(ఎన్నెమ్మకతలు 89 )
ముందే చెప్పేస్తాను. తెల్లారి లేస్తూనే కొత్తపాళీగారి హాయి హాయి టపా హాయిగా చదివినతరవాతా, ఆ తరవాత వ్యాఖ్యలు చూసింతరవాతా నాకు వచ్చిన సందేహాలూ, ఆలోచనలూ ఇవి. అంచేత ఇది ఒక రకంగా ఆ హాయనే ఓ పిలిపు టపాకి అనధికార పొడిగింపు, సదరు రచయితకి కృతజ్ఞతలతో.
మనసంప్రదాయంలో హలోలూ పొలోలూ లేవు. మనకి పలకరింపంటే తిన్నగా కబుర్లలోకి దిగిపోడమే. ఏమండీ, ఏరా, ఏమిటోయ్, ఏమమ్మా, … ఎక్కడా కనిపించడంలేదు. ఊళ్ళో లేరేమిటి, లేవేమిటి, … ఇలా సాగిపోతాయి మనమాటలు. నమస్తే, నమస్కారం కూడా సంస్కృతమే అయినా ఆంగ్లసాంప్రదాయాలొచ్చేక, వాటికి దీటుగా పుట్టినవే కదా.
ఏరా, ఏమే, ఏఁవోయ్ లాటివి ఆ ఇద్దరిమధ్య సంబంధాలని తెలియజేస్తాయి. ఇద్దరూ సమవయస్కులయితేనో, ఒకరు రెండోవారికంటే చాలాపెద్దవారూ, ఏరా, ఏమే అన్నపిలుపులకి అర్హతగలవారూ అయితే అలా పిలుస్తారు. ఏమోయ్ అన్నది ఏరా కంటే ఓ మెట్టు పైన. అంటే ఏరా అనడానికి అర్హతలేనప్పుడు ఏమోయ్ అన్నది అంగీకారయోగ్యం. పైగా, ఏమోయ్ పదానికి లింగభేదం లేదు. అమ్మాయిలూ, అబ్బాయిలూ కూడా ఒకరినొకరు ఏమోయ్ అనుకుంటారు.
ఇంకా వీటిలో ప్రాంతీయ సంప్రదాయాలు కూడా ఉన్నాయిట. మా విశాపట్నంవాళ్ళం ఏరా, ఏమే, ఏమోయ్ అనుకోడం మామూలే ఇళ్ళల్లోనూ స్కూళ్ళలోనూ కూడా. తిరపతి ప్రాంతంలో ఏమోయ్ అంటే చాలా తప్పుట. నేను అక్కడకి వెళ్ళినకొత్తలో అంటే 1964లో విన్నాను. “ఏంటండీ, ఏమోయ్ అంటాడు నేనేం ఆయన బావమరిదినా?” అన్నాడు ఒకాయన నాతో. నాకు భలే ఆశ్చర్యం వేసింది మొత్తం వాక్యానికి. తప్పయితే సరే, ఆ వరసలేమిటో నాకర్థం కాలేదు.
ఇంతకీ ఈవరసలోనే నాకు పై ప్రశ్నకూడా తోచింది. అన్నట్టు పైప్రశ్నలో “రా” “ఏరా”లోది కాదు. “రండి” కి ఏకవచనంగా అడుగుతున్నాను. (అన్నట్టు “రండి” అని హిందుస్తానీవాళ్ళతో అనకండి.). మళ్ళీ ఆభాష వేరు.
కొన్నేళ్ళక్రితం నేను షికాగో వెళ్ళినప్పుడు ఒకాయన, “మేం చిత్తూరోళ్ళం. మాకీ అండి అయీ రాదు. మీరేం అనుకోమాకండి,” అన్నారు. అందుకు విపర్యయం – కొందరు ప్రతిమాటకీ అండీ చేరుస్తారు. “మరేనండీ, నేనండీ ఆయన్నండీ రమ్మన్నానండీ …” అంటూ.
ఇంతకీ, ఎవరిని నువ్వనొచ్చు, ఎవరిని మీరు అనాలి, ఎవరిపేరుకి తప్పనిసరిగా గారు తగిలించాలి, ఏ సందర్భాలలో గారు వదిలేయొచ్చు లాటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. పూర్వం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని నిక్షేపంగా నువ్వు అనేవారు. ఇంత చర్చ లేదు. వయసు తేడాలే ఎక్కువ లెక్కలోకి వచ్చినా, కొంతవరకూ సంఘంలో వారి స్థాయి కూడా కనిపించేదక్కడ. అయితే పాలేరులు అయ్యగారిని నువ్వు అనడం కూడా కద్దు. (చూ. విశ్వనాథ సత్యనారాయణగారి వీరవల్లడు.). ఇప్పుడు నాకంటే చిన్నవాళ్ళతో మాటాడితే, నాకు నువ్వు అనాలనిపిస్తే, అడుగుతాను మిమ్మల్ని నువ్వు అనొచ్చా అని. అలా అడుగుతున్నప్పుడు నాకు నవ్వొస్తుంది కూడా. మిమ్మల్ని గౌరవించవలెనా, అక్కరలేదా అని అడిగినట్టుంటుంది.
నిజానికి నువ్వంటే అగౌరవం కాదు మన సంప్రదాయంలో కానీ ఇప్పుడది చాలామందికి తెలీడంలేదు. చూశారా, తెలుగెంత పరిపుష్టమో. ఇంగ్లీషులో ఇన్ని శషభిషలు లేవు కదా.
(జనవరి 12, 2012)
Totally agree with you. Infact, you made it very clear with all the possible reasons. I, sometimes feel uncomfortable to address some persons ” meeru “. But after joining Eenadu I”ve got used to it.
madhuri.
@ లక్ష్మీ రాఘవ, అవునండీ, నిజమే. నువ్వన్పప్పటి ఆత్మీయతలే వేరు.
@ సి.వి.ఆర్ మోహన్, మందస్మితానికి ఏ హలోలూ, కరచాలనాలూ సరితూగవు. ఒంగి దణ్ణాలు పెట్టడం ఇద్దరి మధ్యగల వయోభేదం, సాంఘిక స్థాయిలని బట్టి కదా.
A bright smile, and a hand shake or folded hands with a slight bowing of the head , onseeing a welcome person is more communicative than any words in any language; smile has an universal appeal.
చిత్తూరు వాళ్ళం..నిజంగా మీలాగా అన్నీటి కి “అండి “అనం..అంతేకాదు చిన్నవాళ్ళ ని ” నువ్వు”అని స౦భోదిస్తేనే ఆనంద పడతాం ఒక లాటి ‘దగ్గరి తనం ‘ {closeness} feel అవుతాం . మరీ దగ్గర అనుకుంటే “రా’ అనడం ఇంకా బాగుంటుంది.
@ స్ఫురిత, నేను కూడా అదే అనుకుంటున్నాను, ఈసారి కనిపించినప్పుడు ఈ అమ్మాయి అనుమతి కోరాలని :p.
@ సౌమ్య, నాక్కూడా అదే ఆశ్చర్యం. తెలుగు సాహిత్యం చక్కగా చదువుకున్నవారు మనం మనభావాలు భిన్నంగా వ్యక్తం చేస్తాం. అంతేకానీ అది భాషలో లోపం కాదని గ్రహించలేదా అన్నది నాకర్థం కాదు.
పరిపుష్టమని మీరంటారు. దాన్నే అనాగరికం అంటారు కొందరు మరి
మీరు నన్ను “మీరు” అంటుంటే చాలా ఇబ్బంది పడుతూ వుంటా…ఈసారి మీతో మాట్లాడినప్పుడు చెబ్దామనుకున్నా…ఇప్పుడు సంద్ర్భం దొరికింది కదా అని చెప్పేస్తున్నా…:)