తెలుగు తూలిక

జూన్ 5, 2009

ఊసుపోక – లేమంటే ప్రేమా!!

ప్రచురించిన వర్గము ఊసుపోక — మాలతి @ 9:24 అపరాహ్నం

(ఎన్నెమ్మ కతలు 39)

లేమ కాదండీ, నే చెప్పేది “లేమి” మాట.

దరిద్రపుబతుకుల్లో గల ఔన్నత్యాన్ని వేనోళ్ల పొగిడేవాళ్లున్నారు. నాకెందుకో అది చాలా అసంబద్ధంగా

కనిపిస్తుంది. ఇలా అసంబద్ధంగా కనిపించినప్పుడు ఓ కత రాసేస్తే నా ప్రాణం తెరిపిన పడుతుంది. అందుచేత ఇది రాసేడానికి కూర్చున్నాను.

నిజానికి నాక్కూడా ఆకళలు వేపకాయంత వున్నాయి. అందుకే నాకథకి “హాలికులైననేమి” అని పేరు పెట్టేను. అలాగే నాకు అంతగానూ నచ్చిన, నామనసులో సుస్థిరంగా నిలిచిపోయిన మరో పద్యం -

ఫలరసాదులఁ గురియవే పాదపములు

కమనీయ భూమిభాగములు లేవె పడియుండుటకు

పొసగ బిచ్చము వెట్టరె పుణ్యమతులు

ధనమదాంధులకొలువేల తాపసులకు.

(ఈపద్యంలో కూడా ముందుపద్యంలోలాగే పొరపాట్లులుండొచ్చు. తెలిసినవారు చెప్తే దిద్దుకుంటాను)

పోతనగారిదృష్టిలో – చెట్లు పళ్లూ, కాయలూ ఇస్తాయి పొట్ట నింపుకోడానికి, సుందరమయినభూమి వుంది పడివుండడానికి. ఉత్తమఇల్లాళ్లు బిచ్చం పెడతారు. బహుశా ఇక్కడ బిచ్చం అంటే బట్టలనుకోవాలేమో. ముందు చెట్లు భోజనం ఏర్పాట్లు చేస్తాయని చెప్పేశారు కనక. దశదానాల్లో వస్త్రదానం ఒకటి కదా. ఇంతకీ అసలు మాట దినము గడుపుకోడానికి డబ్బుతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులసేవ చెయ్యనవసరంలేదు అని.

చిన్నతనంలో అంటే – కంచంలోకి అన్నం ఎలా వస్తుంది, ఏం చేస్తే లోకంలో కీర్తిప్రతిష్ఠలు వస్తాయి అన్న కండూతిలేని రోజుల్లో – దారిద్ర్యం రొమాంటిగ్గా కనిపిస్తుంది.

ముందొక హెచ్చరిక. నేను ఇక్కడ రాయబోతున్న నాదౌర్భాగ్యపుఆలోచనలకి ఉద్దండపండితులు మండిపడకుండా ముందే మనవి చేసుకుంటాను. పోతనగారి పాండిత్యప్రకర్షని నేను ఏమాత్రమూ కించపరచడంలేదు. నిన్న చదివినపుస్తకమే గుర్తుండదు నాకు. అలాటిది అర్థశతాబ్దంక్రితం నేర్చిన ఈపద్యాలు గుర్తుండిపోయేయంటే ఆమహాకవి దిట్టతనమే కదా.

నాకు ఈమధ్య మంచిఆలోచనలు రావడంలేదు. నాలాటివారే మరికొందరు వుండకపోతారా అన్న భరోసాతో ఇక్కడ వాచ్యం చేస్తున్నానంతే. ఈనాటి ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మరియు పెర్సనల్ డెవలప్మెంట్ పేట్రేగిపోతున్నకాలంలో మనఆలోచనలు ఎలా వుంటున్నాయో చెప్పడానికే ఈకత.

పోతనగారి కథ చాలామందికి తెలిసిందే. ఆయన సంతత భగవత్చింతనలో నేలబారు జీవితం గడిపిన మహానుభావుడు. ఆరోజులు అలాటివి కనక చెల్లింది ఆయనకీ, ఆయనవంటి సత్కవులకీను. అప్పట్లో కారు ఇన్సూరెన్సూ, హెల్తిన్సూరెన్సూ, ఇల్లిన్సూరెంసూ .. అంటూ రెక్కలు ముక్కలు చేసుకు ఆర్జించుకున్న నాలుగురాళ్లూ కొల్లగొట్టుకు పోయే భద్రతలబెడద లేనందున కావచ్చు.

మళ్లీ కొన్ని యుగాలతరవాత గాంధీమహాత్ముడికి కూడా చెల్లింది త్రీ-పీస్ సూటులొదిలేసి, కొల్లాయిగుడ్డ చుట్టుకు దొరల్తో మంతనాలకి సిద్ధమవడం. అదే నాబోటివారు అలా వెళ్లి వుంటే, “పో, పో, దొరల్తో గాదు ఆరిబట్లరుతో మాటాడ్డానికయినా తగ్గట్టు నేదు నీవాలకం” అంటూ తన్ని తగిలేసేవారు.

అంచేత, వూసుపోకకి కొన్ని ఆలోచనలు మీముందు పెడతాను. మీక్కూడా ఊసుపోకపోతే, చదువుకోండి.

నా మొదటి ప్రశ్న- అందరూ పోతనగారిలానే ఆలోచిస్తే మహాసామ్రాజ్యాలు ఏర్పడ్డానికి అవకాశం వుండేదా?

రెండు – సకలజనులూ దరిద్రులే అయితే బిచ్చము పెట్టగల పుణ్యమతులు మాత్రం ఎక్కడ్నుంచి వస్తారు?

అసలు ఎవరైనా దేనికోసం తాపత్రయపడతారు?

అఫ్కోర్స్, పోతనగారు తాపసులకు అని గిరి గీసేరు కనక ఇట్టి మహోన్నత జీవనమార్గం సకలజనులకోసం కాదని తెలిసిపోతోంది. నేను పైపద్యం చదివిన రోజుల్లోనే, కాలేజీలో హెన్రీ డేవిడ్ థోరోగారి వాల్డెను కూడా నాచేత చదివించబడడం జరిగింది. ఆగ్రంథరాజంలో ధోరోసార్ ఉత్కృష్టమయిన simple living and high thinkingని వేయివిధాల కొనియాడేరు. నిజానికి మనదేశంలో నూటికి తొంభైమందికి అలాటి simple living కోరీ వేడీ తెచ్చుకున్నది కాదు. చాలామందికి అది జన్మహక్కు. అయినా పొరుగువాడు చెబితే వినసొంపు. High thinking ‌మాట అడక్కండి. ఈమధ్య కొందరు ఉద్దండపండితుల వ్యాఖ్యానాలు చూస్తే, అసలు ఏ థింకింగూ వున్నట్టు లేదు. తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తోంది. గొంగళిపురుగుల్ని చూసినట్టే!

అది సరే, మన ఆలోచనావిధానంలో అందీ పొందనట్టు ఎందుకుంటుందో చెప్తాను.

ఓ అయ్యకో ఓ అమ్మకో గల వజ్రవైఢూర్యాలతో, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలూ, రంగరంగవైభవంగా పాలసముద్రంలో పట్టుపానుపులో పవ్వళింపులూ – ఇవన్నీ గల దైవాన్ని ఆవైభవంమీదికి మనమనసులు పోకుండా చెయ్యమని వేడుకుంటాం. అలా చేసినతరవాత మనకి పుణ్యం వస్తుందని. పుణ్యం వచ్చినతరవాత ఏమవుతుందంటే పుణ్యలోకాలకి వెళ్తాం. పుణ్యలోకాల్లో ఏం వుంటుందంటే రంభా వూర్వశీ నృత్యప్రదర్శనలూ, మృష్టాన్నభోజనాలూ, అష్టైశ్వర్యాలూ … మరయితే నాకు అనుమానం, ఎప్పుడో వస్తాయని వీటికోసం ఇప్పుడెందుకు ఈ శరీరాల్ని ఎండగట్టడం? ఇప్పుడే ఇక్కడే అనుభవించేస్తే పోలా ఆ అష్టైశ్వర్యాలూ … అదేలెండి అనుభవించడానికి వున్నవాళ్లమాటే చెపుతున్నది.

సంగతి ఇలా వుండగా మరి ఇవ్విధమ్మున లేమికి మంగళారతులు పట్టేవారు ఎవరయివుంటారా అన్న సమస్య ఉత్పన్నమవడం సహజం.

మరోలా చెప్పాలంటే ఏదో ఒక అభిప్రాయాన్ని, ఒక జ్ఞానశకలాన్ని, నభోమండలానికెత్తేయడమో, పాతాళానికి తొక్కేయడమో ఎవరు చేస్తారు అన్నది మొదటి ప్రశ్న. ఎందుకు చేస్తారన్నది రెండో ప్రశ్న.

ఎవరు అంటే లేమి లేనివారు. అసలు లేమిలో బతుకుతూ లేమిని మెచ్చుకున్నవారు ఒక పోతనగారూ ఒక గాంధీగారూనేమో. గాంధీగారు లేమిలో పుట్టలేదు కానీ లేమిని వరించి తరించేరు. కానీ నిత్యజీవతంలో కోటానుకోట్ల ప్రజలకి అది నప్పదు. ఏ బ్రిడ్జీకిందో ఏ అట్టపెట్టెలోనో వొణికిపోతూ ముడుచుకుపడుకున్న హోంలెస్ మానవులని అడిగి చూడండి లేమిలో సౌఖ్యాలేమిటో…

ఈమధ్య అమెరికా ఆర్థిక ప్రతిపత్తి మన్ను కరిచేక, మా విస్కాన్సిన్‌లో ఒక కొత్త నుడికట్టు వింటున్నాను homeless children అని. ఇంతవరకూ హోంలెస్ జనాలు ఏకాకులు మాత్రమే. ఇప్పుడు కుటుంబాలకి కుటుంబాలే దిక్కు లేకుండా పోతున్నాయి. ఆ పిల్లలు మామూలుగా వెళ్లే స్కూలికే వెళ్తే, స్థితిగతులు మారగానే సాటిపిల్లలు వాళ్లని హేళన చేస్తున్నారని వార్త.

ఎలక్షనలయేవరకూ వార్తలు హాస్యరసస్ఫోరకంగా వుండి ఆనందాన్నిచ్చేవి నాకు. కానీ ఈమధ్య చాలా చిరాగ్గా వుంటున్నాయి. ఎంతెంత పెద్దవారు ఎన్ని మిలియనులూ, బిలియనులూ కుమార్గాల మూటగట్టుకున్నారో చెప్తుంటే, వాళ్లని రక్షించడానికి ప్రభుత్వం ఎంత కృషి చేస్తోందో వింటుంటే, నాకు మతి పోతోంది. నేను మహా అయితే వెయ్యి డాలర్లు అంటే సుమారుగా వూహించుకోగలను. ఆపైన సంఖ్యలు నాకు చాలా గందరగోళంగా వుంటాయి. ముఫ్పై మిలియనులు కుప్ప పోసి చూస్తే ఎలా వుంటుందో విజ్యువలైజు చేయబోతే నాకు చుక్కలు కనిపిస్తున్నాయే కానీ డబ్బులు కనిపించడంలేదు.

అంచేత లేమికి ఎవరు పట్టం కడతారంటే లేమి అంటే తెలీనివారనే నిర్ణయానికి వచ్చేశాను. తమకి అనుభవంలో లేనిదాన్ని అందంగా వూహించుకునే సౌభాగ్యం కలగడానికి కూడా పెట్టి పుట్టాలి.

ఒకసారి నేను ఆరుద్రగారింటికి వెళ్లినప్పుడు ఆయన మాటాడుతూ శ్రీశ్రీ వరద రాజేశ్వరరావుగారి కవిత్వంగురించి చేసిన వ్యాఖ్యానంగురించి చెప్పేరు. శ్రీశ్రీ అన్నారుట “కొత్తకారులో బీచిరోడ్డుమీద ప్రయాణం చేస్తున్నంత హాయిగా వుంటుంద”ని. ఆరుద్రగారు “నాకు కొత్తకారు లేదు. బీచిరోడ్డుమీద కారులో షికారు ఎలా వుంటుందో తెలీదు” అన్నారు. ఆయన ఏం మాటాడినా నెమ్మదిగా గంభీరంగా చెప్తారు. ఇంతకీ వారి వ్యాఖ్య మనం ఇచ్చే సామ్యాలు మనఅనుభవాల పరిధిలో వుంటాయని. వినేవారికి కూడా ఆఅనుభవం వుంటేనే అది అర్థం అవుతుంది. అప్పటికింకా ఇప్పుడు వున్నన్ని కార్లే కాదు స్కూటర్లు కూడా లేవు. శ్రీశ్రీ వ్యాఖ్య సామాన్యులస్థాయిలో లేదని ఆరుద్రగారి వ్యాఖ్య.

నిజానికి లేమి అంటే డబ్బే కానక్కర్లేదు. ఏకొరత అయినా కొరతే. కిందపడ్డవాడికి చెయ్యందించి, లేపి నిలబెట్టడానికి ప్రయత్నించడం మానవనైజం. స్పోర్ట్స్ కామెంటేటర్లు చూడండి. ఆపకుండా అదేపనిగా ఓడిపోతున్నవాడు గెలవడానికి మార్గాలు సూచిస్తూ వుంటారు. వారినోటిమాట చల్లగా అదే నిజమయి, ఓడిపోతున్నవాడు గెలిచే సూచనలు కనిపించగానే, రెండోవాడు ఏంచెయ్యాలో చెప్పడం మొదలుపెడతారు వాళ్లే మళ్లీ!

అసలు ఎంచేతో కానీ కష్టాల్లోనే ఒక ఆకర్షణ వుంది. “నేనెంత కష్టపడుతున్నానో చూడండి” అంటూ చెప్పి ఒప్పించడం చాలా సుళువు. బోలెడు సానుభూతీ, సలహాలు వరదలా వచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి మిమ్మల్ని. మనకో సామెతుంది లేనివాడు గంజిలోకి ఉప్పు లేదని ఏడిస్తే, ఉన్నవాడు పాలల్లోకి పంచదార లేదని ఏడ్చేడని. అంటే ఇద్దరివిషయంలో సిద్ధాంతరీత్యా నొప్పి సమానస్థాయిలో వుంటుందని.

సమానస్థాయి అంటే జ్ఞాపకం వస్తోంది నాకు తోచిన మరో ఉపమ. పన్నీట స్నానం చేసేవాడికి ఆ పన్నీటిస్నానం ఎంత ఆహ్లాదకరమో పందికి బురదలో పొర్లటం కూడా అంతే ఆహ్లాదకరం. అంటే అనుభవం ఒకటే. ఏది కాంక్షనీయం అంటే “ఎవరికి?” అన్నదాన్నిబట్టి అని చెప్పుకోవాలి.

యాతావాతా నేనిక్కడ నిరూపించింది ఏమిటంటే లేమి అంటే ప్రేమలేదని ఎట్టిసమయంలోనూ అనరాదు. అలాటి వ్యర్థవ్యాఖ్యతో మనం ఎవరినీ మెప్పించలేం. మెప్పించడానికి మంచిమార్గం దాన్నిగురించి రాయడమే. ఎలాగంటే, ఇదుగో, ఇలాగే. …

(5 జూన్ 2009)

అభిప్రాయములు »

  1. రాధికా, నీ వ్యాఖ్య చూడగానే నాకు వెంటనే జవాబు రాసేయాలనిపించింది. శైలి అంత మారిపోయిందా? ఈ విషయం (లేమి) అలాటిది కదా. అంచేతనేమో …

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — జూన్ 12, 2009 @ 1:10 పూర్వాహ్నం

  2. మాలతి గారూ మీ శైలి ని చాలా మార్చేసారండి.ఇంతకు ముందు ఏమి చెపుతున్నారో వెంటనే అర్ధం అయ్యేది.పెదవుల్ని విచ్చుకునేలా చేసే చిన్నపాటి వ్యంగ్యం వుండేది.ఇప్పుడు పెద్ద పెద్ద చెయ్యి తిరిగిన రచయితల కోవలోనికి వెళ్ళిపోయినట్టున్నారు.నాలాంటి సామాన్యులకి అర్ధం కావడానికి చాలా సమయం పడుతుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — జూన్ 12, 2009 @ 1:01 పూర్వాహ్నం

  3. @ ఉష, సూర్యుడు, ధన్యవాదాలు.
    @ అరుణ, హాహా, నేను కూడా ఆరోజుకోసమే ఎదురు చూస్తున్నా.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — జూన్ 11, 2009 @ 7:20 అపరాహ్నం

  4. మరీ ముఖ్యంగా కళాకారులు, రచయితల లేమి అనేది వారు పోయేక ఇతరులు మాట్లాడుకోవడానికి మంచి దినుసు. అవతలివాడు ఎంత గొప్ప రచయిత, కళాకారుడు అయినా దరిద్రంలో ఉన్నాడంటే ఎక్కడ ఓ ఐదొందలు అడిగేస్తాడో అని తప్పుకుని తిరుగుతారు. వాళ్లే పోయాక మాత్రం, ‘ఎంత లేమిలో ఉన్నా ఎవర్నీ చెయ్యిచాపి అడగలేదండీ, మహానుభావుడు.. అప్పుడప్పుడూ నేనే చూడలేక ఎంతోకొంత సాయం చేశాననుకోండి…’ అని చెప్పుకు తిరుగుతారు. రచయితలు, కవులు కళాకారులు నేటి రాజకీయనాయకుల్లాగానో, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లాగనో రచన రచనకూ ఓ కారు మార్చేస్తూ పోష్ గా తిరగాలని నా కోరిక. వెన్నముద్దల జనార్దన మహర్షి పుస్తకం వెనకాల కనిపించే కల కూడా అదే. ఆంధ్ర దేశంలో అదెప్పుడు నిజమవునో!!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా అరుణ పప్పు — జూన్ 7, 2009 @ 4:55 అపరాహ్నం

  5. ఇంకా మీరు లేమా అంటే ప్రేమా అని వ్రాశారేమో అనుకున్నా :)

    ఎప్పుడో మా తెలుగు మాస్టారొక అలంకారానికి ఉదాహరణ చెప్తూ ఓ పద్యం:

    “లేమా దనుజుల గెలువగల లేమా” అని కృష్ణుడు సత్యభామ తో అన్న పద్యం, ఇక్కడ లేమా అంటే స్త్రీ అనొ లేకపోతే అమ్మాయనో అర్ధం చెప్పారు :)

    ~సూర్యుడు :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సూర్యుడు — జూన్ 6, 2009 @ 11:47 పూర్వాహ్నం

  6. లెస్స పలికారు. “మనం ఇచ్చే సామ్యాలు మనఅనుభవాల పరిధిలో వుంటాయని. వినేవారికి కూడా ఆఅనుభవం వుంటేనే అది అర్థం అవుతుంది.” నిజ్జంగా నిజం. లేమి అన్నది సాపేక్షం, దేనికి అన్వయించి మాట్లాడుతున్నామో దానిపై ఆధారపడివుంటుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Usha — జూన్ 6, 2009 @ 12:15 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.