తెలుగు తూలిక

జులై 16, 2008

ఊసుపోక -అచ్చంగా నేనే అచ్చేసేసుకున్న చిన్నినా పొత్తము.

ప్రచురించిన వర్గము ఊసుపోక, సాహిత్యం — malathi @ 9:18 అపరాహ్నం
Tags: , , ,

(ఎన్నెంకతలు 15)

 

బాబ్బాబూ, నాపుస్తకం కాస్త అచ్చేసి పెట్టండి. చచ్చి మీకడుపున పుడతా. - ఇది నిజానికి మధ్యమ స్థాయి.

ఆదిని, ఈ అచ్చొత్తడాలు లేనిరోజుల్లో, కవులు సభల్లోనూ, నడివీధిలోనూ ఆశువుగా కవితలు చెప్పేసేవారు. ఆపైన ఆకులమీద గిలికేస్తూ వచ్చారు.

ఆతరవాత కొంతకాలానికి గ్రేటు బ్రిటనునుండి యంత్రాలొచ్చేయి. అసలు నన్నడిగతే నాగరీకం అన్నమాట ఎలా వచ్చిందో కాని మనదంతా పశ్చమీకం తెలుగువారికంటె ఎక్కువగా తెల్లవారే పూనుకుని మహోత్సాహంతో పుస్తకాలూ, పత్రికలూ అచ్చేసేసేరు. అసలు కారణం క్రైస్తవీకరణమే అయినా, మన పుస్తకాలక్కూడా మంచికాలం వచ్చింది. మూలమూలల పడున్న తాళపత్రాలని తెల్లకాగితాలమీదకి ఎక్కించేరు. విజ్ఞానం పలువురికి పంచిపెట్టొచ్చు అన్నది మూలకారణం కావొచ్చు. బోలెడు కాపీలు తయారు చెయ్యొచ్చు,, చాలామందికి చదవే అవకాశం కలగొచ్చు అని కూడాను.

 

అప్పట్లో బాబ్బాబు, నాపుస్తకం కాస్త అచ్చేసిపెట్టు అంటూ రచయితలు ప్రచురణకర్తల వెంట పడవలసిన అవుసరం వున్నట్టు కనిపించదు. ప్రచురణకర్తలే ఇది మంచిపుస్తకం, ఇది నలుగురికి అందుబాటులో వుండేలా చెయ్యాలి అని నిర్థారణ చేసుకుని ప్రచురించేవారు. ఇలా నేనెందుకు అనుకుంటున్నానంటే వేమనగారూ, పోతనగారూ వావిళ్ల రామస్వామి శాస్త్రులవారినో, రాజమండ్రీ సరస్వతీ బుక్ డిపోవారినో కలుసుకుని ఇలా బతిమాలుకున్నారు అనుకోలేకుండా వున్నాను. అలాగే పెద్దబాలశిక్ష కానీ చిన్నయసూరి వ్యాకరణం కానీ ఏరచయితపోరో భరించలేక అచ్చొత్తించినవి కావు అనే అనుకుంటే నాకు తృప్తి.

 

మూడో దశలో అంటే, వీధికో పత్రికా, ఇంటికో రచయితలూ-గా వృద్ధి పొందేక, సీను మారిపోయింది. ఈవిషయంలో కొంతవరకూ తెలుగు రచయిత్రులు బాధ్యత వహించకతప్పదు. యాభై, అరవై దశకాల్లో పత్రికలలో వచ్చిన సీరియళ్ల ప్రాచుర్యం చూసి ప్రచురణకర్తలు వాటిని పుస్తకరూపంలో అందించేరు. ఆతరవాత డైరెక్టు నవలలంటూ సీరియళ్లు కాని వాటికి కూడా పుస్తకరూపం ఇచ్చేరు.

1982లో విజయవాడలో నేను ఒకపబ్లిషరుతో మాటాడుతున్నప్పుడు ఆయన అన్నమాట ఈ లేడిరైటర్లతో పడలేక వారి నవలలు వేసుకోడం మానేశాంవండీ. ఆళ్ల డిమాండులు తట్టుకోలేక పోతన్నాంఅని. అంటే ప్రచురణకర్తలే రచయితలదగ్గరకి వెళ్లి బాబ్బాబూ మీపుస్తకం మమ్మల్ని అచ్చేసుకోనీండి, మీకు పుణ్యముంటుంది అని బతిమాలుకునే రోజులు అప్పుడు పోయాయన్నమాట. వాళ్లు ప్లేటు మార్చేసి మేం వేసుకుంటాం కానీ మాడబ్బెట్టి కాదు అని ప్రకటించేశారు. .

రచయితలసంఖ్య వందలు దాటిపోయింతరవాత అంతగా పేరు లేని రచయితల పుస్తకాలు -అది ఎంత మంచిపుస్తకం అయినా సరే - ప్రచురణకర్తలు వేసుకోడం మానేశారు అంచేత సిరిగల రచయితలు తమ పుస్తకాలు తామే ప్రచురించుకోడం మొదలు పెట్టారు. ఎప్పుడు అంటే ఫలానా దివ్యముహూర్తంలో అని ఖచ్చితంగా చెప్పలేను. మన స్ట్రెయిట్ టాక్ జర్నలిస్టు సుజాతకి తెలుసేమో. (సుజాతా, తెలిస్తే చెప్పు). 

ఇంతకీ ఈఆచారం ఫ్రచురణకర్తలకి గొప్ప వరం అయిపోయింది.. ఈరచయితలది ఎంత మంచి మనసు, రాసిందే కాక ప్రచురించుకోడానికి కూడా సిధ్ధమే. దుకు అనవసరంగా మన సొమ్ము కుమ్మరించడం అనుకున్నారు. పైగా ఇది అమెరికాలో ప్రాచుర్యంలో వుంది. సబ్సిడరీ పబ్లిషింగు అంటారు. నేను అమెరికన్ పబ్లిష్రర్లతో మాటాడినప్పుడు తెలిసింది. 

మొన్నమొన్నటివరకూ, ప్రచురణగురించి నాకు కొన్ని అభిప్రాయాలుండేవి. పాతకాలం తెలివే అనుకోండి. కాకిపిల్ల కాకికి ముద్దు కదా. నారచన నాకెప్పుడూ ఎంతోఓఓఓఓఓఓఓఓ బావుంటుంది విస్సందేహంగా. కాని …

1. మరొకరు ప్రచురించడానికి ఒప్పుకుంటే, అందులో ఎంతో కొంత సరుకు వుండే వుందన్న భరోసా కలుగుతుంది. లేకపోతే వారెందుకు మదుపు పెడతారు అన్నది నా తర్కం. నా మటుకు నాకు అదొక ఆమోదముద్ర అనిపిస్తుంది..

2., వారికి ఎడిటర్లుంటారు. ఆఎడిటర్ల పని ఆపుస్తకంలో తప్పొప్పులు చూడడం. చూస్తారనే ఆశ.

3. మార్కెటింగు కూడా వారికి తెలిసినట్టు మనకి తెలీదు కదా. అది వారు చూసుకోగలరు.

రెండు పుస్తకాల ప్రచురణ తరవాత అర్థం అయింది - ఇవన్నీ నేను కట్టుకున్న పేకమేడలే అనీ, నా అభిప్రాయాలకి బూజు పట్టేసి చాలాకాలం అయిపోయిందని. నారెండు పుస్తకాలు ఎందుకు ప్రచురించారో నాకు అర్థం కాలేదు కానీ ఎడిటింగు, మార్కెటింగు మీద ఆశలు పెట్టుకోడం మాత్రం వ్యర్థం అని తెలిసింది.

 

సరే, నారాతలు వెలుగు చూసే అవకాశం ఇంక లేదని నిరుత్సాహపడిపోతున్నరోజుల్లో ఓ విద్యా సంస్థ పెద్దవారిని కలిశాను. అదే తొలిసారి కలవడం ఆయనని. అయినా నాకెందుకో మాఅన్నయ్యతో మాటాడుతున్నంత హాయిగా అనిపించింది ఆపూట. ఆహుషారులోనే,. నేను తెలుగురచయిత్రులమీద ఇరవై ఏళ్లకిందట రాయడం మొదలుపెట్టి, మధ్యలో అటకెక్కించేసి మళ్లీ తీసి ప్రచురణకి సిద్ధం చేసాను, అని చెప్పేశాను. ఆయన మా పబ్లికేషన్ డివిజనుకి ప్రపోజలు పెట్టండి. వాళ్లేం అంటారో చూద్దాం అన్నారు. నిజానికి నేనేదో నేను చేస్తున్నపని చెప్పాను కానీ ఆయన అలా అంటారని అనుకోలేదు. ఎదురు చూడని ఆహ్వానం. నేను ఉప్పొంగిపోతూ, ఆహా జీవితమానందమయమూ అంటూ స్వగతంలోనే పాడేసుకున్నాను నాగదికి వెళ్లిపోయి. ఆతరవాత, లోకంలో నిజంగా మంచివాళ్లున్నారు, మనం మంచిపని చేస్తే, ఆదరించేవారున్నారు అని మహదాచ్చేర్యపోయేసి, నేలకి నాలుగడుగుల ఎత్తున నడుస్తూ ఇల్లు చేరి, మరోసారి ప్రూఫు చూసుకుని మేల్ చేసేశాను సదరు పబ్లికేషను డివిజనుకి.

అట్టే ఆలీసం లేకుండానే, తమ అంగీకారం తెలిపేశారు ప.డి. డైరెక్టరు. నేను పడీ పడీ మురిసిపోయేను.  హమ్మో, ఇండియాలో విద్యాసంస్థలలో ఇంత గబగబా పనులు జరిగిపోతాయా అని.

ఆతరవాత, మరో నాలుగు వారాలకి కాబోలు ఆసంస్థలోనే ఒకమహారచయిత్రి అయిన ఓ చంద్రముఖినుండి నాకో ఈ-లేఖ వచ్చింది. తమ సంస్థ ఆనవాయితీ ప్రకారం, తనని నాపుస్తకానికి శ్రీముఖం రాయమన్నారనీ, నాకు అభ్యంతరం లేదని తాను అనుకుంటున్నాననీ, అలా నాబృహత్ గ్రంథానికి శ్రీముఖం రాయగల అదృష్టం తనకి కలగడం తను ఏనాడో చేసుకున్న పుణ్య విశేషమనీ … హీహీహీహీ ,,, లేదు లెండి అచ్చంగా ఇలాగే కాదు కానీ ఇంచుమించు ఇలాటి అర్థమే వచ్చే ఇంగ్లీషులో రాసింది ఆ రైటరు..

మరి నేను కూడా అంతకంత తీర్చుకోవాలి కదా (అప్పులుంచుకోరాదు). అంచేత తమవంటి ప్రముఖ, ఉత్తమ, మహా రచయిత్రీ, విదుషీమణీ, (గట్రా) నాపుస్తకానికి ముందుముక్క రాయడం నాకెంతో గౌరవప్రదమనీ, అసలు అందువల్ల నాకూ, నా ఉద్గ్రంథానికీ విలువ ద్విగుణీకృతమయిందనీ …శక్తిలోపం లేకుండా విన్నవించుకున్నాను.

మళ్లీ వెంటనే జవాబు, నేను అనుమతించినందుకు తనకెంతో ఆనందమయిందనీ, పైవారం సామర్లకోటలోనో శంకరగిరిమాన్యాల్లోనో ఏదో సభ వుందనీ ఆతరవాత రాస్తాననీ మళ్లీ మరో మేలు.

ఇప్పుడు చెప్పాలంటే ఆరోజులు మళ్లీ రావు. నాకు కళ్లనీళ్లొస్తున్నాయి! ఆహా, ఆమర్యాదా, ఆమప్పితం, ఎంతైనా తెలుగు ఆడబడుచూ, ఆసలా వంశంలోనే వుందీ … ఇలా ఏంతైనా చెప్పుకోవాలనిపించిందన్నమాట.

ఆతరవాత మాయిద్దరిమధ్య జరిగిన మేలాదిమేలుల సంక్షిప్తరూపం ఇక్కడ చూడగలరు -.

నేను- సభ చాలాబాగా జరిగిందని విన్నాను. మీ ఉపన్యాసం పత్రికల్లో చదివాను. చాలా బాగా మాటాడేరు. (ఇందులో నా ముందుమాట యొక్క మాట లేదు.)

చం.- చాలా బాగా జరిగింది. (ఇందులో కూడా నా ప్రవేశిక ప్రవేశించలేదు.)

నేను.- నాపుస్తకానికి మీరు రాయబోయే ముందుమాట చూడడంకోసం ఎంతో వుత్సాహంగా ఎదురు చూస్తున్నాను.

చం.- ఈనెల్లో పరీక్షలు మా పెద్దవాడికి. అది అవగానే రాస్తాను. ఆషామాషీగా కాక, ఎంతో పొడుగ్గా రాయాలని నాకోరిక.

నేను.- తప్పకుండా రాయండి. రచయిత్రులమీద రాయడానికి బోలెడు సమాచారం వుంది. మీలాటి లబ్ధప్రతిష్ఠులయిన పండితురాళ్లు రాయడం అవసరం.

చం.- అలా అనకండి. నేను అంత పండితురాలని కాను

నేను.- వచ్చే సెమెస్టరు ఇక్కడ యూనివర్సిటీలో ఒక కోర్సు పెడుతున్నాను. నాపుస్తకం పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది. మీరు ముందుమాట కాస్త త్వరగా ముగిస్తే సంతోషిస్తాను.

చం.- మీరు తొందర పెడుతున్నారు కనక చిన్నది రాసి ముగించేస్తాను.

నేను.- అలాగే కానివ్వండి. నిజానికి వీసీగారు  మూడు నెలల్లో ప్రచురణ అయిపోగలదన్నారు. ఏడాది దాటిపోయింది చూశారా.

(జవాబు లేదు)

నేను. మీరు నామెయిలు చూడలేదేమో. నాకు క్లాసులు మొదలవుతాయి త్వరలోనే.

.(మళ్లీ జవాబు లేదు)

నేను. రెండు నెలల్లో ఇండియా వస్తున్నాను. వీలయితే మిమ్మల్ని కలుస్తాను.

చం. నేను అప్పుడు వూళ్లో వుంటానో వుండనో చెప్పలేను. మీరు వచ్చేక ఫోను చెయ్యండి.

 

ఇలా మామెయిళ్లు ఆగిపోయేక ఇండియాలో దిగాను. అప్పటికి నాకు మొదట మాట ఇచ్చిన పెద్దవారూ, ఆయన తరవాత వచ్చినవారూ కూడా రిటైరయిపోయారు. ఆస్థానంలో కొత్తగా చేరిన మూడోనెంబరు పెద్దవారిని కూడా కలుసుకోడానికి అనుమతి తీసుకుని,, అనుకున్నవేళకి కలుసుకున్నాను. వారు కూడా ఎంతో ఆప్యాయంగా నాముందు పెద్దవారు మీకు మాట ఇచ్చారు, ఆమాట నిలబెట్టవలసిన బాధ్యత నాకుంది, తప్పకుండా వేస్తాం అని మాటిచ్చారు.

ఇలా మాట మీద మాట పుచ్చుకునీ, ఆమాటా ఈమాటా ఆడుతూనూ నాలుగేళ్లు ఎదురుచూసాను ఆశుభముహూర్తం కోసం.

 

ఇండియానించి తిరిగి రాగానే, కొత్తగా వచ్చిన డైరెక్టరాఫ్ పబ్లికేషనుకీ నాకూ జరిగిన మేలులాట కూడా నాకూ చంద్రముఖికీ జరిగిన ఏకాంకికలాటిదే. మొదట ఎంతో మెప్పుగా మేడమ్‌గారు అంటూ మొదలెట్టి చివరకి ఎడ్రెస్ లేని ఉత్తరాలూ, ఆతరవాత పూర్తిగా సౌండ్‌లెస్.

 

ఈలోపున నాకు అప్పుడప్పుడు సహృదయులైన మిత్రులు తారసబడడం, వాళ్లు నేనడిగి చెప్తాం లెండి అని మాట ఇవ్వడం జరుగూతూ వచ్చింది., ఓకాపీ పంపించండి ఫలానా ఎడ్రెస్‌కి అని చెప్తే నేను కాపీలు పంపిస్తూ వచ్చేను. పాపం, నాస్నేహితులు నిజంగా శ్రమ తీసుకుని వెళ్లి కనుక్కుంటూనే వున్నారు. ఎవరో ఒకరు అడిగినప్పుడల్లా ఆ ప.డై. ఇదుగో అయిపోయింది. వచ్చే నెల వచ్చేస్తుందని చెప్పండి అంటూ వచ్చింది. వచ్చేనెలలు వచ్చి పోయేయి కానీ పుస్తకం అచ్చు కాలేదు. నేను అదేం అని రాసిన మేలూ, ఉత్తరాలూ బుట్ట దాఖలా. పెద్దవారికి రాసినా అంతే. 

ఇప్పటికి నాలుగేళ్లయింది. ముగ్గురు వీసీలు, నలుగురు ప. డై.లు మారేరు నాకు తెలివొచ్చేసరికి.

ఈనాటికి అర్థమయిన సంగతుల గతి ఇదీ -

1. అయిన పెద్దలు ఆమోదించినా వాకిట కావలి తిమ్మన్నలు జరగనివ్వరు

2. మాటిచ్చేయడం తేలిక. పాటించడం లేదిక.

3. కాపీలమీద కాపీలు అంపుకోడంకన్నా సొంతంగా అచ్చేసుకోడం చవక

4. మనం వేసుకున్నా, మరొకరు వేసినా మార్కెటింగు రూలొకటే. అచ్చేయించేసి, దేవుడా నీవే దిక్కు అనుకుని వూరుకోవాలి ఆస్తికులయితే. నాస్తికులు కూడా ఇలాటిదే మరోటి కనిపెట్టుకోవాలి.

——–

 

 

గమనిక . ఇది ఊసుపోక కాదు, నిజంగానే రచయిత ఆర్తితో రాస్తున్నాను.  ఈపాయింటునించీ మీరు చదువుతున్నది నిజంగా నిజం. నాపుస్తకాలు నేనే Publish on Demand (POD) పద్ధతిలో ప్రచురిస్తున్నాను.

ముందు ఇది ఎలా పని చేస్తుందో చూడడానికి, తొలి ప్రయత్నంగా ఒక చిన్న సంకలనం, నాకథల అనువాదాలు “All I Wanted was to Read and Other Stories” by Malathi Nidadavlu అన్న పేరుతో www.CreateSpace.com  ద్వారా ప్రచురిస్తున్నాను. ఈనెలాఖరుకి Amazon.com లభ్యమవుతుంది.

 

మీకు వీలయితే, ఆసక్తి వుంటే, చూసి, సలహాలు చెప్పండి. నాప్రయత్నం విజయవంతమయితే చెప్తాను., మీకు కూడా ఇది పనికొస్తుందేమో చూసుకోండి., ఇప్పుడే పెట్టేను కనక ఇందులో సాదకబాధకాలు ఇంకా తెల్లము కాలేదు.. కొంతకాలం ఆగితే, తెలిసింతరవాత మళ్లీ చెప్తాను.

పాతికేళ్లుగా కుస్తీ పడుతున్నపుస్తకం - తెలుగురచయిత్రులమీద- కూడా ఇలాగే ప్రచురించడానికి సిదం చేస్తున్నాను. 

 

000

 

చివరిమాటగా . అంకితం - మనసులో మాట స్పష్టంగా విశిష్టంగా వెల్లడి చేసేస్తున్న సుజాతకి.

ప్రచురణకష్టాలగురించి రాయాలని చాలా రోజులుగా రాయాలనుకుంటున్నా, సుజాత జర్నలిస్టు అనుభవాలు చూశాకే తోచింది ఫార్మాట్. అంచేత, సుజాతా, ప్రచురణ నీ రంగం కాకపోయినా, జర్నలిస్టుగా కొంత తెలిసినదానివి కనక, ఇది అచ్చంగా నీకే. అందుకో మరి.  

 

000

(జులై 2008. )

అభిప్రాయములు »

  1. తెలుగువాడిని గారూ, చాలా చాలా నెనరులు మీరు శ్రమ తీసుకుని ఇంత సమాచారం సేకరించినందుకు. ముఖ్యంగా ఇండియాలో కూడా ఇది మొదలయినందకు సంతోషంగా వుంది. కూడలిలో నా బ్లాగులోని వ్యాఖ్యలు కనిపించడంలేదు. దయచేసి మీరు సేకరించిన సమాచారం అందరికీ అందేలా చూడండి.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఆగష్టు 9, 2008 @ 8:54 అపరాహ్నం

  2. మాలతి గారు : ఈ టపా చదివిన దగ్గర నుంచి ఈ సమాచారం ఇద్దామని ఆలోచిస్తున్నా, కానీ నేనే ఈ సైట్స్ మీద కొంత పరిశోధన చేసి అప్పుడు మీకు చెపుదామని అనుకుంటే ఇన్ని రోజులకి పూర్తిచేయగలిగా ..

    ఈ విధంగానైనా మీ రచనలు మన తెలుగు వారికి మరింత చేరువలోకి వస్తాయనీ/రావాలనీ ఆశిస్తూ …

    పూర్తి వివరాలు :

    CinnamonTeal
    Print & Publishing Services

    Setting the price for your book

    Self Publishing and Print On-Demand : Pothi
    Estimate Price of Your book

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా తెలుగు 'వాడి' ని — ఆగష్టు 9, 2008 @ 9:27 పూర్వాహ్నం

  3. నాగరాజు గారూ, చాలా చాలా థాంక్స్ మీ సూచనలకి. మీరు చెప్పిన లింకులు తప్పకుండా చూస్తాను. నా పేరు ప్రఖ్తాతులు తెలిసినవాళ్లమధ్యేనండీ. …

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — జులై 26, 2008 @ 10:31 అపరాహ్నం

  4. మాలతిగారు,
    మీ పుస్తకం చాలా కాలం తర్వాతనైనా వెలుగు చూస్తున్నందుకు అభినందనలు. మీరన్నట్టు ఈ పబ్లిష్ ఆన్ డిమాండ్ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇప్పుడు కిండిల్, డి-బుక్ లాటి డిజిటల్ ఇంక్‌ పరికరాలు కూడా వచ్చాయిగా, ఇవి ఊపందుకొంటే ప్రింటింగ్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఇవి మరి తెలుగు రచయితలకి ఎలా ఉపయోగపడతాయో చూడాలి.

    మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టీ, ఇంగ్లీషు పుస్తకాలు ప్రచురిస్తున్నారు కాబట్టి, కింద లింకులేమైనా ఉపయోగపడతాయేమో చూడండి.

    http://weinbergonwriting.blogspot.com/ – ఈ బ్లాగులో వైన్‌బెర్గ్ కేవలం రచనల గురించే కాకుండా, పబ్లిషింగు గురించి, వాటికి సంబంధించిన కాంట్రాక్టుల గురించి కూడా రాస్తుంటారు.

    చాలా కాలం క్రితం ఎప్పుడో చూసా – Steven York రాసిన Do you want to be read or do you want to be published అని ఓ బ్లాగు పోస్టు. మీలాంటి పేరు ప్రఖ్యాతులు గడించిన వారికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అనుకోండి, కాని ఎందుకో మీ పోస్టు చదివితే ఇది గుర్తుకు వచ్చింది:
    http://york-multiplex.blogspot.com/2006/03/writers-and-other-delusional-people.html

    రిగార్డులతో,
    నాగరాజు

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నాగరాజు (సాలభంజికలు) — జులై 26, 2008 @ 8:59 అపరాహ్నం

  5. నెటిజన్ గారూ, ఈవారాంతంలోపునే మీ పుస్తకమా మరో బ్లాగా వెలువడేది? ఏదైనా సంతోషమే. అభినందనలు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — జులై 21, 2008 @ 6:40 అపరాహ్నం

  6. క్రియేట్ స్పేస్ లాగా మరో ఆన్‌లైన్ lulu.com !
    “ఊసుపోక -అచ్చంగా నేనే అచ్చేసేసుకున్న చిన్నినా పొత్తము”అనే శీర్షిక మీద బ్లాగడానికి అవకాశమ్ కలిపించినందుకు కృతజ్ఞతలు!
    త్వరలోనే వెలువడుతుంది!
    బహుశ ఈ వారాంతంలోపే!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — జులై 21, 2008 @ 8:33 పూర్వాహ్నం

  7. ప్రవీణ్, మీరు చదివారా గారలకు, మీ శుభాకాంక్షలకి కృతజ్ఞతలు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — జులై 20, 2008 @ 9:13 అపరాహ్నం

  8. మీ ప్రయత్నం విజయవంతమై మరింత మందికి దీపధారులు కాగలురు గాక! విజయీభవ…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా meeruchadivaaraa — జులై 20, 2008 @ 3:47 అపరాహ్నం

  9. పబ్లిషింగ్ లో ఉన్న కష్టాలు బాగా వివరించారు.

    మీ ప్రయత్నం సఫలమయి మీ పుస్తకానికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నా…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ప్రవీణ్ గార్లపాటి — జులై 18, 2008 @ 1:14 పూర్వాహ్నం

  10. @ వికటకవిగారూ, ఆంధ్రాలో కూడా మొదలుపెట్టడం ఏమంత కష్టం కాదు. మన సాఫ్టువేరు వీరులంతా అక్కడే కదా వున్నది. ఓ సైటు పుట్టించడం వారు చెయ్యగలరనే నానమ్మకం. పుస్తకం ఫార్మాటింగ్ మరి రచయితలకి తెలియాలి.
    @మహేష్ కుమార్, తెలుగుదేశంలో ఇంకా చాలామంది పాఠకులకి కంప్యూటరులూ, బ్లాగులూ అలవడలేదనే అనుకుంటున్నాను. కానీ అమెరికాలో పబ్లిష్ అయిన పుస్తకం అక్కడ కొనుక్కోడం కూడా కష్టమే పోస్టేజి చాలా ఎక్కువ కనక. నాకిక్కడే రెండు డాలరుల ప్రూఫ్ కాపీకి ఆరు డాలరులు పోస్టేజీ అయింది!
    @ cbrao గారూ, నిజమే నండీ. ఏదో ఒకటి చెయ్యాలన్న తపనే తప్ప ఏదోఒరుగుతుందన్న ఆశ లేదు. మీ అభిప్రాయాలు ఇక్కడ వెలిబుచ్చినందుకు కృతజ్ఞతలు.
    @ దుర్గేశ్వర, గురుపౌర్ణమా. సంతోషం అండీ.
    @సుజాతా, ఎందుకు నచ్చిందో చెప్పాలన్న నీనిర్ణయం బాగుంది. ఆహా, నువ్వు చదివిన మొదటి కథ రససిధ్ధి. సరే.

    పీఓడీ ప్రచురణలలో ఫార్మాటింగూ, ప్రూఫులు అన్నీ మనబాధ్యతే. వాళ్లు చేసే పని అచ్చు వెయడం, బైండు చెయ్యడం, మార్కెటింగు కూడా చేస్తాం అంటున్నారు. చూడాలి.
    @ ప్రవీణ్ గారూ, మీ శుభాకాంక్షలకి కృతజ్ఞతలు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా tethulika — జులై 17, 2008 @ 10:33 అపరాహ్నం

  11. మాలతి గారు,
    మీ చంద్రముఖి, మరియు విద్యా సంస్థ ఎవరో నాకు తెలిసిపోయింది.! ఈ అకాడమీలు ఏ గవర్నమెంట్ ఆఫీసు కన్న భిన్నమైనవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాయాలనే ఉత్సాహం(పుస్తకంగా) ఎవరికుంటుంది నిజంగానే?
    ఇక్కడ తెలుగు పుస్తకాలు వేసే ప్రచురణ సంస్థలు ఇంగ్లీషు పుస్తకాలు వేయరట. ప్రూఫులు దిద్దడాలూ అవీ కష్టం అవుతుందని ఒకాయన అన్నాడు. నాకేం మాట్లాడాలో తోచలేదు మరి!

    ఇకపై మీ టపాలకు వ్యాఖ్యలు రాస్తే ‘ఎందుకు నచ్చిందో ‘ కూడా రాయాలని నిర్ణయించుకున్నాను. నేను మొదటగా చదివిన మీ రస సిద్ధి కథనుంచి ఇవాల్టి టపా వరకు సున్నితమైన వ్యంగ్యాత్మక హాస్యం(మరీ కాంప్లికేటెడ్ గా లేదనుకుంటా వాక్యం)నాకు చాలా నచ్చుతుంది. వేమన గారు,చిన్నయ సూరి…పబ్లిషర్లు..సుపర్బ్!

    మహేష్ గారు,
    బ్లాగు లోకం బాగానే ఉంది గానీ, పుస్తకంగా వస్తే ఇంకా ఎక్కువమంది చదివే అవకాశం ఉంటుందా ఉండదా? బ్లాగులు కొంతమందికే పరిమితం కదా!ఇప్పుడైనా ఈ http://www.createspace.com మాలతి గారు చెప్పేవరకూ నాకు తెలీదు! ఎంతమంది చదువుతారంటారు? పుస్తకంగా వస్తే అందునా మాలతి గారు లాంటి రచయిత్రి రచనలు పుస్తకంగా వస్తే నా లాంటి వాళ్ళు హాయిగా వంటింట్లో వంట చేస్తూ కూడా ఒక చేత్తో పుస్తకం పట్టుకుని హాండిల్ చేయొచ్చు.

    మాలతి గారు, మీరు పబ్లిష్ చేస్తున్నందుకు సంతోషమే! ఎలాగోలా పుస్తకం మేము చదివెయ్యొచ్చు గాబట్టి! కానీ ఇక్కడ పబ్లిషర్లు రచనల, రచయితల విలువలు గ్రహించలేకపోతున్నందుకు విచారంగా ఉంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుజాత(మనసులో మాట) — జులై 17, 2008 @ 11:12 పూర్వాహ్నం

  12. chaalaa baagumdI kottapaddati. mIku gurupourNami subhaakaamxalu.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా durgeswara — జులై 17, 2008 @ 7:21 పూర్వాహ్నం

  13. తెలుగునాట పుస్తక ప్రచురణ ఒక వ్యధల కథ. అకాడమీలలో ఉన్న ఉద్యోగిస్వామ్యం (bureaucracy) ఇంతా అంతా కాదు. ఇక కొందరు వ్యక్తులు, సంస్థలు చేసే స్వకీయ ప్రచురణల విధానము కూడా పెద్దగా రచయితలకు ఉపయోగ పడేది కాదు. Personality Development, General Knowledge కాక మిగతా పుస్తకాలపై ప్రచురణ కర్తలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. మనము ప్రచురించి వారి కిచ్చినా పెద్ద కమీషన్ అడుగుతారు. దీనివలన పుస్తకం ఖరీదు ఎక్కువవుతుంది. ఎక్కువధర వలన పుస్తకాలు, పాఠకులను ఆకర్షించలేవు. మన డబ్బు తో పుస్తకం వేసుకుంటే పుస్తకాల పంపిణీదారులు, అమ్మిన పుస్తకాలు తాలుకా డబ్బు ఎప్పుడు ఇస్తారో దేవుడు కూడా చెప్పలేడు. అమెరికా లో మీ స్వంత ప్రచురణ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా cbrao — జులై 16, 2008 @ 11:58 అపరాహ్నం

  14. మీరు ఆఖర్న చెప్పిన ‘ఈ నాటికి అర్థమైన సంగతులు’ కొత్త రచయితలూ,రచయిత్రులకు చీకటిలో దివిటీ పనిచేస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. అందుకే, “ఈ పబ్లిషింగుకన్నా, మనమే రాజూ/రాణీ అయిన ఈ బ్లాగులోకమే మిన్న” అని విజయవంతంగా డిక్లేర్ చేస్తున్నాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — జులై 16, 2008 @ 11:35 అపరాహ్నం

  15. అబ్బో, భలేగా ఉందండీ ఈ సొంతముద్రణ పద్ధతి. రచయితలకి ఎన్ని ఉపయోగాలో.

    చేతులు పూర్తిగా కాల్చుకోకుండానే, అమ్మగలిగినన్నే అమ్ముకోవచ్చు.

    సక్సెస్ కాని పుస్తకాలు చెత్తకింద అమ్ముకోటం కంటే ఇది చాలా మంచి పద్ధతి. డబ్బు, శ్రమ, పేపరు అన్నీ మిగులే మిగులు.

    ఇండియాలో కూడా ఈ పద్ధతి రావాల్సిన అవసరం ఉంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వికటకవి — జులై 16, 2008 @ 11:13 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.