తెలుగు తూలిక

ఫిబ్రవరి 17, 2008

ఊసుపోక -మిరపకాయబజ్జీలు

ప్రచురించిన వర్గము నాకథలు, హాస్యం — malathi @ 8:52 అపరాహ్నం
Tags:

విస్కాన్సిన్ శో��లు

ఊసుపోక -పచ్చిమిరపకాయ బజ్జీ
ఎన్నెంకతలు 2

చలి ..చలి … మంచు బ్లిజర్డూ ముంచుకొచ్చి ముంచేస్తోందీరోజు ఇక్కడ. వీధిలోకెళ్లడం గగనం. వేడివేడిగా కారంగారంగా పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకుని సోఫాలో ముడుకు పడుకుని టీవీ చూసుకోవాలనిపిస్తోంది.

నేను చిన్నప్పటినుంచే కారాలూ మిరియాలూ నూరుతూ పుట్టలేదు. అసలు నేను సగటుకారం కూడా తినలేనని మాఅమ్మ నాకోసం కూర వేరే తీసిపెట్టేది. అలాటిది అమెరికా వచ్చేక కారం అలవాటయింది. నేనే చేసుకున్నాను.

ముఖ్యకారణం డోనట్లు. అవి చూడ్డానికి గారెల్లా కనిపించి మురిపించి నన్ను మోసం చేసేయి. మొదటిసారి తెలీక తిన్నాను. రెండోసారి ఆశ చావక తిన్నాను. ఆతరవాత మరి నాతరం కాలేదు. మొత్తంమీద ఏంకొనబోయినా తియ్యగానో చప్పగానో వుంటాయి తప్ప మరోరుచి నాలుక్కి తగలదనిపించింది. ఏమెక్సికనో, పీచావో అయితే తప్ప. చాలాకాలం నేను ఎవరేనా భోజనానికి పిలిస్తే, ఇంట్లో తినేసి వెళ్లడమో, తిరిగొచ్చాక ఆవకాయేసుకుని తినడమో చేసేదాన్ని. ఆతరవాత చచ్చినజిహ్వని లేపడానికి కాస్త కారం తగిలితే బాగుండుననిపించి కూరల్లో ఓ చిన్నమిరపకాయ తగిలించేను. ఆతరవాత రెండూ, రెండున్నరా, … అలా పెంచుకుంటూ వచ్చి ఆఖరికి నసాళం అంటే వరకూ వచ్చింది.

అపైనా రిసెర్చి మొదలెట్టాను ఏమిరపకాయకి హీటిండెక్సు ఏస్థాయిలో వుంటుందని. … నాకు గుర్తున్నంతవరకూ మనూళ్లో మిరపకాయలు రెండేరకాలు, పచ్చిమిరపకాయలూ, సీమమిరపకాయలూను. ఇక్కడ మనుషుల్లాగే దేశదేశాల పెప్పరులుకుప్పలుతిప్పలుగా ఎదురై మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఫ్రెంచి కయన్ కాస్త మెరుగు, మనగుంటూరు మిరపకాయలసాటి అనుకోండి. సెరానో కూడా అంతే. హీటిండెక్సులో పదివేలనించి ఇరవైమూడు వేలవరకూ వుంటుందిట స్కవిల్ కొలతల్లో. హబానో కాస్త నయం 280 వేలవరకూ వుంటుంది. గిన్నెస్ బుక్కాఫ్ రికార్డులకెక్కిన ఘనత హబానో పెపరుదేనట. మరి ఇంకో రకం షొల్తొపెన్ కూడా నోట్లో చిచ్చు పెడుతుంది.

హాట్ బనానా పెప్పరయితే అట్టే కారం వుండదనుకున్నాను కానీ ఓసారి నోరు మండిపోయింది అదే తట్టలోనుంచి ఏరుకొచ్చినా. అంచేత దానివరస నాకు తెలీదు. ఆనహెమ్ అసలు కారమే వుండదు పసరువాసన. పప్రికా అయితే మరీను ఆకారపుష్టి. జానెడు పొడవుంటుంది కాని ఆమిరపకాయ కొరికినా ఒకటే ఇంత పచ్చగఢ్డి నమిలినా ఒకటే. స్కవిల్ కొలతల్లో 500 నుండీ 2500 వరకూంట.

ఇంతకీ నేను ఇంత పరిశోధన చెయ్యడానికి మరో కారణం వుంది. తెలుగుదేశంలో నాస్నేహితురాలితో ఏదోసందర్భంలో మిరపకాయ బజ్జీలు చేసానన్నాను. దాంతో ఆఅమ్మాయి మిరపకాయబజ్జీలు చేసిపెడతానంటే అమెరికా వస్తానంది. చేస్తానన్నాను కానీ ఇంతదూరం ఆవురావురామంటూ వచ్చినపిల్లకి నచ్చినట్టు చెయ్యలేనేమోనన్న బెంగ పట్టుకుంది. దాంతో, ఏమిరపకాయలు బజ్జీలకు తగినవి అంటూ మొదలెట్టానన్నమాట. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పచారీకొట్లో లేబులులెప్పుడూ మారవు కాని ఒక్కోపూట ఒక్కో రకంగా వుంటోంది హీటిండెక్సు మాత్రం. ఇక్కడ షాపుల్లో ఒక్కోప్పుడు రుచులు చూడనిస్తారు కదా అని కొరికిచూద్దాం అనుకున్నాను కానీ నాకే బాగోలేక చెయ్యలేదు. ప్రతిసారీ ఇంటికి తెచ్చి చూసుకుని ఇది కాదు, ఇదు కాదు అంటూ నేతివాదం ప్రాక్టీసు చేసాను. ఎలాగో మొత్తంమీద నాస్నేహితురాలు వచ్చినప్పుడు రెండురకాలు తెచ్చాను హబీనో మరియూ సెరానో. హబీనో నసాళానికంటింది. పొలోమని కేకేసి, కుండెడు నీళ్లూ, గరిటెడూ పెరుగూ, పుచ్చుకుని, తరవాత నెయ్యీ అన్నం కాస్త తిని తేరుకుంది.

నేను నెమ్మదిగా “నువ్వు కారం తింటావనుకుని ఆమిరపకాయలు తెచ్చాను. ఇదయితే అంత కారంలేదు” అంటూ నాకోసం పక్కన పెట్టుకున్న సెరానో మిరపకాయలు ఇచ్చాను. నాకు తెనాలి రామలింగడిపిల్లికథ జ్ఞాపకం వచ్చింది.

ఈనాటి అప్పుడేటు. కారం పరాకాష్ట పొందినరోజుల్లో మొదటి ముద్ద నోట పెట్టుకున్నతరవాత జిహ్వ మాడి మసి అయిపోయి, ఆతరవాత ఏంతింటున్నానో తెలియనిస్థితికి వచ్చేను. అందులో కూడా కొన్ని అందాలు కనిపించేయి. నాలుక ఆహాటుకూరలతో కాలిపోయాక తరవాత ఏంతిన్నా రుచి తెలీదు కనక రకరకాలవంటలు చెయ్యవలసిన అవుసరంలేదు. అంచేత మధ్యాన్నం లంచీ, రాత్రి సప్పరూ, మర్నాడు లంచీ, .. ఇలా ఒకే డిష్షు తినే గతికొచ్చాను కొన్నాళ్లు. ఆవరస బావులేదని, కారం తగ్గించుకుంటూ వచ్చి ప్రస్తుతం రీజనబుల్లెవలు కొచ్చేను. … అనే అనుకుంటున్నాను.

(ఇంతే సంగతులు, ఫిబ్రవరి 2008).

9 వ్యాఖ్యలు »

  1. బాగుంది మీ మిరపకాయల మీద రీసెర్చ్. ఇంతకీ ఎన్నెంకతలు అంటే ఏమిటి??

    వ్యాఖ్య ద్వారా varudhini — ఫిబ్రవరి 18, 2008 @ 9:31 పూర్వాహ్నం

  2. హహహ… మీ మిరపకాయ బజ్జీల అనాలసిస్సు అదుర్స్.
    నేను మీ ఇంటికొచ్చినప్పుడు మాత్రం అలాంటి బజ్జీలు పెట్టకండి :)

    వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఫిబ్రవరి 18, 2008 @ 3:01 అపరాహ్నం

  3. వరూధినిగారూ,
    ఏమిటో ఏదో ఊసుపోకకి పురాణంసీతలా పేరు పెట్టాలనిపించింది. కళ్లుమూసుకు కీలు కొడితే ఎన్ యం తగిలేయి. ఎన్నెమ్మ అని పెడదాం అనుకున్నాను కాని ఫెషనబల్ గా లేదని పెట్టలేదు. :).

    ప్రవీణ్ గారూ మీరు రావాలే కాని నీ అదుర్సు ఆర్ బెదుర్సు. మీకేం కావాలేమిటి ఇంతకీ ..

    వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 18, 2008 @ 6:49 అపరాహ్నం

  4. మేము కారాలు బాగా తింటాము.కానీ ఎవరినయినా భోజనానికి పిలిచినప్పుడు మాత్రం చాలా తక్కువ వేస్తాను.అయినా సరే వచ్చినోళ్ళందరూ కళ్ళనీళ్ళెట్టుకుని వెళతారు.మాకేమో ఆ వంటలు గొంతుదిగవు.తిన్నాకా మిగిలిన కూరల్లో మళ్ళా కారం కలుపుని ఉడికించి తింటాము. మీలా నాకూ ఏ మిరపకాయ ఏ ఘాటులో వుంటుందో తెలియదు.అందుకే ఎవరయినా వచ్చినప్పుడు సాధారణం గా కారాన్నే వాడతాను.

    వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 19, 2008 @ 3:15 పూర్వాహ్నం

  5. ఎన్నెం కథలూ కి మీ కథ కంటే బెటర్ వివరణ మీ పేరే చెబుతోందిగా? :p

    వ్యాఖ్య ద్వారా Sowmya — ఫిబ్రవరి 19, 2008 @ 4:08 అపరాహ్నం

  6. మాలతి గారు , బావుంది మీ మిరపకాయ బజ్జీల కథ. మరి అవి చేయడం బాగా ప్రాక్టీస్ ఐందా లేదా ఇప్పటికైనా!!

    వ్యాఖ్య ద్వారా జ్యోతి — ఫిబ్రవరి 19, 2008 @ 7:08 అపరాహ్నం

  7. జ్యోతి గారూ, లేదండీ. అస్త్ర్రసన్యాసం చేసేసాను.
    రాధిక గారూ, నాకు తంటాలు మనవాళ్లతో కన్నా అమెరికనులని పిలిచినప్పుడు. మాకు కారం ఇష్టం అంటారు తీరా ఓమిరకాయ కనుచూపుదూరంలో కనిపిస్తే ఎగిరిగెంతేస్తారు. :) ఆడాన్సు చాలా నాజూగ్గా వుంటుంది, అది మరో కథ …

    వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 19, 2008 @ 9:54 అపరాహ్నం

  8. @ సౌమ్యా .. pattern recognition :-)

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 20, 2008 @ 2:26 పూర్వాహ్నం

  9. [...] సొంతం! చాలా విరివిగా కూడా రాస్తారు. మిరపకాయ బజ్జీల కబుర్లు, ఇక్ష్వాకుల కాలం నాటి తన గడియారం కథా, [...]

    పింగ్ బ్యాక్ ద్వారా పొద్దు » Blog Archive » 2008 ఫిబ్రవరి బ్లాగోగులు — మార్చి 3, 2008 @ 4:08 అపరాహ్నం

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.