జాకీ మిలార్ కి క్షమ కవచం మాత్రమే కాదు. పరమదుర్మార్గులలో కూడా మానవత్వం మేలుకొలిపి, వారిని మనుషులని చేయగల పరమౌషధం.
ఐదారేళ్ళక్రితం జూడీ తన స్నేహితురాలు జాకీ మిలార్‌గురించి చెప్పి పుస్తకం రాస్తున్నానని చెప్పినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించలేదు. పుస్తకప్రచురణ అయినతరవాత నాకో కాపీ ఇచ్చినప్పుడు కూడా నేను వెంటనే చదవలేదు. మామూలుగా నాకు inspirational కథల్లో ఆసక్తి లేదు. ఎంచేతంటే చెప్పలేను కానీ, గొప్పవారికష్టాలు నన్ను అంతగా కదిలించవు. అంతే.
“Because I am Jackie Millar” by Jackie Millar and Judith Gwinn Adrian (2007) – మాత్రం నన్ను ఆపకుండా చదివించింది. ఒక కారణం ఇందులో ఘనాపాఠీ ఉపన్యాసాలు లేకపోవడం అనుకుంటా. దాదాపు మన జానపదవాఙ్మయం తీరులో సాగుతుంది కథనం. ఇంకా చెప్పాలంటే ఇది ఇంటర్వూల సంకలనం. జాకీ మిలార్ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఖైదీలు, “ద ఏక్సిడెంటు”కి పూర్వం ఆమెతో పని చేసినవారు, తరవాత హాస్పిటల్లో పని చేసినవారు – వాళ్ళందరిమాటలు వరసగా వాళ్ళమాటల్లోనే చెప్పేరు, వ్యాకరణదోషాలు కూడా సరిదిద్దకుండా ప్రచురిస్తున్నాం అని చెప్పారు రచయితలు.
సూక్ష్మంగా అన్ని హింసాకాండల్లాగే ఇది కూడా -
నవంబరు 4, 1995.
జాకీ మిలార్ రీడ్స్‌బర్గ్‌లో తన స్నేహితుడు జాన్‌ని చూడ్డానికి తాను కొత్తగా కొన్న ఎర్రటిఆపిల్ రంగు హాండాలో బయల్దేరింది. కారు వాళ్ళగరాజిలో ఆపి లోపలికి వెళ్ళింది. జాన్ వాళ్ళబ్బాయీ జాకీని రెస్టు తీసుకోమని చెప్పి, బజారుకి వెళ్ళేరు ఆపూట భోజనానికి కావలసినసరుకులు తీసుకురాడానికి.
ఆదారిని పోతున్న ఇద్దరు అబ్బాయిలు, జాష్ (15), క్రేగ్ (16) ఇంటినించి పారిపోయే ఉద్దేశ్యంతో బయల్దేరి ఆదారిన పోతూ జాకీకారు చూశారు. తాళాలకోసం ఇంట్లోకి వెళ్ళేరు. తాళాలు దొరికేయి. వాళ్ళ అలికిడి విని జాకీ బయటికి వచ్చింది. అది వాళ్ళు ఎదురు చూడనిది. క్రేగ్ ఆమెని నేలమీద పడుకోమన్నాడు. తలమీద తలగడ పెట్టి షూట్ చేసి, కారు తీసుకు వెళ్ళిపోయేరు. ఆతరవాత పట్టుబడ్డారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ.
జాన్, వాళ్ళబ్బాయి తిరిగి వచ్చేసరికి జాకీ రక్తపుమడుగులో నేలమీద పడి ఉంది, స్పృహ లేకుండా. ఆంబులెన్స్ పిలిచి ఆస్పత్రికి చేర్చేరు. ఆ తరవాత మాడిసన్‌లో యూనివర్సిటీ హాస్పిటల్‌కి తరలించేరు.
జాకీకి కొన్ని నెలలు పట్టింది కోలుకోడానికి. అయితే పూర్తిగా కోలుకోలేదు. ఆమె ఏనాటికీ పూర్వపు జాకీ కాలేదు. శరీరం కుడిభాగం పారలైజ్ అయింది. వరసగా ఐదుమాటలు మాటాడ్డం కష్టం. జ్ఞాపకశక్తి దెబ్బ తింది. కొన్నివిషయాలు వివరంగా గుర్తుంటాయి. కొన్ని గుర్తుండవు. ఆమెమెదడులో గుండుతాలూకు ఏడు తునకలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఒక తునక కంటికి వెనకభాగంలో ఇరుక్కుపోవడంచేత చూపు కూడా పోయింది దాదాపుగా.
ఆ దుర్ఘటన లేక హింసాకాండని జాకీ “ద ఏక్సిడెంట్” అంటుంది. ఆవిడే కాదు ఆమెని తుపాకీతో కాల్చిన క్రెగ్, జాష్, ఆవిడ కుమారులు డెరెక్, చాడ్, సహోద్యోగులు, ఆస్పత్రిలో ఆమెతో పని చేసినవారు – అందరూ “ద ఏక్సిడెంట్” అనే అంటారు. అది హింస కాదు, ఇద్దరు చిన్నపిల్లల తెలివితక్కువతనంవల్ల, ఆలోచించకుండా చేసుకున్న నిర్ణయం మూలంగా జరిగిన ప్రమాదం అని జాకీవాదన.
జాకీ ద ఏక్సిడెంట్‌నించీ (ఇంగ్లీషులో “ద”కి ఉన్న ప్రత్యేక అర్థంమూలంగా మనం కూడా అలాగే అనాలనుకుంటాను) కోలుకున్నతరవాత, జాష్‌నీ, క్రేగ్‌నీ చూడ్డానికి జైలుకి వెళ్ళింది. వాళ్ళ సెంటెన్సింగ్ టైంలోనూ కోర్టుకి వెళ్ళింది. వాళ్ళని “క్షమించేను” అంటుంది.
“ఎందుకు క్షమిస్తావు?” అంటే, “నేను జాకీ మిలార్‌ని కనక” అంటుంది. పుస్తకం పేరు అదే.
ఈ సంఘటన ఆమెజీవితాన్ని, తన ఇద్దరు అబ్బాయిల జీవితమే కాదు అనేకమంది స్నేహితులూ, చుట్టాలూ, ఆమెకథ విన్న ఖైదీలు, – ఎంతోమంది జీవితాలను మార్చివేసింది.
జాకీ క్రమంగా ఇతర నేరస్థులతో, పోలీసు డిపార్ట్‌మెంటులో వివిధస్థాయి ఉద్యోగస్థులతో, rehabilitation therapistsతో, క్రిమినల్ జస్టిస్ విద్యార్థులతో, హైస్కూళ్ళో మాటాడుతోంది. మాటాడుతోంది అని ఎందుకంటున్నానంటే ఆవిడ ఇచ్చేవి ఉపన్యాసాలు కావు. వాళ్ళతో స్నేహపూర్వకంగా మాటాడుతుంది. ఒకొకరిగురించి అడుగుతుంది. అప్యాయంగా కౌగలించుకుంటుంది. వాళ్ళకి తనకథ చెప్తుంది.
ఆమెకి ఖైదీలదగ్గర్నుంచీ ఉత్తరాలు వస్తుంటాయి. జైలు కౌన్సిలర్లు చెప్పే పాఠాలకంటే జాకీకథ ఆమెనోట వినడంవల్ల తమకి తమ దుశ్చర్యలఫలితాలు ఎక్కువగా అర్థమయేయంటారు చాలామంది నేరస్థులు.
నేరస్థులని జైళ్ళలోకి తోసేయడంతో, వాళ్ళకి రిహాబిలేషను పాఠాలు వల్లించేయడంతో వాళ్ళని మనుషులుగా మార్చడం జరగదు. ఈ రిహాబిలిటేషన్ ప్రాసెస్‌లో విక్టిమ్స్‌కి కూడా పాత్ర ఉంది అని జాకీ ప్రతిపాదన. నేరస్థులకి ప్రేమంటే ఏమిటో చూపాలి. వారు చేసినవి – not crimes, bad choices అంటుంది జాకీ మిలార్.
ఈపుస్తకం రాయడానికిముందు జాకీ దూరపుచుట్టం ఒక పాట రాసేడు “ద ఏక్సిడెంట్” గురించి. తరవాత ఈ పుస్తకం రాయడం జరిగింది. పుస్తకంతో పాటు ఆ సిడి కూడా దొరుకుతోంది అనేకచోట్ల. కీవర్డ్ Jackie Millar అని టైపు చెయ్యండి.
రెండేళ్ళక్రితం జాకీకి జఫర్సన్, జాకీ ఒనాసిస్ ఎవార్డులు లభించేయి. విస్కాన్సిన్లో అనేక సేవాసంస్థలు, విద్యాసంస్థలూ ఆమెని సత్కరించేయి. ఈలింకు చూడండి.
http://washingtonscene.thehill.com/party-events-pictures/archive/5559-2010-jefferson-awards
ద ఏక్సిడెంట్‌మూలంగా తనజీవితం మారిపోయింది. దానికి మరొకరకం అర్థం ఏర్పడింది అంటుంది జాకీ.
జాకీ క్షమాగుణం అవతలిమనిషిలో మానవత్వం మేల్కొల్పడమే కానీ అదొక easy way out కాదు.
2007లో అనుకుంటాను ఓప్రా షోలో జాకీ, పెద్దకొడుకు చాడ్ వచ్చేరు. 2015లో క్రెగ్ పెరోల్ హియరింగ్ ఉంది. ఆసమయంలో జాకీ క్రెగ్ తరఫున మాటాడుతుందా అన్నది చాలామందికి కలిగే సందేహం.
“నేను మా అబ్బాయి ఛాడ్‌కి మాటిచ్చేను క్రెగ్‌తరఫున వాదించనని. అంచేత మాటాడను” అంది జాకీ.
“అతనిచర్యమూలంగా నేను ఆజన్మాంత ఖైదీని అయేను. మా అమ్మ ఆజన్మాంత ఖైదీ. మాకు పెరోల్ లేదు. వాళ్ళకి మాత్రం ఎందుకుండాలి?” అన్నాడు చాడ్.
“మాబంధువులు కొందరు నేను జాకీని నాతరఫున చెప్పమని అడగాలి అంటారు. కానీ నేను అడగను.” అన్నాడు క్రెగ్. ఆ అబ్బాయి అంతగా మారిపోయేడు. తన దష్కృత్యానికి ఫలితం తాను అనుభవించాలి అని మనస్ఫూర్తిగా నమ్మేస్థాయికి ఎదిగేడు.
ముందు టపాలో మనుషులు మారరు అని నేను నమ్ముతానని చెప్పేను. ఏంటో నానమ్మకాలు వమ్ము చెయ్యడానికి ఇలాటివాళ్ళు పుడతారు కాబోలు.
ఇప్పటికీ నాకు సందేహమే. జాకీలాటి విశాలహృదయులు ఎంతమంది ఉంటారు. నేరస్థులలో క్రెగ్‌లా జ్ఞానోదయం కలిగినవారు ఎంతమంది ఉంటారు.
ఏమో.. చాలామందే ఉంటారని ఆశిద్దాం. లేకపోతే నిద్ర పట్టదు.
(డిసెంబరు 24, 2010. )
@ కల్పనా, నిజమే. జాకీ మిలార్ వంటివారిని మనం కనీసం అప్పుడప్పుడూ తలుచుకుని మారగలమేమో చూసుకోడానికి కొలమానాలు. అలాటివారు లోకంలో ఉన్నారని తెలుసుకోడమే ఒక ఎడ్యుకేషను. నీకు ఇది నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది.
మాలతి గారు,
మార్పు చాలా బాగా వస్తోంది. మొదటి రెండు భాగాలు చదివి ఆపాను. మిగతా మూడు భాగాలు ఏక బిగిన చదివేశాను. ఈ భాగం లో జుడీ మిల్లర్ గురించి చదవగానే మనసు భారమైపోయింది. నిజమే..క్షమ గొప్ప గుణం కాబట్టే అందరం పాటించలేము చాలా సార్లు. కానీ ఇలాంటివి చదివినప్పుడు మనం కూడా ఆ గుణం అలవరుచుకోవాలని బలం గా అనిపిస్తుంది.
@ లలిత, ధన్యవాదాలు.
@ అభిమాని, నిజమేనండీ. ఇతరులకి చెప్పడం తేలికే కానీ ఆచరణలో పెట్టడం కష్టం. ఏమోలెండి జాకీ మిలార్ వంటివారు కారణజన్ములు అనుకుంటా.
మీకు నారచనలయందు గల అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
sorry Jackie Millar.. avesam lo achu tappu
Mee rachalau maa kutumbam anta chadivi anandistam.
meeru road ride in us gurinchi baaga rasaru. pelli ayina kotallo memu vellina road rides gurtu vachayai.
Jack Miller katha chala inspiring ga undi. Kshama gunam prati okkariki avasaram. nenu cheptu untanu maa amma ki ( nenu aacharana lo pettaka poyina) kshaminchey mummy vallani kshaminchesey… nuvve oka mettu ettu lo untavu eppatiki ani.. Hope I can forgive some people in my life
“నేరస్థులలో క్రెగ్‌లా జ్ఞానోదయం కలిగినవారు ఎంతమంది ఉంటారు.
ఏమో.. చాలామందే ఉంటారని ఆశిద్దాం.” Amen!