నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి

13వ శతాబ్దంలో రుద్రమదేవి పరిపాలనలో కాకతి సామ్రాజ్యవైభవం కథ ఇది. రుద్రమదేవి పట్టాభిషేకం మొదలు ఆరు సంవత్సరాలపాటు ఆమె ఆధిపత్యంలో రాజకీయ, సాంఘిక, సాహిత్యప్రతిభ ఆవిష్కరించారు నోరి నరసింహశాస్త్రిగారు.

రుద్రమదేవి తండ్రి గణపతిదేవుడు వార్థక్యంలో అనారోగ్యంతో బాధపడుతూ రుద్రమదేవిని పట్టాభిషిక్తురాలిని చేసి రాజ్యం ఆమెకి అప్పచెప్తాడు. “ఆడదాని మోచేతి నీళ్ళు తాగుతామా” అంటూ చోళులూ, తదితర సామంతరాజులూ తిరగబడడం, అటు మహారాష్ట్రులు దేశం ఆక్రమించుకోడానికి ప్రయత్నించడం – రుద్రమదేవి అద్వితీయమైన రాజకీయచతురత ప్రదర్శించి వారిని ఎదుర్కొనడం ప్రధాన కథాంశాలు. ఆమెగురువు శ్రీ విశ్వేశ్వర శంభు దేశికులు, మంత్రి అన్నమయ్యలతో పాటు కవి తిక్కన రుద్రమకి అండగా నిలిచి అనేక విధాల సహాయం చేస్తారు. అలాగే ఆమెవిజయానికి అనేక విధాల సహాయం అందించిన మరొక వీరుడు గోనగన్నారెడ్డి.

గణపతిదేవుడు కుమార్తెవివాహం విషయంలో చూపిన శ్రద్ధలో కాకతి రాజ్యభవిష్యత్తే కాక తమ వంశం పేరుప్రతిష్ఠలు కూడా కనిపిస్తాయి. ఆయన విధించిన ఆంక్షలమేరకు, రుద్రమదేవితో కత్తియుద్ధం చేసి, ధనుర్విద్యలో ఆమెని ఓడించి, వివాహమాడతాడు చాళుక్యరాజు భద్రదేవుడు. ఆతరవాత క్షత్రియ సాంప్రదాయాలూ, రాజకీయపరిస్థితులూ కారణంగా భద్రదేవుడు నిడుదప్రోలు రాజధానిగా తనరాజ్యానికి వెళ్ళిపోతాడు. అయినా ఇద్దరూ అవసరసమయాల్లో ఒకరినొకరు ఆదుకోడం ఒకవిధంగా ఆనాటి రాజకుటుంబాలలో వైవాహికవ్యవస్థని ప్రస్ఫుటం చేస్తుంది. వీరిద్దరి వైవాహికజీవితంలో ఎగుడుదిగుళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. నరసింహశాస్త్రిగారు చిత్రించినతీరు గొప్పగా ఉంది. నరకాసురవధలో సత్యభామ ధనువు ధరించి పరుఁ జూచు, వరున్ జూచు రోషరాగోదయయై అన్నట్టు రుద్రమ భిన్నఅనుభూతులమధ్య కఠోరనిర్ణయాలు తీసుకున్నతీరు హృద్యంగమంగా చిత్రించేరు రచయిత.

నరసింహశాస్త్రిగారు ఈ నవలగురించి ముందుమాటలో కొన్ని విలువైన మాటలు చెప్పేరు. మొదటిది – ఆంధ్రులలో జాతిపౌరుషం రేకెత్తించవలసిన అవుసరం వచ్చినప్పుడు ఉత్తేజపరిచే సాహిత్యం వెలువడుతుందన్నది. దానికి తార్కాణంగా నన్నయ భారత రచన ప్రారంభించడం, మళ్ళీ యవనులు ఉత్తరభారతాన్ని జయించి దక్షిణభారతం కూడా ఆక్రమించుకోడానికి ముందుకి సాగుతున్నసమయంలో తిక్కన, ఆ తరవాత ఎఱ్ఱాప్రగడ భారతాన్ని పూర్తి చేయడం జరిగిందంటారు. అంటే ఈ మూడుకాలాల్లోనూ భారతరచనకి ప్రధానకారణం మనజాతి ఘనచరిత్ర ప్రజానీకి మరొకసారి గుర్తు చేయడం అని.

నరసింహశాస్త్రిగారు తమ చారిత్రక నవలలో చరిత్రతోపాటు సాహిత్యాన్ని కూడా చేర్చి తమ కథనానికి సమగ్రత సాధించేరు. నారాయణభట్టులో నన్నయసాహిత్యకృషి, రుద్రమదేవిలో తిక్కనకృషి. మల్లారెడ్డిలో ఎఱ్ఱనకృషి చర్చించడంద్వారా ఆనాటి రాజకీయాల్లో కవులపాత్రలు ఎంత బలమయినవో ఎత్తి చూపేనని ఆయనే ప్రవచించేరు. నేను మిగతా రెండూ చదవలేదు కానీ రుద్రమదేవిలో మాత్రం తిక్కన, బద్దెన పాత్రలు సజీవంగా, హృద్యంగమంగా ఉన్నాయి.

ఒక కథకి గానీ నవలకి గానీ ఓంప్రథంగా కావలసింది పాఠకులఉత్సుకతనీ, ఉత్సాహాన్నీ నిలబెట్టగలగడం. కథ చెప్తున్నంతసేపూ “తరవాతేమయింది” అంటాడు పాఠకుడు. ఆ ఉత్సాహాన్ని ఆ స్థాయిలో నిలబెట్టాలి కానీ కేవలం తనప్రతిభ చాటుకోడానికేనేమో అనిపించేలా పేజీలకి పేజీలు అదేపనిగా కైవారాలు వల్లె వేసుకుంటూ పోకూడదు.

నరసింహశాస్త్రిగారి కథనరీతి నన్ను ఆకట్టుకుంది. ఎముకలగూడులాటి చరిత్ర తీసుకుని రక్తమాంసాలు చేర్చి, ఆ పైన నానాభూషణభూషితురాలిని చేసి పాఠకుల మనసులని అలరించగల మంచినవలని అందించేరు నోరివారు.

ఈ నవలలో ఏమాత్రమయినా సాహిత్యాభిరుచి గల పాఠకులని ఆకర్షించేవి కవులపాత్రలూ, సాహిత్యచర్చలూ. రుద్రమదేవి,  పల్లవరాజు కొప్పెరుంజింగడు రాజకీయాలు పక్కనపెట్టి ఉదాత్తహృదయంతో సాహిత్యసభలు  నడపడం, కొప్పెరుంజింగనిసభలో సాంప్రదాయాలకి భంగమయిందని గోదావరి పండితులు నిరసన తెలియజేస్తూ బయటికి పోవడం, కొప్పెంరుంజింగడు ఆగ్రహించినా శత్రురాజ్యంలోని పండితులే అయినా సభామర్యాద పాటించి వారిని శిక్షించక వదిలివేయడంవంటివి జాతిచరిత్రకి వన్నె తెస్తాయి. నరసింహశాస్త్రిగారు అద్భతంగా ఆవిష్కరించేరు ఈ వృత్తాంతం. అలాగే అనేక సందర్భాల్లో పూర్వకవులరచనల్లోంచి ఎంచిన పద్యాలు ఉదహరించడం కూడా రచయిత సాహిత్యాభిమానాన్ని తెల్లం చేస్తుంది.

సుమతీ శతకకర్త బద్దెన అసామాన్యమైన జీవనసత్యాలు తేలికభాషలో చెప్పిన యువకవిగా దర్శనమిస్తాడు ఈనవలలో. అతను సభలో తన పద్యాలు వినిపించడానికి సిగ్గు పడడం, తిక్కన, రుద్రమదేవి వంటి ప్రముఖులు అతన్ని ప్రోత్సహించడం వంటి సన్నివేశాలు నవలకి పుష్టి చేకూర్చేయి. యథావాక్కుల అన్నమయ్య మరొక గొప్ప పాత్ర ఈనవలలో.

అలాగే ఇతర సూక్ష్మవిషయాలు – జైనపండితులు కాకతి బ్రాహ్మణులకి క్షాత్రంలోనూ కరణీకంలోనూ శిక్షణ ఇవ్వడానికి పెట్టిన పాఠశాలలూ, రుద్రమదేవి, భద్రదేవుని అంతరంగచిత్రణ, అడుగడుగునా వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగానూ వారికి ఎదురైన సమస్యలను పరిష్కరించుకున్న తీరూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే నిత్యజీవితంలో పశుసంపదని సంరక్షించుకోడం, వర్తకులు, వేశ్యవాటికలు, నృత్యాలూ – వర్ణించినతీరు కూడా నన్నాకర్షించింది.

ఈనవలకి రూపకల్పన చేసేముందు నరసింహశాస్త్రిగారు విస్తృతంగా పరిశోధన చేసి అనేక చారిత్రక సత్యాలు నిర్ధారణ చేసుకున్నారుట. తన పరిశోధనమూలంగా ఆనాటి చారిత్రక పరిశోధకులకి స్పష్టం కాని కొన్ని అంశాలు స్పష్టం అయేయనీ కూడా రాసేరు. అలాటి వాటిలో కొన్ని – రుయ్యమ్మ వివాహం, రుద్రమదేవి పట్టాభిషేకానికి వెనకున్న కారణాలు. ఆమె శాసనాల్లో భర్త భద్రదేవుని పేర్కొనకపోవడానికి కారణం.

నేను మొదట్లో చెప్పినట్టు, అన్నాంబిక, గోనగన్నారెడ్డి నవలలకంటే ఈ నవల సాహిత్యపరంగా ఉత్తమస్థాయిలో ఉంది. ఇలా అనుకోడానికి నాకు తోచిన కారణాలు కొన్ని చెప్తాను.

రచయితకీ పాత్రలకీ మధ్య కొంత ఎడం ఉండాలి. ప్రతి పాత్రకీ అదేపనిగా వీరవైష్ణవ భక్తుడిలా కైవారాలు చదువుకుంటూ పోతే, పాఠకుడికి కథకుడిమీద నమ్మకం కలగదు. కథానాయకుడు, కథానాయకి పేరు వచ్చినప్పుడల్లా పేజీలకి పేజీలు వారి అందచందాలూ, బిరుదులూ వర్ణించడం విసుగిస్తుంది. అన్నమాంబిక లో కథకుడు దాదాపు ఆనాటి వందిమాగధులని తలపింపచేస్తాడు.

గోనగన్నారెడ్డిలో నాయకీనాయకుల వర్ణనలతోపాటు యుద్ధవర్ణనలూ కూడా కొంచెం అతిగానే అనిపించేయి. కథనంలో కొంత గందరగోళం కూడా ఉంది. ఈనవలలో కథ నాకు సుమారుగా అర్థమయినా, మరింత స్పష్టం కావడానికి పుస్తకం.నెట్‌లో ప్రచురించిన బెల్లంకొండ శ్రీకాంత్‌గారి వ్యాసం తోడ్పడింది. వారికి ధన్యవాదాలు.

రుద్రమదేవిలో కూడా యుద్ధవర్ణనలు ఉన్నాయి కానీ విసుగనిపించలేదు. యుద్ధానికి కారణాలూ, యుద్ధాలు నడపడంలో రాజకీయ చతురత కూడా వివరించడంతో కథనానికి బలం వచ్చింది.

మరి కొన్ని ధర్మసూక్ష్మాలు – తండ్రి గణపతిదేవుడు రుద్రమదేవిని పురుషుడిలా పెంచుతూ, క్షాత్రధర్మాలలో శిక్షణ ఇప్పించి లోకానికి ఆమె స్త్రీ అని తెలియనివ్వకుండా ఉంచేడు చాలాకాలం. ఆవిషయాన్ని బలపరచడానికే ఆమెకి ముమ్మడాంబ అనే రాచకన్యతో వివాహం కూడా జరిపించినట్టు, ఆ రాచకన్యకి కూడా రుద్రమ స్త్రీ అని చాలాకాలం – రుద్రమే చెప్పేవరకూ – తెలీనట్టూ అన్నమాంబికలోనూ, గోనగన్నారెడ్డిలోనూ చిత్రించారు.

రుద్రమదేవి లో నరసింహశాస్త్రిగారు ఈవిషయం ప్రస్తావించలేదు. బహుశా ఆయన తీసుకున్న కాలపరిమితివల్లనేమో. రుద్రమదేవి పట్టాభిషేకంతో మొదలు పెట్టి ఆరు సంవత్సరాలచరిత్రని ఆరుమాసాలలో జరిగినట్టు చిత్రించానని ఆయనే చెప్పుకున్నారు. దానికి ఆయన ఇచ్చి వివరణ చరిత్ర అంటే తిథులూ వారాలూ కావని.

చారిత్రక నవలలు నేను అట్టే చదవలేదు కానీ నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి అలాటినవలలో తలమానికం కాగలదని నాకైతే అనిపించింది. నాచేత మరోసారి చదివించగల నవల ఇది.

(మార్చి 29, 2011)

14 Responses to నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి

  1. రాజేష్ జి అంటున్నారు:

    $మాలతి గారు

    #..మరి మీరేం చేస్తున్నారు…
    హ్మ్.. ప్రస్తుతానికి ఏవీ లేదండి. మధ్యాహ్న భోజనానికి ఇస్కాన్ వారి శాకాహారశాలకి వెళతాను.. చూడాలి మరి అక్కడ ఏవైనా విశేషం ఉందొ అని!

    #..ఇతోధికంగా రాయడానికి ప్రయత్నిస్తాను..
    కృతజ్ఞతలు నా కోరికను మన్నించినందుకు! పాలతాలికల్లాంటి మీ తూలికటపాల కోసం ఎదురుచూస్తుంటా!

  2. మాలతి అంటున్నారు:

    సత్యవతిగారూ, ఉగాది శుభాకాంక్షలు.
    రుయ్యమ పాత్ర — అవునండీ, గుర్తుండిపోయే పాత్ర. అసలు అన్ని పాత్రలనీ కూడా అంత బలంగా నరసింహశాస్త్రిగారు చిత్రించారు అనిపించింది నాకు. రుద్రమదేవి సినిమా వచ్చినప్పుడు చెప్పండి నాకు. దానికోసమయినా వస్తాను ఇండియాకి :) )

    రాజేష్ జి. గారు, ధన్యవాదాలు. మీకూ ఉగాది శుభాకాంక్షలు. వంటలు – హా. నిన్న ఒక స్నేహితురాలింట్లో పంచభక్ష పరమాన్నాలతో విందు అయిందండీ. ఈరోజు అవే తలుచుకుంటూ, ఫ్రోజెన్ పోళీలు వేడి చేసుకు తిందాం అనుకుంటున్నా. మరి మీరేం చేస్తున్నారు. :)
    మీ ప్రోత్సాహంతో ఇతోధికంగా రాయడానికి ప్రయత్నిస్తాను.
    మాలతి

  3. రాజేష్ జి అంటున్నారు:

    $మాలతి గారు
    మీకు
    :x : ఉగాది శుభాకాంక్షలు!:x:

    మీరు చరిత్రకు సంబందించిన మరిన్ని రచనలు ఇలానే విశ్లేషించాలని కోరుకుంటూ!

    {! అన్నట్లు ఈ రోజు వంట ఏ౦ చేసారు/చేయబోతున్నారు? :) !}

  4. మాలతి అంటున్నారు:

    శి. రా. రావుగారూ, తెలుగు తూలిక అభిమానులూ – అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మాలతి

  5. SRRao అంటున్నారు:

    మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

    - శి. రా. రావు
    ఉగాది ఊసులు
    http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

  6. సత్యవతి అంటున్నారు:

    రుద్రమదేవి మాకు బి.ఏ లో నాన్ డిటైల్డ్ గా వుండేది అందులో రుయ్యమ పాత్ర ఎందుకో నాకు బాగా గుర్తుండిపోయింది.చదివించే నవల .సినిమా అంటె గుర్తొచ్చింది.ఈ మధ్య విజయశాంతి రుద్రమ దేవి సినిమా తీస్తానన్నట్లు ఎక్కడొ చదివాను

  7. మాలతి అంటున్నారు:

    @ సూర్యప్రకాష్ కగారూ, నిజమేలెండి. ఒకొకరికి ఒకొకటి నచ్చుతుంది. ఇద్దరం రెండూ చదివేం కదా. అదీ ముఖ్యం. మీ కాస్టింగ్ బాగుంది. చూడండి మరి, మళ్లీ ఏమయినా వినతి పెట్టుకోగలమేమో సినిమావాళ్లకి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @ రాజేష్ జి., రుద్రమదేవి నాకు నెట్లో ఎక్కడా కనిపించలేదు. కానీ నోరి నరసింహశాస్త్రిగారి సాహిత్యవ్యాసాలు పుస్తకం teluguthesis.comలో ఉంది. అది కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నా. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @ సౌమ్య, సార్వభౌముడు నేను చదవలేదు కనక చెప్పలేను కానీ రుద్రమదేవి మాత్రం నీకు నచ్చుతుందనే అనుకుంటాను. ముఖ్యంగా స్త్రీపాత్రలని ఆయన చిత్రించినతీరు బాగుంది. రుద్రమదేవే కాదు ఇందులో మరొ ఇద్దరు స్త్రీలు కూడా మగవేషాలేసుకుని తమవరులకి అండదండలుగా నిలుస్తారు. నాటకీయం!

  8. Sowmya అంటున్నారు:

    “కవిసార్వభౌముడు” లో ఎంతకీ అసలు కథ మొదలవకపోయేసరికి విసుగొచ్చి ఆపేశా. మళ్ళీ నోరి వారి నవల మొదలుపెట్టనేమో అనుకున్నా. కానీ, ఈ వ్యాసం చూస్తూంటే మరోసారి ప్రయత్నించాలి అనిపిస్తోంది°°

  9. రాజేష్ జి అంటున్నారు:

    $మాలతి గారు
    మంచి ఉత్తేజపూరితమైన చారిత్రాత్మక నవలని పరిచయం చేసినందులకు కృతజ్ఞతలు. మీరు పరిచయం చేసిన విధానం ఆ పుస్తకాన్ని వెంటనే చదవాలని పురికొల్పుతుంది.
    చరిత్రం అంటే మహాఇష్టం. ఈ పుస్తకం ఆన్లైన్లో ఉచితంగా చూసుకోవడానికి ఉందా?

    మరొక్కసారి ధన్యవాదాలు.

  10. Suryaprakash అంటున్నారు:

    మాలతిగారూ,
    లోకోభిన్నరుచి. నాకు నోరివారి రుద్రమదెవి కంటే బాపిరాజుగారి గోనగన్నారెడ్డి యెక్కువ ఇష్టం. లోకేష్ గారు ప్రస్తావించినట్లు గన్నారెడ్డిలో వీర శృంగార రసాలు, రుద్రమదేవిలో చారిత్రక అంశాలకు ప్రాధాన్యం అనిపిస్తుంది. గన్నారెడ్డి సినిమాగా తీస్తే బాగుంటుందని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం (N.T.R. – గన్నారెడ్డి, S.V.R. – విఠల ధరణీశుడు, భానుమతి – రుద్రమ, జమున – అన్నాంబిక, A.N.R. – చిన అక్కిన ప్రగ్గడ మొ.)
    ఇక వర్ణనలంటారా – బహుశా అందువల్లనేమో నాకు బాగా నచ్చింది. బాపిరాజు గారి హిమబిందు కూడా చాలా ఇష్టం. (విశ్వనాథ వారి భ్రమర వాసిని నవలలో మొదటి 30 పుటలు, పెళ్ళి కుమారుడు శోభనపు గదిలో గోడలకున్న చిత్రపటాలు చూస్తూ చేసే ఆలోచనే – వాటితో పోలిస్తే బాపిరాజు గారు తక్కువే చేస్తారు).
    “గన్నారెడ్డి గరుడప్లుతంతో పైకెగిరి కత్తిని మూడు నిలువు కోతలు లాగి ఉప్పల సోముని కత్తిని కాలితో తన్ని” నిజంగా చూస్తున్నట్లే లేదూ.
    అలా అని నోరివారి నవలలంటే నచ్చవు అని కాదు, పైన మీరు పేర్కొన్నవి, కవి ద్వయము, మల్లారెడ్డి, వ్యాసాలు చేతికందే దూరంలోనే వుంటాయి.
    ఏమైనా మంచి నవలలని మరోమారు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
    సూర్యప్రకాష్

  11. మాలతి అంటున్నారు:

    @ మాధురి, ధన్యవాదాలు. నేను కూడా చదవాలనుకుంటున్నాను నరసింహశాస్త్రిగారి ఇతర నవలలు.

  12. madhuri అంటున్నారు:

    Yes, I’ve read Rudramadevi, Mallareddy, Narayanabhattu and thoroughly enjoyed all the three.

  13. మాలతి అంటున్నారు:

    @ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారూ, గోనగన్నారెడ్డి సినిమాటిక్ అంటారా. హా, నాకు తోచలేదు. మీరు కూడా అది చదవడానికి శ్రమ పడ్డారన్నమాట. రుద్రమదేవి కథ మంచి సినిమా అవుతుందని నాకు అనిపించింది. మన ప్రొడ్యూసర్లు ఎందుకు తలపెట్టలేదో.
    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. – మాలతి

  14. మాలతి గారు,
    మంచి వ్యాసం.టపా చదువుతూంటే ఈ నవల రుద్రమ్మదేవి ,వీరభద్రుల వైవాహిక జీవితంలోని ఆటుపోట్లను,ఆనాటి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పినట్లు తెలుస్తోంది.కథకుడిని బట్టి చరిత్రలో కొత్తకోణం ఆవిక్ష్కరింపబడుతుంది.గోనగన్నారెడ్డిలో వీరరసానికే అగ్రతాంబూలం ఇచ్చారు.కొంచెం సినిమాటిక్‌గానూ ఉంటుంది. నవల అర్థం కావడానికి అనవసర వర్ణనలు స్కిప్ చేసి రెండు మూడు మార్లు చదవలసి వచ్చింది.టపాలో నా వ్యాసాన్ని ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.