తెలుగు తూలిక

ఫిబ్రవరి 27, 2008

పూర్వకవులు-వేములవాడ భీమకవి

ప్రచురించిన వర్గము సాహిత్యం — malathi @ 6:22 అపరాహ్నం
Tags:

పూర్వకవులకథలు - వేములవాడ భీమకవి

హయమది సీత పోతవసుధాధిపుఁడారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుఁడ వహ్యజవారిధి మారుఁడంజనా
ప్రియతనయుండు లచ్చన విభీషుణుఁడా గుడిమెట్ట లంక నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాడు చూడుడీ!

ఇది పూర్వకవులలో ప్రముఖుడయిన వేములవాడ భీమకవి చెప్పిన పద్యం.

భీమకవి కాలం ఇంతవరకూ ఎవరూ నిర్ధారణ చేయలేదు కాని ఆయనగురించి చెప్పుకునే కథలు చాలా వున్నాయి. ముఖ్యంగా జననం గురించి. గోదావరిమండలంలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ప్రాంతంవాడని ఒకకథనం. ఆయన తల్లి బాలవితంతువు, సాటి చెలులతో కలిసి భీమేశ్వరస్వామి దర్శనసమయంలో స్త్రీలకోరికలు వింటూ నాకు నీవంటిపుత్రునివ్వమని కోరిందిట. స్వామి ఆవిడ అభీష్టం నెరవేర్చాడు. ఆవిడ తనముద్దుబిడ్డకి భీమన అని పేరు పెట్టుకుని పెంచుకుంటూంది. వూళ్లో ప్రజలు మాత్రం ఆమె మాట నమ్మక, వెలివేశారు. అ పిల్లవాడిని సాటిపిల్లలు రండాపుత్రుడని గేలి చేయగా, అతడు వచ్చి తల్లిని తనతండ్రి ఎవరని అడిగితే, ఆమె భీమేశ్వరుడేనని చెప్పిందిట. అంతట, ఆ చిన్నవాడు భీమేశ్వరాలయానికి వెళ్లి, “నన్ను వూళ్లో అందరూ తండ్రి లేనివాడని గేలి చేస్తున్నారు. నువ్వు నిజంగా నాతండ్రివవునో కాదో చెప్పకపోతే ఇక్కడే తలపగలగొట్టుకు చస్తాను” అని పట్టు బట్టాడు. అప్పుడు భీమేశ్వరుడు ప్రత్యక్షమయి, అతనితల్లిమాట నిజమేననీ, తానే తండ్రిననీ చెప్పి, అందుకు నిదర్శనంగా భీమన ఆడినమాట సత్యమవుతుందని వరం ఇచ్చాడుట.

పైన వుదహరించిన పద్యానికి పూర్వకథ. భీమకవి తనకవితావైభావన్ని ప్రదర్శిస్తూ దేశదేశాలు సందర్శిస్తూ, గుడిమెట్ట ఆస్థానానికి వచ్చాడు. ఆసంస్థాధీశుడయిన మాగి పోతరాజు భీమకవిని గౌరవించకపోగా, అతని గుర్రాన్ని తీసుకుని, తరిమికొట్టాడు. భీమకవి కోపగించుకుని, పైపద్యం ఆశువుగా చెప్పి పోతరాజుని శపించాడు.
భీమనమాట ఋజువయి, పోతరాజు శత్రువులచేతిలో ఓడిపోయి, రాజ్యసంపదలూ, ప్రాణాలూ కూడ పోగొట్టుకున్నాడు. ఆతరవాత మరణించిన పోతరాజుకోసం అతడి బంధువర్గం విచారిస్తుండగా, భీమన ఆదారిన పోతూ వారిని చూసి, జాలిపడి, మరొక పద్యంతో పోతరాజుని బతికించాడట. ఆపద్యం. –

నాఁటి రఘురాము తమ్ముఁడు, పాటిగ సంజీవి చేత బ్రతికినభంగిన్
గాటికిఁ బో నీకేటికి, లేటవరపు పోతరాజ లెమ్మా, రమ్మా!

ఇలాగే మరొకకథ. రాజ కళింగగంగు భీమనని అవమానించినప్పుడు, ఆయన కోపించి, శపించి మళ్లీ కోపం తగ్గాక, మరొకపద్యంతో గంగుని రాజుగా చేసినకథ వుంది.

ఒకసారి, రాజ కళింగగంగుని చూడడానికి భీమన విజయనగరం వెళ్ళి, తాను వచ్చినట్టు కబురంపాడు. కళింగగంగు తాను వేరే పనిలో వున్నానని మరొకసారి రమ్మని జవాబు పంపాడు. భీమన అప్రసన్నతతో,

వేములవాఁడ భీమకవి వేగమె చూచి కళింగగంగు దా
సామము మాను కోపమున సందడి దీరిన రమ్ము పొమ్మననెన్
మోమునుజూడ దోసమిఁక ముప్పదిరెండు దినంబు లావలం
జామున కర్థంమందతని సంపద శత్రులపాలు గావుతన్

అని శపించాడు. శాపగ్రస్తుడయిన ఆరాజు సర్వస్వం కోల్పోయి. బిచ్చగాడయి వూరూరా తిరుగుతూ వేములవాడకి వచ్చి అక్కడ చీకటిలో గోతిలో పడ్డాడు. ఆదారిన పోతున్న భీమకవి అలికిడి విని ఎవరది అని అడగితే, కళింగగంగు, “వేములవాడ భీమకవి చేసిన జోగిని” అని జవాబు చెప్పాడు. అప్పుడు భీమకవి అతనిని గుర్తించి, నీరాజ్యం నీకు తిరిగి ప్రాప్తిస్తుందని దీవించి పంపాడట. తరవాత భీమకవి వాక్కునిజమై, కళింగగంగు సైన్యంములను సమకూర్చుకుని రాయలమీదికి దండయాత్రచేసి తిరగి తన రాజ్యం స్వాధినం చేసుకున్నాడు.

ఇలాటికథలలో నిజానిజాల తర్కం నాకంత సమంజసంగా అనిపించదు. అందులో కవిచాతుర్యం, భాషావైభవం నన్ను ఎంతగానో అలరిస్తాయి.

(మా. ని. ఫిబ్రవరి 2008)

4 వ్యాఖ్యలు »

  1. ఆసక్తికరమైన కథలు!

    వ్యాఖ్య ద్వారా Sowmya — ఫిబ్రవరి 27, 2008 @ 10:58 అపరాహ్నం

  2. ఏమో నాకు మాత్రం యిల్లాంటివన్నీ నమ్మాలనిపిస్తుంది. అన్నట్టు మీరు వంటకాలు కప్పలుగా మారతాయని వొకసారి భీమకవి యిచ్చిన శాప వృత్తాంతం గురించి వ్రాయలేదేమి?

    వ్యాఖ్య ద్వారా రాఘవ — ఫిబ్రవరి 28, 2008 @ 11:33 పూర్వాహ్నం

  3. దూరదర్శన్ లో చాలా సార్లు వాచ్చేది ఈ కధ. తర్కం మాట అటుంచితే చూడ్దానికి ఆసక్తి కరం గా ఉండేది.

    వ్యాఖ్య ద్వారా kalhara — ఫిబ్రవరి 28, 2008 @ 4:59 అపరాహ్నం

  4. అవునండీ, వంటకాలను కప్పలుగా మార్చిన కథ నిజానికి తొలిసారి ఆయన తనకు గల ప్రత్యేకమైన ఘనతని నలుగురికీ తెలియజెప్పిన సంఘటన అంటారు.
    ఆకథ ఏమిటంటే, భీమేశ్వరుడు భీమనని తనపుత్రుడేననీ చెప్పినతరవాత కూడా ఆవూరి ప్రజలు భీమనని చులకనగానే చూస్తున్నారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు సమారాధన చేసి ఆవూరి బ్రాహ్మణులనందరినీ విందుకి పిలిచాడు కాని భీమనని పిలవలేదు. అప్పుడు భీమన తన ప్రతిభ ప్రదర్శించదలచి,, వారింటికి వెళ్లి
    అప్పములన్ని కప్పలు గావలె
    అన్నమంత సున్నము గావలె
    అని చదివాడట. వెంటనే అప్పాలన్నీ కప్పలయి బెకబెకమంటూ ఆస్థలమంతా గెంతసాగేయి. అప్పుడు ఆగృహస్థు తనతప్పూ, భీమన వాక్ప్రాభవమూ తెలుసుకుని, తనవాక్కు ఉపసంహరించుకోమని భీమనని ప్రార్థించాడు. భీమకవి ప్రసన్నుడయి,
    కప్పలన్నీ అపాప్పాలగును
    సున్నమంతా అన్నంబగును

    అని చెప్పాడు. ఆతరవాత ఆవూరి జనులు భీమకవి కుటుంబంమీద వెలి తొలిగించి వారిని గౌరవిస్తూ వచ్చారు.

    అలాగే ఆయన మృతి గురించి కూడ వింతకథ చెప్పుకుంటారు.
    తల్లి అతనికి అన్నం వడ్డిస్తుండగా, గిన్నెకి వున్న మసి ఆమెకడుపుకి తగిలి మసి అయిందిట. భీమన అది చూసి, “అమ్మా, నీకడుపు మసి ఆయెగదా“ అన్నాడట.
    కడుపు మసి అవడం అన్నవాక్యం మరణించడం అన్న అర్థంలో ఋజువై ఆయన పరమపదించారు అని చెప్పుకుంటారు..

    వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 28, 2008 @ 10:16 అపరాహ్నం

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.