నిజానికీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ
ఏప్రియల్ 20, 2008 ద్వారా tethulika
నిజానకీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ
ఈరెండుకథలకీ ముందుమాట
చాలా పత్రికలూ సంకలనాలూ నన్నడక్కుండానే ప్రచురించుకున్న ప్రముఖకథ ఇది.
ఈకథమీద చాలా చర్చలు జరిగాయని విన్నాను. అంచేత అవే ప్రశ్నలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా, నేను ఈకథగురించి నామాట ముందే చెప్పేస్తాను.
నాకు వ్యక్తిగతంగా కూడా వుత్తరాలు వచ్చేయి. అందులో చాలావరకూ తమజీవితంలోనూ తమఆప్తులజీవతంలో సరిగ్గా ఇలాగే జరిగిందనీ, తమకి కాస్త ఓదార్పు కలిగించిందనీ.. ఏకథకి అయినా అదే ప్రయోజనం. సాధారణంగా కథకోసం వస్తువు గ్రహించినప్పుడు రచయిత సంఘటనని కొంత ఆసరాగా తీసుకుని కథ రాసినప్పుడు దానికి విశ్వజనీనత వచ్చేది అలాటిఅనుభవమో సంఘటనో ఇతరుల జీవితాల్లో కూడా జరిగినప్పుడు, అనేకసంఘటనలని కూడదీసి ఒకకథ అల్లినప్పుడు. కథకీ ఆత్మకథకీ తేడా అదే.
మొదటికథమీద చర్చలు చాలానే జరిగినా, నాదాకా వచ్చిందీ, నాకు సమాధానం చెప్పాలనిపించిందీ రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్య. ″… ఇలా సీత ఆత్మవంచన చేసుకుంటూ కొంతకాలం గడిపి …″ అన్నది.
నేను ఈకథలో సీతపాత్ర ఆత్మవిశ్వాసం గలవ్యక్తిగా చిత్రించడానికి ప్రయత్నించాను. (పత్రికలవారు నెత్తిన కొంగు వేసుకుని పెద్ద కన్నీటిబొట్టుతో సీతని చిత్రించడం కూడా నాకు నచ్చలేదు). పోతే ఆత్మవంచన అన్నది ఒక దుస్థితిలో వుండీ ″నేను సంతోషంగా వున్నాను, నాజీవితం పూలనావ″ అన్న భ్రమలో వున్నవ్యక్తికి నప్పుతుంది. అంతేకానీ, సమస్య వుందని గుర్తించి, ఆసమస్యకి మూలకారణం వెతుక్కుని, ఎదుటివ్యక్తిని ముఖాముఖి ఎదుర్కొని నిలదీసి ప్రశ్నించి, పరిష్కారంగా తనకు తానుగా నిర్ణయం తీసుకున్న వ్యక్తికి నప్పదు. దాన్ని ″ఆత్మవంచన″ అనడం అసమంజసం. ఇక్కడ రంగనాయకమ్మ నాకిచ్చిన కితాబుకూడా చెప్పుకుని గొప్పపడిపోవాలి మరి. తాను నాకథలో ఒకవాక్యం తీసుకుని, కాస్త మార్చి (″మీప్రేయసులలో ఒకప్రేయసిగా వుండను″) వాడుకున్నాను అంది. అది వారి ఔదార్యం!
రెండో ప్రశ్న. దీనిలో ఫెమినిజం ఏముంది అన్నది. లేదు. ఇది ఫెమినిజం కాదు. ఫెమినిజం పేరు చాటు పెట్టుకుని, అటు ఫెమినిజానికీ ఇటు నిజానికీ చెందని, కళ్లుమూసుకు పాలు తాగేపిల్లి తత్వం ఎత్తి చూపాను ఈకథలో. అలాటివారిలో చిత్తశుద్ధి లోపించిందన్న వాదన ఇది. ఇంట్లో భార్యకొక నీతీ, ఊళ్లో ఆడవాళ్లకి మరో నీతీ మగవారిలోనూ, ఆమగవారిప్రాపకంలోనే తమస్థాయిని పెంచుకోడానికి నానా రూపులూ ధరించే ఆడవారినీతినీ ప్రశ్నిస్తున్న కథ ఇది. సోకాల్డ్ సంఘసంస్కర్తల చిత్తశుద్ధిని నిలవేసి ప్రశ్నిస్తున్న మేలుకొలుపుపాట.
మూడోకోణం. అది ప్రవాసజీవితంలోని కొత్తవిలువలకి అలవాటు పడలేక, పాతవిలువల్ని వదులుకోలేక ఆరాటపడిపోతున్న అస్తవ్యస్తపు జీవులు తెలిసీ తెలియకా పడే బాధలు. నిజానికీ ఫెమినిజానికీ మధ్య రాసింతరవాత, ఈవిషయం పూర్తిగా ఆవిష్కృతం కాలేదనిపించి, ఆతరవాత రాసిన కథ దేవీపూజ. కాలక్రమంలో వెనకే అయినా ముందు చదివితే మొదటికథ (నిజానికి … ) ఎక్కువగా అర్థమవుతుందనుకుంటాను. నాకథల్లో పాత్రలు ఆరోజుల్లో, అంటే 60, 70 దశకాల్లో, ఆంధ్రలోనే వుంటే వారికథ వేరే విధంగా వుండేదనే నాఅభిప్రాయం.
మరొక సంగతి. ఈపరిస్థితులు కొంతవరకూ 80 దశకంనాటికే మారిపోయాయి. అంచేత ఈతరంవారికి ఇది అంతగా అర్థం కాకపోవచ్చు కూడా. అందుకే రెండు కథలూ ఇక్కడ పెడుతున్నాను. ఈకోణాల్లోంచి, ఈవరసలో చదివి మీఅభిప్రాయాలు రాయండి.
(మాలతి, ఏప్రిల్ 200
మాలతి గారు,
ఈ కథ నేను లెక్క లేనన్ని సార్లు చదివాను. అయినా ప్రతిసారీ కొత్తగానే ఉంటుంది. ప్రతి సారీ సీత ఈ కథ నాకు ఎదురుగా కూచుని చెప్తున్నట్టుగానే ఉంటుంది. ప్రతి వాక్యం ఎంతో ఆలోచించి రాసినట్టూ ఉంటుంది, at the same time.. అలా ఒక ఒరవడిలో రాసుకుంటూ పోయినట్టూ ఉంటుంది. మీరెలా రాసారో నాకు తెలీదు.
ప్రతి వాక్యం ఫెమినిస్టులమని చెప్పుకుని తమ ‘స్వాతంత్రాన్ని ‘ సమర్థించుకునే వారికి పగిలిన సీసా పెంకుల్లా ఖస్సుమని గుండెల్లో దిగుతుంది.
‘ఈ దిక్కు మాలిన దేశంలో ఒక కప్పు కాఫీ పెట్టుకుంటే ఉంది, లేకపోతే లేదు”
” మరి తన హక్కులేమిటి? చలికాలంలో మంచు ఎత్తిపోసుకోడమూ, ఎండాకాలంలో గడ్డి కోసుకోడమూనా?’
“రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా? అనే మాట ఆడవాళ్ళ పరంగానే ఎందుకొచ్చిందో ఆవిడకర్థం కాలేదు”
“అనుభూతితో కూడిన విమర్శలకు సీతాపతిని సంప్రదించండి” (ఇక్కడ మాలతి మార్కు హాస్య రేఖ)
“మీ ముండల్లో ఒక ముండగా నేనుండను” ఇలా రాసుకుంటూ పోతే కథంతా తిరగ రాయాల్సిందే నేను.
ఏమైనా నాకొక అసంత్రుప్తి మొదటినుంచీ ఉంది. మీకు రావాల్సినంత ఫేమూ, నేమూ రాలేదని! మీరు దశాబ్దాల తరబడి అమెరికాలో ఉండిపోవడమూ, మీ పాత కథలని మీరు సంకలంగా తీసుకురావడానికి ప్రయత్నించకపోవడమూ(అప్పుడే), మీ సాహిత్యాన్ని మార్కెట్ చేసుకోవడానికి(పోనీ ఇలా చెప్పనా…’ మీ సాహిత్యాన్ని నలుగుర్లోకీ తీసుకెళ్ళదానికి) ఇక్కడ మీరు ఏర్పాట్లు చేసుకోకపోవడమూ, మొదలైనవి కారణాలుగా నేననుకుంటున్నా!
ఇదే కథను సదరు గాయత్రి, శోభ వగైరాల వైపు నుంచి చెప్పిన ఓల్గా నవల ‘ మానవి ‘. చదివారా మీరు? వారి ‘ప్రేమ ‘ను అర్థం చేసుకోవాలట సీతలు.
సుజాతా,
ఫెమినిస్టులమని చెప్పుకుని తమ ‘స్వాతంత్రాన్ని ‘ సమర్థించుకునే వారికి పగిలిన సీసా పెంకుల్లా ఖస్సుమని గుండెల్లో దిగుతుంది. - నాకథ ప్రయోజనాన్ని అంతటినీ ఒక్క వాక్యంలో చెప్పేసారు. మీరు మాత్రం తక్కువవారా!
మళ్లీ మరోకసారి మనవి చేసుకుంటున్నాను. మీవంటివారి అభిమానం నాకెంతో బలం. నా కథాసంకలనం, నిజానికీ ఫెమినిజానికీ మధ్య, అన్న పేరుతోనే BSR Foundation, Vizianagaram, వారు ప్రచురించారు. (విశాలాంధ్రలో దొరుకుతుంది కూడాను). నేను పుస్తకానికి ఈపేరు పెట్టినందుకు ఒక పెద్ద ఫెమినిస్టు చిన్నబుచ్చుకున్నారుట. నేను డైటింగ్ చేయాల్సివస్తే తలుచుకుంటాను వీరిని. (మళ్లీ మా.మార్కు హాస్యరేఖ).
మానవిలాటివి చదవడం నావల్ల కాదులెండి. నాది చాలా చిన్నబుర్ర.
మీరు నవతరంగానికి రాసిన కామెంట్ పుణ్యమా అని మీ వెబ్సైట్ దర్శనభాగ్యం అయ్యింది. సరదాగా ఓ కధ చదువుదామని మొదలు పెట్టి ఇప్పటికే నలుగు చదివేసా ( ఇదే మొదటిసారి విజిట్ చెయ్యడం) . మరో రెండ్రోజులకి సరిపడా పదార్ధం దొరికింది.
“వీరేశలింగంగారు విధవలకి పెళ్ళి చేసి ఉద్ధరిస్తే, ఈయన పెళ్ళైన వాళ్ళను పట్టుకొని వాళ్ళ మొగుళ్ళను వెధవల్ని చేస్తున్నారు” అన్న ప్రయోగం మీలోని చతురతను తెలియచేస్తే, “మనుషులు తమకి తెలీకుండానే మారిపోతారు” అన్నది జీవితసత్యాలను సింగిల్ లైన్లో చెప్పగలిగే చాకచక్యాన్ని తెలియచేసింది.
చివరిగా చిన్న ప్రశ్న ..
“నిజానికీ ఫెమినిజానికీ మధ్య” లో సీతాపతి శోభకీ, గాయత్రికీ రాసిన ఉత్తరాలు వాళ్ళ దగ్గర ఉండకుండా సీతాపతి ఇంట్లోనే దొరకడంలో ఏమైనా ఆంతర్యం ఉందా?… నాకెందుకో ఎంత అలోచించినా ఈ విషయం బోధపడలేదు. ఒకవేళ సీతాపతి కావలనే సీతను ఆట పట్టించే ఉద్దేశ్యంతో ఇదంతా చేసాడనే భావం వచ్చేలా ఉంది. కాస్త విశదీకరించగలరు.
@శంకర్,
థాంక్స్. మీ ప్రశ్న - అదొకరకం నార్సిసిజం కావచ్చు. నేను కొందరు ఆలా తాము రాసిన వుత్తరాలకాపీలు దాచుకోడం చూశాను. కథ నడవడానికి పనికొచ్చింది కదా అని వాడుకున్నాను.
సీతాపతి ఉత్తరాలు రాసి పోస్ట్ చేద్దామని అక్కడ పెట్టాడు అనుకున్నాను.
సీత ఆలోచనని, సీతాపతి లేఖల్లోని వాక్యల్ని చేర్చి మీరి సృష్టించిన కథాశైలి కొత్తగా ఉంది. “తాబేలు తారే బతుకుతుంది, లేడి దూకే బతుకుతుంది” అన్న సామెత ఉదహరిస్తూ మీరు (సీత తరఫున) చేసిన ముక్తాయింపు, కొంచెం ’statement’ అనిపించింది. కథ మొత్తం suggest చేసి, ఆఖరున “నిర్ణయించెయ్యడం” అవసరమంటారా? అదీ శోభ కు సీతాపతి రాసీ పోస్టు చెయ్యని(నిర్ణయానికి ట్రిగ్గర్ గా పనిచేసిన) ఉత్తరం ఆధారంగా.
చాలా బాగా ఉన్నా, కొంత అసంతృప్తి ని కలిగించింది. బహుశా అదే ఈ కథ ఉద్దేశ్యం కావచ్చు.
రాధికా, నీ వివరణే సహజంగా వుంది నావివరణ కంటే.
మహేష్ కుమార్ గారూ. ఏమో మరి, నిత్యజీవితంలో సామెతలు వాడతాం కదా అట్టే ఆలోచించకుండా. మీ వ్యాఖ్యానంలో మీవిమర్సనాదృష్టి తెలుస్తోంది. థాంక్స్.