నాపేరు వెంకటలక్ష్మీనరసింహసీతారామవరప్రసాదు. వెంకూ అన్నా పలుకుతాను. లక్ష్మీ అన్నా పలుకుతాను. నర అన్నా పలుకుతాను. సింహ అన్నా పలుకుతాను. సీతా అన్నా పలుకుతాను. రామా అన్నా పలుకుతాను. వరప్రసాదూ అన్నా పలుకుతాను. ఏమీ అనకపోయినా పలుకుతాను.
నేను పలక్కపోయినా, చిటిక వేసి, చూపుడువేలుతో పిలచి, ఉత్తరం పోస్టు చెయ్యమనో, మెంతులు తెమ్మనో, ఆవుమీద కాంపోజిషన్ చిన్నచెల్లికి రాయమనో చెప్తారు. నేను చెయ్యడమో, తేవడమో, రాయడమో చేసేస్తాను.
అంతమాత్రంచేత నేను చిన్నారి పొన్నారి చిరుతకూకటినాటినుండీ ఉత్తరం పోస్టు చెయ్యడమో, మెంతులు తేవఢమో తెలుగు కాంపోజిషను రాయడమో చేస్తూ ఉన్నాననుకుంటే పొరపాటు.
ఆ మధ్య మధ్యలో కాలేజీకెళ్లడం, భోజనం చెయ్యడం, నిద్రపోవడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేసేవాణ్ణి. ఇవన్నీ ఇలా ఉండగా, ముచ్చటగా మూడేళ్లు “హానర్సు” చదివి, మూడోక్లాసు తెచ్చుకుని, మూడే నెలలయింది. కథాకాలంనాటికి మరో మూడు నెల్లయిందనుకోండి.
పరీక్షలయిన మొన్నాటినుండీ రోజూ పొద్దున్నే లేచేవాడిని. పళ్లు తెల్లగా తోమేవాడిని. జుత్తు నున్నగా దువ్వేవాడిని. లాల్చీ, పైజమా కొంచెం మాసినా, కొత్తవి అంటే ఇస్త్రీవి తీసి తీరా ఫలితాలు వచ్చేక ఉద్యోగానికి అర్జీ పెట్టుకుంటే, ఇంటర్వ్యూకి వెళ్లడానికీ, ఆపైన వాళ్లు నిల్చున్నపాళాన డ్యూటీలో చేరిపొమ్మంటే చేరిపోడానికీ ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని కొద్దిగా మాసినబట్టలతోనే రోడ్డెక్కి, ఎండెక్కేక ఇల్లు చేరేవాడిని. ఆమద్యకాలంలో పలకరించినవాళ్లందరికీ నేను “హానర్సు” పరీక్ష వ్రాసేననీ, రిజల్ట్సు వచ్చేక ఏం చెయ్యాలో ఆలోచిస్తాననీ సన్నగా నవ్వుతూ, సగం సిగ్గుపడుతూ, ఆమీదా సగం గర్వపడుతూ చెప్పేవాడిని.
ఇట్లుండ, కొండొకరోజు సదరు రిజల్టులు వచ్చేశాయి.
“అబ్బో, యమ్మే కామాలు,” అన్నాడు ఎదురించి నాయుడు కళ్లెగరేస్తూ.
నేను మందహాసం చేసేను కామాలూ, ఫుల్‌స్టాపులూ అక్కర్లేదని.
“రిజల్ట్సు వచ్చేసినట్టున్నాయే,” అన్నారు అఫిలియేటేడ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరరు రామారావుగారు.
“ప్చ్. ధర్డ్ క్లాసు వచ్చిందండీ,” అన్నాను, నామీద నాకే జాలి కలిగి.
“ఫరవాలేదులే” అన్నారాయన ఓదార్పుగా.
ఆరోజు త్రిపాద నక్షత్రాన్ని ఇంటికి మళ్లించాను.
నెలాపదిహేను రోజులు గడిచిపోయేయి. వాచీ అక్కర్లేకుండానే మూడేసి గంటల కొకమారు “వస్తుంది. తొందర పడితే ఎలా? అందరికీ ఉద్యోగాలు కావాలి. మరి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు రిటైరవడమో, హరీమనడమో అయితే కానీ ఖాళీలు కావు కదా,” అనేది అమ్మ.
“ఆఁ. ఉద్యోగాలకేమిటి కొదవ. నలుగురికి నాలుగు ప్రైవేట్లు చెప్చే నాలుగు పదులు నలభై” అనేది అక్క. దానికి నాలుగో ఎక్కం క్షణ్ణంగా వచ్చు.
నాన్నగారు నాపక్కనించి నడిచి వెళ్తుంటే, నేనక్కడ ఉన్నానో లేనో ఆయనకి తెలిసినట్టు లేదు.
“ఒరేయ్, మాకాలేదీలో పి.యు.సి. వాళ్లకిట ట్యూషను చెప్తావా?” అడిగాడు అన్నాయ్య.
“ప్రైవేట్లా?” అన్నాను ఆశ్చర్యంగా.
“ఏం? ప్రస్తుతానికి అడుగు పెడితే, పడుకోడానికి జాగా తరవాత చూసుకోవచ్చు. పొద్దున్నోగంటా, సాయంత్రం ఓగంటా చెప్పావంటే బాచికి పదిహేనుమందిని వేసుకున్నా, పదిహేను పదులు నూటయాభై. రెండు నూటయాభైలు మూడొందలు. లెక్చరరుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ” అన్నాడు.
వీడికి కూడా ఎక్కాలు బాగా వచ్చు.
“ఓ ఇరవేమంది వచ్చినా రెండు వందలు కళ్ల చూస్తాం,” అంది అమ్మ. అమ్మకి కూడా ఎక్కాలు బాగా వచ్చు.
“సరే, చూద్దాం” అన్నాను. నాకు ఎక్కాలు రావు. సరేననేసి వీధిన పడ్డాను. లెక్క పెట్టి నాలుగడుగులు వేసేలోపున ఓ పెద్దమనిషి ఎదురుపడి, “ఏరోయ్, ప్రైవేట్లు చెప్తున్నావటగా” అన్నాడు ఆనందంతో.
నేను తెల్లబోయి, “ఇంకా మొదలు పెట్టలేదండీ,” అన్నాను భయభక్తులతో.
ఇలా చాలామందికి చెప్పవలసివస్తుంది. ఈలోపున చాలా రోజులు అయిపోతాయి. రెండూ అయేక అన్నయ్య వచ్చి “ఒక్క స్టూడంటు కూడా రాలేదు” అని చెప్పేడు.
“బాగుంది” అన్నాను.
“అయ్యో” అంది అమ్మ.
“ప్చ్” అంది చెల్లాయి.
మళ్లీ ఊరుమీద బలాదూర్ తిరగడం మొదలు పెడతాన్నేను.
పదిగజాలకోమారు ఓ పెద్ద మనిషి కనిపిస్తాడు. మాఊరినిండా పెద్దమనుషులే!
“ఏరా, ఎక్కడా కనిపించడంలేదు. చదువుకున్నవాడివనా?” అంటారు ఒకాయన మందహాసం చేస్తూ, జరీకండువా సవరించుకుంటూ.
“అదేఁవిటండీ. నేనెంత? నాచదువెంత?” అంటాన్నేను. మరి నేను నాలుగున్నర అడుగులూ, నాచదువు యం.ఏ. ధర్డుక్లాసూ.
“మరి కనిపించడంలేదేం?” అంటారాయన చిరుకోపంతో.
“మొన్న మీయింటికొచ్చేనండీ.”
“మరి నాకెందుకు కనిపించలేదూ?” అంటూ గర్జిస్తారాయన.
“ మీజవాను గేటుదగ్గర అడ్డుపడి పొమ్మన్నాడండీ” అంటాను నసుగుతూ, వణుకుతూ.
“సరేలే. ఎక్కడైనా పని చేస్తున్నావా” అంటారాయన శాంతించి.
“అందుకనే వచ్చేను మీయింటికి,” అంటాను సాహసించి.
“బాగుంది. వస్తా” అంటారాయన ముందుకి సాగుతూ.
“మీరెందుకండీ. ఎప్పుడో చెప్పితే, నేనే వస్తా,” అంటా ఆయన వెంట బడుతూ.
“ఎందుకులే. నేనే కబురు పెడతా,” అంటారాయన వెనక్కి తిరిగి చూడకుండా, పెద్ద పెద్ద అంగలేస్తూ.
నేను కాళ్లీడ్చుకుంటూ ముందుకు సాగుతాను. పన్నెండయేక ఇంటికి చేరుతాను. అది పండుగరోజయితే ఓ ఉత్తరం అందిస్తుంది అమ్మ, “నీకొచ్చిందిరా” అంటూ. హాసరేఖలు అమ్మమొహంమీద లాస్యం చేస్తాయి.
అది ఇంటర్వ్యూకి రమ్మని ఆహ్వానం. నా నూటపదిహేడో అప్లికేషనుకి జవాబు. ముప్ఫైతొమ్మిదో ఇంటర్వ్యూ ఇది.
సరే, ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.
“నీపేరు?”
“మీ ఊరు?”
“ఏం చదువుకున్నావు?”
“చిత్తం” అన్నంత వినయంతో జవాబులు చెప్తాను. అయితేనేం?
“అదేమిటయ్యా, యమ్.యే. చదువుకున్నవాడిని ఎలా వేసుకోను ఇంత చిన్న పనికి?”.
“నాకేం ఫరవాలేదండీ” అంటాను.
ఆయన జాలి పడతాడు.
“ఇంటరు ఫైయిలయినవాళ్లకింద పని చేస్తావా?” అంటాడాయన నా ఆత్మగౌరవాల్ని రెచ్చగొట్టడానికి తలపడుతూ.
“మీరు ఆ ఉద్యోగం ఇస్తానని మాటిస్తే, నేను అప్పుచేసి వెళ్లి కాశీలో వదిలేసి వస్తానండీ నాడిగ్రీని” అంటాను ఆశగా.
“నీకు భలే సెన్సాఫ్ హ్యూమరుందే” అంటూ మెచ్చుకుంటారాయన. అయీ ఈభుషణకీ (ఇలాంటి దూషణలకీ) పొంగిపోను.
“దానికేం లెండి. కాళిదాసుకి కవిత్వంలాగే నాహ్యూమరు కూడా దానంతచే వస్తుంది,” అంటాను ఇంకా ఆశ చావక.
ఆయన మళ్లీ నవ్వి, ప్యూనుని పిలిచి కూర్చీ వెయ్యమంటారు.
“నాకు మరో అయిడియా తడుతోంది. నెంటనే చెప్పేస్తా, చూడండి. మీరు కుర్చీ వేయించడానికి ప్యూనుని పిలిచారు. ఆపని చెయ్యమన్నా చేస్తానండీ,” అని.
పర్వతం బద్దలయినట్టు ఆయన మరోమారు హోరెత్తిపోతూ నవ్వుతారు.
“మరి మేం ఈ ఉద్యోగానికి హోల్ మొత్తం ఎనభై రూపాయలిస్తున్నాం. నీకు చాలా?” అంటారాయన నేనివ్వబోయే హ్యూమరసాన్సరుకోసం చూస్తూ.
“నాకు యాభై చాలండీ,” అంటాను వస్తున్న ఏడుపు ఆపుకుంటూ. ఈసారి ఆయన ప్యూనుని పిలిచి రెండు కప్పులు కాఫీ తెప్పిస్తారు. మరో అరగంట నాచేత వాగించి, తృప్తిగా నవ్వి, “నీ ఎడ్రెసియ్యి. నీకు తగిన ఉద్యోగం వస్తే తప్పకుండా నిన్నే తీసుకుంటా,” అంటారాయన.
నేను లేచి నిలబడి, నిటారుగా నిలుచునే, టేబుల్‌మీద, కాగితంమీద నా ఎడ్రెసు రాసి, “మరి రేపు ఇదే వేళకి రమ్మంటారా?” అని అడుగుతాను.
“ఎందుకు?” అంటారాయన ఆశ్చర్యంగా.
“ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టయిన్ చేసినందుకు కప్పు కాఫీ ఇప్పించేరు కదా. ఈరెఖ్కన నెలకి సుమారు నాలుగు రూపాయలు గిడుతుంది. మీరు నాకిచ్చే ఉద్యోగం ఏమీ లేదని నాకు తెలుసు.”
“అదేమిటి? ఎడ్రెసు తీసుకున్నది ఎందుకనుకున్నావు?”
“అదంతా ఓ తమాషాలెండి. అయినా ఇది మటుకు ఉద్యోగం కాదండీ? రోజుకి పదిహేను నయాపైసల చొప్పున సంవత్సరానికి యాభై ఒక్క రూపాయి ఇరవైఅయిదు పైసలవుతుంది. లీపు సం. అయితే మరో పదిహేను పైసలు అవుతుంది.”
“హార్నీ, భలేవాడివయ్యా! ఆఫీసులో ఉద్యోగం లేదు సరిగతా ఇంట్లో ఎదిగిన ఆడపిల్లయినా లేదు కదోయ్,” అంటారాయన వెనక్కి చారబడి.
“అది మాయింట్లో ఉందిలెండి” అంటాను లేచి నిలబడి.
ఆయన ముందుకి వంగి, నా ఎడ్రెసు పర్సనల్ ఫైలులో పెట్టుకుంటూ, “ఆర్యూ ఎ బ్రాహ్మిన్? నువ్వు బ్రాహ్మణుడివా?” అంటారు హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు.
“అవునండీ, యస్సార్” అంటాను నేను కూడా ద్విభాషల్లోనూ.
“అహం స జాతిః ప్రత్యక్తా అంటూ తెంపి పారేయడానికి నామెళ్లో యజ్ఞోపవీతం లేదు. (ఇదివరకు ఉండేదిలెండి). గాయత్రి మానాన్నగారు ఉపదేశించిన మర్నాడే మర్చిపోయేను. హోటల్లో నాజాతికానివాడి సహపంక్తిన ఏ ఒరియావాడో వడ్డించిన వంటలు పబ్లిగ్గా తింటాను. ఐతే ఏం గాక. నేనుప్రభుత్వేవారిచే రికగ్నైజు చేయబడిన శుధ్ధశ్రోత్రియ బ్రాహ్మణకుమారుణ్ణి! భూసురవరుణ్ణి!
“సారీ, ఎనీవే దట్ డోంట్ మేటర్, అదేమంత లెఖ్కలోకి రాదు ఉద్యోగంవిషయంలో.”
“వస్తే మటుకు ఏంచేస్తాంలెండి. జన్మ దైవాధీనం” అనేసి, ఇంటికొస్తాను.
“ఏమన్నార్రా?” అని ప్రశ్నించేవాళ్లకి ఏం చెప్పాలో ఆలోచిస్తూ.
కానీ, కథాంతం సుఖాంతం కావడం కోసం … … గారు నాకు ఉద్యోగం వే.యిస్తారనీ, నాలాగే మీరూ ఆశ పడితే, నాకులాగే మీకూ నిస్పృహే ఎదురవుతుంది.
ఏది ఏమైనా “ఫలం” మనది కానప్పుడు ఎందుకీ తాపత్రయం? అందుకే నిశ్చింతగా నాలాగే మీరు కూడా.
(1965 జ్యోతి మాసపత్రికలో ప్రచురితం)
పెద్ద మార్పేమీ లేదు ఇప్పటికీ అని నాకనిపిస్తుంది. సగం ఉద్యోగాలకి ఓవర్ క్వాలిఫైడ్. మిగితా సగం నో వేకెన్సీస్ – అందరూ సలహాలివ్వడం – అంతా ఇంకా జరుగుతూనే ఉంది
@ శర్మగారూ, రావిశాస్త్రిగారికథలమీద టపా నాదృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. ఎంచేతో మళ్లీ అప్లోడ్ చేసినా రావడంలేదు. మరోకసారి ప్రయత్నిస్తాను కొంచెంసేపు ఆగి. నా పీసీకి ఏదో నలత చేసినట్టుంది.
రావి శాస్త్రి గారి నాలుగార్లు పేజి ఓపెన్ అవ్వడం లేదు.
@ SRRao గారూ, నిజమేనండి. ఎన్నితరాలు మారినా, ఉద్యోగాలవేటలో పెద్ద మార్పులు వచ్చినట్టు లేదు. మీప్రోత్సాహానికి ధన్యవాదాలు.
మాలతి గారూ !
నాలుగున్నర దశాబ్దాలనాటి కొన్ని వాస్తవ పరిస్థితుల్ని ఎంత చక్కగా చెప్పారు. ఎంత అభివృద్ధి జరిగి ఉద్యోగావకాశాలు పెరిగినా కొన్ని విషయాల్లో పెద్దగా మార్పు రాలేదనే చెప్పవచ్చు. మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు.