(ఎన్నెమ్మ కతలు 66)
ఈమధ్య సౌమ్య తాను చూస్తున్న కొత్త ఊరుగురించి తెగ ఊరించేస్తుంటే, నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది నేను కూడా ఇలాటివేవో రాసేనని. తిరిగి చూసుకుంటే తనలా మురిసిపోతూ రాసింది తక్కువే అని కూడా అర్థమయింది. ఇదుగో ఇలాటప్పుడే మనం చిన్నవాళ్ళదగ్గర్నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని నాకు నేను చెప్పుకుంటాను.
ఇంతకీ ఇప్పుడు నేను “మాఊరు”గురించి కొత్తగా గ్రహించినవి వరసగా చెప్పేస్తాను – అట్టే ఉపోద్ఘాతాలూ, ఇ-పోద్ఘాతాలూ లేకుండా. ప్రస్తుతం ఇవన్నీ ఉపసంహారాలే అంటే రిట్రాక్షనులే అన్నమాట, హీహీహీ.
మొదటిది చాలాకాలం క్రితం నన్ను బామ్మ అనొద్దని బ్లాగులో చాలా ధాటీగా ప్రొటెస్టు చేశానా ..
కిందటివారం నేను ఓ పిల్లలబడి పక్కనించి నడిచొస్తుంటే, ఓ చిన్న బాలుడు, “హాయ్ గ్రాంమా” అంటూ కేకేసేడు ముళ్ళకంచె వెనకనించి. నేను ఉలిక్కిపడి చూశాను. ఆ చుట్టుపక్కల మరెవరూ లేరు. పైగా నేను ఆ పక్కన అదే మొదటిసారి నడవడం కూడాను. మనవాళ్ళపిల్లవాడు కాదు. తెల్లవారి బుల్లి నాన్నే!
ఇవాళ మూమూలుగా నేను రోజూ నడిచే రోడ్డుమీదే నడుస్తుంటే, ఎప్పుడూ లేనిది ఓ పోలీసు పక్కనించి పోతూ కారాపి, హలో అని పిలిచి, “Are you okay?” అనడిగేడు. నేను యా అన్నాను కానీ వెంటనే వై అనాలనిపించింది. అప్పటికే అతను చాలా దూరం వెళ్లిపోయేడు. హుమ్. ఇప్పుడు నాకు మరో అనుమానం వస్తోంది. ఏ memory care facility నుంచో తప్పిపోయో, తప్పించుకుపోయో వచ్చేసి, ఇలా తిరుగుతున్నాననుకున్నాడేమో ఆ పోలీసు!
2. ముందు నేను రోడ్డుమీద అదేలెండి సైడువాకుమీద నడుస్తున్నప్పుడు ఎలా నడుస్తానో చెప్పాలి. సాధారణంగా తలొంచుకుని నడుస్తుంటాను. రోడ్డో డ్రైవేనో దాటవలసివచ్చినప్పుడు కొనదాకా సాగి, అక్కడాగి తలెత్తి అటూ ఇటూ చూసి దాటుతానన్నమాట. నాదారిలో ఏ కారో ట్రక్కో ఉంటే, నేనే ఆగేదాన్ని అది దాటిపోయేవరకూ. ఇప్పుడేమో వాళ్ళే ఆగి “దయచేయ”మంటూ చేతులో తలో ఊపుతున్నారు ఎంతో మర్యాదగా. అవును, నాక్కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇదన్నమాట సదర్న్ హాస్పిటాలిటీ అనిపించేస్తోంది
3. ఇదిలా ఉండగా రెండువారాలక్రితం కారు టైరు కుంగిపోతోందని నడిరోడ్డుమీద, రెడ్ లైటు వచ్చినప్పుడు పక్కకారులో డ్రైవరు నాకు హస్త, ముఖవిన్యాసంతో తెలియజేసింది. నేను ఉలికిపడి, కారు దిగి, చుట్టు తిరిగి అటెళ్ళి చూస్తే, నిజంగానే ఫ్లాట్ టైరు కాదు కానీ గాలి దాదాపు ఇగిరిపోయింది.
నా అదృష్టం బాగుండి ఆపక్కనే ఒక సర్విస్ సెంటరు కనిపించింది. రథాన్ని అక్కడికి చేర్చి, చూడమంటే, “నీకు భయం లేదు, మేం చూస్తాం” అని అభయమిచ్చి, టైరు చూసి, ఇందులో మేకుంది అన్నాడు.
సరే, ఏం చేస్తాం కొత్త టైరు వెయ్యి అని నేను అనాలి. మీరు అనుకుంటున్నారా నేను అలా అంటానని. లేదులెండి. నాది డిలేడ్ రియాక్షను. (కదాచితుగా రిటార్డెడ్ అనుకోడానికి అవకాశం కూడా ఉందన్నమాట). అంచేత నేను అలా నిరామయంగా ఆ టైరుకేసి చూస్తుంటే, మళ్లీ ఆ మెకానిక్కు “నేను రిపేరు చేస్తానులే” అని గబగబా రిపేరు చేసేశాడు పదినిముషాల్లో. “ఎంత ఎక్కడ?” అన్నాను.
“అబ్బే. అక్కర్లేదు. ఇలాటివాటికి మేం డబ్బు పుచ్చుకోం,” అన్నాడు.
4. శనివారం ఇక్కడ తెలుగువాళ్ళపిల్లలకి తెలుగు క్లాసులు నడుపుతున్నారు. ఆ టీచరు నన్ను కూడా రమ్మంటే సరే వస్తానన్నాను. వేరే పనులమూలంగా టైంకి బయల్దేరలేకపోయేను కానీ కాస్త ఆలస్యంగానైనా వెళ్ధాం అని బయల్దేరాను. రెండు మైళ్ళు వెళ్ళేసరికి మళ్ళీ కుడివేపుకి వాలిపోయింది.
ఏమైందో అనుకుంటూ కారు రోడ్డువారకి తీసి, దిగి చూస్తే, చెప్పనేల, టైరు ఈసారి సీదాగా ఫ్లాటుగా ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, మేకు తీయించిన షాపుకే వెళ్లి వారం రోజులక్రితం దానికి అన్ని సేవలూ చేయించాను. అందులో టైరు రొటేషనొకటి. అంటే ఇప్పుడు ఫ్లాటయిన టైరు ఇంతకు మునుపు మేకు తిన్న టైరు కాదన్నమాట.
ఇంతకీ ఇక్కడ స్థానిక ట్రాన్స్‌పోర్టేషనువాళ్ళు చాలా అప్రమత్తులై ఉంటూ మనకి చాలా విధాలా సహాయసహకారాలు అందిస్తాం అని గొప్పగా చెప్పుకుంటారు. అందులో ఒక భాగం మన డ్రైవర్స్ లెసెన్స్ వెనక ఓ ఫోన్నెంబరిస్తారు. రోడ్జుమీద హఠాత్తుగా ఏదైనా అవసరమయితే పిలిస్తే వచ్చి ఆదుకుంటారన్నమాట. బాగుందా? అవును. చాలా బాగుంది. ఎటొచ్చీ నేను ఆ నెంబరు పిలిస్తే, engaged వచ్చింది. పావుగంట కుస్తీలు పట్టేను. మరి అక్కడ ఆ ఫోను ఆపరేటరు నిద్రపోతున్నారో, ఏ బాయ్ ఫ్రెండుతోనో గర్ల్ ఫ్రెండుతోనో సరసాలాడుకుంటున్నారో (ఈమధ్యే వార్తల్లో వచ్చింది ఎయిర్‌పోర్టుల్లోనే కంట్రోలర్లు ఎంచక్కా పక్కలు పరుచుకు కునుకు తీస్తున్నారుట), నేను మా స్నేహితురాలిని పిలిచేను. ఆయన ఏదో గరాజి నెంబరిచ్చారు. ఇంతెందుగ్గానీ …
నేను పిలిచిన నెంబర్లు, వారి సలహాలు, లేక సమాధానములు
- ఇప్పుడు నువ్వున్న ప్రదేశం మా ఎరియాలో లేదు. మరో నెంబరు పిలు
- మేం tow చేస్తాం కానీ టైరు మార్చం
- . — (ఎవరూ ఫోను తియ్యలేదు.)
- నీ డ్రైవరు లైసెన్సుమీద నెంబరుంటుంది. ఆనెంబరు పిలు.
ఇంక నాతరం కాక, ఆదారిన ఏ పోలీసయినా వస్తాడేమో, వాడే ఆదుకుంటాడులే అని దిగులుగా చూస్తూ కూర్చున్నా.
ఇంతలో ఒకబ్బాయి – రోడ్డు పనిచేసేవాడిలా ఉన్నాడు వచ్చి, “నీకు సాయం కావాలా?” అనడిగేడు.
అవునంటూ ఆ టైరు చూపించేను.
“నేను మార్చనా?” అన్నాడు. సరే అన్నాను. ట్రంకు తెరవమని చెప్పి, క్షణాలమీద టైరు మార్చేశాడు.
మీకెవరికైనా సందేహం కలిగితే, టైరు మార్చడం కష్టం కాదు. కానీ భుజబలం కావాలి చక్రం ఎత్తడానికి.
ఇంతకీ ఇందులో నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, టైరు మారుస్తుండగా అతనిమాటలు -
తాను అంతకుముందు రోడ్డుమీద వెళ్తూ నన్ను చూశాట్ట. అక్కడెక్కడో తన పని ముగించుకుని, తిరిగి వస్తూ, నేనింకా అక్కడే ఉండడం చూసి ఆగేట్ట, ఇందులో ఆశ్చర్యం ఏమిటంటారా? అదే చెప్తున్నా ఆ టైరు మారుస్తున్న పావుగంటలోనూ కనీసం ఐదుసార్లు అతను నాకు క్షమాపణలు చెప్పేడు తాను మొదటిసారి నన్ను చూసినప్పుడు ఆగకపోవడం తన తప్పని!
ఏం చెప్పను? టెక్సనులకి మర్యాద తెలీదన్న నా వ్యాఖ్యని ఇందుమూలంగా ఉపసంహరించుకుంటున్నాను. సదర్న్ ఆతిథ్యంగురించి నవ్వినందుకు సమస్త టెక్సనులకూ ఇవే నా క్షమాపణాంజలులు!
(ఏప్రిలు 11, 2011)
@ రాజేష్ జీ, – ఆదరణ మటుకు శాశ్వతంగా ఉంటుంది – నిజమేనండి. ఇలాటివి మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ధన్యవాదాలు.
$మాలతి గారు
బావున్నాయి.. మీ ఊరి ఆతిధ్యపు విషయాలు. చాలాచక్కగా చెప్పారు.
కుమార్ గారి అనుభవం-అతిధ్యమూ రెండూ బావున్నాయి.
అందుకే పెద్దలనేవారు “అన్నం అరఘడియలో అరుగుతుంది ఆదరణ మటుకు శాశ్వతంగా ఉంటుంది” అని.
@ కొత్తపాళీ, – random kindness – అవునండీ. అసలు అది మనసంస్కృతిలో ఉంది కదా. ఎవరికి ఎప్పుడు ఎక్కడ సాయం కావాలంటే అక్కడ ఎవరో ఒకరు ఆసాయం చేస్తారు. నిజానికి అమెరికాలో కూడా ఈ సంస్థలూ గట్రా మొదలు పెట్టకముందు ఒకరినొకరు ఇలాగే ఆదుకునేవారనుకుంటాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@ స్ఫురిత, బాగుందండీ మీ అనుభవం. అవును ఎప్పుడు ఎక్కడినుంచి సాయం వస్తుందో చెప్పలేం.
@ kumarN, సంతోషమండీ మీకథ. నిజమే. మీరన్నమాట. విస్కాన్సిన్ లో కూడా నేనందుకున్న సహాయాలు సామాన్యమయినవి కావు. ఏమిటో సందర్భం రాలేదు కనక చెప్పలేదు. పైగా, ఒక్కనెలలో ఇన్నిసార్లు నేను ఆదుకోబడడం నాకు వింతగా అనిపించిందనుకుంటాను. ధన్యవాదాలు. మీరు ఇతరులకి అందిస్తున్న సహాయం ఇలాగే పదికాలాలపాటు కొనసాగగలదని ఆశిస్తూ, ..
నాకూ నా కార్ ఆగినప్పుడు, స్ట్రేంజర్స్ వాళ్ళ కార్లు ఆపేసి వచ్చి, 1) అడగడమూ, 2) నా కార్ టైర్ మార్చటమూ, 3) స్నో, ఐస్ ధారాళంగా పడుతున్న రోడ్డు పై నుంచి, నేనూ, నా వైఫ్ లోయలోకి జారిపోయినప్పుడు, నా కార్ ని పైకి లాగటమూ అవన్ని కూడా వాళ్ళే చేసారు.
అన్నింటి కన్నా ముఖ్యంగా నాకు ఓ సారి ఫ్లైట్ లో అనుకోకుండా లో-బి పి అటాక్ వచ్చినప్పుడు నలుగురు పాసింజర్స్(they had some basic paramedic training when they were in college, I was told), భూమికి ముప్పై వేల అడుగుల ఎత్తున వాళ్ళు నాకు చేసిన సేవలు జీవితంలో మర్చిపొలేనివి ( బి పి చెక్ చేయటం, ఫ్లైట్ దిగేదాకా నా కాళ్ళు వత్తటం, పక్కనే కూర్చొని నీళ్ళు తాగించటం, నన్ను flight-attendant నోటీస్ చేసిన పది నిమిషాల్లో…ఎస్ కేవలం పది నిమిషాల్లో నా బాడీ లోకి సైలైన్ ఎక్కించటం(at 30,000ft above!!)…అదే కాదు, మూడు నెలల తర్వాత నన్ను అదే ఫ్లైటు లో మళ్ళీ గుర్తు పట్టి, దిగిన తర్వాత తనే నా దగ్గరికి వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరించటం) ఇవన్నీ కూడా నాకు మనుషుల మీద ఉన్న, ముఖ్యంగా ఈ దేశం లోని మనుషుల మీద నాకు గౌరవాన్ని పెంచాయి. ఇప్పటికీ గుర్తు, ఫ్లైటు దిగేప్పటికీ నేను పూర్తిగా నార్మల్ అయిపోయినప్పటికీ, నేనేంత వద్దు వద్దన్నప్పటికీ, అప్పటికే వచ్చి ఉన్న పారామెడిక్స్ యూనిట్ వాళ్ళు నన్ను స్ట్రెచర్ మీద తీసుకెళ్తూంటే, నా బ్యాగూ, బూట్లూ, అన్ని నా వెనకాలే పట్టుకొచ్చి నాతో పాటూ ఉండి, నన్ను ఆ వెహికిల్ లో ఎక్కించేప్పుడు, నా గొంతు పూడుకు పోయి, ఆ అమ్మాయి చేతిన్ని నేను వదల లేక, వదల లేక, సినిమాల్లో చూపినట్లుగా నా చేయి జారిపోవటం..కనీసం థాంక్స్ అన్న పదం కూడా నా గొంతు దాటడానికి చాలా కష్టపడింది. కృతజ్ఞత లేక కాదు, ఎక్కువయ్యి!!. కళ్ళల్లో నీటి పొర గొంతులోంచి మొదలయినట్లుంది, అందుకే మాటకడ్డం పడింది.
తీసుకున్నవాళ్ళు ఇవ్వటం భాద్యత..అందుకే నేను ఎప్పుడూ చాలా ఇస్తుంటాను మనుషులకీ, ఆర్గనైజేషన్స్ కీ , అవి పైకి చెప్పుకోవటం పద్దతి కాదు కాబట్టి, ఇక్కడ చెప్పట్లేదు. (ఇంక్లూడింగ్ నాకు కార్ రిపేర్ తెలీకపోయినా, కార్ అయితే ఆపి వెళ్ళి అడుగుతాను, అట్లా ఇప్పటికి మల్టిపుల్ టైంస్ వాళ్ళకి ఇళ్ళకి రైడ్స్ ఇచ్చాను).
పోతే, ఇది సదరన్ హాస్పిటాలిటీ యేనా అంటే నేనొప్పుకోను, పైన చెప్పినవన్నీ, మిడ్ వెస్ట్ లోనే అయినప్పటికీ!! కాకపోతే ఒకటి నిజం. మిడ్ వెస్ట్ లో లైఫ్ చాలా సుఖం, ఈ కోస్ట్, ఆ కోస్ట్ తో పోలిస్తే. మీ విస్కాన్సిన్ కూడా మంచిదే కదండీ, డాల్లాస్ లాగే, కాదా
)))
మీ టపా చదివాక నాకు జరిగింది ఒకటి గుర్తుకొచ్చిందండీ,
నేను project పని మీద కొత్త వూరు, కొత్త రాష్ట్రం వెళ్ళాను నిరుడు. అక్కడ manager ని ఆఫీసుకి ఎలా రావాలి అంటే బస్సులుంటాయి అన్నాడు. ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగాలి అని అడిగితే నన్ను చూస్తే బస్సులెక్కేవాడిలా వున్నానా…నీ పాట్లు నువ్వు పడు అని ఫోను పెట్టేసాడు. నిజానికి కొత్తగా అతని project లోకి వచ్చిన నన్ను guide చెయ్యాల్సిన బాధ్యత అతనిదే. ఆ చోటు కొంచెం ప్రమాదకరమైందని అందరూ చెప్పటం తో కాస్త భయపడుతూనే దేవుడిమీద భారం వేసి బస్సు ఎక్కేసాను. బస్సులో ఒకతన్ని నా ఆఫీసుకి ఎలా వెళ్ళాలని అడిగితే అతను తన stop కన్నా తరవాత stop అయినా నాకోసం వెనక్కి వచ్చి ఆఫీసు దాకా తోడు వచ్చి రోజు ఎక్కడ దిగాలో ఎలా వెళ్ళాలో చూపించి మరీ వెళ్ళాడు. అతనూ నా company లోనే పని చెస్తున్నాడు. నేను కృతజ్ఞతలు చెపితే మా company కి కొత్తగా వచ్చిన వాళ్ళకి సాయం చెయ్యటం నా బాధ్యత అని చెప్పాడు.
మా మానేజరు అలా మాట్లాడగానే ఆ వూరుని, ఆ company ని అన్నింటిని తిట్టేస్కున్నాను. మనుషుల మనస్తత్వాలు వూళ్ళని బట్టీ వుండవేమో అనిపించింది తరవాత
Very interesting and very nice to read.
అసలు పరిచయం లేని మనుషులనించి ఇటువంటి దయ, సహాయం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అప్పుడప్పుడూ కార్లమీద బంపర్ స్టిక్కర్ చూస్తూంటాను – Practice random kindness and senseless acts of beauty – అని.
@ సౌమ్య, నువ్వు నిశితంగా ఆలోచిస్తావని మరోసారి నిరూపించుకున్నావు. అవును. స్నేహాలు, కోపతాపాలూ, గౌరవాగౌరవాలూ – లాటివన్నీ “యిచ్చిపుచ్చుకునే” ప్రాతిపదికమీదే సాగుతాయని నేను కూడా అనుకుంటాను.
బహుశా, కొత్తలో మనం మరోచోటికి వచ్చినప్పుడు – ఇది కొత్తప్రదేశం, వీళ్ళు నాకు కొత్త – అన్న భయం మనమొహాల్లో కనిపించి, వాళ్ళని కాస్త ఎడంగా ఉండేలా చేస్తుందేమో. క్రమంగా మనం వాళ్ళకీ వాళ్ళు మనకీ అలవాటు అవుతామేమో. అప్పుడు సాటి మనిషి అన్న ఆలోచన కలగడానికి వీలవుతుంది కాబోలు. @రెండు పార్టీలూ అన్-ఫ్రెండ్లీగానూ, పొగరుగానూ.. హా. నిజమే. నేను ఈ విషయాలే “మార్పు” పరంపరలో చర్చించడానికి ప్రయత్నిస్తున్నాను – ముఖ్యంగా నాతరంనించీ నీతరానికి, ఈ మధ్యలో వచ్చినమార్పులు.
@ chavakiran, గుర్తు పెట్టుకుంటాను. ధన్యవాదాలు.
@ C V R Mohan, ధన్యవాదాలు.
I told a colleague that Germans are very friendly do far and she was pretty surprised to hear that.
ఒక్కోసారి, మనల్ని బట్టి కూడా అవతలి వారి స్పందనలుంటాయేమో. మనం కాస్త ఫ్రెండ్లీగా ఉంటే అవతలి మనుషులూ ఫ్రెండ్లీగా ఉంటారు. నేను గొప్పా… నాకు ఆ గౌరవం ఉండాలీ…ఈ తరహాలో సాగితే, అవతలి మనిషి కూడా అలాగే స్పందించి, అన్ ఫ్రెండ్లీ గా ఉంటారేమో! Ofcourse, there can be the other two combinations as well!
మూడో మనిషిగా చూసి నేను కడుపుబ్బా నవ్వే కాంబినేషన్ ఏది అంటే, రెండు పార్టీలూ అన్-ఫ్రెండీగానూ, పొగరు గానూ ఉండే దృశ్యం… వాళ్ళ కోపాలు చూసి బాగా నవ్వుకోవచ్చు. సరే, ఇక పోస్టు పరిధి దాటి వ్యాఖ్య రాస్తున్నట్లు ఉన్నా! ఆపేస్తా!
బాగుంది.
సౌమ్య బ్లాగుకు లింకు ఇచ్చాక కూడా మీ టపా చదవడం జరిగింది. (గమనించ ప్రార్థన)
గుడ్ సమరిటన్ బదులుగా గుడ్ టేక్సన్ అనాలన్న మాట.
nice to read.