(ఎన్నెమ్మ కతలు 34)
ముందుటపాలో ఒత్తులూ, గుణింతాలగురించి రాస్తున్నప్పుడు కొన్ని తప్పులు దొర్లేయి. అబ్రకదబ్రగారు చెప్పేక చూసుకున్నాను. వారికి ధన్యవాదాలు. అందులో అక్షరదోషాలు కనిపించినమేరకి దిద్దుకున్నాను. ఆయన ప్రస్తావించిన రెండోవిషయం
రెండుమాటలమధ్య విరామాలగురించి. ఇది ఆలోచించాలి.
అసలు తెలుగులో విరామచిహ్నాలు లేవు. పూర్వకవులు ఘంటం పిడికిట సంధించి, తాటాకుమీద ఈచివరినించి ఆచివరికి రాసుకుపోయేవారు ఆపకుండా. ఘంటం ఆపడం తాటాకు చివరికొచ్చినప్పుడే కానీ వాక్యం అయిపోయినప్పుడు కాదు. దరిమిలా ముద్రణాయంత్రాలు వచ్చేక విరామచిహ్నాలు ప్రాచుర్యంలోకి వచ్చేయి.
ఫుల్‌స్టాపు ఉపయోగం బాగానే వుంది కానీ కామాలూ, కొటేషను మార్కులూ (దీనికి తెలుగేమిటో నాకు తెలీదు) మాత్రం ఇంకా కుదురుకున్నట్టు లేదు తెలుగులో.
ప్రస్తుతం నాసందేహం విశేషణానికీ విశేష్యానికీ మధ్య విరామం (స్పేస్) అవసరమా కాదా అని. నల్లనివాడు ఒకే పదం, ఆవుపాలు ఒకే పదం. కానీ కొన్నిమాటల్లో విరామం పెడితే అర్థాలు మారిపోతాయి. “అన్న మాట”లో “అన్న” అన్నది విశేషణం. “అన్నమాట” విశేషణం కాదు.
నాకు ఈవిషయంలో నిశ్చితమయిన అభిప్రాయాలు లేవు. నాకు LCD Screenలో ఒకొకప్పుడు అక్షరాలు సరిగ్గా కనిపించవు. బ్రౌజరు కారణం కావచ్చు, ఫాంటు కారణం కావచ్చు, ఏదయితేనేం కాయితంమీద కంటే కంప్యూటరుమీద చదవడం కష్టం. అంచేత నేను నా స్క్రీనుమీద ఎలా కనిపిస్తోందో దాన్నిబట్టి, మాటలు కలిపి వుంచడమో, విడదీయడమో చేస్తున్నాను. ఈవిషయంలో ఏది ఒప్పు అన్నది భాషాశాస్త్రజ్ఞులే చెప్పాలి. వ్యాకరణవిశేషాలకి సంబంధించినంతవరకూ ఇంతే కత.
ఇక కథారచన విషయంలో - తెలుగుకథ తెలుగులోనే రాయాలని నా ధృఢమయిన అభిప్రాయం. ఈరోజుల్లో మనమాటల్లో కనీసం సగానికి సగం ఇంగ్లీషు వుంటుంది. అదే వాస్తవం, సహజం అంటున్నారు కొందరు. నాకు అలా అనిపించదు. ఎందుకంటే ఒక తెలుగువాడు మరొక తెలుగువాడికి కథ చెప్తున్నప్పుడు, రచయిత వేరూ, కథకుడు వేరూను. రచయిత నిత్యజీవితంలో ఇంగ్లీషే మాటాడుతూ వుండొచ్చు. అందుకు భిన్నంగా కథకుడిచేత రచయిత కథని మంచి తెలుగులో చెప్పించవచ్చు. అంటే అలవాటుతోపాటు సాహిత్యవిలువలు కూడా పనిచేస్తాయి కథకుడిమీద.
తెలుగుసాహిత్యంలో ధ్వనికీ, వక్రోక్తికీ ప్రాధాన్యం వుంది. అంటే వున్నది వున్నట్టూ, చూసింది చూసినట్టూ కాక, అలంకారవిశేషాలతో కథని మరింత ఆకర్షణీయం, మనోరంజకం చేయడం.
“వాడికి కోపం వచ్చింది” అన్న వాక్యానికీ “వాడు అగ్గిరుద్రుడయిపోయేడు” అన్న వాక్యానికీ తేడా ఏమిటంటారు?
బసవరాజు అప్పారావుగారు ఒకకవితలో “బుల్లి పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయేడు” అంటారు వారి బాబుని తలుచుకుంటూ. చూడండి ఎంత సాధారణమయిన వాక్యం ఎంత విషాదాన్ని నింపుకుందో.
భాష కథని పటిష్ఠం చేస్తుంది. మంచివిషయాలు చెప్పడం ఒక ఎత్తయితే, మనసుకి హత్తుకునే పదాలు కూర్చి చెప్పడం మరో ఎత్తు. అలాటికథకే పాఠకుడు స్పందిస్తాడు.
మరి స్పందన అంటే ఏమిటి? కథ చదువుతుంటే, ఇంకా చదవాలనిపించడం స్పందన. కడవరకూ ఆపకుండా చదవడం స్పందన. చదివినతరవాత దాన్నిగురించిన తలపులు మనసులో కొనసాగడం స్పందన. దాన్ని పొడిగించుకుంటూ పోయి మరోకథకి నాంది పలకడం స్పందన. ఇలాటిస్పందన వున్నప్పుడే మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది. లేకపోతే, ఒకసారి చదివి అందులో ఏం వుందో తెలుసుకుని పక్కన పెట్టేస్తారు. లేకపోతే అబిడ్సులో అణాపరకకి అమ్మేస్తారు,
ఇంతకీ నేనంటున్న స్పందన కావాలంటే దానికి తగినభాష కావాలి. ఈరోజుల్లో చాలామంది కథలు నిజంగా చదవడంలేదు. అక్కడక్కడ చదివేసి, సుమారుగా అందులో భావాలు తెలుసుకుని పక్కన పెట్టేస్తున్నారు. నెట్టులో అయితే వ్యాఖ్యానాలు కూడా పెట్టేస్తున్నారు. అది కథని ఆస్వాదించడం అనలేను నేను. అలా చదివేవారే ఇంగ్లీషూ తెలుగూ కలిపి రాసినభాషకి అభ్యంతరాలు చెప్పరు కూడా.
అసలు నేను మొదట అడగాల్సింది “మీరు తెలుగుకథ రాస్తున్నారా? ఇంగ్లీషుకథ రాస్తున్నారా?” అని. తెలుగుకథ తెలుగులోనే ఎందుకు రాయాలి అని అడిగితే నేనేమీ చెప్పలేను. ఏమో మరి, దానిలో ఏదో తర్కం వున్నట్టుంది. అందుకూ. …
నేను కూడా తెలుగుకథల్లో ఇంగ్లీషు అప్పుడప్పుడు వాడతాను. దానికి రెండు కారణాలున్నాయి. మన సంస్కృతిలో లేని సాంప్రదాయాలూ, ఆచారాలూ మాటాడుతున్నప్పుడు, అదంతా తెలుగులోనే చెప్పాలంటే కృతకంగా వుంటుంది. అంత బాధపడి తెలుగులో రాస్తే చదివేవారికి నేనేం చెప్తున్నానో తెలీకపోవచ్చు కూడా. రెండోది, హాస్యానికి. “He told you కదా” అంటే నాకు హాస్యంగానే అనిపిస్తుంది. చివర “కదా” చేర్చడం ఎందుకు? కదా చేరిస్తే అది తెలుగు అయిపోతుందా? లేక, ఆ ఒక్క మాటకీ ఇంగ్లీషులో సమానార్థకం లేకనా? ఇంతకంటె మంచి ఉదాహరణ వారాలు చేసుకోడం తెలుగుజాతికి ప్రత్యేకమయిన సంప్రదాయం. వారాలబ్బాయిమీద తెలుగువారు చదువుకోడానికి తెలుగుకథ రాసి, వీక్లీబాయ్ అని పేరు పెట్టడం నాకు హాస్యాస్పదంగానే కనిపిస్తుంది. ఏ ఇంగ్లీషువాడికయినా వీక్లీబాయ్ అంటే అర్థం అవుతుందా? అవదు. వారాలబ్బాయి అన్నమాట వినని తెలుగువారుంటే, వారికి కూడా వీక్లీబాయ్ అంటే ఏమిటో అర్థం కాదు.
నేను వెనక చెప్పిన సూజీ కథ తీసుకోండి. అది అమెరికాలో జరిగింది కనక సహజంగానే ఇంగ్లీషువాతావరణం, ఇంగ్లీషుబతుకుకి అవసరమయిన ఇంగ్లీషుమాటలు వాడవలసివస్తుంది. నేనే ఆకథ తెలుగులో రాస్తే, బహుశా వీలయినంతవరకూ తెలుగు సమానార్థకాలు వెతికి, వీలుకానిచోట మాత్రం ఇంగ్లీషుమాటలు పెడతాను. ఉదాహరణకి వాక్‌కి తెలుగు నడక, వ్యాహ్యాళి - ఇలా ఏవో వుండొచ్చు కానీ ఈనాడు వాడుకలో వున్న వాక్ అన్న మాటకి అవి సరి కావు. అలాగే బేబీసిటింగ్ కూడా ఆమధ్య హైదరాబాదులో ఏవో తెలుగుపదాలు విన్నాను కానీ నాకు అవి సరిగ్గా మనసున నాటలేదు కనక బేబీసిటింగు అనే అంటాను. అలాగే బ్రౌజరూ, ఫాంటులు మొదలయినవి.
ఆమధ్య ఒక తెలుగుఅబ్బాయి “ఎవ్వరీ మనోహారిణి” పాట (ఘంటసాలవారు పాడింది) పంపించాడు అర్థాలు చెప్పమని. అతనికి కొంచెం తెలుగు అర్థం అవుతుందిట. కానీ ఈపాట చాలా బాగుండడంచేత క్షుణ్ణంగా తెలుసుకోవాలని వుందని రాసేడు. నాకు వెంటనే కలిగిన సందేహం ఈ అబ్బాయికి ఎంత తెలుగు వచ్చు? నా అనువాదం ఎంత తేలికభాషలో వుండాలి? అని. అప్పట్లో నాకు వేరే పనులు ఎక్కువగా వుండడంచేత, “నీకెంత తెలుగు తెలుసు, ఆపాటలో ఏమాటలు నీకు అర్థం అయేయీ” అంటూ శోధనకి దిగకుండా, ఇంగ్లీషులోనే అర్థాలు రాసి పంపించేసేను. అతను దానికే ఎంతో పొంగిపోయి, తెలుగుభాష ఇందుకే మధురంగా వుంటుందంటారని చెప్పి, “అర్థాలు తెలుగులోనే రాసి పంపగలరా?” అని మళ్లీ అడిగేడు. చెప్పొచ్చేదేమిటంటే, తెలుగుభాష మనసుని రంజింపజేయగల భాష. కథలు చెప్పినప్పుడు, కథలో ఏం చెప్పేం అన్న అంశంతో పాటు ఏశబ్దతరంగాలతో పాఠకుడిని అలరిస్తున్నాం అన్న అంశం కూడా ఆలోచించుకోవాలి. “సండే రండి, మండే పొండి” అంటే ఇంగ్లీషు అలవాటయినవారికి అది సహజంగానే కనిపిస్తుంది. కానీ తెలుగంటే పడిచచ్చే నాలాటివారికి “ఆదివారం రండి. కాస్సేపు కబుర్లాడుకుని సోంవారం వెళ్లొచ్చు” అన్నవాక్యంలో వున్న ఆత్మీయత గోచరించదు.
నేను రావిశాస్త్రి భాషని పదేపదే మెచ్చుకుంటాను కానీ నాకు ఆరుద్రకవితలు కూడా అంత ఘనంగానూ తోస్తాయి. చాలా మామూలుమాటలతో మనసుని పట్టి కుదిపేసే వాక్యాలు సృష్టించగలరాయన. ఇప్పుడు నేను ఉదాహరణలు వల్లించలేను కానీ ఎప్పుడో 1950లలో రాసిన రేడియో నాటిక, సీతాకోకచిలకలు, విన్ననాటి అనుభూతి నామనసులో ఇప్పటికీ అలానే వుంది పచ్చగా.
పోగా తెలుగు నిలబెట్టుకోడంగురించి ఒకమాట. భాష సజీవం. వాడుకలో వున్నమాటలు వుంటాయి. లేనివి పోతాయి అని అంటున్నారు కొంతమంది. మరి మనం వాడుతుంటేనే కదా వాడుకలో వుండేది. ప్రత్యేకించి “వాటిని వాడి నిలబెట్టడానికి” అంటూ వేరే జనాలు వుండరు కద. “మనమే ఆ వాడేవాళ్లం, మనమే తెలుగు మాటలాడదాం” అన్న స్పృహ మనకే వుండాలి మరి.
నాలుగేళ్లక్రితం నేను మల్లాది రామకృష్టశాస్త్రిగారి కథ “సోహం” అనువాదం చేస్తుంటే “మంచిమాట చేసుకువచ్చాను” అన్న వాక్యం కనిపించింది. నాకు ఆమాట తెలుసు కానీ కథలో చూసేవరకూ స్పృహలో లేదు. “మంచిమాట చేసుకురావడం” అంటే పూటకూళ్లమ్మ ఇంట భోజనం ఏర్పాట్లు చేసుకురావడం. అందాకా ఎందుకు? మొన్నీమధ్య “చాతకపక్షులు” రాస్తున్నప్పుడు ఎరేంజిమెంట్లు అంటే ఏర్పాట్లు అని జ్ఞాపకం తెచ్చుకోడానికి నాకు మూడువారాలు పట్టింది. వాడుకలో లేకపోవడం అంటే అదే.
మాకిదేమీ అక్కర్లేదు అనుకునేవారివిషయంలో బాధే లేదు. తెలుగుకథ రాస్తున్నాం అని మాత్రం నాకు చెప్పకండి. అవి చదివి అర్థం చేసుకునేస్థాయి నాకు లేదు.
ఇది చాలనుకుంటాను తెలుగుకథలో తెలుగుభాష అవసరం చెప్పడానికి.
చివరిమాటగా మీరు అందరూ అంటే నాకు గౌరవం. అలాగే మీరు కూడా భాషమీదా సాటి పాఠకులమీదా గౌరవం చూపిస్తారన్న నమ్మకం. ఎదటివారిని గౌరవించడం కూడా నాగరికతలో భాగమే కదా. నేనంటే గౌరవం వున్నవారు నాబ్లాగులో దుడుకుమాటలాడితే నాకు బాధగా వుంటుంది.
ఇంక మీదే ఆలస్యం. సుజాతా, నెటిజన్, ఇంకా ఈకతలు చదివినవారందరూ, ఫలశృతిగా కథలు రాసేయండి మరి. బహుమానం ఏం ఇవ్వను? నా తెలుగుసంతకం ఇవ్వనా? J. పోస్టుఖర్చులు నావే!
(20 ఏప్రిల్ 2009)
సుజాతా, నీ సంతకాలు నాదగ్గర వున్నాయి కూడా. బహుమతి ఏం ఇవ్వను? నువ్వే చెప్పు, కథ పంపినప్పుడు. నీకథలు నీ బ్లాగులో ఇంకా పెట్టలేదేం?
వికటకవి, బొల్లోజుబాబా, మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు.
తెలుగులో ఇంగ్లీషుమాటలు వాడడం ఎప్పుడొచ్చిందీ, ఎవరు తీసుకొచ్చేరు అన్న చర్చలు ఇప్పుడు అవసరం కాదనుకుంటాను భాషావేత్తలకి తప్ప.
నేను ఇక్కడ చెప్తున్నది కేవలం నేను తెలుగు మిస్సవుతున్నాననే. ఇక్కడ మిస్సవడం అన్నమాటకి తెలుగులో సమానార్థకం లేదు. బెంగపెట్టుకోడం వేరు. మనం వేరే రకంగా తెలియజేస్తాం ఈ బాధ. “తెలుగుపలుకుకోసం అలమటించిపోతున్నాను, తెలుగు మాటాడేవాళ్లకోసం తపించిపోతున్నాను …” ఇలా. అంటే మనసంస్కృతిలో లేని అలవాట్లూ, భావాలూ చెప్పాల్సివచ్చినప్పుడు వేరేభాషలోనుంచి వచ్చినవి వాడడం జరుగుతుంది. కానీ మనకి వున్నమాటలు కూడా, ‘ఆదివారం’కి సండే అనీ, ‘సరే’కి బదులు ‘ఓకే’ అనీ అనడం అవసరమా అని నా ప్రశ్న. పత్రికలు కూడా ఆదివారం ప్రత్యేకం అనడానికి సండే స్పెషల్ లాటివి వాడడం ఎందుకు?
పోతే చలం, గురజాడవంటి మహానుభావులు ఉపయోగించిన ఇంగ్లీషుమాటలకి పది రెట్లు వుంటున్నాయి ఇప్పుడు తెలుగుకథల్లో. ఏదేనా జాడ్యం గోరంతలుగా వున్నప్పుడు బాధించదు. కొండంతలు అయేక, మేలుకుంటాం. అప్పుడు ఏమయినా చేద్దాం అనిపిస్తుంది. ఫలితం ఎలా వుంటుందన్నది కాలమే నిర్ణయించాలి.
మరోమాట. మామూలుగా నాటపాకి 300-400 వుంటాయి హిట్లు. ఈ ఒక్క టపాకి 720 హిట్లు తగిలేయి. ఒత్తులేవీ టపాకి 1410 హిట్లు తగిలేయి. అంటే అంతమంది ఆ శీర్షికలు వచ్చేరన్నమాట నాబ్లాగులోకి. నాకు ఈటపావల్ల అర్థం అయింది ఏమిటంటే కొందరికైనా నాలాటి తపన వుంది అని. ప్రస్తుతం కొన్ని బ్లాగుల్లో మంచి తెలుగు చూస్తూనే వున్నాం కదా.
లేదండీ. నేను ఉన్నపాళాన ఎవరుగానీ తమ అలవాట్లు మార్చేసుకుంటారు అనుకోడంలేదు. ఎవరి అభిరుచులు వారివి. మీరు ఇంగ్లీషుమాటలే బాగుంటాయి అన్నారని నేను ఇంగ్లీషుమాటలే రాయబోవడంలేదు. అలాగే నేను అన్నంతమాత్రాన మీరంతా తెలుగులోనే రాసేయడం మొదలెట్టాస్తారని నేనూ అనుకోలేను.
అభిప్రాయాలు వెలిబుచ్చినవారందరికీ మరోసారి ధన్యవాదాలు.
మాలతి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — మే 3, 2009 @ 6:07 పూర్వాహ్నం
@వికటకవి గారూ
యండమూరి కంటే చాలా చాలా ముందు చలం ఇంగ్లీషు పదాలను తన వచనంలో బాగానే ఉపయోగించుకొన్నాడు.
ఒక్కోసారి ఆయా పదాలను చూస్తూంటే వాటిని అలా అర్ధంచేసుకొంటేనే బాగుంటుందనిపిస్తుంది. (ఉదా: ఒకే ప్లేన్ లో ఆలోచించటం)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా bollojubaba — మే 2, 2009 @ 10:20 అపరాహ్నం
నాకు తెలిసి ఇదసలు ఈ మధ్యనేమీ పుట్టిన విషయం కాదు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడే యండమూరి తదితర రచయితలు నవలల్లో ఈ ఇంగ్లీషు పదాల్ని తెగ చొప్పించేవాళ్ళు, అవసరం లేకపోయినా. నాకు నవలలు అంటే విరక్తి పుట్టటానికదో కారణం. ఆ సస్పెన్స్ తరహా నవలలు చదివేది తెలుగు వాళ్ళు, మరి ఎందుకో ఆ ఆనందం. నాకు తెలిసి అలా ఇంగ్లీష్ పదాలు ఇరికించి వ్రాయటం, చదవటం అప్పట్లో ఓ మోజనుకుంటా.
చెప్పొచ్చేదేమంటే, గట్టి పునాదులు తెంగ్లీషుకి ఏనాడో పడ్డాయి. ఇలా ఉన్న పళంగా ఇంగ్లీష్ లేని తెలుగంటే, తప్పదు మరి, వెతుక్కోవాల్సిందే
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వికటకవి — మే 2, 2009 @ 9:53 అపరాహ్నం
మాలతి గారు,
మీ తెలుగు సంతకాలు నా దగ్గరున్నాయి. ఇంకో బహుమతి ఏదైనా ఆలోచించండి, ఉండండి, ముందు కథ రాయనీయండి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుజాత — మే 2, 2009 @ 8:57 అపరాహ్నం
మహేష్ కుమార్, మీ అభిప్రాయం అర్థం అయింది. థాంక్స్.
నెటిజన్, మీ అభిప్రాయం కూడా అర్థం అయింది.
నేను ఏదో నాకు తోచిన ఆలోచనలు రాసేస్తూంటాను కానీ వాదోపవాదాలకి దిగలేను. మీరందరూ ఈవిషయాన్ని సీరియస్గా తీసుకుని మీ అభిప్రాయాలు వెలిబుచ్చడం నాకు సంతోషంగా వుంది. అందరికీ కృతజ్ఞతలు.
ఇక్కడితో ఈ చర్చ ముగించుదాం. మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, – మాలతి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — మే 2, 2009 @ 6:00 అపరాహ్నం
@కె.మహేష్ కుమార్ “..ఆ పదాల తెలుగు అర్థం కనీసం బ్రాకెట్లలో (దీనికి తెలుగు పదం నాకు తెలీదు) ఇస్తే, ” అన్న దానికి కొత్తపాళీ గారు మీకు “..బ్రాకెట్ = దీని అసలు ఆంగ్ల పేరు పెరాంథెసెస్ = కుండలీకరణాలు ” అని తెలియజేసారు.
తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించి ఉంటే మీరు కుండలీకరణాలుఅనే పదాన్ని వాడేవారు. దానికి అర్ధం తెలుసుకుని అవసరమైన చోట వాడేవారు. రెపు భవిష్యత్తులో మీరు వాడతారనే ప్రగాఢ విశ్వాసం కూడ ఉంది. మీరు తెలుగు వారు కదా!
అది మరొకరు చూసి, “గురువుగారు మీరు ఫలానా చోట “ కుండలీకరణాలు” అనే పదం వాడారు. నాకు అర్ధం తెలియలేదు. అది ఫ్రెంచి పదమా , లేక స్వహిలి నుంచి దిగుమతి చేసుకున్నదా?” అని అడిగినప్పుడు, మీరు, “శిష్యా, అది ఫ్రెంచి పదం కాదు, స్వహిలి లో నుంచి దిగుమతి చేసుకున్నది అంతకంటే కాదు. అది అచ్చ తెలుగు పదం అని చెప్పగలుగు తారు.
కొత్త పాళీ గారి ధర్మమా అని “ కుండలీకరణాలు ” అనే తెలుగు పదానికి బ్రాకెట్టు లేదా పెరాంథెసెస్ అనే అంగ్ల పదం అన్నది ఒక కె. మహేశ్ కుమార్ గారికి తెలిసింది. అలాగే ఈ టపా లోని వ్యాఖ్యలు చదివినవారందరికి తెలుస్తుంది. వారందరు కూడా తెలుగు చదవడం తెలిసిఉన్న – జర్మన్లు, న్యూజీలాండర్లు, తమిళులు, అరబ్బులు, పార్శీలు, రషీయన్లు మొదలైన వారు ఐవుండవచ్చు.
కాని వారందరికి కూడా వారి తెలుగు పద సంపదలో “ కుండలీకరణాలు ” అనే ఒక తెలుగు వారి వాడుకలో ఉన్న పాత పదం, కొత్తగా చేరడం మూలంగా ఆ పదం వాడుకలో వస్తుంది. తెలుగు చచ్చిపోవడం లేదు, చచ్చినంత నిజంగా బతికే ఉంది అని మా బొంట్లు తలెత్తుకుని తిరుగుతారు.
కాబట్టి, “ప్రస్తుతం నగరజీవితంలో ఒకవైపు అంగ్లం మరో వైపు హిందీ కలగలిసి పోయాయి. అలాంటప్పుడు సంభాషణల్లో ఆ “పరాయి”పదాలు దొర్లడం” అసహజంగా అనిపించి “పదహారణాల తెలుగు” పదాన్ని వాడడం మొదలు పెడితే, కాస్త తెలుగువాడకం పెరుగుతుంది.
కొంచెం కటువుగా ఉన్నా, కొంత మంది, బద్ధకం వొదిలించుకుని తెలుగు పదం కోసం వెతుక్కుని దానిని ఉపయోగించడం మొదలు పెడితే, మనమందరం చక్కగా “సుందర తెలుంగు “లో జీవించవచ్చు. ఏమంటారు?
దీనికి మీ జవాబు కాని మరొహటి గాని, మీ బ్లాగ్ లోనే ఉంచండి, ఇక్కడ వద్దులెండి!
అమ్మా, మాలతి గారు, దుడుకు మాటలు ఇక్కడ వాడొద్దు అన్నారు. మన్నించండి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — మే 2, 2009 @ 12:47 అపరాహ్నం
@మాలతి గారూ, నేను సూచన చెబుతూ ఒక necessary condition చెప్పాను “…ఇస్తే, తెలుగుతప్ప మిగతా భాషలతో పరిచయం లేని పాఠకుడికి బాగా అర్థమవుతాయి.” అని. ఇంగ్లీషు, హిందీ కలిపి మాట్లాడే పాఠకుడికి ఇది అసలు సమస్యకాదు. ఈ సమస్య తెలుగు మాత్రమే తెలిసిన పాఠకుడిది. కాబట్టి, బ్రాకెట్లో అనువాదం మంచిదే.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — మే 2, 2009 @ 10:21 పూర్వాహ్నం
[...] మే 1, 2009 · వ్యాఖ్యలు లేవు “Umbrella” లు అడ్డుచెబుతుంటే “Perfection” లు పంటి కింద రాళ్లైతే, తెలుగు సాహిత్యం లో తెలుగు వెతుక్కుంటున్నాను.. [...]
పింగ్ బ్యాక్ ద్వారా వెతుక్కుంటున్నాను « ఊక దంపుడు — మే 1, 2009 @ 3:23 పూర్వాహ్నం
తెలుగు కథలు చదవాలంటే ఎన్ని భాషల్లో ప్రావీణ్యం ఉండాలి?
Being a Polyglot is necessary condition to read Telugu stories?
—
Self promotion
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — ఏప్రియల్ 30, 2009 @ 11:30 పూర్వాహ్నం
రాధికా, పరిమళం, రమణి, కొత్తపాళీ, – ధన్యవాదాలు.
ఊకదంపుడు – అవునండీ, చూస్తూనే వున్నా. నేనిలా రాసినంత మాత్రాన అలా రాసేవాళ్లందర్నీ మార్చేస్తానని కాదులెండి. ఏదో నాకాలక్షేపంకోసం నేను రాస్తున్నానంతే. మంత్రాలకి చింతకాయలు రాలవని వుంది కదా సామెత.
మహేష్ కుమార్ – మీ అభిప్రాయం కూడా గమనించవలసిందే. ఎటొచ్చీ బ్రాకెట్లలో తెలుగు మాటలు ఇవ్వడం మాత్రం ఎందుకండీ, రాసేవారికీ చదివేవారికీ కూడా అదే భాష అలవాటు అనుకున్నప్పుడు.
నెటిజన్ – ఏదీ మీకథ వస్తే కదా సంతకాలదాకా వెళ్లడం
అందరికీ మరోసారి పేరుపేరునా కృతజ్ఞతలు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఏప్రియల్ 30, 2009 @ 12:39 పూర్వాహ్నం
మీ అభిమానానికి ధన్యవాదాలు.
తప్పకుండా, మీ తెలుగు సంతకం అందివ్వండి! అంతకంటే కావల్సింది ఏముంటుంది?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — ఏప్రియల్ 29, 2009 @ 3:04 పూర్వాహ్నం
@ఊకదంపుడు .. శభాష్!
@మహేశ .. బ్రాకెట్ = దీని అసలు ఆంగ్ల పేరు పెరాంథెసెస్ = కుండలీకరణాలు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — ఏప్రియల్ 27, 2009 @ 5:51 అపరాహ్నం
నేను ఈ విషయంలో కూసింత విభేధిస్తాను. కథ జీవితంలోంచీ పుట్టి, జీవితాన్ని ప్రతిఫలించి, జీవితంలో ఒక అనుభూతిని నిలపాలంటే నిత్యజీవితంలో వాడే భాషేవాడాలి. ప్రస్తుతం నగరజీవితంలో ఒకవైపు అంగ్లం మరో వైపు హిందీ కలగలిసి పోయాయి. అలాంటప్పుడు సంభాషణల్లో ఆ “పరాయి”పదాలు దొర్లడం సహజం. కాకపోతే చావా కిరణ్ చెప్పినట్లు ఆ పదాల తెలుగు అర్థం కనీసం బ్రాకెట్లలో (దీనికి తెలుగు పదం నాకు తెలీదు) ఇస్తే, తెలుగుతప్ప మిగతా భాషలతో పరిచయం లేని పాఠకుడికి బాగా అర్థమవుతాయి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — ఏప్రియల్ 27, 2009 @ 8:34 పూర్వాహ్నం
అమ్మా,
మీరు తెలుగు కధలలోకి వెళ్లారూ….
అంతకన్నా ముందు తెలుగు కధలపేర్లను పరిశీలించలేదూ? ఒక తెలుగు కధ శీర్షిక లో “Perfection” అనే పదం చూసి, హతాశుడనయ్యాను….
అసలు మంచి కధలెన్నొస్తున్నాయ్? కాలప్రవాహం లో కొట్టుకుపోకుండా, నిలచి “మంచి” కధ అని పిలవబడేవి గత దశాబ్దము/రెండు దాశాబ్దాలలో ఎన్ని వచ్చాయి చెప్పండి..
వాటికి లభించిన ప్రాచుర్యం ఎంత? వాటిని మెచ్చుకున్న విమర్శకులెందరు…
కధ మంచిదా కాదా, కధ తెలుగు లో ఉందా లేద అనే విషయం .. ఏ పత్రిక చూస్తోంది?
ఓ నాలుగు పుటలు నింపాలి.. ఈ వారానికి.. లేదా .. ఈ నెలకి.. దానికీ ఓ పెద్ద పేరూ, ఓ పెద్ద బొమ్మ…
మధ్య మధ్య లో పెట్టెలుగట్టిన పెద్ద అక్షరాలు… అంతే,,,
అమ్మేది, లాభాలు ఇచ్చేది ప్రకటనలే, కద కాదు.. ప్రకటనలకోసం కధకూడ అమ్ముతున్నారు అనిపిస్తుంది నాకు
మీరు ప్రవాసం లో ఉండటం వల్ల, తెలుగు కధ మీద కధలో తెలుగు మీద ఏవో అపోహలు పెట్టుకున్నట్టున్నారు….
గత సంవత్సరం ఈనాడు దినపత్రిక వారు తమ ఆదివారం సంచిక కోసం కధల పోటి బెట్టి, మేము ఆశించినస్థాయి లో కధలు లేవు అన్నారు.. ఐనా బహుమతులు ఇచ్చారులేండి..
అలాంటి కధలలో తృతీయ బహుమతి ( ఈనాడు మే 11, 2008) పొందిన కధ ” అమ్మ ఒడి” లో , తల్లి ప్రాణంపోయినపుడు ప్రధానపాత్ర తన స్థితిచెప్పుకున్న మాటలు :
“ఏడుపుకూడా రానంత డీప్ షాక్ లో ఉండిపోయాను”
( ఏమీటీ మీరు ఏరేంజిమెంట్ అనే మాటకు తెలుగు వెతుకున్నారూ?, )
ప్రధమ బహుమతి పొందిన “తోట దాటిన పరిమళం” అనే కధలో ( ఈనాడు , ఏప్రిల్ 20, 2008) ఒక చిన్న పాపను పోల్చిచెప్పటానికి రచయిత వ్రాసిన విధం:
తెల్లని బార్బీడాల్ ఆకారంలో ప్రాణంపోసుకొని వచ్చినట్లుగా అనిపిస్తుంది”
తెలుగు కధకే కాదు.. ఇప్పుడు తెలుగు దేశంలోనే తెలుగు అవసరం ఏర్పడింది…
“హోం మంత్రిత్వశాఖ” కు తెలుగు లేదు మాకు, మీకు తెలియదూ?..
అలానే సెంటిమెంటు కు కూడా..
————————————————
(సాద్యమైనంతవరకు అచ్చుతప్పులు రాగూడదనే ప్రయత్నించాను .. కనిపిస్తే చెప్పండి )
————————————————
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ఊకదంపుడు — ఏప్రియల్ 27, 2009 @ 2:51 పూర్వాహ్నం
“భాష కథని పటిష్ఠం చేస్తుంది. మంచివిషయాలు చెప్పడం ఒక ఎత్తయితే, మనసుకి హత్తుకునే పదాలు కూర్చి చెప్పడం మరో ఎత్తు. అలాటికథకే పాఠకుడు స్పందిస్తాడు”
ఈ వాక్యం నన్ను కట్టి పడేసింది మాలతి గారు. ఎన్నిసార్లు చదివానో నాకే గుర్తు లేదు కాని, కథకి కావల్సింది భాష అని చాలా చక్కగా చెప్పారు. అభినందనలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ramani — ఏప్రియల్ 24, 2009 @ 3:59 అపరాహ్నం
మాలతి గారూ ! ఓ పదిహేను రోజులు నేను లేకపోయేసరికి పాఠాలు మిస్ అయిపోయానన్న మాట ! త్వరగా అన్నీ చదివేయాలి మరి ఉంటానండీ !
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా parimalam — ఏప్రియల్ 22, 2009 @ 11:53 పూర్వాహ్నం
సంపాదించిన జ్ఞానాన్ని,అనుభవాన్ని పంచే పనిలో వున్నారా?తీసుకోడానికి మేము సిద్ధం.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఏప్రియల్ 22, 2009 @ 2:34 పూర్వాహ్నం
లలితగారూ, చూశారా, తెలుగు తెలీనివాళ్లు తప్పు పట్టగలరు. కానీ వెదకబోయిన కాలికి తగిలినట్టు అన్న జాతీయం ఎప్పుడు వాడతామో తెలిస్తే, తప్పుగా తోచదు. నామటుకు నాకు అది చాలా బాగుంది. మీరు తీసేయమంటే తీసేస్తాను కానీ లేకపోతే జానుతెనుగు ఎందుకు మార్చడం అనిపిస్తూంది. మీకు నావ్యాసాలు పనికొచ్చినందుకు సంతోషం.
అరిపిరాల గారూ, పంపండి మరి.
అశ్వినిశ్రీ, శేషశాయిగారలకి, ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఏప్రియల్ 21, 2009 @ 6:21 అపరాహ్నం
మాలతిగారూ క్షమించండీ, నా వ్యాఖ్యలో మొదటిలైను ఉపసం హరించుకుంటున్నాను. ఏదో కంగారులో వేసేసాను. కాని తరువాత ఆలోచిస్తే అందులో తప్పు అర్ధం గోచరించే ప్రమాదం ఉందనిపించింది. ఇదుగో లెంపలేసుకున్నాను. (వ్యాఖ్యని డిలీట్ చెయ్యటమెలాగో తెలీక వచ్చిన తిప్పలుగా గ్రహించగలరు.)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా లలిత — ఏప్రియల్ 21, 2009 @ 2:16 అపరాహ్నం
“నాకు రాదు” అని గర్వంగా చెప్పగలిగేది ఓ తెలుగువాడు తన తెలుగు గూర్చే.
ఇటువంటి సంకర భాష మాట్లాడడం ఓ అందం అదో అర్హత అనే కుహనా ప్రచారం నిజమని నమ్మి అలాగే మాట్లాడితే బావుందనుకునే వారున్నంత కాలం ఏమీ మార్పు రాదు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ఒంగోలు శేషశాయి — ఏప్రియల్ 21, 2009 @ 1:37 అపరాహ్నం
మాలతి గారూ
వెదకపోయినతీగ కాళ్ళకి తగలటం అంటే ఇదేనేమో.(మాలతి అంటే పూలతీగ అనేకదండి)
నేను మొదటిసారిగా ఒక కధ రాసి కౌముది కధలపోటీకి పంపించాను. నేనే ఆశ్చర్యపోయేలా వారు నా కధ ని ఎంపిక చేసారు. కానీ అది సాధరణ ప్రచురణకి ఎంపికైంది. ఏదో రాసానుకానీ నాకు పూర్తి సంతృప్తి లేదు. ఏదో లోపం ఉందనిపించేది కాని అదేంటో తెలిసేదికాదు. అందుకే దానికి బహుమతి రాకపోవటం నాకు నిరాస కలిగించలేదు. మీరు ఈ పాఠాలు కాస్త ముందు మొదలుపెట్టివుంటే నేను నా మొదటికధని ఇంకాస్త బాగా రాసివుండేదాన్నేమో. ఎంతైనా గురువులేని విద్య గుడ్డివిధ్య అన్నది నిజమేకదా. ఇప్పుడు నా ప్రార్ధన ఏమిటంటే , మీరు మావంటి ఔత్సాహికులను దృష్టిలో వుంచుకొని ఈ పాఠాలను ఇలాగే కొనసాగించాలి .
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా లలిత — ఏప్రియల్ 21, 2009 @ 12:24 అపరాహ్నం
మాలతిగారు,
మంచి వ్యాసాలు. చాలా నేర్చుకున్నాను. నెనర్లు.
ఫలశృతి కథ సిద్ధమౌతోంది. పంపమంటారా?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా అరిపిరాల — ఏప్రియల్ 21, 2009 @ 12:01 అపరాహ్నం
baagundandii!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా aswinisri — ఏప్రియల్ 21, 2009 @ 11:04 పూర్వాహ్నం
సుజాతా, ఓ మీరు విశాపట్నం సుజాత గారా. సరే. అయినా ఇంత స్కూలు పెట్టేశాను కదా అంచేత మీరు ప్రయత్నించి చూడాలి. ముఖ్యంగా సంగీతానికి అంత టీక రాయగలవారు మీరు మంచి తెలుగు రాయగలరు కనీసం.
వంశీమోహన్, నేను చెప్పింది కూడా అదే అనుకుంటాను. ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఏప్రియల్ 21, 2009 @ 4:03 పూర్వాహ్నం
అందంగా ఉండటానికి జ్ఞానానికీ సంబంధం లేనట్టే, తెలుగు కథలు వ్రాయటానికి, అందులో తెలుగు మాటలు ఉండటానికి సంబంధం లేదేమో అనిపిస్తే వాళ్ళ తప్పు కాదండీ.
పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే, మొట్టమొదటిగా వ్రాసేది “శ్రీరామ”. అక్షరాభ్యాసం అవలేదు అనటానికి “ఇంకా శ్రీరామ కూడా పెట్టలేదు” అనే మాట మా తాతగారు, అమ్మమ్మగారి నోట చాలాసార్లు విన్నా.
ఎక్కడో చదివిన మాటలు – సాహిత్యానికి దాస్యం తొలగించి స్వాతంత్ర్యం ప్రసాదించే శక్తి సాహిత్య విమర్శకు ఒక్కదానికే ఉన్నది. ఆ గురుతర బాధ్యత విమర్శకులు గుర్తించి నిర్వహిస్తేనే సాహిత్యానికి నిజమయిన స్వాతంత్ర్యం” అని.. మరి అవే మాటలు తెలుగు కథకు, తెలుగు మాటలకు అన్వయించుకుంటే, ఆ విధిని నెత్తికెత్తుకునేవాళ్ళు, బాధ్యతగా నిర్వర్తించే సద్గుణోపాసకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో?
పస్తులున్నవాడికే ఆకలి విలువ, భోజనపదార్థ మాధుర్యం తెలుస్తుంది. పైగా ఇది ప్రచార యుగం కావటంవల్ల, కారణాలు ఏవయినా కానివ్వండి, దేనికి ఎక్కువ ప్రచారం ఉంటే అది మంచి రచనగా చలామణి అవుతోంది. ఆ రచనలో అసలు రసం ఉన్నదా, ఒకవేళ ఉంటే ఆ రస పుష్టి తర్వాతి తరాలకు అందించేంతవరకు నిలుస్తుందా అనేది చూసేవారు తక్కువ అయిపోయిన రోజుల్లో ఇంకేమి ఆశించగలం? రసమా అంటే ఏమిటి బాబూ ఒక్కసారి చెప్పు అని ఎవరయినా అంటే, నేను పుట్టపర్తివారి “శివతాండవం” చదవండి నాయనా, అని చెపుతాను.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా మాగంటి వంశీ మోహన్ — ఏప్రియల్ 21, 2009 @ 2:14 పూర్వాహ్నం
వెరీ నైసు ! నాకు కధ రాయడం (నేను వేరే సుజాతను లెండి) చేత కాదు. కానీ కధలంటే ఇష్టం. వాడుక భాష – వాడితే కదా .. అనడం నచ్చింది. కధ రాయడం ఒక కళ. U r blessed. Really !
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా sujata — ఏప్రియల్ 21, 2009 @ 12:49 పూర్వాహ్నం