ఊసుపోక – చుక్కలూ, తోకచుక్కలూ

(ఎన్నెమ్మకతలు 85)

ఈమధ్య పాఠకులు చాలామంది నా, మీ ఇంకా ఇతర రచయితల రచనల్లో చుక్కలూ [.], తోకచుక్కలూ [,] సరిగా లేవని చిరాకు పడుతున్నారు. అంచేత ఈరోజు పొద్దున్నే లేచి, ఈ విషయం సవిస్తరంగా చర్చించదల్చుకున్నాను. అంటే విశ్వవిద్యాలయాల్లో ఘనాపాఠీ పండితుల సిద్ధాంతగ్రంథాలలోవలె పాశ్చాత్య మహాశయులని ఆదర్శంగా తీసుకోక తప్పదు కదా. మనం అధ్యయించవలసిన రెండో విషయం మనచరిత్ర – మనకీరాత ఏరాతలనుండి సంక్రమించెను అన్నది.

రెండోసంగతి మొదట చూద్దాం. ప్రధానంగా మనకి మౌఖికసాహిత్యంయందు చాలా గౌరవం. అంచేత చారిత్ర్యకంగా మనరాతలెలా వచ్చేయో చూడాలి మొదట. చాలా చాలా సంవత్సరాలక్రితం ఒక శుభసందర్భంలో వ్యాసులవారు మహా భారతం అనర్గళంగా గానం చేస్తుంటే వినాయకులవారు ఆపకుండా రాసేసినట్టు గ్రంథస్తమయి ఉంది. “గంటం పుచ్చుకుని” అని అంటారు కానీ అప్పటికే గంటం వాడుకలోకి వచ్చిందా అన్నది నాకు అనుమానమే. ఇది ప్రక్షిప్తం అని నా నమ్మకం. ఎందుకంటే, కాలక్రమం చూస్తే ముందు వ్యాసులవారూ తరవాత అశోకుడూ వాళ్ళూ కదా వచ్చింది. అశోకుడి శిలాశాసనాలూ, తామ్ర శాసనాలూ కొంతవరకూ దొరికేయి. ఇదుగో, అశోకుని శిలాశాసనం.

(tewikiకి కృతజ్ఞతలతో ఇక్కడ పెడుతున్నాను. http://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82 )

చూశారా, చుక్కలూ, తోకచుక్కలూ కనిపించడంలేదు. నిజానికి అసలు అక్షరాలే సరిగ్గా తెలీడం లేదు.

రెండవదశలో మనకి తాటాకుదస్త్రాలూ, గొలుసుకట్టు రాతా వచ్చేయి. తాటాకుమీద ఒకొక అక్షరానికి గంటం ఎత్తి రాయడంకంటే, గొలుసుకట్టుగా రాసుకుంటూ పోవడమే సులభం కనక. కోర్టు దస్తావేజులూ, జాతకాలలో ఈరాత కనిపిస్తుంది. వీటిల్లో కూడా విరామచిహ్నలు కనిపించవు. ఎందుకంటారు? మనకి ఆపకుండా గుక్క తిప్పుకోకుండా మాటాడ్డం అలవాటు కనక. అలా ఆపకుండా గుక్క తిప్పుకోకుండా మాటాడుతున్నమాటలు రాస్తే తోకచుక్కలూ కనిపించే అవకాశం లేదు కనక.

వెనక వ్యాసుడికి వినాయకునిలాగే, విశ్వనాథ సత్యనారాయణగారికి వారితమ్ముడు వెంకటేశ్వర్లుగారూ, ఆ తరవాత మన రచయిత్రులకి భర్తలో రిసెర్చి స్కాలర్లో లేఖరులుగా వ్యవహరిస్తూ వచ్చేరు. (చివరివిషయం నా కల్పిన కాదు. ఆయా స్వయంగా రచయిత్రులే ప్రకటించుకున్నారు.). ఇలా వాచా చెప్పి రాయించుకోడం మనకి ఆనవాయితీ అయిపోయింది. ఈవిధంగా మనం మన మౌఖికసాహిత్యాన్ని పదిలపరుచుకుంటూ వస్తున్నాం. అంచేత, మనకి ఈ విరామచిహ్నాలమీద దృష్టి లేకుండా పోయింది.

పోతే, ఈ విరామచిహ్నలఅవసరం పాశ్చాత్యులనించి సంక్రమించిందే.మామూలుగా ఇంగ్లీషులో ఈ విరామచిహ్నాలకి అవసరం ఎక్కువే. సరైన స్థానంలో సరైన విరామం లేకపోతే అర్థం మారిపోయే ప్రమాదం ఉంది కనక.  అయినా వాళ్ళలో కూడా అందరికీ ఈ విరామచిహ్నాలంటే అట్టే గౌరవం ఉన్నట్టు కనిపించదు.

సుప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ అంత సుప్రసిద్ధుడు కాని రాజుల్లో ఒక కథ రాసి ఏదో పత్రికకి పంపేడు అప్పటికి సంపాదకులు మార్క్ ట్వైన్ కథ ఇస్తే చాలు మహా ప్రసాదం అంటూ పొంగిపోయే స్థితి లేదు అంచేత ఆ సంపాదకుడు ఆకథని తిప్పి పంపుతూ ఇందులో ఫుల్ స్టాపులూ కామాలూ లేవు వాటిని తగిన స్థానాల్లో ఉల్లోఖించి సరిదిద్ది పంపించు అని రాసేడు మార్క్ టైన్ అప్పుడు మరొక కాగితం టైపురైటరులో పెట్టి, దాన్నిండా …………………………………………….. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇలా చుక్కలూ, తోకచుక్కలూ టైపు చేసి ఇవిగో మీక్కావలసినచోట పెట్టుకోండి అని జవాబిచ్చేడుట

అయ్యో, నేను  కథ చెప్పే ఉత్సాహంలో చుక్కలూ, తోకచుక్కలూ ఎగరగొట్టీసినట్టున్నాను J). అయినా మీకు తెలుసు కదా అవి ఎక్కడ లేవో. లేకపోయినా మీకు అర్థమయిపోయింది కదా. లేదంటారూ, పోనీ, మరోపని చెయ్యండి. నోరు విప్పి కనీసం మీకు వినిపించేలా పైకి చదువుకోండి ఆ భాగం. మీకు అప్పుడు కథ అర్థమయిపోతుందనే నా నమ్మకం.

అన్నట్టు, మాటాడుతున్నప్పుడు ఈ విరామచిహ్నాలు కావాలనుకుంటే ఎలా చెయ్యొచ్చో విక్టర్ బోర్గా (Victor Borge) అనే పియానో విద్వాంసుడు చూపించాడు. ఇక్కడ (http://www.youtube.com/watch?v=lF4qii8S3gw) చూడండి.

(డిసెంబరు 17, 2011)

4 Responses to ఊసుపోక – చుక్కలూ, తోకచుక్కలూ

  1. మాలతి గారూ, తోకచుక్క గురించి మీరిచ్చిన ఉదాహరణ బావుంది. కామేశ్వర రావు గారి బ్లాగు నాకు కూడా ఇష్టం.
    కొత్తపాళీ గారూ,
    మీరు చెప్పింది బానే వుంది. ఐతే రచయితలే పుస్తకాలలో గ్లాసరీ వంటిది ఇస్తే బావుంటుందేమో కదా అన్న ఆలోచన కూడా వచ్చింది నాకు. కొందరు బ్లాగుల్లో తమ రచనల్లో ఇతర ప్రాంతాల వారికి తెలియవనుకున్న పదాలకి అర్థాలు తెలిసేలా చెప్తున్నారు కదా, అలా. అలాగే, కొత్త రకం చదువుల్లో కొట్టుకు పోయిన పాత పద్ధతుల గురించి బాధేస్తుంది. ఐతే అవి అలా కొట్టుకుపోత్యున్నాయి కనుకనే మనం ఈ రోజుల్లో కొత్త ప్రయత్నాలు చెయ్యవలసిన అవసరం ఉంది కదా అని నా అభిప్రాయం. నాకు ఆంగ్లం కూడా సరైన టీచర్లు దొరికి ఉండకపోతే చదవడం, అర్థం చేసుకోవడం చేతనయ్యేది కాదు. తెలుగు ‘సహజం’గా రావాలి అనుకునే ఆలోచనలో మార్పు రావాలి అని నా అభిప్రాయం.

  2. కొత్తపాళీ అంటున్నారు:

    లలిత గారు, ప్రాంతీయ వాడుకలు, మాండలిక పదకోశాలు తయారు చేశారు. తెలుగు ఎకాడమీనిగానీ తలుగు వివిని గానీ సంప్రదించండి. సీవెండి .. బహుశా సీమ వెండికి పొట్టిరూపం అయి ఉండవచ్చు. దీన్నే నగరాల్లో జెర్మన్ సిల్వర్ అంటారు. వంట గిన్నెలు తయారు చెయ్యడానికి ఉపయోగించే లోహం.
    పూర్వకాలపు చదువుల్లో పద్యం విడమరిచి చదవడం ఒక భాగంగా ఉండేది. దీన్ని గురించి శ్రీపాద వారు తన అనుభవాలూ జ్ఞాపకాలూ లో రాశారు. పల్లెల్లో పెద్దలెవరైనా పురాణం చెబుతున్నప్పుడు పుస్తకం చూసి పద్యం పెద్దగా చదివే పని వారి శిష్యులు చిన్న పిల్లలెవరో చేసేవారు. ఇలాగకూడా పద్యాన్ని పైకి ఎలా చదవాలి అని పట్టుబడుతుండేది. మందల్ని మళ్ళేసే పాఠశాలలు వచ్చాకనే ఇట్లాంటి విద్యలన్నీ మరుగున పడినాయి.

  3. మాలతి అంటున్నారు:

    @ లలిత (తెలుగు4కిడ్స్), Pardon, not execute. Pardon not, execute. రెండోవాక్యంలో తోకచుక్క స్థానం తప్పినందున ఒక అభాగ్యుడితల ఎగిరిపోయిందిట. ఇది నెపోలియన్ ఇచ్చిన టెలిగ్రాం కథగా చెప్పుకుంటారు. బహుశా ఇంగ్లీషులో ఉన్నంతగా పటిష్టంగా మనకి అవసరం లేదేమో ఈ విరామాలు. పద్యాలలో, శ్లోకాల్లో విరుపులు నాక్కూడా బాధేనండీ. ముఖ్యంగా పద్యాల్లో ఈ విరామచిహ్నాలు పనికిరావు కదా. ఛందస్సునిబట్టి విరుపులు అక్కడ. నేను అప్పడప్పుడు కామేశ్వరరావుగారి తెలుగుపద్యం అందుకే చూస్తుంటాను. ఆయన చక్కగా ప్రతిపదార్థం చెప్తారు కనక ఆవిధంగానైనా కొంత తెలుస్తుందేమోనని. ఇలాటివే ఇంకా కొన్ని బ్లాగులున్నాయని విన్నాను కానీ చూడలేదు. నిజమే, మీరన్నట్టు మనకి ఇలాటి నిఘంటువు కావాలి. అలాగే, ప్రాంతీయభాషల్లో రాసినకథలు కూడా నేను చదవలేను. మంచివిషయమే ప్రస్తావనకి తెచ్చేరు. ధన్యవాదాలు.

  4. మీ చుక్కలూ, తోకచుక్కలూ అనే ప్రయోగం చాలా బావుంది :)
    విరామ చిహ్నాలు సరే కానీ పద్యాలు చదివేటప్పుడు పదాలని ఎలా విడగొట్టాలో తెలీని పరిస్థితి చాలా సార్లు నాకు. “రామునితో కపివరుఁడు…” గుర్తుకు వచ్చేలా అన్నమాట. చదువుకునే రోజుల్లో తెలియలేదు. ఇప్పుడు తెలుసుకుని నేర్చుకుందామంటే ఎవర్ని అడగాలో తెలియదు. అడిగితే కోపగించుకుంటారనే భయం కూడా లేకపోలేదు. మంచి విషయాలు పాశ్చాత్యులనుంచి నేర్చుకున్నా పరవాలేదనుకుంటాను మరి. నాకు నిఘంటువులు, thesaurus లూ, గ్రాంథికం అర్థం చేసుకోవడానికి ఉపకరణాలూ, వ్యాకరణం విషయంలో సాయాలూ మున్నగు వాటి మీద resources తయారు చేసుకుని వాడుకోవడం వారి వద్ద నుంచి నేర్చుకుని తీరాల్సిన విషయం అనిపిస్తుంటుంది నాకు మరి. అంతెందుకు, ఈ రోజు తీరిక దొరికిందని, ఎందరో మెచ్చుకునే వంశీ కథలు నాకెందుకు అంతగా నచ్చట్లేదోనని కొంచెం “ఏకాగ్రతతో” తో ఒక కథ చదివాను. ఈ కథ మీద అభిప్రాయాలకి ఇది వేదిక కాదు కానీ అందులో పదాలు నాకు కొన్ని తెలియలేదు. ఉదాహరణకి “సీవండి” (గ్లాసూ etc.)అంటే ఏమిటి? ఆంధ్రభారతి వారి కృషిని మెచ్చుకోవాలి, నిఘంటువులు అంతర్జాలంలో అందుబాటులో తెచ్చినందుకు. కానీ నాకు అక్కడా ఈ పదం దొరకలేదు. ఒక ప్రాంతంలో వాడుకలో ఉన్న వాటిని ఆ ప్రాంతం వారు గ్రంధస్థం చెయ్యొచ్చు కదా. చేసే ఉంటారేమో. కానీ ఎక్కువ మందికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఏదో పరిశొధనలకీ, కొద్దిమంది సాహితీ వేత్తలకి మత్రమే పరిమితం కాకుండా, ఈ కాలం కోసం ఈ కాలపు అవసరాలకి తగ్గట్టు ఇంకొంచెం విస్తృతపరిస్తే బావుంటుంది కదా. ఏదో మీరో విషయం వ్రాస్తే నేను ఇంకో గోడు వెళ్ళబోసుకుంటున్నానేమో :(

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.