మార్పు 4

ఇక్కడ  మూడు దిశలా విస్తరించుకున్న ఆకాశం కనుకొలుకుల్లో ఈ చివర్నించి ఆ చివరికి కనిపిస్తూ – హ్. అదొక అద్భుత అనుభవ. నాకు కలిగిన తొలి ఊహ, “అబ్భ, ఆకాశం ఎంత పెద్దదో” అని!! మాడిసన్‌లో వినువీధి లేదని కాదు. అక్కడ నేను నడిచేదారులకి ఇరుపక్కలా, పెద్ద పెద్ద చెట్లు, చిన్నవీధులూ, అటూ ఇటూ ఇళ్లూ, శిశిరం ప్రవేశిస్తూనే వింతశోభలు పులుముకునే పచ్చనాకులూ, వసంతంతో తొడుక్కొచ్చే కొత్త చివుళ్ళూ – వీటి సొగసులు చూసి ఆనందించడంతో సరిపోతుంది కానీ కనురెప్పలెత్తి పైకి పైపైకి చూడాలని తట్టదు. కనీసం నాకు తట్టలేదు. ప్చ్.

అక్కడున్నన్నాళ్ళూ చెరువులచుట్టూ చెట్లనీడల్లో తిరిగేను. ఇక్కడ బీళ్ళూ, రాళ్ళూ, రప్పలూ, తప్పా తాలూ చుట్టూ తిరుగుతున్నాను.

అసలు నేనిక్కడికి రాగానే నా వాక్ కోసం వీధులు వెతుక్కోవాల్సి వచ్చింది. నాలుగు రోజులు అలా తిరిగేక, మేజర్ హైవే అనిపించే దారినే నడవాలే తప్ప గత్యంతరం లేదని తెలిసిపోయింది. దారిపొడుగునా, గుంపులుగా

గుంపులుగా జనావాసాలు గొబ్బెమ్మల్లా దాదాపు ఒకేరకం కప్పులతో.

పక్కనుంచి యాభైమైళ్ళవేగంతో దూసుకుపోయేకార్లు. సదర్న్ హాస్పిటాలిటీ అంటారు కానీ అలాటి మర్యాదలు కారులు తోలేటప్పుడు మనం అట్టే చూడం. అంటే మీరు పదండి అంటే మీరు పదండి అంటూ మర్యాదలు ప్రదర్శించడం. ఇది నాకు కలిగిన మొదటి ఇంప్రెషను. కానీ నిజానికి వారం పదిరోజులు గడిచేక ఆ మర్యాదలు కొంత కనిపించేయి. నేను దారి దాటబోతుంటే పద తల్లీ అంటూ చేతులూపేవారు కనిపించేరు!

అలాగే రోడ్డుమీద చెట్లూను. ఇక్కడ చెట్లు లేవనీ, ఇళ్ళు ఇరుకు కాదనీ చెప్పేనా … అదీ నిజం కాదు. నా తొలి ఇంప్రెషను తప్పని త్వరలోనే గమనింటేను. నేను నడిచేరోడ్డుమీద చెట్లు కనిపించేయి. అంటే ఇక్కడికి రాగానే నాకు ఉన్నవి లేనట్టూ, లేనివి లేనట్టూ కనిపించేయి కొన్నాళ్ళు ఎంచేతో మరి. అక్కడ మనసులో పడిన ముద్రలబలమేమో.

సైడ్‌వాక్‌మీదె నడుస్తుంటే, కారులు దూరంనించి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరం అవుతుంటే నాకో ఊహ వచ్చింది. వాటివేపు చూడకుండా, అవి కారులు కావు తరంగాలు అనుకుంటే, బంగాళాఖాతంలో విరుచుకుపడే అలలు గుర్తొచ్చేయి.

అలా నడుస్తుంటే, ఆకాశం బారలు చాచుకుని రారమ్మంటూ కౌగలించుకోడానికేమోనన్నట్టు, మీద పడిపోతున్నట్టు ఉంటుంది ఎటు చూసినా. ఇప్పురమున వీధులు విశాలము. చెట్లు కురచ. మనుషులు తక్కువ. కార్లు ఖరీదయినవి అనుకున్నాను సూక్ష్మంగా.

వెనకటి ఊళ్లోలా ఆపులులూ, మేపులులు ఆకాశాన్ని కప్పేస్తూ కన్నులవిందు సేయవు. ఇక్కడా మేపులులున్నాయి కానీ ఇంకా ఎదగాలి. అంటే డల్లస్ ఎదగలేదని కాదు. నేనున్న పల్లె కొత్తదేమో … ఇంకా వివరాలు కనుక్కోలేదు.

అసలే ఊరు చిన్నది. అదున్నది డలెస్ పొలిమేరల్లో. ఆమీదట నేనున్నది దానికి పొలిమేరల్లో. అంచేత ఓ రకంగా నేను టెక్సస్ వచ్చినా రానట్టే ఉంది. అసలు ఎక్కడున్నానో తెలీడానికే నాలుగు వారాలు పెట్టింది. అన్నట్టు మీకు చెప్పలేదేమో నేనిక్కడికొచ్చి ఆరువారాలయింది. రెండువారాలు నాస్నేహితురాలు సుధే నాబతుక్కి పూర్తిగా జవాబుదారీ. అంచేత నాకసలు ఊరు తెలిసొచ్చింది నేను నా అపార్ట్‌మెంటులోకి మారేకే. దాంతో చాలా సంగతులు తెలిశాయి.

అర్జెంటుగా ఓ మిరపకాయ కావాలంటే కారేసుకుని ఆరుమైళ్ళు వేరే ఊరేగాలి. పోస్టాఫీసూ, పోలీసుస్టేషనూ (నాకవసరం రాదనుకోండి, వస్తే మాటే), కూరగాయలదుకాణం – ఎక్కడికెళ్ళాలన్నా రానూ పోనూ పధ్నాలుగు మైళ్ళకి తక్కువలేదు. అంటే అర్థ గేలను గాసయిపోతుందన్నమాట. అంటే డాలరున్నర గేసు పోసుకుని బయల్దేరితే మూడు డాలర్లు పెట్టి అర్థ గేలను పాలు కొంటే, ఆపైన అందుకోసం నేను వెచ్చించినకాలానికి ధర కడితే.

పోతే పోయిందని ఒక డాలరు పెట్టి గేలను పాలూ కొనేశాను. అవి చెల్లడానికి, ముందు పెరుగు తోడు పెట్టదల్చుకున్నాను. సుధకి పెరుగు బాగా తోడుకుంటుంది. ఇండియానించి ఎవరో తెచ్చి ఇచ్చేరుట తోడు! మరోసమయంలో ఐతే వెఱ్ఱి వెక్కిరించినట్టే ఉందంటూ ఎంతో హాస్య, వ్యంగ్యంగా రాసి ఉండేదాన్ని ఈవిషయంమీద కానీ ఇప్పుడు మాత్రం నాకు ఇది సహజసిద్ధంగా సమర్థనీయంగా అనిపించింది. సరే. పాలు చెల్లడానికి కొంచెం ఎక్కవ పెరుగే తోడబెట్టేను. అది చెల్లడానికి మజ్జిగ చేసేను. దాన్ని లస్సీ చెయ్యడానికి రోజువాటరు కొన్నాను. ఇంకా మిగిలిన పెరుగు చెల్లడానికి పెరుగ్గారెలు చెయ్యాలేమో L.  హార్లిక్స్ కూడా కొన్నాను రోజూ పొద్దున్నే తాగొచ్చని అనడం కన్నా పాలు చెల్లబెట్టడంకోసమే అనడం న్యాయం.

“గేలను పాలు చెల్లించుట” నాకు full-time ఉద్యోగం అయిపోయిందని తెలియడానికి నాలుగు రోజులు పట్టింది. కౌపీనసంరక్షణార్థం … వ్యయమే కాదు ప్రయాస కూడాను. ఇదంతా తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది. ఇంత చేసినా ఆ గేలను పాలూ వాటికాలం చెల్లేలోపున ఖర్చవలేదు.

అప్పటికి ఒక కఠోరసత్యం ఠక్కున కొట్టుకుంది నాబుర్రకి. మనం అంటే భారతీయులం సాధారణంగా ఇండియానుంచి రాగానే ఇలాగే ఆలోచిస్తాం. మనకి ధరలన్నీ రూపాయల్లోనే అర్థమవుతాయి. “ఏంటీ కొబ్బరికాయ రెండు డాలరులా, అంటే ఎనభై రూపాయాలా? పెరట్లో పచ్చగడ్డిలా పెరిగే కొత్తిమీర డాలరా? అంటే నలభై రూపాయలు!” అసలేం జరుగుతుంటే మనబుర్రల్లో ఒక యాదృచ్ఛిక కాల్క్యులేటరుంటుంది. మనకి తెలీకుండానే అది ఇలా లెక్కలు గట్టి మనల్ని మందబుద్ధులని చేసేస్తుంది. ఏదేశానికా దేశంలో ఆయా కరెన్సీలో ఆదాయమూ, వ్యయమూ కూడా జరుగుతాయని ఒకంతట రిజిస్టరవదు మనబుర్రల్లో. “నేను ఇప్పుడు టెక్సస్‌లో ఉన్నాను, ఇక్కడ విస్కాన్సిన్ ధరలు కోరుట అమాయకత్వమో తెలివితక్కువతనమో అనబడును” అని నాకు రిజిస్టరవడానికి ఆరు వారాలు పట్టింది.

ఊరుసంగతి అదీ. నీరు సంగతి మరీ విచిత్రం. నా స్నేహితురాలింట్లో మృదువునీళ్ళు. మృదువునీళ్లేమిటి అంటే మరి సాఫ్టువేరులో సాఫ్ట్‌కి మృదువు అంటున్నారు కదా. ఆ పదం వారికి హక్కుభుక్తములు అవునో కాదో నాకు తెలీదు కానీ భావిపండితులతో తలపడతగదు గనుక పనిలో పనిగా వారికి ఇవే నా కృతజ్ఞతలు. అన్నట్టు సాఫ్టువేరు మృదులయంత్రం అయితే మరి హార్డువేరు కఠినయంత్రము అనాలా?

ఇంతకీ మా సుధఇంట్లో నీళ్లు చాలా మృదువు. కాశీమజిలీకథల్లో నవపల్లవకోమలాంగుల సురుచిరహస్తాల్లా అన్నమాట. ఎంత కడుక్కున్నా ఇంకా చేతిని సబ్బున్నట్టే ఉంటుంది. అందుకు పూర్తిగా విరుద్ధం నా ఎపార్ట్‌మెంటులో నీళ్ళు. “నీళ్ళు కావివి రాళ్ళు” అని గట్టిగా చెప్పగలను. రాళ్లతో చేతులు కడుక్కుంటున్నట్టే ఉంటుంది. నురగే రాదు. దాంతో కొంచెం రిసెర్చి చేశాను. ఈ కఠినజలాలు తాగితే అందులో వున్న మినరలులూ అవీ నాఒంట బట్టి నేనేమయినా రాటు తేల్తానేమోనని. అదేం లేదుట. నురగరాదంతే అంటూ చప్పరించేశాయి ఆ వ్యాసాలు. ప్చ్.

సైంటిస్టులకి అట్టే బాధ లేదు కానీ నాకు మాత్రం ఈ నీళ్ళు పడుతున్నట్టు లేదు. వారంరోజులుగా దగ్గు, పడుకుంటే లేవబుద్ధి పుట్టదు. సమయానికి సుధ ఊళ్ళో లేదు కానీ నన్ను వాళ్ళింటికి తీసుకుపోయి. సకలసేవలూ చేసి ఉండేది. ఇలా ఎందుకంటున్నానంటే, పక్కమీంచి లేవబుద్ధి పుట్టదు, కానీ బాగా ఆకలేసి, లేచినతరవాత మాత్రం చక్కగా వంట చేసుకు ముప్పొద్దులా మూడు కంచాలు చెల్లిస్తున్నా. అందులో లోపమేమీ లేదు. హీహీ. పైగా రాత్రీ పగలూ కలిపి రోజుకి కనీసం 10న్నర గంటలు నిద్రపోతున్నా. నిజంగా రోగమో రొచ్చో ఉంటే ఇవి సాధ్యం కావనే నా అనుమానం.

నీళ్ళమార్పు ఇలా ఉంటే, డ్రైవింగుమార్పులు మరింత హుషారిచ్చే కథ. వచ్చే టపాలో వివరిస్తాను.

(డిసెంబరు 30, 2010)

5 Responses to మార్పు 4

  1. Sowmya అంటున్నారు:

    మీ లాగే నేను లీటరు పాలు కొనేసి,అది వారం లో ఖర్చు చేయడానికి నానా అవస్థా పడుతున్నా.
    లీటరెందుకూ అంటే – చిన్న పేకెట్లు కనబడ్డం లేదు.
    వారమే ఎందుకూ అంటే – నాకు పాతబడ్డ పాలంటే చిరాకు…అవి బానే ఉన్నా కూడా.
    అక్కడికీ, వివిధ కారణాల వల్ల రోజుకి ఒకట్రెండుసార్లు కాఫీ మానేసి, పాలు తాగుతున్నా ! :) )

  2. kalpana అంటున్నారు:

    ఈ భాగం చదివి నవ్వటమే సరిపోయింది. అందుకే కామెంట్ పెట్టకుండా వెళ్ళి మళ్ళీ వచ్చి తీరికగా పెడుతున్నాను. పాల భాగోతం బావుంది. సదరన్ హాస్పిటాలిటీ మాత్రం నేను కూడా మీతో పాటే వొప్పుకొను. మిడ్ వెస్ట్ వాళ్ళ కున్న సంస్కారం , ఎవరిని చూసినా నవ్వుతూ పలకరించే వాళ్ళ ఆత్మీయత వీళ్లకు కొంచెం తక్కువే. మూడేళ్ళుగా ఇక్కడే వుంటున్నా నాకు మన విస్కాన్సిన్ వాళ్ళంటేనే అభిమానం ఎక్కువ:-))

  3. మాలతి అంటున్నారు:

    @ శాయిపద్మ, ధన్యవాదాలు. :) )

  4. Sai Padma అంటున్నారు:

    డియర్ మా… మీ టపాలు చదివితే భలే గా ఉంటుంది..యెక్కువ హాహాకారాలు లేని అచ్చమైన తెలుగు నుడికారం ప్లస్ కొంచం వెటకారం…హహ్హహహ..(వివాహ భోజనం తీరులో…

  5. SRRao అంటున్నారు:

    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    SRRao
    శిరాకదంబం

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.