మార్పు 12

లీలకి నవ్వు రాలేదు. ఏడవాలనుంది కానీ అదీ రాడం లేదు. నగరివాకిట నుండు నల్లగుండులాటిదేదో గుండెల్ని పట్టి  దిగలాగుతున్నట్టుంది. కారుమేఘాలు తరుముకొస్తున్నట్టుంది. రాబోయే శిశిరాన్ని రారమ్మంటూ స్వాగతం పలుకుతూ ఆకులు రాల్చుకుంటున్న మహావృక్షంలా ఉంది మనసంతా.

నోరి నరసింహశాస్త్రిగారు చెప్పినట్టు మహాకవులంతా ఏదో రకం ఏడుపు ఏడుస్తూనే ఉన్నారు యుగయుగాలుగా. తనక్కూడా తనదైన ప్రత్యేకమైన ఫక్కీలో ఓ ఏడుపు రాకూడదూ … ఎలాటి ఏడుపు బాగుంటుంది? అల్లసాని పెద్దనలా అల్లనల్లన? భట్టుమూర్తిలా బావురుమనా? ముక్కు తిమ్మనలా ముద్దుముద్దుగానా? కృష్టశాస్త్రిలా ఎలుగెత్తి ఏడ్తునా?

సుందరాన్నే అడిగాలేమో … ఆయనగారికి తెలీనిసంగతి లేదు. మాటాడలేని విషయం లేదు. ఆయనఅభిప్రాయాలకి గురి కాని వస్తువు లేదు భూనభోంతరాళాలో. అడగాలే కానీ ఏదో ఓ పుస్తకంపేరు చెప్పి ఉదాహరణలు గుప్పిస్తూ ఎన్నో విషయాలు చెప్పేగలడు. పండితపరమేశ్వరుడన్నబిరుదు ఊరికే రాదు కదా. మూతిమీద మీసం మొలవకముందే విశిష్టసేవాపురస్కారం పుచ్చుకున్న గురవరాగ్రణి.

000

హీహీ అంటూ సన్నగా నవ్వుతోంది అరవింద.

“ఏమిటంత నవ్వొస్తోంది?” అనడిగేను.

“అందరూ నవ్వుగురించి రాస్తారు. నోరి నరసింహశాస్త్రిగారు ఏడుపుగురించి భలే చెప్తున్నారు. నవ్యకవతలో కృష్ణశాస్త్రిగారు ఏడుపు ఫాషను చేసారు, ఏడుపులో మాధుర్యము చూపినారు అన్నా తప్పులేదు, ఏడుపు స్పెషలిస్టు ఆయన అంటున్నారు. కృష్ణపక్షానికి ముందే ఆయన కన్నీరు అన్న కావ్యం రాసి ఏడుపు స్పెషలిస్టు అనిపించుకున్నారు అంటారు. మరి అంతకుముందే నన్నయ్య, తిమ్మన, భట్టుమూర్తి, శ్రీనాధుడూ ఏడ్చారంటారు. ఇంతకీ ఈ ఏడుపుకవిత్వానికి ఆద్యులెవరూ అని హీహీ,” అంది మళ్ళీ.

“ఏడుపుకి ఆది ఏమిటి? పిల్లలు ఏడుస్తూనే పుడతారు కదా. ఏడుపు సృష్ట్యాదినుండీ ఉంది. ఆ తరవాత మనిషి అది లేదూ ఇది లేదూ అంటూ జన్మంతా ఏదో ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు” అంది సిరి.

“అలా అనకు అమ్మమ్మా. అందరూ ఏడవడంకోసమే పుట్టరు. ఏడ్చేవాడికి ఏదో ఒక సాకు ఎప్పుడూ దొరుకుతుంది. అది వేరే సంగతి,” అంది అరవింద ఆరిందాలా.

“ఆ సాకులేమిటో కూడా చెప్పు మరి,” అన్నాను కాలక్షేపానికి.

అరవింద నావేపూ, సిరివేపూ మార్చి మార్చి చూసి, “నాకు తెలీదులెండి,” అంది.

“చెప్పడం ఇష్టంలేక అదో సాకు,” అన్నాను ఎద్దేవా చేస్తూ.

సిరి నవ్వింది. “తెలీడంలేదూ? ఆమె అంటున్నది విషిగురించి.”

“ఆ కథ అయిపోయిందనుకున్నానే. మళ్ళీ ఏమయింది?”

“నన్ను వదిలేలా లేడు. డేటు కాదులే అంటూనే కాఫీకి రా, సినిమాకి రా అంటూ ఏదో ఓ సాకుతో పిలుస్తుంటాడు. నేను ఏ పార్టీకి వెళ్ళినా అక్కడ తనూ హాజరు వీళ్ళు నాక్కూడా స్నేహితులే అంటూ.”

“నిజమే కావచ్చు కదా. ఒకే స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరికీ తెలిసివాళ్ళుండడంలో ఆశ్చర్యమేముంది?”

“కాదండీ. నిజంగా ఏ స్నేహమూ లేకపోయినా పిలవకపోయినా తయారవుతాడు నేనూ ఉన్నానంటూ. ఇహనక్కడ ఫార్సు చూసితీరాలి. మరో అమ్మాయితో సరసాలాడుతూ, నన్ను వెక్కిరిస్తూ … అక్కడికి నేనేదో కుళ్ళుకుని పరుగెత్తుకెళ్ళి అతడిఒళ్ళో వాలిపోతానని.”

“మరి నీకు కుళ్ళుగా లేదా?”

అరవింద మాటాడలేదు. మనిషన్నాక ఆమాత్రం ఉండకపోదు. ఎలప్రాయం, ఎంత కాదనుకున్నా తొలివలపు … అంతకుమించిన సర్వసాధారణమయిన మనస్తత్త్వాలు కూడా ఉంటాయి కదా. అరవింద చూపు అటు మొగ్గుతోంది పైకి చెప్పకపోయినా.

“కవులుమాటేమో కానీ నిత్యజీవితంలో వేళాకోళాలూ, హాస్యం, వ్యంగ్యం అన్నీ ఏడుపు దాచుకోడానికేనేమో. అది వదిలేయండి. నరసింహశాస్త్రిగారు ఈరోజుల్లో కూడా కవితల్లో ఏడుపు ఎక్కువగానే ఉందన్నారు కానీ నామటుకు నాకు అది మారిందనిపిస్తోంది. భానుమతిగారి తెలివితేటలవిలువ, జీవితంలో అగాధాలు కథల్లో కథానాయకులు ఏడవలేక నవ్వే సీదా మనుషులే. ముళ్ళపూడి వెంకటరమణగారు భగ్నవీణలూ, బాష్పకణాలూ కథలో హాస్యమే ఎక్కువ. అందులో నాయకుడూ నాయికా నిజంగా బాధ పడలేదనే అనిపిస్తుంది. ఆయనకి వారి హృదయవేదన అర్థం కాలేదో, దాన్ని తేలిక చేయాలనో.”

“కలకంఠికంట కన్నీరొలికినయింట సిరి యుండనొల్లదంటారు కానీ కవిత్వం చిలుకుతుందేమో.”

“కవిత్వాలమాటకేంగానీ మాఅక్కయ్యయింట సిరులూ కన్నీరూ ఒక్కలాగే ఒలకడమేమిటి పొంగి పొరలుతున్నాయి. ఆవిడకి సదా నెత్తిమీద నీళ్ళకుండ ఉంటుంది. ఏడ్చి సాధించుకోడం అంటే ఏమిటో ఆవిడదగ్గిరే నేర్చుకోవాలి.”

“శోకంలోనించి శ్లోకం పుట్టిందంటారు, అదే రామాయణమయింది. కానీ ఈమధ్య వచ్చిన కల్పవృక్షాలు, విషవృక్షాలూ, విషవృక్షఖండనలూ – ఎవరికి వారే వారి పాండిత్యం ప్రదర్శించుకోడానికే పనికొచ్చింది కానీ అందులో శోకమూ లేదు. హాస్యమూ లేదు. చివరి రెండిట్లో కోపం, వ్యంగ్యం ఉన్నట్టుంది. మరి విషాదం వ్యంగ్యానికీ కోపానికీ, చివరికి తిట్లలోకీ దిగుతోంది అనుకోవాలా?”

“పూర్వం తిట్లకి సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు.”

“లేదులే. అచ్చతెలుగు తిట్లు కూడా బాగానే చోటు చేసుకున్నాయి కదా ఈనాటి రచనల్లో.”

“బాగుందీ వరస. మనం ఎక్కడో మొదలెట్టి ఎక్కడో తేలేం. సాహిత్యంలో ఏడుపు ఎలా ఉంటుందంటే …”

“ఎక్కడో తేలడం ఏమిటి. ఏడుపు మారి కోపతాపాల్లోకీ తిట్టుకవిత్వంలోకీ దిగిందని నిర్ధారణ చేసేం.”

“శోకంలో పుట్టి శ్లోకంగా మారి తరవాత ఆవేశంలోకి దిగిందంటావా?”

“బాగానే ఉంది ఏడుపుమీద మాటాడ్డానికింత ఉంటుందనుకోనే నేను,” అన్నాను నేను లేస్తూ.

000

“శోకంలోంచి శ్లోకం వచ్చింది. మరి నేనిప్పుడు మరో సుందరాయణం రాయలేమో?” అనుకుంది లీల.

నిజానికి తనది శోకం ఎప్పుడయింది? ఇంతకాలం నవ్వుతూ తుళ్ళుతూ గలగలా సెలయేరులా సాగుతున్న జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా గండి పడింది?

లీల ఆలోచనల్లో పడిపోయింది.

(మార్చి 16, 2011)

6 Responses to మార్పు 12

  1. మాలతి అంటున్నారు:

    @ సౌమ్య, మంచి పాయింటే ప్రస్తావించేవు. నిజమే. హృదయవేదన అర్థమయినప్పుడే అలా రాయగలరేమో. ఎంచేతంటే ఆయన రాసినతీరు మనసుకి హత్తుకుంటుంది కూడా.

  2. Sowmya అంటున్నారు:

    ముళ్ళపూడి వెంకటరమణగారు భగ్నవీణలూ, బాష్పకణాలూ కథలో హాస్యమే ఎక్కువ. అందులో నాయకుడూ నాయికా నిజంగా బాధ పడలేదనే అనిపిస్తుంది. ఆయనకి వారి హృదయవేదన అర్థం కాలేదో, దాన్ని తేలిక చేయాలనో.”
    - రమణ గారు అన్నింటి గురించీ అలా సరదాగా మాట్లాడేస్తూ ఉంటారు కదా, అలాగే అదీ కాబోలు. నేనింకా భగ్నవీణలూ… చదవలేదు లెండి. ఊరికే – ఊహిస్తున్నా, అంతే. హృదయ వేదన అర్థం చేస్కుంటేనే అలా రాయొచ్చు – అని కూడా అనిపిస్తుంది నాకు. :)

  3. మాలతి అంటున్నారు:

    @ free software download, థాంక్స్.

  4. free software download అంటున్నారు:

    i like it మార్పు 12 « తెలుగు తూలిక now im your rss reader

  5. మాలతి అంటున్నారు:

    :) ) సంతోషం సరయు.వెంకట్ గారూ – మాలతి

  6. sarayu అంటున్నారు:

    malathi garu
    me rachanalathi me abhimaniga maripoya

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.