(ఎన్నెమ్మకతలు 83)
ఏకాగ్రత అంటే సమస్తం మరిచి ఒకే విషయంలో నిమగ్నమై ఉండడం. అనేకాగ్రత అంటే ఏమిటో చెప్పడం కష్టం. ఈటపా చదివినతరవాత మీకేం తోస్తే అదే. ఇంకా దీన్నే అష్టకర్మావధానం అని కూడా అనొచ్చు. కారు నడుపుతూ, కాఫీ చప్పరిస్తూ, రేడియో వింటూ, ఒక చెవులో పీసుద్వారా మరొకళ్ళతో ఊసులాడుతూ పోతుంటారు కొందరు. ఇంకా కారులో are we there yet అంటూ పిల్లలు సంగీతం మొదలు పెడితే అది మరీ వీర అష్టకర్మావధానమే!
అలాటి అవస్థనన్నమాట అనేకాగ్రత అనాలి.
పూర్వం ద్వాపరయుగంలో ద్రోణాచార్యులవారు పాండవులకి విలువిద్య నేర్పినవిధానంగురించి చెప్పుకునే కథ – మీకు జ్ఞాపకం లేకపోతే ఇదుగో.
శ్రీ ద్రోణాచార్యులవారు పంచపాండవులని వరసగా నిలబెట్టి, “అదుగో, దూరంగా ఓ చెట్టుంది. కనిపిస్తోందా?” అని అడిగేరు. పాండవులలో నలుగురు, “అవునవునవును, ఉంది, ఉంది,” అన్నారు. అర్జనుడు మాత్రం, “నాకేమీ కనిపించడంలేదు,” అన్నాడు. ఆచార్యులవారు, “మరి ఆ చెట్టుమీద పిట్ట కనిపిస్తోందా?” అనడిగేరు. మళ్ళీ అందరూ, “అవునవునవును,” అన్నారు కానీ అర్జనుడు మాత్రం “లేద”న్నాడు. “మరి ఆ పిట్టకన్ను కనిపిస్తోందా?” అంటే, “కనిపిస్తోంది,” అన్నాడు అర్జనుడు. మిగతావారేమన్నారో తెలీదు కానీ ఇది మాత్రం అర్జనుడి ఏకాగ్రచిత్తతకి నిదర్శనంగా చెప్తారు. అంటే ఏ పని చెయ్యాలో దానిమీద మాత్రమే దృష్టి నిలపడం.
అందుకు ప్రతిగా ఏకకాలంలో నాలుగో పదో కర్మలయందు నిమగ్నులైతే లేదా అవడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏకాగ్రత అనలేం. కలియుగం నాలుగోపాదంలో ఈ multi-tasking అమెరికాలో పుట్టి దేశదేశాలా వ్యాపించినట్టు అనిపించినా, నిజానికి ఇది మన నిత్యజీవితంలో ఎల్లెడలా ఉంది.
మన పల్లెల్లో రోజుకూలీ ఆడవాళ్ళు పిల్లలని చెట్టుకొమ్మకి వేలాడేసిన గుడ్డఉయ్యాలల్లో పడేసి, అనకాపల్లి చుట్టముక్కొకటి అడ్డపొగ పట్టి, పదాలు పాడుకుంటూనో, పక్కవాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూనో రాళ్ళు కొట్టడమో జల్లెడ పట్టడమో చేయడం ఈ అష్టకర్మావధానం కిందకే వస్తుంది నా అభిప్రాయంలో. మధ్యతరగతి ఇళ్ళల్లో ఆడవాళ్ళు పిల్లలకి చదువు చెప్తూనూ, మరీ చిన్నపిల్లలయితే వారి ఆలనాపాలనా చూసుకుంటూ, పొయ్యిమీద కూర ఎనుపుతూ, ఫోనులో మాటాడుతూ, టీవీలో సీరియల్ అనుసరించడం కూడా అలాటిదే.
నామటుకు నేను ఒక పని కంటే ఎక్కువ చెయ్యలేను ఏ ఒక్క క్షణంలోనూ. అది అర్జనుడికున్నలాటి ఏకాగ్రత కాదు. కేవలమూ నాబలహీనతే అని ఒప్పుకుంటాను. ఒకే సమయంలో నాలుగు పనులు చేబట్టడం నాకు చేతకాదంతే. కానీ గత నాలుగునెలలుగా సీను కొంత మారింది. సమాజం నన్ను అటువేపుకి తోసేస్తున్నట్టు అనిపిస్తోంది. టీవీలో split screen రెండో నాలుగో షోలు ఏకకాలంలో చూసే అవకాశం కల్పిస్తోంది. వార్తల్లో ముగ్గురో నలుగురో తాజా తాజా రాజకీయాలు చర్చిస్తుంటే, స్క్రీనుకి అడుగుభాగాన సెలయేరులా పారుతున్న రిబ్బనులో సరికొత్త వార్తలు ఏకవాక్యాలలో సాగిపోతుంటాయి. అలాటప్పుడు కళ్ళు అటు తిరక్కుండా ఆపడం కష్టం. వీధిలోకెళ్తే కళ్ళు రోడ్డుమీద ఉండాలని నియమం అయితే ఉంది కానీ రోడ్డుపక్కన మారీచసుబాహుల్లా బిల్లుబోర్డులు మీద పడిపోతూ దృష్టిని అటువేపుకి లాగేస్తాయి. బట్టలు కొనడానికి వెళ్తే అక్కడ నాకక్కర్లేని, నేను విని ఆనందించలేని సంగీతం నాబుర్ర తినేస్తుంది. ఆ హోరులో పడి రెండు సైజులు పెద్దదయిన చొక్కా కొనుక్కొచ్చేస్తాను హడావుడిగా. ఎవరింటికేనా వెళ్తే, టీవీ పెట్టేసి, మాటల్లోకి దిగిపోతాం వేడి వేడి పకోడీలు నవుల్తూ. మరి ఏకాగ్రత రమ్మంటే ఎలా వస్తుంది? హుమ్.
మాంఛి రద్దీసమయంలో కారులో కూర్చుని ఓచేత్తో చక్రం పట్టి మరో చేత్తో సెల్ పుచ్చుకుని టెక్స్టింగూ, నిక్స్టింగూ, వెక్స్టింగూ, (ఇంకా సెక్స్టింగూ) చేయడంమూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవలే గుర్తించి, అలా ఫోనులో మాటాడరాదని నియమాలు పెడుతున్నారు. దాంతో నీలిటూతులూ, చెవిపీసులూ వచ్చేయి. చేతులయితే ఖాళీ అయేయి కానీ బుర్రలవిషయంలో మాత్రం పంపకాలు తప్పవు కదా. అంటే రోడ్డుమీద, చుట్టుపక్కల కార్లమీదా, నడిచే జనాలమీదా ఉండాల్సిన ఏకాగ్రతలో కొంత భాగం లుప్తమయిపోతుంది కదా.
అలాగే ఫోనులో మాటాడుతూ పిల్లలని సముదాయించబోతే వాళ్ళు హర్షించరు సరికదా తీవ్రనిరసన తెలియజేస్తారు రాగాలు తీస్తూ.
ఆపీసుల్లో అయితే బాసురుడు ప్రకటించే నిరసన మరింత విషాదకరం కాగలదు.
పడకటింటిలో సంగతి … నేను చెప్పనులెండి.
జరగడం అయితే ఇలా జరుగుతోంది కానీ నా సిద్ధాంతం మాత్రం ఈ బహుళ కర్మావధానం మంచిది కాదనే. ఎందుకంటే మెదడు ఎంత పెద్దదయినా దానికో పరిమితి ఉంది. ఒక విషయంమీద పెట్టవలసిన దృష్టి అనేక విషయాలకి పంచితే, ఒక విషయంమీద ఉండాల్సిన దృష్టి కాస్తయినా లోపించడం ఖాయం. సాధారణ భౌతికశాస్త్రం చెప్పే పాఠం అది, మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడినట్టు.
ఎలా చూసినా అనేకాగ్రత పరిమితసమయాల్లో మాత్రమే పరిగ్రహించడం ఉత్తమమని గ్రహించగలరని ఆశిస్తూ ..
(నవంబరు 30, 2011)
@ chvbhaskar, flow అంటారు. అలాగా. నిజమేనండీ. మరీ నూటికి నూరు పాళ్ళు ఏకాగ్రత కష్టం ఈ హరీబరీ రోజుల్లో. కానీ, కొంతయినా మితి పెట్టుకోవాలని నా ఆకాంక్ష.
ఏదైనా పనిని ఏకాగ్రతతో చేస్తున్నప్పుడు మనకు మన చుట్టు ఏమి జరుగుతుంతో పట్టించుకోము. ఆకలి కూడా అనిపించదు. దానినే సైకాలజీ లో flow అని అంటారు. ఆ పనిని సాదించినప్పుడు పొందిన ఆనందం వర్ణించలేనిది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో flow స్థాయిని సాధించడం చాల కష్టం
సి.వి.ఆర్. మోహన్, నిజమేనండీ. అష్టావధానంలాటి విద్యలు అలాటివే. ధన్యవాదాలు.
అష్టావధానం శతావధానం ప్రక్రియలున్న తెలుగు వారికి ‘మల్టీ టాస్కింగ్” క్రొత్త ఏమీ కాదు .
@ ఉదయరాణి, అవున్లెండి, కొందరికి తేలిగ్గా పట్టుబడుతుంది ఆ విద్య. ఏ సిద్ధాంతానికైనా మినహాయింపులుంటాయి కదా :p
మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు.
abbe ala emikadu malathi garu anekegrata valla pedda kastamu emi vundadu -i mean andariki kadu -konthamandiki edi chala easy ga pattubadivuntundi
bahusha by birth-nature kavachchu
emina manchi visayame topic loki techchru
@ లలిత, కొన్ని ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నాయి. – అదేనండీ కావలసింది. మీరు దీన్ని మంచి స్పిరిట్ తో తీసుకున్నందుకు సంతోషం. ఈరోజుల్లో అందరూ అనేకాగ్రతతో ఉరుకులతో పరుగుల్తో సాగుతున్నారు కనక కోపగించుకుంటారనుకున్నాను. అందుకు మీకే ధన్యవాదాలు. మీరు మీ పద్ధతిలో చేసుకుపొండి. అంతే.
.
ఈ అనేకాగ్రత లోపించడం మూలంగానే ఎన్నో పరిధులు విధించుకున్నాను నాకు నేను. కానీ అవి భౌతికంగానే. మనసు పరి పరి విధాలా పోతూనే ఉంటుంది. ఎన్నో చేసెయ్యాలని ఉత్సాహం ఊరిస్తూ ఉంటుంది. మీరు నేను పిల్లల కోసం చెయ్యదల్చుకున్న పనులు చెప్తుంటే సున్నితంగా హెచ్చరించారు అప్పట్లోనే