మార్పు 16

“శనివారం మీకేం పన్లేదూ?”

“హా. అదేం ప్రశ్న? నాకు పనుందో లేదో నీకిప్పుడు ఎందుకింత అర్జంటుగా కావలసివచ్చిదీ?”

“అది కాదండీ. తప్పనిసరిగా నేను మీయింటికి రావలసిన అవసరం మీకేమీ లేదా అని.”

నాకు అరవింద ధోరణి అర్థం కాలేదు. చిన్నగా నవ్వుకుని, “ఉంది. అసలు నువ్వు రాకపోతే కొంపలంటుకుపోతాయి, ఆరోజు మరేపనీ పెట్టుకోకు,” అన్నాను ఆ అమ్మాయి ధోరణి అందుకుని, కొనసాగించే ఉద్దేశంతో.

రెండు క్షణాలు చేతిలో ఫోనువేపు చూస్తూ కూర్చున్నాను, ఇప్పుడయినా అసలు సంగతేమిటో చెప్తుందేమోనని.

కిటికీలోంచి గాలికి సన్నగా ఊగుతున్న పేరు తెలీని చెట్టు కొమ్మలూ, ఉండీ ఉడిగీ ఓ పిట్ట కూతా తప్ప మరే నిశ్శబ్దం లేదు.

“అన్నట్టు మరిచిపోయేను. ఇప్పుడు కూడా చాలా పనుంది. ఓమారు రాకూడదూ?” అన్నాను ఆఖరికి. ముఖాముఖి మాటాడుకోడం తేలిక కదా.

అరవింద అందుకోసమే ఎదురు చూస్తున్నట్టు, “చెప్పరేం మరి. ఇదుగో అయిదు నిముషాల్లో అక్కడుంటాను,” అని ఫోను పెట్టేసింది.

పది నిముషాల్లో ప్రత్యక్షమయింది. అట్టే జాప్యం లేకుండానే అసలు సంగతి అర్థమయింది.

“సుందరంగారెందుకో ఫోను చేశారు.”

“అంటే? సాధారణంగా చెయ్యరనా?”

“చెయ్యరు. వాళ్ళకీ మాకూ ఏదో దూరపు చుట్టరికం ఉంది. తెలుగువాళ్ళం కదా ఎవరిళ్ళలోనో ఏదో అయినప్పుడు కలుస్తుంటాం. అసలు నేనయితే ఆయన్ని చూసి రెండేళ్ళకి పైనే అవుతోంది.”

“ఎందుకు పిలిచారో చెప్పలేదా?”

“ఆయన చెప్పలేదు కానీ నాకో అనుమానం ఉందిలెండి.”

నేను మాటాడలేదు తను ఎంతవరకూ చెప్పదలుచుకుందో నాకు తెలీదు కదా.

“విషినాన్న ఈయన్ని నాతో ఏదో మాటాడమని చెప్పిఉంటారు. ఈయన ఏం అడుగుతారో, నేనేం చెప్పాల్సివస్తుందో అని నాభయం. భయమేమిటిలెండి, చిరాగ్గా ఉంది. అసలు నా సొంతవిషయాలకి వీళ్ళందరికీ నేను జవాబులు చెప్పుకోడం ఏమిటని?”

“నీ సొంత విషయాలే ఆయన మాటాడతారని నువ్వెందుకనుకుంటున్నావు?”

“పదిరోజులకిందట నాకూ విషీకీ మధ్య ఓ చిన్న సీను జరిగిందిలెండి. దాంతో వాళ్ళనాన్నకి కోపం వచ్చింది. ఆయనేమో సుందరంగారిని మధ్యవర్తిత్వం జరపమన్నట్టుంది. అసలు ఆయనకి మాత్రం ఎందుకో నాకర్థం కావడంలేదు.”

000

“ఈనాటి ఆర్థికపరిస్థితులలో పరిమిత ఆదాయంగల మధ్యతరగతి కుటుంబాల్లో ఆరోగ్యం ఎలా కాపాడుకోగలరు?” అన్న విషయంమీద అరవింద రాసిన వ్యాసానికి దేశస్థాయిలో మొదటి బహుమతి వచ్చింది.

క్లాసులో వాళ్ళ ఎకనమిక్స్ టీచరు ప్రకటించేరు. క్లాసు మొత్తంగానూ విడివిడిగానూ అభినందించారు. అరవింద మహోత్సాహంలో పొంగిపోతూ ఇంటికి బయల్దేరింది. బహుమతి ప్రదానాలు ఆగస్టులో వాషింగ్టన్లో జరుగుతాయిట.

అరవింద ఉత్సాహంగా కూనిరాగాలు తీస్తూ అడుగులేస్తోంది. ఇంతలో విషి ఎదురయేడు. శుభవార్త చెప్పింది. “హేయ్, నావ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది. నేను వాషింగ్టన్ వెళ్తున్నా,” అని.

విషి, ముఖం ముడుచుకుని “సంతోషం,” అన్నాడు. ఆ స్వరంలో సంతోషం లేదు. సంతోషిస్తున్న ఛాయలు లేవు.

అరవింద ఉత్సాహం సగం అయింది. “అదేమిటి? ఎంచక్కా I am proud of you, అనో I am so glad for you అనో అనాలి కానీ,” అంది, అతని నీరసాన్ని హాస్యంలోకి దింపే ప్రయత్నంలో..

ఆ హాస్యం కూడా హత్తలేదు అతనికి.

“అసలు ఆ బహుమతి నాకు రావలసింది. నీకెలా ఇచ్చేరో నాకర్థం కాడంలేదు. అసలు వాళ్ళు నావ్యాసం చదవలేదేమో. లేదా వాళ్ళ మట్టిబుర్రలకి అర్థం కాలేదో.. అయినా అంతేలే. ఆడపిల్ల పేరు చూడగానే పోనీ పాపం అని ఇచ్చేసుంటారు.”

దాంతో అరవింద ఉత్సాహం పూర్తిగా చచ్చింది. చిన్నకోపం కూడా వచ్చింది. “ఛీ. నీతో చెప్పడం నాదే తప్పు. అసలిందుకే నిన్ను డంప్ చేసేను.” విసురుగా తిరుగు సమాధానం వచ్చింది.

విషి కాస్త తగ్గేడు. “నేనంటున్నది అది కాదు. వాళ్ళు నాతెలివితేటలు గుర్తించలేదు అంటున్నా. నీతప్పు అన్లేదు. నాకెప్పుడూ ఇంతే అవుతోంది. ఎంచేత అని అది నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించమంటున్నాను.”

“This is my moment.” అని అరవాలనిపించింది అరవిందకి.. ఎప్పుడు తనసంగతి తను మొదలుపెట్టినా, దాన్ని అతను అతనివిషయంగా మార్చేస్తాడు.

“నీకెప్పుడూ నీగొప్పలే కానీ నాగురించి ఆలోచించవేం?” అన్నాడు మళ్ళీ అతను..

మరో క్షణం ఉంటే బావురుమని ఏడుస్తాడేమోనని భయపడింది అరవింద. చిరాకేసింది. తను ఇంత సంతోషంగా ఉన్నందుకు కనీసం ఈ ఒక్కసారికీ “నాకూ సంతోషంగా ఉంది అనొచ్చు కదా” …. కనీసం సంతోషిస్తున్నట్టు నటించినా బాగుండు.

అసలు తనదే తప్పు. తెలిసి, తెలిసి ఎందుకు అతనికి చెప్పడం? అతనితో బ్రేకప్ప్ అయిపోయినా ఇంకా ఎందుకు స్నేహంగా ఉండడం? – ఆలోచిస్తూ ఇల్లు చేరుకుంది.

వారంరోజులపాటు సాఫీగానే సాగింది. ఏ గొడవా లేదు. స్కూల్లో అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. విషి మళ్ళీ మామూలుగా, సరదాగా మాటాడుతున్నాడు. బ్రేక్ సమయాల్లో కనిపిస్తే, ఏ కాండీబారో, సోడావో కొనిస్తున్నాడు.

ఇప్పుడు సుందరం పిలిచేవరకూ, మళ్ళీ ఈ విషయం తలెత్తుతుందని అనుకోలేదు.

000

నాకు ఏం చెప్పాలో తోచలేదు. అసలు నాకీ దేశంలో అబ్బాయిలూ-అమ్మాయిలూ సంబంధాలూ, వరసలూ అట్టే తెలీదు. జీవితం సగం అయింతరవాత ఇక్కడికి వచ్చేను. ఆ తరవాత కూడా మెయిన్ స్ట్రీంలో కలిసిపోడానికి అట్టే ప్రయత్నాలేమీ చెయ్యలేదు. ఇప్పుడు, నాజీవితం ముప్పాతిక అయిపోయేక, ఈ చరమావస్థలో, ఈ అరవిందలాటివారి పరిచయాలమూలంగానే కొంచెం కొంచెం తెలుస్తోంది!

అంచేత, నేను చెప్పగలిగిందేమీ లేదు, వినడమే తప్ప. అదే అన్నాను అరవిందతో.

“ఏం చేస్తావయితే?”

“అదే కదా అంటున్నది. మీకిప్పుడు అర్జంటుగా నేను లేకపోతే జరగనంత పెద్ద పనేదో ఆ శనివారం తగలాలన్నమాట. అయిదుగంటలకి రమ్మన్నారు. మీరు నాలుగున్నరకి ఫోను చేస్తే చాలు.”

నేను నవ్వేను. “బాగుంది. ఏదో కనిపెడతాను. కానీ ఎన్నాళ్ళు అలా తప్పించుకుంటావు. ఎదురు పడి తాడో పేడో తేల్చేసుకుంటే తరవాత ప్రాణం తెరిపిన పడుతుంది కదా,” నేను నా అనుభవసారం ప్రయోగించేను. ఇలాటివిషయాల్లో సాధారణంగా నేను అప్పులుంచుకోను మరి!

నాకు మరో అనుమానం వచ్చింది. “మీ అమ్మా, నాన్నా ఏమంటారు?”

అరవింద ఫక్కున నవ్వింది, “బాగా అడిగేరు,” అంటూ.

“అదేమిటి? ఎంత అమెరికాలో పెరిగినా, మన సంప్రదాయాలు కూడా బాగానే ఒంట బట్టినట్టున్నాయి కదా. వాళ్ళని కూడా మీకెందుకు అన్నావేమిటి?” అన్నాను అనుమానంగా. నాభయం ఏమిటంటే నేనెంతదూరం వెళ్ళొచ్చూ నాకు కొత్తగా వచ్చిన ఈ మెంటోర్ స్థానంలో అని.

“లేదులెండి. నిజమే నవ్వొచ్చే సంగతి కాదు. ఎందుకు నవ్వేనంటే, ఇదే క్షణంలో – this very moment – అక్కడ మాయింట్లో కూడా మాంఛి జోరుగా ఓ చర్చ జరుగుతోంది. మా అమ్మ, నాకింకా 17 ఏళ్ళే కదా, ఇతను కాకపోతే మరోడు వస్తాడు, ఎందుకు ఇప్పట్నుంచీ ఈ లంపటాలు పెట్టుకోడం అంటుంది. మానాన్నకేమో ఇతనిలాటి గొప్ప వరుడు మరి దొరకడని. నేను కూడా అనుకుంటానులెండి ఇలాటి మానవుడు మరొకడు ఉంటాడా అని. అది వేరే ఉద్దేశంతో అనుకోండి. ఇంతకీ మా నాన్న వాదన మేధావులందరికీ మెదడులో ఒక భాగం ఇనాపరబుల్ అనీ, అది సీరియస్‌గా తీసుకోకూడదనీ.”

నాకు ఏం చెప్పడానికీ తోచలేదు. ఇంతచిన్నపిల్లకి ఇప్పటినుండే ఇంత పెద్ద సమస్య ఏమిటి అనిపించింది. మళ్ళీ ఇది కూడా ఈదేశంలో పిల్లలపెంపకంలో భాగమేనా అన్నది నాకర్థం కాలేదు.

“సరే వస్తానండీ.”

“ఎక్కడికి వెళ్తావు?”

“ఎక్కడికి? ఇంటికే. మాఅమ్మమ్మయింటికి వెళ్ళొచ్చు కానీ మళ్ళీ మాఅమ్మా, నాన్నా ఆవిడమీద ఎగిరిపడతారు. ఎందుకొచ్చిన గొడవ. నేనే పడితే పోలే.”

“పోనీ, ఈరాత్రికి ఇక్కడ ఉండు.”

“మీరు గుండెనొప్పో ఏదో తెచ్చుకుంటారా మరి?”

“చూస్తాను, ఏది వీలో.”

ఇద్దరం నవ్వుకున్నాం. అరవింద వెళ్ళిపోయినతరవాత కూడా చాలాసేపు ఆ అమ్మాయిగురించే ఆలోచిస్తూ కూర్చుండిపోయేను.

000

సుందరం కాఫీ తాగుతూ ఆనాటి న్యూయార్క్ టైమ్స్ చూస్తున్నాడు అరవింద పుస్తకాలషాపులో అడుగు పెట్టేసరికి.

మెల్లిగా వచ్చి పక్క కుర్చీలో కూర్చుంది చిన్నగా నవ్వి, హలో చెప్పి.

“చాల్రోజులైంది చూసి. బాగున్నావా? క్లాసులు ఎలా అవుతున్నాయి? అన్నట్టు, కాఫీ, టీ, … ఏం తాగుతావు?”

అరవింద గబుక్కున లేచింది, “నేను తెచ్చుకుంటాలెండి.”

“నో, నో… అలా కాదు. నా ట్రీటు. నేను పిలిచేను కదా. పైగా పెద్దవాణ్ణి.” అంటూ సుందరం చనువుగా

అరవింద బుజంమీద చెయ్యేసి, కూచోపెట్టి, “ఏంటి?” అన్నాడు.

“ఐస్డ్ టీ”

సుందరం వెళ్ళి టీ తెచ్చేవరకూ, ఆయన వదిలేసిన పేపరు చూస్తూ కూర్చుంది అరవింద..

(ఏప్రిల్ 29, 2011)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.