లలితగారి కథ మీ అభిప్రాయాలకోసం

నా శ్రవ్యటపాలకి స్పందించి, నా కోరిక మన్నించి తన కథ పంపిన లలితకి కృతజ్ఞతలు.

ఈకథమీద మీ అభిప్రాయాలూ, సూచనలూ తెలియజేయవలసిందిగా అర్థిస్తున్నాను – మాలతి.

————————————————–

‘ రహస్య ‘ నివేదిక  !

రచన: లలిత దాట్ల.

కాపీరైటు: రచయిత్రి.

*****************

పెద్దల  పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడ్డ  ఏంకాంతంలో వాళ్ళిద్దరూ……. అలసి సొలసి ……, అనుభూతిస్తూ ఆమె, అలసటగా అతను …..

“  నీకేవిష్టం ?” అనాసక్తిగా అడిగాడతను

” వానంటే ఇష్టం , ఊ..ఇంకా కొండలు లోయలు, అడవులు సముద్రం …..ఆశక్తిగా చెపుతుందామె….

“ఛా …అదికాదు”  విసుక్కునాడతను . తినేవి తాగేవీ….?

“ఆలోచించిందామె …..నాకు తీపిష్టం , పులుపూ ఇష్టమే ….వగరూ చేదూ కూడా నచ్చుతుంది …..”

” నాకు మాత్రం కారం ఒకటే ఇష్టం . తీపంటే వెగటు ….అయినా చేదును కూడా ఇష్టపడతారా ఎవరైనా పిచ్చిదాన్లా వున్నావే ….”

కాసేపు మౌనం తర్వాత ……”  నీకేం కావాలన్నా సంకోచించకుండా అడుగు . ఇకనుంచీ నీ బాధ్యతంతా నాదే  భరించువాడు భర్త అన్నారుకదా ! చెప్పు నీకేం కావాలి అజ్ఞాపిస్తున్నట్టుగా  అన్నాడతను.

ఆరాధనగా చూసిందామె  ..  ……. “ మీ ప్రేమ ఆదరణ …..

చిద్విలాసంగా చూశాడతను . “నీనుంచీ నేనేం కొరుకుంటున్నానో తెలుసా ……..నా  ఇల్లాలిగా నువ్వు నా ఇంటిని స్వర్గసీమ చెయ్యాలి.  నా వాళ్ళందరినీ నీ సేవలతోనూ ఆప్యాయత తోనూ మురిపించాలి. నా కొచ్చే ఆదాయానికి తగ్గట్టూ నువ్వు పొదుపు నేర్చుకోవాలి. నా పిల్లలికి మంచి బుద్దులు నేర్పి వాళ్ళని నా వంశోద్ధారకులుగా గర్వపడేలా తీర్చిదిద్దాలి ……. కుటుంబ పరువు మర్యాదలకు భంగం   కలగకుండా చూసుకోవాలి . మంచి ఇల్లాలిగా ఇంటా బయటా  పేరు తెచ్చుకోవాలి ….. అంతేకాదు…..

“ ఆ……”ఆవులించిందామె…

” నిన్నే ….ఏంటి నిద్రా …కుదిపి లేపాడటను . ఇంకా చాలా మాట్లాడుకోవాలి ఈ రాత్రి   మనం ఒకరినొకరం  పూర్తిగా అర్ధం చేసుకోవాలి   …..

” నీకెవరిష్టం ….. మగపిల్లాడేగా  ”చిలిపితనం చిలకరించాడటను .

సిగ్గుతో తడిసి ముద్దయిందామె .“ఆడపిల్ల అయితే బావుంటుంది   ” అంది మురిపెంగా  . ఎంచక్కా పరికిణీలు వెయ్యొచ్చు .జడగంటలు మువ్వలపట్టీలు పెట్టొచ్చు….. నాట్యం నేర్పించొచ్చు బాగా చదివించి   డాక్టర్ ని  చెయ్యొచ్చు  ఊహల్లో వూరేగుతుందామె

“ఇంకా నయం …!  అమ్మాయికి  గోపాలరావు పేరెలా పెడతాం . ముందు మనకి అబ్బాయి పుట్టాలి వాడికి మా తాత పేరు పెట్టాలి . వాడివల్ల మనవంశం వృద్దిపొందాలి ……ఆ తరవాత  అమ్మాయో అబ్బాయో …ఎవరైనా పర్లేదు దృఢంగా చెప్పాడటను . నిరాశగా చూసిందామె .

కొన్ని క్షణాలు నిశ్శబ్ధం తర్వాత …”ఇందాకా చెప్పానోలేదో  ….. చేపల పులుసంటే చెవికోసుకుంటాను నేను . బాగా మసాలా దట్టించి ఎక్కువసేపు మరగపెట్టీ…..మా అమ్మ చేస్తుందీ భలేవుంటుందిలే . మా సుగుణక్క  మాంసం బాగా వండుతుంది బావకి నచ్చేలా వండటం నేర్చుకుంది. పెళ్ళికాకముందు అసలు వంటింటి చాయలకే వచ్చేదికాదు అని అమ్మ తిట్టేదిలే. మా గోపీగాడున్నాడుకదా అదే, పెళ్ళిలో వెదురుబద్దలా ఉన్నారు వదినగారు అని నిన్ను ఆటపట్టించాడే వాడే… ,ఆ గోపీగాడు ఒకసారి వేటకెళ్ళి అడవిపందిని కొట్టుకొచ్చాడు . నిజంగా వాడే వేటాడి తెచ్చడేమో అని మేం అంతా ఆశ్చర్యపోయాం . ఆహా ఒహ  అని వాడిని ,వాడు కొట్టుకొచ్చిన పందిని ఊరంతా ఊరేగించి ఓరలు వాటాలేసి వండుకుతిన్నాం .అంతా అయ్యాకా అందరం అరుగులమీద దొర్లుతూ  ఒరేయ్ గోపీ ఎలా కొట్టావో చెప్పరా అని ఆసక్తిగా అడిగాం . వాడి వీరోచిత గాధ వినాలని అంతా చెవులు రిక్కించుకున్నాం . వాడు  పళ్ళికిలిస్తూ  చెప్పాడు గదా………  ఓరి వెర్రి నాగన్నల్లారా కొట్టుకొచ్చాను అంటే అర్ధం కాలా…ఎవరో వేటాడి పొదల్లో దాచిన   దాన్ని  నేను దొంగతనంగా ఎత్తుకొచ్చాను అని చెప్పేసి  చక్కా పోయాడు .హ..హ..హ..   ఆ తర్వాత వాడి వీపు విమానం మోత మోగించేశాం అనుకో ……..అవునూ నీకు వంటొచ్చుకదా ! ఆరాగా అడిగాడు  ఆయాసం తీర్చుకుంటూ …..

“భలే.. వెన్నెలలో……  తిరగడమంటే………. నాకూ……. భలే ఇష్టం . మత్తుగా చెప్పిందామె ఒక్కో మాట వెతుక్కుంటూ…..”

తనచేతిలో ఉన్న ఆమె చేతిని విదిలించాడటను. “ఓయ్..మొద్దూ …ఏంటానిద్ర . నిద్ర మొహం ఎరగని దాన్లా  .  వంటొచ్చా అని అడుగుతున్నాను . వెర్రిదాన్లా ఆ పలవరింతలేవిటీ , వెన్నెలా వల్లకాడూ అంటూ…..”విసుక్కున్నాడతను  .

తడబడి లేచికూర్చుందామె …..ఏంటండీ , ఏవన్నారూ ……ఊరికే అలా కునుకుపట్టేసింది ..సంజాయిషీగా అంది .

తన విసుగును చిరాకును అదుపు చేసుకుటున్నట్టు గట్టి నిట్టూర్పు విడిచి , ఆమెవైపు తిరిగి” నీకు వంటొచ్చా అని అడిగాను , నాకు చేపల పులుసంటే ఇష్టమని చెప్పాను …… “అన్నాడు నిదానంగా

” ఓ అదా  ….అదీ నాకు రాదండీ,  చాలా మామూలుగా అంది.

“మరేం వచ్చు ……..ముగ్గులెయ్యటం , అడాళ్ళంతా చేస్తుంటారే …..గుమ్మాలకి లేసులల్లటం వంటివి అవొచ్చా ….వెటకారంగా అన్నాడతను

ఉహు…అవి నాకు నచ్చవు . నాకు బొమ్మలెయ్యటం వచ్చు  , పాడటం ఇష్టం ……గొంతెత్తి పాడటం నాకెంతో బావుంటుంది   .  ఇంకా చదవటం రాయటం…. ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతుంది.

నిరసనగా  చూసాడు .  ” హు….. మా నాన్నని అనాలసలు  , కట్నానికి ఆశపడి నన్ను ముంచేశాడు….. అహంకారాన్ని కుమ్మరిస్తూ  , అసహనంగా అటు తిరిగి పడుకున్నాడతను

అమ్మ చెప్పింది నిజమేనేమో…..వంట చెయ్యటం ఒక్కటీ వస్తే సరిపోయేది . మిగతావన్నీ ఎన్నొచ్చీ ఎందుకు దండగ …..

ఎంత కష్టవయినా సరే తొందరగా  చేపలపులుసు చెయ్యటం నేర్చేసుకోవాలి …. అనుకుంటూ , అపరాధ భావనని నిండా కప్పుకుని  ఆవేదనగా  ఇటు తిరిగి పడుకుందామె.

**************

సరిగ్గా పాతికేళ్ళ పది నెలల తర్వాత  …..

పెద్దల ప్రమేయం పెద్దగా లేకుండానే , తమంత తాముగా ఏర్పాట్లు చేసుకున్న ఏకాంతం లో ……అతడు ఆమె….

“  మనం రెండేళ్ళనుంచీ లవ్ లో వున్నాం అయినా…. నువ్వు నన్ను పూర్తిగా అర్ధం చేసుకోలేదేమో అనిపిస్తుంది “అన్నాడతను .

సందేహంగా  చూసిందామె

“నాకు  రెడ్ కలర్ ఇష్టమని తెలిసీ …  వైట్ సేరీ  కట్టుకున్నావ్ ….”ఉడుక్కుంటూ చెప్పాడు

“అహ…అలాకాదు , ఇప్పుడు తెలుపైతే బావుంటుందనీ …..”మెల్లగా అంది

“వస్తుంటే అమ్మేం చెప్పిందో తెలుసా …..” ముంగురులు సవరిస్తూ అగాడు  .

ఏంటన్నట్టు చూసిందామె

“మందులు మాకులూ జోలికి పోకుండా  ఒక మనవణ్ణి కని నా ఒళ్ళో పడెయ్యండి . ఆ తర్వాత ఏం చేసుకున్నా  మీ ఇష్టం అంది “ . మురిసిపోతూ చెప్పాడతను

“అహ…అది కాదు మరీ….” ఏదో చెప్పబోయిందామె …..

“పెద్దలని గౌరవించడం మన ధర్మం. మా ఇంట్లో అమ్మ ఎలా చెపితే అలా….నువ్వుకూడా మా సాంప్రదాయాల్ని, కుటుంబ పద్ధతుల్ని అలవాటు చేసుకోవాలి . అందరినీ ఆప్యాయంగా ఆదరించాలి . ఇంట్లోనూ బయటా అన్నివిధాలా నాకు సపోర్ట్ గా వుండాలి    . నా మనసుకు నచ్చినట్టూ నిన్ను నువ్వు మార్చుకోవాలి.  ఇంకా …….”

‘ ఆ….  ” ఆవులించిందామె

“ఏంటీ అపుడే నిద్రా ……ఒకరినొకరం పూర్తిగా అర్ధం చేసుకోటానికి ఇదే మంచి సమయం . లేలే….”

“ఇంకేంవుందీ అర్ధం చేసుకోటానికి ….”బద్ధకంగా అందామె

“నీకు  జాబ్  చెయ్యటం ఇష్టం లేదని చెప్పావట ….అమ్మతో …”

“అవును……నువ్వు బాగానే సంపాదిస్తున్నావ్ గా ..నేను ఇంట్లోనే వుంటూ నా మనసుకు నచ్చిన పనేదయినా …..”

“అదికాదురా….  ఇంట్లో కూర్చొని ఏం చేస్తావ్ ……వంట చెయ్యటం కూడా ఓ పనేనా …. కావాలంటే వంటమనిషిని పెట్టుకోవచ్చు  అర్ధం చేసుకో ..డబ్బెవరికి చేదు … ఎందుకు మంచి సేలరీ వదులుకోవటం …..ఇద్దరి జీతాలు కలిస్తే త్వరగా సెటిల్ అవ్వొచ్చు….. బరువంతా ఒక్కడ్నే మొయ్యాలంటే ఎలా….” నా మాటవిను…. మృదువుగా  అన్నాడతను

“  మ్యూజిక్  నేర్చుకోవాలని ఎప్పటినుంచో ఆశ ….చదువుతో కుదర్లేదు సగంలో ఆగిపోయింది  . అందుకే ఇప్పుడు……”సందేహిస్తూ ఆగింది

“నాన్సెన్స్…….పాటలు, ఆటలు , వంటా ,వార్పూ …..ఎందుకవన్నీ …… జాబ్  వుంటే సొసైటీ లో స్టేటస్ పెరుగుతుంది అర్ధం చేసుకోవేం  అసహనంగా అన్నాడు .

మౌనంగా వుండిపోయిందామె ……

నా ఫ్రెండ్స్ అంతా  ఒక రేంజ్ లో   వున్నారు . ఇంటి బాధ్యతంతా నామీద వుండటంతో నేనే వెనకబడిపోయాను . ఇద్దరం జాబ్స్ చేస్తే త్వరలోనే మనం ఒక పొసిజషన్ కి చేరుకుంటాం ……అసలు నీ క్వాలిఫికేషన్ చూసే….ఏదో గుర్తొచ్చినట్టూ హటాత్తుగా  ఆగిపోయాడు .

” ఏవిటీ  …..” సందేహంగా చూసిందామె

“అహ ఏం లేదు ……..అవునూ……అదీ……” మాట దాటేసే ప్రయత్నంలో మాటలు  వెతుక్కుంటూ ఆమెకి దగ్గరయ్యాడు .

అనుమానంతో అన్యమనస్కంగా  ఆమె…. ఆలోచనలను సాగదీస్తూ అతి చాక చక్యంగా అతను   …….   ఆత్మలను విడదీసి శరీరాల్ని కలుపుతూ  మరో తరానికి ఊపిరిపోసే  పనిలో పడ్డారు .

అలా తరాలు మారుతునే ఉన్నాయ్ , మారాల్సినవి ఎప్పటికీ మారకుండా అలానే ఉంటున్నాయ్

నాలుగు గోడలమధ్య  మనసులు నలుగుతూనేవున్నాయ్ , నలుగురి మధ్యకూ వచ్చి ఆదర్శదంపతులుగా కొనియాడబడుతున్నాయ్

22 Responses to లలితగారి కథ మీ అభిప్రాయాలకోసం

  1. మాలతి అంటున్నారు:

    @ lakshmi raghava గారూ, మీకథ నాకు విడిగా ఈమెయిల్ చె్యండి. malathini@gmail.com.

  2. lakshmi raghava అంటున్నారు:

    లలితా గారూ,
    మీ కథ చదివాకా నాకు అనిపించినా విషయాలు
    ౧. కథ ఏకపక్షం అని అందరు అనుకుంటారు..కానీ ఇదీ జరుగుతున్నా కథ, ముఖ్యంగా భారతదేశంలో. మరో పక్షం కోణం లో సంగతులు జరుగుతున్నాయి కాని అవి విడాకులకు దారి తీస్తున్నాయి…అంటే ఆడవారికి అభిప్రాయాలు వుంటే ,అవి చేతలలో చూపితే అక్కడ పరిస్థితి వేరు అవుతుంది ..
    ౨. కథ సంభాషణలతో నడవటం బాగుంది..కథ అంటే ఇలాగ కూడా వుండచ్చు అని తెలియచేసారు .
    ౩. నాకెప్పుడూ కథ ఈసైలిలో వుండాలి , ఈవిధంగానే వుండాలి అని రాయడం కన్న కథాంశం బట్టి శైలి మారాలి అని ఇష్టం.
    ౪. మాకు దినంలో చాలావరకు కరెంట్ వుండదు కనుక మాలతి గారి తెలుగు తూలిక పూర్తిగా ఫాలో అవటం కష్టంగా వుంది. వారు ఇస్తున్న ప్రోచ్చాహానికి ,
    రాసిన మీకు అభినందనలు.
    ౫. కథలు దీనికి పంపాలంటే ఎలా ? చేబుతారుగా ..

  3. lalitha అంటున్నారు:

    @quickexpress గారు : ఇంతకు ముందు నేను కథలు రాశానండి కానీ అదంతా గుడ్డివిద్య అని నా అభిప్రాయం . నేర్చుకోవాలనే తపనతో మాలతిగారి వెంటపడి వేధించి ఇంతవరకూ వచ్చాను . మీ అభిప్రాయం తెలియచేశారు ధన్యవాదాలు
    కథ ఏకపక్షంగా వుందనీ చదువుతుంటే నిరాశని కలిగించిందనీ చెప్పారు.
    అదే ఏకపక్ష ధోరణి ని , ఒక జీవితకాలం భరించాల్సి వస్తే అదెంత కష్టమో
    ఊహించండి .
    <> తరాల ప్రస్థావన ఉందికాబట్టి మొదటి తరానికి వారసుడు అని అర్ధ వస్తుందనుకున్నాను . అది పాఠకులకి అర్ధం కాలేదంటే నేను ఇక్కడ తప్పినట్టే అని ఒప్పుకుంటాను .

    కథలో రెండొ సన్నివేశం లో అటుదిటుచేసి చెప్పొచ్చు కానీ అలా చేస్తే అది వేరే కథాంశం అవుతుంది . నే చెప్పాలనుకున్న విషయమే మారిపోతుంది. ఇక ఏ కథ అందరికీ వర్తించేలా వుండదు కదండీ .

    ఆలోచించండి .

  4. lalitha అంటున్నారు:

    sunamu గారు .మీ వ్యాఖ్య నాకు చాలా బలాన్నిచ్చింది . మీరు చెప్పింది కథలు రాసేవారికి, విమర్శకులకూ ఇద్దరికీ ఉపయోగకరంగావుంది ధన్యవాదాలు

    @ లలిత (తెలుగు4కిడ్స్) : చిన్న కథకు మాటలు పొదుపుగా వాడాలన్నది మాలతిగారి పాఠం . అందువల్లే వాదనలు ప్రతివాదనలతో పాఠకులకి విసుగు తెప్పించకుండా వీలయినంత పొదుపుగా కథకి అర్ధాన్ని చేకూర్చే ప్రయత్నం చేశాను . మీ స్పందనకి ధన్యవాదాలు

    చేశాను

  5. lalitha అంటున్నారు:

    @ psmlakshmi గారు : మీ సూచన కి ధన్యవాదాలు. నిర్మొహమాటంగా చెప్పినప్పుడేకదండీ నిజం తెలిసేది :) )

    @ rukminidevi గారు :ధన్యవాదాలండీ

    @ tgnanaprasuna గారు: మీ ప్రోత్సాహం ఒక మంచి కథ రాయాలనే నా ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. సదా మీ ఆశీస్సులు కోరుతూ

  6. lalitha అంటున్నారు:

    @ mansi గారు : నూటికి నూరుపాళ్ళు నా భావాన్ని అర్ధం చేసుకున్నారు . నాకు చాలా సంతోషంగా వుంది .
    అవునండీ, అంతా పై పై మార్పే . తనకి అనుకూలంగా భార్య ని మర్చుకోవాలి అనే మగాళ్ళ ఉద్దేశంలో ఏ మార్పూలేదు . ఆమెని ఆమెగా ఉండనివ్వాలి అనే ఆలోచన ఇంకెన్ని తరాలకి వస్తుందో .

    @ G.S.Lakshmi గారు : మీ అభిప్రాయం తెలియచేశారు ధన్యవాదాలు . మీరు సరిగ్గా చెప్పారు ‘ భావస్వాతంత్రం ‘ అది చాలా అవసరం అండీ . దానికి పరిమితులు విధించి వేరే ఏ స్వాతంత్రం ఉన్నా అది ప్రయోజనం లేనిదే వుతుంది .

    @ కొత్త పాళీ గారు : మీ పోలిక అక్షరాలా నిజం. కథని మాలతిగారికి పంపినప్పటినుండీ ఎంత టెన్షన్ పడ్డానో . కూతురిలో తప్పులకీ, లోపాలకీ తల్లిదేకదండీ బాధ్యత . ఈ కథని ఇలా మీముందు పెట్టడం లో ఉద్దేశం నేనెంత నేర్చుకున్నాను, అని తెలుసుకోటానికేనండీ. మీ సూచనలు తప్పక పాటిస్తాను .ధన్యవాదాలు

    G.S.Lakshmi

  7. lalitha అంటున్నారు:

    ఈ కథ చదివి తమ అభిప్రాయాలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు

    @మురళి గారు : ఆ సంఖ్య స్వల్పమే అయినా అటువంటి కథలు కూడా చాలానే వచ్చాయండీ . మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు

    @malapkumar గారు : మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఈ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో వినలేదు అన్నారు . భలేవారండీ , ఈ కాలంలో మొదట తేల్చుకునేది ఈ విషయమే . ఎందుకంటే మూడొంతులమంది అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు . కాబట్టి పెళ్ళికి ముందో తరువాతో ఎప్పుడో అప్పుడు ఈ సమస్య వారిద్దరిమధ్య వచ్చితీరుతుంది. కాకపోతే అచ్చం ఇలాగే అని చెప్పను .

    @వసంతం గారు : ధన్యవాదాలు . ఒకప్పుడు భర్తలు అధికారం చెలాయిస్తే, ఈ కాలంలో అది కుదిరేది కాదుకాబట్టి లౌక్యం ప్రదర్శిస్తున్నారు .

    వసంతం గారు : ధన్యవాదాలు . ఒకప్పుడు భర్తలు అధికారం చెలాయిస్తే, ఈ కాలంలో అది కుదిరేది కాదుకాబట్టి లౌక్యం ప్రదర్శిస్తున్నారు .

  8. b.murali అంటున్నారు:

    లలిత గారి కథ చదివాను. సహజంగా ఉంది. ఏకపక్షం అని కొందరు అన్నారు. ఐతే వారి అభిప్రాయాన్ని కూడా తీసివేయలేము. కానీ సమాజంలో ఈ కథలో ఉన్న పాత్రలే ఎక్కువ. మహా నగరాల్లో కొంతమంది భర్తకు నరకాన్ని చూపే వారు లేరని చెప్పలేము. కానీ వారి సంఖ్య స్వల్పం . ( చాలా స్వల్ప సంఖ్య ) .

  9. malapkumar అంటున్నారు:

    కథ రాసిన విధానం బాగుంది . శైలి బాగుంది . ఐనా లలిత గారి శైలికి వంక పెట్టగలమా ?
    కాకపోతే టాపిక్ పైన ఇద్దరుముగ్గురు అన్నట్లు ఏక పక్షం గా వుంది . ఐనా , నేను చూసిన అమ్మాయిలు మరీ అలా నీ పాదదాసిని అన్నట్లుగా లేరు . అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిల నుంచి అంతగా ఎక్స్పెక్ట్ చేయటము లేదు . ఈ ప్రాబ్లం ఈ మధ్య కాలం లో నేను వినలేదు . ఇప్పుడు అమ్మాయిలు/అబ్బాయిలు ఫేస్ చేస్తున్న ఏదైనా ప్రాబ్లం తీసుకొని రాస్తే సహజం గా వుంటుంది అని అనిపిస్తోంది .

  10. vasantalakshmi.P అంటున్నారు:

    ఇది జరుగు తున్న నిజం..మనకి తెలియకుండానే, మనకి చిన్నపట్నించి చూస్తున్న మన అమ్మ నాన్నా,లు, పక్కింటి, పొరుగింటి వారిని చూసి, మైండ్ పొరల్లో ఇంకి పోతుంది. భర్త అనుమతి తీసుకోవాలి, అతని కి ఇష్ట మయిన వన్నీమన ఇష్టాలు, ఎంతో ఆదర్శం తో మొదలు పెట్టిన సంసారాలు కూడా, చివరికి ఒక మూస లోకే జేరుతాయి. అదే సంఘం ..అనే పెద్ద శక్తి. దానిని అధిగమించి బ్రతకడానికి చాల కమిట్మెంట్ కావాలి రెండు వేపుల నుంచి. కథ .కథనం..ఒక వ్యక్తీకరణ. దానికి రూల్స్ లేవు అని నా అభిప్రాయం. చక్కగా ఉంది మీ కథ.

    వసంతం.

  11. mansi అంటున్నారు:

    కత ఏకపక్షంగ ఉంది ఇరుపక్షాలను సమర్దించలేదు అంటే.. .అసలు కత ఉద్దేశ్యం వేరు అనిపిస్తుంది నాకు . .ఇక్కడ ఆడ మగ అన్న విషయనికన్న మనిషికి ప్రాధాన్యత ఉంది . . రచయిత ఒక ఉదాహరణా ద్వార చూపించడానికి ప్రయత్నించారు. . చక్కటి భావుకత కల ఒక అమ్మాయి ఒక మామూలు అబ్బాయి( సగటు మగాడు)
    . . వాళ్ళిద్దరూ భార్య భార్తలైతే వారి మధ్య సంభాషణ . .వారి మనస్తత్వాలు .
    25 years తరువాత కూడా అదే అభిరుచులు కలిగిన ఇద్దరు మనుషుల మనస్తత్వం లో ఏమైనా మార్పు వచ్చిందా ? అన్నది చుపించాలన్నది రచయిత ప్రయత్నంగ కనిపించింది . .
    కత లోని సంభాషణలను సూక్ష్మంగా పరిశీలిస్తే మనుషులలో మార్పు ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది . .అన్ని పై పై మాటలలో మార్పులు తప్ప బేసిక్ మెంటాలిటీ లో మార్పు లేదు . .భావ వ్యక్తీకరణ మారింది కానీ భావం మారలేదు . భార్య భర్తలు పరస్పరం అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకుని నడుచుకునే పరిపక్వత ,సంస్కారం ఇంకా రాలేదు.సంకుచిత మనస్తత్వమే డామినేట్ చేస్తోంది . ..భార్య కావచ్చు భర్త కావచు. . సున్నిత మనస్కులు కాస్త రాజీ పడుతున్నారు . .సయోధ్య కుదరక ఇద్దరి మనసులు నలిగిపోతున్నాయి నాలుగు గోడల మధ్య . . బయటకోచినపుడు నలుగురి మధ్య ఓ ప్లాస్టిక్ నవ్వును పెదవులకు తగిలించుకుని . .ఏరా అంటే రారా అనుకుంటూ . .అబ్బ భార్యభార్తలంటే వీళ్ళిద్దరే అన్నట్లు ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయత్నించడం ఆదర్శ దంపతులుగా కొనియడబాడటం . .కానీ నిజమైన అవసరమైన మార్పు ఏదని ఎక్కడుందని . . ఇదే కత ఉద్దేశ్యం అని ఒక పాటకురాలిగా నా అభిప్రాయం. .

  12. మాలతి అంటున్నారు:

    వ్యాఖ్యాతలకీ, పాఠకులకీ ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో నా ఏ టపాకీ ఇన్ని వ్యాఖ్యలూ, హిట్లూ రాలేదు. మంచి
    విషయం తీసుకుని, మంచి చర్చకి అవకాశం కల్పించిన రచయిత్రికి అభినందనలూ, ధన్యవాదాలు.
    @ లలిత దాట్ల, మీకు అనుకూలం అయినప్పుడే జవాబు రాయండి.
    ఇలాగే మరో రెండు కథలు వస్తే, నేను మరింత విపులంగా చర్చించాలనుకుంటున్నాను.

  13. G.S.Lakshmi అంటున్నారు:

    ఈ రచన నాకు నచ్చింది. ఎందుకంటే..
    తీసుకున్న విషయం నిత్య నూతనం.
    తన అభిప్రాయాలు భార్య మీద రుద్దడం హక్కుగా అనుకునే భర్తలు తరాలు మారుతున్నామారలేదు.
    ఒక ఇల్లు సరిగ్గా నడవాలంటే భార్యాభర్త లిద్దరిలో ఎవరో ఒకరు ఒదగవలసిన పరిస్థితి కనిపిస్తుంది. యేళ్ళు గడిచినా, దశాబ్దాలు గడిచినా ఆ పని స్త్రీలే చేస్తున్నారు.
    సాధారణంగా స్త్రీలే ఒదిగి వుండాల్సిన పరిస్థితి ఎందుకొస్తోందంటే భర్త ఇంటికే భార్య వస్తోంది కనక. ఈ ఇల్లు మా ఇద్దరిదీ.. అని పదిమంది మగవారిలో ఎంతమంది అనగలుగుతున్నారు?
    ఈ రోజుల్లో కూడా నూటికి ఏ నలుగురు దంపతులో మాత్రమే ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటున్నారు.
    ఆ మధ్య సర్వేలో బైట పడిన ఒక విషయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.
    భార్య ఇష్టాయిష్టాలు తెలుసుకునే భర్తల మాట అలావుంచి, అసలు భార్య ఇంట్లోంచి బైటకి ఏ చుట్టాలనో, స్నేహితులనో కలవడానికి వెళ్ళాలన్నా భర్త అనుమతి అఖ్ఖర్లేనివారు కేవలం పదిహేనుశాతం మాత్రమే వున్నారంటే మిగిలిన యెనభై అయిదు శాతం భర్త వెళ్ళమంటే వెళ్ళాలి, లేదంటే లేదు అనేకదా.
    ఈ రోజుల్లో స్త్రీల చదువూ, ఉద్యోగాల వల్ల మార్పు వస్తోందని అనిపిస్తున్నా ఆర్ధిక స్వాతంత్ర్యం వున్నంతలో భావస్వాతంత్రం కూడా అనుభవిస్తున్నారు అనుకుందుకు లేదు.
    అందులోనూ ఈ కథలో ముఖ్యంగా కనిపించేది భార్య లోని భావుకత. ఆ భావుకత లేని అతి వాస్తవిక తత్వం కల భర్తతో ఆమె జీవితం మనసును చంపుకుంటే కాని నడవదు.
    అలాగ భావుకత లేని మనుషులకు పెళ్ళీ, భార్య లాంటివి అస్సలు ప్రత్యేకతను సంతరించుకోవు.
    “అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మేమూ చేసుకున్నాం..”అన్నవాళ్ళని చాలామందిని చూసేను నేను.
    జీవితంలో సహధర్మచారిణి విలువ తెలీని వారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తోంది.
    మరింక ఈ రచన లో బాగున్న మరో అంశం శైలి.
    అంతా సంభాషణలతో నడుస్తుంది. ఒక రచయిత కథ సూటిగా తనపరంగా చెప్పెయ్యడం సులువే. కాని ఇలా సంభాషణలతో కథని నడపడం అంటే ఆ సంభాషణలోనే పాత్రస్వభావం తెలియాలి. అది కష్టం. అది చాలా బాగా చెప్పేరు లలితగారు.
    మరింక టెక్నికల్ గా చూసుకుంటే దీనికి పెద్దవాళ్ళు చెప్పిన “కథ” కి వుండవలసిన లక్షణాలు వున్నాయా అని.
    కథ, కథానిక, చిన్నకథ, స్కెచ్.. ఇలాంటి చాలా పేర్లకి చాలామంది చాలా నిర్వచనాలు ఇచ్చేరు.
    నా ఉద్దేశ్యంలో పేరు ఏది పెట్టినా కూడా ఆ రచన చదివించేదిగా వుండాలి. ఆ లక్షణం దీనికుంది.
    లలితగారు ఇదే విషయాన్ని ఇంకొంచెం ఆలోచించి, ఇంకొన్ని సన్నివేశాలని సృష్టించి, అన్ని కోణాల్నించీ దీనిని మరింత మెరుగుపరిస్తే బ్రహ్మాండమైన కథఅవుతుందనడానికి సందేహంలేదు.
    లలితగారూ.. కథని వ్యాఖ్యానించడానికి పెట్టిన మీ ధైర్యానికి అభినందనలు.

  14. కొత్త పాళీ అంటున్నారు:

    బావుందండీ.
    ఏదన్నా ఒక రచనచేసి నలుగుర్లోనూ పెట్టడం అంటే, పాతకాలపు పోలికే అనుకోండీ, కనిపెంచిన కూతుర్ని అత్తారింటికి పంపుతున్నట్టే.
    ఇంక దానిపైన విమర్శలు చెయ్యండి, సూచనలివ్వండీ అనికూడా అన్నారు చూశారూ – మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అభినందనలు
    మీకు మంచి భాష ఉంది. దాన్ని ఆసక్తిగా మలిచే నేర్పుంది. ఆ రెండూ పుష్కలంగా కనబడుతున్నాయి ఈ రచనలో.
    కొన్ని మౌలికవిషయాల పట్ల కుతూహలం కనబడుతున్నది. ఇదికూడా చాలా మంచిదే కథా రచనకి.
    జ్ఞానప్రసూనగారు చెప్పినట్టు సాధన అవసరం.
    నా మట్టుకి నాకు ఇది ఒక స్కెచ్‌లా ఉంది. పూర్తి కథ అనిపించలేదు. ఇదే ఫ్రేంవర్కుని పునాదిగా బలమైన సంపూర్ణమైన కథాభవనం కట్టగలరేమో చూడండి.
    sunamu గారి వ్యాఖ్య సమంజసంగా ఉన్నది.

  15. lalitha అంటున్నారు:

    మాలతి గారు
    పాఠకుల వ్యాఖ్యలకు వివరణ ఇప్పుడే ఇవ్వాలని వుంది కానీ , తరువాత చదివే వారు ఆ వివరణనని అనుసరించి కథని అర్ధం చేసుకునే అవకాశం వున్నందున మరి కొన్ని వ్యాఖ్యల తర్వాత కథ గురించిన నా అభిప్రాయం చెబితే బావుంటుందనుకుంటున్నాను .

  16. psmlakshmi అంటున్నారు:

    మరీ ఏకపక్షమనికూడా నేననుకోను. ఎందుకంటే నిద్రమత్తులోనైనా అమ్మాయిలు వాళ్ళ ఇష్టాలు చెప్పటానికి ప్రయత్నించారు. కానీ తరతరాలుగా అలవాటైన ఆడవాళ్ళు సర్దుకుపోవటం అంత తొందరగా మారకపోవచ్చగానీ, మార్పు వస్తోంది. కనుక మన కధా వస్తువుల్లోకూడా మార్పు అవసరమేమో. ఇంకొక్క విషయం..కధ మొత్తం సంభాషణలే. ఎదిగే వుద్దేశ్యంతో అడిగారుకనుక నిర్మొహమాటంగా చెప్పాను. ఇది నా అభిప్రాయం మాత్రమే.
    psmlakshmi

  17. rukminidevi అంటున్నారు:

    lalita gaaru, cheppaalanukunna vishayam chaala chakkagaa cheppaaru.. congrats and keep it up…

  18. sunamu అంటున్నారు:

    I for one feel ‘one-sided’ness is not a disqualification in itself. For that matter all writing is subjective and hence one-sided. The writing itself is a manifestation of such urge to share something one feels to communicate to others. The problem with criticism is people try to compare their convictions with that of the writer. They need not be and will never be. A piece of work should be judged from within and not without. from the framework within which the writer wanted to convey, yes, the writer could convey that times have changed only chronologically, not in perceptions, expectations and adjustments. There is no dogmatism whether such view is good or bad. it is just a presentation of matter-of-fact situation which one can not deny. I believe to that extent the writing did succeed. I liked the choice of words on some sensitive issues.

  19. tgnanaprasuna అంటున్నారు:

    lalitha gaaru
    malat igaari prOtsaahaanni andukoni kadha
    vraasaaru, mudaavaham. annapraasana naaDE aavakaaya
    evarutinaleru, pettaru koodaa. saadhana muna panulu samakooru annaaru. inkaa enta saadhana cheste anta
    phalitam. meeku vraasE nduku utsukata vundi. manchikadhalu
    mee nunchi raavaalani korutunnaa.
    gnana prasuna

  20. quickexpress గారి వ్యాఖ్య చూసి తరవాత చదవాలనుకున్నది ఇప్పుడే చదివేశాను. వ్యక్తీకరణ బానే అనిపించింది మరి నాకైతే. అవును ఏకపక్షంగానే ఉంది. ఒక పక్షం వారి ఆలోచనలు వినిపించింది ఈ కథ. ఇరు పక్షాల వాదనలు వినిపించాలని ప్రయ్త్నించి విఫలం కాలేదు కదా. లక్ష్యం ఒక వైపు ఆలోఛనలు చూపించడం. అది బానే జరిగింది. expectation match అవ్వకపోవడం, అలానే సర్దుకుపోవడం అనేది తరం మారిన తవాత కూడా కొనసాగడం అనేది విషయం అనిపించింది. కథలు వ్రాయడం గురించి మాలతి గారి ఆడియోలలో ఒక భాగమే విన్నాను. కాబట్టి ఆ వైపు నుంచీ ఇప్పుడేమీ వ్యాఖ్యానించలేను. వ్యాఖ్య కలిగించిన కుతూహలం కొద్దీ చదివి నాకనిపించింది చెప్పాలనిపించింది. ప్రస్తుతానికి ఇంతే.

  21. quickexpress అంటున్నారు:

    ౧) ఇదే మొదటి సారి కథ రాయడమా? లేదంటే ముందు కూడా రాసారా? మొదటి రాస్తే నేనేం అనలేను కానీ, కథలు రాయడం అలవాటు ఐతే మాత్రం, కథనం ఏం బాలేదు
    ౨) పూర్తీ ఏకపక్షంగా, నిరాశతో నిండి ఉంది. ఏమిటో నాకు చదువుతూ ఉంటే మరీ అసంపూర్ణంగా అనిపించిండ్ కూడా. “నాలుగు గోడలమధ్య మనసులు నలుగుతూనేవున్నాయ్ , నలుగురి మధ్యకూ వచ్చి ఆదర్శదంపతులుగా కొనియాడబడుతున్నాయ్” – ఈ వాక్యం కథాంశం అనుకుంటే, దాని ఎస్టాబ్లిష్ చేసేలా లేవు ఆ పైన ఉదాహరించిన సంఘటనలు రెండూ.
    ౩) “సరిగ్గా పాతికేళ్ళ పది నెలల తర్వాత …..” : ఈ లెక్క నాకర్థం కాలేదు
    ౪) “నిరసనగా చూసాడు . ” హు….. మా నాన్నని అనాలసలు , కట్నానికి ఆశపడి నన్ను ముంచేశాడు….. అహంకారాన్ని కుమ్మరిస్తూ , అసహనంగా అటు తిరిగి పడుకున్నాడతను”
    -మళ్ళీ ఏకపక్షం అనిపించింది. ఈ కథలో రెండు ఉదాహరణలు చెప్పారు. రెంటిలోనూ మగవాళ్ళే ఇలా చేస్తారు అన్నట్లు చెప్పారు. కానీ, ఎవరన్నా చేయొచ్చుగా!

    ఇలా… నాకంత నచ్చలేదు కథ. పెద్దగ ఆలోచించకుండా, పైపైన రాసేసినట్లు అనిపించింది.

  22. lalitha అంటున్నారు:

    ధన్యవాదాలు మాలతి గారు .
    పాఠకుల విమర్శ ఈ కథలో లోటుపాట్లను తెలుసుకోటానికీ, కథా రచనలో నన్ను ముందుకు నడిపించడానికీ తోడ్పడేదిగా ఉంటుందని ఆశిస్తూ – లలిత

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.