మార్పు 13

ఇక్కడికొచ్చేక మరో పెద్ద మార్పు ఏది కొన్నా రెండోసారీ, మూడోసారీ షాపువాడితో  “యిచ్చిపుచ్చుకోడాలు” చెయ్యాల్సొస్తోంది. మంచం అయితే నాలుగుసార్లు మార్చాల్సివచ్చింది. మారోజుల్లో అంటే అదేలెండి నాచిన్నతనంలో పరుపు అంటే పరుపు అంతే. ఏ దూదేకులాడో ఓ పరుపు కుట్టిస్తే, అదే రెండు తరాలకి సరిపోయేది. ఇప్పటికీ నాకు గుర్తే – పరుపుచుట్టలు పడుకునేవేళకి తెచ్చి పరుచుకోడం, మళ్ళీ లేచినతరవాత అవి చుట్టి ఏ మూలగదిలోనో దాచేడం. అదొక దినచర్య. నాకెందుకో అలాటివి సరదాగా ఉంటుంది.

మా యింట్లో పెద్ద పందిరిమంచం ఉండేది. దానికి నాలుగు పొడుగాటి రాటలు నాలుగు మూలలా, దోమతెర కట్టుకోడానికి. అలాటివి ఆరోజుల్లో భాగ్యం అన్నమాట. పందిరిమంచంమీద పరుపు మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. చుట్ట చుట్టుకోడాలూ మూల పెట్టుకోడాలూ లేవు. సాధారణంగా అది ఆ యింటి యజమాని భోగభాగ్యాలని తెలియజేస్తుంది. అంతే.

ఇప్పుడు మళ్ళీ బెడ్రూములొచ్చేక ఆ పందిరమంచం ఆనవాళ్లయితే కనిపిస్తున్నాయి కానీ ఆ సౌఖ్యం మాత్రం లేదు.

అన్ని రంగాల్లోలాగే పానుపులరీతులకి కూడా స్పెషాలిటీలొచ్చేయి. posturopedic, tempopedic, beauty rest, … ఇంకా మరేవో ఇస్టులూ రొష్టులూ …

షాపులో అడుగెట్టగానే “పడుకుని చూడండం”టాడు అమ్మకాలబ్బాయి. నాకు అది మహ ఇబ్బందిగా ఉంటుంది. అతను ఎదట నిలబడి ఆ పానుపుపై నేనెలాటి ఆనందాన్ననుభవిస్తున్నానో అతను సినిమా చూసినట్టు చూస్తుంటే నేను దానిమీద మేను వాల్చి పైన సీలింగు చూడ్డంలో నాకు ఆనందం కనిపించదు. పడుకోడం ప్రైవేటుమేటరు కదా. అమ్మకాలబ్బాయిలందరూ అలాగే. అంటే అందరూ కాదు లెండి. కొందరు “పడుకుని చూడమ”ని చెప్పి అక్కడినించి వెళ్లిపోతారు కొనే ఉద్దేశ్యం ఉంటే పిలవండని చెప్పి. వాళ్ళెలా చెప్పినా నాకు మాత్రం అలా పబ్లిగ్గా పడుకోడం ఇబ్బందిగానే ఉంటుంది. అసలు నాకు చొక్కాలూ పాంటులే షాపులో వేసుకునీ తీసుకునీ చూడ్డం చిరాకు. అలా అని వాటిని కొని ఇంటికి తెచ్చి తొడుక్కుని చూసి బాగోలేకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేయడానికో మార్చి మరోటి తెచ్చుకోడానికో వెళ్ళడం కూడా అట్టే సరదా లేదు. అయితే మరేం చేస్తానూ అంటే, ఏంలేదు, కొననంతే. నావార్డురోబు పదిహేనేళ్ళనాటిది. చాలామంది జనాలు నేను చాలా చాలా అవుటాఫ్డేటు దుస్తులు వేసుకు తిరుగుతున్నాననుకుంటున్నారని నేను కూడా అనుకుంటున్నాను కానీ నేననుకుంటున్న మరొకసంగతి వారు అనుకోడంలేదు. వారికి తెలీదు.

నా ఈ పురాతన వార్డురోబు మళ్ళీ ఫాషను అయిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా పాతబట్టలే రానున్న భావితరానికి మార్గదర్శకాలవుతాయి. అప్పుడు నేను కూడా ఆటోమేటిగ్గా అప్టుడేటయిపోతాను. అంతెందుకు ఈమధ్య జరిగిన ఒక ఉదంతం చెప్తాను. నిజంగానే జరిగింది. ఇందులో నేనే హీరోని. ఒకరోజు ఓ పాత చొక్కా తొడుక్కుని రోడ్డుమీద నడిచి వెళ్తున్నాను. ఆ పక్కనే నిల్చున్న ఓ అమ్మాయి “నైస్ షర్ట్” అంది నన్ను చూసి. ఆ అమ్మాయికి పదేళ్ళుండొచ్చు. నా చొక్కాకి పదిహేను. అంటే ఆ పిల్ల పుట్టకముందు కొన్నది అన్నమాట. అంచేత ఆపిల్లకి అది కొత్తే!

సరే ఈనాటి మంచాలషాపులో నవనాగరీక మంచాలసంగతికొస్తాను.

అసలు ఇలా మొదలవుతుంది మంచాలషాపులో బాతాఖానీ

“ఎంతలో చూస్తున్నారు?”

“ఎంతుంటాయేమిటి?”

“మూడువందలనించీ ఏడువేలవరకూ ఉన్నాయి?”

నేను సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు రెండు క్షణాలు ఆలోచించి, ఏడువేల పానుపు నాకు అక్కర్లేదనీ, మూడువందలమంచం చూపమనీ అడుగుతాను.

అప్పుడు చెప్తాడు “అబ్బే అది ట్విన్ బెడ్” అని. అంటే పిల్లలకన్నమాట. నిజానికి నేను చొక్కాలు అప్పుడప్పుడు పిల్లల విభాగంలోనే చూస్తాను. పెద్దలసైజులు మరీ భారీమనుషులకి. పిల్లలవన్నీ నాకు పట్టవనుకోండి. అది కూడా ఒక కారణమే నేనట్టే షాపింగు చెయ్యకపోవడానికి.

ఇంతకీ నేను కొనబోయే పరుపుసంగతి – పైబెడ్డు పిల్లలకి మాత్రమే అని తెలుసుకొనినదానినై, అయితే పెద్దసైజువి చూపమంటాను. అక్కడినుంచీ ఎడ్వాన్సుడు ప్రశ్నావళి మొదలవుతుంది.

సుతిమెత్తని పరుపు కావలెనా?

కొంచెం మెత్తనిదా? …

గట్టిగా ఉండేదా?

కొంచెం గట్టిగా ఉండేదా?

చాలా గట్టిగా ఉండేదా?

ఆతరవాత మీరు బోర్లా పడుకుంటారా

వెల్లకిలా పడుకుంటారా

పక్కకి తిరిగి పడుకుంటారా.

- ఇక్కడికొచ్చేసరికి ఆయనగారు అడగని ప్రశ్నలు కూడా నాకు తోస్తాయి.

“ఏ పక్కకి – ఎడంపక్కా కుడిపక్కా తేడాలు కూడా ఉంటాయా?” అని అడుగుతాను ఎంతో కుతూహలంగా.

అతను తెల్లబోయి, “మీకు అది ముఖ్యమా?” అనడుగుతాడు నాఅంత సీరియస్గానూ. మీరు గమనించే ఉంటారు. షాపరులెప్పుడూ లేదు అనరు. తమకి తెలీకపోయినా, తమదగ్గర మనం అడిగింది లేకపోయినా మరో ప్రశ్న వేస్తారు.

“నేను ఆ పక్కా, ఈ పక్కా, వెల్లకిలా, బోర్లా అన్ని విధాలా పవ్వళిస్తాను. కానీ మీరు ఇలా పక్కపక్కలకి వేరు వేరు పక్కలుంటాయంటుంటే, నాకు ఇంకా వివరాలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే నాకు కుడిచెవి మాత్రమే వినిపిస్తుంది. అంటే నేను కుడివేపు తిరిగి పడుకుంటే, ఫోనొస్తే తెలీదు ఎడమచెవి వినిపించదు కనక. దానిక్కూడా మీరేమైనా సౌలభ్యం కనిపెట్టేరేమో అని అడుగుతున్నాను” అంటాను వినయంగా.

“నాకు తెలిసి లేదనుకుంటాను. మీకు కావలస్తే స్పెషలార్డరు చెయ్యగలమేమో కనుక్కుని చెప్పగలను.”

అలాటిదేమీ నాకక్కర్లేదని చెప్పి, (ఎందుకంటే స్పెషలనగానే మరో రెండు వందలు వడ్డిస్తాడేమోనని), ఉన్నవాటిలోనే సుమారుగా మెత్తగా ఉన్నది కావాలంటాను. పూర్వం ఎప్పుడో మాఅమ్మాయి వచ్చినప్పుడు “అబ్భ నీపరుపు ఇంత కఠినంగా ఉందేమిటి?” అందిలెండి. అది మనసులో పెట్టుకునే కానీ నాకయితే ఆపూర్వపరుపు ఎంతో హాయిగా ఉండేది.

“ఇహ తప్పదు, ఏంచేస్తాం, నాఅవసరం మరీ” అనుకుంటూ బితుకుబితుకుమంటూ నలువేపులా ఓ సారి కలియచూసి, ఎవ్వరూ నావేపు చూడ్డంలేదని దృఢపరుచుకుని గబుక్కున ఇట్టే వాలి అట్టే లేచిపోతాను.

ఇలాటి అవస్థలన్నీ భరించి ఆ మృదు హంసతూలికాతల్పం ఇంటికి తెచ్చుకున్నాను. వారంరోజులు తిరిగేసరికి ఆ పరుపుమధ్యలో మూడంగుళాలలోతు గుంట పడింది. ఆ లెక్కన నెలరోజులు తిరిగేసరికి ఆ గోళాకాలం పరుపుమీద నా మోకాళ్లు నామొహంలోకి చొచ్చుకుపోతాయేమో అనిపించింది. చూశారా ఈ “పొజిషను”సంగతి మాటాడనే లేదు ఆరోజు ఆ సేల్సుమేను. సరే షాపుకి వెళ్ళేను ఇదేం పరుపు అని అడగడానికి. ఆ పక్కలో గుంట ఫొటోలు తీసుకుని, ఎక్కడ ఎప్పుడు కొన్నానో అవన్నీ చిట్టా ఆవర్జాలు చూసుకుని పెద్ద యుధ్ధానికి సన్నిద్ధమయి వెళ్ళేను కానీ ఆ షాపువాడు ఒక్క వాక్యమయినా పూర్తి చెయ్యనియ్యలేదు. పరుపు బాగులేనందుకు విచారం వెలిబుచ్చి, మరోటి ఇస్తాం అన్నాడు. సరే నన్నాను. వేరే చెప్పడం ఎందుకులెండి. అదీ అంతే అయింది.

ఇహ మరీ సోదిలా అనిపించే వివరాల్లోకి పోను కానీ మొత్తంమీద ఇలా కొన్న ఉత్తమ పరుపు ఇచ్చేసి మరోటి పుచ్చుకుని, మళ్ళీ అది కూడా అలాగే అయితే, .. అది ఇచ్చేసి, మరో షాపుకి వెళ్ళి అక్కడ మరోటి కొని .. మొత్తమ్మీద ఇప్పుడు నాలుగో పరుపుతో స్థిరపడ్డాను. ఇది కూడా నా వెనకటి ఊళ్ళో అణాపరక పరుపంత సుఖంగా లేదు కానీ ఇంత డబ్బు పెట్టి కొన్నాను కనక సుఖంగానే నిద్రిస్తున్నానని నన్ను నేనే నమ్మించుకుని సరిపెట్టుకున్నాను. ఈకథంతా ఓ స్నేహితురాలికి చెప్పుకుంటే, “అవునండీ ఈపరుపులంతే. అందుకే నేను హాయిగా నేలమీద పడుకుంటున్నాను” అంది! అయ్యో, మాతృదేశానుంచీ ఇన్నివేలమైళ్ళదూరం వచ్చి, నానా కష్టాలు పడుతూ సంపాదించే సంపాదనలూ కమనీయ భూమిభాగములమీద శయనించడానికా అని కొంచెంసేపు వాపోయేను. మ్.

అలాగే సోఫా కూడా రెండోది నిన్న ఇంటికొచ్చింది. ఇంక ఇల్లొక్కటే రెండోది కాదు. కనీసం ఇక్కడికొచ్చేక ప్రారంభమయిన ఈ కొత్త ఆనవాయితీ నిలబెట్టుకోడానికైనా మరో ఇల్లు చూద్దాం అనుకుంటున్నాను.

అంతలోనే ఏవో ఆలోచనలు – ఆదేశాన్నించి ఈధేశానికి, ఆకాలంనుంచీ ఈకాలానికి, ఆనాటి దృక్పథాలనుండీ ఈనాటి దృక్పథాలకీ … గబగబా మారిపోతున్న సాంకేతిక విన్యాసాలకీ .. మధ్య …

(మార్చి 22, 2011)

10 Responses to మార్పు 13

  1. Sowmya అంటున్నారు:

    ““ఏ పక్కకి – ఎడంపక్కా కుడిపక్కా తేడాలు కూడా ఉంటాయా?” అని అడుగుతాను ఎంతో కుతూహలంగా.”
    - ఇక్కడ నుంచి ఒకటే నవ్వాను మిగితా టపా మొత్తం… Hilarious!!

  2. మాలతి అంటున్నారు:

    @ నాగేస్రావ్, అవునండీ, ఈలోకానికి మనలాటివాళ్ళు కూడా ఉండాలి మరి. :)

  3. నాగేస్రావ్ అంటున్నారు:

    “నావార్డురోబు పదిహేనేళ్ళనాటిది”…”నాకు కుడిచెవి మాత్రమే వినిపిస్తుంది”
    ఐతే మీరూ మన ‘టైపే’ అన్నమాట!

  4. మాలతి అంటున్నారు:

    @ స్ఫురిత, మొత్తమ్మీద అన్నీ చదివేశారన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కలుద్దాం. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి.

  5. sphurita అంటున్నారు:

    మాలతి గారూ నమస్తే,

    మీ మార్పు-1 చదివాను. తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో దూరి మార్పు-10 చదివి మధ్యలో దూరాను అని అర్ధం అయ్యి, ఇలా కాదు తీరిక చేస్కుని అన్నీ ఒకేసారి చదవాలి అనే నిర్ణయానికి వచ్చి ఆపేసాను. ఇవాళ మొత్తం అన్ని మార్పులు చదివేసాను. అదన్నమాట. ఐతే Dallas వచ్చేసారన్నమాట. నేనూ మీ పక్కనే Arkansas లో వుంటున్నా…మా వారు వుండేది Dallas లోనే. ఈ సారి అక్కడకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవొచ్చా…? మీకు అభ్యంతరం లేకపొతేనే…

    స్ఫురిత

  6. మాలతి అంటున్నారు:

    @ రాజేష్ జి. :) ) మీకు నచ్చినందుకు సంతోషమండీ.
    @ చిట్టెన్ రాజు, ఇందాకా చెప్పడం మర్చిపోయేను. అన్ని మార్పులూ ఇలా ఉండవండీ. మీకు ఈధోరణి రచనలే కావాలంటే నా ఊసుపోకలు చూడండి. మీ ఆసక్తికి ధన్యవాదాలు

  7. రాజేష్ జి అంటున్నారు:

    $మాలతి గారు
    మీ పరుపు ఇబ్బందుల్ని భలే సరదాగా రాసారు. పరుపు-పరువు ;-)

  8. మాలతి అంటున్నారు:

    @ తెలుగు యాంకి, లండన్ నించి వచ్చిన పరుపు -:). అదేనండీ, నిండు విస్ఫారితనేత్రాలతో గోతిలోకి దిగిపోతాం. పోన్లెండి ఎలాగో నిద్ర పట్టటము మొదలయింది కదా. హా.
    @ చిట్టెన్ రాజు, మీ బాణీ :) ). హా!. మీ రెండు ప్రశ్నలకి, అలానే అనుకుంటున్నాను, అవును.
    - మాలతి

  9. మాలతి గారూ,

    భలే బాగా రాశారు….ఎందుకో “నా బాణీ” రచన అనిపించింది….ఈ “మార్పు” వ్యాసాలు ఇంకా రాస్తూనే ఉంటారు కదా! మీరు ప్రస్తుతం డాలస్ లో ఉంటున్నారా?

    వంగూరి చిట్టెన్ రాజు

  10. తెలుగు యాంకి అంటున్నారు:

    భలే బాగా రాసారు. దాదాపు నాకు గూడా షేమ్ -టూ- షేమ్ అనుభవాలు ఈ విషయములో. కారు అమ్మకాలబ్బాయిల తర్వాత అంతే సత్య హరిశ్చంద్రులు ఈ పరుపులబ్బాయిలు. మనకేదన్నా ఒక పరుపు నచ్చిందని ఏ మాత్రము వాడికి అనిపించినా, ఆ బెడ్డు మీద క్వీణ్ విక్టోరియా పొడుకునేది, ఇప్పుడే లండన్ నుంచి వచ్చింది అని కూడా చెప్పగలడు. ఇన్ని తెలిసి గూడా ఈ మధ్యనే, స్వీడను దేశానికి సంబంధించిన టెక్నాలజీతో, నీల్ ఆర్మస్ట్రాంగ్ లాంటి వాళ్లు పడుకునే టెంపురుపీడిక్ పరుపును నాతో కొనిపించాడు. ఇంటికొచ్చి క్రెడిట్ కార్డు బిల్లు చూసాక ఆకాశములోని చుక్కలు కనపడుతూ చక్కగా నిద్రపట్టటము మొదలయ్యింది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.