ఊసుపోక – నాన్యెకడమీకం

(ఎన్నెమ్మ కతలు 54)

అమెరికాలో బ్రాహ్మణీకం ఉంది. అంటే తెలుగుదేశంలో బ్రాహ్మణుడిగా పుట్టి ఏ ఇంజినీరింగో చదివి, అమెరికాలో నిత్యానుష్ఠానకర్మలాచరిస్తూ తమ బ్రాహ్మణీకాన్ని నిలబెట్టుకుంటున్న సద్బ్రాహ్మణుల మాట కాదు నేను చెప్తున్నది.ఎవరికైనా ఏదో ఓ రకం నిష్ఠ ఉండడం మంచిదే. అది వేరే విషయం.

ఈకత నాన్యెకడమీకంగురించి. ఈ బ్రాహ్మణీకం వేరు.

ముందు ఎకడమీకం అంటే ఏమిటో చెప్తాను. అమెరికాలో కొందరు పదహారణాల లేక నూటికి రెండువందల శాతం మహాశ్వేతలు ఉన్నారు. బ్రిటన్ నించీ వలస వచ్చి అమెరికాలో స్థిరపడి, తమ ధన, జ్ఞాన ఇంకా అనేకానేక ఆధిక్యతలని బహు అప్రమత్తతో పరిరక్షించుకుంటూ వస్తున్నారు. వారికి బోస్టన్ బ్రామిన్స్ అని పేరు. మనం తెల్లవాళ్లనుండీ అంకించుకున్న లక్షలమాటలకి ప్రతిగా వాళ్లు కూడా ఆంధ్రనామవిశేషాలు కొన్ని తీసుకున్నారు – నిర్వానా, కర్మా, కరీ లాటివి. వాటిలో బ్రామిన్ అన్నపదం ఒకటి. ఇక్కడ “మి” అనే అనాలి “హ్మి” కాదు. ఇంగ్లీషు గుణింతాల్లో హెచ్చుంది కానీ అది ఉచ్చారణలో అచ్చిరాదు. అది అవాచ్యం.

ఈ బ్రామినులు సంగతి – వారిలో ఒకాయన ఒక శుభముహూర్తంలో ఒక క్లాసు సృష్టించి బోస్టన్ బ్రామినులని నామకరణం చేసేట్ట. అర్థమయింది కదూ. ఈ వీర బ్రామినులకి అచ్చంగా మనదేశంలో ఉద్దండ పండితమ్మన్యులకు గల పరపతి  ఉంది. వీరు వివాహాది శుభకార్యాలు కూడా తమ ప్రత్యేకవర్గ పరిధుల్లోనే చేసుకుంటూ వచ్చేరు చాలాకాలం. కొంతకాలం అయేక నియమాలు కొంచెం సడలించి, తమస్థాయి ఘనాపాఠీ పాండిత్యస్థాయికి చేరుకున్న నాన్‌బ్రామినులని (మీరు speed read చేస్తే నాన్ ‌భామినులు అని చదవగలరు, జాగ్రత్త!) తమలో కలిసిపోనిచ్చేరుట. అలా కొంత కులాంతరీకరణ జరగనిచ్చేరు కానీ ఆ బోస్టన్ బ్రామనీకం కళలు మనకి తగుల్తూనే ఉంటాయి ఎక్కడో అక్కడ ఏదో రకంగా.

ఈబ్రామినులని ఇంగ్లీషులో ఎకడమికులు అని కూడా అంటారు. వీరు ఘనాపాఠీచదువులు చదువుకున్నవారూ ఆపైన ఆ చదువుకున్నవి అవలీలగా “కోట”గలవారూ అయి ఉంటారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏంవన్నారో మంచినీళ్లప్రాయంగా ఒప్పజెప్పేయగల్రు ఈ పండితులు.

ఇదంతా ఇప్పుడెందుకొచ్చిందీ అంటే మొన్ననోరోజు ఒక స్నేహితురాలు నావ్యాసాలమీద వ్యాఖ్యానిస్తూ, “మీరు యూనివర్సిటీలో ఉన్నా మీ రాతలు నకెడమీకంగా ఉంటాయి” అంది. అంటే  న-ఎకడమిక్ అనిట, నసాంకేతికంలాగే కాబోలు.

అదీ ఈ సోదికి నాంది. నేను మాత్రం దాన్ని కొంత సవరించి, నాపట్ల నాన్యకెడమికం అనడం సబబు అనుకుంటున్నాను. non-ఎకడెమిక్ అని కానీ, నా-అన్య ఎకడమీకం అని కానీ అర్థం చెప్పుకోవచ్చు. ఇది నాకు ఉభయత్రా అన్వయించుకోవచ్చు.

నేను ఎకాడమీలో చాలాకాలమే ఉన్నా, నాకు ఎకడమీకం ఒంట బట్టలేదు. వారి సర్కిల్ పొలిమేరల్లో నామమాత్రంగా ఉంటూ తాటిమీద సాము చేస్తూ వచ్చేను. ఇది మొదటి వివరణ. రెండోది, బోస్టను బ్రామినులలాగే ఇక్కడ ఎకాడమీ కూడా వారి వర్గాన్ని పరమఛాందసంగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు. అంటే ప్రతి ఎకడెమిక్కూ ఎన్ని పుస్తకాలు ప్రచురించేరు, ఎన్ని కాన్పరెన్సులకి ఎటెండయేరూ, ఎన్నిటిలో కాయితాలు సమర్పించుకున్నారు, వాటికి స్పందన ఎవరిదగ్గర్నుంచీ ఎలాటిది వచ్చింది – ఇలా వివిధరీతుల అడ్డంగా నిలువుగా అడ్డదిడ్డంగా కొలతలు కొలిచి వారి స్థానాలు నిర్ణయిస్తారు. అది ఎకడమిక్ పద్ధతి.  అంతే కానీ “ఏదో యూనివర్సిటీముంగిట అప్రాచ్యులచేత అఆలు దిద్దించేను” అంటే చాలదు. అవ్విధమున నేను విశ్వవిద్యాలయాల ఎల్లల్లో నానెకడెమికుగానే మిగిలిపోయేను గోడమీద పిల్లిలా. పెరిఫరీమీదే ఆగిపోయాయి నా సర్కస్ ఫీట్లు.

రెండోఅర్థంలో అన్యఎకాడమీ ఎలా అంటే విశ్వామిత్రుడి త్రిశంకుస్వర్గంలా, ఉత్తర, దక్షిణ అమెరికాలలో మూడో అమెరికాలా ఇది నేను సృష్టించిన ప్రపంచం. నా ఈ “అన్య” ప్రపంచంలో, నాకుగాదులు లేవు ఉషస్సులు లేవు, కాలమానాలు లేవు, కుల కొలమానాలు లేవు.

“మీకథల్లాగే” అంటున్నారెవరో అల్లంత దూరంలో. లేక కలగంటున్నానో … అవును మరి. నాకథల్లో కాలం అయోమయం. కులం (ఎకడమీకం) అగమ్యగోచరం. “కుంచం తిరగేసి కొలవాలి మీకథల్లో ఏముందో చూడాలంటే” – మళ్లీ అక్కడినుండే విసుర్తున్నారెవరో అక్షరతూణీరాలు. నిజ ఎకడమీషియను కానోపు. కానీండి. ఆ విధంగా కూడా నా ఈ ప్రతిపాదనకి బలమే. నా వాదన బలం ద్విగుణీకృతమాయెను ఎకెడమీకులభాషలో. అంతకంత అయింది నాభాషలో.

నాన్యెకడమీకం అంటే స్పష్టంగా, నాకథల్లోలాగ కాకుండా, ఏ సందేహాలకీ తావు లేకుండా, నిర్ద్వంద్వంగా, నిర్దుష్టంగా, విషయం వివరింపబడి ఉండవలె. అంటే ఏ ప్రశ్నకి ఆస్కారం లేకుండా, స్పష్టంగా, సాధికారకంగా,  ఉండాలి. అంటేనా? అదేనండీ స్పష్టంగా, నిస్సందేహంగా, సాపేక్షకంగా ఉండాలి. అంటేనా  …

సరే, మరోలా చెప్తాను.

ఉదాహరణకి, మీరు “ఏమండీ ఆయనెవరు?” అని అడిగేరనుకుందాం ఒకాయనని.

ఆయన బోస్టన్ బ్రామిను అయితే, “ఏ లీలన్ నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వనివ్యంగ్య శబ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన” ఆ రూపాన్ని అంటూ డొంకతిరుగుడుగా ఉపమ, ఉత్ప్రేక్ష, ధ్వని, వ్యంగ్యం, లాటి విశేషాలతో కూడినభాషకి అలవికాని ఆ రూపాన్నిగురించి ఏం  చెప్పను?” అంటారు. అది ఎకడమిక్. లేదా,

రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణిపతికి
.. లాటి వాక్యమేదో కూడా చెప్పొచ్చు. ఇది గోడమీద పిల్లివాటం. ఎందుకంటే ఈపద్యపాదంలో ఒక్కొక్క మాటకీ నాలుగేసి అర్థాలు ఎక్కలాగి చూపవచ్చునట. నాకు తెలీదులెండి. అంతర్జాలంలో విజ్ఞులు విడమరిచి చెప్పేరు. ఇలా చెప్పగలగడం నిజ జన, సాధుశీలక ఎకడమీకం. అలా చెప్పలేకపోతే నాన్యెకమీకమే శరణ్యం రెండర్థాలలోనూ.

“ఉపమా లేదూ, దోశా లేదు ఆయనపేరూ, ఊరూ, ఉజ్జోగం, వీలయితే అమ్మవంక చుట్టమో అబ్బవంక చుట్టమో చెప్పండి, చాలు” అని మీరు కసిర్తే మీకు ఎకడమిక్లక్షణాలు ఎక్కడా మచ్చుకైనా లేనట్టే లెక్క.

“అదేంటండీ అలా అడుగుతారు. నిన్న ఆ రావుగారి మావగారింట్లో చూళ్లేదూ … వారి తోడల్లుడి బావమరిది. …” ఇలా చెప్పుకుంటూ పోతే అది నాన్ ఎకమీడకం.

“ఆయనా, మ్, ఆ .. ఆయనే కదూ … ఎక్కడ చూశాను చెప్మా… మ్ .. ఆ ….” ఇలా దిక్కుల్చూస్తూ సాగదీస్తే అది నాన్యెకడమీకం.

ఇలా చెప్తుంటే నాకు మరేదో పద్యం జ్ఞాపకం వస్తోంది. ఇలా కూడా చెప్పొచ్చేమో?

వారును వారు వారు వారును మీరు వారు మీరును మరి వారు మీరు

వారును మీరు మీరు వారును వారు మీరు వారు మరి మీరు వారు

అనొచ్చు. అంటే మీరూ వారూ, లేక మీరూ మీరూ ఉండగా వేరేవారేల అని అర్థం అనుకుంటా.

ఇదేమిటి కందపద్యమా చేమపద్యమా అని అడక్కండి. పోనీ, దురదకంద పద్యం అనుకుందురూ – రాయాలన్న దుగ్ధతో రాసిన పద్యం అన్న విస్తృతార్థంలో.

అన్నట్టు మీకు తెలుసా. వెనకటికి ఓ గురువుగారిదగ్గర ముగ్గురు శిష్యులుండేవారుట. అఖండ ప్రజ్ఞానిధులు. గురువుగారు ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు ఠక్కున వారికి వచ్చేసేదిట. నాకలాటి విద్యార్థులుంటే ఎంత బాగుండూ అని ఏ పంతులయినా ముచ్చటపడేలాగ.

వారిలో ఒకడు ఏకసంథాగ్రాహి. గురువుగారు ఒక్కసారి చెప్తే చాలు, ఠక్కున ఒప్పచెప్పేసేవాడు మరుక్షణంలో. రెండోవాడు ద్విసంథాగ్రాహి. ఆ ఇద్దరు చెప్పిందీ విని వల్లె వేసేవాడు. మూడోవాడు  … గ్రహించేరు కదూ త్రిసంథాగ్రాహి అని. మూడుసార్లు విన్నతరవాత అతనికి కంఠోపాఠం వచ్చేసేది.

ఒకసారి గురువుగారికి తన శిష్యులప్రతిభని దేశం నలుమూలలా చాటాలకి బుద్ధి పుట్టింది.  ఆయన తన ముగ్గురు శిష్యులనీ వెంటబెట్టుకుని నానారాజ సందర్శనానికి బయలువెడలేరు. ప్రతి రాజసభలోనూ సవాలు చేసేవాడు “నాశిష్యులకి సాహిత్యం అంతా కరతలామలకం (ఈమాటకి అర్థం కావాలంటే చూ. కొత్తపాళీ తెలుగుపాఠాలు). వారికి తెలియని కావ్యం లేదు జగత్తులో అన్చెప్పి, కావలిస్తే పరీక్షించుకోండి. మీరు చెప్పినపద్యం వాళ్లు తిరిగి చెప్పలేకపోతే, నేను మీకు దాసుడనవుతాను” అనో అలాటిదే మరోటో ప్రమాణం చేసేడు.

ప్రతిసభలోనూ అప్పటికప్పుడు ఆశువుగా చెప్పినపద్యాలు కూడా ఈ ఏక, ద్వి, మరియు త్రిసంథాగ్రాహులు గుక్కతిప్పుకోకుండా ఒప్పచెప్పేస్తుంటే కవులు తెల్లమొహం వెయ్యాల్సి వచ్చింది. సరే, ఆ తరవాత అన్నికథల్లోలాగే రాయలవారి సభకి వేంచేసేరు ఈ గురుశిష్యులు. అక్కడ కూడా అష్టదిగ్గజాల్లో ఒకరో ఇద్దరో ఆశుకవితలు చెప్పి వేసారిపోయేరే కానీ ఈ శిష్యులని బోల్తా కొట్టించలేకపోయేరు.

అప్పుడు రామకృష్ణుడు ఒక పద్యం చెప్పేడు. ఆయనకే కదా ఇలాటి దండుపండితులని ఓడించేయగల సత్తా ఉన్నది. ఆయన ఓ పద్యం చెప్పి, “ఏది చెప్పండి చూద్దాం” అన్నాడు.

అలవాటు ప్రకారం ఏకసంథాగ్రాహి అందుకోబోయేడు.

అప్పుడు రామకృష్ణుడు, “నువ్వు కాదు. ఆరెండోవాడిని మొదట చెప్పమను,” అన్నాడు.

ఇంతే కథ.

ఈకథ విన్నప్పుడు నాకు మరో ఉపకథ గుర్తొచ్చింది. నాకాలేజీ రోజుల్లో ఇప్పుడు వస్తున్న for dummies పుస్తకాలలాటివి అప్పుడు కూడా వచ్చేవి. అసలు అదే మొదలేమో కూడా. వాటికి పుస్తకంపేరుకి made easy అని తగిలించి అమ్ముకునేవారు. షేక్స్‌పియర్ మేడీజీ, మిల్టన్ మేడీజీ … ఇలాగ. ప్రతి పుస్తకానికీ సంగ్రహంగా అందులో ఏం ఉందో చెప్పి, వాటిమీద వచ్చిన విమర్శలన్నీ ఓచోట ఫక్తుగా అమర్చి అందించేసేవారు పరీక్షలు రాసే విద్యార్థులకి. అవి చదివితే చాలు మరింక ఒరిజినల్స్ చదవక్కర్లేదు.

ఇప్పుడు కూడా అలాటి సదుపాయం ఉంది. అంతర్జాలంలో ఓగంట వెచ్చిస్తే చాలు మన తెలివి మేడీజీ. దీన్ని కూడా అన్యెకడమీకం అనే అంటాను. అపార్థం చేసుకోకండి. నిజంగా ఒరిజినల్సు చదివి, అధికంగా అంతర్జాలంలో విషయసంగ్రహణకోసం వెతికేవారు కూడా ఉన్నారులెండి. అది వేరే సంగతి.

ఎకడమీకులం అని చెప్పుకు తిరిగేవారిలో ఈ అన్యెకడమీకం కాళ్లు కాపోతే కీళ్లు పట్టుకుని పబ్బం గడిపేసుకునేవారున్నారు. మీకు తెలుసో తెలీదో వారానికోమారు పుస్తకాలషాపుకి వెళ్లి, కొత్తగా వచ్చిన పుస్తకాలు గబగబా తిరగేసి,  అందులో ఏం ఉందో సుమారుగా గ్రహించేసి, బయటికొచ్చి తమ మేధాసంపత్తిని చాటుకునేపండితులని నేను నిజంగానే చూశాను.

అంతెందుకూ … ఈ టపాలోనూ, ఇంకా నా ఇతర టపాల్లోనూ పెట్టిన పద్యాలు చూసి మీరేమో ఇది సాహిత్యబ్లాగు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసులెండి. మాలాకుమార్ బ్లాగులో చూశాను :) .

ఇది నా నాన్యెకడమీకం అని చాటుగా అనుకునేవారున్నారని కూడా నాకు తెలుసు. నిజమే. అంతర్జాలంలో ఓ పావుగంట వెచ్చించి తెచ్చుకున్న తెలివిది. అందుకే మళ్లీ మీరూ మీరూ వారూ మీరూ – అందరూ “నిజంగా ఆవిడకేం తెలీదు. నెట్లో చూసి గూట్లో ఎట్టేసుకుంటోంది” అనకుండా, నేనే ఒప్పేసుకుంటా. ఇది మదీయ నాన్యెకడమీక గుణాల్లో ఒకటి.

ఇంతకీ నేను చెప్పేదేమిటంటే పైన చెప్పినలాటి నాన్యెకడమీకులు ఏకాలంలోనూ ఉన్నారు. నామటుకు నాకు ఏ ఎకడమీకమయినా ఒకటే, ఏరాయయితేనేం పళ్లూడగొట్టుకోడానికి అనీ.

కనీసం నాకిలా పోచికోలు కబుర్లు చెప్పుకోడానికి పనికొచ్చింది నేను చదివిన కాలేజీ మరియు యూనివర్సిటీ చదువంతా (కళ్ల నీళ్లు ఒత్తుకుంటూ.)

(23 మే 2010)

16 Responses to ఊసుపోక – నాన్యెకడమీకం

  1. మాలతి అంటున్నారు:

    ఇందుగారూ, :) . సంతోషం.

  2. malathi అంటున్నారు:

    @ teresa, అయ్యో సోమవారం పెట్టేశానా. ప్చ్. ఇకమీదట జాగ్రత్తగా చూసుకుంటానండీ. ధన్యవాదాలు.

  3. teresa అంటున్నారు:

    ఈ ఊసుల క్లాసు నాన్యెకడమీకమంటూనే , సొమవారం పెట్టేశారా.. నాకు మాత్రం ఈ వీకెండ్కి భలే పసందైన విందు :)
    one of your best malati garu!

  4. మాలతి అంటున్నారు:

    @ చదువరి, నాకు నాన్యెకడమీకమే అచ్చొచ్చిందంటారు. మళయాళంకారం. హా. నాకు తోచలేదు. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.:)
    @ కొత్తపాళీ, ఓ, కన్యాశుల్కంనాటికే ఉందా ఈ మేడీజీ, దాని విపర్యయం. బాగుందండి.
    @ వైదేహి, థాంక్స్ నీకు బాగున్నందుకు సంతోషం.
    @ భావన, థాంక్స్. అలా నవ్వుకుంటూ ఉండండి. మీరు కూడా నాన్యెకడమీకులే కాబోలు. హీహీ
    @ జ్యోతి, ఊసుపోతే, అటే పోతాను కదండీ. ఇంకేం కబుర్లూ ఉండవు. ఇదే బాగుందిలెండి. చాలాకాలం తరవాత ఇటొచ్చేరు. థాంక్స్.

  5. జ్యోతి అంటున్నారు:

    ఓహో! నాన్యెకడమిక్కంటే ఇదా?? బాగు బాగు. మీరు ఇలాగే ఊసుపోక కబుర్లు చెప్తుండండి. మేము హాయిగా ముసిముసినవ్వులు నవ్వుతాం.. మాలతిగారు ,, మీరు ఊసుపోక ఇన్ని కమ్మని కబుర్లు చెప్తున్నారే? మరి ఊసుపోతే ఇంకెన్ని చెప్తారోకదా??

  6. భావన అంటున్నారు:

    అబ్బబ్బబ్బ.. ఆడుకున్నారు గా ఎకడమీకులను నానెకడమీకులను. సూపరండి బాబు. ఇకిలిస్తూనే వున్నా చదువుతున్నంత సేపు…

  7. Vaidehi Sasidhar అంటున్నారు:

    Wow!
    This is indeed one of your best “Usupoka”.
    Have not seen you this “Naanyekadamik” of late! :-) Sharp humor/wit too.
    Made me laugh,really !

  8. కొత్తపాళీ అంటున్నారు:

    “షేక్స్‌పియర్ మేడీజీ, ”
    కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశానికి వచ్చేయేడు కొనాల్సిన పుస్తకాల లిష్టు చెబుతూ “కుప్పుస్వామయ్యరు మేడ్డిఫికల్టు” అని చెబుతాడు :)

  9. కొత్తపాళీ అంటున్నారు:

    @citralekha .. Your browser has controls to increase or decrease the letters display.
    in IE – Page–> Zoom

    in FF – View –> Zoom

  10. కొత్తపాళీ అంటున్నారు:

    “నాన్యెకడమీకం ” .. బలే బలే సూపర్ బలే.
    నేను చెప్పాలనుకున్నవన్నీ మొదటే చదువరిగారు చెప్పేశారు.
    చాల్రోజుల తరవాతొచ్చాను మీ బ్లాగుకి. కనువిందయింది. మనసు నిండింది.

  11. చదువరి అంటున్నారు:

    చెడుగుడాడేసారు. మీ కలం తాండవం చేసిందని చెప్పొచ్చు. (ఎకడమీకుల మీద విమర్శగా దీన్నిభావిస్తే ఇదొక చర్నాకోల.) ’ఊసుపోక’లో నే చదివిన అత్యుత్తమమైనవాటిలో ఇదొకటి.

    శీర్షిక చూసి ఇదేదో మలయాళంకారమని అనుకున్నాను.

  12. మాలతి అంటున్నారు:

    @ చిత్రలేఖ, అక్షరాలు నేను ఎంత పెద్దగా పెట్టినా టపాలో ఇలాగే వస్తున్నాయండీ. cntrl + కీలు నొక్కితే, అక్షరాలు పెద్దవి అవుతున్నాయి. ప్రయత్నించి చూడండి. మీకు టపా నచ్చినందుకు సంతోషం.
    మరెవరికైనా మరేదైనా తెలిస్తే సూచించగలరు.
    @ సౌమ్య, :) )

  13. chitralekha అంటున్నారు:

    ఇది చాలా బాగుంది. ధన్యవాదాలు. బ్లాగు టైపు అక్షరాలు మరీ చిన్నవిగా వున్నాయి పెద్దవి చేసికొని చదవడము యెల్లాగో వీలైతె తెలియచేయండి

  14. Sowmya అంటున్నారు:

    =)) Hilarious!

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.