మార్పు 19

“మంచి ఘుమఘుమ వాసనలు … ఏం చేస్తున్నారేమిటి?”

“మజ్జిగపులుసు. తింటావా?”

“ఏంటో మీరు! ఇంతకాలంగా మీయింటిచుట్టూ తిరుగుతున్నా కదా “రా, భోంచేద్దువుగానీ“ అని ఒక్కసారయినా అన్లేదు.”

నేను తెల్లబోయి, మళ్ళీ తమాయించుకుని, “సరే, ఇప్పుడు అంటున్నాను కదా. ఒక్క పావుగంట ఆగు. అన్నం అయిపోతుంది.”

“ఇవాళ కాదులెండి. శనివారం వస్తాం.”

“వస్తాం అంటే? బంధుమిత్రసపరివారసమేతంగానా? ఎంతమందిని వేసుకొస్తావేమిటి?”

“లేదులెండి. వాళ్ళంతా ఎందుకు? ఒక్క మిత్రమే.”

“ఓ. … సరే. శనివారం రండి ఇద్దరూ. అతని ఇష్టాయిష్టాలూ, ఎలర్జీలు కూడా ఏమిటో ఇప్పుడే చెప్పు. తీరా కంచందగ్గర కూర్చున్నాక ఇది తినను, అది పనికిరాదు అంటే ఒప్పుకోను.”

“అతను … అంటారేమిటి. ఎవరో నేను చెప్పలేదు కదా” అంది అరవింద చిలిపిగా.

“సరే, అతనో ఆవిడో మూడో శాల్తీయో … ఎలర్జీలమాట చెప్పు.”

“కాకరకాయ చాలా యిష్టం,” అనేసి నవ్వుతూ పారిపోయింది అరవింద.

నేను అక్షరాలా విభ్రాంతితో ఆ అమ్మాయి వెళ్ళినవైపు చూస్తూ ఉండిపోయేను చాలా సేపు. మామూలుగా ఇది డేటింగ్‌లో రెండో భాగం. ఇద్దరూ ఇష్టపడ్డాం అనుకున్నతరవాత వారి వారి ఇళ్ళల్లో పెద్దలకి పరిచయం చేస్తారు ఒకరినొకరు. నాకు ఆశ్చర్యం అయింది. ఈ ఈక్వేషనులో నేనెక్కడ ఇముడుతాను అన్నది. అదీ నాకు ఆశ్చర్యం కలిగించినవిషయం.

000

శనివారం ఇద్దరూ చెరో కారులోనూ వచ్చేరు. వాళ్ళు వచ్చేసరికి నేను కాకరకాయలు తరుగుతున్నాను.

విషి వస్తూనే, “కాకరకాయలు. ఆహా. ఇటివ్వండి నేను తరుగుతాను,“ అంటూ నాచేతిలోంచి కత్తి పుచ్చుకున్నాడు.

“ఉండుండు. ఇలా మొదటిపరిచయంలోనే మేం ఇంటికొచ్చినవాళ్ళని వంటింట్లో పనికి పెట్టేయం,” అన్నాను కానీ అతను వినిపించుకోలేదు.

“చెయ్యనివ్వండి. అతనికి సరదాలెండి. పైగా బాగా చేస్తాడు కూడాను,” అంది అరవింద తేలిగ్గా.

నేను కత్తీ, కటింగ్ బోర్డూ అతనికొదిలేసి, వేరుశనగగింజలు వేయించడం మొదలు పెట్టేను.

“అవెందుకూ?“

“పుళిహోరలో బాగుంటాయని.“

అరవింద సింకులో ఉన్న గాజు గ్లాసులు రెండు కడగడం మొదలెట్టింది. “అవలా ఉండనియ్యిలే“ అంటున్నా వినిపించుకోకుండా.

వాళ్ళిద్దరి చొరవా, పనితనం చూస్తే నాకు ముచ్చటేసింది. “బాగుంది. ఇలా అని ఇంతవరకూ తెలీలేదు నాకు. ఇహమీదట మీరిద్దరూ రెండురోజులకోమారు మాయింటికి రావాలి తప్పకుండా.“

“తప్పకుండాను. నానెంబరిస్తాను. స్పీడ్ డయల్‌మీద పెట్టుకోండి. ..” అన్నాడు విషి.

మరుక్షణం ఠప్మని చెప్పుడయింది. అరవింద చేతిలో గాజుగ్లాసు చెయ్యి జారి సింకు అంచున కొట్టుకుని ముక్కలయింది. అరవింద వేలికి గాజుపెంకు గీసుకుని రక్తం చిమ్మింది.

అయ్యయ్యయ్యో… అంటూ విషి అరవింద చెయ్యి పుచ్చుకుని చన్నీళ్లతో కడిగి “క్లీన్ టవలుందాండీ?“ అన్నాడు.
నేను కూడా హడావుడిగా లేచి డ్రాయరులోంచి టవలు తీసి తడిపి ఇచ్చేను.

“అబ్భ, మరేం ప్రమాదం లేదు లెద్దూ.“

“హుష్. పట్టుకో గట్టిగా. … మీ ఫస్టెయిడ్ కిట్టెక్కడుందండీ?“

“అంత ప్రమాదం లేదని చెప్తున్నానా? రెండునిముషాలు ఇలా తడిగుడ్డ చుట్టి పట్టుకుంటే అదే . పోతుంది.“

“అంత రక్తం వస్తే ఏం లేదంటావేమిటి?“

“రక్తం అలా కనిపిస్తోంది కానీ నిజంగా తక్కువే.“

“అయ్యో, మాయింట్లో బాండెయిడయినా లేదు. కొందాం అనుకుంటూనే తాత్సారం చేసేను.“

“మీరిలా ఈ చెయ్యి పట్టుకోండి. నేనెళ్ళి బాండెయిడ్ తీసుకొస్తాను.“

“ఇప్పుడేం అఖ్ఖర్లేదంటున్నానా?”

“క్షణంలో వచ్చేస్తాను,” విషి అంటూ వెళ్లిపోయేడు అరవింద వద్దని చెప్పినమాట వినిపించుకోకుండా.

అతనలా బయటికి అడుగు పెట్టేడో లేదో అతనిసంచీలో సెల్లు సంగీతం అందుకుంది.

నేను అరవిందవేపు చూసాను, “సెల్ పట్టుకెళ్ళడం మరిచిపోయినట్టున్నాడు.“

అరవింద నవ్వింది, “అదొక స్ట్రేటజీలెండి.“

నాకు అయోమయం.

“వాళ్ళమ్మ అయివుంటుంది. అయివుంటుందేమిటి ఆవిడే. … బాబు ఎక్కడ తప్పిపోతాడో అని ఆవిడకి బెంగ. పూటకి మూడుసార్లు పిలిచి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటుంది. నాతో ఉన్నాడని తెలిస్తే అరగంటకోసారి వస్తాయి ఎలర్టులు మన టోర్నెడో వార్నింగుల్లాగే.“

విషి పెద్ద ఫస్టెయిడ్ పెట్టెతో తిరిగొచ్చేడు.

“అంత పెద్ద పెట్టె తెచ్చేవేమిటి? బాండెయిడ్ బాక్స్ తెస్తే సరిపోయేదానికి.“

“ఉండనియ్యండి. ఎప్పుడే అవసరం వస్తుందో చెప్పలేం కదా.“

అరవింద వేలు మరోసారి కడిగి, ఏదో మందు రాసి, కట్టు కట్టేడు. “ఇంత కట్టు మాఅమ్మ చూసిందంటే మూర్ఛ పోతుంది.“ అంది అరవింద.

ఆతరవాత తింటున్నంతసేపూ, విషి ఆరాటపడుతూనే ఉన్నాడు. “నేను కలిపి పెట్టనా?“ “మంచినీళ్ళు అందించనా?“ … అంటూ.

మళ్ళీ సంచీలో సెల్లు మోగింది. విషి తీసి చూసి మళ్ళీ సంచీలో పెట్టేశాడు.

“మీకు తెలుగు భోజనాలు ఇష్టమా?“ అన్నాను అన్నం తింటూ.

“తినదగ్గదేదైనా తినేస్తాడండీ.“

“అదేం కాదు. నేను ఏం తింటున్నానో చూసుకునే తింటాను.“

“అంటే?“

“నాకు అన్ని రుచులూ కావాలి. కానీ ఏం తింటాను అంటే రుచిగానే అయినా పోషకపదార్థాలు అవునా కాదా అని కూడా చూసుకుంటాను. భోజనం అంటే కంచంనిండా అన్నం పెద్ద కుప్ప పోసి కూరలూ, పప్పూ నామమాత్రంగా తినడం కాదు. కూరలు ఎక్కువగా తినాలి. మనకూరల్లో ఎన్నో బలమిచ్చేవి ఉన్నాయి కదా. సమతూకంలో తినడం – అదీ ముఖ్యం. కారాలు తింటాం. దానికి ఏంటీడోట్ పెరుగు కదా. అలాగే మెంతులు కూడా. దనియాలూ, జీలకర్రా, అల్లం ఇవన్నీ ఇక్కడ వాళ్ళు చెప్పే ఫైబర్ సప్లై చేస్తాయి. వంకాయ, బీరకాయ, బెండకాయ – ఇవన్నీ కూడా ఎంతో మంచివి. వాటిలో నీరు – ఇక్కడ విడిగా డబ్బాలో వెజిటబుల్ స్టాక్ అని అమ్ముతారు. ఎందుకు. చక్కగా తాజాగా ఆకూరలు తినొచ్చు కదా. మన కూరలు రక్తపోటు, గుండెదడలాటి జబ్బులు రాకుండా కాపాడతాయి. అయితే సరిగ్గా తినడం తెలియాలి. అంతే. తింటే అదేపనిగా కడుపులో చిచ్చు పెట్టేంత కారాలూ, లేకపోతే అన్నీ వేపుళ్ళూ.. అలా కాదు. బాలెన్స్ – అదీ ప్రధానమయిన నీతి సూక్ష్మం …  “

నేను తింటూ వింటున్నాను. ఇతనికి మనభోజనాలమీద ఆ మాత్రం ఆసక్తి ఉండడమే నాకు ఆశ్చర్యంగా ఉంది.

భోజనాలయేక, వాళ్లు తెచ్చిన ఆపిల్ స్ట్రూడెల్ ముక్కలు కోసి, “విప్ క్రీం ఉందా?“ అన్నాడు ఫ్రిజ్ తలుపుమీద చెయ్యేసి.

లేదన్నాను. “పోనీ, వెనిల్లా ఐస్‌క్రీంతో తిందాంలెండి.“

“అది కూడా లేదు,“ అన్నాను విచారపడిపోతూ. నాకు తోచనేలేదు ఇలాటివి అవుసరం అవుతాయని.

“ఏంటీ? ఐస్‌క్రీం కూడా లేదా? ఆశ్చర్యమ్! హుమ్. ఉండండి. క్షణంలో వచ్చేస్తా,“ అంటూ మళ్ళీ బయల్దేరేడు.

“ఐస్‌క్రీం లేకుండా తిందాం, మళ్ళీ ఏం వెళ్తారు, మీరిక్కడ ఉన్నంతసేపూ బజార్లు తిరగడంతోనే సరిపోతోంది,“ అన్నాను.

“ఫరవాలేదండీ, ఇట్టే వచ్చేస్తాగా,“ అంటూ వెళ్ళిపోయేడు విషి.

“అతనంతేలెండి,“ అంది అరవింద

“అంటే ఐస్క్రీం లేకుండా అతను స్ట్రూడెల్ తినడనా, ఈదేశంలో ఐస్‌క్రీం లేనివాళ్ళని ఇదే చూడ్డమా?“

“నిజం చెప్పమంటారా?.“

“చెప్తావనే కదా అడుగుతున్నాను.“

“నిజంగానే ఇంట్లో ఐస్‌క్రీం లేనివాళ్ళని అతను సహించలేడు. అదో లోకంలెండి.“

“పోన్లే. అయినా అదో లోపమా ఏమిటి. ఎవరివెర్రి వారికానందం.”

“ఆఁ.“

“మంచి అబ్బాయిలాగే ఉన్నాడు, నువ్వంటే చాలా ఇష్టం కూడా .. కనిపిస్తూనే ఉంది,” అన్నాను. మరెందుకు బ్రేకప్పయేవు అని అడగలేదు కానీ అరవిందకి అర్థమయినట్టే ఉంది.

“అందుకేనండీ ఈ సందిగ్ధావస్థ. ఒకరకంగా మంచివాడే. తిక్క రేగినప్పుడు మాత్రం భరించడం కష్టం.“

“ఎవరైనా అంతే కదా. ఆమాత్రం వేపకాయంత వెర్రి లేనివారు ఉండరని జనవాక్యం.”

“అవుననుకోండి. నాకింకా పదిహేడే కదా. ముందు ముందు ఏం చేస్తామో నాకూ తెలీదు, అతనికీ తెలీదు. ఏదో సరదాగా డేటింగ్ చేశాం. ఆమాత్రం దానికి వాళ్ళమ్మా, నాన్నా ప్రాణాలు తోడేస్తే ఎలా?”

“అవును. అసలు నువ్వెప్పుడూ వాళ్ళమ్మగురించి మాటాడలేదు. నీతో ఆవిడ సవ్యంగానే ఉంటారా?“

“అడక్కండి.. .. “ అరవింద వాక్యం పూర్తి చేసేలోపున విషి వచ్చేడు ఐస్‌క్రీం, విప్ క్రీం కూడా తీసుకుని.

“రెండూ తెచ్చేరేమిటి? నేను అవి వాడను. పోనీ మీరు పట్టుకెళ్లిపోండి వెళ్ళేటప్పుడు,” అన్నాను.

“ఉండనీండి. మేం కాకపోతే మాలాటివాళ్ళు మరొకరు రావచ్చు కదా.”

“ఇంక వచ్చేవాళ్ళెవరూ లేరు. మీరే రావాలి ఆ క్రీములు రెండూ అయిపోయేవరకూ.“

“సరే, మీరంతగా చెప్తుంటే ఏం చేస్తాం! అలాగే వచ్చేస్తూంటాం. వారానికొకమారు రమ్మంటారా? రెండుమార్లు రమ్మంటారా?…”

మరో అరగంట కూర్చుని ఇద్దరూ వెళ్తాం అంటూ లేచేరు.

వాళ్ళని గుమ్మంవరకూ సాగనంపి, రెండు కార్లూ కనుమరగయేవరకూ చూస్తూ నిలబడిపోయేను.

ఒకరిగురించి వేరేవాళ్ళు చెప్పినప్పుడు ఏర్పడే అభిప్రాయాలకీ ఆ మనిషే ఎదురుపడి కాస్సేపు కబుర్లు చెప్పుకున్నతరవాత ఏర్పడే అభిప్రాయాలకీ ఎంత తేడావో …

(మే 26, 2011)

5 Responses to మార్పు 19

  1. మాలతి అంటున్నారు:

    @ రాజేష్, మీవి అర్థంలేని వ్యాఖ్యలు కాదండి. నిజానికి ఇలాటివ్యాఖ్యలకోసమే ఇలా భాగాలుగా పెడుతున్నాను. దీన్ని నవలగా మళ్ళీ రాసినప్పుడు నాకు తెలీనివిషయాలు మీద్వారా తెలుసుకుని అందులో పెట్టాలని, ముఖ్యంగా ఆహారనియమాలూ, మానవీయ విలువలూ, మనసాంప్రదాయాలూ – ఇలాటివిషయాలాలో నాకు చాలా సందేహాలున్నాయి. అందుకే ఇది ఇంత నిదానంగా నడుస్తోంది. అంచేత నేను రాయని కోణాలు మీరు రాస్తే ఎంతో సంతోషించడమే కాక మీకు క్రెడిట్ కూడా ఇస్తాను నేను నవల రాసినప్పుడు. దీన్ని ఒకరకంగా సామూహికరచనగా చెయ్యాలనే నాకోరిక.
    తప్పకుండా మీకు తోచిన యితర అభిప్రాయాలు రాయండి.
    - మాలతి

  2. రాజేష్ జి అంటున్నారు:

    $మాలతి గారు

    మార్పు కధ భాగాల్లో కేవలం కధగా మాత్రమే కాకుండా ప్రతిభాగంలోనూ కావాల్సిన, రావాల్సిన ఏదో ఒక మార్పును కధాపాత్రదారుల ద్వారా తెలియజేస్తూ సాగుతున్న మీ శైలి చాలాచాలా బావుంది మాలతి గారు. ఇందుకు ధన్యవాదాలు.

    ఈ భాగంలో నేను ఏరుకున్న ఆణిముత్యాలు ఇక్కడ..

    #నాకు అన్ని రుచులూ..పోషకపదార్థాలు..భోజనం అంటే కంచంనిండా అన్నం పెద్ద కుప్ప పోసి కూరలూ, పప్పూ నామమాత్రంగా తినడం కాదు…మనకూరల్లో ఎన్నో బలమిచ్చేవి ఉన్నాయి..సమతూకంలో తినడం – అదీ ముఖ్యం. కారాలు తింటాం. దానికి ఏంటీడోట్ పెరుగు కదా. అలాగే మెంతులు కూడా. దనియాలూ, జీలకర్రా, అల్లం ఇవన్నీ ఇక్కడ వాళ్ళు చెప్పే ఫైబర్ సప్లై చేస్తాయి. వంకాయ, బీరకాయ, బెండకాయ – ఇవన్నీ కూడా ఎంతో మంచివి. వాటిలో నీరు – ఇక్కడ విడిగా డబ్బాలో వెజిటబుల్ స్టాక్ అని అమ్ముతారు. ఎందుకు. చక్కగా తాజాగా ఆకూరలు తినొచ్చు కదా. మన కూరలు రక్తపోటు, గుండెదడలాటి జబ్బులు రాకుండా కాపాడతాయి. అయితే సరిగ్గా తినడం తెలియాలి. అంతే. తింటే అదేపనిగా కడుపులో చిచ్చు పెట్టేంత కారాలూ, లేకపోతే అన్నీ వేపుళ్ళూ.. అలా కాదు. బాలెన్స్ – అదీ ప్రధానమయిన నీతి సూక్ష్మం … “

    చాలా బాగా వివరించారు. నేను ఆహారం తీసుకోవడంలో పెక్కుజాగ్రత్తలు తీసుకుంటాను. లండన్ వచ్చిన తర్వాత ఆ ఆహారశైలి కొద్దిగా దేబ్బతినిన్దనుకోండి..అదివేరే విషయం. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలపై మరికొంత వివరం కలిపి వ్యాఖ్యానిద్దామని హాడావుడి పడబోయి ఇది ఆహర బ్లాగు కాదని గురోచ్చి నాలిక్కరుచుకుని ఆపేసాను ;)

    #“అందుకేనండీ ఈ సందిగ్ధావస్థ. ఒకరకంగా మంచివాడే. తిక్క రేగినప్పుడు మాత్రం భరించడం కష్టం.“

    అమ్మాయిలూ అబ్బాయిల మీద సదా షరా మామూలుగా చేసే పీర్యాదు ఇది ;) . కొండొకచో అబ్బాయిలు కూడా చేస్తారానుకోండి :)

    #ఒకరిగురించి వేరేవాళ్ళు చెప్పినప్పుడు ఏర్పడే అభిప్రాయాలకీ ఆ మనిషే ఎదురుపడి కాస్సేపు కబుర్లు చెప్పుకున్నతరవాత ఏర్పడే అభిప్రాయాలకీ ఎంత తేడావో …

    ఖచ్చితంగా చాలావరకు తేడా కనిపిస్తుంది. కలిసి మాట్లాడినప్పుడు మాట తీరు, మన్నన ఇవతలివారికి తెలుస్తుంది. ఒక్కోసారి ఏవైనా బేధాప్రాయాలు ఉన్నా కలిసిమాట్లాడుకున్న తర్వాత సమసిపోయే అవకాశం కూడా ఉంది.

    ఒకరోజు అన్ని భాగాలు చదవి మార్పు కధపై అవగాహన తెచ్చుకుని కధపై కూడా సమయోచితంగా వ్యాఖ్యానించగలను. అంతవరకూ నన్ను అనగా నా అర్థం లేని వ్యాఖ్యలు ఏవైనా ఉంటే మీరు సహృదయంతో మన్నిచగలరు :)

  3. మాలతి అంటున్నారు:

    @ వినీల, నాక్కూడా ఈరకం ప్రేమలు అర్థం కావండీ. అందుకే కథలు రాస్తాను అలాటివారు ఇది చదివి వారికోణం చెప్తారేమోనని ఆశపడుతున్నాను. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @ లక్ష్మీరాఘవ, మీరు చదువుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండీ. మీరొకసారి అమెరికా వచ్చినప్పుడు నాకు మెయిలిచ్చారు కదా. గుర్తుంది. ధన్యావాదాలు.

  4. lakshmi raghava అంటున్నారు:

    మీరు చూసే కోణం, మీరు రాసే నడక నచ్చుతాయి నాకెప్పుడూ..మార్పు బాగుంది

  5. vineela అంటున్నారు:

    నమస్కారం అండి మాలతి గారు,

    మీ మార్పు కథ ఇప్పుడే చదువుతున్నాను..నాకు ఇలాంటి అమ్మాయి అబ్బాయి ఒకరు పరిచయం..అబ్బాయి ఏమో అతి జాగ్రత్త కాని ఆ అమ్మాయి కి ఆ అతి ప్రేమే నచేది కాదు…తరచు గొడవలు అవుతూ ఉండేవి. ఒక సారి ఆ అమ్మాయి ఏమి చెప్పిందంటే నాకు అతనంటే ఇష్టమే కానీ జీవితాంతం కలిసి ఉండలేను..ఆ మాట ఆ అబ్బాయికి చెప్తే తనని బతిమాలి తనతో ఉండడానికి ఒప్పించేవాడు..అసలు ఇలా పెళ్లి కాకుండా కలిసి వుండటం ఏమిటో..కలిసి ఉండలేము అని చెప్పిన అల ఫోర్సు చేసి ఉండేట్టు చెయ్యడం ఏంటో చూసి నాకు మతి పోయేది..న టైం బాగోక వాళ్ళతో రూం షేర్ చేసుకున్న కొన్నాళ్ళు. మీరు ఎలాంటి ముగింపు ఇస్తారో ఈ కథకి నేను ఎదురు చూస్తుంటాను. సెలవు.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.