ఆదివారం సౌజన్య ఇంటికి వెళ్ళేను, నాస్నేహితురాలితో.
మేం వెళ్ళేసరికి ఓ పదిమంది ఉన్నారు. సుధ చనువుగా లోపలికి వెళ్ళి నలుగురినీ పలకరిస్తోంది. నేను సందేహిస్తూ వెనక నించున్నాను. ఇంతలో ఒకావిడ నావేపు వస్తూ కనిపించింది. ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ పరకాయించి చూస్తున్నాను.
తిన్నగా వచ్చి నాకు ఎదురుగా గజందూరంలో నిలబడింది చిన్నగా నవ్వుతూ. చూస్తూ నిలబడిపోయేను రెప్పపాటుకాలం నేను.
“గుర్తు పట్టలేదు,” అందావిడ కొంటెతనం కళ్ళలో మెరుస్తుంటే.
“సిరి” అన్నాను నెమ్మదిగా, నన్ను నేను నమ్మించుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు.
శ్రీదేవి దగ్గరగా వచ్చి నాచెయ్యి తనచేతిలోకి తీసుకుని “నువ్వు మాత్రం ఏం మారలేదు” అంది.
“మారలేదా? ఏమో. మారని రూపాయిని మరి,” అన్నాను నేను కూడా నవ్వుతూ. “పదేళ్ళయిందేమో కదూ.”
“ఇంకా ఎక్కువే అయుంటుంది. మేం షికాగో వదిలేసింతరవాత ఓ ఆర్నెల్లు కొంతకాలు ఫోనులో మాటాడుకున్నాం. తరవాత అంతే సంగతులు కదా,”
అవునన్నట్టు తలూపేను. సిరి షికాగోలో ఉన్నంతకాలం, తరుచూ కలుసుకునేవాళ్ళం. మొదట పరిచయం తనే అయినా ఆవిడతో కన్నా నాకు వాళ్ళాయన ప్రభంజనంగారితోనే ఎక్కువ కాలక్షేపం అయేది. ఆయన ఆపకుండా ఆరుగంటలు మాటాడగలరు ఏవిషయంమీదైనా సరే. సిరేమో నాలుగుమాటల్లో ముగించేసేది ఎంత క్లిష్టమైన ప్రశ్నయినా.
“ఇంతకీ నువ్వు షికాగోలోనే ఉన్నావా?”
నేను చుట్టూ చూసి, “షికాగోలోనా? ఇది టెక్సస్ అనుకుంటున్నానే,” అన్నాను వెక్కిరిస్తూ.
“హా హా. ఏమో, చుట్టపుచూపుగా, కేవలం నన్ను చూడ్డానికే వచ్చేవేమో అనుకున్నా.”
“అదేమిటి?” ఓ చిన్న అమ్మాయి నా ఎదురుగా నిల్చుని నాచేతిలో ఉన్న చిన్న పొట్లం చూస్తూ అడిగింది. తొమ్మిదేళ్ళుంటాయేమో. చురుకైన కళ్ళు, గుండ్రని మొహం, పాలబుగ్గలూ ముద్దొస్తోంది.
“ఇదా? ఇది రహస్యం,” అన్నాను నవ్వుతూ.
ఆ అమ్మాయి నాకు ఇంకా దగ్గరికొచ్చి, “నేను ఎవరికీ చెప్పనులే,” అంది.
“నీపేరేమిటి?”
“అపర్ణ. అదేంటో చెప్పు.”
… … …
“అమెరికా అంతరించే సమయం ఆసన్నమయింది. చరిత్రలో ఏ సామ్రాజ్యం మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది కనక?” నాలుగు కాలాలు చూసిన పెద్దాయన చారిత్ర్యక సత్యాలని వల్లిస్తున్నారు.
ఈమధ్యనే పట్టం పుచ్చుకున్న యువకుడు అమెరికా తిరిగి పుంజుకుంటుందనీ, ప్రపంచంలో మేధావులందరికీ ఇదే మహాప్రస్థానం అనీ వాదిస్తున్నాడు.
… … …
“బిస్క్విత్ అదీ వాడనండీ నేను. స్క్రాచ్ నించీ చేసేను” అన్నారు గులాబ్ జాం చేసి తీసుకొచ్చినావిడ.
బొప్పాయికాయ కూర ఎలా చెయ్యడమని అడుగుతోంది అమెరికాకి కొత్తగా కాపురానికొచ్చిన మనోహారిణి.
ఇద్దరు మొగపిల్లలు – పది, పన్నెండేళ్ళవాళ్లు బ్లాక్ బెరీలో ఏవో గేములాడుకుంటున్నారు ఓమూల కూర్చుని. ఎదురెదురుగా కూచుని ఇంటర్నెట్‌లో ఆడుతున్న వాళ్ళని చూస్తే నాకు తమాషాగా అనిపించింది. మనం ఒకరికొకరు ఎందుకు దూరమవుతున్నామో చెప్పడానికి అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?
…. …. ….
టీవీ ఆన్‌లో ఉంది. ఏదో తెలుగు సినిమా గోలగోలగా. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడంలేదు. … ఎవరూ చూస్తున్నట్టు కనిపించలేదు. ఎందుకు అది ఆన్లో ఉందో నాకర్థం కాలేదు.
“అయితే నువ్వు ఇండియా వెళ్ళే ఆలోచనలేమైనా ఉన్నాయా?” శ్రీదేవి అడిగింది ఏదో మాటాడాలన్నట్టు.
“లేదు. ఈమధ్యనే వెళ్ళొచ్చేను ఆర్నెల్లయింది. మళ్ళీ రెండేళ్ళవరకూ ఆమాటెత్తను,” అన్నాను.
“తెలంగాణా ఇచ్చేయక తప్పదు. బందులూ, ధర్నాలూ దేశం అట్టుడికినట్టు ఉడికిపోతోంది,” అన్నారు నాయుడుగారు.
ఎవరూ జవాబు చెప్పలేదు. అమెరికాలో ఆర్థికసంక్షోభంగురించి మళ్ళీ అందుకున్నాడు ఇందాకటి అబ్బాయే. తెలంగాణాసమస్య కంటే అమెరికా పరిస్థితులే ఎక్కువ ముఖ్యం కదా మరి అతడికి.
“ఆదివారం టెంటక్స్ సభకి వస్తావా?”
“ఎవరు మాటాడుతున్నారు?”
“ఎవరో రాగరాజు గంతాకులట.”
“ఏం మాటాడతారేమిటి?”
“ఈమధ్యే వచ్చిన పుస్తకంమీదట.”
“దానికో సభా? మనమే ఆ పుస్తకమేదో చదివేస్తే పోలా?”
“లీలగారేరీ, రాలేదా ఇంకా?”
“అదుగో, మాటల్లోనే వచ్చేరు నూరేళ్ళాయుష్షు”
“ఏమండీ లీలా పొన్నాగారూ, అసలీమధ్య ఎక్కడా కనిపించడంలేదు? బొత్తిగా నల్లపూసయిపోయారు.”
“నల్లపూసేంటండీ, నల్లపూసా, కారప్పూసా? మీరు మరీనూ … ఇంతటి మహా కాయం నూటతొంభైఎనిమిది పౌన్లు కనిపించడంలేదా మీకు? నిన్ననే సందార్‌గారు ఐస్‌క్రీం మేకరు తెచ్చేరు. ఆ రెండు పౌనులూ కూడా పడితే, రెండూ, రెండు సున్నాలు అని ఎంచక్కా చెప్పకోవచ్చు తేలిగ్గా ఉంటుందంటూ …”
స్థానికులభాషలో సందార్ అయిన సుందరం ఆవిడకి రెండడుగులు వెనక వస్తూ అందుకున్నారు, “ఏం చెయ్యనండీ? నాకెలాగా తినే యోగం లేదు. తినేవారిని చూసైనా ఆనందిద్దామని,” అన్నారు.
“చెప్పేనా కిందటివారం మంచం కొన్నాం అని. మన తాతలనాటి పందిరిమంచంలా రెండడుగుల ఎత్తుంది. నిన్న మంచం దిగబోతూ కింద పడిపోయేను. అయ్యో పడిపోయింది అని చెయ్యందియ్యడం పోయి, ఒకటే నవ్వు ఈ మహరాజు.”
“నువ్వంటే దిట్టంగా గుమ్మడిపండులా ఉన్నావు. కింద పడ్డా నీకేం కాదు. నేను చెయ్యందించి నిన్ను లేవనెత్తబోయి నేనే పడ్డానంటే పులుసులోకి ఎముక లేకుండా చితికిపోయేవాణ్ణి కాదూ?”
“యం.పి.సి” అంటూ గొణిగింది నాపక్కనున్న పదహారేళ్ళమ్మాయి.
“హెల్దీ, హెల్దీ అంటూ మేకల్లా ఆ ఆకులూ అలములూ నమలకపోతే నాలా చక్కగా కడుపునిండా షడ్రుచులతో కమ్మగా కడుపునిండా తినకూడదా, నువ్వు కూడా నాలా కండ బట్టి నేవళం తేలేవాడివి.”
ముగ్గురు మొహాలు ఇబ్బందిగా పెట్టేరు. మరో ఇద్దరు లేచి పక్కగదిలోకి వెళ్ళిపోయేరు. ఒక్క నాకు మాత్రమే అనుకుంటా అదేమంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. నాతరంలో మొగుడూ పెళ్ళాలు ఒకరినొకరు ఇలా ఎత్తిపొడుచుకోడాలూ, వేళాకోళాలాడుకోడాలూ మామూలే. అప్పట్లో మేం దాన్ని హాస్యంకిందే తీసుకుని నవ్వేసుకునేవాళ్ళం. మాకు అదే సిట్ కామూ, స్టాండప్ కామెడీ హాస్యరస నాటకం అన్నీ. ఈ హాస్యం మునిమాణిక్యం, పానుగంటి రచనల్లో చూడలేదూ? అదేమిటో మరి. ఎప్పుడు ఎలా మారిపోయిందో తెలీదు కానీ ఈ తరంవారికి ఇది అసభ్యత, అవమానం, నీచం కూడానేమో. ఇలాటివి ఇప్పడు టీవీలోనూ కామెడీ క్లబ్బుల్లోనూ మాత్రమే చెల్లుతాయి.
…. …. ….
“లీలగారూ, రండి. అప్పడాలవేపుడు మీ స్పెషాలిటీ కదా. నూనె కాగింది.” అంటూ సౌజన్య వచ్చింది.
లీలగారు ఒక్క ఉదుటున లేచి, “అయ్యయ్యో, నూనె పొయ్యిమీద పెట్టేశావా? ఎన్ని అప్పడాలు, ఎంత నూనె, ఎంత టెంపరేచరు చూసుకోకుండా,” అంటూ వంటింటివేపు నడిచారు గబగబా కొంపలంటుకుపోతున్నట్టు.
ఆవిడ హుషారు చూస్తే చెప్పొద్దూ నాకు మహ సరదా వేసింది. ఆవిడ వెళ్ళినవేపే చూస్తూ, “అప్పడాలవేపుడుకి కూడా స్పెషాలిటీనా?” అన్నాను శ్రీదేవితో.
“మీకు తెలీదులెండి. వంటా వార్పూ పుస్తకం చూసి మూడు పేకట్ల అప్పడాలు నాలుగు క్వార్టుల నూనే తగలేసి, ఆర్నెల్లు ప్రాక్టీసు చేసింది. దేశం నలుమూలలా ఎవరింట్లో అప్పడాలు వేయించాలన్నా ఆవిణ్ణే పిలుస్తారు” అన్నారు సుందరంగారు.
“సరే. నాక్కూడా ఆవిడ నెంబరివ్వండి. ఎప్పుడవసరం వస్తుందో,” అన్నాను గంభీరంగా.
“మొన్నే కదా పట్టుకెళ్ళేవు అప్పుడే చదవడం అయిపోయిందా?”అన్న ప్రశ్న విని అటు తిరగేను. నాకు నాలుగు సీట్లు ఎడంగా కూర్చున్న గోపాచార్యగారు ఓ పన్నెండేళ్ల అబ్బాయిచేతిలో పుస్తకాలు చూస్తూ అడుగుతున్నారు. కఠోపనిషత్తు, మాండూక్యోపనిషత్తూ వాటికి శంకరభాష్యాలు. ఆ పుస్తకాలు ఆ అబ్బాయి చేతిలో ముందు చూశాను కానీ వాళ్ళమ్మో నాయనమ్మో చదువుతారు కాబోలనుకున్నాను కానీ అతనే చదువుతాడనుకోలేదు.
“చదివేను,” అన్నాడు ఆ అబ్బాయి తలొంచుకుని.
…. …. …..
కాస్త ఎడంగా గోడవార కూర్చుని ఐఫోనుల్లో ఆటలాడుకుంటున్న ఇద్దరు పిల్లల్లో పెద్దాడు
“నాన్నా!” అంటూ కూత పట్టేడు. వాడిని చిన్నాడు మోసం చేస్తున్నాడుట.
నేనేం చెయ్యలేదంటాడు చిన్నాడు.
పిలుపందుకున్న నాన్న చిన్నవాడిదగ్గరికి వెళ్ళి, నలుగురు కూడిన చోట అరచుట మర్యాద కాదనీ, అన్నదమ్ములు పోట్లాడుకోకూడదనీ, ఆటల్లో గెలుచుట ఒక్కటే ముఖ్యము కాదనీ – ఇలాటివే మరి కొన్ని సాంఘికమర్యాదలు పాఠం చెప్పి వచ్చేరు.
చిన్నాడు కళ్ళు చిట్లించి కొంటెగా నవ్వుతూంటే, పెద్దాడు మూతి ముడుచుకుని అమ్మపక్కన చేరేడు.
… …. ….
దాదాపు మూడయింది. ఒకొక్కరే ఇళ్ళకి మళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు. నేను కూడా సుధవేపు చూశాను పదమన్నట్టు.
“మాయిల్లు అట్టే దూరం లేదు. రాకూడదూ. మాఅక్కని కూడా చూడొచ్చు” అంది సిరి నాతో.
“మీ అక్కయ్య ఇక్కడున్నారా?” అన్నాను సాలోచనగా.
“ఆర్నెల్లయింది వచ్చి. మాబావగారు పోయేక అక్కడ ఒక్కత్తీ అవస్థలు పడుతోందని తీసుకొచ్చేశాను. నాదగ్గరే ఉంటుంది. ఏం వస్తావా?”
నాకు ఇప్పటికే నీరసం వస్తోంది. కలగలపుతనం చాలా తక్కువస్థాయిలో ఉంది నాకు.
“ఇవాళ కాదులే. మరోసారి వస్తాను. ఇప్పటికే చాలామందిని కలుసుకున్నాను కదా. వీళ్ళందర్ని గుర్తు పెట్టుకోడానికి ఇంటికెళ్ళి మెంటల్ సాము చెయ్యాలి ఓగంటసేపు.”
“సరే. నీనెంబరియ్యి. ఫోను చేసి దారి చెప్తాను. మీఇంటినించి అరగంట కంటె ఉండదు.”
అలాగేనంటూ తలూపి చిన్న కాయితంమీద నెంబరు రాసిచ్చేను. ఓ రెండున్నరగంటల కాలంలో సగం ఊరు చూసినట్టనిపించింది నాకాపూట.
గమనిక లేదా హెచ్చరిక అనుకోండి. ఇక్కడినించీ అనేక రకాల చర్చలు కనిపిస్తాయి. అంతమాత్రాన ఈ మార్పు కర్త చాలా చదువుకున్నదని కానీ ఉద్దండ పండితురాలని గానీ అనుకుంటే పొరపాటు. ఇక్కడ ప్రవచించే ధర్మసూత్రాలూ ప్రాపంచిక విషయాలూ వారూ వీరూ చెప్పగా విన్నవీ, అక్కడక్కడా కనిపించినవీ, అంతర్జాలంలో పట్టుకున్నవీ మాత్రమే. అంతేగానీ సందర్భానుసారంగా ఉదహరించిన ఈ బృహద్గ్రంథాలన్నీ కూలంకషంగా చదివి, క్షుణ్ణంగా పరిశీలించి, ఆకళించుకున్నవి కావు.
పోతే, ఇలా కూడా ఘనాపాఠీ పండితులుగా చెల్లడానికి అవకాశం ఉందన్న నీతిని సూచించడం అన్యాపదేశంగా జరిగిఉండవచ్చు. ఏ ఒక్కరినో హేళన చేసే దురుద్దేశ్యం ఏమాత్రమూ లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను - ఇట్లు, నిడదవోలు మాలతి.
(ఇంకా ఉంది)
మీ గమనిక తో పాటు మీరు ఇంకో గమనిక చెప్పాలేమో – ఇందులో వందశాతం యదార్థ జీవితం ఉందని అనుకోకండి, ఇది నా ఆత్మకథ కాదూ అని
ఇక్కడి దాకా అలాగే ఉన్నా, నేను మధ్యలో చదవకుండా పన్నెండో ఎక్కణ్ణుంచో మొదలెట్టా కదా… అందుకని ఈ గమనిక విషయం చెప్తున్నా
Katie, thank you,
your good
@ mohan c v r , సంతోషం మోహన్ గారూ.
నాకు ఇష్టమైన అంతర్జాల రచనలు
@నాగేస్రావ్,
) బాగుందండీ. ఇది కూడా పనికొచ్చే ఆలోచనే.
అంటే technology అంత వేగంగా మారుతోందని చెప్తున్నారేమో పూర్ణిమగారూ
-:)). నోట్ చేసుకున్నాను.
ఆడుకొవచ్చునండి…ఆయ్ !!
@ పూర్ణిమ, భలే అడిగేరండీ. అలాటివే నాకు సరిగ్గా తెలీవు. మీలాటివారు వాటిని సరిదిద్దగలరనే ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ ఇదంతా సంస్కరించినప్పుడు దిద్దుకుంటాను. అసలు బ్లాక్ బెరీలో అలా అడుకోడం వీలవుతుందా?
బాగుందండి టపా…. కాని ఒక్క సందేహం… బ్లాక్ బెర్రి లొ ఆట మొదలు పెట్టి ఇఫొన్ లోకి ఎలా మారిపోయారు ఆ గోడవారు పిల్లలు??? ఈ మార్పు మాత్రం అర్ధం కాలేదు.