మార్పు 15

“బాగున్నావా? చాల్రోజులయింది చూసి,” అన్నాడు ప్రభాస్రావు.

సుందరం ఉలికిపడి అటుతిరిగి, “ఓ, అంకుల్, ఆ, బాగానే ఉన్నానండి. అవును ఎప్పుడు చెప్మా … కనీసం నాలుగేళ్లయిఉండాలి, ఆంటీ, విషీ, అందరూ బాగున్నారా?” అన్నాడు.

“నాలుగేళ్ళయే ఉంటుంది. పిలుద్దాం అనుకుంటూనే ఏదో అలా అయిపోతోంది ఎప్పటికప్పుడు. పైగా నాకు తీరినా నువ్వెంత బిజీగా ఉంటావో అనొకటీ,” అన్నారు, సుందరానికి ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంటూ.

“నిజమేనండీ. ఈదేశంలో చావడానికి కూడా అపాయింటుమెంటు తీసుకోవాలి. ఆ యమధర్మరాజే వచ్చినా, ఇప్పుడు కాదు బాబూ, ఆర్నెల్లతరవాత కనిపించు అనాలేమో.”

“ఇవాళ 90 దాటుతుందన్నాడు వెదరుమేను. … మరో నెలయినా కాస్త చల్లగా ఉంటే బాగుండు.”

“అవునండీ. పైగా ఈ ఈదురుగాలొకటీ. వీధిలోకి అడుగెడితే, వాయుదేవుడే వాహనం అయేలా ఉంది.”

“బాగా చెప్పేవు.”

సుందరానికి ఈయన ప్రత్యేకించి తనకి ఇవాళ ఇలా “తటస్థపడడం” అనుకోకుండా జరిగినట్టు లేదు.

తను తరుచూ పుస్తకాలషాపుకి వస్తాడని దాదాపు తనని తెలిసినవాళ్లందరికీ తెలుసు. ఇది తనకి చాలా ఇష్టమయిన ప్రదేశం. ఇక్కడ పుస్తకాలే కాక కూర్చుని కాఫీ తాగడానికీ, కబుర్లు చెప్పుకోడానికీ కూడా అనువుగా ఉంటుంది.

రెండు నిముషాలు నిశ్శబ్దం.

“నువ్వూ లీలా ….బాగానే ఉన్నారా?” అన్నాడు ప్రభాస్రావు గొంతు తగ్గించి, తటాపటాయిస్తూ.

సుందరం మనసులోనే ఉలికిపడ్డాడు.

“బాగానే ఉన్నాంవండీ. ఏం అలా అడుగుతున్నారు?”

“అఁ, ఏం లేదు. పెద్దవాణ్ణి కదా. మీనాన్నా, నేనూ ఓ కంచంలో తిని ఓ మంచంమీద పడుకోలేదు గానీ ఇంచుమించు కవలపిల్లల్లాగే పెరిగేం హైస్కూలు అయిపోయేవరకూ. మీపెళ్ళికి కూడా వచ్చేను, గుర్తుందా? అంచేత మనవాడెలా ఉన్నాడో అని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటానంతే.”

“యా. థాంక్స్. బాగున్నాఁవండీ. ఈమధ్య లీలకి ఉద్యోగంలో ప్రొమోషను కూడా వచ్చింది. నేను కూడా చాలా ఆనందపడిపోయేను. తనకి కొత్త కంప్యూటరు కొనిచ్చేను” అన్నాడు సుందరం గబగబా.

మళ్ళీ రెండు నిముషాలు నిశ్శబ్దం. ఇద్దరూ షాపులోకి వచ్చే పోయేవారినీ, కాఫీలు తాగుతున్నవారినీ, కాఫీ కప్పు పుచ్చుకు, ఏ పుస్తకమో సీరియస్‌గా చదివేసుకుంటున్నవాళ్ళనీ పరిశీలించేరు కొంచెంసేపు.

“ఈమధ్య ఏదో విన్నాలే. లీల ఎవరితోనో ఏదో అందని మీ ఆంటీ నాతో అంది. దానికేముందిలే ఏవో చిన్నచిన్న తగూలు సహజమే కదా మొగుడూ పెళ్ళాలన్నతరవాత అన్నాను.”

సుందరం “ఏం తగువండీ?” అన్నాడు కంగారు కప్పిపుచ్చుకుని.

“మ్. చూశావా. నేనూ అదే అనుకున్నాను ఏం తగువులే అని. … మ్.. ఏంటంటే … అదే నువ్వూ, ఆవిడా మరెవరితోనో సినిమాకి వెళ్ళి, ఆవిణ్ణి ఒక్కదాన్నీ ఒదిలేసి వచ్చేశావుట. అందుకు ఆవిడ చాలా బాధ పడిపోయి ఆ విశాలగారితో చెప్పుకుందిట.” అన్నాడ ప్రభాస్రావు నేనేం అదేం పెద్దవిషయం అనుకోలేదులే అనిపించే స్వరంతో.

“ఓఓఓఓ అదా. అబ్బే, అదేంలేదండీ. తను ఆ క్షణానికి కాస్త బాధ పడినమాట వాస్తవమే. ఉప్పూ పులుసూ తినేవాడికెవరికైనా అలా అనిపించడం సహజమే కదండీ. ఆతరవాత నేను పరిస్థితి విడమర్చి చక్కగా చెప్పింతరవాత తను కూడా ‘నిజమేనండీ‘ అంది. తనకి  ఆమాత్రం తెలీక గాదండీ. అసలు సమస్యేమిటంటే లీల చాలా ఎమోషనల్. చాలా చిన్నవిషయానికి కూడా అగ్గిపుల్లలా భగ్గున మండిపడిపోతుంది కానీ మళ్లీ చప్పున చల్లారిపోతుంది కూడా.”

“నేను అదే అనుకున్నాలే,” అన్నాడు ప్రభాస్రావు తృప్తిగా.

“ఏం చెప్పేనని అడగరేం? అసలు అంతెందుకూ, మీరే చెప్పండి ఇలాటి సందర్భాలలో మధ్యేమార్గం ఉంటుందా? ‘మీరెళ్ళండి, నేను మాఅవిడని ఒంటరిగా వదిలి రాలేను‘ అని రెడ్డికేనా చెప్పాలి, ‘నేను రెడ్డితో వెళ్తున్నాను, నువ్వు తరవాత రా‘ అని లీలకేనా చెప్పాలి. అంతేగదా. ఇద్దరితోనూ ఉండడానికి నాకేం రెండు కాయాలు లేవు కదా. నేనేం ఆ వాసుదేవుణ్ణి కాదుకదా ఇక్కడా అక్కడా, ఎందెందు వెతికి చూచిన అందందంతా కనిపించడానికి. హా హా. లేదులెండి, ఊరికే హాస్యానికంటున్నా. పాపం రెడ్డి ‘కడుపులో కెలికేస్తోందండి, నేనింక కూర్చోలేను‘ అనగానే, నాకు మరేం తోచలేదు. ‘పదండీ,‘ అని బయటికి తీసుకుపోయేను. ఆతరవాత ఏదో మాటాడుకుంటూ ఇంటికి తీసుకొచ్చేను. లీల ఇంటికి వచ్చేవేళకి మేమిద్దరం పేకాడుతూండడమే తనకి కనిపించింది కానీ అతను ఆ మధ్యలో ఎంత అతలాకుతలం అయిపోయేడో తెలీలేదు. అంచేత ఆ క్షణానికి కోపం తెచ్చుకుంది. తరవాత నేను వివరించి చెప్పినతరవాత తను కూడా అర్థం చేసుకుందిలెండి.”

“ఆహా. అయితే నువ్వు మాటాడేవన్నమాట ఆవిడతో. బావుంది. మరి ఆమాత్రం దానికి ఆ విశాలగారిదగ్గర ఎందుకూ ఆ ఏడుపూ అని?”

“అదేనండీ. మనవాళ్ళేమో అదుగో పులి అంటే ఇదుగో తోక అనేరకం. పులీ, తోకా లేనిచోట కూడా ఓ కాయితప్పులిని పుట్టించి, కతలు రేపుతారు. అసలు లీల ఏమందో ఆ విశాలగారు ఏంవర్థం చేసుకున్నారో … హుమ్. ఆడవాళ్ళు ….”

“మాబాగా చెప్పేవు సుందరం. నాకు తెలుసు నువ్వు ఎట్టి క్లిష్టపరిస్థితులనయినా చక్కగా సమర్థించుకు రాగలవు, మీనాన్నలాగే.”

“మీకు తెలుసా. మేం విస్కాన్సిన్‌కి వచ్చినకొత్తలో తెలుగుమొహాలకి వాచిపోయేవాళ్ళం. నేను కాదులెండి, లీలకే అది మరీ ఎక్కువ. తెలుగువాడు కనిపిస్తే, సాక్షాత్తూ శ్రీవెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయినంత ఆనందంగా ఉండేది. అప్పుడే ఏదో షాపులో కనిపించి నాయుడుగారు కొత్తగా వచ్చేం అని తెలిసి, వాళ్ళింటికి పిలిచేరు. ఆరోజు ఆవిడ చేసిన మిరప్పళ్ళపచ్చడి లీల ఇప్పటికీ తలుచుకుంటుంది. దేశం కాని దేశం వచ్చేక ఇక్కడ ఉన్నవాళ్ళే కదా మనకి తల్లులూ, తండ్రులూ, సఖులూ, బంధువులూను.”

“నేనూ అదే అన్నాను మాఆవిడతో. లీలకి అంత బాధగా ఉంటే ఆమాట సుందరంతోనే చెప్తే పోయేది కదా అని. ఊళ్ళోవాళ్ళతో చెప్తే, వాళ్ళేం చేస్తారు? ఇదుగో ఇలా కాకిగోల చేసి, నీ పరువు తియ్యడం తప్ప.”

“నేను అదే చెప్పేను లీలకి. రెడ్డి కొత్తవాడు. అతనేం అనుకుంటాడో అని మనం బాధపడాలి కానీ నీకూ నాకూ మధ్య ఈ మర్యాదలూ, మన్ననలూ ఏమిటి అని. నిజం చెప్తున్నా అంకుల్. అసలు మేమిద్దరం ఒక్కతాటిమీద నడుస్తాం, ఒక్కమాటమీద నిలబడతాం. తనేం చేసినా నేనేం అనుకోను. నేనేం చేసినా తనేం అనుకోదు. మామధ్య అలాటి అండర్‌స్టాండింగ్ ఉంది. ఉండాలి. ఇక్కడ అమెరికనలకి అ అంటర్‌స్టాండింగు లేదు కనకే అనుక్షణం ‘ఐ లౌ యూ, ఐ లౌ యూ‘ అంటూ హామీలిచ్చుకుంటూ ఉంటారు క్షణక్షణం. మన సంప్రదాయంలో అది ఎందుకంటే లేదంటే ఇదుగో ఇదే కారణం. మనలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరిప్రవర్తనని మరొకరు గౌరవించే ఆచారం ఉంది కనక.”

సుందరం మన సంస్కృతీ, సంప్రదాయాలగురించి ఇనుమిక్కిలి ఉద్రేకంతో చెప్పుకుపోతుంటే, ప్రభాస్రావుకి ముచ్చటేసింది.

“అవును సుందరం, నీకు మన సంప్రదాయాలు ఇంత చక్కగా అవగాహన కాబట్టే మీ సంసారం సజావుగా సాగిపోతోంది. చెప్పేనో లేదో మీ ఆంటీకీ నాకూ మధ్య అనుబంధం కూడా అలాటిదే.”

“లీల కూడా అదే అందండీ. ‘మీరన్నది సబబే. పాపం రెడ్డి ఇంక ఎన్నాళ్ళుంటాడు కనక. మరో వారం రోజులు, అంతే కదా. కాస్త దగ్గరుండి కనిపెట్టుకునుండండి. నాకు కుదుర్తుందో కుదర్దో … మీరిద్దరూ రోజూ సినిమాలకి వెళ్తూండండి. అసలు అక్కడే పడుకుంటే బాగుంటుందేమో. మళ్లీ ఏ రకాలపుకార్లూ పుట్టకుండా, చెరో గదిలో పడుకుని, అలా ఫొటోలు కూడా తీసిపెట్టుకోండి అంది.”

ప్రభాస్రావు మొహంలో అయోమయం గమనించి, సుందరం గట్టిగా నవ్వేడు. “హా …హా హా … అదేనండీ మా లీల సెన్స్ ఆఫ్ హ్యూమర్. మేం ఇద్దరం తెగ నవ్వుకున్నాం.”

సుందరం లేస్తూంటే, ప్రభాస్రావు కూడా లేస్తూ, “పద, నీతో రెండు మాటలు చెప్పాలి.” అన్నాడు సుందరాన్ని అనుసరిస్తూ.

సుందరానికి ప్రభాస్రావు తనమాటలని మెచ్చుకోడం, తనతో ఏదో ముఖ్య విషయం చర్చించాలనడం మహా తృప్తినిచ్చింది. “చెప్పండి,” అన్నాడు బయటికొచ్చి ఆగి.

“అదే విషిసంగతి.”

“విషిసంగతా? ఏమయిందేమిటి?”

“ఏం కాలేదు. అరవింద నీకు తెలుసు కదా. నీకు వరసకి చెల్లెలవుతుందనుకుంటాను.”

“చాలా దూరపు చుట్టరికమండీ. ఇంతకీ అసలు సంగతి చెప్పేరు కారు.”

“పిల్లలు కదా. కాస్త ఆవేశాలెక్కువ. ఇక్కడ ఇదో గోల. హైస్కూలేనా కాకుండా డేటింగంటూ మొదలెడతారు.”

“ఒస్. అంతేనా. మీరన్నట్టు అదో రకం ఆనవాయితీ … రైటాఫ్ పాసేజి అనుకోండి. అదే పోతుందిలెండి. వీళ్ళకి పాతిక దాటేలోపున ఇలాటివెన్నో.” అన్నాడు సుందరం తేలిగ్గా.

“అదే బాబూ నేను కూడా అన్నది. కానీ విషి అలా అనుకోడం లేదు. నేను చెప్తే వినడం లేదు. ఆ పిల్లే నా లవ్వాఫ్ లైఫంటూ ఒకటే గోల.”

“విషితో మాటాడమంటారా?”

ప్రభాస్రావు క్షణం ఆలోచించి, “విషికి నేను చెప్తానులే. వాడిది అసలే చాలా సున్నితమయిన మనసు. నువ్వు ఆ అరవిందతో మాటాడు. విషికేమిటి మగాడు. కో అంటే కోటిమంది వాడిముందు వాల్తారు. ఆ అమ్మాయికుండాలి. వాళ్ళపెద్దలకుండాలి. ఆడపిల్ల. … కొంతకాలం వీడితో తిరిగింది అంటే మనవాళ్లమధ్య పరువుంటుందంటావా?”

“మీరేవంటున్నారో నాకర్థం కావడంలేదు.”

“ఏం లేదు. మళ్ళీ వాళ్లిద్దరూ కలిస్తే బాగుంటుందనీ …. ఇప్పుడే పెళ్ళి చేసేస్తాం అనడంలేదులే నేను. … ఇద్దరూ చదువులయేకే చేసుకోవచ్చు. అంతవరకూ మనవాడిని ఆ పిల్ల డంప్ చేసిందన్న మాట పైకి పొక్కకుండా ఉంటే మంచిదని. ఈదేశంలో ఇద్దరూ పెరుగుతున్నవాళ్ళు … ఇక్కడ ఉన్నవాళ్ళలోనే చూసుకోవాలి కదా. వాళ్ళకి మళ్ళీ మాలాటి సంబంధం దొరుకుతుందేమిటి? అందులోనూ కొన్నాళ్ళు మావాడితో తిరిగిందంటే … హుమ్.”

“… …. ….”

“ఏంలేదు. మీఆంటీకి కూడా ఆ పిల్లంటే చాలా ఇష్టంగా ఉంది. అంచేత వీళ్ళిద్దర్నీ ఒకింటివాళ్ళని చెయ్యాలని నా అభిమతం. మావాడు మనతెలుగుపిల్లనే చేసుకుంటానని పట్టు బట్టేడు. వాళ్ళకీ అలాటి కోరికే ఉందనుకుంటాను.”

“సరేనండీ. చూస్తాను. చెప్పేను కదా. మాకూ వాళ్ళకీ సోషలైజింగు తక్కువే. కానీ ఇలాటి సందర్భాల్లో చుట్టరికం తిరగదీయడంలో తప్పులేదు కదా.”

సుందరం ప్రభాస్రావుకి ధైర్యం చెప్పి తనకారువేపు నడిచేడు.

ప్రభాస్రావుకి తన ఆలోచన కార్యరూపం ధరిస్తుందనే నమ్మకం కుదిరింది.

“అన్నట్టు మరోమాట. లీలకి ఏదైనా మనస్తాపం కలిగితే, ఆంటీతో చెప్పమను. సంసారం గుట్టూ, రోగం రట్టూ అన్నారు. ఇలాటి చిన్న చిన్నవిషయాలు బయటికి పొక్కనీకూడదు,” అన్నాడు ప్రభాస్రావు చివరిమాటగా.

“ఎందుకులెండి. నేను చూసుకుంటాను. అవసరమయితే చెప్తాలెండి” అన్నాడు, సుందరం, మళ్లీ ఆయన్ని చిన్నబుచ్చడం ఇష్టంలేక.

(ఏప్రిల్ 19, 2011)

6 Responses to మార్పు 15

  1. మాలతి అంటున్నారు:

    లలితా, ఊళ్లో లేకపోవడం చేత, మీ వ్యాఖ్య వెంటనే కనిపించలేదు. ఏం అనుకోకండి. మీఅభిమానానికి థాంక్స్.

  2. మాలతి గారూ,
    మార్పు 17 కి నా వ్యాఖ్యకి మీ సమాధానం చూసాక ఇక్కడికి వచ్చాను.
    కొన్ని links మిస్ అయ్యానని అర్థం అయ్యింది.
    బావుంది ఈ భాగమూ, చర్చా కూడా.
    నిజంగానే మంచి నవల తయారు చెయ్యాలి మీరు.

  3. మాలతి అంటున్నారు:

    @ c v r mohan, థాంక్స్.

  4. సి వి ఆర్ మోహన్ అంటున్నారు:

    “అంటే ఎవరికి వారు తమప్రవర్తనలో తప్పు లేదు అని చెప్పడానికే ప్రయత్నిస్తారు కానీ పూర్తిపాఠం ఎప్పుడూ చెప్పరు.”
    అంటే —తమ తమ కోణంలోని ఒప్పులు మాత్రమే కనిపిస్తాయి, తప్పులు కనపడవు.
    అలాగే ఎదుటివారిలో తప్పులే కనిపిస్తాయి ఒప్పులు కనపడవు.
    అదే మానవ నైజం .
    Very interesting progress.

  5. మాలతి అంటున్నారు:

    @ KumarN, ). అదేనండీ, ఇలాటి మనుషులుంటారా? ఇలా మాటాడతారా? ఇలా ప్రవర్తిస్తారా? అని నాక్కూడా సందేహమూ, ఆశ్చర్యమూ కలిగినప్పుడే రాస్తున్నాను. నారాతల్లో అభూతకల్పనలు లేవు. నిక్కచ్చిగా జరిగినవే.
    కథకి ప్రాణం సంఘర్షణ. పాత్రలమనస్తత్వాలలో భిన్నత్వమే సంఘర్షణకి మూలం కదా. మీరన్నట్టు నాటకీయంగానే ఉన్నట్టనిపించినా, (మళ్ళీ మీరే అన్నట్టు,) మానవనైజం అలాటిది మరి.
    లీలకి ఆ క్షణంలో చెప్పాలనిపించిందేదో చెప్పేసిందే కానీ వీళ్లతో చెప్పొచ్చా, వీళ్ళు మరొకరికి చెప్తారా అని ఆలోచించే మనస్థిమితం ఉన్నట్టు కనిపించదు.
    సుందరం మేధావి. తన మేధనీ, ఆధిక్యతనీ ప్రదర్శించుకునే ధోరణి అతనిది.
    వెనకటి టపామీద సి వి ఆర్ మోహన్ “లీల సుందరంతో మాటాడితే సరిపోయేది” అని వ్యాఖ్యానించారు.
    ఆ “మాటాడడం” ఎలా సాగిందో సుందరంకోణంలోనుండి చూపడానికి ప్రయత్నించేను ఇక్కడ.
    ఈ రెండు వ్యాఖ్యలూ చూసినతరవాత నాకు తోచిన మరో సంగతి. లీల ఆవకాయగురించి మాటాడలేదు. సుందరం తన ప్రవర్తనని (చెప్పకుండా వెళ్ళిపోడం) సమర్థించుకోడానికి ప్రయత్నించలేదు.
    అంటే ఎవరికి వారు తమప్రవర్తనలో తప్పు లేదు అని చెప్పడానికే ప్రయత్నిస్తారు కానీ పూర్తిపాఠం ఎప్పుడూ చెప్పరు. ఎవరు ఎలా మాటాడతారో చెప్పేనన్నమాట.
    మరోకోణం ఇప్పుడే తట్టింది – సుందరమే లీలతో ధియేటర్లోనో తరవాత ఫోన్లోనో మాటమాత్రం చెప్పి ఉంటే సరిపోయేది కదా అనీ. హుమ్. అలా అయిఉంటే అసలు కథే లేకపోను. :p. ). ఏమంటారు?
    మీ అభిప్రాయాలు ముందు ముందు కూడా రాస్తూంటారని ఆశిస్తూ, ధన్యవాదాలతో. – మాలతి..
    .

  6. KumarN అంటున్నారు:

    బాబోయ్, మీరు సామాన్యులు కారు మాలతి గారూ, ఎక్కణ్ణుంచి ఎక్కడికి లింకెట్టారండీ బాబూ? లౌక్యమా మజాకా??!!!

    నేనింకా ఆ జనరేషన్ కి రాలేదు కానీ, మీరు ఫ్యూచర్ మాత్రం బానే చూపెడుతున్నారు, కళ్ళకి :-) )

    పోతే నాదో అనుమానం, నిజంగా వైఫ్స్ అట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భర్త నన్ను థియేటర్ లోనే వదిలేసి, వాళ్ళ ఫ్రెండుతో మా ఇంటికెళ్ళిపొయాడూ (అందునా ఆ మాటల్ని బ్రాడ్కాస్ట్ చేసే లాంటి వాళ్ళదగ్గరికి వెళ్ళి మరీ) అని వాపోతారా? ఏదో తన కుటుంబసభ్యులు చెల్లికో, తల్లికో, చాలా నమ్మకస్తులతోనో అన్నారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ..ఏమో నాక్కొంచెం రియాలిటీ లాగా అనిపించలేదు. పైగా బోర్డర్స్ లాంటి బుక్ షాప్ లో కనపడి పెద్దాయన అంత చిన్న విషయాన్ని పట్టుకొని, మీరిద్దరూ సౌఖ్యంగా ఉంటున్నారా అన్న పెద్ద ప్రశ్న వేయటం కూడా..అందులో ఆ అబ్బాయి పెద్దాయన్ని అంతగా నమ్మించాలని చూట్టం కూడా కొంచెం నాటకీయంగా ఆనిపించింది.

    కాని చెప్పలేం లెండి, లోకంలో మనుషులు రకరకాలు కదా..ఎన్ని ఆశ్చర్యాలని చూడలేదూ!!!..

    నాలాంటాడయితే, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, వెళ్ళి నీ పని చూసుకో బాసూ అనేవాడు. కాని పెద్దాయన కాబట్టి, కొంచెం లౌక్యంగా ఏ సమాధానమూ ఇవ్వకుండా మీ లైను ఇదే మాస్టారూ, క్రాస్ అవుతున్నారూ అని మెసేజ్ పాస్ చేసేవాడు.

    క్షమించాలి, ఈకలు పీకానంటారా ? ఏమో అనిపించింది చెప్పాను. ఇష్టం తోనే సుమా.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.