అదే కిటికీలోంచి చూస్తున్నా. నిన్నటికీ ఇవాళ్టికీ ఎంత తేడా!
నాకు ఎక్కడో ఓమూల “నాఇంటికొచ్చిన” అనుభూతి! “I am home!” …
విస్కాన్సిన్ మంచు ఎట్టకేలకు కనిపించింది. తడితడిగా, బురదబురదగా …
ఈదురుగాలిలో అల్లల్లాడుతున్న కలబంద మొక్కలు … నాకు నవ్వొచ్చింది. దాదాపు నాలుగు నెలలు నిత్యసత్యం అయిన వాతావరణం ఇక్కడ ఒకటో రెండో రోజులు … వారం రోజులంటున్నారు కానీ నాకు నమ్మకం లేదు. ఎంచేతంటే 50, 60 డిగ్రీలున్న రోజున కూడా కొందరు రెండంగుళాల మందం కోట్లేసుకు తిరుగుతున్నారు. అంచేత వాళ్ళ పరిభాషలో చలికీ నా చలికీ చాలా తేడా ఉంది.
నేనిక్కడికి రాగానే పాతికేళ్ళ స్నేహితులదగ్గర్నుంచీ కొత్తగా పరిచయం అయినవాళ్లదాకా ప్రతివారూ నాకు చెప్పేరు మంచు పడినప్పుడు వీధిలోకెళ్ళొద్దని.
సరేనన్నానే కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళాలనే అనిపిస్తోంది. వెళ్తే బాగుండు. మీకూ తెలుసు కదా నా చోదకచాకచక్యం. నా చాకచక్యంమీద నాకు గొప్ప నమ్మకం. విస్కాన్సిన్, షికాగోలోనే కారు నడిపేను ఇదెంత అన్నాను వాళ్ళతో గొప్ప పడిపోతూ.
“అదికాదు మాల్తీ, అక్కడ బోలెడు మంచుంటుంది కనక కార్లు తోలేవాళ్ళకి అలవాటు కూడా ఉంటుంది దాన్ని సమర్థించుకుంటూ పోడం. ఇక్కడ మాకు మహా అయితే సంవత్సరానికి రెండు రోజులు, మాకు రోడ్లు క్లియర్ చేసే బండ్లూ లేవు అంత మంచులో కార్లూ నడిపే అలవాటూ లేదు కదా. అంచేత డ్రైవర్లకి ఆ యాదుండదు,” అంది సుధ.
ఆ అమ్మాయితో సరేలే అన్నానే కానీ ఊరుకో బుద్ధి పుట్టలేదు. బయల్దేరేను. తీరా బయల్దేరబోతూంటే బుర్రలో చిన్న పురుగు పొడిచింది – గతనాలుగు వారాల్లో నా కారు నడుపు చరిత్ర చూసుకోమంటూ. … రెండువారాలక్రితం సుధని పిలిచి అడిగితే. ఇండియన్ స్టోరు నాకు దగ్గరే అని చెప్పి, “మాయింటికి లెగసీమీద ఎడంవేపు తిరుగుతావు గద, ఇటు కాక అటు, కుడివేపు తిరిగితే, ఆరోడ్డుమీదే ఉంది,” అంది.
ఒస్ అంతే కదా అని బయల్దేరేను. లెగసీమీదకెక్కి “ఇంకా కనిపించదేం?,” .”ఇంకా కనిపించదేం?” అనుకుంటూ వెళ్తున్నా… రోడ్డు అంతమయిపోయింది కానీ స్టోరేదీ … ఇంతలో … హో హో హో ..
… బ్రేకుమీద బలంగా తొక్కేను, స్టీరింగువీలు గట్టిగా పట్టుకుని, కళ్ళు రెండూ గట్టిగా మూసుకుని … క్షణంలో సగంసేపు… కళ్ళు తెరిచేను. ఎదురుగా ఉన్న ఎలెక్ట్రిక్ పోల్‌కి నాకారూ నేనూ కృష్ణసర్పంలా చుట్టుకుపోయేవాళ్ళం. . తృటిలో తప్పిపోయింది కానీ …
చుట్టూ చూశాను. ఇటువేపో కారూ, అటువేపు మూడు కార్లూ ఆగి చూస్తున్నాయి. ఆ రోజు కనీసం మూడు ప్రమాదాలు తప్పేయి. అవి ఏమిటంటే -
1. నేను ఆ పోలుకి కారుతో సహా ఆహుతి అయిపోలేదు.
2. అటూ ఇటూ ఉన్న కార్లలో ఒక్కటీ పోలీసు కారు కాదు. అయుంటే నాకో పెద్ద టికెట్టొచ్చేది. పెద్ద అంటే మన సన్మానపత్రాల్లా 24 బై 18 అట్టమీద రంగుబొమ్మలతో అని కాదు. కాయితం చిన్నదిగానే ఉంటుంది కానీ దానిమీద అంకె చాలా పెద్దదిగా ఉంటుందిట. ఎంత పెద్దది అని అడగలేదు ఎంత పెద్ద అంకె వినవలసివస్తుందో అని భయపడి.
3. ఇరుగు పొరుగు కార్లవారు ఠక్కున తమ సెల్లు తీసి పోలీసాళ్ళని పిలిచేయలేదు. విస్కాన్సిన్‌లో అయితే ఇది జరిగి ఉండుననే నా నమ్మకం.
ఇంతకీ లెగసీమీద నాకు ఇండియన్ స్టోరు ఎందుకు కనిపించలేదంటే., నేను లెగసీమీద కుడివేపు తిరగలేదు. ఎందుకంటే, అప్పటికి నాకు సుధయింటికి మాత్రమే వెళ్ళడం అలవాటయింది మునిసిపాలిటీ ఎద్దులా … అంచేత తను కుడివేపుకి వెళ్లమందన్నమాట నాబ్రురకెక్కలేదన్నమాట, హీహీ. ఏం చేస్తాం? అసలు ఇక్కడికొచ్చిందగ్గర్నుంచీ నేను దిక్కు తోచనిదాన్నయిపోయేను. అంటే దిక్కులేనివారికి దిక్కు అయినవాడు నాకు మాత్రం కరెక్టు దిక్కులు సూచించుటలేదు. L.
అసలు ఇక్కడ రోడ్లు విశాలం, ట్రాఫిక్కు తక్కువన్నమాట నిజమే కానీ రోడ్ రూళ్ళు మాత్రం విస్కాన్సిన్ రూలులని తలదన్నేలా ఉంటాయి. అక్కడిసంగతులు ముందోసారి మనవి చేసుకున్నాను కదా. (చూ. ఊ,.పో. 17. మహావీరచక్ర)
ఇక్కడ రోడ్డుకి నాలుగేసి లేనులయితే ఉంటాయి కానీ యు-టర్నుకో లేనూ, నేరుగా లేక ఎడమవేపు తిరుగుటకో లేనూ, తీరా ఎడమవేపు తిరిగినతరవాత మళ్ళీ ఎడమవేపుకి మాత్రమే తిరగడానికో లేనూ – ఈలేనులో తిరిగితే ఇందాకా చెప్పిన యు-టర్ను తీసుకుని వెళ్ళినట్టే మళ్ళీ అదే లేనులో తేల్తాం …
ఆ తరవాత నేరుగా వెళ్ళినరోడ్డుమీద ఓ రెండువందలగజాలు వెళ్తే “తప్పనిసరిగా కుడివేపుకి తిరగవలెను” అంటూ ఒక తాఖీదు కనిపిస్తుంది. నిజానికి అక్కడ కుడివేపు తప్ప మరోవేపు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఎదురుగా ఏ మహా చక్రవర్తిగారి కోటప్రాకారమో అనిపించే రాతికట్టడం కనిపిస్తుంది. నేరుగా వెళ్తే దానిని ఢీకొంటాం. ఎడమవేపు చూస్తే సువిశాలంగా టెక్సస్ బంజరుభూములు దర్శనమిస్తాయి. ఇంకెక్కడికెళ్తాం కుడివేపుక్కాక?
అలాటి దుర్గమమార్గందగ్గర కూడా ఓ స్టాపు సైనూ, “ట్రక్కులకి ప్రవేశము లేదు” అంటూ మరో సైనూ. ఎలాగా ఎడమకి లేదు, ఎదటికి లేదు. నో యు-టర్న్ అని లేదు కానీ అంత పెద్ద ట్రక్కులు యు-టర్నంటే మాటలు కాదు కదా .. మరి అక్కడిదాకా వచ్చిన ట్రక్కు ఎక్కడికెళ్తుంది? గాల్లోకి ఎగిరి పొమ్మనా ఈ సిటీ ఇంజినీర్ల అభిప్రాయము? కనీసం ఆ సైనేదో ఆ సందుమొగలోనే పెట్టొచ్చు కదా. నేను ట్రక్కు నడపడం లేదు కానీ నడిపితే మాత్రం ఆ ట్రక్కు తీసికెళ్ళి ఆ ఇంజినీరు ఇంటిముందు పెట్టేసేదాన్ని.
సరి, మీరు ఇంతదాకా చదివివుంటే, ఈసరికి మీకు మహ చిరాకేస్తూ ఉండి ఉండాలి. “సరేనమ్మా, అర్థమయింది నీ అవస్థ. తరవాతికథకి తరలుము” అని మీకు అనాలనిపిస్తుంది కూడా … అదేనండీ నేను చెప్తున్నది కూడా … మీకయితే ఈ ఒక్కసారే కానీ నాకు తెల్లారి లేచి వీధిన పడ్డదగ్గర్నుంచీ దినదినమూ ఇదే మేళం. … ఇలాటప్పుడే నా వయసు నాకు గుర్తొచ్చేది కూడా. అంటే ఇలాటి సందర్భాలు రోజుకి రెండు చొప్పున ఎదురుపడ్డా, ఇన్నేళ్ళకి ఎన్ని అనుభవించి ఉంటానో ఆలోచించుకోండి ….
బహుశా ఈ చట్టాలు తయారు చేసేవాళ్ళని “మీరెందుకిలా అర్థం పర్థంలేని నిబంధనలు పెడతారు?” అని అడిగితే, “మేం చెయ్యగలం కనక,” అంటారేమో? లేక జనాలకి బుర్రల్లేవనుకున్నారో? ఈ రెండోదే నిజం కావచ్చు. లేకపోతే ప్రతి చిన్నవిషయానికీ “మాకు హక్కులున్నాయి, అక్కులున్నాయం”టూ అక్కులు నొక్కుకునే జనాలు ఇలాటి తిక్క నిబంధనలకి ఎందుకు ఎదురుతిరగరు?!
ఈ వీధిభాగోతాల్లాగే ఇక్కడికొచ్చేక నేను శాస్త్రోక్తంగా పాటిస్తున్న మరో కఠిననియమం సీట్ బెల్టు. విస్కాన్సిన్‌లో కూడా అది “లా”యే కానీ ఆ బొంతకి చాలా కంతలున్నాయి – చట్టవిరుద్ధం కానివే. మామూలుగా ఆ పాలియాస్టరు పటకా వేసుకోపోతే పోలీసులు మనని ఆపడానికి రూల్సొప్పవు. మరో ప్రమాదం జరిగితే, అప్పుడు రెంటికీ కలిపి ఇచ్చుకుంటారు తాంబూలం. మరో చట్టసమ్మతమయిన గుట్టు – డ్రైవరు కనీసం ఐదడుగులయినా లేకపోతే ఒక ప్రమాదం జరిగినప్పుడు జరగగల మరో ప్రమాదం ఆ పటకామూలంగా డ్రైవరు కంఠం సమూలంగా నరుక్కుపోగలదు. వేరు చెప్పనేల. ఈరెండు రంధ్రాలతో పాటు, ఇంకా “అది వేసుకుంటే కట్టి పడేసినట్టుంటుంది, నాకు ఊపిరాడదూ, నాకు అదేదో ఫోబియా” .. ఇలా వాదించుకుంటూ దినాలు గడుపుకున్నాను అక్కడ ఉన్నన్నాళ్ళూ.
ఇక్కడికి వచ్చేక, “అదేం పనికిరాదు, ఇక్కడ టిక్కెట్టు చాలా పెద్దది ఇచ్చేగల్రు జాగ్రత్త” అని హెచ్చరించింది సుధ. చెప్పేను కదా అసలు ఇక్కడికొచ్చిందగ్గర్నుంచీ నాకు దిక్కు తోచడం లేదని. అసలే కొత్తమొహం అని ఓ కన్నేసి ఉంచుతారు మామూలుగా అధికారం ఉన్నవాళ్ళు.. వీళ్ళతో పేచీలెందుకులే అని ఆ పటకా ఎంతో శ్రద్ధాభక్తులతో … మంగళసూత్రములంత పవిత్రమయినవిగా … ధరిస్తున్నాను ఇప్పుడు. నాకు అది వేసుకున్నానన్న స్పృహే ఉండడంలేదిప్పుడు, ఆశ్చర్యమ్!
నేను ఇలా ఆలోచించుకుంటుంటే ఫోనొచ్చింది..
సుధ “నువ్వు పార్టీలకి రానంటావు. వీళ్ళందరూ నిన్ను హాబ్స్‌లో చూసినారు కదా. పిలస్తున్నారు. ఒకసారి వచ్చి పోగూడదా?” అంటూ.
నిజం చెప్పొద్దూ, ఇక్కడికొచ్చేక, సుధని చూసి నేను నేర్చుకోవలిసింది చాలా ఉందనిపిస్తోంది ఈమధ్య. అంచేత, “సరేలే. ప్రతిసారీ రానన్నాను కానీ అస్సలు రానన్లేదు కదా. ఎప్పుడు చెప్పు,” అన్నాను.
“ఈ శనివారం. సౌజన్య ఇంట్లో. నేను మీయింటికొచ్చి పిల్చకపోతాలే.” అంది.
సరేనని చెప్పి ఫోను పెట్టేశాను.
ఊరూ, నీరూ, కారూ, ఆమీదట మనవారూ …
(జనవరి 11, 2011)



ఒక రాష్ట్రానికీ ఒక రాష్ట్రానికీ నే ఇంత తేడా ఉందా అయితే!
మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం
@ శారద. ఆ ఒక్కమాటా చాలండీ. సంతోషం
@ కల్పన, బాగుంది. ఒక్కసారి అన్ని భాగాలూ చదివేశావా.. నాకెన్నాళ్లూ పట్టిందో తెలుసా రాయడానికి. ఇంక పాఠకులకోరికపై సాగించాల్సిందే, థాంక్స్.
ఒక్కటే మాట!
))))
Awesome!
మీ శైలీ, సెన్సాఫ్ హ్యూమరూ…
శారద
హాస్యం, మెత్తటి చురకలు, కొన్ని చోట్ల మీదైన కవిత్వ శైలి…ఆపకుండా చదివిస్తోంది ఈ సీరియల్ ని. నేను అన్నీ భాగాలు చదివేశానోచ్చ్..ఇక మీరే తొందర తొందరగా రాయాలి.
చాలా రోజుల తర్వాత బ్లాగుల్లోకి వచ్చి మీ ధారావాహిక చదువుతుంటే…రిలీఫ్ గా వుంది.
@ పూర్ణిమ, – అటువాళ్లం ఇటూ ఇటువాళ్ళం అటూ –
). బావుంది. తరువాయిభాగం త్వరలోనే పెట్టడానికి ప్రయత్నిస్తాను.
అవునండి మాలతిగారు, అంతేకాదు ఇంతకుముందు డల్లాస్ లో వుండేవాళ్ళం. అటువాళ్ళు ఇటు…ఇటువాళ్ళు అటు అయ్యాం
మీ శైలీ చాలా బాగుంటుంది. తరువాతి టాపా కోసం ఎదురుచూస్తూ…
@ పూర్ణిమ, మీ వ్యాఖ్యానం నాకు చాలా సంతోషం కలిగించింది. అయితే మీరు సరికొత్త విస్కాన్సిన్ వాసులన్నమాట
. బాగుంది.
“ఇంకెక్కడికెళ్తాం కుడివేపుక్కాక?” – కేక !!!
మీ బ్లాగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పటివరకు కామెంటు పెట్టలేదు కాని మీ బ్లాగ్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. కాని మీరు విస్కాన్సిన్ దాటి వెళ్ళాక నేను ఇక్కడకు వచ్చాను.
ధాంక్స్ లలితా!
- మాలతి
Glad you are safe.