నిరీక్షణ
*
చిన్నప్పుడు స్కూల్ బస్సుకోసం
చల్లని సాయంత్రాలకోసం
ఆసాయంసమయాల బీచిలో
ఇసకలో కట్టే పిచిగ్గూళ్లకోసం
ఆగూళ్లలో చేరే పిట్టలకోసం
పెద్దపండుక్కోసం
పట్టుపరికిణీకోసం
గోదావరి ఆనకట్టపై
పరుగుల్తీసే రైలుబండీకోసం
ఆరైలుబండీకమ్మీల్లోంచి
చిమ్మచీకట్లు చీల్చుకుంటూ
వెలుగులు కురుసే దీపాలతోరణాలకోసం
ఏతావాతా
చదువుల్తెచ్చే డిగ్రీలకోసం
ఆడిగ్రీలిచ్చే ఉద్యోగాలకోసం
ఆఉద్యోగాల్లో ప్రమోషన్లకోసం
ఆప్తుల ఆమోదముద్రకోసం
నాలుగువీధులకూడలిలో పచ్చవెలుక్కోసం
మనసిచ్చి మాటాడే మనిషికోసం
అలనాటి ఆప్తురాలు
కాకమ్మచేతనైనా అంపే కబురుకోసం
ఋజువైన చెలిమికోసం
ఎండకోసం
వానకోసం
ఆకురాలు కాలంలో
కొమ్మలు చిమ్మే వింతసొగసులకోసం
తిరిగొచ్చే చివుళ్లకోసం
ఎదురుచూస్తున్నాను అర్ధశతాబ్దిగా
మూడంతస్థులమేడల్లో
ఐదంకెల ఆదాయాల్తో
కోరితెచ్చుకున్న ఈతిబాధల్తో
వాలుకుర్చీల్లో విలాసంగా
వెనక్కి వాలి
భారతీయసాంప్రదాయం
వైరాగ్యం ఔన్నత్యం గూర్చి
వివరిస్తుంటే
వింటున్నాను ఓపిగ్గా.
తరంగాలెళ్తే స్నానం చేస్తానంటూ
సముద్రపొడ్డున
ముడుచుక్కూచున్న బడుగుబాపడిలా
ఎదురుచూస్తున్నాను.
ఏఉద్గ్రంథానికో
అస్తవ్యస్తంగా రాస్తున్న
నాందీప్రస్తావనలా వుంది
జీవనహేల.
తుదిపలుకు మాటే లేదు మరి.
*
(తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో, తెలుగువెలుగు, 2003, లో ప్రచురితం. )
వరస గా రాసే మాటర్ ని విరగొట్టి నిలువు ముక్కలు రాస్తే అది కవితా?????
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా rahim — ఫిబ్రవరి 24, 2008 @ 8:34 అపరాహ్నం