తెలుగుకథ తీరుతెన్నులు

తెలుగుకథ తీరుతెన్నులు

కథ తీరుతెన్నులు ఈ నాటి అంశం. అసలు కథంటే ఏమిటి? ఏది కథ, ఏది కథ కాదు? చూద్దాం.

ఈరోజుల్లో విమర్శకులూ, సంపాదకులూ, ఒకొకప్పుడు పాఠకులూ కూడా కథంటే ఇలా ఉండాలి, ఈ లక్షణాలు ఉంటేనే కథ అవుతుంది అని నిర్ధారణ చేస్తున్నారు.

ఆ లక్షణాలు –  క్లుప్తత, వస్త్వైక్యత, సమయైక్యత, నిబద్ధత, సాంద్రత. రెండోస్థాయిలో పరిశీలించేవి నిర్వహణ లేక నడక, ఆవరణ, పాత్రపోషణ, ముగింపు. వీటికి తగినట్టుగా సన్నివేశాలు. సంఘర్షణా ఉన్నాయా లేవా అన్నది పరిశీలిస్తారు విమర్శకులు. మరోలా చెప్పాలంటే కథకి ప్రధానాంగాలు – ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు. ఉపాంగాలు - ఆవరణ, పాత్రచిత్రణ, భాష. ఈ భాష అన్నది మళ్ళీ చాలా విస్తృతమయిన విషయం.

ఈ నియమాలు నిజానికి ఆంగ్లసాహిత్యం చదివి మనవారు తయారు చేసినవి. నేను కూడా కొంతవరకూ ఆ సంప్రదాయాన్ని పాటిస్తాను. ఎప్పుడంటే రచయితలు తమకథమీద నా అభిప్రాయం అడిగినప్పుడు అన్యాపదేశంగా వారు కోరేది ఈనాటి సంపాదకులప్రమాణాలకి ఆ కథ నిలుస్తుందా లేదా అనే అనుకుంటాను. అంచేత, తదనుగుణంగా ఉంటాయి నాసలహాలు. ఈవిషయం మరొకసారి, లేదా వీలయితే ఈప్రసంగంలో చివర మాటాడుకుందాం.

కథ అంటే ఏమిటి? ఏది కథ అవుతుంది?

అంటే మీరు ఏది మాటాడితే అదే కథ. లేదా కథ అవడానికి కావలసిన లక్షణాలు కలిగి ఉంటాయి మీమాటలు. మనం ప్రతిరోజూ కథలు చెప్పుకుంటూనే ఉంటాం. ఏ ఇద్దరు తటస్థపడినా ఒకరితో రెండోవారితో కథలే. “ఇవాళ ఏమయిందో తెలుసా?” అని ఒకరు మొదలుపెడితే, రెండోవారు చెప్పేది కథ కావచ్చు.

హోమ్ వర్క్ ఏదీ.

కుక్క తినేసింది.

ఇంటికి ఆలస్యంగా వచ్చేరెందుకూ?

వాన పడింది.

వానెక్కడ ఫెళ్ళున ఎండ కాస్తుంటే

ఇక్కడ కాదు, పక్కవీధిలో పడింది.

ఆమాట నిజమే కావచ్చు. లేదా కొంచెం నిజం కావచు. కాకపోవచ్చు కూడా.కానీ ఇవన్నీ కథలవడానికి అవకాశం ఉంది.

మాట ఏనాడయితే పుట్టిందో అప్పుడే కథలూ పుట్టేయి. ముందు కథనం తరవాత లేఖనం. అనాదిగా జానపదసాహిత్యరూపంలో మౌఖికంగా కథలు చెప్పుకుంటూనే ఉన్నాం. ఈనాడు కథాంశాలు అని మనం వేటిని చెప్పుకుంటున్నామో అవన్నీ జానపదగేయాల్లో చూస్తాం.

పల్లెలో ఒ చిన్నవాడు కంటబడ్డ చిన్నదాన్ని అడుగుతాడు.

ధాన్యమయిన దంచగలవ పిల్ల నీవు అని.

ధాన్యమంటే దగ్గొస్తదయ్య మాకు అంటుందా చిన్నది

ఇలా ఏవో మూడో నాలుగో ప్రశ్నలేస్తాడు ఆ చిన్నవాడు. నాకు అవన్నీ గుర్తులేవు. చివరికి అంటాడు

…..  …..

సంతకైన ఎల్లగలవ పిల్ల నీవు

సంతకంటె సంతోసమయ్య మాకు అంటుంది ఆ చిన్నది.

మా రోజుల్లో పెళ్ళిచూపుల్లోనూ ఇప్పుడు డేటింగులోనూ జరిగేది అదే – పెళ్ళికి ముందు పిల్లదాని అర్హతలు కనుక్కోడం.

అలాగే …. ఓ అత్తగారు కొత్తకోడలిని నిలదీస్తుంది.

పచ్చిపాలమీద మీగడేదమ్మా

వేడిపాలలోన వెన్న ఏదమ్మా అంటూ

ఆ కోడలు అత్తకి ఎదురు చెప్పలేదు. అంచేత పొరుగింటి ఇల్లాలితో చెప్తుంది

మాయత్త ఆరళ్ళె గానీ చూస్తివ?

పచ్చిపాలమీద మీగడుంటుందా

వేడిపాలలోన వెన్న ఉంటుందా

అంటూ తనబాధ వెళ్ళబోసుకుంటుంది. .

ఇలా ఆనాటి పాటకజనం తమ కష్టం సుఖం, మంచీ చెడూ కలబోసుకు ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. అంచేత కథ ఎప్పుడు పుట్టింది అంటే మాట పుట్టినప్పుడే అని చెప్పుకోవాలి. ఒకరితో మరొకరు మాటాడినప్పుడల్లా ఏదో కథకి ఆస్కారం ఉంది.

కథ పూర్వచరిత్ర

పోతే వ్రాతపూర్వకంగా మొదలయింది పైశాచీభాషలో గుణాఢ్యుడు రాసిన బృహత్కథ అని సాహిత్యచరిత్ర చెప్తోంది. తెలుగు కావ్యాలూ, ప్రబంధాలూ బృహత్కథలోని ఇతివృత్తాలు తీసుకుని రాసినవి కథనం – చెప్పిన పద్ధతి – పద్యరూపమే అయినా వీటిలో కథలు ఉన్నాయి. శాలివాహనుని గాథాశప్తశతి, సోమదేవుని కథాసరిత్సాగరం, ఇంకా భట్టి విక్రమార్కచరిత్ర, భేతాళపంచవింశతి – ఇలాటివన్నీ సంస్కృతమూలాలనుండీ తెలుగులో రచించినవి. అలాగే సంస్కృత రామాయణ, మహాభారతాల్లోంచి కూడా తెలుగు కథలు రాయడం జరిగింది.

వస్తుపరంగా చూస్తే, ఆదిని కవులూ పండితులూ రాసిన కథలల్లో దేవతల శక్తిసామర్థ్యాలూ, ప్రభువుల వీరోచిత ధైర్యసాహసాలూగా ఇతివృత్తాలయితే, మౌఖికసాహిత్యంలో సామాన్యులు కథానాయకులుగా ఉంటూ వచ్చేరు. మధ్యతరగతి, దిగువతరగతి జనుల కష్టసుఖాలూ, ఈతిబాధలూ, నీతిబోధలూ- ఇవి కథావస్తువులుగా జానపదసాహిత్యంలో చూస్తున్నాం. నిజానికి ఈనాడు మనం ఆధునికకథ అని చెప్పుకుంటున్న కథల్లో కూడా కొన్ని జానపదఛాయలు కనిపిస్తాయి. మనసంస్కృతిలో భాగం అది.

కథ తీరు తెన్నులు అన్నవిషయానికి వస్తే – కథలో ఏం చెప్పారు, కథాస్వరూపం ఏమిటి అన్నది తీరు. తెలుగుకథ ఎక్కడినుండి ఎక్కడికి వచ్చింది. ప్రధానంగా రచయిత వస్తువుని ఎలా ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరణలో వెనకటికథలకీ ఇప్పటికథలకీ గల వ్యత్యాసాలు, లేదా సామ్యాలు ఏమిటి, ఎక్కడినుండి ఎక్కడికి వచ్చేం అన్నది తెన్ను.

ప్రాచీన లాక్షణికులు కథాప్రక్రియని ఐదువర్గాలుగా విభజించారు – కథ, పరికథ, ఆఖ్యాయిక, ఖండకథ, కథానిక, అని. వీటికి స్థూలంగా ఇచ్చిన నిర్వచనం -

భయానకం సుఖతరం గర్భేచ కరుణోరసః

అధ్బుతో..స్తే సుక్లుప్తార్థా నోదాత్తో సా కథానికా.

అని. భయం అంటే పాఠకుడిని కదిలించేది, ఉలిక్కిపడేలా చేసేది. అద్భుతం, క్లుప్లం,  నోదాత్తః – ఉదాత్తంగా ఉండకూడదు అన్నది కొంచెం గందరగోళంగా ఉంది. దానికి ఆచార్య కె.కె. రంగనాథాచార్యులుగారు ఇచ్చిన వివరణ – మహారాజులకీ చక్రవర్తులకీ ఉండే ధీరోదాత్తగుణాలు కాక ఈనాటికథ సాధారణమానవులందరికి వర్తింపజేసేది అని.

కథాసరిత్సాగరం కృతికర్త సోమదేవుడు కథకి 17 లక్షణాలు పేర్కొన్నారు.

రమ్యం, హృద్యం, హారిణి, చిత్రం, ఉదారం, విచిత్రార్థం, ఆర్త్యం, అపూర్వం, స్వల్పం, దివ్యం, వినోదిని, శిక్షావతి, బుద్ధివిభాసంపన్నం, రుచిరం, అద్భుతవిచిత్రరుచిరం, ముగ్ధావిషయం, మహాకథా.

మొత్తంమీద మనం ఆదిలో చెప్పుకున్న లక్షణాలకీ ఈ జాబితాకి అట్టే తేడా లేదు. ప్రతికథలోనూ ఇవన్నీ ఉండాలనీ లేదు. ఇలా ఉంటే కథని పాఠకులు ఎక్కువగా, లేదా ఎక్కువమంది పాఠకులు ఆదరిస్తారు అని ఆ లాక్షణికుల అభిప్రాయం అనుకుంటాను. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఆధునికతెలుగుకథ తనదైన ప్రత్యేక స్వరూపం సంతరించుకున్నా, ప్రాచీన కథాలక్షణాలు కూడా కనిపిస్తాయనే.

కథ స్వరూపం – నాలుగువర్గాలుగా విభజించుకోవచ్చు.

కొన్ని సరళరేఖలా ఆద్యంతం సాగేవి, కొన్ని వర్తులాకారంలో ప్రథానాంశాన్ని ప్రారంభంలో సూచించి, రెండో మూడో సన్నివేశాలలో సంఘర్షణ ఆవిష్కరించి ముగింపులో పరిష్కారమో సందేశాన్నో ప్రవచించేవి – ఇలాటికథల్లో ముగింపుతో ప్రారంభంలో అంశాన్ని కలిపుకుని కథ పూర్తి చెయ్యడం కనిపిస్తుంది.

ఉదాహరణకి – ఏడుచేపలకథ చూడండి. సరళరేఖలా సాగుతుంది. రెండో రకంకథల్లో అంటే రాక్షసులూ, రాజకుమారులూ ఉండేకథల్లో ముగింపు ముందే తెలుస్తుంది. నేను ఆకథాస్వరూపాన్ని వర్తులాకారంగా వర్ణిస్తాను. అంటే ఈ కథలో ముగింపు ఎత్తుగడలో చెప్పినఅంశంతో పూర్తవుతుంది.

మరోవర్గం – మేధని సవాలు చేసేవిగా ఉంటాయి. భట్టి విక్రమార్కుడి కథలు, కథలో ఏదో మెలిక, చిక్కుప్రశ్న ఉంటుంది. జవాబు తెలిసేవరకూ తోచదు.

మరొక వర్గం కథలో కథ, కథలో కథ అల్లుకుంటూ సగంవరకూ కొనసాగించి, మళ్లీ ఒకొక కథా ముగించి, వెనక్కి వరుసక్రమంలో నడుపుకురావడం. ఇలాటికథకి రచయిత చాలా నిపుణడై వుండాలి.

ఇతివృత్తాలలో వైవిధ్యం - పూర్వపుకథలకి రెండు ధ్యేయాలు కనిపిస్తున్నాయి. నీతిబోధకం, వినోదాత్మకం.

నీతి బోధకాలు అయినకథలలో ఈనాడు మనం అనుకుంటున్న సామాజికకోణం కూడా ఉంది. ఉదాహరణకి పంచతంత్రం, హితోపదేశంలాటి పిల్లలకథలు తీసుకున్నా, రామాయణ మహాభారతాల్లాటి పెద్దలగ్రంథాలు తీసుకున్నా వీటిలో బోధించేది మానవధర్మం బోధించడమే. పిల్లలకి నీతికథలు చెప్పినప్పుడు వారి వ్యక్తిత్వాలు తీర్చి దిద్దే ప్రయత్నం ఉంది. అలాగే రామాయణ, మహాభారతాల్లో పెద్దలకి ఆచరించవలసిన నీతులు ఉన్నాయి.

రెండోకోవకి చెందిన గ్రంథాలు వినోదాత్మకం. వినోదం అంటే అంటే హాస్యం అనే కాదు సంభ్రమాశ్యర్యాలు కలిగించేవి, మేధకి పని పెట్టేవి. శృంగారం కూడా వినోదాత్మకంగానే భావించవచ్చు. వీటివల్ల పాఠకులకి  చదువుతున్నంతసేపూ తాత్కాలికంగా ఉల్లాసమో, ఉత్సాహమో, ఉద్వేగమో కలుగుతాయి. ఆకథలకి ప్రయోజనం అదే అనుకోవచ్చు. తెనాలి రామకృష్ణుడికథలు, పరమానందయ్యశిష్యుల కథలు. భట్టి విక్రమార్కుడి కథలు, భేతాళ పంచవింశతి లాటి కథలు మేధని సవాలు చేసేవి. శృంగారం – మదనకామరాజు కథలు, శుకసప్తతి వంటివి.

అయితే ఆధునిక కథలు అని వేటిని అంటున్నాం, ఎందుకు అంటే ఇతివృత్తంలో, ఎత్తుగడలో, నిర్వహణలో మార్పు కనిపించేకథలని ఆధునిక కథలు అంటున్నాం.

అవి ఎప్పుడు వచ్చేయి అంటే ముద్రణాయంత్రాలు దిగుమతి అయేక అనుకుంటున్నాను నేను. వీరేశలింగంగారి సంఘ సంస్కరణోద్యమాలు కూడా ఇంచుమించుగా అప్పుడే మొదలయేయి. ఈనాడు మనం చెప్పుకుంటున్న “సాంఘికప్రయోజనం” గల కథలు మొదలయింది ఆకాలంలోనే. అయితే ఈ కథలలక్ష్యంలో మార్పులేదు. అవ్వపేరే ముసలమ్మ అన్నట్టు వీరేశలింగంగారి ప్రధానోద్దోశ్యం ప్రజలకి సత్ప్రవర్తన నిర్దేశించడమే. ఇలాటి నీతిబోధలు వెనకటికథల్లో కూడా ఉన్నాయని చెప్పుకున్నాం.

వీరేశలింగం, అచ్చమాంబ, - స్త్రీలసమస్యలు - విద్య, ఆర్థికప్రతిపత్తి, వేశ్యలు

ఆయన ఉద్యమాల్లో కథకి సంబంధించినంతవరకూ  స్త్రీవిద్యకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆడవాళ్ళు చదువుకోవాలని ఉద్యమం మొదలు పెట్టినా దానికి ఆయన చెప్పిన కారణంలో మాత్రం ఆధునికత లేదు. ఆయన చెప్పిన కారణఁ “స్త్రీలు చదువు లేకపోయినచో ఇరుగుపొరుగువారితో వృథాగా కాలక్షేపము చేయుచు, దుర్భాషలాడుచూ, కలహించుచూ ప్రొద్దు పుచ్చుదురు. అట్టివారి పిల్లలు కూడా అవియే నేర్చి పాడగుదురు” అని.

తల్లి గుణవంతురాలయితే పిల్లలు గుణవంతులు అవుతారనడం స్థూలంగా న్యాయమే అనుకున్నా తల్లిచదువు కేవలం పిల్లలని తీర్చి దిద్దడానికీ, భర్తకి సేవలు చేయడానికీ మాత్రమే అన్నది సనాతనధర్మాన్ని పునఃప్రతిష్ఠించడంగానే కనిపిస్తుంది. ప్రత్యేకించి స్త్రీలకోసం ఆయన పెట్టిన పత్రికలో సతీహితబోధినిలో ప్రచురించిన కథల్లో ప్రధానాంశాలు అవే.

అయితే ఆయన అభిప్రాయాలని వారికాలంలోనే అందరూ బేషరతుగా అంగీకరించలేదు. అక్కడ చెప్పుకోదగ్గ మార్పు మొదలయింది. ఆయన భావాలకి విరుద్ధంగా రచనలు వచ్చేయి. ఆయన అభిప్రాయాలని ఖండించినప్రముఖులలో కొక్కొండ వెంకటరత్నంపంతులుగారు ఒకరు. అలాగే పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు సావిత్రి అని పత్రిక పెట్టి ఆయనఅభిప్రాయాలని ఖండిస్తూ కథలూ, వ్యాసాలూ  ప్రచురించారు. అలాటిదే మరో పత్రిక హిందూసుందరి. చారిత్ర్యకంగా ఈ పత్రికలు ప్రత్యామ్నాయ పత్రికలనే చెప్పుకోవాలి.

ఆవిధంగా 19వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాలలో ఇతివృత్తాలలో సామాన్యులజీవితాలు కథావస్తువులుగా తీసుకోడం మొదలయింది ప్రచురణ మొదలయిన తరవాత.

వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు తెలుగుకథ పుట్టుకతోనే ప్రౌఢగా పుట్టింది అంటూ గురజాడ అప్పారావుగారి దిద్దుబాటుని మెచ్చుకున్నారు. ఆకథ వచ్చింది 1910లో. కానీ అంతకుముందే 1898లో ఆధునికలక్షణాలు కలిగిన కథ ఉంది అని సోదాహరణంగా ఆచార్య రంగనాథాచార్యులుగారు తమ తెలుగుకథానిక, తొలినాటినుండీ 1930 వరకూ అన్న పుస్తకంలో నిరూపించారు. భండారు అచ్చమాంబగారి కథలతో మరి కొన్ని కథలూ కూలంకషంగా చర్చించి, ఇప్పటివరకూ దొరికిన ఆధారాలనుబట్టి అచ్చమాంబగారే తొలి కథా రచయిత అనాలి అన్నారు. ఇక్కడ మళ్ళీ మనం ఇప్పటివరకూ దొరికిన ఆధారాలను బట్టి అన్నమాట గుర్తుంచుకోవాలి.

ఉదాహరణకి అచ్చమాంబగారి కథ ఒకటి ధనత్రయోదశి. తీసుకుని ఆధునిక లక్షణాలు సూక్ష్మంగా చూద్దాం. కథ ఎత్తుగడలోనే ఆధునికత కనిపిస్తుంది. అంతవరకూ కథలు ఎలా మొదలయేవి అంటే అనగా అనగా ఒక రాజు అనో ఒకఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు గలడు అనో కదా. అందుకు భిన్నంగా అచ్చమాంబగారికథలో దీపావళి వేడుకలతో బొంబాయినగరం ఎంత కళకళలాడుతోందో వర్ణంచి, అదే సమయంలో ఒక పూరిగుడిసెలో లేమితో బాధపడుతున్న ఇల్లాలిగురించి చెబుతారు. ఇది ఈనాటికథ లక్షణం. కథలో ప్రధానాంశం పేదరికంవల్ల ధనత్రయోదశినాడు వారు పండుగ చేసుకోలేకపోవడం. ఆ ఎత్తుగడలో అయ్యో పాపం, మరి వారికి పండుగ ఎలా గడిచింది అన్నది పాఠకుడికి ఉదయించే ప్రశ్న.  ఆమె భర్త వెంకటరత్నం పనిచేస్తున్న దుకాణంలో పెద్ద గుమాస్తా ప్రోద్బలంతో వందరూపాయలు తీసుకుంటాడు కానీ తప్పు చేశానన్న తలపు ఆయన్ని బాధిస్తూనే ఉంటుంది. ఆ విషయం గ్రహించిన భార్య డబ్బు లేకపోయినా గౌరవంగా బతుకుతున్నామనీ, ఈ దొంగతనంవల్ల ఆ గౌరవం కూడా లేకుండా పోతుందని నచ్చచెప్పి, ఆ డబ్బు తిరిగి సెట్టికి ఇచ్చేయని పంపిస్తుంది. నా అభిప్రాయంలో ఇదీ నిజమైన దిద్దుబాటు.

ఈ కథ చదువుతున్నప్పుడు నాకు తోచిన మరొక లక్షణం మంచికథ లక్షణం – సమస్యకీ నిర్వహణకీ కూడా సమన్వయం కుదరాలి. అంటే సమస్య చిన్నదయినప్పుడు పరిష్కారం తేలిక అవుతుంది. ఈకథలో సమస్య దొంగతనం. పైగా ఆయన తప్పు చేసేనని మనోవేదన అనుభవిస్తున్నాడు. అలాటి సందర్భంలో భార్య నెమ్మదిగా నచ్చచెప్పి, ఆయన తన తప్పు దిద్దుకునేలా చేసింది అంటే నమ్మగలం. ఆవిధంగా చూసినప్పుడు ధనత్రయోదశి ఈనాటి విమర్శకులు కావాలంటున్న ప్రమాణాలకి సరితూగుతుంది.

అందుకు భిన్నంగా అప్పారావుగారు తీసుకున్న వేశ్యాలోలుత్వం పెద్ద సమస్య. మాటలతోనో భార్య పుట్టింటికి పోతాననో బెదిరించినంత మాత్రాన మారిపోయేంత చిన్న విషయం కాదు అని నేను అనుకుంటున్నాను. కథ చదువుకోడానికి సరదాగా ఉంది. కానీ ఒక బలవత్తరమైన సాంఘికసమస్యని తేలిగ్గా రెండు పేజీల్లో అతి చిన్నసామాన్యమయిన విషయంలా చూపడం జరిగిందిక్కడ. ఆ కథని సాంఘికసమస్య చర్చించిన కథగా ఆదరించడం సమంజసం కాదనే నాకు అనిపిస్తోంది.

(రెండోభాగం ఇక్కడ )

4 Responses to తెలుగుకథ తీరుతెన్నులు

  1. మాలతి అంటున్నారు:

    కొత్తపాళీ, ధన్యవాదాలండి.

  2. మాలతి అంటున్నారు:

    జె.యస్.ఆర్. మూర్తిగారు, – కథా విమర్శా కథానిర్మాణ కౌశలాలు విస్తరించడం లేదు – కథానిర్మాణం మాట చెప్పలేను కానీ విమర్శవిషయంలో నేను కూడా అలాగే అనుకుంటున్నానండీ. పోతే -థాశిల్పం లాంటి మరొక శాస్త్రీయమైన, నిర్మాణాత్మకమైన ఆచరణాత్మకమైన, సులభగ్రాహ్యమైన, అన్నిటికంటే ప్రధానంగా భారతీయమైన – పుస్తకం రాయడానికి అన్ని కథలూ చదవాలి కదండీ. నాకు అంత ఓపికా లేదు, అవకాశమూ లేదు అయినా మీ ప్రోత్సాహం చూస్తే ఏమయినా కొన్ని వ్యాసాలు ఒకొక అంశంమీద నాకున్న పరిధిలోనే రాయడానికి ప్రయత్నిస్తాను. మరొకసారి ధన్యవాదాలతో, – మాలతి

  3. కొత్తపాళీ అంటున్నారు:

    బావుందండీ.

  4. jsrmurthy అంటున్నారు:

    మీ తెలుగు కథ తీరుతెన్నులు చదివిన తరవాత ఇది రాయకుండా ఉండలేకపోతున్నాను. కథ చాలా శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ. ఇది జీవన దశనీ సామాజిక దిశనీ మార్చివేస్తూ దశ దిశలా వ్యాపించగలదు. తెలుగులో కథా కథకులూ విస్తరిస్తున్నంత వేగంగా కథా విమర్శా కథానిర్మాణ కౌశలాలు విస్తరించడం లేదు. ( అందుకు గల కారణాలూ దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడుకోవడానికి ఇది సమయం కాద్కాదు ) ఇలాంటి సందర్భంలో మీవ్యాసం ఎడారిలో ఒయాసిస్సులా అనిపించింది. అంతేకాదు, ఈ రెండు భాగాల వ్యాసాన్ని చదివాక ఇది మీరు రాయవలసిన కథాశిల్పం లాంటి మరొక శాస్త్రీయమైన, నిర్మాణాత్మకమైన ఆచరణాత్మకమైన, సులభగ్రాహ్యమైన, అన్నిటికంటే ప్రధానంగా భారతీయమైన పుస్తకానికి ఇది ముందు మాటలా అనిపించింది. ఇందులో ఎటువంటి అతిశయోక్తులూ లేవని ఇందు మూలముగా తెలియజేస్తున్నాను. ఇంతటి అద్భుతమైన వ్యాసాన్ని రాసినందుకు అభినందనలు. మీ సాధనాసంపత్తికి అభివందనలు తెలియజేసుకంటూ మీ అభిమాని – jsr మూర్తి.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.