(ఎన్నెమ్మ కతలు 37)
“నాకళ్లు పెట్టుకు చూడు” అన్నమాట విన్నారా ఎప్పుడన్నా? వినే వుంటారు.
అంటే నాకళ్లు ఎక్కలాగి మీరు తగిలించుకు చూడమని కాదు అర్థం. మరోమాట. “కళ్లు” అని బహువచనం వాడడానికి కారణం ఒక కన్నుతో చూస్తే కనిపించే బొమ్మ వేరు, రెండోకన్నుతో చూస్తే కనిపించే బొమ్మ వేరూ అని. దాన్నే పేరలాక్స్ ఎర్రర్ అంటారు. ఈపదానికి
తెలుగు భౌతికశాస్త్ర పుస్తకాలలో దృష్టిదోషం అని గానీ వక్రదృష్టి అని గానీ వుంటే నన్ను తప్పు పట్టకండి.
ఈమధ్య నేను చూసిన అనువాదాలు చూసింతరవాత అనిపించింది అంతే.
ఇంతకీ, మనదృష్టిలో పేరలాక్స్ ఎరర్‌ను తప్పించుకోవాలంటే, రెండు కళ్లూ పెట్టుకుని చూడాలి!
నాచిన్ననాటి సైన్సు పాఠాల్లో నాకు గుర్తుండిపోయిన బహుకొద్ది విషయాల్లో ఇదొకటి. ఎందుకంటే ఈ పేరలాక్స్ లక్షణాలు దాదాపు ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఏదోరూపంలో నాకు ఎదురవుతూనే వున్నాయి.
అసలు మనందరికీ చిన్నప్పుడే మొదలవుతుందనుకుంటాను ఒంటికన్నుతో చూసే లక్షణం కాపీబుక్కు సూక్తులతో. ఉదాహరణకి చూడండి.
పెద్దలు ఏదైనా అడిగితే పిన్నలు జవాబు చెప్పాలి. చెప్పకపోతే, భేతాళుడికథలోలాగ తల వెయ్యి చెక్కలు కాకపోవచ్చు కానీ తలవాచేలా చీవాట్లు పడడం తథ్యం. “నిన్నే అడిగేది. జవాబు చెప్పవేం? అంత పొగరేమిటి? … “ అంటూ.
తెలీకపోతే, కనీసం తెలీదనేనా చెప్పాలి కానీ ముంగిలా పెదిమలు బిగించి, కళ్లప్పగించి చూస్తూ కూర్చో లేదా నిల్చోరాదు. (ఇది ఈమెయిళ్లలో మాత్రం సాధ్యం. కుక్కపిల్లలకీ, పిల్లిపిల్లలకీ కూడా సాధ్యం. ఈకారణంగానే జవాబులు పొందడం ఇష్టంలేనివాళ్లు కుక్కల్నీ, పిల్లుల్నీ పెంచుకుంటారు).
ఈసూక్తులు నిజజీవితంలో ఎలా ఆవిష్కృతమవుతాయో చూద్దాం సరదాకి.
1. ఒక పెద్దమనిషి ఒకరియింటికి వస్తారు. గుమ్మంలో ఓ పదేళ్ల అబ్బాయి కనిపిస్తాడు.
“ఏం చదువుతున్నావు బాబూ?”
“ఏం చదవడంలేదండీ”
“అదేమిటి? స్కూలికి వెళ్లడంలేదూ?”
“స్కూలికి వెళ్తున్నానండి”
“మరి చదవడం లేదంటావేం?”
“మీరు ఏం చదువుతున్నావు అని అడిగితే చదవడంలేదని చెప్పేనండీ.”
ఇది అడిగినప్రశ్నకి సూటిగా జవాబు చెప్పడం. ఇందులో అధికప్రసంగం లేదు. అనవసర ప్రసంగం అసలే లేదు.
2. మరో పెద్దమనిషి వస్తారు. మళ్లీ ఆ బుద్ధిమంతుడే ఎదురవుతాడు.
“మీ నాన్నగారు ఇంట్లో వున్నారా బాబూ?”
“లేనని చెప్పమన్నారండి.” ఇది కూడా పైజవాబులాగే వున్నదున్నట్టు చెప్పడం.
ఆ తరవాత -
1. ఆ పెద్దమనిషి నాలాటి చాదస్తుపు పంతులయితే,
“అది కాదు బాబూ. నా ప్రశ్న ‘వున్నారా లేరా’ అని. ‘వున్నారు’ అనో ‘లేరు’ అనో జవాబు చెప్పాలి” అని పాఠం చెప్తారు.
“మరి మానాన్నగారు మీరు వస్తే ‘లేనని చెప్పు’ అన్నారండి,” అంటాడు ఆ అబ్బాయి అమాయకంగా.
2. ఆ పెద్దమనిషి నాలాటి తెలివితక్కువ పంతులయితే,
“అబద్ధాలు చెప్పకూడదు బాబూ. మీనాన్న ఇంట్లో వుంటే వున్నారనే చెప్పాలి. లేకపోతే లేరని చెప్పాలి” అంటూ పాఠం చెప్తారు.
“మరి పెద్దలమాట వినాలి అని కూడా చెప్తారు కదండీ” అంటాడు ఆ అబ్బాయి తికమక పడిపోతూ.
3. ఆ పెద్దమనిషి నాలాటి గడుగ్గాయి పంతులయితే,
“సరేలే. నేను కాదు, సుబ్బులుమామ వచ్చేరని చెప్పు” అంటారు.
కొంతకాలానికి ఈ పాఠాలమూలాన, ఓ శుభదినాన ఆ అభ్బాయికి తెలివొస్తుంది. “నాకు తెలీదండీ. నడవలో పేపరు చదువుకుంటున్న మానాన్నగారిని మీరే అడగండి వున్నారో లేరో” అనేసి, సైకిలెక్కి పారిపోతాడు.
ఇలా అనేకమంది వల్ల ప్రభావితుడవుతూ ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడవుతాడు. ఆ తరవాత నేను తొలి చేసిన పూజాఫలావల్ల నాతెలుగుక్లాసులో చేరతాడు.
అప్పటికి నాలుగువారాలు అయిందనుకుందాం. ‘ఇష్టం’ అన్న క్రియాపదం వాడినప్పుడు, కర్తకి ‘కి’ లేక ‘కు’ ధాతువు చేర్చాలి, తదనుగుణంగా కర్త స్వరూపం మారుతుంది అని తెలియజేయడం ఆరోజు పాఠం.
ప్రశ్నః నీకు ఎర్రరంగు చొక్కా ఇష్టమా?
జవాబుః నేను కాఫీ తాగాను.
ఈజవాబు “మొదటివారం పాఠంలోనిది. మనం ఇప్పుడు నాలుగోవారంలో వున్నాం. నిన్న చెప్పినపాఠం ఇది” – ఇవన్నీ నేను ఆ అబ్బాయికి చెప్పను. ఇలా “పాఠాలు” పెట్టేనంటే ఆ అబ్బాయికి కోపం వస్తుంది. నాఉద్యోగానికి ఎసరు. అంచేత భూమాత అంత శాంతచిత్తముతో నా ప్రశ్న అతను వినలేదేమోనన్నట్టు నటిస్తూ, “నీకు ఎర్రరంగు చొక్కా ఇష్టమా?” అని మళ్లీ అడుగుతాను.
ఆ అబ్బాయి మళ్లీ “నేను కాఫీ తాగాను” అంటాడు.
“నేను అడిగింది అది కాదు.”
“నాకు తెలుసు. మీ ప్రశ్నకి జవాబు నాకు తెలీదు. అంచేత ఇలా ‘కర్వు’ విసిరితే (బేస్‌బాల్ భాష), మీరు ఇటువేపు వస్తారని అలా చెప్పేను” అంటాడు ఏమాత్రం జంకు లేకుండా.
ఇది బిజినెస్ 101 క్లాసులో పాఠం. మనం ఓ దుకాణంలో చొక్కా కొనడానకి వెళ్లేం అనుకోండి.
“నేను ఫలానా స్టైలు చొక్కా కోసం వచ్చేను” అని మొదలుపెడతాం..
ఆచొక్కా లేదు అనడు షాపువాడు. “ఇదుగో, ఈ డిజైనరు పేంటు చూడండి. లేటెస్టు స్టైలు.. ఇంకా ఎవరికీ చూపలేదు కూడాను. మీకే ఫస్టు ఇచ్చేస్తాను. ఎవరికీ చెప్పకండి. నన్ను చంపుకుతినేస్తారు …” – ఇలా వేలంపాట మొదలవడం ఎప్పుడంటారు?
నాతెలుగుక్లాసులోనామొహం తెల్లగా వుండి వుంటే ఎర్రగా అయిపోవలసిన ఘట్టం అన్నమాట ఇది. అయినా నేను తమాయించుకుని, “అలా కాదు. నువ్వు అడిగినదానికి జవాబు చెప్తేనే నేను చెప్పినపాఠం నీకు అర్థం అయిందని నాకు అర్థం అవుతుంది” అంటాను.
“అంటే, నాకు తెలిసిందేమిటో తెలుసుకునే వుద్దేశం మీకు లేదని తెలుస్తోంది.” అంటాడు అతను చిరాకు పడుతూ.
“నీకు ఈపాఠం చెప్పినా ఒకటే, గోడకేసి తల కొట్టుకున్నా ఒకటే”అని అనాలనిపిస్తుంది కానీ నేను అలా అంటే నాకు కోపం వచ్చింది అనుకుంటారు. నాకు ఎట్టిసమయాల్లోనూ కోపం రారాదు. ఇది unwritten law.
“నువ్వే రైటు” అంటాను హుందాగా.
అసలీమధ్య నా మెదడు చిన్నదయిపోతోందో, లేక దానికి కాలదోషం పట్టిందో అని అనుమానమేస్తోంది నాకు.. నేను అడిగేదొకటీ, వారు చెప్పేదొకటీ అవుతోందా, లేక నేనే సమకాలీన సామాజిక విలువలనీ, విద్యావిధానాలనీ అర్థం చేసుకోలేకపోతున్నానా? అని.
నేనిలా అర్థంలేని వ్యర్థప్రశ్నలతో సతమతమవుతూంటే ఇప్పుడే నాకు మరో విషయం కూడా తెలిసింది.
క్లాసులో జరిగిన నాటకం విన్న ఆ అబ్బాయి నాన్న “మా అబ్బాయికి గొప్ప పండితుడు కాగల లక్షణాలు కనిపిస్తున్నాయి” అంటూ అడిగినవారికీ అడగనివారికీ చెప్తూ తెగ మురిసిపోతున్నాట్ట!
ఇంత రాసింతరవాత మరొటి తోస్తోంది. Parallax error లో దృశ్యంలో లేనివి కనిపించవు. వున్నదృశ్యంలోనే కొంతభాగమే కనిపిస్తుంది. అంటే నేను పెట్టిన శీర్షిక చాలా అసందర్భంగా వుంది. ఏం చెప్పను నా అవస్థ. నేను incorrigible. నాకు మోక్షం లేదు గాక లేదు. –
(17 మే 2009)
vbsowmya,
)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — మే 27, 2009 @ 3:07 పూర్వాహ్నం
parallax error….నాక్కూడా ఎదురౌతూనే ఉంది…
Nice post.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vbsowmya — మే 26, 2009 @ 5:58 అపరాహ్నం
రాధికా, సాధించేను. ఇప్పుడు, మామూలుగా మీదినించి కిందకే
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — మే 22, 2009 @ 12:06 పూర్వాహ్నం
మీ బ్లాగులో వ్యాఖ్యలకి ఏమయింది మాలతి గారూ? కింద నుండి పైకి చదవాల్సొస్తుంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — మే 21, 2009 @ 11:43 అపరాహ్నం
@ నెటిజన్, –
అది కూడా ఓ వ్యాఖ్యేలెండి.
భాను ప్రకాశ్, అవునండీ. మనకీ పారలాక్స్ ఎర్రర్ అనుక్షణం ఎదురవుతూనే వుంటుంది.
ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — మే 21, 2009 @ 5:59 అపరాహ్నం
ఈ పారలాక్స్ ఎర్రర్ వయసుతో బాటు మారిపొతూ ఉంది. ఇది చదువుతుంటె “కొత్త బంగారులోకం” సిన్మాలో రావ్ రమేశ్ పిల్లలకి 20, 30, 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆలొచించే పద్దతి గురించి చెప్పే సన్నివేశం గుర్తొచ్చింది.
ఇది ఒక పారలాక్స్ ఎర్రర్.
మరీ ఎక్కువ ఆలోచించినట్టున్నాను.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా భాను ప్రకాశ్ — మే 19, 2009 @ 12:47 అపరాహ్నం
నవల వ్రాసుకోవడానికి పనివచ్చే ఒక సాఫ్ట్ వేర్ అని ఎక్కడో ఎవరో ప్రయత్నించమని అన్నారు. చూడండి ఎంత వరకు ప్రయత్నించవచ్చో!
“అంటే నేను పెట్టిన శీర్షిక చాలా అసందర్భంగా వుంది.” అని మీరన్నట్టే టపా మీద వ్యాఖ్యానించకుండా ఎదో సాఫ్ట్ వేర్ గురించి చెప్పడం ఏవిటి? “ఏం చెప్నను నా అవస్థ”. క్షమించాలు – “చెప్పను”!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — మే 17, 2009 @ 11:57 అపరాహ్నం