|
రెండు మాటలు -
ఈ కథ 1959లో రాసేను.
గతవారం జానుతెనుగు.బ్లాగ్‌స్పాట్.కాం లో మాగంటి వంశీమోహన్‌గారు పాత తెలుగు స్వతంత్రలు తిరగేస్తుంటే నా గల్పిక ఒకటి కనిపించిందని నాకు చెప్పి ప్రచురించేరు. తరవాత మరో గల్పిక చూసి, అది కూడా నాకు పంపించేరు. దానిమీద వారిఅభిప్రాయాలు నిర్మొహమాటంగా రాయమని చెప్పేను. ఒకేకాలంలో రాసినా మిగతా గల్పికలు ఒక మెట్టు పైనున్నాయనీ, “దీనికి కొద్దిగా మినహాయింపు ఇచ్చి పత్రికలో ప్రచురించారేమో అనిపించింది” అన్నారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను.
ఆ సందర్భంలోనే ఆనాటి సాహిత్యచరిత్ర కొంచెం స్పృశించాలనిపించి ఈ రెండు మాటలు. ఎందుకంటే ఆ గల్పిక తరవాత ఐదేళ్ళకి రాసిన ఈ కథలో కూడా పరిపక్వత తక్కువే. ఇది ఏదో పత్రికకి పంపినట్టు నా రాతప్రతిమీద కనిపిస్తోంది కానీ ప్రచురించిన జాడల్లేవు.
ఇంతకీ నేను చెప్పదల్చుకున్నది, యాభై, అరవై దశకాల్లో స్త్రీలరచనలకి పత్రికలు చాలా ప్రోత్సాహం ఇచ్చేయి. వాళ్ళు రాస్తే చాలు వేసుకుంటాం అంటూ చాలా పత్రికలు ఉత్సాహం చూపించేయి. సంపాదకులు రచయిత్రులఇళ్ళకి వెళ్ళి రాయండి, రాయండి అని ప్రోత్సహించేరు. (నావిషయంలో కాదులెండి. ఇతర ప్రముఖ రచయిత్రులమాట నేను చెప్తున్నది.) కొందరు వాళ్ళే రాసి చెల్లెళ్ల, భార్యలపేర్లమీద ప్రచురించేరు. అనాటి సాహితీక్షేత్రం అలాటిది. అంచేత ఈనాడు “ఏముంది ఇందులో” అనిపించే కథలు ఆనాడు తేలిగ్గానే ప్రచురింపబడ్డాయి. (అందుకే కొందరు మగవారు స్త్రీల పేర్లు పెట్టుకుని రాసేరు కూడాను.)
రెండోది – ఈ కథలో చదువుకున్న సరస్వతి ఎందుకు ఉద్యోగం చేయడానికి అంగీకరించదు అన్నది. స్త్రీవిద్య ప్రారంభదశలో స్త్రీలని చదువుకోమని ప్రోత్సహించడానికి కారణం వారిని ఉత్తమయిల్లాళ్ళగానూ, ఉత్తమతల్లులుగానూ తీర్చి దిద్దడానికి మాత్రమే. ఆ తరవాతికాలంలో ఇంగ్లీషు చదువులూ, డిగ్రీలతోపాటు చదువుకీ డబ్బుకీ లంకె, డబ్బుకీ సుఖాలకీ లంకె పెట్టడంతో చదువుకి ప్రయోజనం మారిపోయింది. చదువుకున్న ఆడపిల్లలు సంపాదనలు మొదలు పెట్టేరు. తద్వారా వచ్చే ఆదాయానికి స్త్రీల ఆర్థికస్వాతంత్ర్యం అని పేరు కూడా పెట్టేరు. నిజానికి అది స్వాతంత్ర్యం కాలేదు. పెళ్ళికి ముందు పుట్టింటివారికీ, పెళ్ళి తరవాత అత్తింటివారికీ, “వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు తోడుగా” మాత్రమే ఉపయోగపడ్డాయి వాళ్ళ సంపాదనలు. అలాటి పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి స్త్రీ ఉద్యోగం చేసి తీరాలన్న నిబంధనకి ప్రతిఘటనగా ఈ కథ రాసేను. నా అభిప్రాయం ఉద్యోగం చెయ్యడమా, మానడమా అన్నవిషయంలో కూడా స్త్రీకి స్వాతంత్ర్యం ఉండాలని.
కథలో ఈఅంశం అంత బాగా స్పష్టం కాలేదేమో. మీరే చదివి చెప్పగలరని ఆశిస్తున్నాను.
ఇప్పుడు అసలు కథ!
“ఇదుగో, ఓవిడా!” అన్నాడు శ్రీహరి హుషారుగా పడకగదిలోంచి వంటింట్లో ఉన్న సరస్వతితో.
ఓవిడా అనబడిన ఆవిడ వింది. విననట్టు ఊరుకుంది.
“Good morning, darling. ఆ tooth brush, ఓ చెంబు నీళ్ళూ నామొహాన పారేస్తే, నానెత్తిన పాలవాన పడ్డట్టే,” అన్నాడు శ్రీహరి మళ్ళీ. ఆశ ఆరిపోతూంది. ఆయనగారి ఉత్సాహం ఉషోకాంతులు విరజిమ్మి తెల్లగా చల్లారిపోయింది. అతను భగ్గుమనేట్టు ఉన్నాడు.
సరిగ్గా సమయానికి సరస్వతి “ఉదకమండలం” మొదలైన వస్తుసామగ్రితో సాక్షాత్కరించింది.
శ్రీముఖం చదవడానికి సిద్ధంగా ఉన్న శ్రీహరి ముఖశ్రీ సద్యోవికసితప్రసూనమయింది క్షణంలో. తొలకరి చినుకుల్లా చిరునవ్వులు చిలకరించేడు. “వచ్చావా?” అని పలకరించేడు తొలిసారి నవవధువుని చూసినట్టు.
సరస్వతి కాస్త తొణికి, సిగ్గుతో మొగ్గయి, ఒకడుగు వెనక్కి వేసి అలా అలా వంటింటిలోకి అదృశ్యమయిపోయింది.
రసభంగమయింది అనుకున్నాడు శ్రీహరి. “చదువుకుంది అన్నమాటే గానీ …” అనుకుంటూ bathroomలోకి దారి తీసేడు నిస్పృహగా.
సరస్వతి వంటింట్లో filter decoction తీస్తోంది. నాలుగున్నర నిముషాలయేయి.
“యేయ్,” “ఛీ,” “థూత్” వంటి రకరకాల శబ్దాలు bathroomలోంచి వినిపించడం, వెండి మరచెంబు ధన్‌మని కింద పడి ఓ గజం దూరం దొర్లడంతో అక్కడ త్రిపురసంహారం పూర్తయింది.
సరస్వతి మనసులో శ్రీహరీ అనుకుంది.
శ్రీహరి వంటింటిదరవాజా రెండు చేతుల్తో పట్టుకుని, గుమ్మానికి అవతల నిలబడి ఇవతలకి వంగి రహస్యం చెప్తున్నట్టు అన్నాడు, “నిజంగా స్త్రీజాతికి రత్నమాణిక్యంలాటిదానివి సరస్వతీ! మొండితనం నీ సొంత సొమ్ము. మచ్చుముక్కలాటి మనిషివి సుమా.”
తను మంచినీళ్ళనుకుని ఉప్పునీళ్ళు ఇచ్చింది అని ఆ మాటలకి తెలుగు అర్థం. స్నానాలకీ, వాడుకకీ బిందెకి 3 రూ.ల చొప్పున కొళాయినీళ్లు తెప్పించలేదని తాత్పర్యం.
సరస్వతి చేతిలో పని ఆపి, ఆయనకి మరో చెంబుతో నీళ్ళు ఇచ్చింది. ముత్యాలు రాల్చవలసిన నోరు సీలు వేసిన రిజిస్టర్డు కవరులా ఉండిపోయింది. ఇహ రెండు పట్టుకార్లు ఉపయోగించినా ఆ రెండు పెదిమలూ విడివడవు.
“హుమ్,” అన్నాడు శ్రీహరి. అక్కడికి దక్షయజ్ఞం పూర్తి కాలేదేమో ఓ రెండు గిన్నెలు కాళ్ళకి అడ్డం లేకపోయినా తన్నేసి, మధ్యగదిలో కుర్చీలో ముడుచుక్కూచున్నాడు సినిమాలో గయ్యాళి హీరోయిన్లా.
పది నిముషాలు ఖర్చు చేసుకుని, మొహమ్మీద కోపం తువాలుతో తుడుచుకుని, “సరసూ,” అన్నాడు తీయగా మందరంలో మొదలు పెట్టి మధ్యమానికి తీసుకెళ్ళి మందరంలోకి దించుతూ.
“వస్తున్నా,” అంది సరస్వతి వంటింట్లోంచే.
శ్రీహరి అదే పేరు అదే రాగంలో మరోమారు పిలిచి కులాసాగా వెనక్కి వాలి వీధిలోకి చూస్తున్నాడు.
“ఏమిటో,” అంది సరస్వతి కాఫీ, టిఫినూ బల్లమీద పెట్టి.
“రోదసిలో హరివిల్లులు రెండూ,” అన్నాడు కాళిదాసుకి రెండోకూర్పూ, ఆరుద్రకి ఏకలవ్యునివంటివాడూ అయిన శ్రీహరి.
“రెండు కనులలో ఒక మల్లిచెండూ,” అంది సరస్వతి కనుబొమ్మలు ఎత్తి యథాస్థానానికి దించుతూ. కవితాదేవి ఇలా ఖూనీ అయిపోతున్నందుకు, నవ్వితే బాగుండదని సరస్వతి గంభీరంగా నిలబడింది.
“దా, కూచో,” అన్నాడు అతను ముద్దులు కురుస్తూ. ఫలానా సినిమాలో ఫలానా హీరో ఇలాటి సందర్భమే తగిలిన సీను గుర్తొచ్చింది అతనికి. చటుక్కున చొక్కా గుండీలు తీసేసి, జుట్టు కాస్త ముందుకి లాక్కున్నాడు.
ఎదురుగా నించున్న హీరోయిను ఆ చిత్రరాజం చూడకపోవడంచేత అతగాడివాలకం ఆమెకి అర్థం కాలేదు. అంచేత ఆమె అక్కడికి ఆ సీనుకి కట్ చెప్పి, మరో చిత్రంలోని మరో సీను అందుకుంది. “ఏమిటో చెప్పండి. అవతల కూర పొయ్యిమీద పెట్టి వచ్చేను,” అంది danger signal ఇస్తూ.
“ప్రత్యేకించి చెప్పడానికేముంటాయి,” అన్నాడు శ్రీహరి నీరసంగా.
“అయితే వెళ్తున్నా,” అని బెదిరించింది సరస్వతి, ఆయన మాటాడదల్చుకున్నవిషయం ఊహించేసుకుని.
కానీ శ్రీహరి అనదల్చుకున్నది కాస్తా ఆనేశాడు, “అందుకే వంటమనిషిని పెట్టమన్నాను.”
సరస్వతి ధ్వజస్తంభంలా నిలబడింది.
అతనిఅభిప్రాయం వంటమనిషి తనకన్నా బాగా చేస్తుందని కాదు. “ఒకమాట చెప్తా వింటావా?” అన్నాడు శ్రీ.
వినితీరాలి అని ఇద్దరికీ తెలుసు.
అతను తత్వబోధ చెయ్యబోతున్నట్టు ఒకసారి నిట్టూర్చి, “అటు చూడు ఎల్లమ్మ ఏడోబిందె కొళాయినీళ్ళు పట్టుకెళ్తోంది. నాకు తెలుసులే నువ్వేం చెప్తావో. అది వాడుకునేవి అన్నీ మంచినీళ్ళే. మనకో? కొంపలో ఉప్పునీళ్ళబావి ఒకటి ఏడుస్తోంది నాప్రాణానికి. మంచినీళ్ళు బిందె 3 రూ.లు, తెప్పిస్తే బోలెడు ఖర్చవుతుంది అంటావు. ఖర్చు లేకుండా బతుకు ఎలా సాగుతుంది?” అని ప్రశ్నించేడు.
సరస్వతి మాటాడలేదు.
శ్రీహరి రెండోసారి నిట్టూర్చి తమ మూడేళ్ళ దాంపత్యజీవితం సంగ్రహంగా – పెళ్ళయిన కొత్తలో “చదివిన చదువు వృథా పోవడమెందుకు? ఉద్యోగం చెయ్యరాదూ?” అని చూచాయగా చెప్పేవాడు. సరస్వతి తేలిగ్గా నవ్వేసేది. ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది, దిలాసాలు చెయ్యొచ్చు దర్జాగా అని శ్రీహరి అభిప్రాయం. చదువుకి సార్థకత ఉద్యోగమేనా అని సరస్వతిప్రశ్న. శ్రీహరి కొన్నాళ్ళూరుకున్నాడు. తరవాత బతిమాలేడు. “పోనిద్దురూ,” అంది సరస్వతి. అతను కోప్పడ్డాడు. ఆమె మౌనం ధరించింది. అతని సర్కస్ ఫీట్లూ, స్టంట్లూ ఎదుర్కొనడానికి తోడ్పడింది ఆమె విద్య.
తనని అర్థం చేసుకోలేదు అనుకున్నాడతను.
తనని అర్థం చేసుకోలేదు అనుకుందామె.
నిజానికి మొదట్లో శ్రీహరికీ అంతగా అవుసరం అనిపించలేదు. ఎటొచ్చీ మొదటివాడు పుట్టేక బాంక్ ఎకౌంటు ఆలోచన అతడికి విడాకులిచ్చి వెడిపోయింది. రెండోఏడు రెండోవాడు పుట్టేక ఇంట్లో రుసరుసలు బయల్దేరేయి. ఆఖరికి శ్రీ దెప్పిపొడవడం మొదలెట్టేడు. “ఏం చేస్తాను, నాఖర్మ. ఎలాగోలా ఆ డబ్బు తెచ్చి తగలేస్తాను. లేదని నామొహమ్మీద అనకు,” అన్నాడు.
సరస్వతికి కళ్ళనీళ్ళపర్యంతమయింది. తను వినయంగా ఊరుకుంటే ఈయన ఎందుకింత రెచ్చగొడుతున్నారో అర్థం కాకుండా ఉంది. రోజుకి 24 గంటలు తనని దులపరిస్తూ, తన చదువుని ఎత్తిపెడుతూ ఆడజాతిని ఆడిపోసుకుంటూ ఉంటారేం ఈయన? సమానత్వాన్ని ప్రతిపాదిస్తూ తను భర్తని గౌరవించడంలేదని నేరం ఆరోపిస్తారేం? చదువుకి సార్థక్యం ఉద్యోగమే కాదని తను చెప్తే వినరేం? చదువుకోనివారిలా ప్రతివిషయానికి తను తిరగబడి దెబ్బలాడలేదే! నిజానికి తను ఏనాడూ ఏకాదశి చెయ్యవలసిన అవుసరం కలగలేదు. సినిమాకి వెళ్ళడానికి డబ్బుల్లేవు అనుకోవలసిన అవుసరం కలగలేదు. కానీ సరస్వతి పనిమనిషికి అనవసరంగా 10 రూ.లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ప్రతీ చిన్నపనీ ఇంకోళ్ళు చెయ్యాలి అనుకోలేదు. మహారాజుల్లా పెద్ద దాసదాసీగణాన్ని పెట్టుకుని తనేం చెయ్యాలి గోళ్ళు గిల్లుకుంటూ కూచోడం తప్ప. వాళ్ళని పోషించడానికి డబ్బు కావాలి. ఆ డబ్బుకోసం తను ఉద్యోగం చెయ్యాలి. తను కష్టపడి ఉద్యోగం చేసి ఎవరో తనకి కానివాళ్ళకి పెట్టాలి? చిత్రం కాదూ? పోగా, ఉద్యోగాల్లో ఉండే కష్టనిష్ఠూరాలు ఉద్యోగాల్లోనూ ఉంటాయి. ఒక్కొక్క ఆఫీసులో ఎంతమంది బాస్‌లు! మేనేజరు, ప్రప్రొయిటరు, హెడ్ గుమాస్తా, గేటుదగ్గర జవాను … అందరూ. పోనీ అందరూ ఒక్కలాగే ఉండరనుకుందాం. అయినా ఏమో … సరస్వతికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
ఆరోజు రాత్రి శ్రీ మళ్లీ మొదలెట్టేడు ఒకటోరకం కార్యసాధకుడిలా. “ఇంతకీ నీకిలా వండిపెట్టాలని మాత్రమే ఉంటే ఎవరింట్లో వండి పెడితే కాదు. ఈమాత్రందానికి నన్ను పెళ్ళి చేసుకోడం ఎందుకు?” అన్నాడు.
సరస్వతికి మొహమ్మీద కొట్టినట్టయింది. ఆయన ఏంమాటాడుతున్నారో ఆయనకే తెలీదు అనుకుంది. దుఃఖం పొంగి పొంగి వస్తుంటే పక్కగదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. అలా ఆలోచిస్తే శ్రీ మటుకు తనని పెళ్ళి చేసుకోకపోతే అతను అనుకున్నంత దర్జాగానూ ఆ వస్తున్నజీతంతో గడపవచ్చుగా.
సరస్వతి వెనక్కి తిరగ్గానే శ్రీ నాలుక్కరుచుకున్నాడు. ఎంత మూర్ఖుణ్ణి అనుకున్నాడు. విద్యావిహీనుడు మాటాడినంత అసహ్యంగా మాటాడినట్టు గ్రహించుకున్నాడు.
ఆరాత్రి సరస్వతి గదితలుపులు తియ్యలేదు.
శ్రీహరి పిలవలేదు.
మర్నాడుపొద్దున్న శ్రీ లేచేసరికి ఇంటినిండా మంచినీళ్ళు కనిపించేయి. గన్నెలు తెల్లగా తోమి ఉన్నాయి. బట్టలు ఆరేసి ఉన్నాయి.
“తెల్లారకముందే ఇవన్నీ చేసేశావా?” అన్నాడు శ్రీహరి భయంభయంగా చూస్తూ.
“ఎల్లమ్మ నాలుగైదు ఇళ్ళల్లో చెయ్యాలని తెల్లారకముందే వచ్చి చేసి పోయింది,” అంది సరస్వతి తలొంచుకుని.
శ్రీ మళ్ళీ మాటాడలేదు.
క్రమంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇంట్లో పన్లు ఏదో అదృశ్యహస్తం చేస్తున్నట్టుగా ఉంది. ఎవరో మంచినీళ్లు పోసేఆవిడ వచ్చి రోజూ ఎనిమిదిలోపున వండిపెట్టి వెళ్ళి పోతూంది. ఆవిడకి అన్నీ అందివ్వడం సరస్వతి డ్యూటీ.
శ్రీకి ఇవన్నీ చూసేసరికి వణుకు పుట్టుకొచ్చింది. నెల తిరిగేసరికి వీళ్లందరికీ జీతాలిచ్చుకోవద్దూ? కానీ సరస్వతి ఉద్యోగం చేస్తానని ఎందుకనడం లేదో అర్థం కాలేదు. తనే ఈవిషయం ఎత్తడానికి ధైర్యం చాల్లేదు.
శ్రీ ప్రైవేట్లు ఒప్పుకున్నాడు. రాత్రి 8 గం. అవుతోంది వచ్చేసరికి.
000
వంట మళ్ళీ మామూలు రుచికి వచ్చింది. అతనికి అంతా అయోమయంగా ఉంది.
నెల తిరిగింది. “ఈనెల ఎంత ఖర్చయింది?” అని ప్రశ్నించేడు అతను.
ఆమె ఒక కాయితం అతనికి అందించి తలుపుచాటుకి వెళ్ళిపోయింది.
శ్రీకి నోట మాట రాలేదు. ప్రతి నెలాకన్నా 65 ఎక్కువ ఖర్చయింది. నెల రోజుల్లో తామిద్దరూ 15 రూ.లు ఖర్చు పెట్టేరు. రిక్షాలకి 13 అయేయి. తను కూడబెట్టగలిగింది 50 రూ.లు. శ్రీ నిలబడలేక కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పటికింకా తను ఖరీదయిన బట్టలు కొననేలేదు.
ఇంతలో సరస్వతి మరో కాయితం తెచ్చి ఇచ్చింది.
శ్రీ మొహం మిఠాయిపొట్లం చూసినట్టు వికసించింది. సరస్వతి ఇందాకా వేసిన బిల్లు అయివుండవలసిన ఖర్చు, అయిన ఖర్చు కాదు. తను స్వయంగా అన్ని పన్లు చెయ్యడంవల్ల 30 రూపాయలు మిగిల్చింది. జమ రాసేయవచ్చు. ఆయన ఆఫీసుకి వెళ్లినప్పుడు హిందీ ట్యూషను చెప్పి 10 రూ. తెస్తోంది. పొద్దున్న ఆయనకి కనిపించడానికి మాత్రమే నిర్ణయించిన వంటమనిషికి 10 మాత్రం ఆయనే ఇచ్చుకోవాలి.
“సరస్వతీ,” అన్నాడు ఆనందంతో కేరింతలు కొడుతూ. “నువ్వు నాదేవతవి. ఈ 50 నువ్వే తీసుకో,” అన్నాడు.
“వంటమనిషిని మానిపించేయండి,” అంది సరస్వతి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ.
“మానిపించేయ్. నెలరోజుల్లో మాటాడుకోడానికేనా తీరిక లేకపోయింది,” అన్నాడు శ్రీహరి హాయిగా ఊపిరి పీలుస్తూ.
000
(సెప్టెంబరు 1959)
@ స్ఫురిత, నేను ముందే చెప్పి ఉండకూడదు. కానీ కథాంశం గట్టిదే అయినా చెప్పేతీరు అంత బాగా లేదని నాకే అనిపించడంచేత అలా రాసేను. మీరు తప్పకుండా రాయండి. చాలామంది దృష్టిలో ఇది తిరోగమనవాదమే. కాదని నిరూపించే బాధ్యత మనమీదుంది మరి. :p
మీరు ముందే చెప్పెయ్యడం వల్లేమో ఈ కధ వుద్దేశం కధలో కనపడలేదేమో అన్న అనుమానం రాలేదు. ఈ విషయం మీదే కధో, వ్యాసమో రాయాలని ప్రయత్నించి చాలా కాగితాలు ఖరాబు చేశాను ఇప్పటికి. 1959 లోనే మీకీ ప్రతిఘటన అవసరమనిపించిందంటే మీది చాలా ముందు చూపు…:)
@ లలితగారూ, మీరు సరదాగా చదివేశారంటే నాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
మాలతి గారూ,
కథ నేనైతే సరదాగా చివరి దాకా చదివేశాను. మీ పరిచయ వాక్యాలూ, కథ గురించిన అభిప్రాయాలూ పక్కన పెట్టి కథ వినోదాత్మకంగా ఉందన్నది నా ముందు మాట. ఇంకొంచెం ఇంకోసారి.
@ లలితగారూ, కథమీద కూడా మీ అభిప్రాయానికి ఎదురు చూస్తూ, ధన్యవాదాలు.
@సి.వి.ఆర్. మోహన్ గారూ, ప్యూచరిస్టిక్ ఏముందండీ, మూడు తరాలు గడిచినా ఆలోచనలు అలాగే ఉంటే. మీ వ్యాఖ్యకి, శుభాకాంక్షలకి ధన్యవాదాలు.
wish a happy new year
చదువుకున్న భార్య ఉద్యోగం చెయ్యడానికే కావాలనుకొనే వాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో, 1959 లోనే futuristic గా వ్రాసారు, థాంక్స్.
Wow! This is a topic close to my heart. I am yet to read the story. I am reacting after reading the introduction itself in which you stated the point so clearly which I have been trying to express in so many ways. Will comment again after reading the story. I think the issue is still relevant, in fact more so today.