(ఎన్నెమ్మకతలు 86)
ఇదివరకోసారి చదవనివారికి ప్రత్యేకం శీర్షికతో “చదువుతాను, తరవాత చదువుతాను, తప్పక చదువుతాను” అను తిరుమంత్రం జపిస్తూ మనం పోగేసుకుని అటకమీదకి ఎక్కించేసే పుస్తకాలగురించి రాసేను. అప్పుడు నాలాటి పాఠకులు చాలామందే ఉన్నారని అర్థమయింది. మళ్ళీ ఇప్పుడు నాకు చదవాలన్న కోరిక అంటే నిజంగా చదవాలన్న కోరిక పుట్టింది. ముఖ్యంగా గత నాలుగు నెలలూ మరీ నిస్సారం అయిపోడంచేత. అంచేత అయం ముహూర్తో సుముహూర్తోస్తు అనుకుని కొన్ని పుస్తకాలు అటకమీంచి (ప్రతీత్మకంగా) దింపి, మరో రెండు కొ్త్తపాళీఇంట్లో అటకమీంచి దింపించి, వాలుకుర్చీలో వాలి, ఆ పుస్తకాలని పక్కనున్న బల్లమీద పెట్టి సుదీర్ఘంగా ఆలోచించడం మొదలెట్టేను ఏది ముందు అని.
అలా ఓ పది రోజులు గడిచేక, ఓ పుస్తకం తీసేను. ఏ పుస్తకమో తరవాత చెప్తాను. ఈలోపున నేను గ్రహించిన మరి కొన్ని విషయాలు చెప్పుకుందాం.
ముందు నాకు పుస్తకంపేరు నచ్చాలి. చాలామంది అట్టమీద బొమ్మ కూడా మనని ఠక్కున ఆకట్టుకునేగుణం కలిగి ఉండాలంటారు గానీ నాకది అంత ముఖ్యం కాదు. అంటే మరీ నెత్తిన చెంగూ, చెంపన కన్నీటిచారికలతో మన హృదయకమలాన్ని కటకటలాడించేసే పరిదీనవదనలు గల అట్ట అని కాదు. అలా అయితే నాకస్సలు రుచించదు. ఓ మోస్తరుగా ఫరవాలేదు లెద్దు అనిపించేబొమ్మయితే, అట్టలొదిలేసి, పుస్తకంలో ముందుమాట, వెనక అట్టమీద పెద్దల లేక ప్రచురణకర్తల కితాబులు చూస్తాను. అప్పటికి సుమారుగా అందులో సందేశం లేక ప్రధానాంశం తెలిసిపోతుంది. నవల అయితే ముగింపు తెలిసిపోయి, కౌతుకం ఖూనీ అయిపోయే ప్రమాదం కూడా వాటిల్లుతుంది కానీ వాటిని అధిగమించే ఆత్మబలం నాకుండడంచేత ఫరవాలేదు. నిజానికి నాకు చివరికి ఏమయింది అన్నది తెలుసుకోడం ఇష్టమే అయినా అంతకంటే ఎక్కువగా రచయిత ఎలా చెప్పేడు అన్నది ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎలా చెప్పేడు అన్నదానిమీదే మనం మళ్లీ మళ్ళీ “చదవగలగడం” అన్న గుణం ఆధారపడి ఉంటుంది.
ఇక్కడే మరో విషయం చెప్పాలి. నేను పూర్తిగా చదవలేదు అంటే ఆ పుస్తకం చదివేలా లేదా మనచేత చదివించేలా లేదని అర్థం కాదు. నేను పుస్తకం పూర్తి చెయ్యలేకపోవడానికి కారణం చాలామటుకు నా లోపమే. ఈనాటి చాలామంది పాఠకులలా నాకు “స్పీడురీడు” రాదు. నాకు ప్రతి మాటా, ప్రతి వాక్యం అర్థమయితే తప్ప చదివినట్టు ఉండదు. అక్కడే వస్తుంది తంటా. చదువుతుంటే, ఓ మాటో ఓ ఆలోచనో తగిలి నన్ను ముందుకి పోనివ్వకుండా ఆపేస్తుంది. ఆ మాటో ఆ ఆలోచనో నన్ను ఆదిక్కుగా లాక్కుపోతుంది. వాటికి బ్రేకులేసి, మళ్ళీ చేతిలో ఉన్న పుస్తకంలో పేజీమీదికి రావడానికి కొంత టైము పడుతుంది. అంచేతన్నమాట ఒక పుస్తకం పూర్తి చెయ్యడానికి నాకు చాలాకాలం పడుతుంది. అయితే నన్ను అలా ఆలోచింపజేయడం కూడా ఆ పుస్తకం సాధించిన ప్రయోజనమే కనుక అది దాన్ని సుగుణంగానే స్వీకరించాలి.
అలా కొంత సుదీర్ఘాలోచన అయింతరవాత త్రిపురకథలు తీసి చదవడం మొదలు పెట్టేను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కనీసం కొందరైనా వినుంటారు ఆయన విలక్షణమైన కథలు రాస్తారని. చక్కని తెలుగుసాహిత్యం చదవాలనుకునేవారికి ఒయాసిస్సులాటిది త్రిపురకథలు అంటారు విమర్శకులు. నాకు మాత్రం ఆదిలోనే హంసపాదు – ఈ సంకలనంలో కనకప్రసాదుగారి ముందుమాట. అది చదవడం మొదలు పెట్టి, పది పేజీలు చదివేసరికి ఇది మనలాటి సగటు పాఠకులకి కాదేమో అనిపించింది. నేను ఈ సంకలనం చూడ్డం ఇదే మొదలు కానీ ఇంతకుముందు దాదాపు రెండేళ్ళ క్రితం ఒక కథ, “భగవంతంకోసం” చూసేను. ఎలా ఎక్కడ చూడ్డం జరిగిందో జ్ఞాపకం లేదు కానీ చదివేను. నాకు నచ్చింది. అనువాదం చేసేను కూడా. అప్పట్లో త్రిపురగారిని ఆ కథ నేపథ్యంగురించి అడిగేను. ఆయన, “పెద్దగా చెప్పుకోడానికేంలేదు. సామ్యూల్ బెకెట్ రాసిన waiting for Godot చదివేక అలాటికథ రాయాలనిపించింది. రాసేను. అంతే,” అన్నారు (చూ. Waiting for Bhagavantham, http://thulika.net/2009April/waitgBhagavantam.html). బెకెట్ శైలివిషయంలో చాలా తర్జనభర్జనలు జరిగేయి. త్రిపుగారి “భగవంతంకోసం” కథపరంగా బాగుంది. పై సంకలనంలో రెండో మూడో కథలు చదివినతరవాత అన్ని కథలూదాదాపు ఒకే మూసలో ఒకే ధోరణిలో చెప్పుకుపోతున్నట్టు అనిపించేయి. స్థూలంగా ఈ కథల్లో రచయిత ప్రధానాంశం – రచయితఅంతరంగం, ఆత్మతత్వవిచారణ కనిపిస్తుంది. నేనెవరు, బతుక్కి అర్థం ఏమిటి, మనం ఏదైనా ఎందుకు చేస్తాంలాటి ఆత్మశోధన, మానవతత్వవిచారణ అంటారు కనకప్రసాదుగారు, పాలగుమ్మి పద్మరాజుగారు, ఇంకా ప్రముఖ రచయితలూ, విమర్శకులూ. అంటే ఆల్బర్ట్ మొరేవియా, కామూ, బెకెట్ వంటి పాశ్చాత్య తత్వజ్ఞానరచయితలని అభిమానించేవారికి ఇవి ఎక్కువగా నచ్చుతాయి. నామటుకు నాకు మాత్రం ఏమనిపించిందంటే, నాక్కూడా అలాటి ఆలోచనలు – నేనెందుకు పుట్టేను, ఎందుకిక్కడ ఉన్నాను, (ఏం చేసినా) ఎందుకు చేస్తున్నాను లాటి ప్రశ్నలు కలుగుతాయి తరుచూ. నాక్కూడా ఇలాటి కథలు రాయాలని ఉంటుంది. కానీ నేను రాయలేను. అంచేత త్రిపురగారిని మెచ్చుకోవాలి. నిజానికి ఎవరికైనా ఇలాటిప్రశ్నలు వస్తే ఎవరికి వారే జవాబులు చెప్పుకోవాలి కానీ వేరేవారికథల్లో దొరకవేమో అనిపిస్తుంది నాకు. అంచేతన్నమాట ఈ పుస్తకంలో కథలన్నీ చదవలేకపోయేను. ఏమైనా, మీక్కూడా ఇలాటి తత్వజిజ్ఞాసా, పాశ్చాత్య తాత్విక రచయితలంటే విపరీతమైన అభిమానమూ ఉంటే ఈ కథలు మీకునచ్చవచ్చు అని నాఅభిప్రాయం.
రెండోది నోరి నరసింహశాస్త్రిగారి నారాయణభట్టు. నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి చదివినప్పట్నించీ ఆయన రాసిన మిగతా చారిత్రక నవలలు కూడా చదవాలని నాకు మహ ఆకాంక్షగా ఉండింది. గత జూన్‌లో కొత్తపాళీగారింటికి వెళ్ళినప్పుడు వారిలైబ్రరీనించి సంగ్రహించేను ఈ నారాయణభట్టు, కవి సార్వభౌముడు అనే రెండు నవలలు. ఇప్పటికే ఆర్నెల్లయింది కనక గబగబ (నావేగంలోనే) పూర్తి చేయాలని తలపెట్టేను. నేను మొదలు పెట్టకముందు ఎదురు చూసింది నారాయణభట్టు కవిత్వ ప్రశస్తి ఇక్కడ చూడగలనని. దాదాపు పాతిక పేజీలు అయింతరవాత ఈ నవలలో నారాయణభట్టు రాజనీతివైదుష్యానికే ఎక్కువ ప్రాధాన్యత అని అర్థమయింది. నిజానికి శాస్త్రిగారు రుద్రమదేవిలో కూడా కవి తిక్కనని రాజనీతి దురంధరుడిగానే ఎక్కువగా చూపించేరు. నాకెందుకో అక్కడ బాగుందనిపించింది కానీ నారాయణభట్టులో ఆయన కవిత్వప్రశస్తి చాలినంతగా లేదు. ఉన్నచోట పద్యాలు నాకు అర్థం కాలేదు. ప్చ్.
కవి సార్వభౌముడు పూర్తిగా చదివేను కానీ రచయిత పూర్తి చేయలేదనిపించింది. అంటే నేను ఎదురు చూసినంతగా కథ లేదని. శ్రీనాథుడు అష్టైశ్వర్యాలూ, అష్టదరిద్ర్యాలూ కూడా అనుభవించినట్టు చెప్పుకుంటారు. ఆవిధంగా చూస్తే ఆయనజీవితంలో చాలా నాటకీయత ఉంది. రుద్రమదేవిజీవితంలాగే. ఈ నవల కూడా ఆస్థాయిలో ఉంటుందనుకున్నాను. నరసింహశాస్త్రిగారు శ్రీనాథుని జైత్రయాత్ర, అందులోనూ గౌడ డింఢిమభట్టు కంచుఢక్క పగులగొట్టడమే ఎంతో వివరంగా చిత్రించేరు. ఆయన ఇతర నవలలలోగే ఇందులో కూడా అస్త్రశస్త్రాలలో కవిగారి అనన్యసామాన్యమైన కౌశలం చూస్తాం. పోతే, పద్యాలూ, శ్లోకాలూ మాటకొస్తే, మామూలే – నాకు అర్థం అయినవాటికన్నా కానివే ఎక్కువ. ఇంకా నాకు కొత్తగా అనిపించిన ఒకటి, రెండు విషయాలు – మొదటిది పోతనని చిన్నకుర్రవాడిగా చిత్రించడం. కుల్లాయుంచితి, కోక చుట్టితి, … అన్న పద్యం ఆయనచివరి రోజుల్లో చెప్పింది అనుకున్నాను. ఈ నవలలో శ్రీనాథుడు జైత్రయాత్ర సందర్భంలో ఒక ఊళ్ళో గృహస్తుని నొప్పించలేక, తన ఆచారాలకి ప్రతిబంధకమయినా తిలపిష్టమూ, వెల్లుల్లితో తిన్నట్టు ఉంది. ఇవి ఎందుకు రాస్తున్నానంటే, నరసింహశాస్త్రిగారు తాను చారిత్రకనవలలు రాస్తున్నప్పుడు విస్తృతంగా పరిశోధన చేసి చారిత్రకసత్యాలను సేకరించి నవలలో పొందుపరిచేననీ, తాను కనుగొన్న విషయాలు రిసెర్చి స్కాలర్లు వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనీ రాసేరు తమ సాహిత్యవ్యాసాలు అన్న పుస్తకంలో. నాకెందుకో ఈ నవలలో చారిత్య్రక సత్యాలకంటే శాస్త్రిగారి కల్పనాచాతుర్యమే ఎక్కువగా కనిపించింది.
కొన్ని వ్యాసాలు చదువుతుంటే, వ్యాసకర్తలు చర్చించే పుస్తకాలే కాక, విమర్శ పద్ధతులు, సిద్ధాంతసాహిత్యంలాటి విషయాలలో కూడా ప్రవేశం కలుగుతుంది. అలాటి విమర్శకులు రా.రా., శేషేంద్రశర్మగారలు.
రాచమల్లు రామచంద్రారెడ్డిగారి సారస్వతవివేచనలో వ్యాసాలు మూడు చదివిన తరవాత (కొల్లాయి గట్టితేనేమి, విమర్శ, ఆర్. యస్. సుదర్శనంగారి సాహిత్య దృక్పథాలు మీద వ్యాసం) మిగతా వ్యాసాలు ఆ మూలగ్రంథాలు చదివితే గానీ ఈవ్యాసాలు అర్థం కావు అనిపించింది.
గుంటూరు శేషేంద్రశర్మగారి వ్యాసావళిలో వ్యాసాలు కూడా మరీ విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నాయి. ఇది చదివితే రసం, ధ్వని, సాహిత్యవిలువలు, సాహిత్యప్రయోజనం వంటి సైద్దాంతికవిషయాలు చాలా తెలుస్తాయి, అవి తెలుసుకోడం నాకు ఇష్టం కూడా. కానీ, ప్రస్తుతం అవి కొరుకుడు పడే స్థాయిలో నా బుద్ధి పని చేయడం లేదు. అంచేత ఈ రెండు పుస్తకాలూ పక్కన పెట్టేసేను.
ఇప్పటికి ఇంతే.
(డిసెంబరు 23, 2011)
లలితగారూ, మీ మూడో పాయింటు అంగీకరిస్తానండి. నేను స్పష్టంగా చెప్పలేదు. ధన్యవాదాలు.
“రచయిత ఎలా చెప్పేడు అన్నది ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎలా చెప్పేడు అన్నదానిమీదే మనం మళ్లీ మళ్ళీ “చదవగలగడం” అన్న గుణం ఆధారపడి ఉంటుంది.” – ditto
“చదువుతుంటే, ఓ మాటో ఓ ఆలోచనో తగిలి నన్ను ముందుకి పోనివ్వకుండా ఆపేస్తుంది. ఆ మాటో ఆ ఆలోచనో నన్ను ఆదిక్కుగా లాక్కుపోతుంది. వాటికి బ్రేకులేసి, మళ్ళీ చేతిలో ఉన్న పుస్తకంలో పేజీమీదికి రావడానికి కొంత టైము పడుతుంది. అంచేతన్నమాట ఒక పుస్తకం పూర్తి చెయ్యడానికి నాకు చాలాకాలం పడుతుంది. అయితే నన్ను అలా ఆలోచింపజేయడం కూడా ఆ పుస్తకం సాధించిన ప్రయోజనమే కనుక అది దాన్ని సుగుణంగానే స్వీకరించాలి.” – ditto
“నిజానికి ఎవరికైనా ఇలాటిప్రశ్నలు వస్తే ఎవరికి వారే జవాబులు చెప్పుకోవాలి కానీ వేరేవారికథల్లో దొరకవేమో అనిపిస్తుంది ” – ఇంకొకరి ఆలోచనలను తెలుసుకోవడం మన ఆలోచనలకి ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. చదివించే గుణం ఉంటే నేను ఆ ఆలోచనలతో నేను ఏకీభవించకపోయినా చదవడం నాకిష్టమే. ఒప్పుకోకపోయినా, ఒప్పుకున్నా, ఎందుకు ఒప్పుకుంటున్నాము లేదా ఎందుకు ఒప్పుకోవట్లేదు అని మనసులోనో స్నేహితులతోనో చర్చించుకోవడం వల్ల మన ఆలోచన పెర్గుతుందనిపిస్తుంది నాకు. ఆలోచనలు ఇంకొకరివే ఐనా మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి వీలౌతుంది అనిపిస్తుంది.
@ ఉదయరాణి, శివప్రసాదుగారి నవలలగురించి విన్నాను కానీ చూడలేదండీ. అవును, కొన్ని పుస్తకాలు పట్టుకుంటే అవి మనని పట్టుకుని వదలవు.
.
మీరు లేఖిని ఉపయోగించి చూసారా. ఇక్కడలాగే, ఇంగ్లీషులో టైపు చేస్తే, తెలుగులో కనిపిస్తుంది. చిన్న చిన్న మార్పులు ఉన్నాయి కానీ పక్కనే కీబోర్డు ఉంటుంది.
శుభాకాంక్షలతో
మాలతి
chala mandiki books patla feeling elage vuntundemo——-
okkasari chadavatamu modalu pettagane vadileyyataniki manassu oppukokapote nenu maremu danni vadalanu
konni books entaga cadavalani teesukunna
edo exams ku povataniki balavanthnga cadivinatlu anipiste—–
mudigonda sivaprasad gari books (meeru historical-rudramadevi-chepparu)kuda chala baguntuntayi