మార్పు 10

ఆదివారం మధ్యాహ్నం. టైము నాలుగయింది. దారిన పోతూ పార్క్ దగ్గర ఆగేను. పిల్లలు సాకరాడుతున్నారు. పిల్లల తల్లులూ, తండ్రులూ, స్నేహితులూ ఆట చూస్తూ, పిల్లలకి హుషారిస్తూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. ముచ్చటేసే దృశ్యం. ఓ బెంచీవేపు నడిచేను కొంచెంసేపు ఆట చూసి ఆనందిద్దామని.

ఓ అబ్బాయి ఒంట్లో ఉన్న బలాన్నంతా కూడగట్టుకుని ఒక్క తన్ను తన్నేడు బంతిని. అది పదడుగులు గాల్లోకి లేచి యాభైగజాలదూరంలో ఉన్న నాకాళ్ళదగ్గర పడింది. వంగి దాన్ని అందుకోబోతుంటే ఓ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చింది బంతికోసం. ఆరేళ్లుంటాయేమో.

బంతి అందుకుని, నావేపు చూస్తూ, “నేను ప్రెసిడెంట్ అవుతాను,” అంది.

“హా. ప్రెసిడెంట్. బాగుంది,” అన్నాను.

తండ్రి కాబోలు వెనకే వచ్చి నన్ను చూసి, “థాంక్స్” అన్నాడు.

నేను తలూపేను చిన్నగా నవ్వి.

“ఇంతప్పటినుండీ ఉంటాయి ఆశలు.”

నేను ఉలికిపడి ఆమాట వచ్చినవేపు చూశాను. ఎవరో యాభై పై బడ్డట్టే ఉన్నాడు. ఆయన నావేపు చూడ్డంలేదు. నాతో అన్నాడో తనలో తనే అనుకుంటున్నాడో నాకర్థం కాలేదు. ఆపిల్లమాటకే అనుకుంటా ఆయన వ్యాఖ్య. ఆ పిల్ల ఆయనకి పరిచయమా? అదే నిజమయితే, మరి ఆ పిల్ల ఆయనతోనే ఎందుకు మాటాడలేదు?

నేను ఊరుకున్నాను.

ఆయన మళ్ళీ మొదలు పెట్టేరు. “ఇక్కడే పుట్టింది కాబోలు. తల్లో తండ్రో చెప్పి ఉంటారు నువ్వు ప్రెసిడెంటు కావచ్చని. ఇంకా ఇండియా ప్రధానివి కూడా కావచ్చు అని కూడా చెప్పేరేమో. మనకా పట్టింపుల్లేవు కదా … ఎక్కడ పుట్టినా … ప్రధానికావడానికి ఎలాటి ఆంక్షలూ లేవు. మనవి విశాల హృదయాలు. ..”

తలూపేను అవునన్నట్టు ఆట చూస్తూ. ఆయనకి నాసమాధానం అక్కర్లేకపోతే నావేపు చూడరు. నేను తలూపేనో లేదో తెలీదు. నాసమాధానం కావలిస్తే నావేపు చూస్తారు. నేను వింటున్నట్టే లెక్క అనుకుంటూ. నిజానికి ఆయన నాతో మాటాడుతున్నట్టు నాకు అనిపించలేదు. ఆటాడుతున్న పిల్లల్ని చూస్తూ వినీ విననట్టూరుకుంటే పోలే …

“మాది గుంటూరుదగ్గర పెదరెడ్లపల్లె. మాఊళ్ళో అప్పుడే కొత్తగా పెట్టినబళ్ళో నాచదువు  … బాగా సాగడంలేదని మానాన్న నన్ను తాతగారింటికి పంపించేరు …. హైదరాబాదు. మాతాతగారు లండన్‌లో చదివి వచ్చి హైదరాబాదులో ఐసియస్ ఆఫీసరుగా ఉండేవారు. అంచేత నాచదువంతా ఇంగ్లీషు … బతుకంతా ఇంగ్లీషు … ఆయనకి మహా నిష్ఠ. నిరతాగ్నిహోత్రుడు. యమకం, రుద్రం రోజూ పారాయణ అయినా చదువు మాత్రం అంతా ఇంగ్లీషు. రెండు సాంప్రదాయాలూ కలగలుపుగా అంత ఛాందసంగా పాటించిన మనిషి మరొకరిని నాజీవితంలో నేను చూడలేదు.  … నాకూ అవే వచ్చేయి. ఏదైనా పట్టుదలతో సాధించడం, సాధించేవరకూ నిద్రపోకపోవడం … మనిషన్నాక ఒక నియమం ఏర్పరుచుకుని ఆ నియమం నిష్ఠగా పాటించాలని ఆయన అభిమతం. నాకూ అంతే … 80, 20 రూలు. అంటే తెలుసా? నాబాధ్యత ఎనభైశాతం, ఆయనబాధ్యత 20 అన్నమాట నేను తీసుకునే నిర్ణయాల్లో.  అలాగే బాధ్యత చేపడితే సక్రమంగా నిర్వర్తించాలి. ఏదోఒకటి “చేస్తానన్నాను, చేసేను అన్నట్టు” ఉఁడకూడదు. పరిణామాలు క్షుణ్ణంగా ఆలోచించుకుని కానీ దిగకూడదు … “

నాకు చిరాకేసింది. “ఇదుగో, ఎవరితో మాటాడుతున్నావు? అసలు నువ్వు చెప్తున్నదేమిటి? ఏ మిటీ చేంతాడుకథ?” అని గట్టిగా కసురుకుని ఉందును మరో సందర్భం అయితే. ఇదే నాసొంతిల్లా ఏమన్నానా? అరవడానికి. ఆయనిష్టం ఆయనది. పోనీ లేచి పోతే పోలే అని కూడా అనిపించింది. కానీ మరోపక్క చిన్న కుతూహలం కూడా … ఈయన ఏం మాటాడుతున్నారు? ప్రకాశంగా ఈ స్వగతం ఏల?

హోహో … హోహో … పార్కులో చేరిన ప్రేక్షకులంతా జయజయద్వానాలు చేసేరు.

ఇందాకా ప్రెసిడెంటునవుతానన్న అమ్మాయి గోల్ చేసింది.

నేను కూడా హుషారుగా చప్పట్లు కొట్టేను.

“గోలు కొడితేనే అంత మురిసిపోతున్నారు. నిజంగా ప్రెసిడెంటయితే ఇంకా ఎంత మురిసిపోతారో …”

అన్నాడాయనే మళ్ళీ. ఆ అమ్మాయి గోలు కొట్టినందుకు ఆయన సంతోషించినఛాయలు లేవు. ఇంకా ఏదో చెయ్యలేదని విచారిస్తున్నట్టుంది ఆయనవాలకం.

“నాచదువు పూర్తయి ఇంజినీరునయేను. మెకానికల్ ఇంజినీరుని. ఇప్పుడు స్కూటర్లలో పెడుతున్న  స్మాలింజన్ నేనే డెవలప్ చేసేను. ప్రెసిడెంట్ ఎవార్డు కూడా వచ్చింది. ఈరోజు మెకానికల్ ఇంజినీర్లలో నాపేరు తెలీనివాళ్ళు లేరు.”

బహుశా ఇప్పుడెవరూ ఆమాట అనడంలేదేమో. అదేనేమో ఆయనబాధ.

“మాపెద్దవాడు కూడా నాలాగే ఇంజినీరు కావాలని ఎంతో ఆశ పడ్డాను. డాక్టరయేడు. అమెరినమ్మాయిని చేసుకుని వేరే స్థిరపడ్డాడు…. యాడాదికోమారు కలుస్తాం. ఇక్కడ మదర్స్ డే, ఫాదర్స్ డే లాగే అర్థంలేని ఆచారాలు. రెండోవాడికి హైస్కూలు అయిపోతుంది ఈయేడు. కాలేజీలకి అర్జీలు పెట్టుకుంటున్నాడు. వాడిష్టం. నేను చెప్పలేను. … ప్రేమా దోమా అంటూ జీవితాలు నాశనం చేసుకునేవాళ్లని ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు?”

ఉలిక్కిపడ్డాను. హఠాత్తుగా ఈయనగానీ విషి తండ్రి కాదు కదా అనిపించింది. ఎందుకలా అనిపించిందటే చెప్పలేను. బహుశా ఆయన్ని నేను కలుసుకోడం జరిగితే మా సంభాషణ ఇలాగే ఉండేదేమోనన్న ఊహ కావచ్చు.

“అయినా మనకాలంలో ఇలా కాదు కదా. చదువంటే చదువూ, ఉద్యోగం అంటే ఉద్యోగం, సంసారం అంటే సంసారం .. దేనికదే .. దానిమీదే దృష్టి. నేను చదువుకునేరోజుల్లో చదువుమీదే నాధ్యాసంతా. మాతాతగారు చండశాసనుడు. ఆయన అసలు మాట కూడా అనఖ్ఖర్లేదు. ఆయన గదిలో అడుగు పెడితే చాలు నిశ్శబ్దం అయిపోయేది గది. కూర్చున్న ఆడవాళ్ళు లేచి నిలబడేవారు. కొందరయితే పక్కగదిలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఒక్కనాడు కూడా ఆయన ఎవరిమీద గానీ చెయ్యెత్తడం నేను చూడలేదు. అయన ప్రెజంస్ అలాటిది. …

మావాడికి చెప్పేను ఆపిల్లమీద అంత మనసుంటే చేసుకో. కానీ ముందు చదువు పూర్తి చెయ్యి. తరవాత ఆపిల్లకి ఇంకా నీమీద మనసుంటే చూద్దాం. ఇప్పుడు వయసు పొంగు అలా అనిపిస్తుంది కానీ కాస్త ఎదిగేక నీ తలుపులు మారొచ్చు. ఆఅమ్మాయి తలపులు మారొచ్చు. నీకో ఆఅమ్మాయికో ఇంకా ఎక్కువ ఇష్టమయినమనిషి తగలొచ్చు కదా అని.  … వింటేనా … ఒకటే గోల ఆ అమ్మాయి లేకపోతే బతుకు లేదూ అంటూ. సినిమాలొచ్చి మనకి పెట్టిన భిక్ష ఇదనుకుంటాను. …”

నాకు నవ్వొచ్చింది. ఎంతసేపూ తప్పు ఎదటివారిదే … అరవింద, విషి, .. వాళ్ళ నాన్న … మరి సిరిమాటలు కూడా అలాగే ఉన్నాయా? నాకెందుకో లేదనే అనిపించింది. మానవనైజం కాబోలు.

“పోనీ, నిజంగానే ఇద్దరూ made for each other, marriage made in heaven అనుకుని ఆ అమ్మాయితో మాటాడడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ వినదే .. కాస్త ఆలోచించుకోవాలి కదా పెద్దాయిన చెప్తున్నారు అనైనా లేదు. ప్రేమా ప్రేమా అంటూ అల్లాడతాడు అక్కడికి ప్రేమంటే ఏమిటో నాకు తెలీనట్టు. నేనూ ప్రేమించే పెళ్ళి చేసుకున్నాను.”

నాకు ఇప్పటికి కాస్త కుతూహలంలాటిది కలిగింది. “అలాగా,” అన్నాను.

“నాకూ తెలుసు ప్రేమంటే. నాభార్యకి ఏంకావాలో నాకు తెలుసు. ఆమెకి కావలిసినట్టు అన్నీ అమరుస్తాను. అంతే కాదు. ఆమెకి తెలీనివి కూడా నేనే గమనించి చెప్తాను నీకు ఇది బాగుంటుందని, ఇలా ఉండాలని. అసలు ఆమెని సంతోషపెట్టడానికే వీడిని కూడా ఓదారిలో పెట్టాలని చూడ్డం.”

ఇంకా ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నాను.

“మాతాతగారికి నామీద ప్రేమ ఉండబట్టే కదా నన్ను అంత కట్టుదిట్టాలతో పెంచేరు. పెద్దలు అనుభవంతో చెప్తారు. అది కూడా వినాలి. అదే నేను ఆ అమ్మాయికి చెప్పేను. ”

నేను నవ్వేను, “అనుభవాలా… మానవాళి చరిత్రనుండీ నేర్చుకున్న పాఠం ఒక్కటే – అది చరిత్ర చూసి మనం ఏమీ నేర్చుకోం అన్నది. నిజంగా చరిత్ర చూసి పాఠాలు నేర్చుకుంటే లోకం ద్వాపరయుగంలో భారతయుద్ధంతరవాతైనా బాగుపడేది. ఇన్ని యుద్దాలు ఉండేవి కావు. ” ఆయన నామాట వినిపించుకోలేదు. లేదా పట్టించుకోలేదు.

“ప్రేమంటే నీకు కావలసింది చూసుకోడమే కాదు అబ్బాయికి ఏం కావాలో కూడా చూడ్డం అని. … అసలు ఆ అమ్మాయికి ఆ తత్త్వమే అర్థమయినట్టు లేదు. లేదా నేనే పొరపాటు అంచనా వేసేనేమో. నెమ్మదిగా కనిపిస్తే అణుకువగల పిల్ల అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడనిపిస్తోంది స్లో అయైనా ఉండాలి. మొండితనమయినా అయిఉండాలి అని.”

“స్లో అని ఎందుకంటారు? ఆలోచించి నిదానమీద జవాబు చెప్పడం కూడా కావచ్చు కదా,” అన్నాను, నామమాత్రంగానైనా తెలీని ఆ అమ్మాయిపక్షం వకాల్తా పుచ్చుకుని. దానికి కారణం నాగురించి కూడా అలాగే అనుకోవచ్చు మరి. నేను కూడా నిదానంగానే కనిపిస్తాను. నేను కూడా మాటకి మాట టక్ టక్‌మని వెంటవెంటనే చెప్పను మరి!

“ఏమైనా ఆపిల్ల మావాడికి తగదు. అది మావాడు అర్థం చేసుకునేలా చెప్పడం ఎలాగో నాకు తెలీడంలేదు” అన్నారాయన లేస్తూ.

ఈయన విషితండ్రి అవునో కాదో నాకు తెలీదు కానీ అయిఉంటే, నేను సంభాషణ ప్రారంభిస్తే, అది ఇలాగే ఉండేది అనిపించింది.

నిదానంగా తలొంచుకుని అడుగులేసుకుంటూ కోరలు తీసిన సింహంలా నడిచిపోతున్న ఆయన్ని కనుమరుగయేవరకూ చూసేను. అయ్యో అని కూడా అనిపించింది నాకు అర్థరహితమే అయినా.

(ఫిబ్రవరి 26, 2011)

One Response to మార్పు 10

  1. Sowmya అంటున్నారు:

    అదేమిటి, వ్యాఖ్యలే లేవా…. ఇంటరెస్టింగ్!
    ఆ అబ్బాయి విషీ తండ్రా? తర్వాతేమయింది? అన్న కుతూహలం ఒక్కరికీ కలుగలేదూ? చూస్తూనే ఉండండి, నిరంతర వార్తా స్రవంతి, టీవీ 9!! :)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.