నాలుగోఝామున లేచి
తొలికాఫీతో వరండాలోకెళ్తే
కనిపించిన సుందరదృశ్యం
మందంగా ఆవరించి
మనసుని ముడిచేసింది.
చిక్కటినింగిని మూడుదీపాలు మిలమిలా మెరుస్తూ
ఎయిర్పోర్టువేపు దూసుకుపోతుంటే
మరోవేపు అల్లంతదూరాన చిన్ని చుక్కలు రెండు
ఎటూ పోలేక్కాబోలు
స్వస్థలంలోనే మినుకుమినుకు మెరుస్తుంటే
చిమ్మచీకట్లు చీల్చుకు నులివెచ్చని రంగులు
రెడీమేడ్ స్ర్కిప్టుని ఆకళించుకున్న
ప్రౌఢనటి అలవోకగా మేకప్పేసుకుంటున్నట్టు
నల్లని కారుమబ్బుల్లోంచీ పొడుచుకొస్తూ
వెలిబూడిద తెలినీలిమలోంచి ఊదారంగులోకీ,
ఊదానించీ నునులేత ఎరుపులోకీ
ఆపైన సువర్ణరేఖలలోకీ పరివర్తిస్తూ
కనీ కనిపించకుండా
నాకళ్ళ మాయపొరలు కమ్మిస్తుంటే
లోకం విస్తరించిందో కుంచించుకుపోతోందో తెలీడం లేదు.
దిగంతాలకి ప్రయాణాలు సుఖతరమయేయి
ఉద్యోగాలు దేశపుటెల్లల్ని దాటుకు లోకవ్యాప్తమయేయి
ప్రపంచీకరణపేరున
భాషలు పంచపళ్ల కషాయమయేయి
భావాలు హెచ్చిపోయేయి ద్విగుణీకృతోత్సాహంతో.
అయేయంటున్నారు ప్రథమశ్రేణి పండితమ్మన్యులు.
నాకు మాత్రం గత యాభై ఏళ్ళలో
మారినలోకం చూస్తే
మనసు ముడుచుకుపోతోంది.
అంతో ఇంతో పెరడూ,
ఇంటిముందు వేపచెట్టూ, కర్రిఆవూ లేగదూడా లేవిప్పుడు.
ఇల్లంటే
రెండోఅంతస్థులోనో మూడో అంతస్థులోనో రెండున్నరగదుల ఫ్లాటు
కుటుంబమంటే
తల్లీ, తండ్రీ, తాతా, ముత్తాతా పోయి
అబ్బాయీ, అమ్మాయీ,
వారి నిసువులూ మిగిలేరు.
నాయిల్లునుంచీ నాగదికీ,
మనవాహనంనించీ
నాకారూ నాబైకుకీ, నాఫోనుకీ
మారిపోయేయి ఆస్తులూ, ఆత్మీయతలూ.
ఎవరికి వారే యమునా తీరే.
నా మనోవ్యథ వినిపించుకునే
తల్లీ, తండ్రీ, తోబుట్టువులూ లేరు.
గంటకి రెండొందల్తీసుకు
గోడు అవధరించే అనాత్మీయులు అవతరించేరు..
హర్షం పంచుకోడానికి
సిద్ధంగా లేవు ఈసంస్థలేవీ
వాటికి ప్రతిరూపాలు
థెరపీగ్రూపులూ సొంతబ్లాగులూ
తామరతంపరగా లేచేయి.
విపులా చ పృథ్వీ
ఎదల్ని మాత్రం చెదలు తినేశాయి
(ఏప్రిల్ 23, 2011)

@ నాపరిధి, లిక్విడ్ బ్రేక్ ఫాస్ట్.. హా. ఎందుకండీ అంత తొందర అని అడగనులండి. :p. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు
నిజంగా .. నిజం రాసారు .. ఇప్పుడు ఆ కాఫీ తాగడానికి కూడా టైం ఉండడం లేదండి ..
లేచేప్పటికి 6 30 లేదా ఏడు .. అప్పుడు లంచ్ వండాల .. కాఫీ తాగల .. బ్రేక్ఫాస్ట్ తినే టైం కూడా లేక ఈ మధ్య తాగుతున్న .. అదే లిక్విడ్ బ్రేక్ఫాస్ట్ లెండి
సాయంత్రం మళ్ళా ఇల్లు చేరేప్పటికి ఏడు లేదా ఎనిమిది .. హ్మ్ .. ఇంకేమి చేసేది చెప్పండి ..
@ సౌమ్యా. అయితే విశాలహృదయాలూ, సంకుచితహృదయాలూ కూడా చూసేశానంటావు అప్పుడే. బాగుంది. @ కొత్త ప్రమాణాలు – నిజానికి నేను కూడా అదే ఆలోచనతో మొదలు పెట్టేను. సూర్యోదయం, సంధ్యవేళ ఆకాశంలో రంగులూలాగే కొన్ని ప్రమాణాలు నిత్యనూతనంగా, మనిషితో పుట్టుకతో వచ్చినవి అలా ఆద్యంతరహితంగా సర్వవేళలా ఉంటాయని చెప్పాలని మొదలు పెట్టేననుకుంటాను. తీరా ఇలా తేలింది, హుమ్.
“ఎదల్ని మాత్రం చెదలు తినేశాయి” – ఏమో, నాకు పూర్వకాలపు ఎదల సంగతి తెలీదు కానీ, బోలెడంత విశాల్యం ఉన్న ఎదలే ఎక్కువ చూసాను – పుట్టకతోనే అదృష్టవంతురాలిని కనుక. అలాగే, బోలెడంత సంకుచితమైన వారూ చాలా కొందరు తగిలారు -అదృష్టవంతురాలిని కదా!
బహుశా,ఇప్పటి జీవితాన్ని చూడ్డానికి కొత్త ప్రమాణాలు అవసరమేమో. పాత ప్రమాణాలతో కొత్త జీవితాన్ని చూస్తే, పక్కవాడి నార్మల్సీ మనకు ఉండాలి అన్నట్లు ఉండదూ?
@ Snkr, ధన్యవాదాలు మీ అభిప్రాయాలకి. ఇలాటివి తలుచుకోడం ఊరికే ఆ క్షణం సంతృప్తికేసమేనేమో.
‘ కర్రావు, లేగదూడ, గోధూళి … కె.విశ్వనాథ్ మూవీ ‘ కాదు గాని, కొందరు ప్రవాసుల సున్నిత మౌనాలాపన వినిపించారు, వాసుల పరిస్థితి అంతకన్నా గొప్పగా లేదు.
‘ఐనా పడవ ప్రయాణం
గమ్య మెక్కడో తీరమేమిటో తెలియదు పాపం’ అన్నట్టు ‘పదండి మోసుకు, పదండి తోసుకు’ అని వెళ్ళిపోతున్నాం.. అంతే!
బాగా చెప్పారు.
@ ఉష, – మొన్న సంక్రాంతికి మా ఊర్లో ఓ లేగదూడ పుట్టటం చూశాను, తామర పూవుని తాకి, నారింజ కాయ కోసుకు తిన్నాను. ముగ్గు వేశాను, భోగి చీకటికి ఎదురు మంట వేశాను. ఆత్మీయత కనపరిచిన వారి చెంత గడిపాను. వాటి ప్రభావాన్ని నాతో మోసుకు తెచ్చాను – మంచిపని చేసారండీ. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఇలాటి క్షణాలు చాలా తక్కువే. మీకు దొరికేయంటే సంతోషంగా ఉంది. పదిలంగా దాచుకోండి. మీ తలపులు పంచుకున్నందుకు ధన్యవాదాలు. – మాలతి
@ రాజేష్ జి, చాలా సంతోషమండీ మీకూ కూడా నాలాగే అనిపించినందుకు. ఇది నిజంగా విచారం కాదు. అవన్నీ లేవన్న ఆర్తీ కాదు. బహుశా మీరు మీటపాలో అన్నట్టు నేను కూడా మరో టపా రాయాలేమో వివరణకి. – మీ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు. – మాలతి
$మాలతి గారు
ప్రాత:కాల ఉషోదయాన్ని చూపించినట్లే చూపించి దానికనుగుణంగా మేల్కొవాల్సిన మనసులు ఎలా కుచించుకుపోతున్నాయో..చక్కగా చెప్పారు.
#లోకాలతలుపులు తెరుచుకున్నవేళ మనసులు ముడుచుకుపోతున్నాయి!
మీరు ఈ టపాలో ఏం చెప్పాలనుకున్నారో టపా పేరుతోనే చెప్పేసిన మీ మేధాశక్తి అద్భుతం.
”
లోకం విస్తరించిందో కుంచించుకుపోతోందో తెలీడం లేదు.
.
ప్రపంచీకరణపేరున
భాషలు పంచపళ్ల కషాయమయేయి
భావాలు హెచ్చిపోయేయి ద్విగుణీకృతోత్సాహంతో.
.
మారినలోకం చూస్తే
మనసు ముడుచుకుపోతోంది.
అంతో ఇంతో పెరడూ,
ఇంటిముందు వేపచెట్టూ, కర్రిఆవూ లేగదూడా లేవిప్పుడు.
.
తల్లీ, తండ్రీ, తాతా, ముత్తాతా పోయి
.
నాయిల్లునుంచీ నాగదికీ,
.
నాకారూ నాబైకుకీ, నాఫోనుకీ
.
ఎవరికి వారే యమునా తీరే.
.
గంటకి రెండొందల్తీసుకు
గోడు అవధరించే అనాత్మీయులు అవతరించేరు..
.
థెరపీగ్రూపులూ సొంతబ్లాగులూ
.
ఎదల్ని మాత్రం చెదలు తినేశాయి
”
!
ఎంత చక్కటి భావుకత..అంతే చక్కగా వాస్తవాలను విడమరిచి చెప్పారు. ఈ నవయుగంలో ఉండాలంటే జీవితాలు ఇలానే గడపాలేమో.. లేకపోతే హిమాలయాలకు నాంది
అన్నట్లు నేకూడా.. కాకపొతే సాయంసంధ్య గురించి.. నాకు తెలిసిన పదాలతో రాసా.. మీకు వీలున్నప్పుడు ఒక్కసారి సందర్సించగలరు
http://saapaatusamagatulu.blogspot.com/2011/04/1.html
మాలతి గారు, ఉదయపాకాశపు వర్ణన బావుంది. వెనగ్గా వచ్చిన వేదన గట్టిగా తాకింది. ఇక,
“మారినలోకం చూస్తే
మనసు ముడుచుకుపోతోంది”
ఎందుకో సవ్వడి సందడి తక్కువగా ఉండే ఈ వారాంతపు ఉదయాలు, మునిమాపులూ నాలోనూ ఇదేమాదిరి గుబులు, సంవేదనలు రేపుతాయి. ఏదో తెలియని బాధ, ఆవేశం కలిగి పురుగులా ఒక ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది – ఈ మార్పులు ఎందుకు? అని. దానికి జవాబు శోధించేలోగా దైనందిన ప్రాపంచిక జీవన జరుగుబాటు వెతలు తోసుకొస్తాయి, అప్పటికి వాయిదా వేసి లేదా తెర కప్పి సాగటం. కానీ ఉన్నంతలో నేను పెరిగి వచ్చిన వాతావరణపు ఛాయలు మాత్రం అందుకునే ప్రయత్నం లోనే ఉంటానిక్కడా – వెనక్కి వెళ్ళి ఉండే కాస్త సమయమూనూ. మొన్న సంక్రాంతికి మా ఊర్లో ఓ లేగదూడ పుట్టటం చూశాను, తామర పూవుని తాకి, నారింజ కాయ కోసుకు తిన్నాను. ముగ్గు వేశాను, భోగి చీకటికి ఎదురు మంట వేశాను. ఆత్మీయత కనపరిచిన వారి చెంత గడిపాను. వాటి ప్రభావాన్ని నాతో మోసుకు తెచ్చాను. ఇలా బాలెన్స్ చేస్తూ పోవటమే పరిష్కారమేమో.
@ Lalitha4kids, మీకు కూడా అలానే అనిపించిందా. సంతోషం.
@ శ్రీలలిత, -అవసరాన్ని బట్టి – అవుండీ, మామూలు మనిషిగా స్పందించడం తగ్గిపోతోందనిపిస్తోంది. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.
@ కుమార్ యన్, – అసలా పదాలు చదవగానే ఎ౦త చక్కగా అనిపి౦చి౦దో… – అంతేనండీ, అవి మరోమారు తలుచుకోడానికే ఈ రాతలు. మీరు ప్రస్తుతానికి సంతోషంగానే ఉన్నందుకు సంతోషంగానే ఉంది. నిజానికి అలా హాయిగా ఉన్నవాళ్ళే ఎక్కువేమో. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
@ మాధురి, నా కిటుకు పని చేస్తున్నందుకు సంతోషం.
@ సరయు, అవునండీ, నేను కవిత రాసి చాలా కాలం అయింది. మీకు నచ్చినందుకు సంతోషం.
malathi garu
ee madhya me kavithalu chadavaledu.. chala baga rasarandi..
Ctrl + is working. Thanks.
హ్మ్మ్. “వేప చెట్టూ, కర్రి ఆవు, లేగ దూడ” అసలా పదాలు చదవగానే ఎ౦త చక్కగా అనిపి౦చి౦దో…
వాటితో చాలాఏళ్ళు పెరిగి వచ్చినవాణ్ణే కాని, జరిగిన, జరుగుతున్న మార్పుల గురి౦చి నాక౦తగా క౦ప్లయి౦ట్స్ లేకపోవట౦ మూలాన కాబోలు, నాకు బానే ఉ౦ది లోక౦.
అలా అని నేను మిస్ అవుతున్నవి, నచ్చనివీ లేక కాదు…ఓ చా౦తాడ౦త లిస్టు౦ది కానీ, ఈ లా౦గ్ జర్నీ చేయకు౦డా ఉన్నట్లయితే మిస్ అయిపోయేవి ఏ౦టో కూడా ఎప్పుడూ ఎరుకలోనే ఉ౦టాయి కాబోలు, అ౦దుకని I am pretty much happy with the journey so far. Would I be happy with the destination..Oh Well…that’s for another day..
చాలా బాగా చెప్పేరండీ..
ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వస్తాము
ఒంటరిగానే పోతాము..
కాని ఇక్కడ మటుకు ఒంటరిగా బతకలేము…
నిజమైన ఆత్మీయతలు, బాంధవ్యాలు ఎప్పుడో మరుగునపడిపోయేయి..
కృత్రిమ వాతావరణం, అవసరాన్ని బట్టి అనుబంధాలు, ఆనందాలు పంచుకోవడం
ఇదే ఇప్పటి నాగరిక జీవనం..
“హర్షం పంచుకోడానికి
సిద్ధంగా లేవు ఈసంస్థలేవీ”
అవును కదా, బాధ చెప్పుకుంటే వింటామంటారు, సంతోషం పంచుకోవడానికీ మనుషులు కావాలి.
పార్టీలు చేసుకున్నట్లు కాదు చిన్న చిన్న సంతోషాలు పంచుకొని పెంచుకోవడానికి మనుషులు కావాలి.
జనాభా పెరిగి అలా అనిపిస్తోందేమో, మనముండే జనవాసాలలో మరీ ముఖ్యంగా.
అన్ని రకాల వారూ, రక రకాల వాతావరణాలూ ఇప్పుడూ ఉన్నాయి. మనం పుట్టిన చోటి నుంచి పెరిగి పెద్ద పట్టణాల్లో, దేశాల్లో స్థిరపడి ప్రపంచాన్ని పెంచుకోవట్లేదేమో, అదే ప్రపంచం అనుకుంటున్నామేమో అనిపిస్తుంటుంది కొన్ని సార్లు.
@ anil, లేదండీ, నేనెవరి కథా చదవలేదు. పొద్దున్నే లేచి చీకట్లో కూచుని కాఫీ తాగుతుంటే తోచిన నాలుగు ముక్కలూ ఇక్కడ పెట్టేను, ఇదీ కవితేనా అంటూ చీవాట్లు పెట్టేవారుంటారని తెలిసినా. :p.
మీ “కోటు”లకి ధన్యవాదాలు. – మాలతి
“హర్షం పంచుకోడానికి
సిద్ధంగా లేవు ఈసంస్థలేవీ
వాటికి ప్రతిరూపాలు
థెరపీగ్రూపులూ సొంతబ్లాగులూ
తామరతంపరగా లేచేయి.”
“గంటకి రెండొందల్తీసుకు
గోడు అవధరించే అనాత్మీయులు అవతరించేరు..”
ఎవరిదో ఆంగ్ల కథ చదివిన గుర్తు.