ఊసుపోక – రామునితోక పివరుండిట్లనియె

(ఎన్నెమ్మ కతలు 58)

పొద్దున్నే లేచి నీలితెర తెరిచి ఏదో చూస్తుంటే మొల్లమీద నేనే రాసిన వ్యాసం వచ్చింది తెరమీదికి. మరో సైటులో ఎవరో పెట్టుకున్నారు. అందులో మొట్టమొదట నాకళ్ళ బడ్డది – శవరల … అన్న అక్షరాలు. నేనులిక్కిపడి అయ్యయ్యో, మొల్ల రామాయణంలో పిడకలవేటలా శవసాహిత్యమేమిటి అని గాభరా పడిపోయి. కళ్ళజోడు సవరించుకుని మళ్ళీ చూస్తే, కనిపించింది “శ్రీకంఠమల్లీశవరలబ్ధ”, అంటే శ్రీకంఠమల్లీశ వర లబ్ధ అన్నమాట సరైన విరుపులతో. ఆతరవాత నాబ్లాగులో కల్పన “జల్లితలుపు” అన్న తెలుగుపదాన్ని మెచ్చుకోడం చూశాను. ఆ తరవాత తను ఫోను చేస్తే, వేరే చెప్పాలా  … ఆధునికులకి ఆదిగురువు, తెలుగుసాహిత్యబ్రహ్మ గిరీశంవాక్యం, “నాతో మాట్లాడ్డమే ఓ ఎడ్యుకేషను” అన్నట్టు, తెలుగుపదాలు మనం ఎందుకు వాడాలో ఉపన్యాసం ఇచ్చేశాను. నిజానికి ఇలా నాచేత “తలలు తినవేయబడినవాళ్లు” ఇంకా ఉన్నారు. వీళ్లు ఇంకా నాతో మాటాడుతున్నారు కూడాను. అనగా ఈ నాప్రవృత్తిని లేదా చర్యని సునిశితంగా పరీక్షించి చూస్తే, తేలేదేమిటంటే, వాళ్ళకి కూడా అంతర్గతంగా తెలుగుమీద ఇలాటి సదభిప్రాయమే ఉన్నదనిన్నీ, నేను కేవలం నిమిత్తమాత్రురాలినై ఆ అగ్గి మరింత ఎగసన తోసేనన్నీను.

రామునితోక పివరుండిట్లనియె అన్నది నాచిన్ననాటి తెలుగుక్లాసుల్లో హాస్యం. తెలుగు పద్యాలు సరిగ్గా చదవడం రానివారిని హేళన చేస్తూ… మీరు గుర్తించే ఉంటారు అది రామునితో కపివరుండు ఇట్లనియె అని.

మొన్న ఆదివారం లైబ్రరీకి వెళ్లేను ఆమధ్య తెచ్చిన ఆచంట శారదాదేవీ, శారద పుస్తకాలూ ఇచ్చేయడానికి. తరవాత ఇంకేం తెచ్చుకుందామా అని చూడబోతే దేనిమీద చెయ్యేసినా, “ఇది కాదు,” “ఇది కాదు” అంటూ ఒకేవరసన రిజక్షను బుర్రలో! నాకు హఠాత్తుగా శ్మశానవైరాగ్యంలాగ సాహిత్యవైరాగ్యం వచ్చేసి, సరే, కొన్నాళ్ళపాటు చదవడం మానేద్దాం అనుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగేను. ఆ తిరగడంలో తూలి చిలకమర్తివారి నవ్వులగని మీద పడ్డాను. అది లాగేసరికి, ఆపక్కనే పానుగంటివారి సాక్షి, ఆవెంట భమిడిపాటి కామేశ్వరరావుగారి హాస్యవల్లరీ ఇబ్బడిముబ్బడిగా నామీద పడి ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. వీళ్ళందరూ తెలుగుభాషాభిమానులు. ఉద్దండ పండితులు. అంతకుమించి హాస్యబ్రహ్మలు. వారికి గల కీర్తిమూలంగా “నవ్వెట్లు వచ్చునో తెలుసుకొనుము” అని సవాలు చేస్తున్నట్టనిపించింది కూడా నాకయితే. సరే చూద్దాం అని ఆ మూడు పుస్తకాలూ తెచ్చుకున్నాను. ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ హాస్యబ్రహ్మత్రయాన్ని అభిమానించే పాఠకమహాశయులకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను కొంపలంటుకోకముందే. ప్రస్తుతానికి నాలక్ష్యం కేవలం ఈ పుస్తకాలు చదవబోతే నాకు కలిగిన కష్టాలు వివరించడం మాత్రమే. గానీ ఆ మహానుభావుల్ని కించపరచడం కాదు.

ఇంతకీ, మొదట నేను పక్కన పెట్టేయవలసి వచ్చిన గ్రంథం సాక్షి. అందులో ఉన్నది వ్యంగ్యం కానీ నన్ను హాహా, హోహో అంటూ నవ్వించగల హాస్యం కాదు. వాటిలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు ఈనాటికీ చురుగ్గా తగిలేవే. ముఖ్యంగా తెలుగువాళ్ళు వాడే ఇంగ్లీషూ, మనవిద్యావిధానాలూ, ఎన్నికలూ, కౌన్సిలర్ మెంబరుకి కావలసిన అర్ఙతలూ … ఇలాటివి ఈనాటికీ వాలిడే (అనగా valid). ఇవేమీ మారలేదు. ఇలాటి వ్యంగ్యాలు ఈనాటిరచనల్లో కూడా బహుళంగా కనిపిస్తూనే వున్నాయి. పానుగంటివారి సాక్షి మూలంగా ప్రజలకి ఏమైనా తెలివి వచ్చిందా అంటే మ్. మ్. అంచేతన్నమాట నాకు నిరుత్సాహం.

కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. పానుగంటివారు నవ్వులు ఎన్ని రకాలో వివరించిన తీరు మాత్రం నవ్వు తెప్పించింది.

“ఉహుఁ” అని బండ్లు గనఁబడని పెదవులు విడని మూతి గదలని మొగమున వికాసమ లేని నవ్వు- పైపెదవి మాత్రమ కొంచెముగదలి పై రండుపండ్లు మాత్రమే కనఁబఱచి ధ్వని ఎంతమాత్రమును లేకుండ నవ్విన నవ్వు-అడుగుపెదవి పైపెదవి కొంచెము గదల్చి పై రెండుపం డ్లడుగు రెండుపండ్లును గనఁబఱచి “హు హు హు” అని యిగిలింపు గలుగునట్లు నవ్విననవ్వు-నేరు బాగుగఁ దెఱచి “హాహాహా” యని న్విన వెఱ్ఱి నవ్వు-మొగమేడ్చునట్టుల చేసి “హేహేహే” లతోఁగూడి నవ్విన నవ్వు-ఇట్లనేక విధములుగ వీని బాహ్యచిహ్నము లుండును. వీనికి మొలకనవ్వు-మొద్దునవ్వు-కిచకిచ న్వు-కిలకిల నవ్వు-ఇగిలింపు నవ్వు-సకిలింపు నవ్వు-అని వివిధ నామములు గలవు. (సాక్షి పు. 2) ఇలా సాక్షి మొదట్లోనే ఆయన వివరిస్తారు. ఇక్కడ నేను అక్షరాలూ, గుణింతాలూ, పదాలమధ్య విరామాలు ఉన్నదున్నట్టు ఇచ్చాను. (నా అదృష్టం గౌతమీ ఫాంట్సులో ఇది సాధ్యం).

మరి ఈ నవ్వులన్నీ మనం అనుభవించాలంటే మళ్ళీ ఆయన పుస్తకమే చదవాలి …

చిలకమర్తివారి నవ్వులగనిలో హాస్యం కొంతవరకూ వారికి సమకాలీనం. అంటే వయసు మళ్ళిన పెళ్ళికొడుకులూ, ముక్కు పచ్చలారని పెళ్ళికూతుళ్ళూ … ఈవిషయంలో సమాజంలో మార్పు వచ్చింది కనక నాకు నవ్వు రాలేదు కానీ సంతోషించేను అని చెప్పక తప్పదు. కడుపు చెక్కలయేలా నవ్వేనా అంటే, ప్చ్. లేదు.

ఈ మహారచయితలు సృష్టించిన హాస్యంవల్ల నాకు నవ్వు రాలేదు కానీ ఏడుపొచ్చింది అని చెప్పడానికి విచారిస్తున్నాను. చాలాచోట్ల మాటలకి అర్థాలు తెలీలేదు “అయిసజ్జా” లాటి మాటలు కొంత ఆలోచించగా సజ్జా అన్నది సద్యః అన్న పదానికి వికృతి కనక అయిసజ్జా అంటే ఆవెంటనే అని అనుకుంటున్నాను. అక్కడికీ సాక్షి పుస్తకంలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు కొన్ని కఠినపదాలకి ఇంగ్లీషు అర్థాలు ఇచ్చేరు కానీ మొత్తంమీద ఇలా ప్రకృతులూ, వికృతులూ, ప్రతిపదార్థాలూ కనిపెట్టుకోడంలో కాలం వెచ్చించవలసి వస్తుంటే నవ్వాలన్న స్పృహ ఎలా కలుగుతుంది చెప్పండి ఎవరికైనా.

అలాగే పదానికీ పదానికీ మధ్య ఎక్కడ విరుపో తెలీక కొన్ని వాక్యాలు రెండు మూడుసార్లు చదవ్వలసివచ్చింది. తమ్మిట్లేజన్నంలోనైనా అంటే తమ్మిట్టు ఏ జన్నంలోనైనా అనీ, మీరీండ్రకన్నకూడా అంటే మీరు ఈ ఆండ్ర (ఆడవాళ్ల) కన్నా కూడా అని గబుక్కున నాకు తోచలేదు మరి. అది కొంతవరకూ ఆనాటి కంపోజర్ల వరప్రసాదం అనుకోండి. ఇప్పుడు డిజిటలైజు చేసినవీ అలాగే ఉంటున్నాయి కదా. అంటే మనం సంప్రదాయం నిలబెట్టినట్టే. భాష సరిగ్గా తెలీనివారూ, రానీవారూ చవగ్గా టైపు చెయ్యడానికి పూనుకుంటే ఇలాగే ఉంటాయి అని కొందరు కిట్టనివాళ్ళు విసుగుకొనవచ్చు. మరి మన పుస్తకాలు. వాటిలో ఉండవలసిన ఒరిజినల్ రసాలన్నీ ఇంకిపోయి, పిప్పి మిగులుతుంది. అప్పుడు ఏడుపు కాక నవ్వేలా వస్తుంది మరి.

ఈ మూడు పుస్తకాలమీద ఇది నాసమీక్షావ్యాసం కాదు. వీలయితే తరవాత ఎప్పుడయినా రాస్తాను. ప్రస్తుతానికి మాత్రం నవ్వెలా వస్తుందంటే కథలోనో వ్యాసంలోనో చిప్పిల్లిన రకరకాల హాస్యంతోపాటు, కాగితంమీదో కంప్యూటరుతెరమీదో కనిపించే అక్షరాలూ, వాక్యాలవల్ల కూడా నవ్వొస్తుంది అని అనుకుంటున్నాను.

(ఆగస్టు, 14, 2010.)



4 Responses to ఊసుపోక – రామునితోక పివరుండిట్లనియె

  1. మాలతి అంటున్నారు:

    @ రాగిణి, చాలా చాలా ధన్యవాదాలండీ. నాస్నేహితురాలు చాలా సంతోషిస్తుంది ఈమాట చెప్తే.

  2. raagini అంటున్నారు:

    ఇతర దేశాల్లో ఉండి సాక్షి వ్యాసాల పుస్తకాన్ని కొనాలని అనుకునేవారు
    avkf.org , telugudukanam.co.in లలో ప్రయత్నించవచ్చును
    http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=6625

    ఆనులైన్ లో చదవాలని అనుకుంటే
    http://teluguone.com/sahityam/saakshi/index.jsp

    ఒక భాగం archive.org లో
    http://www.archive.org/details/saakshipartiii022726mbp

  3. మాలతి అంటున్నారు:

    @ అనిల్ అట్లూరి, ఆలోచింపజేయడం నిజమేనేమో… ఈ టపా చదివి ఒక స్నేహితురాలు అర్జంటుగా ఆ సాక్షి వ్యాసాలు చదివేయాలనుంది అంది. ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే చెప్పండి. నాకు మాత్రం అడుగున్నరెత్తున నాతలమీదుగా ఎగిరిపోయేయి :) )

  4. అనిల్ అట్లూరి అంటున్నారు:

    కనీసం “సాక్షి‌” వ్యాసాలు ఆలోచింపజేస్తాయి. భాష సంగతి తరువాత.
    రెండు మూడు దశాబ్దాల కాలం నాటి నవలా సాహిత్యం తెలుగు వారికి ఏం సహయం చేసింది?
    మీరన్నట్టు “..మొత్తంమీద ఇలా ప్రకృతులూ, వికృతులూ, ప్రతిపదార్థాలూ కనిపెట్టుకోడంలో కాలం వెచ్చించవలసి వస్తుంటే నవ్వాలన్న స్పృహ ఎలా ఉంటుంది చెప్పండి..”
    బహుశ “హాస్య రచన” కి కూడ పునఃనిర్యచన కావాలేమో.
    మరి ఏదో ఒక ప్రాంతానికో చేందిన యాసతోనో, మాండలీకలతోనే వెలువడే సాహిత్యం పరిస్థితి ఏమిటి? రేపు వాటికి కూడా ‘తెలుగు తెలుగు పర్యాయపదకోశమ్‌’ ని తయారు చేసుకోవాలా?
    కాసేపు నవ్వుకోవడానికే సాహిత్యం, అచ్చులో పేరు చూసుకోవడానికే రచన, ఆ గుర్తింపు ఇచ్చే ‘కిక్’ కోసమే వ్రాయడం అని నేటి నేటి సమకాలీన సాహిత్యాన్ని “సుసంపన్న‌ం” చేస్తున్న కర్షకులని, వారి సాహిత్యాన్ని ఏమనుకోవాలి?
    పొటిగరాపు వాడు అంటే ఫోటోగ్రాఫర్ అని తెలుసుకోవడానికి ఆనాటి వారికే, చాల మందికి చాల కాలం పట్టింది. నిజమే! ఆ సాహిత్యమ్ లేకపోతే..నేటి సాహిత్యం ఎక్కడుండేది?

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.