ఊసుపోక – గోడమీద రేపు

 (ఎన్నెమ్మకతలు 51)

   పిల్లల్ని “భోజనాలకి రండర్రా,”  అని మీరంటే, “ఇదుగో వచ్చే” అని వాళ్లంటే, వెంటనే పరుగెత్తుకు వచ్చేసే పిల్లల్ని మీరెక్కడయినా చూశారా? చూస్తే, వాళ్లు రెండుతరాలకి ముందు పుట్టినవాళ్లయి ఉంటారని నా నమ్మకం. ఎందుకంటే, వస్తా అనగానే వచ్చేయడం, చేస్తా అనగానే చేసేయడం, చెప్తా అనగానే చెప్పడం ఆధునికం కాదు. ఏ తుఫానో, తుఫానులాటి వస్తాదో వచ్చి ఎదుట నిలబడి, “పద” అంటే తప్ప.

అలాగే పార్టీలకి fashionably lateగా వెళ్లడమే సిసలైన మర్యాద. ఆరుగంటలకి పార్టీ అంటే ఆరూపదికో ఆరుంబావుకో గుమ్మంలో కనిపిస్తేనే పరువు దక్కుతుంది.

బిజినెస్ 101 లో పాఠం – ఖచ్చితంగా అన్న సమయానికి కనిపించినా , ఫోను మొదటి రింగుకే ఎత్తినా, “వీడికేం పనిలేదు” అని ఒక గుహ్యసందేశం ఇవ్పకయే ఇచ్చినట్టు అని అర్థంట. అలాటి అర్థాలిచ్చే పనులు చెయ్యడం ఇరుపక్షాలకీ శ్రేయస్కరం కాదు. ఫోను రెండో, మూడో రింగులయేవరకూ ఆగి, ఆ తరవాత సుతారంగా ఎత్తి, మరో రెండు లిప్తలు ఆగి హలో అనాలి.

అలాగే మీరు ఎవరికైనా అపాయింటుమెంటిస్తే, ఆ వచ్చినవాడు ఫల్గుణుడయినా సరే, వాడిచేత ఓపదినిముషాలయినా వెయిటింగుగదిలో వెయిటు చేయించాలి. మరి ఆ వెయిటింగుకోసమే నియంత్రించిన గదీ, కుర్చీలూ  ఊరికే పోనివ్వడం మర్యాద కాదు కదా.

అదే ఇంటర్వూ అయితే, మీరు ఇచ్చేవారా, పుచ్చుకునేవారా అన్నదాన్నిబట్టి ఉంటుంది ఆలస్యంగా వెళ్లాలా, అన్నవేళకి అరగంటముందే వెళ్లి ముప్పావుగంట పడిగాపులు పడాలా అన్నది.

మీటింగులూ, ఇంటర్వూలతరవాత, వారంటీలని చెప్పుకోవాలి. మనం ఏదేనా కొనడానికెళ్తే, ఆ అమ్మకాలమ్మాయి లేక అబ్బాయి మీకోసమే జన్మెత్తినంత హుషారు చూపిస్తాడా మీమొహం కనబడగానే, మీరు కొనబోయే వస్తువు గుణగణాలు చవులూరా వర్ణిస్తాడా, ఆ తరవాత వారంటీలు వాటికి అంటిస్తాడా .. అది చూసి, మీకెంతో ముచ్చటేసి, పాపం ఇతడికి లేక ఈమెకి మనంవంటే ఎంత ప్రేమా అనుకుంటూ కొనేస్తారా… ఆ తరవాత ఇంకా extended warrantyలూ కూడా తాంబూలాలిస్తాడా… ఇవన్నీ ఎంత బాగున్నాయీ, హా … హా … నాకెక్కడ నవ్వొస్తుందంటే, ఈవారంటీలూ, extended warrantyలూ ఈమధ్య మరీ ఎక్కువయిపోయేయి. మరీ పాతిక డాలర్లు పెట్టి కొన్నవస్తువుకి కూడా extended warranty ఇస్తానంటాడు. మూడేళ్లవారంటీ అన్న కంపెనీలు మూడేళ్లు తిరక్కుండా మూసుకుపోవడం చూసేను నేను.  ఆతరవాత ఆ వారంటీ ఏం చేసుకోను?

వారంటీలకి వదుల్చుకునే డబ్బుమాట అలా ఉండగా, ఆ వారంటీని మనం వాడుకోబోతే  మనకి ఎదురయే తిప్పలు ఆ పరమాత్ముడికే ఎరుక. అవి తలుచుకుంటే, అంతకన్నా ఆవస్తువు పారేసి మరోటి కొనుక్కుంటే నయం అనిపించకపోదు ఎంతటి ధృఢచిత్తుడికైనా. ఎందుకంటే, మనం కొన్న వస్తువు వివరాలు – ఎక్కడ కొన్నాం, ఎప్పుడు కొన్నాం, మోడల్ నెంబరు, సీరియల్ నెంబరు, అసలు దానికొచ్చిన జబ్బు వారంటీ పరిధుల్లోకి వస్తుందా – ఇవన్నీ అయేక, ఆషాపువాడు చెప్పినట్టు మెయింటెయిన్ చేసేమా లేదా, మనం ఏ ఘోరతప్పు చేస్తే అది రిపేరుకొచ్చిందీ … ఇలాటి సవాలక్ష ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చుకున్న తరవాత మనం కొన్నపెట్టెలోనే పెట్టి, మరెక్కడికో పంపమంటాడు. మనం కొన్న వస్తువు మళ్లీ ఆ పెట్టెలో పెట్టడం సాధారణంగా దాన్ని పుట్టించినవాడికి మాత్రమే తరం. ఎలాగో అష్టకష్టాలూ పడి, నానా కుస్తీపట్లూ పట్టి, దాన్ని ఆపెట్టెలో కుక్కి pack చేస్తాం అనుకోండి. ఆతరవాత నాలుగునించి ఆరువారాలవరకూ పడుతుందంటాడు.

ఆతరవాత ఆ వస్తువు తిరిగి వచ్చింతరవాత చూస్తే, అది సరిగ్గా రిపేరు చేయబడలేదు అని తెలుస్తుంది. లేదా మరోరకం తిక్క రేగినా రేగొచ్చు. మళ్లీ మన అవస్థలు మొదలు … వారి ప్రశ్నలూ, మన జవాబులూ, మళ్లీ ఈ రెండోబాధ ఆ వారంటీ పరిధిలోకి రాకపోతే మనం ఎంత ఇచ్చుకోవాలీ … సాధారణంగా వాళ్లు వస్తువు చూసి రిపేరు చేసేవరకూ చెప్పలేరు ఎంతవుతుందో  … హరిః ఓమ్ … ఒక్కమాటలో వారంటీలకి రేపు లేదు.

అసలు వస్తువు పటిష్ఠంగా, పకడ్బందీగా, ఏలోపాలూ లేకుండా తయారు చేస్తే వారంటీల అవసరం లేదు. … కానీ గత యాభై ఏళ్లలో తయారయిన ఏవస్తువుకీ “రేపు” కనిపించడం లేదు! ఎప్పటికప్పుడు new and improved సిద్ధమవుతూంటుంది కదా.

ఒకరకంగా ఆలోచిస్తే, మనిళ్లలో చేబదుళ్లలాటిదే. కప్పు కాఫీపొడి అప్పడిగినా, పదిరూపాయలు డబ్బు అడిగినా, ఓ పుస్తకం ఎరువు తీసుకున్నా అంతే. రేపిస్తానంటే రేపే ఇచ్చేస్తానని కాదు. రేపుకి టీక మీకు తెలీపోతే, ముళ్లపూడివారి అప్పారావునడగండి.

నేను మాపిల్లకి ఫోను చేస్తే, ఆపిల్ల తాను మరోలైనులో ఉన్నాననీ, రెండునిముషాల్లో పిలుస్తాననీ చెప్తుంది. మొదట కొన్నాళ్లపాటు నేను వాచీ చూసుకుంటూ, క్షణాలు లెక్క పెట్టుకుంటూ, రెండూ, మూడూ, ఐదూ, పదీ నిముషాలు ఆ రాబోయే ఫోనుకోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని కానీ తరవాత చాలాకాలానికి తెలిసింది దాని కాలమానం వేరని. మాపిల్ల కనక సరిపోయింది కానీ మరోళ్లయితే, “నేనంటే వాళ్లకి ఇష్టంలేదు కాబోలు, వాళ్లకి నాతో మాటాడ్డం ఇష్టంలేదు కాబోలు“ అనుకోవాల్సిన శుభసందర్భం అన్నమాట. లేదులెండి. నిజంగా నేను అలా అనుకుంటానని కాదు. అలా అనుకోడానికి అవకాశం ఉంది కదా. 

ఇంతకీ, … ఇప్పుడు ఏంచేస్తున్నానంటే, అదే మాపిల్ల రెండు నిముషాల్లో పిలుస్తానన్నతరవాత, నేను సరేనని చెప్పి, కాఫీ పెట్టుకుని, తాగి, గిన్నెలు కడిగేసుకుని, నా మామూలు పాదసంచారం కూడా ముగించుకు వచ్చేస్తాను. ఒకొకప్పుడయితే రెండో, మూడో రాత్రులు పడుకుని లేవడం, వంటలూ, భోజనాలూ, బజారుపనులూ కూడా జరిగిపోతాయి ఆ రెండు నిముషాల్లోనూ.

నిజానికి ఇది ఈనాటి జీవిత స్కిల్లుల్లో ఒకటనుకుంటాను – ఇది అంటే జస్టెమినిట్ లేక బిఆర్‌బీ లక్షణం.

మొన్న, అదే నాముందు టపాలో పుస్తకాలగురించి మాటాడుకున్నాం, చూడండీ – “సాయంత్రం చదువుతాను,” “రాత్రి చదువుతాను,” “రేపు” .. “వచ్చేవారం” ..అంటూ పొద్దు పుచ్చుకుంటూ మంచంపక్కనో తలగడా కిందో పెట్టుకున్న పుస్తకాలూ, “రాస్తాను”, “రాయాలి”, “ఇదుగో కాయితం అదుగో కలం, లేదా ఇదో నాకీబోర్డు”, అంటూ జరుపుకొస్తున్న కథలూ, కవితలూ, వ్యాసాలూ, విమర్శలూ, సమీక్షలూ, ఇంకా మరో పావుగంటలో ప్రారంభించేస్తున్నా ననుకుంటున్న పనులూ ఇంకా ఎన్నెన్నో మన దినసరి బతుకుల్లో … … ఆరంభింపరు నీచమానవులు అన్న పద్యం ఎవరికైనా గుర్తొస్తే పట్టించుకోకండి. దానికి ఇక్కడ సందర్భశుద్ధి లేదు. 

నాచిన్నప్పుడు మాస్కూల్లో ఎవరేనా హోంవర్కు చెయ్యకపోతే, “రేపు తప్పకుండా చేస్తానండీ” అని అమ్మతోడుగా హామీ ఇస్తే, మామాస్టారు, “గోడమీద రేపు అని రాసుకున్నావా?” అనేవారు చిరుకోపంతో. 

మరి గోడమీద ఏరోజు చూసినా, “రేపు” అనే కనిపిస్తుంది, కనక, ఫరవాలేదు ఇంకా టైముంది అనిపించి, ఏనాటికీ చెయ్యడం జరగదని ఆయన అభిప్రాయం.

సరే, నా రెండో కాఫీ చల్లారిపోతోంది. రెణ్ణిముషాలాగి మళ్లీ వస్తా..

ఏంటీ? … మీరు కూడా రెణ్ణిముషాలాగి చదువుదాం అనుకుంటున్నారా ఇది? సరే, అలాగే కానీండి. రేపు చదవొచ్చులెండి. నేనూ, నా టపా ఎక్కడికి పోతాం కనక.

“గోడమీద రేపు“ మాత్రం చెయ్యకండి. నాకు చాలా బాధేస్తుంది.

(మార్చి 23, 2010.)

7 Responses to ఊసుపోక – గోడమీద రేపు

  1. మాలతి అంటున్నారు:

    @ రాధిక, మాఅమ్మాయి కూడా అదే అంటుంది మర్చిపోయానని :) . వారంటీలమాట నిజమే వేరే టపా రాయాలి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @ మధురవాణి, కంప్యూటర్లవిషయంలో మాత్రం వారంటీలు అస్సలు నమ్మను. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @ కల్పన, హాహ, చాలామంది అలాగే అనుకుంటున్నట్టుంది, నామీదే అని. అంటే విషయం అంత సర్వజనీనం అన్నమాట. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    @ వాసు, అలాగా. సినిమాలవాళ్లకీ నాకూ ఒక్కలాటి ఆలోచనలే వస్తున్నట్టున్నాయి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    @

  2. vasu అంటున్నారు:

    బావుందండీ. నాకు ఇది చదువుతుంటే జల్సా లో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. లేట్ గా వస్తే వీడికి టైం లేదనుకుంటారు.. ముందొస్తే పని లేదనుకుంటారు అని.

  3. kalpana అంటున్నారు:

    అమ్మయ్య, వచ్చేశాను. కొంపతీసి ఈ టపా నాకోసమే రాయలేదు కదా అనేసుకుని భయపడిపోయి బుద్ధిగా చదివేశాను. మిగతా పోస్టులు మాత్రం అలాగే బాకీ లో వుంచుకుంటున్నాను. రెండు రోజుల తర్వాత వాటికి మోక్షం కలుగుతుందేమో చూద్దాము.

  4. మధురవాణి అంటున్నారు:

    అన్నట్టు… అందుకే కదండీ.. అన్నీ వారెంటీలకి క్రిందన *conditions apply అని రాస్తాడు. అవన్నీ వాడికి కలిసోచ్చేవే గానీ మనకి ఏ ఒక్కటి ఉపయోగపడదు :-(

  5. మధురవాణి అంటున్నారు:

    చాలా బాగుంది టపా. మీ శైలి చెణుకులు భలేగా పేలాయి ;-)
    నా ఆఫీసు కంప్యూటర్ అప్పుడప్పుడూ ఏదో విచిత్ర శబ్దం చేస్తోందని వారెంటీ మీద షాపుకి తీస్కెళితే.. “మేము పరీక్షగా చుసిన ఐదు నిమిషాల్లో ఆ శబ్దం రాలేదు. కాబట్టి, వారెంటీ కిందయినా సరే బాగు చేయలేము. ఎంచేతంటే, మాకు సమస్య కనిపించలేదు కాబట్టి” అన్నాడు.
    నోరు మూసుకుని వచ్చెయ్యడం మా వంతయింది. వాడికి ఆ సమస్య కనిపించేంత పెద్దదయేలోపు వారెంటీ అయిపోయింది ;-)

  6. radhika అంటున్నారు:

    :) ఆ రెండు నిమిషాల ఖాతాలో నేను కూడా వుంటానండి.తిరిగి చెయ్యకూడదని కాదు……మర్చిపోవడం వల్ల :)
    వారెంటీల గురించి మాట్లాడకండి నాకు బాధ,కోపం రెండూ కలిపొస్తాయి.ఎంతో సంబరం గా సోనీ కేంకార్డర్ కొంటే అది మూడు నెలలకే మూల కుర్చుంది.వారెంటీ వుంది కదా అని పంపిస్తే,ఆ సమస్య వారెంటీలో కవర్ చెయ్యదు అని బాగు చెయ్యడానికి కొన్నదానికి రెట్టింపవుతుందని చెప్పి వెనక్కి పంపడానికి షిప్పింగుకి డబ్బులు అడిగాడు…హుమ్మ్

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.