(ఎన్నెమ్మకతలు 74)
లండన్‌లో వింబుల్డన్ ఆటలు మొదలయేయి మళ్లీ.
ఏటా వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తే. కిందటిసారి నా రిపోర్టు ఇచ్చేను. అప్పటికంటే ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ అర్థమవుతోంది. ఉదాహరణకి ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్ళు ఒకేరంగు చొక్కాలేసుకుంటే అంత అయోమయంగా లేదు. వారిని విడివిడిగా గుర్తుపట్టగలుగుతున్నాను. వ్యాఖ్యాతల రొద కూడా అంతగా బాధించడంలేదు. వాళ్ళభాష నేరుచుకోవాలన్న సరదా కూడా పుడుతోంది. ఈ లెక్కన నేను కూడా రన్నింగ్ వ్యాఖ్యానాలు చేసేసే ప్రమాదం ఉందని ఆ క్షణానికి అనిపించినా నిజంగా అలా జరగదని హామీ ఇస్తున్నాను.
మామూలుగా నాకు ఓడిపోతున్నవాళ్ళంటే పక్షపాతం. ఎందుకని అడక్కండి. మొన్న ఫ్రెంచి ఓపెన్లో ఫెదరర్, జకోవిచ్ ఫైనలు ఆడుతుంటే ఊపిరి బిగపట్టుక్కూర్చున్నాను. దానికి కారణం నాకు వాళ్ళిద్దరూ గెలవాలనుంది. ఇద్దరు ఎలా గెలుస్తారండీ అని అడక్కండి. నిజానికి జకోవిచ్ గెలవాలని కొంచెం ఎక్కువగా ఉండింది. ఎందుకంటే the old order giveth place to new order అని సుకవి వాక్కు కదా. పెదరర్ ఇప్పటికే చాలా కప్పులు కుప్పేసుకుని ఉన్నాడు. జకోవచ్ చిన్నవాడు, వృద్ధిలోకి రావలసినవాడు. పైగా చాలా చిన్న దేశంనించీ వచ్చినవాడు. ఆ బడుగుదేశం అతనిమీద చాలా ఆశలు పెట్టుకుని ఉంది. అంచేత మనం అతనికి మద్దతు ఇస్తే మొత్తం దేశానికే మద్దతు ఇచ్చినట్టన్నమాట. … ఆటల్లో ఇలా కాదండీ ఆలోచించవలసింది అని విజ్ఞులు అంటారు. అవును, నేను కూడా విన్నాను. ఏంచెయ్యను మరి. అన్నిబుర్రలకీ ఒక్కలాటి ఆలోచనే రావు కదా.
జకోవిచ్ ఓడిపోతాడని గుర్రాలమీద పందేలు కాసినట్టు పందెం కాయడం కూడా నాకు బాధాకరంగానే ఉంది. ఈమాట నేనంటే, గుర్రాలకేముంది గుప్పెడు దాణా, వీళ్ళకంటే డబ్బు కదా అంది మా సుధ.
ఇంతకీ వింబుల్డన్ మాట – నాకు అర్థం అయినవి -
పైన చెప్పినవాటి తరవాత,
1. ఏసు కొట్టడం స్ట్రేటజీయే అయినా అవి కొంతవరకూ పొదుపుగానే వాడుకుంటారు. అంటే ఆపత్సమయం అంటే మాచ్ పాయింటు టైం – లో కూడా ప్రతిసారీ ఏసు కొట్టరు. ఆట సాగదీసి తమప్రతిభ ఋజువు చేసుకుంటారు.
2. రిఫెరీలతో తగువులేసుకోడం ఓడిపోతున్నసమయాల్లో ఎక్కువ.
3. ఇంతవరకూ నేను చూసినవాటిల్లో ఎర్లీ రౌండుల్లో చాలా ఉత్కంఠతో నడిచినవి వింబుల్డన్లో కనిపించేయి.
4. ఇంతవరకూ నేను వినని పేర్లుగల ఆటగాళ్ళూ ఆటకత్తెలూ వచ్చి ఆటని ఉత్కంఠభరితం చేస్తున్నారు. సరీనా విలియమ్స్ గెలిచినా ఆమెచేత కళ్ళనీళ్ళు పెట్టించగల ప్లేయరు వచ్చిందంటే ఆ ఆట ఊహించుకోవాలి. లేదా టెన్నిస్ భాష బాగా తెలిసిఉఁడాలి వర్ణించడానికి.
పోతే నాకిప్పటికీ అర్థం కానివి -
- బంతి తాడెత్తు గాల్లోకి లేచినప్పుడు న్యూటన్ సిద్ధాంతంప్రకారం ఆ బంతి భూమ్యాకర్షణ శక్తికి లోబడి, కిందకి వచ్చి తీరుతుంది కదా. అలాటప్పుడు ఆటగాళ్ళు అడుగెత్తు గాల్లోకి ఎగిరి దాన్ని అందుకోడానికి ప్రయత్నించడం ఎందుకు?
- నాకు ఈ సందేహం రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఆ బంతిని చూసి చూసి, ఆ తరవాత గాల్లోకి ఎగిరి ఆ బంతిని అందుకుని నెట్‌కో అవుటో కొట్టడం. అయ్యో, ఆమాత్రం చూసుకోనక్కర్లేదూ అనిపిస్తుంది నాకు అలాటప్పుడు.
2. అలాగే ఒక ఆటగాడు నెట్ దగ్గర ఉన్నప్పుడు, రెండో ఆటగాడు ఆ బంతిని ఆ చివర బేస్లైనుదగ్గర పడేలా కొట్టినప్పుడు మొదటి ఆటగాడు ఉన్నచోటే ఉండి ఆ బంతిని కళ్ళతో మాత్రమే ఫాలో అవడం. అందరూ కాదులెండి. నదాల్లాటి కొందరు ఎజైల్ ఆటగాళ్లు ఒక్కక్షణం కూడా అలా వృథా చెయ్యరు కానీ కొందరు వన్నూటూ సీడులు కూడా అలా చూస్తూ నిల్చోడం చూశాను. బహుశా ఆ బంతి తప్పనిసరిగా బేస్లైన్ దాటి పడుతుందని అభిప్రాయపడతారేమో. కానీ అది మిస్-కాలిక్యులేటు అవడం కూడా జరుగుతోంది. అప్పుడు నాకు హుమ్ ఏమిటీ అలా చోద్యం చూస్తూ నిల్చోడం, మాకు అంటే ప్రేక్షకులకి చెల్లుతుంది అలా చూడ్డం, మిస్-కాలిక్యూలేటు చెయ్యడం కానీ రంగంలో వీరులకి చెల్లునా అని ఆశ్చర్యపోతూంటాను.
3. అలాగే నెట్‌కి వేసి కొట్టినప్పుడు కూడా.
4. లైను అంపైర్లు ఫాల్ట్, అవుట్ అని అరవడం తెలుస్తోంది కానీ రైట్ అయినప్పుడు ఏమని అరుస్తున్నారో తెలీడంలేదు.
5. అలాగే, సర్విస్ టైంలో మూడు బంతులు తీసుకుని అందులో ఒకటి నేలమీదకి వదిలేస్తారు. ఏది వదిలేయడమో ఎలా తెలుస్తుంది?
ఇవన్నీ ఆలోచిస్తుంటే, నేను కూడా రాకెట్టు పుచ్చుకు రంగంలోకి దిగి ఆడితే కానీ తెలీదు అనిపిస్తోంది. బహుశా చేస్తానేమో కూడా. హీ. హీ.
ఇప్పటికింతే. అవతల వీనస్ విలియమ్స్‌ని దతె-క్రమ్ తిప్పలు పెట్టేస్తోంది … చెప్పేను కదా సీడ్ నెంబరున్నవారూ, నెంబరు లేనివారూ ..
(జూన్ 22, 2011)
.
@ సౌమ్య, ఇంతకీ నా సందేహాలు తీర్చలేదు. ముఖ్యంగా # 2, 4.
)
పిడకలవేట: “మొన్న ఫ్రెంచి ఓపెన్లో ఫెదరర్, జకోవిచ్ ఫైనలు ఆడుతుంటే …” -అది సెమీస్.
“ఆపత్సమయం అంటే మాచ్ పాయింటు టైం – లో కూడా ప్రతిసారీ ఏసు కొట్టరు. ఆట సాగదీసి తమప్రతిభ ఋజువు చేసుకుంటారు.”
))))))
” 1. బంతి తాడెత్తు గాల్లోకి లేచినప్పుడు న్యూటన్ సిద్ధాంతంప్రకారం ఆ బంతి భూమ్యాకర్షణ శక్తికి లోబడి, కిందకి వచ్చి తీరుతుంది కదా. అలాటప్పుడు ఆటగాళ్ళు అడుగెత్తు గాల్లోకి ఎగిరి దాన్ని అందుకోడానికి ప్రయత్నించడం ఎందుకు?”
-