రావిశాస్త్రిగారి నాలుగార్లు – రెండోభాగం

“జరీఅంచు తెల్లచీరె”లో చెప్పుకోదగ్గ కథ లేదు ఒకరకంగా చూస్తే. ఒక కన్నెపిల్లకి చీరెలమీద ఉండే సీదా సాదా సరదాని ఆవిష్కరించడం జరిగింది. జరీఅంచు అందాలు చిందే మెరుపు. విశాలాక్షికి ఆరేళ్లప్పుడు కలిగింది తెల్లచీరె కావాలన్న కోరిక.
మరో పదేళ్లకి, అంటే పదహారు, పదిహేడేళ్లపుడు, గట్టికోరికగా స్థిరపడింది ఆపిల్లమనసులో. సాధారణంగా ఆ వయసు ఆడపిల్లలకి రంగురంగుచీరెలు కట్టుకోవాలని ఉంటుంది. కానీ అసాధారణవిషయాలు వెలికి తీసుకురావడం రచయితల పని. శాస్త్రిగారికి తెల్లచీరెలంటే ఇష్టం అవడం మరోకారణం (ఆయనే చెప్పేరు ఈమాట రావిశాస్త్రీయంలో అనుకుంటా). అంచేత కథంతా తెల్లచీరెచుట్టూ అల్లుకుంది. విశాలాక్షి ఆరేళ్లప్పుడే అడుగుతుంది తల్లిని తనకలాటి చీరె కొనిపెట్టమని. తెల్లచీరెకీ పెళ్లికీ అనుబంధం. ఆమాటే తల్లిచేత అనిపిస్తారు రచయిత, “బావున్నాయే తల్లీ నీకోరికలు. కొంటాంలే నీపెళ్లినాడు” (పు. 187).

కథలో తెల్లచీరె  అందరానికోరికకి ప్రతీక. తెల్లచీరెలాగే  కనకారావు కూడా ఒకరకం మగవాళ్లకి  ప్రతీక. సంఘర్షణ విశాలాక్షికి గల తీరనికోరిక. అంతకంటె బలమైన  సంఘట్టన కనకారావు ఆఅమ్మాయిమీద  జరిపిన అత్యాచారం. నిజంగా ఏం జరిగింది అన్నది వివరింగా వర్ణించలేదు రచయిత. బహుశా విశాలాక్షికి తెల్లచీరెమీద ఉన్న మోజు మాత్రమే ప్రధానాంశం అని కావచ్చు. మస్తుగా డబ్బుగల కనకారావు అన్నయ్యకి స్నేహితుడే అయినా స్నేహమర్యాదలెరగనివాడు. తనమీద దౌర్జన్యం చేస్తాడు. అతరవాత విశాలాక్షికి తనని అవమానించినవారందరూ కనకారావులే. కార్నరుసీటులో “వెధవ” అన్నంత విసురుగానూ వాడేరు శాస్త్రిగారు కనకారావు అన్న నామధేయాన్ని ఇక్కడ! ఈకథలో మనం పరిష్కారం చూడం. విశాలాక్షికోరిక తీరిందో లేదో తెలీదు. అయితే, మధ్యతరగతి జీవనపోరాటానికి సంబంధించిన సమస్య అనీ, అంచేత ఇది కూడా శాస్త్రిగారి అన్నికథల్లాగే దారిద్ర్యానికి సంబంధించినకథ అని కొందరివాదన. విశాలాక్షికోరిక తీరడం సంఘంలో అసమానతలు పోయినప్పుడే అన్నవాదన నాకంతగా బలంగా కనిపించడంలేదు. ఈకథ నాకెందుకు నచ్చలేదంటే ఇతివృత్తం అతి సామాన్యం. పరిష్కారం లేదు. ముగింపులో ప్రత్రేకంగా తెలిసిందేమీ లేదు. కానీ చెప్పినతీరులో చమత్కారం ఉంది. కొన్నిచోట్ల కథ రాయడానికి పావుఠావు పట్టే విశేషాల్ని ఒక్కవాక్యం చెప్తుంది.

“జరీఅంచు తెల్లచీరె!

విశాలాక్షికి  ఏడుపు వస్తోంది.

… …

జరీఅంచు తెల్లచీరె

ఎప్పుడు కొనడం? ఎప్పుడు కట్టుకోడం? (పు. 186)

ఇలా సాగుతుంది  కథ. ఈ చిట్టిపొట్టివాక్యాలతో  ఒక జీవితకాలానికి సరిపడగల కోరికలని పొదుగుతారు రచయిత.

“తెల్లచీర జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా అమ్మ చెప్పే పెళ్లిమాట జ్ఞప్తికి వస్తుంది. పెళ్లిమాట తలపుకి వచ్చినప్పుడల్లా ఆ వెధవ కనకారావు తలపుకి రాకుండా ఉండడు.

వాడే కనకారావు. అన్నయ్య క్లాస్‌‌మేటు.

వెధవ.”

ఇది కథకి కీలకమైన  సంఘటన. కానీ, సుదీర్ఘంగా, వెగటు పుట్టేలా వివరాలు ఇవ్వకపోవడం విశ్వనాథశాస్త్రిగారికే చెల్లింది. అది పాఠకులమేథకి వదిలేశారు ఆయన. దేశకాలపరిస్థితులదృష్ట్యా పాఠకులు తేలిగ్గానే ఊహించుకోవచ్చు.

రావిశాస్త్రిగారి  శైలిలో నాకు అమితంగా నచ్చినవిషయం  ధ్వని (సజెషన్). కథ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అనిపిస్తూనే, మరోపక్క పాఠకులు ఆలోచించుకోవలిసింది బోలెడు ఉంటుంది.

కథ చదవడం అయిపోయినతరవాత  పాఠకులమెదడుకి పని పెట్టేవి ఇవే. ఈమధ్య నేను కె.కె. రంగనాథాచార్యులుగారి  పుస్తకం, “తొలితరం తెలుగు కథానిక” చదువుతుంటే నాకు డి. ఎ. నరసింహంగారి అభిప్రాయం ఒకటి కనిపించింది. ఆయన చిన్నకథకి ఉండవలసిన ఆరు సూత్రాలు వివరిస్తూ, “రచయిత పాఠకులకిచ్చేది చాలా తక్కువ. తానిచ్చినదానికంటె పదిరెట్లెక్కువ పనిని పాఠకునికి కల్పించి పెడతాడు”” అన్నారు. అది 1920వదశకంలో.  ఈమధ్యకాలంలో వెంకటసుబ్బయ్యగారు కూడా “నామేథని శంకించే కథలంటే” ఇష్టంలేదన్నారు. రావిశాస్త్రిగారు కూడా ఆకోవలోనివారే అనిపిస్తుంది వారి కథలు చదువుతుంటే.

నిజానికి, “జరీఅంచు తెల్లచీర” కథ వర్థమానరచయితలకి ఒక పాఠ్యాంశం అనుకోవచ్చు. కథాంశం అనిపించని ఒక అతిసామాన్యమయిన వస్తువుని తీసుకుని కథలెలా అల్లడమో నేర్చుకోవాలంటే ఈకథ నిశితంగా పరీక్షించి చూస్తే తెలుస్తుంది.

పేజీలు: 1 2

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.