ఊసుపోక - పండగకోరిక
ఏప్రియల్ 8, 2008 ద్వారా tethulika
ఊసుపోక. ఉగాది కోరిక
(ఎన్నెం కతలు 7)
అమరావతీపట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
ఓరుగల్లున రాజవీరలాంఛనముగా పలుశస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగరరాజవీధుల కవితకు పెళ్లిపందిళ్లు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున ఆంధ్రసామ్రాజ్య దిగ్జయస్తంభమెత్తించునాడు
ఆంధ్రసంతతికి ఏమహితాభిమాన దివ్యదీక్షా సుఖస్ఫూర్తి తీవరించె
ఆమహావేశమర్థించి ఆంధ్రులారా, ఆంధ్రులారా
చల్లుడు చల్లుడాంధ్రలోకమున అక్షతలు నేడు.
ఇదే ఆరునెలలకిందట నేను ఈపద్యంగురించి రాస్తే, బహుశా ఇలా మొదలుపెట్టి వుండేదాన్ని. ″చాలామందికి తెలియకపోవచ్చు కానీ టంగుటూరి సూర్యకుమారి అని మాతెలుగుదేశంలో చాలాగొప్ప గాయని వుండేవారు. రాయప్రోలు సుబ్బారావుగారని ఒకగొప్పకవి వుండేవారు …″ అంటూ.
నేను ఈబ్లాగులలోకంలోకి వచ్చింతరవాత ఇలా చెప్పడం అనవసరం అనిపిస్తోంది. ఎందుకంటే ఈబ్లాగరులలో తెలుగుభాష, సాహిత్యం, సంస్కతి, సంగీతం క్షుణ్ణంగా తెలిసినవాళ్లు చాలామందే వున్నారు. నిజానికి నావయసులో సగం లేనివాళ్లు నాకంటె చాలా ఎక్కువతెలిసినవాళ్లు - వీళ్లని చూసి నేను నేర్చుకోవలసింది ఎంతో వుందని ఇక్కడే తెలుసుకున్నాను నేను. నేను మర్చిపోయిన పాటలు, ఆటలు, పిండివంటలు, … ఇలా ఎన్నెన్నో…
ఇక్కడికి రాకముందు అందరిలాగే నేను కూడా ఈనాటి యువతరానికి తెలుగు రాదనీ, అంచేత తెలుగుభాష కృశించి, నశించిపోయే ప్రమాదం వుందనీ అనుకున్నాను. కొందరు చేస్తున్నది ఉష్ట్రపక్షులదేశసేవ అనే అనుకున్నాను. అంటే ఆవ్యాసంలో వాదనలని కనీసం కొన్నిటిని నేను కాదనడం కాదు. అందులో తెలుగుని పరిరక్షించుకుందాం అన్న తపన నాకు కూడా వుంది. సరేనండీ అనడానికి బదులు ఓకేనండీ అని ఎందుకంటారో, అమ్మా నాన్నలని వదిలేసి మమ్మీ, డాడీ అనడంలో సౌలభ్యం ఏమిటో నాకూ అర్థం కాదు. కాని, ఈబ్లాగులలోనే తెలుగులో రాయడం ఎలాగో చెప్పండని తెలుగురాని తెలుగువాళ్లు అడగడం చూశాను. మేం చెప్తాం అని ముందుకొచ్చినవాళ్లను చూశాను. అంచేత, సూర్యకుమారిగారిలాగే మరోసారి అడుగుతున్నాను. పలుకండి తెలుగు పదాలు.
ఏకారణంగానైతేనేం, మననోట ఇంగ్లీషుపదాలొచ్చినంత తేలిగ్గా తెలుగుమాటలు రావడంలేదు. కనీసం రాతల్లోనైనా మరొక్కక్షణం తీసుకుని, తెలుగు పదాలు వెతుక్కుని రాయమని నా కోరిక. తెలుగువాళ్లు మళ్లీ తెలుగుని ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తారని నాకు నమ్మకం కలిగించిన బ్లాగరులకి నానమోవాకాలు.
కొన్నిచోట్ల సందర్భానుసారం ఇంగ్లీషు మాటలే నప్పుతాయి. కాని చాలాచోట్ల మంచి తెలుగునుడికారానికి స్పందిస్తాం అనడానికి పైపద్యమే సాక్షి. నిజానికి, నామటుకు నాకు అట్టే దేశభక్తి లేదు. దేశభక్తిగీతాలమీద ప్రత్యేకాభిమానం అంటూ లేదు. అయినా పైపద్యం విన్నప్పుడు నాగుండె రవంత వేగంగా కొట్టుకుంటుంది. కారణం రాయప్రోలువారి సాహిత్యానికి సూర్యకుమారిగారి కంఠంలో చొప్పించిన ఆత్మాభిమానం అనుకుంటాను.
పైపద్యం మీరు వినాలంటే, సురస వారి సైటు చూడండి. (గద్దె ఆనందస్వరూప్ గారికి కృతజ్ఞతలు. వారి అప్లోడ్ కి లింకు.
http://surasa.net/music/lalita-gitalu/contrib.php#tsk_tsk_songs.
ఉష్ట్రపక్షులదేశసేవ - సూపరు .. బాబోయ్ .. ఇప్పుడు మీ లెక్క ప్రకారం సూపరు అని కూడా అనకూడదు కాబోలు