నిడుదవోలు వెంకటరావు గారు: జంగమ విజ్ఞానసర్వస్వము.
(3 జనవరి 1903 – 15 అక్టోబరు 1982.).
విద్యారత్న, కళాప్రపూర్ణ, పరిశోధనపరమేశ్వరులు, జంగమవిజ్ఞానసర్వస్వములాటి అనేక బిరుదులు సార్థకనామధేయాలుగా రాజిల్లిన పండితులు
నిడుదవోలు వెంకటరావు గారు. వంశపారంపర్యంగా విద్వత్ యశోభూషణులుగా చెలగిన వంశంలో సుందరంపంతులు, జోగమ్మగారి ఎనిమిమంది సంతానంలో నాల్గవసంతానం, మొదటి పుత్రుడుగా జనవరి 3వతేదీ, 1903లో విజయనగరంలో జన్మించారు. తొలిపుత్రుడయినందున గారాబంగా పెంచుకున్నారు తల్లిదండ్రులు.
ఇంటిపేరు గురించి ఒకమాట చెప్పాలి. వెంకటరావుగారు తమ ఇంటిపేరు నిడుదవోలు – రెండవస్థానంలో ‘డు’- అనే రాసుకునేవారు. వారి తండ్రి సుందరంపంతులుగారు ‘నిడదవూలు’ అని రాసుకున్నట్టు తిరుపతి ఓరియంటల్ కాలేజీ లైబ్రరీలో వారు దానం చేసిన పుస్తకాలమీద ముద్ర చూస్తే బోధపడుతుంది. ఈవ్యాసంలో వెంకటరావుగారు వాడుకున్న పేరే నేను కూడా వాడుతున్నాను.
మరొక విషయం. నిడుదవోలు వెంకటరావుగారి సాహిత్యంమీద నిష్టల వెంకటరావుగారు పి.హెచ్.డి కోసం పరిశోధన చేసి తమ సిద్ధాంతగ్రంథాన్ని ప్రచురించారు, “నిడుదవోలు వెంకటరావుగారి రచనలు – పరిశీలన” అన్న శీర్షికతో. నా ఈవ్యాసంలో చాలా విషయాలు వారిగ్రంథంలోనుండి తీసుకున్నాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
తండ్రి సుందరంపంతులుగారు అనేక ప్రాచీనగ్రంథాలు, ముఖ్యంగా శైవసాహిత్యం, సేకరించి చెప్పుకోదగ్గ లైబ్రరీ సమకూర్చుకున్నారు. వారికి పండితారాధ్యచరిత్ర, బసవపురాణంవంటి గ్రంథాలు కంఠోపాఠాలుట.
వెంకటరావుగారు చిన్నతనంలోనే ఆపుస్తకాలు చదవడం ప్రారంభించి, ప్రాచీనసాహిత్యంలో సాధికారమయిన జ్ఞానం సముపార్జించుకున్నారు. తండ్రివారసత్వంలో పుస్తకపఠన అలవడితే, తల్లినుండి వాగ్దాటి పుణికి పుచ్చుకోడం జరిగింది. తల్లి జోగమ్మగారు ఏవిషయం అడిగినా, కథలుకథలుగా గుక్కతిప్పుకోకుండా చెప్పేవారని వినికిడి.
వెంకటరావుగారు చిన్నప్పటినుండి కవితలల్లి కమ్మనికంఠంలో పాడుతుండేవారు. అంచేత చాలామంది వారిని పిలిచి, తీసుకువెళ్లి సభల్లో పాడించుకునేవారుట.
ఆయన హైస్కూలు, ఇంటరు చదువు విశాఖపట్నంలోనూ, బి.ఎ. విజయనగరంలోనూ పూర్తి చేసారు. 1925లో బి.ఎ. పట్టం అందుకుని ఆర్థికపరిస్థితులు కారణంగా పైచదువుకి వెళ్లలేక, ఇంపీరియల్ బాంక్ (ఈనాటి స్టేట్ బాంక్) లో గుమాస్తాగా చేరేరు 1926లో. ఒకసందర్భంలో తిరుమల రామచంద్రగారు “వెంకటరావుగారు కారణాంతరాలవల్ల యం.ఏ. చెయ్య్లలేదు” అంటే సమాధానంగా వెంకటరావుగారు, “కారణాంతరాలవల్ల యం.ఏ. చేసేను,” అన్నారుట.
1926నించి 1939 వరకూ బాంకులో పనిచేస్తున్నరోజుల్లోనే పిఠాపురం రాజా సూర్యారావు మహీపతిగారు నన్నెచోడుని కుమారసంభవం చదువుతూ, అందులో శైవాగమ ఆచారాలను వివరించగలవారెవరైనా వున్నారా అని వాకబు చేస్తే, ఎవరో వెంకటరావుగారిపేరు సూచించారుట. పిఠాపురం రాజావారు వెంటనే వెంకటరావుగారికి కబురు చేసేరు. వెంకటరావుగారు వచ్చి రాజావారికి శైవ సంప్రదాయాలని వివరించినతరవాత, ఆయన పాండితీగరిమకి రాజావారు ముగ్ధులయి. తాము సంకలనం చేస్తున్న సూర్యారాయాంధ్రనిఘంటువులో పని చేయమని వెంకటరావుగారిని ఆహ్వానించేరుట. వెంకటరావుగారికి ఆనిఘంటువుసంపాదకత్వం భావి సాహిత్యకృషికి రాచబాట వేసింది.
వెంకటరావుగారు ఆర్థికపరిస్థితులమూలంగా గుమాస్తాగా చేరారు కానీ అది వారికి తృప్తినివ్వగల ఉద్యోగం కాదు. వారి తపన ఈ కిందిపద్యంలో తెలుస్తుంది.
చనియెన్ ద్వాదశ హాయనంబుల పయిన్
షణ్మానకాలంబు బ్యాం
కునకే దేహపుటస్థి చర్మములు రెం
డున్ ధారగాబోసి జీ
వనమున్ బుచ్చుచు సేవ జేసితి మనో
వాక్కాయ కర్మంబులన్
వినియోగించితి నాదు ధీపటిమ
వన్నెందెచ్చు నెద్దానిలోన్
“పన్నెండేళ్ల, ఆరునెలలయింది, చర్మమూ ఎముకలూ బాంకుకి ధారబోసి, బతుకు వెళ్లబుచ్చుకుంటున్నాను. మనసు, వాక్కు, కర్మ కూడా బాంకుకే అర్పించేను, కానీ నిజానికి నా తెలివితేటలు ఏపనిలోనైనా రాణిస్తాయి” అంటారు వెంకటరావుగారు. (పైన మూడో పాదంలో షణ్మాన అన్నది షణ్మాస అనుకుంటున్నాను)
పిఠాపురం రాజావారి సహకారంతో, వెంకటరావుగారు బాంకువుద్యోగంనుండి బయటపడి, తమకి అత్యంత ప్రీతిపాత్రమయిన సాహిత్యరంగంలో ప్రవేశించారు. ఈసందర్భంలో వెంకటరావుగారు,
“ఈనాడు విశ్వవిద్యాలయములలో నున్నవారికి నాకు నొకటే బేధమున్నది.. బ్యాంకు అంకెలమయము. సాహిత్యము అక్షరమయము. నేను అంకెలనుండి అక్షరములలోనికి రాగా, నేటి విశ్వవిద్యాలయమున నున్నవారు అక్షరములనుండి అంకెలలోనికి వచ్చినారు,” అన్నారు చమత్కరిస్తూ.
1944లో మద్రాసుకి మారినతరవాత, వెంకటరావుగారు త్రిపురాంతకోదహరణము, విపులపీఠికతో రాసి, స్వయంగా ప్రచురించుకున్నారు. ఆగ్రంథం సాటి పండితులదృష్టి నాకట్టుకుని, వారికి సాహిత్యప్రస్థానంలో తొలి మైలురాయి అయి విలసిల్లింది. రెండువందలసంవత్సరాలకి పూర్వమే కవులు ఉదాహరణసాహిత్యం సృష్టించి వున్నా. ఆధునికయుగంలో దాన్ని వెలుగులోకి తెచ్చింది వెంకటరావుగారే. ఆతరవాత వేటూరి ప్రభాకరశాస్త్రిగారివంటి మిత్రుల ప్రోత్సాహంతో, శివలెంక శంభుప్రసాదుగారు తమ ఆంధ్రగ్రంథమాలద్వారా ప్రచురిస్తామని వాగ్దానం చెయ్యడంతో “ఉదాహరణవాఙ్మయం” అన్న గ్రంథం రాసి పండితులు మన్ననలు విశేషంగా అఁదుకున్నారు వెంకటరావుగారు.
ఈసందర్భంలో విశ్వనాథ సత్యనారాయణగారు వెంకటరావుగారికి ఇచ్చిన కితాబుతో పాటు ఉదాహరణసాహిత్య లక్షణాలు కూడా తెలుస్తాయి ఈపద్యం చూస్తే.
జగత్తంతయుఁ గ్రియారూపము.
సర్వక్రియయుఁ బరమేశ్వరునందుఁ బర్యవసించును.
ధాతువు సర్వదా విభక్తాశ్రయము.
ఏ విభక్తికో సంబంధము లేక క్రియ లేదు.
అందుచేత నన్ని విభక్తులతోఁ బరమేశ్వరుని
జెప్పినప్పుడు భగవంతుడు సర్వక్రియాస్థాన
భూతుడని వ్యంగ్యము.
ఇది ఉదాహరణ కావ్య రహస్యము.
తాదృశకావ్య చరిత్ర వ్రాసిన మీ పరిశ్రమ
భవగత్సేవ యందు పర్యవసించుచున్నది.
మీరు పరిశోధన పరమేశ్వరులు.
- ప్రేమతో
విశ్వనాథ సత్యనారాయణ.
వెంకటరావుగారు శైవసాహిత్యానికి చేసిన సేవ అపూర్వం., భావి సాహిత్యచరిత్రకారులకి అనుసరణీయం. కారణం
ఆయన త్రికరణశుద్ధిగా శైవసిద్ధాంతాన్ని నమ్మడమే కాక, శైవసాహిత్యం ఆనాటి సాంఘికజీవనానికి అద్దం పట్టిందని గ్రహించడం. హైందవసాహిత్యం పండితులకి మాత్రమే పరిమతమయి, కేవలం వారి ఆచార, వ్యవహారాలని మాత్రమే గ్రంథస్థం చేసింది, కానీ బసవపురాణంవంటి శైవమత గ్రంథాలు వైదికధర్మాలని విడిచి ప్రజలజీవనానికి ప్రతీక అయి నిలిచాయి, అవి సరళభాషలో సామాన్యజనానికి వేదాంతరహస్యాలు విడమరిచి చెప్పేయి అంటూ వెంకటరావుగారు దాదాపు ప్రతి పీఠికలోనూ, పరిష్కరణలలోనూ నిరూపించారు. ఆవిధంగా చూస్తే, వెంకటరావుగారు ప్రజలపండితుడు.
ఈసందర్భంలో ఒక ఉదంతం చెప్పుకోవాలి.
వెంకటరావుగారు సమకాలీనపండితులని, ముఖ్యంగా ఆనాటియువతరం రచయితలని దురుసుగానే విమర్శించేవారుట. దానికి ఉదాహరణగా నిష్టలవారు తమ సిద్ధాంతగ్రంథంలో కొన్ని ఉదాహరణలిచ్చేరు. అందులో నాదృష్టిని ఆకట్టుకున్నది ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యంమీద వెంకటరావుగారి విమర్శ.
నిష్టలవారు “వెంకటరావుగారు సమగ్రాంధ్రసాహిత్యాన్ని విమర్శించారు” అని వ్రాశారు. అప్పటికి ఇంకా కుంఫిణీయుగం, ఆధునికయుగం సంపుటాలు వెలువడలేదు. ఈవిషయంలో నిష్టల వెంకటరావుగారు “సమగ్రాంధ్ర సాహిత్యం సాధారణపరిజ్ఞానం వున్నవారు కూడా చదువుకునే సులభశైలిలో వ్రాయబడింది. … గ్రంథకర్త స్వతహాగా కవిగా పేరు పొంది తరవాత పరిశోధన ప్రారంభించారు. అందువల్ల లోపాలు రావడం సహజం. వెంకటరావుగారు పరిశోధకాగ్రేసరులుగా పేరుపొందినవారు. కవులచరిత్ర పూర్తిగా ప్రామాణికంగా వ్రాయ సమర్థులు. అటువంటివారు సమగ్రాంధ్ర సాహిత్యకర్తను ప్రోత్సహిస్తూ విమర్శ రాస్తే రచయితలమధ్య సదవగాహన ఏర్పడేది” అన్నారు. (పరిశీలన. వచనవాఙ్మయము. 46.)
అయితే ఆతరవాత ఆరుద్ర వెంకటరావుగారింటికి వెళ్లినట్టు, అప్పుడు వెంకటరావుగారు, “నాయనా, మాదేదో చాదస్తం. ఏదో రాస్తూ వుంటాం. మీలాంటివారు సాహిత్యకృషి చేయాలి” అని ఆరుద్రతో అన్నారని కూడా నిష్టలవారే రాసేరు, ( పరిశీలన. పుట 125).
మరి వారిమధ్య సద్భావం ఏర్పడిందో లేదో నాకు తెలీదు కానీ ఈవ్యాసం రాయడంకోసం నేను సమగ్రాంధ్రసాహిత్యం వెతికాను. వెంకటరావుగారిపేరు నామమాత్రంగనైనా కనిపించలేదు.
వెంకటరావుగారు పండితారాధ్యచరిత్రకి విస్తృతమయిన పీఠికతోపాటు పరిష్కరించడంలో అసమానమయిన పాండిత్యాన్ని ప్రదర్శించేరని పండుతులు శ్లాఘించేరు. నిజానికి ఆయన ఏ పుస్తకానికి పీఠిక రాసినా, కేవలం పుస్తకంలో వస్తువుకే పరిమితం చేయక, దానికి సంబంధించిన అనేక విషయాలు చర్చిస్తారు, కదాచితులగా ఆయన పీఠికలమూలంగా పుస్తకం ప్రాచుర్యంలోనికి వచ్చినసందర్భాలు కూడా వున్నాయిట.
సకలనీతిసారము కావ్యానికి సుదీర్ఘమయిన పీఠిక రాస్తూ, కవికాలమూ, రచనారీతులూ చర్చిస్తూ, ఇలా అంటారు.
గమనిక. – ఇక్కడ నేనిచ్చిన పాఠమూ, సవరించి, సరైన పాఠాంతరం ఇచ్చిన భైరవభట్ల కామేశ్వరరావుగారికి కృతజ్ఞతతో యథాతథంగా పెడుతున్నాను. పాఠకులు ఒకొకప్పుడు వ్యాఖ్యలు చూడరేమోనన్న అభిప్రాయంతో.
————————————
(కామేశ్వరరావుగారు ఉదహరించిన పద్యం, అర్థం -
సింగన గ్రంథం “సకలనీతి సమ్మతము”. అందులో మీరిచ్చిన పద్యం:
వెనుకకు బోక హాయనక వేసటనొందక బంతి బంతిలో
బెనపక కానమిం బ్రమసి బెగ్గిల కెంతయు మున్ను చూచుచున్
గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుడై
యనుపమ భక్తితో జదువు నాతని వాచకుడండ్రు సజ్జనుల్
ఇక్కడ ఉన్నది సింగన శ్రద్ధాసక్తుల గురించి కాదనుకుంటాను. ఈ పద్యం శివదేవయ్య రచించిన పురుషార్థసారము అనే గ్రంథం లోనిది. దాన్ని సింగన తన సకలనీతి సమ్మతములో సంకలించాడు.
పూర్వం కవులకి వ్రాయసకారులు (తాటాకులపై వ్రాసేవాళ్ళు) ఉన్నట్టుగానే, కవుల గ్రంథాలని చదివి వినిపించే వ్యక్తులు ప్రత్యేకంగా ఉండేవారు. వాళ్ళని వాచకుడు అంటారనుకుంటాను. వీళ్ళు రాజ సభలలో రసోచితంగా పద్యాలు చదివి వినిపించేవేరు. పురాణాలు చెప్పేటప్పుడు వాచకుడు చదువుతూ ఉంటే పౌరాణికుడు దానికి వివరణ ఇచ్చే ఆచారం కూడా ఉండేదని విన్నాను. ఇక్కడ యీ పద్యం మంచి వాచకునికి (ఇప్పటి భాషలో “చదువరి” అనవచ్చేమో) ఉండవలసిన లక్షణాలు వివరిస్తోంది.
పెనపక – కలపక (కలగాపులగం చెయ్యక), బెగ్గిలక – బెదరక, కనుకని – జాగురూకతతో, కందువ – జాడ
చదువుతూ చదువుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా, అలిసిపోకుండా, ఒక వాక్యాన్ని/పాదాన్ని మరో వాక్యంతో/పాదంతో కలగాపులగం చెసెయ్యకుండా, సరిగా కనిపించకపోవడం వలన భ్రాంతి చెంది బెదిరిపోకుండా, ముందు వచ్చేదాన్ని సరిగ్గా చూస్తూ, జాగ్రత్తగా అక్షరాక్షరాన్ని జాడ తప్పిపోకుండా ఏకాగ్రతతతో, అనుపమ భక్తితో చదివే వాడినే సిసలైన వాచకుడని సజ్జనులు అంటారు.
వెనుకకుఁ బోక హాయనక వేసటనొందక బంతి బంతిలో
వెనఁవక కానమిం బ్రమసి దెగ్గిల కెంతయు మున్ను చూచుచున్
గమకవి అక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుఁడై
యనుపమభక్తితోఁ జదువునాతని వాదకుఁడండ్రు సజ్జనుల్. (సకలనీతిసారము. 306)
ఇది నాకు తోచిన అర్థం. ఇప్పుడైన మంచి చదువరికి కావలసిన లక్షణాలు ఇవే కదా!
—————————–
అంతేకాదు. ఈపద్యాలలో పద్దు వేయడంలాటి విధులు కూడా తెలుస్తాయంటారు. (195-200). సకలనీతిసారములో అనేక శాఖలనుండి – రాజనీతి, నీతిభూషణము, పంచతంత్రమే కాక శాస్త్రగ్రంథాలు – వైద్యశాస్త్రము, గణితము, వేదాంతం, ఆరోగ్యశాస్త్రములనుండి కూడా పద్యాలు ఉదహరించేడని చెబుతూ, “ఇంతవరకూ సింగనకి వాఙ్మయములో గల విశిష్టస్థానాన్ని గుర్తించకపోవుటచేత ఇంత దీర్ఘముగా వ్రాయవలసివచ్చినది” అన్నారు వెంకటరావుగారు. (పుట. 74)
సకలనీతిసారము చదివితే, అప్పటికే మనకి తెలుగులో ఎంత సాహిత్యం వుందో అర్థమవుతుందంటారు.
వెంకటరావుగారు 1944 నుండీ 64వరకూ మద్రాసువిశ్వవిద్యాలయంలో జూనియర్ లెక్చరర్‌గా మొదలుపెట్టి, తెలుగుశాఖ అధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. ఈవిషయంలో “నన్ను విరమింపజేసినారు” అని ఆయన రాసుకున్నారు అంటే యూనివర్సిటీవారు ఒత్తిడి చేసేరనే అనుకోవాలి. ఆతరవాత ఆయన హైదరాబాదు వచ్చి పదవీవిరమణ చేసిన ప్రొఫెసర్లకోసం యుజిసీ వారు ఏర్పాటు చేసిన గ్రాంటుకి అర్జీ పెట్టుకుంటే తెలుగుశాఖ రికమెండేషను ఇవ్వలేదు కానీ అప్పట్లో లింగ్విస్టిక్స్ ప్రొఫెసరు భద్రిరాజు కృష్టమూర్తిగారు రికమెండు చేసేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాహిత్య ఎకాడమీ, నెలకి చెరొక వందరూపాయలు గౌరవవేతనం ఇచ్చేవారుట. 1982లో గవర్నమెంటు 500 రూపాయలకి పెంచేరు. అదే సంవత్సరం అక్టోబరు 15వ తేదీ, శివరాత్రిరోజున అర్థరాత్రి కళాప్రపూర్ణ, విద్యారత్న నిడుదవోలు వెంకటరావుగారు శివసాయుజ్యం పొందినారు.
వెంకటరావుగారిమీద నేను వ్యాసం రాద్దామని నెలరోజులుగా కుస్తీ పడుతున్నాను వారు సృష్టించిన సాహిత్యంతో. మొదలుపెట్టినతరవాత గానీ నాకు అర్థంకాలేదు అది అంత కష్టమో. అంచేత ఇక్కడికి ఇది ముగిస్తాను
వెంకటరావుగారి చతుర భాషణలు కొన్ని తలుచుకుంటూ – అవి ఇదుగో.
తెలుగువారికి ఐకమత్యం యతిలోనే కానీ మతిలో లేదు
–
జంట వుంటేనే పంట
పంట వుంటేనే వంట
–
పరోపకారం ఇదమ్ శరీరమ్ – ఇది స్త్రీలపట్ల వర్తించదు.
–
పూర్వం మనవాళ్లు కళల్లో ఏకసంతగ్రాహులు.
ఇప్పుడు అనుకరణల్లో ఏకదృశ్యగ్రాహులు
–
ఆంధ్రులకైకమత్యం యతిలోనే కానీ మతిలో లేదు.
–
బలి, దానం చేత అడుగున పడిపోయాడు. బలిదానంచేత పొట్టి శ్రీరాములు పొడుగైనాడు.
–
వెంకటరావుగారు ఎంత ప్రాచీన సాహిత్య ప్రియులయినా, అప్పుడప్పుడు ఆధునికకవితలల్లేవారంటారు నిష్టలవారు.
మచ్చుకి రెండు కవితలు, చమత్కారభాషణలు చూడండి (నిష్టల. 76-77)
షేకుమియ్యాకు గోకులాష్టమికీ ఎంత సంబంధమో
సినీరైటరుకీ చిన్నయసూరికీ అంతే సంబంధం.
–
దినచర్యను వ్రాసినావు
పుట్టుకతేదీ మరచినావు
(గురజాడ) అప్పారావు చెప్పరావా
–
రొమాంటిజమ్,
క్లాసిసజమ్,
రియలిజం, సర్రియలిజమ్,
ఇంప్రెషనిజమ్, ఎక్స్‌ప్రెషనిజమ్
ఫ్రాయిడిజమ్, డాడాయిజమ్
మార్క్సిజమ్, సోషలిజమ్
కమ్యూనిజమ్, కమ్యూనలిజమ్
ఇజములు వీటన్నిటిలో
నిజమేదో తెలుపండి.
చివరిమాటగా – ఇంతకంటె విపులంగా ఇంగ్లీషు తూలికలో పెడతాను.
నిష్టల వెంకటరావుగారి పుస్తకంలో నిడుదవోలు వెంకటరావుగారి రచనలపట్టిక 35 పేజీలు వుంది. ఇంత విస్తృతమయిన సాహిత్యకృషి చేసిన వెంకటరావుగారికి జ్ఞానపీఠ్ పురస్కారం ఎందుకు రాలేదో నాకు తెలీదు కానీ ఏ జ్ఞానపీఠ్ గ్రహీతకీ వెంకటరావుగారు తీసిపోరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
(28 అక్టోబరు 2009)
@ వైదేహీ, ధన్యవాదాలు. అలాగే, ఇంగ్లీషు వ్యాసం కూడా పూర్తి చేసినప్పుడు చెప్తాను.
@ కామేశ్వరరావుగారూ, మీకు ఎంతైనా కృతజ్ఞురాలిని సరైన పాఠం, అర్థం చక్కగా విడమర్చి తెలియజేసినందుకు. సకలనీతి సమ్మతము – ఇక్కడ మాలైబ్రరీలో సకలనీతి సారము అనే వుందండి. అందులో వెంకటరావుగారు పైపద్యం ఉదహరించినప్పుడు శివదేవయ్య పేరు చెప్పినట్టు లేదు మరి. అయినా మరోసారి చూస్తాను. మీరు చెప్పిన వ్యాఖ్య మాత్రం సమంజసంగానే వుంది.
ఉదాహరణ వాజ్మయ చరిత్ర కూడా చూశానండీ డిజిటల్ లైబ్రరీలో. ఎటొచ్చీ నాకు డౌన్ లోడ్ కాలేదు. నిష్టలవారి పుస్తకం అయింది. ఏమిటో తేడా తెలీదు. ఇక్కడ మాలైబ్రరీలో కూడా వుందిలెండి. మరొకసారి ధన్యవాదాలతో.
మాలతి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — అక్టోబర్ 30, 2009 @ 4:04 పూర్వాహ్నం
మాలతి గారూ,
నిడుదవోలు వెంకట రావు గారి గురించి ఇంతకుముందు విన్నాను .కానీ సాహిత్యం లో ఆయన చేసిన విశేష కృషి గురించి మీతో మాట్లాడినప్పుడే తెలిసింది.ఇలాంటి మంచి వ్యాసాల వల్ల అప్పటి సాహితీకారుల గురించి ఇప్పటి రచయితలకు తెలిసే అవకాశం ఉంది.మీ ఇంగ్లీషు వ్యాసం కోసం ఎదురుచూస్తాను.
వైదేహి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Vaidehi Sasidhar — అక్టోబర్ 30, 2009 @ 2:41 పూర్వాహ్నం
మాలతిగారు, ఒక గొప్ప వ్యక్తి గురించి చక్కని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నిడుదవోలువారి ఉదాహరణ వాఙ్మయచరిత్ర Digital Libraryలో ఉంది.
సింగన గ్రంథం “సకలనీతి సమ్మతము”. అందులో మీరిచ్చిన పద్యం:
వెనుకకు బోక హాయనక వేసటనొందక బంతి బంతిలో
బెనపక కానమిం బ్రమసి బెగ్గిల కెంతయు మున్ను చూచుచున్
గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుడై
యనుపమ భక్తితో జదువు నాతని వాచకుడండ్రు సజ్జనుల్
ఇక్కడ ఉన్నది సింగన శ్రద్ధాసక్తుల గురించి కాదనుకుంటాను. ఈ పద్యం శివదేవయ్య రచించిన పురుషార్థసారము అనే గ్రంథం లోనిది. దాన్ని సింగన తన సకలనీతి సమ్మతములో సంకలించాడు.
పూర్వం కవులకి వ్రాయసకారులు (తాటాకులపై వ్రాసేవాళ్ళు) ఉన్నట్టుగానే, కవుల గ్రంథాలని చదివి వినిపించే వ్యక్తులు ప్రత్యేకంగా ఉండేవారు. వాళ్ళని వాచకుడు అంటారనుకుంటాను. వీళ్ళు రాజ సభలలో రసోచితంగా పద్యాలు చదివి వినిపించేవేరు. పురాణాలు చెప్పేటప్పుడు వాచకుడు చదువుతూ ఉంటే పౌరాణికుడు దానికి వివరణ ఇచ్చే ఆచారం కూడా ఉండేదని విన్నాను. ఇక్కడ యీ పద్యం మంచి వాచకునికి (ఇప్పటి భాషలో “చదువరి” అనవచ్చేమో) ఉండవలసిన లక్షణాలు వివరిస్తోంది.
పెనపక – కలపక (కలగాపులగం చెయ్యక), బెగ్గిలక – బెదరక, కనుకని – జాగురూకతతో, కందువ – జాడ
చదువుతూ చదువుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా, అలిసిపోకుండా, ఒక వాక్యాన్ని/పాదాన్ని మరో వాక్యంతో/పాదంతో కలగాపులగం చెసెయ్యకుండా, సరిగా కనిపించకపోవడం వలన భ్రాంతి చెంది బెదిరిపోకుండా, ముందు వచ్చేదాన్ని సరిగ్గా చూస్తూ, జాగ్రత్తగా అక్షరాక్షరాన్ని జాడ తప్పిపోకుండా ఏకాగ్రతతతో, అనుపమ భక్తితో చదివే వాడినే సిసలైన వాచకుడని సజ్జనులు అంటారు.
ఇది నాకు తోచిన అర్థం. ఇప్పుడైన మంచి చదువరికి కావలసిన లక్షణాలు ఇవే కదా!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కామేశ్వర రావు — అక్టోబర్ 30, 2009 @ 2:19 పూర్వాహ్నం
మాలతి గారు జాలం నుండి పుస్తకం డౌన్లోడ్ చేసుకున్నానండీ. చదువుతాను. ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వెంకటరమణ — అక్టోబర్ 29, 2009 @ 7:50 అపరాహ్నం
@ బొల్లోజుబాబా, ధన్యవాదాలు.
@ రవి, మంచి శ్లోకం ఎత్తి చూపేరండీ. ధన్యవాదాలు
@ కల్పన, నీ అభిమానం అలాటిది. వెంకటరావుగారివంటిని తలుచుకున్నప్పుడు నేనంత అన్న భావన మరింత బలపడుతోంది.
ధన్యవాదాలు.
@ వెంకటరమణ, ధన్యవాదాలు. నెట్ లో నిష్టల వెంకటరావుగారి పుస్తకం చూడండి. ఆయన నిడుదవోలు వెంకటరావుగారి కుమారుని అల్లుడు. అంచేత, చాలా విషయాలు కూలంకషంగా చర్చించి వివరించేరు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — అక్టోబర్ 29, 2009 @ 7:28 అపరాహ్నం
ఆయన గురించి విని ఉండలేదు. వారి గొప్పతనాన్ని గురించి ఇప్పటి మాలాంటి వారికి పరిచయం చేశారు. ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వెంకటరమణ — అక్టోబర్ 29, 2009 @ 7:00 అపరాహ్నం
ఒక గొప్ప తెలుగు సాహితీకారుని గురించి చెప్పారు. ధన్యవాదములు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా బొల్లోజు బాబా — అక్టోబర్ 29, 2009 @ 12:43 అపరాహ్నం
ఓ అద్భుతమైన పండితుడి గురించిన ఆహ్లాదకరమైన పరిచయం అందించారు. భర్తృహరి చెప్పిన
కుసుమస్తబకస్యైవ ద్వయీవృత్తిర్మనస్వినః |
మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా ||
అన్న శ్లోకం వెంకటరావు వంటి మహాత్ములకు నప్పుతుంది.
అనేకానేక ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రవి — అక్టోబర్ 29, 2009 @ 10:40 పూర్వాహ్నం
Malathi gaaru,
ee madhya kaalamlO nenu chadivina manchi pariseelaatmakamaina vyaasam idE. nidudavOlu venkatraavu gaariki jnaanapeeT sangatEmo kaani meeku maatram mundu edO oka visvavidyalayam vaaru doctaret ivvali.
Kalpana
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా kalpana — అక్టోబర్ 28, 2009 @ 11:36 అపరాహ్నం