ఊసుపోక – ఇంతకంతయితే అంతకింకెంతో!!!

(ఎన్నెమ్మకతలు 62)

నాచిన్నప్పుడు హాస్యానికనుకునేవాళ్ళం. చిన్నవిషయాలకే పెద్ద గొడవ చేస్తే, ఇహ పెద్ద విషయాలకి ఇంకా ఎంత రభసో అని. విషయాలమాట వదిలేస్తే, మన తర్కం చాలా తమాషాగా ఉంటుంది. నిజానికి చాలా చిన్నవిషయానికి పెద్దగొడవ చేసేవాళ్ళు పెద్దవిషయం వచ్చేసరికి “పోన్లేస్తూ…” అంటూ తేలిగ్గా తీసిపారేస్తారు నూటికి తొంభై పాళ్ళు.

“ప్రియతమా! నీకోసం సప్తసముద్రాలూ ఈదుతాను. సప్తగిరులూ లంఘించగలను. ఘోరకీకారణ్యములు సొచ్చి నీదరికి చేరగలను. బడబాగ్నికీలలు చీల్చుకు నీముందు వ్రాలగలను. … ఆదివారంసాయంత్రం వాన పడకపోతే మీయింటికొస్తాను” అన్నాడుట ఒక మహావీర అబ్బాయిలవరు అమ్మాయిలవరుతో.

ఎంతటి అవాంతరాలయినా అధిగమించగల వీరాధివీరుడికి వాన అడ్డు వచ్చిందా అని అడక్కండి మరి. “బియే చదివేవు, బియ్యం కడగడం రాదా?” అన్నట్టే ఉంటుందా ప్రశ్న.

ఆమధ్య నేనో పెద్ద ప్రయాణం పెట్టుకున్నాను. పట్టుమని వెయ్యి మైళ్ళు కూడా లేదు. బయల్దేరేముందు చిన్న దడలాటిది వచ్చింది కానీ “ఏటుండిపోతాది, ఇయాల సస్తే రేపటికి రొండు” అనుకుని వెన్ను చరుచుకుని పెడలుమీద కాలేసి,  రోడ్డెక్కేశాను. జీపియస్ నమ్ముకుని, నానా అడ్డదార్లు తొక్కి, బతుకు జీవుడా అనుకుంటూ ఇల్లు చేరేసరికి తొమ్మిదివందల తొంభైఅయిదు మైళ్ళు మాత్రమే అయింది. అంతే.

మూడువందలయినతరవాత ఆగుదాం అనుకున్నాను కానీ ఒబామా గవర్నమెంటోళ్ళే అనుకుంటా దారిపొడుగునా రిపేర్లెట్టేసి, ఎక్కడా ప్రమాదాలు లేకుండా అరేంజిమెంట్లు చేసేశారు. 70 మైళ్ల స్పీడులో వెళ్ళాల్సిన లేదా వెళ్ళడానికి వీలున్న రోఢ్డుమీద 7 నుంచి 10 మైళ్ళ స్పీడులో కారు నడుస్తుంటే – అక్షరాలా నడుస్తున్నట్టే – ఇంక ప్రమాదాలేమిటి, కునుకుపాట్లు రాకుంటే అదే చాలు.  కొన్ని చోట్ల కారక్కడే వదిలేసి, నడిచిపోతే నయం అని కూడా అనిపించింది.

మొత్తమ్మీద నాప్రయాణం ఎంతో సుఖకరంగా సాగింది. నేరుగా మా స్నేహితురాలింటికి వచ్చేశాను. “వచ్చేసినావా,” అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది నా స్నేహితురాలు సుధ.

వాళ్ళిల్లు ఎప్పుడు నెడతెగక పారు ఏటిఒఢ్డున ఉంది. భలే ప్లాను. ఏ గదిలోంచి చూసినా గంగాప్రవాహం.. ఆహా, సుందరం, బహుసుందరం అంటూ మురిసిపోతూ పెరట్లోకి దారి తీశాను.

“జాగ్రత్త, పాములుంటాయి” అంది సుధ.

“ఏం పాములు? కుడతాయా? విషప్పురుగులా? బురదపాములా? నలికిలపాములా?” అన్నాను కిటికీలోంచి చూస్తూ. నాకేమీ పాములపుట్టలలాటివేమీ కనిపించలేదు.

“కుట్టడం కాదు. చర్మం కింద దూరి అక్కడే కాపురముంటాయి. బొబ్బర్లు తేలి ఒకటే దురద.”

వాటిని చిగ్గర్లు అంటారుట. బొబ్బలకి వేసలైన్ రాసి, వేణ్ణీళ్ళలో తొట్టెస్నానాలు చేస్తే, ఊపిరాడక అవి చస్తాయిట.

తను ఎంతో చక్కగా అవన్నీ వివరిస్తుంటే, నాకు చెప్పొద్దూ అప్పుడే ఒంటిమీద దురదలు వచ్చేసినట్టనిపించింది. . రెండువారాలున్నాను అక్కడ. పెరట్లో అడుగు పెడితే ఒట్టు.

మామూలుగా ఇప్పుడు అందరూ పెద్దచదువులు చదివినవాళ్లే. వాళ్ళు అన్నివిషయాలూ ఎంతో లాజికల్‌గా వివరిస్తారు – ఒకదానికీ మరోదానికీ మధ్య గలసంబంధం, అనుబంధాలూ, కారణకార్యభావాలు గట్రా …

పైనవాన పడితే కింద బురద కనిపించాలి.

ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది.

తప్పు చేసినవాడు శిక్ష అనుభవిస్తాడు ఖాయం.

నీతిగా బతికితే కష్టాలు రావు, రాకూడదు.

- ఇవి నీతి లేక ధర్మసూత్రాలు. కానీ నిజంగా జరిగేది వేరని సకలజనులకు విదితమే. అంటే ఇంతకయితే అంతకి మరింత అవాలి. మామూలుగా అవదు. రెండు రెళ్ళు ఆరయితే, రెండు నాలుగులు ఎనిమిదే కానీ తొమ్మిది అవవు. రెండురెళ్ళు ఆరు అని ఆరుద్రగారన్నా దానికి ఆయనొక లాజిక్కు చూపించేరు. ఆయన చూపించేక ఓహో అనుకున్నాను. (ఎవరికైనా నేనేం మాటాడుతున్నానో అర్థం కాకపోతే – “రెండురెళ్లు ఆరు” అని ఒక డిటెక్టివ్ నవల రాసేరాయన. అందులో రెండురెళ్ళు ఆరు అన్న పదకట్టుకి రెండు రెళ్ళున్నూ మరియు ఆరూను అని అర్థం. అనగా డబల్ టూ అంటారు చూడండి అలాగన్నమాట. 226 అన్నది ఫోన్నెంబరో డోర్ నెంబరో ఏదో నాకిప్పుడు జ్ఞాపకం లేదు.

ఇంతకీ నాగతి తార్కికం – పాలు కొందాం అని బజారుకెళ్ళేను. మామూలుగా నేను అర గేలను కొంటాను. నేను వాడే పాలు – రోజుకి నాలుగు చుక్కలు కాఫీలు కలుపుకోడానికి అరగేలను చాలు. అంతకంటే ఎక్కువ కొంటే నా దినసరి కాఫీలు అయేలోగా ఆ పాలడబ్బాకి కాలం చెల్లిపోతుంది.

ఇంతకీ అరగేలను పాలు 2.99 డాలర్లు అంటే గేలన్ పాలు ధర ఎంతుండాలి? మామూలుగా నేను చదువుకున్న లెక్కలప్రకారం 5.98 కావాలి. రెండు రెళ్ళు నాలుగు అనుకుంటే. పోనీ పెద్ద మొత్తాలు కొన్నప్పుడు కొంచెం తగ్గించడం ఆనవాయితీ కనక 5.95 అనుకుందాం. మరీ మూడు సెంట్లేనా తగ్గింపు అంటారా? సరే, 5.89 అనుకుందాం. హా, హా.. నాలాగే మీరూ లెక్కలేస్తే, మీక్కూడా తర్కంలో తకరారు తెలీదన్నమాటే. ఆషాపులో గేలను పాలు 1.25 మాత్రమే, కారు చవక!

ఆలెక్క ప్రకారం, నేను గేలను పాలు కొని, వీలయినన్నాళ్ళూ వాడుకుని, డబ్బాకి కాలం చెల్లేక, మిగతాపాలు నానెత్తిన పోసుకోవాలి – నాకు క్షీరాభిషేకం.

అలాటప్పుడే విచారిస్తాను మావాళ్ళు నాకు ఏ సీతామహాలక్ష్మి అనో, కనకదుర్గమ్మ అనో ఎందుకు పేరు పెట్టలేదా అని. వెనకటికి రమణి ఒకతె రామచిలుకని తెచ్చి రామ రామ అని పాడుకుంటే కైవల్యం ప్రసాదించేడుట రామయ్యతండ్రి. మరి నేను క్షీరాభిషేకం చేసుకుంటే, ఆమాత్రం కాదా?

ఇలాటి లాజిక్కులు మాటాడినప్పుడల్లా మాఅమ్మ “నీకీ తిక్కవాదనలు ఎక్కడినుంచి వచ్చేయే” అంటూ బాధ పడిపోతూంటుంది. నాదా తిక్క లాజిక్కు అని నాకేమో సందేహం .. ఏమో మరి. -:?!

(14 నవంబరు 2010)

6 Responses to ఊసుపోక – ఇంతకంతయితే అంతకింకెంతో!!!

  1. మాలతి అంటున్నారు:

    @ సుజాత, పాలాభిషేకం – ముందొకసారి నీ టపా- టీవీలో తెలుగుగురించి రాసింది చూశాను. ఈతెలుగుకోసం నేను మళ్ళీ బడికెళ్ళాలేమో! ఇర్వింగ్ కాదు, లిటిల్ ఎల్మ్ అని. ఈ ఏరు చాలా పెద్దదిట – అదే ఏరు ఎన్నో ఊళ్ళు కలుపుతుందేమో..

  2. సుజాత అంటున్నారు:

    హమ్మ, క్షీరాభిషేకం అన్నారు, అంతే చాలు! ఈ మధ్య ఎవరు చూసినా “పాలాభిషేకాలు” చేస్తున్నారు బయట. ఆ మాట నాకు ఎన్ని సార్లు చదివినా అర్థం కాదు.

    ఏటొడ్డున అంటున్నారు, మీ ఫ్రెండ్ వాళ్ళిల్లు ఇర్వింగ్ లోనా? అక్కడ మేమున్నాం కొన్నాళ్ళు!

  3. మాలతి అంటున్నారు:

    @ అనిలు, – తిక్కా, తిక్కన్నరా- హీహీ. మీకు ఆరుద్ర సాహిత్యం అంతా కంఠతాలాగుంది.
    @ Sujata, :) . మీకు కూడా ఎన్నగాను రామభజన చాలా ఇష్టం కదూ..:)
    @ అరుణా, అలాగే మీ అమ్మతో చెప్పనులెండి. మీరు కష్టపడి అయినా చదవడం మళ్ళీ మొదలు పెట్టడమే సంతోషం. అసలు నేను ఈ రాతలు మొదలు పెట్టింది కూడా అందుకే.. మర్చిపోతున్నానని…

  4. Aruna అంటున్నారు:

    Hi Aunty,
    Nice story. Had fun reading it. :)
    Just realized how out of touch I am reading telugu. It took me longer to read than I expected.
    Please don’t tell my mom that :(

  5. sujata అంటున్నారు:

    :D

  6. అనిలు అంటున్నారు:

    గతి తార్కిక భౌతికవాదం మీద టాపాయిస్తున్నారేమో అనుకున్నాను. :)
    తిక్కా తిక్కన్నరా? :) :)
    అణాకొక బెడ స్టాంపు, పలకల వెండి గ్లాసు, రెండు రెళ్లు ఆరు..ఎర్రగుర్రం..పత్తేదారు సాహిత్యం..భలే! చాల రోజులయ్యింది, మళ్ళీ తిరగెయ్యలి వాటన్నింటిని!

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.