తెలుగు తూలిక

ఆగష్టు 21, 2008

బ్లాగుశతకానికి నా సమిథ

ప్రచురించిన వర్గము వ్యాసాలు, సాహిత్యం — malathi @ 10:53 అపరాహ్నం
Tags: ,

(8-22-2008. తప్పులు దిద్దబడినవి. :)  వీవెన్ గారు మర్చిపోయినవి చేర్చవచ్చు అని రాశాక గుర్తు వచ్చినవి చేరుస్తున్నాను చివర, క్షమాపణలతో. తే. 23 ఆగస్ట్.) 

 

వీవెన్ గారు కూడలిద్వారా మనకి చేస్తున్న సాయం అమోఘం. మీకు ఏవి నచ్చేయో ఎందుకు నచ్చేయో .చెప్పండి అని ఆయన ఆడిగారు కనక రాస్తున్నాను ఇది. 

 

నిజం చెప్పాలంటే ఇది చాలా కష్టం నాకు. ఎందుకంటే నా పరిధి చాలా చాలా చిన్నది.

ప్రపంచసాహిత్యం> తెలుగు సాహిత్యం> కథలు> ఆధునిక కథలు> నేను పుట్టినతరవాత వచ్చిన కథలు. కొండొకచో నేను రాసిన కథలు మాత్రమే. ఇక బ్లాగులు చూస్తే, వీవెన్ వంద మంచి బ్లాగులు అన్నారు కనక రెండో మూడో వందల తెలుగు బ్లాగులు వున్నాయనుకుంటున్నాను. అందులో బాగా రెగ్యులర్‌గా అప్‌డేట్ చేస్తున్నవారు వందమందే అని నా అనుమానం.

ఇందులో 90 శాతం నాపరిధికి మించినవే. తలుచుకుంటే నాచిన్నప్పుడు చదివిన పడవవాడు-వేదపండితుడు కథ జ్ఞాపకం వస్తోంది. నాచదువు నిరర్థకం.

నాకు తెలీనివీ, అర్థం కానివీ - , ప్రపంచ సాహిత్యం, కవిత్వం, ఛందస్సూ, సంస్కృతం, రాజకీయాలూ హైదరాబాదులో స్థానిక రాజకీయాలూ, ఆఫీసులూ, కాలేజీ హాస్యాలూ, క్రికెట్టూ, యువ స్పిరిటు, సైన్సు ఫిక్షను, సాంకేతికం, హైందవమూ తదితర నమ్మకాలూ, సినిమాలూ, నటనటీవర్గం, సంగీతం, చిత్రకళ, ఛందస్సు, పిండివంటలూ, సాధారణ వంటలూ, నగలూ, చీరెలూ.. .

ఈ వడబోత అయింతరవాత, మిగిలినివి ఏమిటి? అందులో నేను చూసేవి ఎన్ని? ప్చ్. అయినా వీవెన్‌గారి కూడలిద్వారా నేను పొందుతున్న లాభం అద్వితీయం. ఈమధ్య కూడలికి నలత చేసినప్పుడేం అయిందో తెలుసా. నా ముందువారం బ్లాగుకి వచ్చిన హిట్టులతో పోలిస్తే మరుసటి వారం బ్లాగుకి 94 శాతం పడిపోయాయి.. పాథెటిక్ అంది నాస్నేహితురాలు. (కన్నీరు తుడుచుకుంటూ రాస్తున్నా). అంచేత నాకు తోచిన అభిప్రాయాలు చెప్తాను. ఎవరినీ కించపరిచే వుద్దేశ్యం లేదు.

 

సాధారణంగా బ్లాగుల్లో సరదాగా చెప్పుకునే ఆషామాషీ కథలూ, కథలకి సంబంధించిన వ్యాసాలు చూస్తాను, సుజాత (మనసులో మాట), సుజాత (గఢ్డిపూలు), మీనాక్షి, పూర్ణిమా, లచ్చిమీ, శ్రీవిద్య, ఇంకా ఎల్లుండి వచ్చిన రెండు పల్లు చూపించినబాలకిశోరం ఎవరో గుర్తు రావడం లేదు, మీరెవరైనా తెలిస్తే చెప్పండి  … వీరందరూ చూపుతున్న కొత్తపోకడలు, క్రియెటివిటీ మెచ్చుకోదగ్గది. నాకు చాలా బాగుంది. ఇక్కడే మరోమాట కూడా చెప్తాను. profile, word verification — ఈమెట్లు గెలిచి కామెంట్లు ఇవ్వడం కష్టంగా వుంది. అంచేత నాకామెంటు కనిపించకపోతే అపార్థం చేసుకోవద్దని మనవి.

పూర్ణిమా, సుజాత, మరియు సుజాత కథలమీదా, పుస్తకాలమీదా రాస్తున్న సమీక్షలు కూడా నాకు చాలా బాగున్నాయి. సౌమ్య సరేసరి పుస్తకాల పురుగు అన్నారెవరో. కానీ సినిమాలగురించి, పాటలగురించీ, అనువాదాలగురించీ కూడా రాస్తోంది కదా. తనబ్లాగు నేను ఎక్కువగానే చూస్తాను. కామెంట్లు ఒక్కోసారి తనకే నేరుగా ఇస్తాను.

సాహిత్యవ్యాసాలకీ, కవితలకీ కల్పనా రెంటాలని చెప్పుకోవాలి. తను బ్లాగుకి కొత్త అయినా పాఠకలోకానికి పాతకాపే. నేను తన వ్యాసాలూ, కవితలూ ఇదివరకే చూసాను కనక గట్టిగా చెప్పగలను తనబ్లాగు మంచి బ్లాగు అని. అలాగే మరొక మంచి బ్లాగరు శారద (ఆస్ట్రేలియా). కూడలిలో అట్టే కనిపించకపోయినా - ఈమధ్య తన కథ, ఆడది కోరుకునే వరం -మీద వచ్చిన చర్చ తప్పించి. మంచికథలతోపాటు స్ఫూర్తిదాయకమైన వ్యాసాలు కూడా రాస్తోంది.

కవితలు - నాకు అట్టే అర్థం కావు. బాగున్నట్టు అనిపిస్తాయి కాని ఏమిటి బాగుంది, ఎందుకు బాగుంది అంటే చెప్పలేను. ఈమాట అంటే రాధిక అలా అనకండి, మీరు కూడా కవితలు రాస్తారు కదాఅంది! మరి నేను ఏంరాస్తున్నానో నాకు తెలుసు కదా. J). ఇంతకీ అలా తెలిసీ తెలీని జ్ఞానాజ్ఞానాలతో నేను చదివే కవితలు రాధిక, నిషిగంధ, బుల్లోజుబాబా, స్వాతికుమారి,  ఇంకా నాబ్లాగులో వ్యాఖ్యలిచ్చినవారి అందరి బ్లాగులూ చూస్తాను కనీసం వాళ్లేం రాస్తున్నారో తెలుసుకోడానకి. సిరిసిరిమువ్వ గారి సరిగమలులాటివి  చూస్తూంటాను.  ఆవిడ క్రికెట్ లాటి విషయాలు రాయగలరు.

ఎప్పుడో మర్చిపోయిన తెలుగుపద్యాలని గుర్తు చేస్తూనూ, కొత్తగా కొన్నిటిని పరిచయం చేస్తూనూ, భైరవభట్ల కామేశ్వరరావుగారు నడుపుతున్న తెలుగుపద్యం నాకు చాలా నచ్చిన బ్లాగు.

 

సర్వశ్రీ కొత్తపాళీ, సీబీరావు, రాజేంద్రకుమార్ - వీరు రాస్తున్న టపాలకంటె తమవ్యాఖ్యలతో బ్లాగరులకి ఇచ్చే ప్రోత్సాహం ఎక్కువలా కనిపిస్తోంది. అది వారి ఔదార్యం. మన భాగ్యం. అలాగే, చదువరీ, వికటకవీ, ప్రవీణ్ గార్లపాటి, మొదలైనవారెందరో మంచి బ్లాగులు నడుపుతున్నారు.

మహేష్ కుమార్ బ్లాగుమీద చర్చచురుగ్గా వచ్చింది శివ ధర్మమా అని. ఈవిషయంలో సాటి బ్లాగరులు నెట్ మర్యాదలు మరొకసారి అందరికీ గుర్తుకి తీసుకురావడం ముదావహం. మహేష్‌కుమారే చెప్పినట్టు శివకి తమ అభిప్రాయాలు వెలిబుచ్చడానికి అధికారం వుంది. ఆయన కొత్తబ్లాగరులకి మార్గదర్శకులు కావాలనుకుంటే ఈఒక్క బ్లాగునీ చూడకండి అని హెచ్చరించడంతో సరిపుచ్చక, ఏబ్లాగులు చదివి కొత్త బ్లాగరులు ప్రభావితులు కాగలరో కూడా చెప్పివుంటే వారు తమ వ్యాఖ్య, తమకొచ్చిన భాషలో సమదృష్టితో చేసేరనే నమ్మకం నాకు కలిగి వుంటేది. బ్లాగులోకానికి సంబంధించినంతవరకూ బ్లాగే బ్లాగరు. ఇది వ్యక్తిగత దూషణ కాదంటే నమ్మడం కష్టం.

 

మాటవరసకి, జ్యోతి గారు ప్రమదావనంలోనూ ఇతరత్రా మంచి జోరూ, హుషారూ గల బ్లాగరు. ఆవిడ ప్రచురించిన తిట్లదండకం నాకు బాగులేదు. అంతమాత్రాన నేను వారి బ్లాగు చూడడం మానేయలేదు, మరొకరిని అటు వెళ్లకండి అని హెచ్చరించనూ లేదు. ఎవరి పరిధిలో వారు రాస్తూ, ఎదటివారి అభిప్రాయాలని గౌరవించడం కూడా బ్లాగులో ఒక సామాజిక ధర్మమే అని నావిశ్వాసం.

పుస్తకప్రచురణవిషయమై నేను రాసినప్పుడు, తెలుగు’వాడి’ని గారు శ్రమతో చాలా విషయాలు సేకరించి పంపారు. వేరే టపా రాస్తానని మాట కూడా ఇచ్చారు. అలాగే మరికొందరు మంచి బ్లాగరులు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి సంస్కృతపాఠాలూ, వికటకవి గారి చమక్కులు… ఇలా కొన్ని కోణాల్లో నాకు నచ్చిన విషయాలు గల బ్లాగులు కూడా వున్నాయి. అలాగే ఏకాంతపు దిలీపు గారు కూడా మంచి టపాలు రాస్తున్నారు.

 

ఇక్కడ ఉదహరించకపోయినా నేను ఇతరబ్లాగులు కూడా చూస్తూంటాను అప్పుడపుడూ ఏమీ అర్థం కాకపోయినా :p.

 

 

(ఆగస్ట్ 2008. )

 

 

 

అభిప్రాయములు »

  1. ఇదిగో సమాధానం
    http://shiva-speaks.blogspot.com/2008/08/blog-post_21.html

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శివ — ఆగష్టు 22, 2008 @ 2:14 పూర్వాహ్నం

  2. అయ్యో మాలతిగారు,ఆ తిట్లదండకం నేను రాసింది కాదండి. అంతా జంధ్యాల గారి మహిమ. సరదాకి పెట్టాను నా బ్లాగులో . కాని అవన్నీ చైనీయూలకే కదా.. నాకు అంత టాలెంటు, ఓపిక లేదు లెండి. నచ్చకుంటే వాళ్లకు దూరంగా ఉంటాను .

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా జ్యోతి — ఆగష్టు 22, 2008 @ 2:19 అపరాహ్నం

  3. శివ గారూ, ధన్యవాదాలు.
    జ్యోతి గారూ. సరే. :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఆగష్టు 22, 2008 @ 5:56 అపరాహ్నం

  4. అమ్మా,మనం మనం ఇలా మన ఇసాపట్నమ్ వాళ్ళమ్ ఇలా మెచ్చేసుకుంటూ(మీరు,నేను,సుజాత గారు తదితరులు)ఇలా ముందుకు పోతుంటే ..మన చుట్టుపక్కలున్న సివ్వాచలమ్,అనకాపిల్లి,ఎల్మించిలి,బీవిలి వాళ్ళేమనుకుంటారో అని నా అనుమానం :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 22, 2008 @ 8:42 అపరాహ్నం

  5. రాజేంద్ర గారూ, :) :) అనుకోనీండి. ఏటి సేస్తం. మీతో అంటే చెప్పండి. అయ్యో సూస్కోనేదు అనేసి వాల్లపేరు కూడా ఎట్టేస్తాను … .
    వెనక ఆరుద్ర అనుకుంటా, విశాపట్నంవాసులారా, దగాపడిన తమ్ములారా .. (ఆంధ్రరాష్ట్రం వచ్చినపుడు, మనకి కాపిటల్ రానప్పుడు, అంటూ ఓగేయం రాసేరు, మీకు గుర్తుందా?

    మాలతి

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఆగష్టు 22, 2008 @ 10:23 అపరాహ్నం

  6. హ్హ హ్హ హ్హ :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 23, 2008 @ 12:49 పూర్వాహ్నం

  7. రాజేంద్ర, మాలతి: మీ ఇద్దరి సంభాషణ బావుంది. :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా చదువరి — ఆగష్టు 23, 2008 @ 11:41 పూర్వాహ్నం

  8. మాలతి గారు మీకు తీరిక దొరికినప్పుడు నా బ్లాగూ చూస్తూ ఉండండీ :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా అశ్విన్ బూదరాజు — ఆగష్టు 23, 2008 @ 1:42 అపరాహ్నం

  9. @ చదువరి గారూ, :) )

    @ అశ్విన్ గారూ, తప్పుకుండా చూస్తాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఆగష్టు 23, 2008 @ 8:03 అపరాహ్నం

  10. రాజేంద్ర గారూ,
    మీకు పుణ్యక్షేత్రాలేమో పొన్నూరు, నిడుబ్రోలూనూ! మరి సాహిత్యం దగ్గరకొచ్చే సరికి “మనం మనం ఒకటి ” అని ఇసాపట్నం వాళ్లని కలిపేసుకుంటున్నారా? ఎంతన్యాయం! ఇదేం బాలేదండీ!(సరదాగా)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుజాత — ఆగష్టు 23, 2008 @ 9:52 అపరాహ్నం

  11. @సుజాత గారు,:)
    ఇది మరీ బాగుందండి,ఒకటి అమ్మగారి ఊరు,ఇంకోటి చదువు చెప్పి రెండు పీజీ డిగ్రీలిచ్చి,పైగా పిల్లనిచ్చి పెళ్ళిచేసిన ఊరు, ఆమాత్రం పీ ఆర్ మెయిన్ టైన్ చెయ్యాలా వద్దా??:)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 24, 2008 @ 12:18 పూర్వాహ్నం

  12. రాజేంద్ర గారు మొదలెట్టిన ఉపకథ – అసలు కన్న కొసరు మెరుగు. చక్కగా సాగుతోంది, :) :)
    ఇంకా ఎవరైనా చెయ్యేయదలుచుకుంటే, రండి.
    ఇంతవరకూ జరిగిన కథకోసం పై వ్యాఖ్యలు నెం. 4,5,6, 7, 10, 11 చూడవలెను.
    నావంతు తెర తీయడమే – ఈప్రహసనం ముగిసేవరకూ మాడరేషన్ లేదు. ..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఆగష్టు 24, 2008 @ 3:13 పూర్వాహ్నం

  13. రాజేంద్ర గారు,
    మీకు పిల్లనిచ్చింది హంపి అని చెప్పినట్టు గుర్తు ఒకసారి!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుజాత — ఆగష్టు 24, 2008 @ 12:29 అపరాహ్నం

  14. హయ్య బావోయ్!1 మీకు మరీ ఇంత జ్ఞాపకశక్తి ఉంటే కష్టమండి! :) వాళ్ళ నాన్నగారు అక్కడ (హంపీలో)ఉద్యోగం చేస్తున్నప్పుడు మాఅవిడ అక్కడ జన్మించిందన్నమాట.వాళ్ళదసలు వైజాగే,

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 24, 2008 @ 12:51 అపరాహ్నం

  15. i apriciate u r blog and contribution for telugu literature
    hope all succes
    with regards
    can u attach my blog

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా GURRAM SEETARAMULU — సెప్టెంబరు 10, 2008 @ 2:25 అపరాహ్నం

  16. మీ పోష్టులో నాబ్లాగుకు చోటిచ్చినందుకు థాంక్సండీ.

    రాజేంద్ర గారు
    అయ్యబాబోయ్ మేంకూడా మీ పక్కనే ఉన్నావండీ. మా తూగోజి ని కూడా గుంపులో కలుపుకోండి బాబూ. :-)

    బొల్లోజు బాబా

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా bollojubaba — సెప్టెంబరు 10, 2008 @ 7:06 అపరాహ్నం

  17. బాబాగారూ మన తూగోజీ వాళ్ళం కూడా ఒక సంఘం పెడదామండి.ఒకపనైపోతుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — సెప్టెంబరు 10, 2008 @ 10:24 అపరాహ్నం

  18. @రాజేంద్ర .. పెళ్ళై ఇన్ణేళ్ళయింది గదా, ఆడవారి జ్ఞాపక శక్తి గురించి ఆ మాత్రం పాఠం నేర్చుకోలేదూ?
    @బాబాగారూ .. తుగోజీ వారిది ఎంత గొప్ప సాహిత్య చరిత్రా, ఏవి కథా కమామీషూ .. మీరిలా పబ్లిగ్గా యిశాపట్నం వోళ్ళని గుంపులో కలుపుకోమని అర్ధించడం సుతరామూ బావోలేదు. రాధిక గారి అవిడియావే రైటు. మొన్న గుంటూర్జిలావాళ్ళెవరో అన్నట్టు ముందస్తుగా ఉగోజి బ్లా.సం పెట్టేసి, ఆ పైన ముచ్చటగా దెబ్బలాడేసుకుని విడిపోయి, తుగోజిబ్లాసం, పగోజిబ్లాసం వేర్వేరుగా పెట్టుకుందురుగాని. :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — సెప్టెంబరు 10, 2008 @ 11:36 అపరాహ్నం

  19. @Seetharamulu garu, thanks. Your blog as recorded here is giving error message.
    @ బొల్లోజు బాబా, రాధిక, కొత్తపాళీ … బాగుంది. ఇప్పుడు తెలిసింది నాబ్లాగుకి హిట్లకోసం ఏంచెయ్యాలో …:)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — సెప్టెంబరు 11, 2008 @ 10:32 అపరాహ్నం

  20. మాలతిగారూ నాకూ చెప్పండి ఆ హిట్లు పెంచుకునే సీక్రెట్టు.ఇక్కడ అందరూ 4,5 నెలలక్రితం బ్లాగు మొదలుపెట్టి 10000 దాటేసానోచ్ అంటున్నారు.నేనేమో రెండున్నర ఏళ్ళ క్రితం మొదలుపెట్టి ఈసురోదేవుడా అంటూ 15000 హిట్లు దాటాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — సెప్టెంబరు 12, 2008 @ 12:03 పూర్వాహ్నం

  21. పోదూ నువ్వు మరీనూ. నీకు తెలీకే అడుగుతున్నావేమిటి. నువ్వు అదేదో సంఘం పెట్టేస్తానంటే ఒక్కరోజే వంద హిట్లొచ్చేయి. అప్పుడనుకున్నాను నీలాటివారిని కాస్త మంచి చేసుకుని నాజేబులో ఎట్టేసుకోవాలనీ….

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — సెప్టెంబరు 12, 2008 @ 12:23 పూర్వాహ్నం

  22. @కొత్తపాళీ:గురూజి,నేర్చుకున్నాను అంటే ఒకతంటా,నేర్చుకుంటున్నా అనంటే మరో తంటా,చస్ నాకేటొద్దు అన్నాను అనుకొండి అదొక మరీ …మరి ఇలాగ కసింకోటకెక్కువగా,అన్కాపిల్లికి తక్కువ గానూ ఉందన్నమాట :)

    @రాధిక గారు,మాలతి గారు :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర కుమార్ దేవరపల్లి — సెప్టెంబరు 12, 2008 @ 1:36 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.