తెలుగు తూలిక

నవంబరు 6, 2009

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలు

ప్రచురించిన వర్గము వ్యాసాలు — మాలతి @ 8:29 అపరాహ్నం

సరస సల్లాపోక్తులు, చురుకుభాషణలు – మల్లాదివారి కథనకుతూహలం.  చలం చిత్రించిన విశృంఖలతకీ కొడవటిగంటి కథల్లోని ఆర్థిక, సామాజికావగాహనకీ నడుమ మేరువులా నిల్చి,

 కథలని కవితలలా మలిచిన రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి గారు.

స్త్రీ పురుషులమధ్య ఆకర్షణ ప్రకృతిసిద్ధం. అయితే ప్రతి జీవికీ సహజమయిన ఈఆకర్షణ మూలాన లేదా దానిపేరుమీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో చలం, కొడవటిగంటి ఎత్తి చూపితే, రామకృష్ణశాస్త్రి గతానుగతికంగా వస్తున్న మరొక కోణాన్ని మరొకసారి ఆవిష్కరించారు.  

 రామకృష్ణశాస్త్రి గారి కథల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది కథకుడు. అందులో మొదటిది- పాఠకుడిని మధ్యమపురుషలో సంబోధిస్తూ కథ చెప్పడం. రెండోది ఆకథకుడిలో రెండు రకాల వ్యక్తిత్వాలు. ఒక కథకుడు పురాణాలూ, ఇతిహాసాలూ ఆకళించుకున్నపండితుడు, రెండోవారు సమకాలీన సమాజాన్ని నిశితదృష్టితో పరిశీలించి వ్యాఖ్యానిస్తున్న నిత్యయౌవనుడు. కొన్నికథలు చదువుతుంటే, షడ్రసోపేతాన్నాలు ఆరగించి, తాంబూలం సేవిస్తూ కథనం సాగించే పౌరాణికడు స్ఫురిస్తాడు పాఠకుడికి. అటువంటి యితివృత్తాలు గల కథలు చెప్పేటప్పుడు ఆకథల్లో తదనుగుణంగానే కొట్టొచ్చినట్టు కనిపించేవి – సరసభాషణలూ, కులకాంతలకి దీటు రాగల వారకాంతలూ, వారిచుట్టూ భ్రమరములవలె సంచరించే ఆబాలగోపాలం! (వనమాల, స్వరమేళ, రంగవల్లి, డు-ము-వు-లు). రెండోరకం కథల్లో ఈనాటి సాధారణ దుస్తులలో ఏ స్టేషనులోనో లేక రోడ్డుమీదో నిలబడో, కూర్చునో ‘ఉండు చెప్తా, నీకు అర్థం కాదేమోనని …’ అంటూ ఆత్మీయునివలే అనునయవాక్యాలతో ప్రత్యక్షమయే ఇరవయ్యో శతాబ్దపు యువకుడు కనిపిస్తాడు (పీఠిక, జోను టికెట్టు).

      కథకి సాంఘికప్రయోజనం వుండాలనీ, అంటే సంఘంలో వున్న కుళ్లును ఎత్తి చూపి, ప్రక్షాళన చేయగల కథలే మంచికథలనీ, అలాటికథలు రాసినవారే కథకులనీ అర్థమవుతుంది ఈనాడు వస్తున్న సమీక్షలూ, విమర్శలూ చూస్తే. అంచేత ల్లాదివారి కథలని ఆదృష్టితో కూడా పరిశీలించాల్సిన అవుసరం వుంది.

          శాస్త్రిగారికి కథావస్తువు చాలామటుకు స్త్రీ పురుషసంబంధాలే. స్త్రీపురుషులు ఒకరికొకరు ఆలంబన. ఎవరికి ఎవరు ఆలంబన, ఎవరు ఎవరిని ఆకట్టుకుని ఆడిస్తున్నారు అన్నది ఒక చిక్కుసమస్య. వారి కథల్లో ఈసమస్య అనేకకోణాల్లో ఆవిష్కరింపబడింది. మగవారిలో స్త్రీలచుట్టూ భ్రమరములవలె తిరిగేవారున్నారు. ఆప్రవృత్తిని ఆమోదించిన ఆడవారున్నారు. బోగంపడుచులకు కన్నెరికం పెట్టడం తమకొక గౌరవంగా భావించే ప్రభువులున్నారు. వారికి నివాళులు పట్టే అర్ధాంగులున్నారు. “ఎవరూ పలకరించకుండా వుంటే సానిపిల్లలు ఏమయిపోవాలి చెప్పూ” అని నిగ్గదీసి అడిగే మహానుభావులున్నారు (గురుప్రసాదం). అటువంటి మగధీరులని నిలవేసి, “నేను మీతో ఎందుకు లేచిపోవాలి? కావలిస్తే మీరే రండి నాదగ్గరకి” అంటూ సవాల్ చేసిన వీరవనితలున్నారు (కనక జానకి). మగవారిని తమకొంగున కట్టుకుని, ఆడించి, లాలించి, బెల్లించి, జాలిపడి కనికరించిన జాణలున్నారు. అదే నీతి అని సాటిఆడవారికి బోధ చేసిన ముద్దరాళ్లున్నారు.

            కొన్నికథల్లో స్త్రీ భోగవస్తువుగా చిత్రింపబడితే, మరికొన్ని కథల్లో విశిష్టమైన, విలక్షణమైన స్త్రీపాత్రలు దృగ్గోచరమవుతాయి పాఠకుడికి. సాధారణంగా ఒక సిద్ధాంతానికో వాదానికో కట్టుబడి రచనలు చేసినప్పుడు, ఆరచయిత రచనావ్యాసంగం ఏకోన్ముఖంగా సాగే ప్రమాదం వుంది. తద్భిన్నంగా రామకృష్ణశాస్త్రిగారి కథల్లో అసామాన్యమయిన వైవిధ్యం చోటు చేసుకుని సమ్యక్ దృష్టిని సాధించింది. అందుకే కొన్నికథల్లో వారకాంతలగురించిన వాక్యాలు కొంత కలవరపరిచినా, ఒక చారిత్ర్యక సత్యాన్ని కూడా ప్రస్ఫుటం చేస్తాయి. వారకాంతలనీ, వారి వ్యాపకాలనీ చిత్రించినప్పుడు కూడ శృంగారకథనాలలో సర్వసాధారణమయిన అంగాంగవర్ణనలు కనిపించకపోవడం (కావ్యాలనుంచో ప్రబంధాలనుంచో ఉదహరణలు ఎత్తిచూపినప్పుడు తప్ప) కథకుడిసంయమనానికి చిహ్నంగా కనిపిస్తుంది.

          మధ్యాక్కర, ఆతిధ్యం కథలు పక్కపక్కన పెట్టి చదివితే, రెండు తరాల మానసిక ప్రవృత్తులలో అంతరం, ఆంతర్యం స్పష్టం అవుతుంది. మధ్యాక్కరలో తాతగారు అమ్మమ్మకీ మనవడికీ కూడా సానిపాపలయందు  తమకున్న ఆదరాభిమానాలు విశదం చేస్తారు. కథాంతంలో బీబీనాంచారమ్మని స్మరించుకోడం గతంలో రసహృదయులు సర్వసాధారణంగా వుదహరిస్తూ వచ్చిన ధర్మసూక్ష్మం. ఆతిధ్యంకథలో మనవడిని కూడా అదే దోవన అనపడానికి ప్రయత్నిస్తారు తాతగారు. భరతుడినుండి బిల్వమంగళుడివరకూ గ్రంథప్రామాణ్యాలు పునరుద్ఘాటించి, అతిథిసేవలో ‘అది’ విధిగా అమర్చాలనీ, టీ, సిగరెట్లలాగ స్త్రీలు సర్వసాధారణం అనీ ప్రవచించి, అత్తరు పూతలతో, కొత్త పెళ్లికూతురిని శోభనంగదిలోకి తోలినట్టు సానివాడకి తోలితే, ఆ యువకుడు చేసిన ఘనకార్యం ఈనాడు మనకి న్యాయమే కాని తాతగారికీ, వారిలాటి సనాతనులకీ అవహేళన! ఆసంగతి ఆయువకుడికీ తెలుసు. తాను తిరిగి ఇంటికి వచ్చేలోపున ఆయన ఎన్నిసార్లు నవ్వుకున్నారో అంటాడు కథకుడు. ఇది కూడా మల్లాదివారి కథల్లో ప్రత్యేకతే. ఏసందర్భంలోనూ ఏపాత్రకీ కోపం రాదు. వచ్చినా హద్దు మీరి ఆగడానికి దిగరు. మల్లాదివారి కథల్లో అందరూ మంచివాళ్లే. కట్టుకథలు చెప్పి తనదగ్గర డబ్బులు వడికిన వ్యక్తి కూడా ఆప్తుడే, కంగు తిన్నవాడు సుప్రసన్నుడే (మీమాంస).

          ముందుతరాల మగవారిదృష్టిలో కళావంతులు సంఘంలో ఆదరించదగ్గ భాగం అయితే, తరవాతితరం యువకుల దృష్టిలో వారు సంఘదూరులు. ముందుతరాలవారు స్త్రీలని భోగవస్తువుగా పరిగణిస్తే ఆతరవాతివారు, అంటే చారిత్రకంగా ఇరవయ్యో శతాబ్దం తొలిదశ నాటికి, అది తప్పుగా భావించడం ప్రారంభించారు. కాలానుగతంగా వచ్చిన ఈమార్పు శాస్త్రిగారి కథల్లో ప్రస్ఫుటమవుతుంది. ద్రౌపదీవస్త్రాపహరణం, ఆతిథ్యంలాటి కథల్లో అమ్మాయిలలో తిరుగుబాటుతనం, అబ్బాయిల్లో ఒకరకమయిన అయోమయం చోటు చేసుకున్నట్టు కనిపిస్తాయి. అబ్బాయిలు తెగించి బోగంయిళ్లకి వెళ్లలేరు, వారిని సాటి మనిషిగా గౌరవించనూ లేరు.

          ద్రౌపదీవస్త్రాపహరణంలో చంద్రంతల్లికి లోకం తమకి వారకాంతలు, దేవదాసీలు అంటూ ఏ పేరెట్టినా, తాము బోగంవాళ్లు అన్నది సువిదితం. అందుకే ఆవిడ తనని తానే వెలి వేసుకుంది. ఇందులో సంఘంలో గూడు కట్టుకున్న కుహనావిలువల గురించిన ఎత్తిపొడుపు వుంది. నోటితో మాటాడుతూ నొసల్తో వెక్కిరించడంలాటిదే ఈపేర్లు పెట్టడం. ఆత్మగౌరవం వున్న ఏవ్యక్తికీ సాంత్వన కలిగించదీ ప్రవృత్తి.

          కాలేజీలో మగవిద్యార్థులు మహోత్సాహంతో ద్రౌపదీవస్త్రాపహరణం నాటకం వేద్దాం అనుకున్న తరవాత పిల్లిమెళ్లో గంట కట్టేవాళ్లెవరు? ప్రిన్సిపాల్ చేత చంద్రాన్ని ద్రౌపదిగా వేయమని అడిగించడంలో కనిపిస్తాయి ఆకుర్రాళ్ల ఓటుగుండెలు. వారి ఆంతర్యాన్ని గ్రహించి, వారికి బుద్ధి చెప్పాలని చంద్రం నిర్ణయించుకున్నప్పుడు పాఠకుడికి కలిగిన సంతృప్తి  ఆతరవాత ఆట్టేసేపు నిలవదు. తనని సాటివిద్యార్థులు బోగందానిగానే చూశారు, తను వారిచెల్లెలితో ఏనాటికీ సమం కాదు అని ఆమె గ్రబహించింది కాని ఒక స్త్రీ తనపరువు నిలపుకోడానికి మార్గం మరొక స్త్రీ పరువు ఎరవేయడమా అన్నప్రశ్న ఉదయించకతప్పదు పాఠకుడిలో ఈముగింపుతో! బహుశా, ఇది కేవలం కుర్రకారు ఆకతాయితనం అనుకుని సరిపెట్టుకోవాలేమో.

          మంత్రపుష్పంకథలో “సీతాయ్, అదో పెద్దబాలశిక్ష” అంటాడు కథకుడు. “కడుపెరిగి ఉంగబట్టకపోతే జాతి జాతంతా ఆకటితో అలమటించిపోతుంది” అంటుంది సీతాయ్. ఆమె యుద్ధశిబిరానికి తనకు తానుగా వెళ్లి, సైనికులని సుఖపెట్టి జాతిని ఉద్ధరించిన పుణ్యాత్మురాలు. సీతాయ్ (చిట్టి)లాగే విలక్షణమైన స్త్రీపాత్ర చైత్రరథంలో నాగరత్నం.

          చైత్రరథంలో ప్రధానపాత్ర నాగరత్నమే అయినా, ప్రధానాంశం ఆనాటి రాజకీయాలు, రాజకీయనాయకుల నీచప్రవృత్తులు. చిత్తశుద్ధితో అయినవారినందరినీ కాదని తనని తాను దేశసేవకి అంకితం చేసుకున్న వేశ్య నాగరత్నం చివరికి వేసారి “ఎందుకిలా ముత్యాలు వెదజల్లడం” అనుకుని వెనకటి వైభవంలోనికి ఒత్తిగిలింది. కథంతా వ్యంగ్యాత్మకంగా నడుస్తుంది. శాస్త్రిగారు ఈపుస్తకానికి రాసిన ముందుమాటలో(నేనూ నాకతలు) మీ కథలో నీతి ఏమిటి అంటే దానికున్నది జాతి అన్నారు. పైకథల్లో జాతిపై పదునైన విసుర్లు కనిపిస్తాయి.    

          సినీవాలీలో మంజరి, సర్వమంగళలో అక్క తమకి తాము పెద్దలయి కథకి సారథ్యం వహిస్తారు. ఈరెండు కథల్లోనూ సందేశం ఒకటే. ఆడవారు కావలసినప్పుడు కళ్లేలు తమ చేతుల్లోకి తీసుకు సారథ్యం వహించగలరనే. అయితే, సినీవాలీలో మంజరికున్న ఆత్మ స్థైర్యం సర్వమంగళలో అక్కకి లేదు. తనకు తానుగా తనని బలిచ్చుకున్నాననడంలో తనని తాను కించపరుచుకోడమే కనిపిస్తుంది. సినీవాలీలో తుదివిజయం మంజరిదే. సర్వమంగళలో అక్క చేసిన త్యాగం అర్థరహితం, ఆవిడ బతుకు గంగపాలు. ఈకథమీద రచయిత వ్యాఖ్యానం ముందుమాటలో చదివినతరవాత కూడా సర్వమంగళ అన్నశీర్షికలో ఔచిత్యం నాకు బోధపడలేదు.

            ఇంటింటా వుండే భాగోతమే కాని శాస్త్రిగారి కథల్లో heavy duty సంఘర్షణలు చూడం అనడానికి గృహిణీపదం ఒక మచ్చుతునక. హాస్యం, వ్యంగ్యంతో కూడిన సంభాషణలు, ఎత్తిపొడుపులతో సరదాగా సాగిపోయే కథ. “మానుషమున్న ఏ ఆడది … మొగవాణ్ణి పెళ్లి చేసుకోడానికి వప్పుకుంటుంది” ఆమె వాదన. “నిజమే. … నేనూ మా మేనత్తకొడుకును చేసుకున్నట్లయితే బాగుండేది” అని అతని జవాబు. గీతగోవిందం పెండ్లాం వ్రాసిన కావ్యాన్ని తగుదునమ్మా అంటూ తనపేర పెట్టించుకున్నాడు జయదేవుడు అంటుంది ఆమె. అతను నవ్వుతాడు.

          పరిశీలించి చూస్తే పాత్రచిత్రణలో వైవిధ్యం కనిపిస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈపాత్రలనన్నిటినీ ఒకచోట చేర్చి చూస్తే, మన సాంఘికపరిణామం ఛాయామాత్రంగా చూడగలుగుతాం. స్త్రీ పురుషసంబంధాలగురించి స్త్రీలలో పురుషులలో వెనకటితరంవారికీ తరవాతితరాలవారికీ వున్న అభిప్రాయాలలో బేధాలకి అద్దం పడతుంది ఈసంకలనం స్థూలంగా.

            డు-ము-వు-లు కథలో ఇతివృత్తం ఐతిహాసికమే అయినా సందేశం ఆధునికంగా తోస్తుంది. పెద్దలు తమ మూర్ఖపు పట్టుదలలతో భార్యాభర్తలని ఓకాడికి చేర్చ నిచ్చగించకపోతే, ఆచిన్నవాడికి, లోకజ్ఞుడయిన ఓతాతగారి సలహా పెద్దలని ధిక్కరించమనే.

          “తండ్రిని తిరస్కరించిన కుమారుడికి ఉత్తమగతులుండవని శాస్త్రాలు ఘోషిస్తున్నాయిట గదా” అంటే, “తప్పుదారి పట్టిన తండ్రికి విధేయుడై, ఆలిని ఉసురు పెట్టేవాడి గతీ అంతేనంటున్నాయి నాయనా” అని సమాధానం. అలాగే ఏష ధర్మ సనాతన: లో కూడా. దుర్మార్గుడయిన తండ్రిని కంటగించుకుని, తల్లి పతివ్రత కాకపోతేనూ, తాను ఆతండ్రికి పుట్టివుండకపోతేనూ తనకి హర్షదాయకమేనంటూ కొడుకు తండ్రిని ఎద్దేవా చేయడమే ఇతివృత్తం. కారణం ఆతండ్రి తల్లిని హింస పెట్టడం, దానికి తల్లి తల ఒగ్గడం. ఉత్తమపురుషలో సాగిన ఈకథ కేవలం ఒక చిన్న స్వగతంలా సాగుతుందే తప్ప తుదీ మొదలూ కనిపించవు. కథకుడికి కావలసిందల్లా తన తండ్రి “శుద్ధవెధవ” అని శ్రోతని (పాఠకుడిని) నమ్మించడమే. ఈరెండు కథల్లోనూ కథకుడు స్త్రీలపట్ల పురుషుల అమానుషచర్యలని గర్హించడం గమనిస్తాం. రెండుకథలకి కథాకాలం ఒకటే కాకపోవడంతో ఒక చారిత్ర్యక సత్యాన్ని ఎత్తిచూపుతున్నట్టు తోస్తుంది. స్త్రీలని హింసించే మూర్ఖులు ఏకాలంలోనూ వుంటూనే వున్నారు! మొదటికథలో ఈహింస ప్రధానాంశమైతే, రెండోకథలో కేవలం సందర్భానుసారం చేసిన వ్యాఖ్యానంగా కథలో చోటు చేసుకుంది.

          పాత్రలనన్నిటినీ- పైతరగతి, కిందితరగతి కూడా – పరిశీలించినప్పుడు మనిషికి తనలో తనకి వున్న నమ్మకం, అభిజాత్యం, ప్రధానాంశంగా కనిపిస్తాయి వీరి కథల్లో. కళావంతులు, దేవదేసీలు – సంఘం సంభావించిన నామధేయాలన్నిటినీ తృణీకరించి, చంద్రం తల్లి తనకు తానే వెలి వేసుకుంది. ఆవిడ పెంచుకున్న బిడ్డ చంద్రానికి కూడా ఆవిడ పెంపకంలో ఆతత్త్వమే అలవడింది. ధర్మపన్నం, ఆతిథ్యం కథల్లో గృహస్థు భార్యని అతిథులసేవలో నియమించడం న్యాయం అంటూ తాతగారిచేత చెప్పించడం, స్త్రీలు ఆధర్మాన్ని ప్రశ్నంచకపోవడం ఈనాటి విలువలదృష్ట్యా హేయంగా కనిపిస్తుంది. ఈవిషయాన్ని మరొకసారి ఎత్తిచూపడమే రచయిత ఆశయమా? ఈనాడు నవనాగరికత పేరున, స్వేచ్ఛ పేరున ఇదే జరుగుతూండడం (swinging or wife-swapping ఒక ఉదాహరణ) తలుచుకుంటే, ఈకథ వక్రోక్తి అనొచ్చు. అన్యాపదేశంగా వర్తమానంలో కూడా ఈ ఆచారం సాగుతూనే వుందన్న హెచ్చరిక. వర్తమానాన్ని తీర్చి దిద్దుకోడానికి గతాన్ని గురించిన అవగాహన అవుసరం. అదే రచయిత ఆశయం కావచ్చు.

          ధర్మంపేరుతో బిచ్చగాళ్లవిషయంలోనూ, సాంఘికన్యాయం పేరుతో బోగంవాళ్ల విషయంలోనూ పైతరగతివాళ్లు చేస్తున్న ఆర్భాటాలకీ, ఆఆర్భాటాలలో కృత్రిమతకీ రూపకల్పన ద్రౌపదీవస్త్రాపహరణం, పల్లవిలాటి కథలు. “కడుపు మాడ్చడంకన్నా నింపడం మహాపాతకం” అంటాడు పల్లవిలో బిచ్చగాడు. ఇంతమంది ఇంత చేస్తుంటే, మరి బిచ్చగాళ్ల సంఖ్య తరగదేం అంటే సమాధానం ఏమిటి?

          ఇది మదరాసు కథలో కాలానికి కొలమానంగా సృష్టింపబడిన జీవంలేని గడియారం మీకు టైం చెప్పడమే మా పనా అని ఎద్దేవా చేస్తే నవ్వు రాకమానదు చదువరికి. అయితే కథ కొసకంటా చదివినప్పుడు కథకుడి ఆంతర్యం బోధపడుతుంది. టైము లేదు, టైము లేదంటూ కిరకిరలాడేవాళ్లందరూ గమనంలో వుంచుకోవలసింది ఈకొలమానాలనీ, అనేకానేక పరిథులనీ సృష్టించుకున్నది మానవులేనని. గడియారానికేముంది, కీ ఇచ్చి ముళ్లని ఎక్కడ అమరిస్తే అక్కడినించే తిరుగుతూ పోతుంది. మనుషులే నిర్ణయించుకోవాలి తమ జీవలసరళి.

          ఈకథలన్నీ ఒక ఎత్తయితే, ప్రాచీనగాథలలోని పాత్రలతో తనదైన శైలిలో కథని మలచడం మరొక ఎత్తు, వనమాలి, రంగవల్లి, రవిచంద్రిక ఈకోవలోనివి. ఈకథల్లో విశేషం శాస్త్రిగారి కథనం, శైలి. ఈకథలో నిజం ఎంత, కల్పన ఎంత, సందేశం ఏమిటి వంటి చర్చలకి ఆస్కారం లేదు. ఒక సుందర సురుచిర కావ్యం చదివిన తృప్తి కలగాలంతే ఇవి చదివినప్పుడు.

            మల్లాదివారి కథల్లో కొట్టొచ్చినట్టు కనిపించేది భాష. ఇప్పుడు తెలుగులో ఇంగ్లీషు ఎంతుందో ఆరోజుల్లో సంస్కృతం అంతుండేది. మల్లాది కథల్లో జానుతెనుగూ, సంస్కృత సమాసాలూ కూడా కలగాపులగంగా కనిపిస్తాయి. విశేషం ఏమిటంటే ఈరెండు పాయల్నీ ఒక గాటక్కట్టి కథని నడిపించిన ఆయన రచనాకౌశలం.

          సిసలైన తెలుగు నుడికారం “మంచిమాట చేసుకు రానా” (భోజనానికి ఏర్పాటు చేయనా అన్న అర్థంలో), “పిల్లది లోజెడ్డది” (జ్వరం వచ్చింది) వంటి వాక్యనిర్మాణం తెలుగుభాషమీద మమకారం వున్నవారిని పట్టి అలరిస్తాయి. “కాకినాడ పరగణా వాళ్లు తిడుతూన్నప్పుడు వాళ్లనోటివెంట యెంత చక్కని జాను తెనుగు రేగుతుందనీ …” అంటారు శాస్త్రిగారు పల్లవి కథలో. అలాటి జాను తెనుగు బహుశా అలా వినే కాబోలు హక్కుభుక్తం చేసుకుని సద్వినియోగం చేసుకున్నారాయన తమకథల్లో.

          కడుపు మండినప్పుడు నోట వచ్చేది అచ్చతెలుగేననడానికి మరొక ఉదాహరణ ఖామోష్, సర్వమంగళలాటి కథల్లో భాష చెబుతుంది. చక్కని మాండలీకంలో ఖామోష్ లో ప్రధానపాత్ర.ద్వారా వింటాం కథంతా. తల్లి తనని తలకు మాసినతమ్ముడుకి అంటగట్టబోతే కాదని, తండ్రిచేత తన్నులు తిని, ఆదరించిన మారాజు మట్టి అయిపోగా, తెలుసుకున్న జీవితసత్యం “ఆడకూతురికి ఓకంట యెన్నెలుండాలి, ఓకంట కత్తులుండాలి – గొంతులో కోయిలుండాలి – కొరడా వుండాలి, … గుబుల్ దప్పితే నరమానవుడు – మనకు గులామే; మాలిక్ కాడే – ఫికర్ నయ్ – యిది యాదుంచుకు బతుకు” అంటుంది కథానాయిక.

          సాధారణంగా మంచికథకి ముఖ్యలక్షణం పాఠకుడిలో ఉత్సుకత నిలపగలగడం. శాస్త్రిగారి కథల్లో ఉత్సుకతతోపాటు వాక్చాతుర్యం కూడా సరిసమానంగా తులతూగుతూ పాఠకుడిని వుల్లాసపరుస్తుంది. అంచేత, పాఠకుడి దృష్టి ఒక్క కథ – ముందేం జరుగుతుందన్న కౌతుకం మీద నిలవడమే కాక మనసు ఆ పదరమ్యతకి పరవశిస్తుంది కూడా. 

          సాహిత్యం ప్రతీత్మకం. ధ్వని ఒక ముఖ్యమైన అంశం కథనంలో. వాచ్యం చేయడానికి మనసొప్పని వాక్యాలకీ, పాఠకులమేధని సాన పెట్టడానికీ కూడా పనికొచ్చే సాధనం ధ్వని. రామకృష్ణశాస్త్రిగారి కథల్లో ఈధ్వని అపారం. కదాచితుగా పాఠకుడిని తికమక పెడుతుంది కూడా. ఒకసన్నివేశం కానీ, సంఘటన కానీ, ఏంజరిగింది అన్న వివరాలకంటే అనుభూతికి – పాత్రలు ఆయా సందర్భాలలో ఎలా స్పందించాయి అన్నదానికి ప్రాధాన్యత అధికం. కాని ఒకొక్కపుడు ఏవాక్యాలు ఎవరు అంటున్నారో అర్థం కాక పాఠకుడిని కంగారు పెడతాయి. కారణం మనకి అనూచానంగా వస్తున్న జానపదకథనరీతుల ఛాయలు కావచ్చు. కొన్నికథల్లో కొటేషన్ మార్కులు అసందర్భంగా వుండి గందరగోళం చేస్తాయి కథని. వెనకటి రోజుల్లో ఈవిషయం పాఠకులని అంతగా బాధించలేదేమో కాని ప్రస్తుతకాలంలో మాత్రం, ఈనాటి చదువరులని దృష్ట్యా, పునర్ముద్రణలో ఇవి సవరించి వుంటే బాగుండేది (ఉదా. గృహిణీపదమ్).

            భాషవిషయంలో చివరిమాటగా, భాషాభిమానులకీ పరమానందం కలిగించే ఈ కథల్లో నాబోటి సామాన్యులకి అర్థం కాని మాటలు కూడా కనిపిస్తాయి అక్కడక్కడ. కొన్ని సందర్భాన్నిబట్టి గ్రహించుకున్నా ఒకొక్కప్పుడు ఏమిటంటున్నారు చెప్మా అనిపించకమానదు. ‘అధికచక్కంది’, ‘రాళ్లు చేస్తూ’ వంటి పదబంధాలు తమాషాగా తోస్తాయి. కొన్ని పదాలు అచ్చుతప్పులేమోనని అనిపించిన సందర్భాలు కూడా వున్నాయి. నిజానికి, ఈనాటి చదువరులలో చాలామంది తెలుగు మర్చిపోయారు. ఆదృష్టితో చూస్తే, 20వ శతాబ్దపు తెలుగుకథల్లో మాటలకి ఒక నిఘంటువు వేరే సమకూర్చవలసిన అవుసరం కనిపిస్తోంది. ఇది కేవలం మల్లాది వారి కథలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని అంటున్నమాట కాదు. 

          శిల్పం విషయంలో, కథకి తలా, తోకా అవుసరమా అంటే, అది పాత్రలయిష్టం అంటారు మల్లాది వారు. కథని మొదలెట్టడం వరకే రచయిత బాధ్యత. ఆపైన పాత్రలే కథని నడిపిస్తాయి అన్నది వారి అభిప్రాయం (నేనూ – నాకతలు).

           కథాసాహిత్యం జాతిచరిత్ర చెబుతుంది. మల్లాదివారి కథలు అందులో హృద్యంగమమైన భాగమని అంగీకరించక తప్పదు.

అభిప్రాయములు »

  1. @Latha.maroju, Thank you.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — నవంబరు 22, 2009 @ 5:04 పూర్వాహ్నం

  2. review on malladi is very interesting. it is comprehensive yet precise. thanks for evoking interest on telugu sahityam esp on malladi

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా latha.maroju — నవంబరు 19, 2009 @ 11:21 అపరాహ్నం

  3. @సూర్యుడు, చదివి మీ అభిప్రాయాలు చెప్పండి మరి.
    @ శి.రా.రావు, ధన్యవాదాలు.
    @ సుజాత, నీ అభిప్రాయాలకోసం ఎదురు చూస్తున్నాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — నవంబరు 8, 2009 @ 9:20 అపరాహ్నం

  4. మాలతి గారూ,
    మల్లాది వారి కథా సంకలనం నా దగ్గరుంది. మొత్తం చదివి మళ్ళీ వస్తానుండండి!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుజాత — నవంబరు 7, 2009 @ 9:28 పూర్వాహ్నం

  5. మాలతి గారూ !
    మల్లాది గారి కథల మీద సవివరమైన, సమగ్రమైన సమీక్ష వ్రాసారు. ఎప్పుడో చదివిన ఆ కథలు లీలగా గుర్తున్నాయి. ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ చదివినట్లయింది. ఇంతమంచి సమీక్షనిచ్చినందుకు మీకు అభినందనలు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శి. రా. రావు — నవంబరు 7, 2009 @ 2:54 పూర్వాహ్నం

  6. ఇప్పటివరకు వీరి కథలుగురించి వినడమేకాని ఎప్పుడూ ఏవీ చదవలేదు, వీలు చూసుకుని చదవాలి.

    ~సూర్యుడు :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సూర్యుడు — నవంబరు 6, 2009 @ 10:16 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.