నాకు రాయడానికేం తోచడంలేదు అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు ఓ మాట అని నన్ను రాసేలా చేసేస్తారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి దుప్పల రవికుమార్ “ఎందుకీ అజ్నానప్రదర్శన” అని అడిగింతరవాత నాక్కూడా అనుమానం వచ్చింది. అవును, మన- అయ్యో లేదులెండి కేవలం “నా” మాత్రమే- అజ్ఞానప్రదర్శన ఎందుకు చేసుకోడం. అసలు అలా చేసుకోవచ్చా, చేసుకున్నందువల్ల ఏ పుట్టి ములిగిపోవును, లేదా చేసుకోనందున ఏ పుట్టి … లాటి సందేహాలు వచ్చేయన్నమాట.
అసలునిజంగా ఏం జరిగిందంటే, మల్లీశ్వరి తన బ్లాగు, జాజిమల్లి లో ఓ చిన్న చర్చ పెట్టేరు వివిధ వాదాలమీద. ఆవిడ తమ ప్రశ్నలకి సమాధానాలు అడిగినప్పుడు, మొదట నేను చాలా వినయంగా “నాకు చాలా అజ్నానం అండీ” అని చెప్పుకుని, ఆమీదట “ఫరవాలేదు, అవే రాయండి” అని ఆమెచేత చెప్పించుకునే నా అజ్నానఅభిప్రాయాలు వెలిబుచ్చేను.
అప్పుడన్నమాట రవికుమార్ గారు ప్రశ్నించేరు తెలీదని చెప్పి ఊరుకోకూడదా.. ఆ పైన రాయడం ఎందుకూ అని. నిజమే. తెలీదంటే తెలీదంతే. అంతే కానీ, అదేమిటీ, ఇదేమిటీ అని పరిపృచ్ఛలు తగునా? పరిపృచ్ఛ అంటే కూడా నాకు తెలీదులెండి. ఆవ్యాఖ్యలో మాట ఘనంగా ఉందని ఇక్కడ వాడేసుకుంటున్నాను.
నిజానికి వెనక రవికుమార్ గారు తమబ్లాగులో ఇంటర్వూ చేస్తానన్నప్పుడు కూడా చెప్పేను నాఅజ్నానంగురించి. అప్పుడు ఆయన కూడా మల్లీశ్వరిగారిలాగే ఫరవాలేదు మీ అజ్నానపూర్వక సమాధానాలే చెప్పండి, అని చెప్పి, ఆ ఇంటర్వూ ప్రచురించేరు కూడాను. అందుకు వారికి ధన్యవాదాలు.
ఇంతకీ రవికుమార్‌గారి ప్రశ్నలో తప్పు లేదు. మనస్ఫూర్తిగానే చెప్తున్నా. అసలు నా ట్రైనింగు కూడా అదే. మా అమ్మ ఎప్పుడూ అంటుండేది “చెప్పడానికేం లేకపోతే నేరు విప్పకు, నోటితుప్పర్లు దండగ” అని.
మరి నేనిప్పుడు ఎందుకిలా మాటాడుతున్నాను అని సుదీర్ఘ ఆత్మవిమర్శ అన్న మాట ఇది.
ఈమధ్య నేను ఇక్కడ తెలుగుక్లాసుకి వెళ్తున్నానని చెప్పేను కదా. చదువుకోడానికి కాదులెండి. తెలుగుపాఠాలు చెప్తున్న నసీంగారికి సహాయపంతులుగా.
అక్కడ చూసాను. పంతులుగారు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు, అడిగీ అడక్కముందే పిల్లలు చేతులు “నేను, నేనం”టూ చేతులెత్తేస్తారు. రెండువారాక్రితం, ఒకబ్బాయి అలా చేసినప్పుడు, “సరే చెప్పు” అని అడిగేరు ఆయన. ఆ అబ్బాయి వెంటనే లేచి నిలబడి, నాలుగు క్షణాలు ఆలోచించి, “నాకు నిజంగా తెలీదు” అన్నాడు.
అఫ్ కోర్స్, “మరి చెయ్యెందుకు ఎత్తేవు?” అని అడగలేదనుకోండి మాస్టారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఎవరైనా ఏదైనా అడిగితే తగు సమాధానాలు ఇవ్వడం ఎంత కష్టమో నాకు తెలీదంటూ నోరు మూసుక్కూర్చోడం కూడా అంతే కష్టం. అంతే కాదు. అడిగినమాట తప్పించేసి అర్థంలేని సమాధానాలు చెప్పడం కూడా ఈ అజ్నానంలో భాగమే. వెనక నేను ఓ కథలో (పరీక్ష) కూడా రాసేను ఈ చిలిపిచేష్ట గురించి.
అన్నట్టు ఈ అజ్నానం విషయంలో నాకు మరో గొప్ప సందేహం ఈ జ కింద న వత్తు మొదలు పెట్టింది ఎవరూ అన్నవిషయంలో.
బ్లాగుల్లో చాలా చోట్ల ఈ గుణింతాలే కనిపించడానికి కారణం వారు వాడుతున్న ఫాంటులని ఈమధ్యనే తెలిసింది. అంటే ఆ పాపం లేదా పుణ్యం కట్టుకున్నది ఫాంటు ఇంజినీర్లన్నమాట. మరి వారికి ఆ దారి చూపి పుణ్యం లేక పాపం కట్టుకున్న పండితులెవరా అని మరో అజ్నాన సందేహం. నేననుకోడం ఇంగ్లీషు బళ్ళో ఇంగ్లీషు స్పెల్లింగులకి అలవాటు పడ్డవారేమో అని. ఎంచేతంటే ఇంగ్లీషులో జ్ఞ కి జె తరవాత యన్ రాస్తారు. వాళ్ళకి “కింద” లేవు కదా. అంచేత అజ్ఞానం అన్న పదం ajnanam అని రాయబడుతుంది. దాన్ని మళ్ళీ తెలుగులో రాస్తే అ జ కింద న, అన్నమాట. ఉఫ్‌ప్.ఫ్ …
మరి ఇంగ్లీషులో జె కింద యన్ రాసిన పండితుడెవరు?
పాఠకులారా! (అనగా చదివేవారందరూ) ఈనాటికి ఇదే మీకు హోంవర్క్. తెలిసినా, తెలియకపోయినా, కొత్తవిషయం రాసినా మీ సమాధానం ఆమోదించబడును.
(మే 24, 2011)
రాజేష్, అవును మీరంటే గుర్తొస్తోంది. ముఖ్యంగా మా విశాపట్నంవోళ్లం గేపకం, గ్యాపకం, అని కూడా రాసేవాళ్ళం అప్పటికథల్లో. అలాగే గ్నాలం కూడానూ.
$మాలతి గారు
బహు సున్నితమైన తలంటు. మేము ఇంకొద్దిగా ముందుకెళ్ళి.. అయ్యా… ఏదో మా అగ్నానం.. మన్నించండి అని అంటాం
@ సౌమ్య, థాంక్స్. లింకు సరి చేసాను.
ఆ ఇంటర్వూ ప్రచురించేరు కూడాను. అందుకు వారికి ధన్యవాదాలు…. : The link over here is also taking us to Pareeksha story page, instead of your interview.