ఊసుపోక – భావముద్రలు …

(ఎన్నెమ్మకతలు 66)

నిజంగా భావముద్ర అన్న అర్థం చెప్పుకోవచ్చో లేదో నాకు తెలీదు కానీ బాగుందనిపించి, “ఇంప్రెషన”న్న పదానికి సమానార్థకంగా వాడుతున్నా. ఇంప్రెషనంటే ఒక మనిషో ఒక సంఘటనో మన మనోఫలకముపై యాదృచ్ఛికముగా గానీ స్వేచ్ఛగా గానీ వేయు ముద్ర అనుకోండి. స్వేచ్ఛగా అంటే స్వ+ఇచ్ఛగా అనగానే, కావాలని కోరీ వేడీ చేసుకునేది కనక వేయు కాదు వేయించుకొను అనాలేమో

ఏమైనా నేనిక్కడ మాత్రం అంతకంటే విస్తృతార్థంలో వాడుతున్నాను. ఎంత వద్దనుకున్నా ఇలాటప్పుడు నాక్కూడా ఇంగిలీకమే శరణ్యం. అంచేత ఇంప్రెషననే అనుకుందాం ఈ టపాకాలం వరకూ.

ఇంతకుముందోసారి “ఇంతకంతయితే అంతకింకెంతో” వివరించేను. ఇది కూడా ఇంచుమించు అలాటిదే. అంటే కనిపిస్తున్నదాన్ని బట్టి కనిపించనిది కల్పించుకోడం మనమనసుల్లో.

నేను ఈదేశం వచ్చినకొత్తలో – అంటే కుంకుడుకాయపులుసూ, శీకాయపొడితో తలంటుకునేకాలంలో – నాకు ఏ షాంపూ వాడాలో తెలిసింది కాదు. టీవీలో ప్రకటనలూ, షాపులో బొమ్మలకొలువులా పేర్చిన షాంపూ సీసాలూ చూస్తుంటే ఏది నిజంగా నానెత్తిమీదున్న నాలుగుపరకలూ తేలిగ్గా శుభ్రపరుస్తుందో తెలీక అయోమయం అయిపోయింది.

మొదట ఒకరిద్దరిని ఆడిగేను. వాళ్ళకి తోచినవి వాళ్ళు చెప్పేరు. తీరా చూస్తే, అవి నాకు పనికొచ్చేవి కావు. ఎంచేతంటే వీళ్ళందరూ వేరు వేరు కారణాలుగా వేరు వేరు షాంపూలు వాడుతున్నారు. అంటే రకరకాల రంగులు పులుముకునేవారు వాడే షాంపూలు రంగులు మరింత మెరుగుపరిచేవో లేదా ఆ రంగులు వెలిసిపోకుండా కాపాడేవో అయివుంటాయి. అలాగే ఉంగరాలజుత్తులవారు ఉంగరాలు నిలుపుకోడానికయితే, ఉన్న ఉంగరాలు సాపుగా ఇస్త్రీ చేసుకున్నవారు ఆ సాపుదనాన్ని నిలుపుకోడానికీ, కొందరికి తుప్పజుత్తు సరదా అయితే మరికొందరికి నీటుగా అణిగిమణిగి ఉండాలి.- ఇలా వారి వారి అవసరాలనిబట్టి ఎవరికి వారు వారిమార్కు షాంపూ ఎంచుకుంటారు.

మరి నాకేమో జుత్తు శుభ్రంగా ఉన్న ఫీలింగొస్తే చాలు. ఫీలింగేమిటిలెండి. శుభ్రంగా తేలిగ్గా ప్రాణానికి హాయిగా అనిపించేదయి ఉండాలి.

ఒకసారి ఒక అమెరికన్ స్నేహితురాలిగదికి వెళ్ళేను. ఆమాటా ఈమాటా మాటాడుతూ ఆ అమ్మాయి జుత్తు జాగ్రత్తగా గమనించేను. కాస్త నాజుత్తులాగే కనిపించింది. రంగులూ, ఉంగరాలూ, ఇస్త్రీలూ ఏమీ లేకుండా.

“మీ బాత్రూం వాడుకోవచ్చా?” అని మర్యాదగా అడిగి అనుమతి తీసుకుని ఆ స్నానాలగది ప్రవేశించేను. అడుగెట్టగానే ఒక జనెరిక్ షాంపూ సాక్షాత్కారించింది. వెంటనే ఆ పేరు నాతల్లో ఇంప్రెషను అయిపోయింది యాదృచ్ఛికంగానే. మర్నాడు షాపుకెళ్తే, ఆదే పేరు కొట్టొచ్చినట్టు కనిపించింది. కొనేశాను.

తీరా వాడితే, నాకేం బాగులేదు. ఏదో బురద పులుముకున్నట్టు చిరాగ్గా ఉంది. ఆ తరవాత ఆ అమ్మాయిని కలిసినప్పుడు, “నువ్వు ఫలానా షాంపూ వాడుతున్నావని మీఇంట్లో గమనించి, నేనూ అదే కొన్నాను,” అన్నాను.

“ఆహా. నేనూ నీలాగే ఇంకెవరింట్లోనో చూసి కొన్నాను. కానీ నాకేమంత నచ్చలేదు. నీకెలా ఇంది?” అని అడిగింది.

నాచిన్నప్పుడు నేను వేసుకునే గౌనులూ, పరికిణీలూ, జాకెట్లూ అన్నీ మాఅమ్మా లేకపోతే మాఅక్కయ్యా అభిరుచులే. వాళ్ళకేది బాగుంటే నాకది బాగున్నట్టే లెక్క.

ఆమధ్య నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒక స్నేహితురాలింటికి వెళ్తే తను నాకు ఊదారంగు చీరె పెట్టింది. ఎంతో ఆప్యాయంగా. మర్నాడు వాళ్ళ అక్క ఇంటికెళ్ళినప్పుడు ఆ చీరె కట్టుకుని వెళ్ళేను, తను కూడా వస్తుంది, సంతోషిస్తుందని. ఇహ అడక్కండి. ఆ తరవాత వరసగా నాలుగిళ్ళలో నాకు పెట్టిన చీరెలన్నీ ఊదారంగే!

చూసారా? అసలు నామొదటి ఊదారంగు చీరె నేను కోరీ వేడీ కొనుక్కున్నది కాదు. కానీ చూసేవారికి అలా అనిపించింది. అలాటి ఇంప్రెషను వారికి కలగడం నా దౌర్భాగ్యమో పూర్వజన్మసుకృతమో …

అదేమంటే “మొన్న సర్వేశ్వరిఇంటికి ఊదారంగు చీరె కట్టుకుని వచ్చేవు కదా. నీకు ఊదారంగు ఇష్టం అనుకున్నా” అని సమాధానం! ఆదెబ్బతో నేను చీరెలు కట్టుకోడం మానేశాను! అదొక ఉపఫలితం (అనగా సైడెఫెక్టు).

మీఇంట్లో ఏదో గాజుబొమ్మ కనిపిస్తే, ఆ తరవాత మీకొచ్చే బహుమతులన్నీ గాజుబొమ్మలే కావచ్చు. మీరో రోజు పొరిగింట్లో వారి సరదాకోసమే ఓ జానపదచిత్రం చూస్తే, ఆ తరవాత నాలుగేళ్ళపాటు బహుమతులుగానో ఉచితంగానో మీరు అందుకునేవన్నీ జానపద డీవీడీలే అయితే ఎలా ఉంటుందో ఊహించడమేమంత కష్టం కాదు కదా.

నేను ఓ పుస్తకాలషాపుకెళ్ళి ఏ విశ్వనాథగారి పుస్తకమో ఒకటి కొంటాననుకోండి. వెంటనే ఆ షాపువాడు “వారివి ఇంకా చాలా ఉన్నాయి” అంటూ మరో పది పుస్తకాలు ఆయనవే తెచ్చి నాముందు పడేస్తాడు. అది అతనిమీద నేను కొన్న ఒక్క పుస్తకం పుట్టించిన ఇంప్రెషను మహిమ. నిజానికి నేను ఆ ఒక్క పుస్తకం కొన్నది కూడా నాకోసం కాకపోవచ్చు. ఏస్నేహితురాలో తెమ్మంటే కొని ఉండొచ్చు. లేదా పక్కవాడిచేతిలో చూసి, ఇది గొప్పపుస్తకం అయి ఉండనోపు అని ఒక ఇంప్రెషను నామీద అయాచితంగా పడుటచేత కొని ఉండొచ్చు.

ఇలా రాసుకుంటుంటే, నాకో కత జ్ఞాపకం వస్తోంది.

వెనకటికొకావిడ వంకాయ కూర వడ్డించిందిట భర్తకి ఎంతో ప్రేమతో.

“ఇవాళా వంకాయకూరేనా?” అన్నాడాయన మొహం ముడుచుకుని.

ఆవిడకి మహ చిర్రెత్తుకొచ్చింది, “ఏమిటీ మీవరస? నాకేం అర్థం కావడంలేదు. ఆదివారంనాడు వంకాయకూర చేస్తే అద్భుతం అన్నారు. మర్నాడు మహబాగుందన్నారు. బుధవారంనాడు మ్.మ్, వంకాయకూరా అన్నారు. ఇప్పుడేమో ఇవాళా వంకాయకూరేనా అంటున్నారు. అసలు మీ మనసులో మాటేదో చెప్పరాదూ?” అనడిగిందా ఇల్లాలు విసురుగా.

ఆమెగారిమీద ఆయనమాటలవల్ల పడిన ఇంప్రెషను అదీ మరి.

మన తెలుగు రచయిత్రులకి భర్తలు ఎంత మద్దతు ఇస్తున్నారో వివరించబోయేను ఒకసారి నా అమెరికన్ స్నేహితురాలికి. “మా స్త్రీ రచయితలు కథలు రాస్తే, భర్తలు కాపీ చేసి పెడతారు. ఎడిట్ చేసి పెడతారు. చక్కగా కవర్లో పెట్టి ఎడ్రెసు రాసి పోస్టు చేస్తారు. పాఠకులప్రశ్నలకి జవాబులు రాస్తారు …” అంటూ మహ గర్వపడిపోతూ చెప్పేను.

“The women allow that? It seems like he is a control freak,” అంది నిశితంగా నాకళ్ళలోకి చూస్తూ.

చెప్పనేల … నేను కలిగించబోయిన ఇంప్రెషను బెడిసికొట్టిందని నాకు తెలియడానికి చాలాసేపు పట్టింది. మరీ అంత పైస్థాయిలో వివరాలు ఇచ్చి ఉండకూడదని నాకు అప్పుడే “ఇంప్రెషను” అయింది. హీహీ.

 

 

 

 

(జనవరి 19, 2011)

 

 

7 Responses to ఊసుపోక – భావముద్రలు …

  1. మాలతి అంటున్నారు:

    @ కల్పవ, ధన్యవాదాలు -:)

  2. kalpana అంటున్నారు:

    ముక్తాయింపు మరీ మరీ బావుంది.

  3. మాలతి అంటున్నారు:

    @ అభిమాని, అయితే భావముద్రలు బాగుందంటారు. సరే, అదే స్థిరపరిచేద్దాం. ధన్యవాదాలు.
    @ సుజాత, థాంక్స్.

  4. sujata అంటున్నారు:

    vERY NICE.

  5. mee abhimani అంటున్నారు:

    chala bavundi mee Bhava mudra padam.

  6. మాలతి అంటున్నారు:

    @ లలిత, -:)
    @ అనిల్, ధన్యవాదాలండీ మీ ఓటుకి (like).

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.