“లోకంలో నీతీ న్యాయం – రెండూ సమాజశ్రేయస్సుకే అయినా రెంటికీ పొత్తు లేదెంచేతో,” అంది సిరి ఎటో చూస్తూ.
“ఏం ఈ రోజు, న్యాయాన్యాయాలవేపు మళ్ళింది బండి,” అన్నాను పక్కనే కూర్చుంటూ.
టీవీలో కోర్ట్ టీవీ చూస్తోంది. అది నాక్కూడా ఇష్టం. బహుశా కనీసం టీవీలోనైనా న్యాయం జరుగుతోందన్న సాంత్వన కావచ్చు.
నిజానికి అన్ని కేసుల్లోనూ న్యాయమే జరగదు. ముఖ్యంగా పుష్టిగా కనిపించేవాళ్ళు ఏదో వంక చెప్పి, సర్టిఫికెట్టొకటి పుట్టించుకుని, సోషల్ సెక్యూరిటీ వసూలు చేసుకుంటున్నారు. వాళ్లని చూస్తే నాకు మహ మంటగా ఉంటుంది. వాళ్ళు నాడబ్బేదో దోచుకుంటున్నట్టు. నిజానికి ఒకవిధంగా ఆలోచిస్తే అది నిజమే కూడాను. నేను సోషల్ సెక్యూరిటీకి సంమర్పించుకున్న డబ్బు వాళ్ళు వసూలు చేసుకుంటున్న సొమ్ములో ఉంది కదా.
“అది కాదు. మనకి చిన్నప్పటినించీ నూరిపోసేది ఏమిటీ? ధర్మపన్నాలే కదా. ఆ తరవాత కాస్త అక్షరపుముక్కలొచ్చేక భారతాలూ భగవతాలు చదువుతాం. అందులో సత్పురుషులు చేసే అధర్మాలన్నిటికీ ఏవో బీరకాయపీచు వివరణలు ఉంటాయి. ధర్మారాజు అశ్వత్థామ హతః కుంజరః అన్నా, హరిశ్చంద్రుడు ఇల్లాలిని అమ్మకానికి పెట్టినా, శ్రీరామచంద్రుడు సహధర్మచారిణిని అడవులపాలు చేసినా ధర్మసమ్మతమే. అటు చూడు,” అంది టీవీవేపు చూపుతూ.
ఈకోర్టు టీవీల్లో కేసులు నిజం కేసులే.
18 ఏళ్ళ అబ్బాయి తండ్రిమీద కేసు పెట్టేడు. ఆ తండ్రి తన క్రెడిట్ కార్డూ, సోషల్ సెక్యూరిటీ నెంబరూ వాడుకుని అప్పులు చేసేశాడనీ, తన్మూలంగా తన క్రెడిట్ హిస్టరీ చిక్కుల్లో పడిందనీ, ఆ అప్పులకోసం అప్పులాళ్ళు తనవెంట బడుతున్నారనీ ఆ అబ్బాయి కేసు. ఆ అప్పులన్నీ కుటుంబంకోసమే చేసినందున తండ్రిగా తనబాధ్యత తాను నిర్వర్తించేనని తండ్రి వాదన.
జడ్జీగారు ఆ అబ్బాయిని అడుగుతున్నారు. “స్కూల్లో బాగా చదువుతున్నావా?”
“చదువుతున్నాను యువరానర్.”
“ఏ గ్రేడ్స్ వస్తున్నాయి?”
“ఒక ఎ, బీలు, వచ్చేయి. ఒక సి వచ్చింది.”
తండ్రిని ప్రశ్నించేరు. “ఏం ఉద్యోగం చేస్తున్నావు?”
“కన్స్‌ట్రక్షన్.”
“ఇప్పుడేం చెయ్యడంలేదండీ,” అన్నాడు కొడుకు.
జడ్జీగారు అతన్ని మాటాడొద్దని సౌంజ్ఞ చేసేరు.
“కట్టడంపనిలో ఇప్పుడున్నావా?”
“లేదు. రిసెషన్‌మూలంగా పని దొరకడంలేదు.”
“అంటే నీజవాబు ఇప్పుడు పని చెయ్యడంలేదు అని.”
“పనికోసం చూస్తున్నాను.”
“నీకు పూట ఎలా గడుస్తోంది?”
“ఐ మేనేజ్.”
“ఎలా మేనేజ్ చేస్తున్నావని అడుగుతున్నాను.”
“స్నేహితులు సాయం చేస్తున్నారు.”
అబ్బాయి మళ్ళీ అందుకున్నాడు, “నా క్రెడిట్ కార్డ్‌మీద గర్ల్ ఫ్రెండుకి బట్టలు కొన్నాడు. ఇద్దరూ వెకేషనుకి వెళ్ళేరు. కారు కొన్నాడు.”
“కారు కొన్నావా?”
“పని వెతుక్కోడానికి కావాలి.”
“నా ప్రశ్న అది కాదు. కారు కొన్నావా. జవాబు అవునో కాదో అవుతుంది.”
“అవును.”
“కొనడానికి డబ్బెలా వచ్చింది?”
“క్రెడిట్ కార్డుమీద.”
“ఎవరి కార్డుమీద?”
“అబ్బాయికార్డు.”
“నీకార్డుమీద ఎందుకు కొనుక్కోలేదూ?”
“నాక్రెడిట్ మెసప్ అయింది. నేనిన్నాళ్ళూ ఆ అబ్బాయికి ఎంత ఖర్చు పెట్టేనో …”
“అది తండ్రిగా నీధర్మం.”
అబ్బాయికి అనుకూలంగా తీర్పు జరిగింది. ఇద్దరూ బయటికి వచ్చేరు. కోర్టు వరండాలో నిటారుగా నిలబడి, ఆ తండ్రి తానేమీ తప్పు చెయ్యలేదనీ, జడ్జీగారు సందర్భం సరిగ్గా అర్థం చేసుకోలేదనీ నొక్కి చెబుతున్నాడు.
సిరి నిట్టూర్చి అంది, “చూశావా. బొత్తిగా ఇరవైఏళ్ళయినా లేని కుర్రాడు. వాడికి ముందు ముందు ఇంకా ఎంతో జీవితం ఉంది. క్రెడిట్ హిస్టరీ ఇంకా మొదలయిందో లేదో అప్పుడే తండ్రే దాన్ని తన సరదాలకోసం వాడుకుని ఆ కుర్రాడికి చిప్ప చేతికియ్యడానికి వెనుదీయలేదు. ఆ మనిషికి సిగ్గెలా వేయలేదో నాకర్థం కాదు … కొడుకు బాగోగులు చూడవలసిన తండ్రే కొడుకుని అలా అప్పులపాలు చెయ్యడం ఎంత ఘోరం. అలాటివి చూసినప్పుడే నాకనిపిస్తుంది అసలు ఒక మనిషి మరొక మనిషిని నొప్పించినప్పుడు తాను అవతలివారిని నొప్పిస్తున్నాను, వారికి హాని చేస్తున్నానన్న స్పృహ ఎందుకు కలగదు అని? మళ్ళీ వీళ్లంతా మందబుద్ధులేం కాదు కదా. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నతోద్యోగాల్లో ఉన్న మేధావులు కూడాను.”
“కలగదు” అన్నాను ఎదటివారికి నొప్పి కలిగిస్తున్నాం అన్న స్పృహగురించి. “కొందరికి కేవలం అవతలివారిని బాధించి ఆనందించే మనస్తత్త్వాలు ఉంటాయి కానీ, చాలామటుకు తాము తప్పు చెయ్యలేదనే అనుకునేవారే ఎక్కువ. తనచర్యకి తాను ఇచ్చుకున్న టిప్పణే తప్ప ఎదటివారికి తాము చేసిన ఎగ్గు వారి తలపులలోకి రాదు. అదొకరకం కళ్ళజబ్బే అనుకో. ఎంతసేపూ నన్నర్థం చేసుకోలేదూ, నాకెంత బాధగా ఉందో చూడ్డంలేదూ అంటూ ఏడుస్తారు. ఏంచేస్తాం. వాళ్ళఖర్మ అదీ.”
“అంతేనేమోలే. మా అరు ఆ విషీతో తిరిగింది కొంతకాలం. నాలుగునెలలక్రితం అతన్ని డంప్ చేసేసింది. మనవాళ్ళేలే. తెలిసినవాళ్ళే కూడాను. రెండేళ్ళక్రితం ఇరుగూ పొరుగూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఇల్లు కట్టించుకుని మారిపోయేరు. మాపిల్ల అతన్ని వదిలేసినా, అతను ఈమెని వదల్డంలేదు”
“ఏమంటాడేమిటి?”
“ఏమీ అనడు. మాపిల్ల వెళ్ళినచోటల్లా- బజారుకెళ్తే బజారులో, సినిమాకెళ్తే థియేటర్‌లో ప్రత్యక్షమయి తనని తాను ఆమెకి గుర్తు చేయడానికి ఆరాటపడుతూంటాడు అదే అతని ఉద్యోగం అయినట్టు.”
నేను మాటాడలేదు. తెల్లారి లేస్తే ఇలాటివి ఎక్కడోక్కడ వింటూనే ఉంటాను. కాఫీ, పేపరూ అంత మామూలు ఈకథలు.
“ఆ అబ్బాయి మాత్రమే అయితే పోన్లే కుర్రతనం అనుకోవచ్చు. నాకు ఆశ్యర్యం ఏమిటంటే వాళ్ళనాన్న కూడాను. వారానికోమారు ఆఫీసునించి ఈదారినే పోతూంటాడు.”
“దారేనేమో?”
“అదే కదా నేనంటున్నది. ఇది చుట్టుతిరిగి అవుతుంది వాళ్ళింటికి. వారానికోమారు ఇట్నించి వెళ్ళకపోతే తోచదాయనకి,” అంది శ్రీదేవి నవ్వుతూ.
“మ్. కొందరికి పధ్నాలుగేళ్లు దాటుతూనే బుర్రలు ఎదగడం మానేస్తాయనుకుంటాను శరీరాలు ఎదిగినా. ఆ బాపతు కాబోలు.” అన్నాను నవ్వుతూ.
“అలాగే ఉంది చూస్తే,” అంది సిరి కూడా నవ్వుతూ. “ఇలాటివాళ్ళని మాఅమ్మ చీమల్తో పోలుస్తుండేది. వాటివల్ల పెద్ద హాని జరగదు కానీ కనిపించీ కనిపించకుండా చిరాకు పెడుతుంటారు.”
“సరే, వస్తాను మరి.” అన్నాను లేస్తూ.
“ఉండరాదూ. భోంచేసి పోదువు గానీ.”
”లేదులే మరోసారి వస్తాను. ఇంట్లో కాస్త పనులున్నాయి.” అని చెప్పి శలవు తీసుకున్నాను.
(ఇంకా ఉంది)
(జనవరి 31, 2011)
లలితా, – మరేమిటో తేడా? – తేడా ఈనేల అనుకుంటానండీ. :p. చెప్పేను కదా ఇక్కడ నేలంతా చవిటిపర్రలు. హీహీ. ఇక్కడికొచ్చిన దగ్గర్నుంచీ నాకే అంతా అయోమయంగా ఉంది. ఏం రాయడానికీ తోచడం లేదు. అందుకే ఈ మార్పు మొదలు పెట్టేను. అట్టేమందికి నచ్చినట్టు లేదు. అంచేత మీరు చదువుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకూ, చదువుతున్న పాఠకులకూ మరొకసారి కృతజ్ఞతలతో,
లలితా, తప్పులెన్నువారు పద్యం ఒక సాధారణీకరణ అనే నేను కూడా అనుకుంటున్నాను. మీరన్నట్టు ఎదటివారి తప్పులు మాత్రమే ఎన్నేవారికి తమ తప్పులని కప్పిపుచ్చుకోడానికే వాడుకోడానికి పనికొస్తుంది తమకి. మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడాను. పోతే, నిజంగా నాటపాలో నేను చెప్పదలుచుకున్నది అసలు తప్పులగురించి కాదు. నాప్రశ్న- ఎదటివారిని నొప్పించేవిషయం. తన ప్రవర్తనమూలం మరొకరికి బాధ కలుగుతోందని ఎందుకు గ్రహించరు అన్నది నాకు కలిగిన సందేహం. బహుశా అది స్పష్టం కాలేదేమో. మరొకసారి ప్రయత్నించి చూస్తాను.
పొరబడ్డాను. ఇంతకు ముందూ మీది అదే టైం జోన్ కదూ? మరేమిటో తేడా?
మాలతి గారూ,
తండోపతండాలు తప్పు చేసే వాళ్ళని తప్పులెన్నితే మనం చెత్త కుప్పలో కాలు పెట్టడమే అని తెలుసుకోవాలి అన్నది నేటి వేమన పాఠం!
మీ మార్పు చదువుతున్నాను. మీరు ఊరు మారడం వల్ల నాకు ప్రత్యక్షంగా అనుభవమయ్యే మార్పు మటుకు ఇదీ. మా ఊళ్ళో పొద్దు గుంకాక కూడా మీ వ్యాఖ్యలు కనిపిస్తుంటే ముందు మీ అలవాట్లలో మార్పు వచ్చిందేమిటా అని ఆశ్చర్య పోయాను. తర్వాత అర్థమయ్యింది మాకు టాటా చెప్పాక సూర్యుడు మీ దగ్గర సెలవు తీసుకోడానికి గంట ఆలస్యం చేస్తాడని
తప్పులెన్ను వారు పద్యం నన్ను తెగ తికమక పెడుతుందండీ. నా అనుభవంలో, ఓర్చుకుని ఓర్చుకుని ఒక్క మాట అన్నప్పుడు ఎదటి వాళ్ళు తిప్పి కొట్టడానికి ఈ పద్యాన్ని వాడుకున్న సందర్భాలే ఎక్కువ
వ్యంగ్యాలు పక్కన పెడితే, మార్పు ఎవరు కావాలనుకుంటున్నారో వారిలోనే రావాలి అన్న దాంట్లో తరచి చూస్తే ఎంతో నిజముందనిపిస్తోంది ఈ మధ్య. అది అన్యాయమూ కాదూ, అన్యాయానికి విజయమూ కాదు. అలాగే, తప్పులెన్ను వారు పద్యం తప్పులెన్నే వారి కోసం కాదనుకుంటా వేమన చెప్పేది. నిజంగానే, ఆయన తెలుసుకోమంటున్నాడు, నీ తప్పులు తెగ ఎంచుతున్నారని నువ్వు వారి తప్పు ఎంచి చూపితే ఉపయోగం లేదు, అటువంటి వారు తమ తప్పు తెలుసుకోలేరు అని. నాకైతే ఈ మధ్య ఈ view point నుంచి చూస్తే ప్రపంచం సవ్యంగా అనిపిస్తోంది
మోహన్ -:). నేనన్నది కూడా అదేనండీ. ఎంతసేపూ ఎదటివారి తప్పులే కనిపిస్తాయని. ఒకొకప్పుడు తప్పులు కానివి కూడా తప్పులుగా కనిపిస్తాయి, విచిత్రం.
).
“తప్పులెన్ను వారు countless
in this materialistic world
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు”
so said yogi vemana
పూర్ణిమ, కనీసం కొందరిలోనైనా మార్పు వస్తుందనే కొందరంటారండీ. ఎటొచ్చీ అది చాలా చాలా ఆలస్యంగా అని అనిపిస్తుంది నాకు :p.
“ఎంతసేపూ నన్నర్థం చేసుకోలేదూ, నాకెంత బాధగా ఉందో చూడ్డంలేదూ అంటూ ఏడుస్తారు. ఏంచేస్తాం. ” – రైటే… ఏమి చెయ్యలేము. మరి వారిలో మార్పు రాదా?