పూర్వకవులు - తరిగొండ వెంగమాంబ
మార్చి 12, 2008 ద్వారా tethulika
పూర్వకవులు - తరిగొండ వెంగమాంబ
స్త్రీలలో కవులుగా ప్రసిద్ధికెక్కినవారు అట్టే లేకపోయినా, లభ్యమయిన వారి కథలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. సాధారణంగా నాకు నచ్చేవి ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారు ప్రదర్శించే వ్యక్తిత్వాలు. కష్షాలు జీవితంలో ఒకభాగం. వాటిని అధిగమించి తమ జీవితాలని మలుచుకోడం మానవనైజం. పూర్వకవులలో భీమనలాగే తరిగొండ వెంగమాంబ కూడా సారస్వతాభిమానుల ఆదరణ చూరగొన్న కవయిత్రి.
వెంగమాంబ కడపజిల్లా తరిగొండలో కృష్ణయామాత్యుని ఇంట 18వశాతాబ్దం ఉత్తరార్థంలో జన్మించినట్టు పరిశోధకులఅభిప్రాయం. తల్లి మంగమాంబ. వెంగమాంబకి వెంకమ్మ, వెంకుమాంబ అన్నవి ప్రాచుర్యంలో వున్న నామాంతరాలు.
వెంగమాంబ బాలప్రాయంలోనే వేంకటేశ్వరుని భక్తురాలయి సదా వెంకటేశ్వరునే స్మరిస్తూ కాలం గడిపింది. ఆమె తండ్రి ఆమె భక్తి విపరీతమయయిన పరిణామాలకి దారి తీయగలదనీ, ప్రాపంచికధర్మాలవైపు మళ్లించడానికీ ఈమెని తండ్రి ఇంజేటి వెంకటాచలపతికిచ్చి వివాహం చేశాడు. కాని వెంగమాంబకి సంసారికజీవనంపై మనసు లేదు. ఆమె తనని తాను సంపూర్ణంగా వేంకటేశ్వరస్వామికి సమర్పించుకుంది. వెంగమాంబచేత తిరస్కరింపబడిన వెంకటాచలపతి మనోవ్యాధితో మరణించాడుట.
పూర్వకాలంలో వితంతువులయిన స్త్రీలు తల్లిదండ్రుల ఇంట కాలం గడపడం, తండ్రి చదువు నేర్పడం ఆనవాయితీగా వుండేది. ఆవిద్య ముఖ్యంగా వితంతువులయిన ఆ బాలికలని కోరికలకి లోబడకుండా ఆధ్యాత్మికం, తాత్త్వకచింతనలవైపు నడిపేదిగా వుండేది. (భాస్కరాచార్యుడు కుమార్తె లీలావతికి గణితం నేర్పడం అసాధారణం కావచ్చు). ఈకథలో ఈమలుపు నాకు వింతగా వుంది. మొదట వెంగమాంబని దైవభక్తినుండి మరల్చడానికి పెళ్లి చేశారు. వితంతువు అయినతరువాత మళ్లీ దైవచింతనవైపు మళ్లించడానికి ప్రయత్నం చేసారు.
ఏమైనా, వెంగమాంబ రచనలకి తండ్రి ప్రోత్సాహం వున్నట్టు కనిపిస్తుంది. తనఅవతారికలలో తండ్రి గుణగణాలూ, గోత్రనామాలూ ప్రశించింది. కాని తనచేత ప్రత్యేకించి ఎవరూ ఓనమాలు దిద్దించలేదంటుంది.
చిరుతప్రాయంనుండీ వెంకటేశ్వరభక్తురాలయిన వెంగమాంబ తన నిజమైన భర్త ఆవేంకటేశ్వరుడేనని ధృఢంగా విశ్వసించి, కేశముండనంవంటి లౌకికాచారాలని ధిక్కరించింది. వెంగమాంబ తనను తాను సుమంగళిగానే ప్రకటించుకోవటంతో వూరిలో ప్రజలు ఆమెకుటుంబాన్ని వెలి వేశారు. అపుడు తండ్రి ఆమెని సమీపించి, ఊరిలో తాను తలెత్తుకు తిరగవలెనంటే, ఆమె కేశములను తీసివేయడానికి అంగీకరించవలసిందని వేడుకున్నాడు. దానికి ఆమె, ′′శరీరంతో పాటు వచ్చిన కేశములు తీసివేసినంత మాత్రాన మళ్లీ పెరగవా? చిత్తశుద్ధి ముఖ్యము కాని ఈబాహ్యచిహ్నలు కావు. అయినా నీతృప్తికోసం అంగీకరిస్తాను. మంగలిని పిలిపించు′′ అని చెప్పింది. అయితే, ఆమె కేశములు తీసివేసిన ఉత్తరక్షణంలోమళ్లీ యథాతథంగా ఆమెశిరోభాగాన్ని అలంకరించాయి.
ఈకథకి కొంత పాఠ్యబేధంతో మరొకకథ వుంది. పైవుదంతం పుష్పగిరి పీఠాధిపతి వచ్చినప్పుడు జరిగినకథగా చెప్తారు. ఏమైనా ఆప్పటినుండీ వెంగమాంబను మహాభక్తురాలుగా గుర్తించారు. ఆతరవాత ఆమెను ప్రతిభావ్యుత్పుత్తులు గల కవయిత్రిగా కూడా గుర్తించారు.
బాహ్యాడంబరాలు వేరు, నైతికవిలువలు వేరు. ఈభేదాన్ని ఎన్నివేల సంవత్సరాలనుండీ ఎత్తి చూపుతున్నాయో కథలు.
వెంగమాంబ దాదాపు ఇరవై వరకూ గ్రంథాలు రచించారు. ఆమె తొలిరచన నృసింహశతకం. ఇంకా వేంకటేశ్వరమహత్మ్యం, రాజయోగసారం, విష్షుపారిజాతంలాటి ఎన్నో కృతులు ఆమెవి ప్రాచుర్యం పొందాయి. వివిధ ప్రక్రియలలో - కావ్యం, నాటకం, ద్విపద, యక్షగానం, శతకం - స్వతంత్రంగానూ, పూర్వకావ్యాలనుండి సంగ్రహించిన ఇతివృత్తాలతోనూ ఆమె సృష్టించిన సాహిత్యం పండితులు విశిష్టంగా పరిగణిస్తారు. ఇంతటి వైవిధ్యం స్త్రీలరచనలలో 18వశతాబ్దంలోనే ప్రారంభమైందనడానికి గురుతు తరిగొండ వెంగమాంబ కృతులు. ఇంకా వెలుగు చూడని గ్రంథాలు తెలుగు సాహిత్యంలో ఇంకా ఎన్ని వున్నాయో.