నీలితెరలమాటున
ఏప్రియల్ 30, 2008 ద్వారా tethulika
నీలితెరల మాటు
కంప్యూటరుముందు కూర్చుని వెబ్బుమబ్బుల్లో ఓలలాడుతోంది నీల కాని మనసంతా రాబోయే మెయిలుమీదే వుంది.
తెల్లార్తూనే తొలికప్పు కాఫీలాగానే ఈమెయిలు కూడా అలవాటయిపోయింది వారం తిరక్కుండా.
కిందటి మంగళవారం వచ్చింది మొదటి మెయిలు. ఆరోజు నీలకి ఆదేమంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఎవరో రామలక్ష్మిట ఓ మెయిలు పంపింది.
తనేదో మెయిలు చూసుకుంటుంటే ఓమూలని వెలిగిన కవరుబొమ్మ చూసి నీల యదాలాపంగా నొక్కింది దాన్ని.
“కొత్తతలపులు” సైటులో మీకవిత ఇప్పుడే చూశాను. చాలా బావుంది″. - రామలక్ష్మి.
″థాంక్స్ అండీ″. జవాబు కొట్టింది నీల
ఆవిడ ఇంకా లైనులో వున్నట్టుంది.
″మీరు ఇంకా ఏం రాసారు? మీజవాబు అవును ఐతే ఎక్కడ?″ -రా
″లేదండీ. ఇదే ఓం ప్రథమం ,″ నీల జవాబిచ్చింది చిన్నగా నవ్వుకుంటూ.
″ఆలాగా! తొలిపలుకే మెరుపులా మురిపించింది.. రాస్తూ వుండండి″. -రా
″నేనంత రచయిత్రిని కానండీ. ఎప్పుడో తోస్తే నాలుగులైనులు గిలుకుతాను అంతే″ - నీ.
″మీకు మంచి భావుకత వుంది″. - రా.
″అమ్మో మరీ అలా పొగిడెయ్యకండి. మరోసారి థాంక్స్.″ -నీ
″పొగడ్త కదండీ.. ప్రతిభవున్నచోట వుందని ఒప్పుకోవాలి కద. చెక్కభజన కాదులెండి″ … రా.
″మీరేమాటైనా ఇంత సూటిగా చెప్పేస్తారేమిటి?″ - నీ.
″ఆహా, నిక్షేపంగా. సరే వుంటానండి. మళ్లీ రేపు మాటాడుకుందాం.″ - రా.
ఇద్దరూ నవ్వుకున్నారు రెండు నీలితెరలమాటున, రెండుసంద్రాలకి చెరోవైపునా.
000
ఆమర్నాడు నీల మరెవరిదో ఓ కవిత చూసింది. తనకి చాలా బావుందనిపించింది. ఆపూటంతా ఆకవిత తనని వెన్నాడుతూనే వుంది. ఆసాయంత్రం కూచుని మెయిలు చూస్తూంటే, రామలక్ష్మి ఈకవితగురించి ఏం అంటారో అనిపించి, వెంటనే ఓమెయిలు కొట్టింది.
″హలో. ఈవారం ″కొత్తలుపులు″లో ″మబ్బుతునక, మంచుముక్క″ కవిత చూశారా? మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.″ - నీ
అవతల ఆవిడ లైనులో వుంది. వెంటనే జవాబు, “నేనూ ఇప్పుడే చూశాను, నేనూ అంతే. అదే మీరేం అనుకున్నారో అని :->″ - రా
“అందులో భావావేశం వుంది కాని కవితలా అనిపించలేదు. అయినా నాకు కవితలగురించి అంతగా తెలీదులెండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను” - నీ.
“కవిత అన్నది మూరెడూ, జానెడూ అంటూ కొలవలేం కదా. ఒకొక్కరు ఒక్కో కోణానికి స్పందిస్తారు. ఇప్పుడు ఈకవితే చూడండి. మీకేమో అందులో ఆవేశం కనిపించింది. నాకేమో పదవిన్యాసం బావుందనిపించింది. ఒకే కవిత అయినా కారణాలు వేరు కావచ్చు కదా.” రా
″ఏమోమరి. నాకు షడ్రుచులతో విందు చేసింతరవాత తాంబూలం తక్కువైనట్టనిపించింది చివరకి ;-)″ - నీ.
″^D. హా. తాంబూలం ,,, ఇప్పుడు తాంబూలాలెక్కడ?. బ్రెత్ ఫ్రెషనరులే కద ఎక్కడ చూసినా :-p.″ - రా
″బ్రెత్ ఫ్రెషనరా? ఎక్కడున్నారేమిటి?″ -నీ.
″ఇంకెక్కడ, కలియుగ భూతలస్వర్గం. అట్లాంటిక్‌కి ఆవలిగట్టున మీవేపునించి చూస్తే″. -రా
″మీరు కవిత్వం రాస్తారా?″ - నీ
″లేదు. చదవడానికే చాలడం లేదు ఎక్కడలేని టైమూను. అయినా నేను కూడా ఎందుకులెండి చెయ్యెట్టడం అందులో -: )″ - రా
″సరేలెండి. ఇప్పటికింతే సంగతులు.″ -నీ.
000
అచిరాకాలంలోనే ఈమెయిళ్లలోంచి చాటులోకి దిగిపోయారిద్దరూ. ఇంచుమించు రోజూ కనీసం ఓఅరగంటసేపు చాటుకచేరీ పెట్టేసుకుంటున్నారు హుషారుగా. కవితలూ, కథలే కాక ఇతర విషయాలు, కదాచితుగా వ్యక్తిగతవిషయాలూ కూడా మేలాడుకోడం, మేలమాడుకోడం కూడా మామూలయిపోయింది. తమకే తెలీకుండా ″మీరు″లొదిలేసి ″నువ్వు″లలోకి కూడా మారిపోయారు.
“ఇంతకీ అమెరికాలో ఎక్కడ నివాసం? ఏంచేస్తున్నావు?” అనడిగింది నీల రామలక్ష్మిని.
“నేను చికాగోలో వున్నాను. నాకూ అదే ఆలోచన - ఏంచేస్తున్నానా అని ఆలోచిస్తూంటాను :p.”
″నేను కంప్యూటరు సైన్స్ చేస్తున్నా. రెండో ఏడు″ నీల తను చెప్తే ఆవిడ చెప్తుందేమో అనుకుంది.
″హా. బాగుంది.″ - రా.
“నీది ఏ ఫీల్డు?” -నీ
“ఏఫీల్డూ లేదు. కాలేజీ ఒక ఏడాది వెలగబెట్టేనంతే.” -రా.
తను మరీ పొడిచి పొడిచి అడుగుతున్నానేమో అనిపించి నీల అక్కడికి ఆప్రశ్నలు ఆపేసింది. ఈవిడెవరు, ఏంచేస్తోంది అన్న ఆలోచనలు అలాగే వుండిపోయేయి.
బహుశా కాలేజీలో చదువుతుండగా ఏవిదేశీ పెళ్లికొడుకో దిగేడేమో. ఈపెళ్లికొడుకులు రావాలే కాని సుమూహార్తాలు ఇట్టే దొరుకుతాయి. పెళ్లికొడుకులకి శలవు దొరికినసమయానికి సరిగ్గా పజిల్లో ముక్కలు అతుక్కున్నట్టు కనివిని ఎరగని శుభముహూర్తం కలిసొచ్చేస్తుంది. ఏసద్బ్రాహ్మణుడో సాక్షాత్తు దేవతలు పెట్టిన కల్యాణఘడియలు కనిపెట్టేసి పుణ్యం కట్టుకుంటాడు.. దేవతలు స్వయంగా వచ్చి దీవిస్తారని కూడా ప్రమాణం చేస్తాడు. నీల నవ్వుకుంది. ఇదంతా కేవలం తన ఊహాగానమే కావచ్చు కాని అనుకోడానికి సరదాగా వుంది.
తను అమెరికాలో నెట్చాటులలో పొంచుండి పిల్లలని వంచించే దుష్టులగురించి కూడా వింది. ఈ రామలక్ష్మి కూడా అలాటి దొంగపేరు కావడానికి ఆవకాశం వుంది కదా అన్నమాట తలుచుకున్నప్పుడు నవ్వురాలేదు. కాని ఎందుకో కొంచెంసేపయినతరవాత అలా అనుకోడమే మహా పాపమనిపించింది. ఆత్మనా లెంపలేసుకుందేమో కూడాను.
ఆవిధంగా వరసగా ఈమెయిలులు హౌరా ఎక్స్‌ప్రెస్‌లా సాగిపోయేయి కొంతకాలం.
000
″ఇందాకా మాఅమ్మ విశ్వంమామయ్య వస్తారు మాటాడమంది. తను పక్కింటికి వెళ్తున్నానని″ - నీల
″సరే. సిద్ధం అవు మరి.″ - రా.
″ఏంమాటాడతానాయనతో. మాతాతగారివయసు ఆయనకి. ఏంవుంటాయి ఆయనకీ నాకూ మాటాడుకోడానికి? అన్నాను అదే ఆమాట మాఅమ్మతో అన్నాను″ -రా.
రామలక్ష్మి కొంచెంసేపు వూరుకుని, ″ఏంచేసావు మరి?″ అని అడిగింది.
″మాఅమ్మేమో ఆయన మనిషే కదా, ఆశృతిపెట్టెకంటె నయమే కదా అంది చిరాగ్గా.″ -నీల
″శృతిపెట్టేమిటి?″
″అదే నా లాప్టాపు. ఇది రాకముందు నేను తనతో సరదాగా వూసులాడుతూ వుండేదాన్ని. మేం ఇద్దరం అసలు అమ్మా కూతుళ్లలా కాక అక్కచెల్లెళ్లలా కబుర్లూ, ఎకసెక్కాలూను..″ -నీ.
″ఇప్పుడు మానేశావేమిటి?″ - రా.
″ఇప్పుడు ఈకంప్యూటరుమూలంగా అంతసేపు తనతో గడపడం లేదని మాఅమ్మకి కోపం.″
″:p. అదేం బాగులేదు. నేను మీఅమ్మతరుఫే..″
″;). అన్యాయం. ముందొచ్చిన చెవులకంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే..″ - నీల
″మరే .)″
000
″నిన్న చదవమని ఓస్నేహితురాలు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని ఓపుస్తకం తెచ్చిచ్చింది. నువ్వు చదివావా?″ -నీ
“లేదు, లేదు. రెండు ప్రశ్నలకీను.” - రా.
″మానేస్తురాలు చెప్పడం అలాటి పుస్తకం అదొక్కటే అని. కనివినిఎరగం అసుమంటి బుక్కు అంటుంది″ - నీ
″:p. ఆమాటకి అర్థం ఎలాగైనా చెప్పుకోవచ్చు.″ -రా
″ఏమో, చదివి చెప్తాలే.″ -నీ
000
“నిన్న తారే జమీన్ పర్ సినిమా చూశాను. నువ్వు చూసావా?” - నీల
“నేను సినిమాలు అంతగా చూడను..నేను చివరిసారిగా చూసింది ప్రాణమిత్రులు అనుకుంటాను..” -రా.
“అయ్యో రామా. అది వచ్చేనాటికి నేనే కాదు మాఅమ్మయినా పుట్టిందో లేదో. :p. ఆతరవాత నువ్వు సినిమాలే చూడలేదా?”- నీ.
“ఏమో మరి, నాకు ఆపాత సినిమాలే బావుంటాయి.” -రా.
“సరే. పుస్తకాలగురించి మాటాడుకుందాం. ఏ రచయితలు ఇష్టం?” -నీల
″నువ్వు Bridge on the river Kwai చదివావా?″ -రా
″ఎప్పుడూ వినను కూడా లేదు. ఎవరు రాశారు?″ -నీ.
″పేరు గుర్తు లేదు, కాని చాలా బాగుంది. చిన్నపుస్తకమే. సినిమా కూడా వచ్చింది″ -రా.
″నీకెక్కడ దొరుకుతాయి ఇవన్నీ. నువ్వు చెప్పేవన్నీ అమ్మమ్మలకాలంవి. ఆతరవాత సాహిత్యం లేదనుకుంటున్నావేమిటి. :P.″ నీ
″నువ్వు చెప్పినవి నాకూ తెలీదు కద. సాహిత్యం సాగరం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి?″ - రా
″ఇవన్నీ మాలైబ్రరీలో లేవు. నీకెలా దొరుకుతున్నాయా అని″. -నీ
″మా అమ్మమ్మకి చదవడం చాలా ఇష్టం. ఆవిడే ఓ ఎన్సైక్లోపీడియా. 1870తరవాత ఏపుస్తకం అడగు. మొత్తం చరిత్ర అంతా చెప్పేస్తుంది.″ - రా
″అంటే? 1870లో వున్నారేమిటి ఆవిడ .)″ -నీ.
″అబ్భ ఆవిడ కాదమ్మా, మనకి ప్రింటింగు వచ్చింది అప్పడూ :^D. హాస్యానికన్నాను.″ - రా.
″సరేలే, ఇకమీదట వికీపీడియాకి బదులు నిన్నే అడుగుతా ఏం కావలిసినా :p.″ -నీ
″ :)) 1950కిపూర్వం అయితేనే … :p.″ - రా.
″మరి శలవా″
″వుంటానుమరి″.
.000
రెండురోజులుగా రామలక్ష్మిదగ్గరినుండి ఏమెయిలూలేదు. రవికిరణాలతో ఏతెంచే ఈ ఉదయటపాలు కనిపించకపోతే ఏం బాగోలేదు నీలకి. ఇలా హఠాత్తుగా ఆగిపోడం మర్యాదగా లేదు. ఎక్కడికేనా వెళ్లిందా? చెప్పివెళ్లొచ్చుకదా. కంప్యూటరుకష్టలేమో. అమెరికాలో కూడా ఉంటాయా?.
″హలో. రెండ్రోజులై మేలుబండి రానేదు. అంతా పనేనా?″ - నీల రామలక్ష్మికి ఓమెయిలు కొట్టి ఆరోజుకి తనపనిలో పడిపోయింది. మరో రెండురోజులు గడిచేయి. అవతల్నించి మేల్గాడీ జాడ లేదు.
″హలో. బావున్నావా? నీమెసేజిల్లేక నా ఇన్నుబాక్సు చిన్నబోయింది.″ -నీల మళ్లీ మరో మెయిలిచ్చింది.
000
ఆ మర్నాడు శనివారం. నీల మెయిలులు చూసుకుంటే తనకి పరిచయం అయిన ఐడితో మెయిలొచ్చింది.
″అమ్మమ్మకి బావులేదు.″
″అయ్యో. డాక్టరుదగ్గరికి తీసుకెళ్లారా?″ నీల ఆతురతగా అడిగింది. తను ఇంతకుముందు ఈనేస్తురాలిగురించి అనుకున్న మాటలు గుర్తొచ్చి నొచ్చుకుంది కూడా వెనువెంటనే..
″ఆస్పత్రిలోనే వుంది″ - ఆర్.
నీల స్క్రీనుని పరీక్షగా చూసింది. రామలక్ష్మి మామూలుగా తెలుగులో రాస్తుంది. పైగా ఆర్ అని సైన్ చెయ్యదు. అయినా మనస్సు బాగులేనప్పుడు అలవాటయినభాష ముందొస్తుందన్న దివ్యసూత్రం తలుచుకుని తను కూడా ఇంగ్లీషులోనే జవాబిచ్చింది.
″ఫరవాలేదు. అక్కడ డాక్టర్లు బాగా చూస్తారు కద. నీకు వీలయినప్పుడే రాయి″. -నీల
కాస్త విరామం. నీలకి అర్థం కాలేదు. అవతల రామలక్ష్మి వుందా? వెళ్లిపోయిందా?
మళ్లీ బాక్స్ వెలిగింది. ″నేను మీకు రాయొచ్చా?″ – ఆర్.
″అంటే?″
″యూ అమ్మమ్మాస్ ఫ్రెండ్.″ - ఆర్. .
నీలకి అయోమయంగా వుంది. తాను ఎవరితో మేలమాడుతోంది? ఎవరికి వొంట్లో బాగులేదు? రామలక్ష్మికా? వాళ్లమ్మమ్మకా?
ఎవరు మెయిలిస్తున్నది. రామలక్ష్మేనా, మరెవరేనా దారితప్పి ఇటొచ్చేశారా?
″నో. నేను రాహుల్. మాఅమ్మమ్మకి మీరు చాలా ఇష్టం″. - ఆర్.
ఇదీ మరీ గందరగోళంగా వుంది. ఎవరీ రాహులుడు?
″నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు?″ - నీల
″5. నేనే అమ్మమ్మకి కంప్యూటరు స్కిల్సు నేర్పింది. నాకు తొమ్మిదన్నర ఏళ్లు.″ - ఆర్.
తాను మేలాడుతున్నది రామలక్ష్మి మనుమడని గ్రహించగానే నీలకి ఫక్కున నవ్వొచ్చింది. ″అలాగా. మంచిపని చేశావు.″ అంది నవ్వుకుంటూ.
″ఆవిడకి అసలు కీబోర్డు తాకడానికి కూడా భయమే . నేను చెప్పాను తెలుగుకథలూ అవీ నెట్లో చూడొచ్చనీ. ఈమెయిలూ, ఇమోటికానులు అవన్నీ చూపించేను కూడా. నా ఐడీలోనే మీకు రాస్తోంది.″ –రాహుల్ హుషారుగా కొట్టిపారేస్తున్నాడు టకటక. వాడికి తాను సాధించిన ఘనవిజయం మహగొప్పగా వుందన్న సంగతి నీలకి స్పష్టం అయింది.
నీలకి మరోసందేహం. మరి రామలక్ష్మి చెప్పే అమ్మమ్మ ఎవరు?
″ఓ, అలాగా. సరే. మీఅమ్మమ్మని అడిగానని చెప్పు. … అవునూ, మీ అమ్మమ్మ వాళ్ల అమ్మమ్మ కూడా మీతోనే వున్నారా?″ -నీల.
″లేదు. అమ్మమ్మ వాళ్లఅమ్మమ్మగురించి కథలు చెప్తుంది అంతే. నేను ఎప్పుడూ చూడలేదు.″ - ఆర్.
″అవును, నాక్కూడా చెప్పింది మీ అమ్మమ్మ వాళ్ల అమ్మమ్మకథలు.″ నీల.
″మాఅమ్మమ్మకి మీరు చాలా ఇష్టం. మిమ్మల్ని ‘చిన్నినాచుట్టం’ అంటుంది. నాకు చాలా హోమ్ వర్కు , బై.″
″:). సరే. హోమ్‌వర్క్ చేసుకో. ″ -నీ.
″మాఅమ్మమ్మ తొందరగా ఇంటికి వచ్చేస్తే బాగుణ్ణు. అమ్మమ్మ ఇంట్లో లేకపోతే ఏం బాగులేదు.″
″ఫరవాలేదులే. తొందరగానే వచ్చేస్తుంది.″ నీల రాసింది ధైర్యం చెప్తూ.
″నేను మీకు రాయొచ్చా?″ - ఆర్.
″తప్పకుండాను.. రాస్తూ వుండు. మీఅమ్మమ్మకి ఎలా వుందో చెప్పు.″ -నీల.
రామలక్ష్మి తనకంటే పెద్దది అన్నమాట తెల్లమవడానికి కొంతసేపు పట్టింది. కాని నమ్మబుద్ధి కావడంలేదు. ఆవిడతో చాటు సాటి మిత్రులతోలాగే అనిపించింది ఇన్నాళ్లూ. ఆవిడ ఎందుకు ఈవిషయం స్పష్టం చెయ్యలేదు? తను విశ్వంమామయ్యగురించి చెప్పినమాట మూలంగానేమో. …చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది.
రేపు ఆవిడ మళ్లీ మెయిలిస్తే తను నువ్వు అంటూ రాయగలదా, రాయలేదా అన్న సదసత్సంశయంలో చాలారాత్రి అయిపోయింది ….. ఈనీలతెరలచాటు భేటీ. ఆటు ఒకతరం వెనక ఆవిడా, ఇటు ముందుతరం చిన్నవాడు, మధ్యధరాసముద్రానికి చెరోవైపునా …
పడుకోబోతూ, నీల డైరీలో రాసుకుంది, “ఈరోజు నాకు ఒక కొత్త చిన్ని నేస్తం దొరికాడు″.
000
(మాలతి. ఏప్రిల్ 200 ![]()
బాగుంది.
మేల్గాడీ లాంటి కొత్త పద ప్రయోగాలు చాలా బాగున్నాయండి.
మీ గురించి తెలియకముందు మీరు రాసిన అమెరికా కబుర్లలాంటి కధలు చదివి మీరు నా వయసువారే అనుకున్నాను.తెలిసిన తరువాత చాలా ఆశ్చర్యపోయాను. మీ కధల్లోగానీ,బదులు రాసే వ్యాఖ్యల్లో గానీ పెద్దరికం కనపడదు.అయినా తాతా మనవళ్ళు,అమ్మమ్మ మనవరాళ్ళు తొందరగానే(అంటే ఆ వయసువాళ్ళు)స్నేహితులయిపోతారులెండి.
@రాజు,
నెనరులు.
@రాధికా,
:)). సరే నా పెద్దరికం ఉపయోగించుకుంటున్నా. ఒకరహస్యం.
ఇదివరకు ఇలాటి తప్పులు వచ్చేవి కావు. ఈమధ్య వస్తున్నాయి. ఇలా ఎవరైనా బాగుంది అంటే అప్పుడు మళ్లీ నేను కూడా చదువుతా. (నవ్వకండి మరి). అలాగే ఇప్పుడు పైవ్యాఖ్యానాలు, చూసాక మళ్లీ చదివాను. కొన్ని లైనులు తిరిగిరాయబడ్డాయని ఇప్పుడే గుర్తించేను.
ఇకమీదట అలాటివి మీకళ్ల బడితే నాచెవిన వేస్తూ వుండండేం .. (ఇది నాకథల పాఠకులకందరికీను)
మా.