తెలుగు తూలిక

మార్చి 15, 2008

ఊసుపోక – వినదగు నెవ్వరు జెప్పిన

ప్రచురించిన వర్గము ఊసుపోక, సాహిత్యం — malathi @ 9:01 అపరాహ్నం
Tags: , ,

ఊసుపోక 5 – వినదగు నెవ్వరు చెప్పిన
(ఎన్నెంకతలు)
వినదగు నెవ్వరు జెప్పిన
వినినంత వేగిరపడక వివరింపం దగు
కని కల్లనిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుండు మహిలో సుమతీ.

నేను నాచిన్నప్పుడూ, మీరు బహుశా ఈమధ్యనా, చదివిన సుమతీశతకంలోని ఈపద్యం నాకంటే మీకే ఎక్కువ గుర్తుండొచ్చు. ఎవరు చెప్పినా వినాలి. నాజీవితంలో మొదటిసగం మాఅమ్మమాట వింటూ వచ్చేను. తరువాతిసగం మాఅమ్మాయిమాట వింటున్నాను. మా అమ్మా, నాన్నగారూ, అక్కయ్యా, అన్నయ్యా, ఇరుగూ, పొరుగూ, క్లాసుమేటులూ, కూరగాయలమనిషీ .. ఎవరు చెప్పినా వింటూనే వచ్చేను. అదేం అని అడిగేదాన్ని కాను, కళ్లప్పగించి చూస్తూ వినడమే.

అలా వింటుంటే ఏం జ్ఞాపకం వుండిపోతాయో, ఏవి మనమనసుల్లో శాశ్వతముద్రలేస్తాయో తెలుసా. నాచిన్నతనంలో సిలోనురేడియోలో శ్రోతలు కోరినపాటలు అని రోజూ సాయంత్రం ఓగంటసేపు శ్రోతలు కోరిన పాటలే వేసేవారు. నేను ప్రతిరోజూ వినేదాన్ని ఎంతో శ్రద్ధగా. కాని ఇప్పుడు ఆవిన్నపాటలేవీ గుర్తులేవు. గుర్తున్నదల్లా “జంతువులలో అందమైనవి గుర్రాలు. బీడీలలో శ్రేష్ఠమైనవి మూడుగుర్రాలబీడీలు” అన్న ప్రకటన మాత్రమే. చూసారా, ఏది ఎంతబలంగా నాటుకుందో. .. సినిమాలో శ్రీరాముడు వేషంవేసిన ఏ యంటీయారో టీవీలో సిగరెట్టువల్ల పొందగల ఆనందం చెప్తే నిజమేకాబోలు అనిపిస్తుంది.

టీవీలో ఈమధ్య ప్రకటనలు ఎక్కువయిపోయేయి. నేను ఇక్కడికి వచ్చినకొత్తలో 20 సెకనులుండేది ఒక్కోప్రకటన. ఇప్పుడు 90 అయిపోయింది. ఎంత వినేదాన్ని అయితే మాత్రం ఎంతకని వినగలను? అందులోనూ మందులకంపెనీలవాళ్లవి నాకు మరీ చిరాగ్గా వుంటాయి. నేనేదో కాలక్షేపంకోసం, మనశ్శాంతికోసం టీవీ పెట్టుకుంటే, సుఖంగా వున్ననాప్రాణాన్ని ప్రకటనదారులు పనిగట్టుకు హింసిస్తున్నట్టనిపిస్తుంది..
ముందు నాకు ఏ లక్షణాలుంటే ఏజబ్బు రావడానికవకాశం వుందో చెప్తాడు. తరవాత సైడెఫెక్టులంటూ ఇంకా ఏఏబాధలు రాగలవో చెప్తాడు. ఆతరవాత నాచావుకి అవకాశం ఎన్నిపాళ్లో చెప్తాడు. ఇంకా జీవితంమీద ఆశేమైనా వుంటే డాక్టరుని అడగమంటాడు. నాకు వచ్చే అనుమానం – డాక్టరుదగ్గరికెళ్లి, అయ్యా ఈమందులకంపెనీవాడు చెప్పేడు ఈమందు నన్ను రక్షించగలదని, అంచేత ఓకాగితంముక్క రాసియ్యండి అనడిగితే ఇచ్చేసే డాక్టరుంటాడా? అసలు డాక్టరుదగ్గరికి వెళ్లడమంటూ జరిగితే ఈ ఒకటిన్నరనిముషం హరికథంతా ఎందుకు? ఆడాక్టరు ఎలాగా చెప్తాడుకదా. డాక్టర్లకి కదా తెలీయాలీ ఏరోగాలకి ఏమందులు వాడాలో. నేనా చేప్పేది ఇది కావాలి అది కావాలి అని. ఈపనసంతా ఆడాక్టరుదగ్గరే పెట్టొచ్చు కదా.
ఈప్రకటనలు 20 సెకన్లున్నరోజుల్లో ఓగ్లాసు నీళ్లు తాగి వచ్చేదాన్ని. ఇప్పుడు కప్పుకాఫీ పెట్టుకుని, తాగేసి, కప్పు కడుక్కోడానికి కూడా సరిపోతోంది ఆ 90 సెకనులు. అంటే టీవీలు ఒక్క ప్రకటన వేసి వూరుకోవు. మూడో, నాలుగో పెడతాయి. అంచేత పొడుగు ప్రకటనలవల్ల నాకు సుఖంగానే వుంది అని ఒప్పుకోక తప్పదు.

మామూలుగా నేను వినీ, చాలాసేపో, చాలారోజులో ఆలోచించుకునీ కానీ ఏపనీ చెయ్యను. మనవాళ్లయితే మాచెడ్డ నిదానం అనో పిచ్చిమాలోకం అనో అంటారు కానీ అమెరికాలో అయితే దానికో పేరెట్టేస్తారు. ఏడీడీ అనో స్లో అనో. ఇది నాకెలా తెలిసిందంటే, ఓరోజు కారు కొనడానికెళ్తే డీలరు పెద్దపడవంత కారు చూపించి, ఆకారులో లెగ్రూమూ, హెడ్రూమూ అంటూ ఊదర పెట్టేశాడు. అప్పటికప్పుడు ఆకారు తీసేసుకుంటే నాక్కనక మూడువందలు తగ్గించి ఇచ్చేస్తానన్నాడు రహస్యం చెప్తున్నట్టు ముందుకి వంగి..
“నాకెందుకు లెగ్రూము? నాకు గాస్పెడలూ, బ్రేకుపెడలూ అందితే చాలూ, ఎదురుగా రోడ్డు కనిపిస్తే చాలు, రోడ్డుమీద జనాలు కారులో నేనున్నానని గమనించగలిగితే చాలు” అనాల్సింది నేను కాని అనలేదు. కళ్లు పైకెత్తి అతని చొక్కాజేబూ, కాలరూ ఆపైన ఐఫిల్ టవరులా వున్న అతనిమొహమూ చూస్తూ, తలూపేను.
 ఆకచేరి అంతా ఓపిగ్గా ఆసాంతం విని, ఆతరవాత, ఒంట్లో వున్న శక్తినంతా కూడగట్టుకుని, “నేను అలా నిల్చున్నపాళాన నిర్ణయాలు తీసుకోలేన”న్నాను. నిజానికి ఇంగ్లీషులో “ఐయాం స్లో” అన్నాను. దాంతో ఆఅబ్బాయి మొహం దమ్మిడీకాసంత చేసుకుని, అత్యంత జాలిగా మొహంపెట్టి ఓ అని, “తొందరలేదు, ఆలోచించుకో, దా, ఇక్కడ కూర్చో, కాఫీ తేనా.”. అంటూ నన్ను బుజ్జగించడం మొదలెట్టాడు. నేను మరీ అంత స్లో కాదనీ, హాస్యానికన్నాననీ, షాపింగ్ ఎరౌండనీ సకలవిధాలా ప్రత్యామ్నాయ జవాబులు చెప్పుకుని అతన్ని శాంతింపచేశాను.
ఆతరవాత ఎవరు చెప్పిన వినదగదు అని తెలిసిపోయింది. ′ఏప్రకటన చూసినా, ఏటెలిమార్కెటరుమాట విన్నా అదే మాట. “మీమేలు కోరే, మీకు డబ్బు ఆదా చెయ్యడానికే” అని హామీలమీద హామీలిచ్చేస్తారు. కల్లనిజము తెలుసుకోడానికంటూ వివరించుకోడానిక్కూడా అట్టే టైము లేకుండా.
నిజంగా “వినదగు నెవ్వరు చెప్పిన … ”అన్నమాట వినరాదు.
ఇంతరాసినతరవాత నాకు మరో సందేహం వస్తోంది. వినరాదన్న నామాట మీరు వింటారా వినరా?

(మార్చి 15, 2008)
,

అభిప్రాయములు »

  1. విన్నాను.
    ఎవరి సంగతో ఏమోగానీ కారు డీలర్లగురించి మీరు చెప్పింది 200% నిజం.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా teresa — మార్చి 16, 2008 @ 8:27 అపరాహ్నం

  2. Namaskaaram Malathigaaru
    Naa peru Vasanthi, maadi kudaa nidadavole. mee kadhalu, kavitalu chaala baaguntayi,
    nenu eppatikappudu comments raaddaamanukuntaanu kaani raayadaaniki enthoo aalochinchi chivariki aa prayatnam maanukuntaanu, sariggaraayalenani nammakam kudiri. eesaari dhairyam chesi raastunnanu.

    naaku telugu lo elaa raayaalo chepparuu.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Vasanthi. — ఏప్రియల్ 21, 2008 @ 4:17 అపరాహ్నం

  3. వాసంతీ,
    మీకు నారచనలు నచ్చినందుకు నాకు చాలా సంతోషం. మీరు సరీగ్గా చెప్పలేదనుకోకండి. మాటల్లో చెప్పలేనివి కూడా మాటల్లోనే తెలుస్తాయి.
    నేను విశాఖపట్నంలో పుట్టేను కానీ చిన్నప్పుడు మానాన్నగారూ, తరవాత నేనూ చాలా వూళ్లు తిరిగాం కనక ఇప్పుడు నాకు చెప్పుకోడానకి ఒకవూరు అంటూ లేదండీ.
    విడదవోలులో మాపూర్వులెవరో, మూడు తరాలకి ముందు వున్నారేమో నాకేమంత పరిచయంలేదు ఆవూరితో. కాని ఇలా నిడదవోలు వాళ్లు నాకు రాయడం నాకు బాగుంది.
    తెలుగు రాయడానికి మంచి సైటు lekhini.org. చూడండి. అక్కడ వున్నాయి వివరాలు.
    పైన మీరు ఇంగ్లీషులో రాసినంత సుళువు ఆ ఫాంట్సుతో.
    త్వరలోనే మీరు తెలుగులో రాయడం మొదలు పెడతారని ఆశిస్తూ…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — ఏప్రియల్ 21, 2008 @ 9:29 అపరాహ్నం

  4. ranganayakamma gari asamanthwamlonchi asamanathwamloke lo nidadavolu malathi ani o kadha lo matalu quote chesaru aa malathi meerena?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా MANJARI LAKSHMI — ఫిబ్రవరి 16, 2009 @ 9:28 అపరాహ్నం

  5. అవునండీ ఆమాలతినే!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఫిబ్రవరి 16, 2009 @ 11:59 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.