“నేనంటే మీతాతకి మహ ఇష్టంగా ఉండేది చిన్నప్పట్నుంచీ. వాళ్ళమ్మ ఏం చేసినా తప్పనిసరిగా నాకు తెచ్చి పెడుతుండేవాడు మొదట్లో. తరవాత్తరవాత వాళ్ళింట్లోనూ మాయింట్లోనూ కూడా ఎగతాళి చెయ్యడంతో రహస్యంగా వచ్చి ఎవరికీ కనిపించకుండా ఏ చెట్టు చాటునో పెట్టి పోతుండేవాడు. అందుకే పెళ్ళంటే నాకేం విశేషంగా అనిపించలేదు. ఏదో ఆరోజుల్లో ఆడుకునే అన్ని ఆటల్లోనూ అదో ఆట. చక్కగా ముస్తాబు చేసి అందరూ హడావుడీ చేస్తుంటే నాకయితే అదొక మహరాణీనయినట్టు అనిపించి మహ గొప్ప పడిపోయేను. ఆ పెళ్ళిమంత్రాలూ అవీ తమాషాగానే అనిపించింది. అయినా ఇప్పడు మాత్రం బాగా పెద్దవాళ్ళయిన తరవాత చేసే పెళ్ళిళ్ళలో కూడా ఎంతమందికి అర్థమవుతాయి అ బ్రాహ్మడు వల్లించే మంత్రాలు. ఏదో మమ అనమంటే మమ అనడం, చేతిలో అక్షింతలూ, నీళ్ళు తీసుకుని పళ్ళెంలోకి విడవమంటే, విడవడమే కానీ అంతకంటే ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది కనక.”
“మరి మీరు పదకొండేళ్ళకే అత్తారింటికి వెళ్ళిపోయేరా?”
“లేదు. పెళ్ళంటే చేసేస్తారు కానీ, పిల్లవాడి చదువయి, ఏదో ఉద్యోగంలో స్థిరపడేవరకూ పుట్టింట్లోనే ఉంటుంది. నేను కూడా స్కూలికి వెళ్ళేదాన్ని.”
“అసలు అంత చిన్నవయసులో ఎందుకు చేసేసేవారంటావు పెద్దమ్మా? పురాణాల్లో సీతా, రుక్మిణీ వాళ్ళందరి పెళ్ళిళ్ళూ అంత చిన్నతనంలో జరగలేదు కదా,” అనడిగింది అరవింద.
పెద్దక్క ఆలోచనలు కూడదీసుకుంటున్నట్టు నిదానంగా మొదలెట్టింది, “ఏమో, ఏ ఒక్క సంప్రదాయానికి గానీ ఏదో ఒక్క కారణమే ఉండదు. అనేక సంఘటనలూ, ఆలోచనలూ కలిసి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఒక అలవాటుగా, సంప్రదాయంగా ఏర్పడతాయనుకుంటాను. వేదాల్లో కూడా స్త్రీలు చాలావరకూ స్వయంప్రతిపత్తి కలిగి ఉన్నట్టే ఉంది. నేను విన్నది – ఎంత నిజమో నాకు తెలీదు కానీ – తురుష్కుల దండయాత్రకాలంలో వాళ్ళు పెళ్ళికాని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవారనీ, మనపిల్లల్ని వాళ్ళబారినుండి రక్షించుకోడానికి పెళ్ళిళ్ళు చేసేసేవారనీను. అది ఒక వంక కావచ్చు. నిజానికి మన హిందూ సాంప్రదాయంలో ప్రతివారికి ధర్మం అంటూ ఒక పద్ధతి ఉంది కదా. చదువూ (బ్రహ్మచర్యం), సంసారం (గృహస్థధర్మం), వైరాగ్యం (వానప్రస్థం), సన్యాసం – ఇలా. అంచేత ఆవరసలో మన నిత్యవ్యవహారంలో కర్మకాండలు కూడా ఉంటాయి. అంటే ఒకటి తరవాత ఒకటి చేసుకుంటూ పోవడం. పిల్లలు చదువులలో ములిగి ఉన్నప్పుడు పెద్దలు తరవాతి ఆశ్రమంగురించి ఆలోచిస్తూ చేసేస్తే ఒక పని అయిపోతుందన్నట్టు చేసేసేరేమో.”
లీల అయోమయంగా చూసింది. “మీరు నిజంగా అంటున్నారా, హాస్యానికంటున్నారా?”
పెద్దక్క నవ్వుతూ, “నాకూ తెలీదు. ఊహిస్తున్నానంతే. మన కుటుంబాలూ, సమాజరీతులూ ఆలోచించి చూడు. ఉన్న ఊళ్ళో ఉండడం, కలిగినదానితో సంతృప్తి పడి బతకడం మనకి అనూచానంగా వస్తున్న ఆచారం. చెన్నపట్నం వెళ్ళినా దేశం వదిలివెళ్ళిపోయినట్టే. డబ్బు సంపాదించడానికి ఏ రంగూనో, బర్మావో వెళ్తే దేశాలట్టుకు పోయేడు ఊళ్ళో జరక్క అని జాలి పడేవాళ్ళు అప్పట్లో. మన ప్రపంచం చిన్నది. మన చుట్టూ ఉన్న మనుషులే మనకి మనలోకం. అంచేత సుమారుగా పిల్లలు గల తల్లులూ, తండ్రులూ ఏయిద్దరు పిల్లలు కనిపించినప్పుడల్లా వీడికిచ్చి దీన్ని ముడి పెట్టేస్తే బాగుంటుందని అనుకుంటే ఆశ్చర్యం లేదు. పైగా పెద్దలు ఏం చూస్తారు పెళ్ళికి చేసేముందు? అవతలవారి ఆస్తిపాస్తులూ, అంతస్తూ, సంఘంలో వారి స్థాయి – ఇవన్నీ ఎందుకు? పిల్ల సుఖపడుతుందనే కదా. పైగా ఇలా పరిచయం ఉన్న కుటుంబాలే అయితే మళ్ళీ తగువులు వచ్చినా ఆ పెద్దలే కలగజేసుకుని ఇద్దర్నీ చీవాట్లు పెట్టి ఓ దారికి తెస్తారు. అదొక సేఫ్టీ నెట్. అలాగే ఆ పిల్లలు కూడా ఈ మనిషితోనే నా ముందు బతుకంతా అని మనసారా నమ్మి, తదనుగుణంగా తమ ఆలోచనలూ, అభిప్రాయాలూ తీరిచి దిద్దుకుంటారు. తగువులొస్తే పెద్దలున్నారని నిశ్చింతగా ఉంటారు.”
“అలా అనుకుంటే బాల్యవివాహాలే నయమేమో! పిల్లలు పెద్దవాళ్ళయినకొద్దీ వాళ్ళ అభిప్రాయాలు స్థిరపడిపోయి, రెండోవారికనుగుణంగా మార్చుకోడం కష్టమవుతుంది,” అంది లీల.
“నేనంటున్నది అది కాదు. ఇప్పుడు పెద్దయేక, ఒకరినొకరు చూసుకుని, ఒకరితో ఒకరు మాటాడుకుని, ఆహా మనం hand in gloveలా, ఒకే ఆపిలు రెండు ముక్కల్లా, ఒకరికొకరం సమఉజ్జీలం అని నిర్ణయాలు చేసుకుని మరీ పెళ్ళి చేసుకున్నవాళ్ళు కూడా విడిపోతున్నారు. ఈదేశంలో అరేంజిడు మేరేజీలు కాకపోయినా, కలిసున్నవారిశాతం కంటే విడిపోతున్నవారి శాతమే ఎక్కువ అంటే లోపం మరెక్కడో ఉన్నట్టే కదా,” అంది పెద్దక్క.
ఇంతవరకూ ఊరుకున్నాను కానీ ఇంక ఊరుకోలేకపోయేను. “మీరే చెప్పినట్టు ఏ ఒక్క సంఘటనకైనా అనేక కారణాలు. అందులో ఒకటి అసలు ఈనాటి మనుషుల attitudeలో వచ్చిన మార్పు అనుకుంటాను. ఇదివరకు ఎదటివారి సౌఖ్యం చూడాలని మనం నేర్చుకున్న పాఠం. ఇప్పుడు ’నేనూ, నాసౌఖ్యం’ అన్నదే తిరుమంత్రం. మిగతా ఆలోచనలూ, అభిప్రాయాలూ, ప్రవర్తనలూ అన్నీ ఆ మంత్రాన్ని ఆసరా చేసుకునే,” అన్నాను.
“నయమవునా కాదా అని కాదు నేనంటున్నాది. ఏ సిస్టమ్ కానీ సంప్రదాయం కానీ ఏవో కొన్ని సదుద్దేశాలతోనే మొదలవుతాయి. కాలక్రమంలో వాటికి కొందరు వక్రభాష్యాలు చెప్పి, వాటిని స్వలాభాలకి అనుగుణంగా మార్చేసి వాడుకుంటారు. ఆకాలంలో నిజంగా ఏం జరిగిందో నాకు తెలీదు. ఇలా జరిగి ఉండొచ్చు అంటున్నానంతే,” అంది పెద్దక్క.
“సరే, మనం సిద్దాంతాల్లోకి దిగిపోయేం. మనమెవరమూ ఈ విషయంలో శాస్త్రోక్తంగా పరిశోధనలు చేయలేదు, చేయ పూనుకోడం లేదు కనక ఈ చర్చ ఇంతటితో సమాప్తం. నువ్వు చెప్పు పెద్దక్కా, నీ సంసారంగురించి,” అంది అరవింద, విషయాన్ని ప్రస్తుతానికి లాక్కొచ్చే ప్రయత్నంలో.
“మీతాతయ్య చదువయిపోయింతరవాత మద్రాసులో కాపురం పెట్టేం. నాకేమో వంట రాదు. బియ్యం పొయ్యిమీద పెట్టి, కూర తరిగి ఏడుస్తూ కూచున్నా ఏం చెయ్యాలో తెలీక. ఆ సాయంత్రం ఆయన కచేరీనించి వచ్చి, నావంట చూసి ఒకటే నవ్వు. బియ్యం ఉడకలేదు. కూర మాడిపోయింది. చారు ఉప్పుకషాయం. ఆయన నవ్వుతుంటే నాకు మరింత ఉడుకుమోత్తనం, ఏడుపూ కోపం వచ్చేయి. ఆపూటకి తనే మళ్ళీ ఒండి పెట్టేరు. ఆ తరవాత వరసగా వారం రోజులపాటు పక్కన కూచుని నాలుగు రకాల కూరలూ, పచ్చళ్ళూ చెయ్యడం, చారూ పెట్టడం నేర్పేరు.
అప్పట్లో చక్కగా కొబ్బరినూనె తలకి రాసుకుని, జడ బిగించి వేసుకునేదాన్ని. పదిరోజుల తరవాత ఛ, అలా కాదు అంటూ ఆయనే తల దువ్వి జడ వదులుగా వేసి, భుజంమీంచి ముందుకి వేసి, చూడు ఇలా అయితే చక్కగా నాజూగ్గా అటూ ఇటూ ఊగుతూ చూడ్డానికి బాగుంటుంది అన్నారు.”
ఆనాటి తలపులు మనసులో మెదిలడంతో కళ్ళు తడి అయినట్టుంది, తల వాల్చి సుతారంగా నవ్వింది పెద్దక్క.
“బాగుంది తాతయ్య నీకు కూడా వేసేడా?” అంది అరవింద నవ్వుతూ.
“అసలుకచేరీకి తప్పిస్తే ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసెళ్ళడమే. కాపురం పెట్టిన కొత్తలో ముందటి అలవాటు ప్రకారం స్నేహితులింటికి పేకాటకి వెళ్ళూ నన్ను కూడా రమ్మన్నారు. ఒకట్రెండు సార్లు వెళ్ళేను కానీ తరవాత నాకక్కడ తోచదు, ఆ యింటావిడతో నాకు మాటాడ్డానికేం ఉండదు రానన్నాను. అప్పట్నుంచీ ఆయన కూడా వెళ్ళడం మానీసేరు. మీఆవిడ కట్టుదిట్టాలు అంత కఠినంట్రా అని స్నేహితులు వేళాకోళం చేసినా పట్టించుకోలేదు. పోన్లెద్దూ, నువ్వూ నేనూ శాశ్వతం కానీ వాళ్ళూ నేనూనా అనేవారు.”
“మరి మీరెప్పుడూ దెబ్బలాడుకోలేదా?”
“ఎందుకు లేదూ, అవీ ఉన్నాయి.”
“ఏ విషయాల్లో వచ్చేవేమిటి తగువులు?”
“ఏవిషయమంటే … చాలా విషయాల్లోనే వచ్చేవి. నాకేమో కాకరకాయ ఇష్టం. ఆయనకేమో బెండకాయ ఇష్టం. బజారుకెళ్తే, కాకరకాయ వద్దని ఆయనా, బెండగాయ వద్దని నేనూ… బట్టలదుకాణానికెళ్తే, జరీ బుటాలున్న నీలంచీర తీసుకో, నీమొహం చంద్రబింబంలా ఉంటుంది, ఆకాశంలో చుక్కల్లా ఆ బుటాలు అని ఆయనంటే, ఉల్లిపొరరంగు చీర కొంటాను చక్కని సాయంశోభని తలపింపజేస్తూ ప్రశాంతంగా ఉంటుందని నేనూ …”
“మరి ఏచీరె తీసుకున్నావు?”
పెద్దక్క నవ్వింది. “ఏమో. ఏదైతేనేం … తగువులు పెట్టుకోడం అదోరకం సరదా, పెంకెతనం … అంతే.”
“నాఅనుమానం నువ్వు అన్నీ తాతయ్యకి కావలిసినట్టే చేసేవని,” అంది అరవింద ఎద్దేవా చేస్తూ.
పెద్దక్క చిలిపిగా నవ్వింది మొహం పక్కకి తిప్పుకుని.
“అసలు మీతరంలోనే ’మేం ఇలా చెయ్యం, అలా చెయ్యం, మీరెంతో మేమూ అంతే అంటూ’ ప్రారంభించి ఉంటే మాకిప్పుడు ఇన్ని కష్టాలుండకపోను,” అంది అరవింద.
“బాగుంది. మేం చక్కగా సంసారాలు చేసుకున్నాం ’చీటికి మాటికి నాయిష్టం, నాసుఖం,’ అంటూ మాసుఖాలే పట్టుక్కూచోకుండా. అదీ తప్పే?”
“తప్పు కాదేమిటి? ఎంతసేపూ ఆ భర్తగారికేం కావలిస్తే అది, ఎలా కావలిస్తే అలా చెయ్యడమే అయితే మీ సొంత వ్యక్తిత్వాలేమయినట్టు? ’మేమూ మనుషులమే, మాకూ ఆలోచనలూ, ఆశలూ, కోరికలూ, అభిప్రాయాలూ ఉంటాయ’ని మీకు అస్సలెప్పుడూ అనిపించలేదా?”
“మాటలో భేదం అంతే. మేమూ అనుకున్నాం మా వ్యక్తిత్వాలు మావి అని. అయితే అవి ఎలా వ్యక్యమయేవి అన్నది మీకు అర్థం కాదు. మీచదువులు వేరు.”
“చెప్పరాదూ మాకు అర్థమయేట్టు.”
పెద్దక్క ఏదో ఆలోచిస్తూ ఊరుకుంది. “పోనీ ఇది చెప్పు. చీరా, కూరా చిన్న విషయాలు. అవి ఎలాగైనా సర్దుకుపోవచ్చు. పెద్ద పెద్ద తగువులు, అభిప్రాయభేదాలు రాలేదా? అప్పుడేం చేసేరు మీరిద్దరూ?”
“అప్పుడూ అంతే. అసలు పెద్ద …”
తలుపు తట్టిన చప్పుడవడంతో అందరం అటు చూసేం. అరవింద ఉలికిపడి, “సరేలే. నేను లైబ్రరీకి వెళ్ళాలి. మరోరోజు చెప్దుగాని,” అంది లేస్తూ.
పెద్దక్క సరేనన్నట్టు తలూపింది.
సిరి, “ఫరవాలేదులెద్దూ, కూచో. అతనేం నిన్ను కొరుక్కు తినేస్తేడేమిటి అలా పారిపోడానికి,” అంది లేచి తలుపు తీస్తూ.
విషి లోపలికి వస్తూ, “మరే కొరుక్కుతినేస్తానేమిటి? తినబోతే మాత్రం ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఊరుకుంటారా?” అన్నాడు.
అరవింద సోఫాఅంచున కూచుంది ముళ్ళమీద కూచున్నట్టు. పెద్దక్కవేపు తిరిగి, “చెప్పు. మరి పెద్ద తగూలు వస్తే ఏం చేసేదానివి?” అన్నతరవాత విషివేపు చూసింది.
“చూసేరా, ఇది నాకు ఎడ్యుకేషను అని తనఅభిప్రాయం,” అన్నాడు ఎడంగా ఉన్న కుర్చీలో కూచుంటూ.
“నువ్వు నామాట అడుగుతున్నావా, అసలు ఆరోజుల్లో ఎవరైనా ఏం చేసేవారని అడుగుతున్నావా?”
“రెంటికీ తేడా లేదనుకున్నాను. సరే. రెండూ చెప్పు. నువ్వేం చేసేవు? ఇంకెవరైనా ఏం చేసేరు?”
“చెప్పాలంటే చాలానే ఉంది. మాది పెద్ద కుటుంబం కదా. ఒకొకరికి ఒకో కథ. ఆ కథలు చెప్తే చాలు నీకు ఆనాటి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. నావిషయంలో పెద్ద తగూలు అట్టే లేకపోవచ్చు కానీ అసలు లేవనను. ఉమ్మడి కుటుంబాలయినప్పుడు మామధ్య కాకపోతే మరొకరిమూలంగా వస్తాయి పేచీలు.”
“అత్తమామలూ, ఆడబడుచులూనా?” అంది అరవింద.
“ఒకరేమిటి, అందరూను. ముఖ్యంగా పెద్ద బావగారు. చెప్పేను కదా మీతాత పేకాట ఆడేవారని. నామూలంగా మానేసేరు కదా. మాపెద్ద బావగారికి ఆటంటే ఆట కాదు అదొక వ్యసనమే. సంసారం నాశనం చేసేరు పేకాటలో. మా తోడికోడలు కొంత రగడ చేసింది ఏడ్చీ, మొత్తుకునీ, నయానా, భయానా చెప్పి … ఆఖరికి పుట్టింటికి పోతానని బెదిరించింది కానీ లాభం లేకపోయింది.”
“పోతే పో అన్నారా?”
“లేదు. మళ్ళీ అభిజాత్యం కదా. పెళ్ళాం వొదిలేసిందంటే నామర్దా కాదూ. వెళ్ళనిచ్చేవాడు కాదు. ఒకవేళ ఆయన ఇంట్లో లేనప్పుడు బండి కట్టించుకుని వెళ్ళినా, రెండు రోజులతరవాత ఈయన వెళ్ళి తీసుకొచ్చేసేవాడు ఇంక ఆడనులే అంటూ బతిమాలీ బామాలీ. ఎంత చెడ్డా ఆడదానికి పుట్టింట్లో ఏం గౌరవం అనో, మార్తానన్నారు కదా అనో ఆవిడ మళ్ళీ వచ్చేసేది. ఆవిడ అటు బండి దిగ్గానే ఈయన ఇటు వీధిలోకి ఉడాయించేసేవారు.”
“మరి మీమామగారూ, అత్తగారూ ఏమీ అన్లేదా?”
“వాళ్లు మాత్రం ఏం చేస్తారు. చెప్పినంతకాలం చెప్పేరు. తరవాత కోడల్ని దెప్పేరు మొగుణ్ణి చెప్పుచేతల్లో పెట్టుకోలేని దద్దమ్మ అని. అమ్మా, నాన్నా తనమానానికి తననొదిలేసి, కోడలిమీద పడ్డంతో ఆయనకి మరింత ఆటవిడుపయింది. మాతోడికోడలు మెళ్ళో గొలుసు, చేతిగాజులూ అమ్మేసి, చేతికందిన చోటల్లా అప్పులు చేసి సాగించేరు. అప్పుడే మీ తాతయ్యదగ్గర్నించి కూడా డబ్బు తీసుకోడం. కొంతకాలం ఊరుకున్నాను కానీ మనసంపాదనలు కూడా ఆయన పేకాటలకే తగలేస్తే పిల్లలచదువులెలా సాగుతాయని అడ్డు పడ్డాను. దాంతో మీతాతయ్యకి కోపం వచ్చింది. పెద్దవాడు వచ్చి డబ్బు కావాలంటే ఎలా లేదంటాను అంటారీయన.”
“అదేంటి. పెద్దవాడయితే పెద్దరికం నిలుపుకోవాలి కదా. ఆయన చెడు అలవాట్లని మీరు పోషించడమేమిటి?”
“అదే మరి. మీతాతయ్య ఆయనకి ఎప్పుడైనా కాస్త ఓ మంచిమాట చెప్పబోతే, మామామగారు ఈయన్నే అనేవారు. ఇంటికి పెద్దవాడు, నాతరవాత నీకు వాడే దిక్కు. మర్యాదగా మసలుకోడం నేర్చుకో అని.”
“మరి మీకు మీబావగారు ఎప్పుడేనా సాయం చేసేరా?”
“ఏమో, ఓమారు ఏదో పెద్దమొత్తం అప్పు చేసి, ఆడి ఓడిపోతే, అవతలవాళ్లు పట్టుక్కొట్టేరుట. ఆ దెబ్బలతో నెలరోజులు మంచంలో ఉన్నారు. ఆరోజుల్లోనే మామామగారికి పక్షవాతం వచ్చింది. మరో నెలరోజులకి పోతారనగా, ఓరోజు పెద్దకొడుకుని దగ్గర కూచోపెట్టుకుని, తలుపులేసేసుకుని ఏం చెప్పేరో మూడున్నర గంటలసేపు. ఆ తరవాత మాబావగారు పూర్తిగా మారిపోయేరు. నిజానికి ఆయన మంచివాడే ఆ ఒక్క దురలవాటు తప్పిస్తే. ఊళ్ళో ఎవరికేం వచ్చినా ఆదుకునేవారు. చాలామంది ఇప్పటికీ ఆయన్ని తలుచుకుని దణ్ణం పెడతారు.”
పెద్దక్క ఏదో గుర్తు చేసుకుంటున్నట్టు కొంచెంసేపు మౌనంగా ఊరుకుంది.
మేం కూడా ఏం మాటాడలేదు. ఎందుకో బరువుగా అనిపించింది. ఇలాటివి జరుగుతాయని తెలీని ప్రపంచంలోకి వచ్చేసేం అని అనిపించడంచేతేమో!
“ఓమారు తిప్పడు, మాయింట్లో పనివాడు, తెల్లారుఝామునే కొడుకుని తీసుకొచ్చేడు ఆవులకి మేత వేసి, పాలు పితకడానికి. హఠాత్తుగా పిల్లాడు కెవ్వుమన్నాడు. బారెడు పాము జరజర గడ్డివాములోకి దూరిపోయింది. తిప్పడు ఓరయ్యో అంటూ పిల్లాడిని పెరటివేపు పంచలోకి వచ్చి, బాబో, బిడ్డని పురుగు కుట్టేసినాదంటూ ఏడుపు మొదలెట్టేడు. మాబావగారు గబగబ బయటికొచ్చి, తుండుగుడ్డ భుజాన వేసుకుని, విషం పైకెక్కకుండా పిల్లాడి కాలుకి మరో తుండు గట్టిగా కట్టి, వాణ్ణి భుజాన వేసుకుని ఐదుమైళ్ళు నడిచి డాక్టరుగారింటికి తీసుకెళ్లి చికిత్స చేయించేరు. ఇంటికి తిరిగొచ్చేక, మా అత్తగారు యానాదివాడిపిల్లాడిని నువ్వెత్తుకు తీసుకెళ్ళడమేమిట్రా, వెళ్ళి స్నానం చెయ్యి అంటూ కసురుకున్నారు. మాబావగారు మాత్రం ఈచలిలో నేనిప్పుడు స్నానం చెయ్యను. తరవాత చేస్తాలే అన్నారు. ఆవిడ మళ్ళీ యానాది అని ఏదో అనబోతుంటే నాచిన్నప్పుడు తిప్పడు నన్ను ఎత్తుకు తిరిగినప్పుడు ఏమయింది ఆ యానాదిరికం అంటూ కసురుకుని లోపలికెళ్ళిపోయేరు.”
అరవింద ఆయోమయంగా చూసింది. “నాకర్థం కావడం లేదు. ఆయన అడిగిన ప్రశ్న నిజమే మరి. తిప్పడు ఆయనని ఎత్తుకు తిరిగినప్పుడు ఎలా పనికొచ్చింది?” అన్నాడు విషి.
“నాకు తెలీదు బాబూ. నాకథ చెప్పమన్నారు. చెప్పేను. అంతే.”
“సరేలెండి. ఇంతకీ మీకేమైనా బజారునించి తేవలసినవి ఉన్నాయేమో కనుక్కోడానికొచ్చేను. ఓ వారంరోజులపాటు హడావుడి ఇంట్లో. అంచేత మీకైమైనా కావలిస్తే చెప్పండి. ఇప్పుడే తెచ్చేస్తాను,” అన్నాడు విషి.
“వారందాకా రావడానికి వీలు లేదంటే, కాస్త పాలూ, కాఫీ తెచ్చి ఇచ్చీ. ఇంకేం అక్కర్లేదు.”
సరేనని చెప్పి, విషి వెళ్ళిపోయేడు. అతను వెళ్ళేక అరవిందా, నేనూ కూడా లేచేం వస్తాం అంటూ.
బయటికి వచ్చింతరవాత, అరవింద నావేపు తిరిగి, “మీకు రేపు ఖాళీయేనా?” అనడిగింది.
“ఖాళీయే. ఏం?”
“ఏంలేదు. పెద్దమ్మ చెప్పినకథకి టీకాతాత్పర్యాలు మీరే చెప్పాలి. నాకేమిటో అదంతా విన్నతరవాత మరింత గందరగోళంగా ఉంది. అసలు పెద్దమ్మ ఆకథ నాకోసమే చెప్పినట్టుంది. అందులో నిజంవెంతో, కల్పనెంతో.”
“సరే, రా. రేపు మాటాడుకుందాం,” అన్నాను కారు ఎక్కుతూ. నాకు అరవిందలా అనుమానం లేదు కానీ ఆవిడ ఇంకా చెప్పగలిగింది, చెప్పవలసింది చాలా ఉందనిపిస్తోంది.
(17 జనవరి 2012)
మాలతి గారూ నమస్కారం. మీ కథ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చెయ్యాలో తెలియడం లేదు.
@ ఉదయరాణి, kakapote kasta oopika kasta prema chalu – మీరు చాలా సింప్లిఫై చేసేరండీ. పంతం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రెండోవారినే తప్పు పడతారు కదా. ఏమైనా మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు.
@ సి వి ఆర్ మోహన్, నాకు మరో రచయిత్రి మాయా ఏంజలో మాటలు గుర్తొస్తున్నాయి. If you cannot change the way things are, change the way you think అంటారు. మార్పు రావడానికి ప్రతివారూ తాము ఆలోచించుకునే తీరులో మార్పు తెచ్చుకోవాలి. అది ఎత్తి చూపడానికే నేను ఈ మార్పు రాస్తున్నాను. మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు.
మార్పు సహజం, నిశ్చితం, ఆహ్వానించ దగ్గది.
మంఛి మార్పులు ఎక్కువ కాలం మన్నుతాయి.
కానివి త్వరగా మార్పుకు గురౌతాయి.
ఈ సంచిక మనస్సుకు హత్తుకోనేటట్లుగా ఉంది.
ధన్యవాదాలు.
nijanga malathi garu
problems
appudu -eppudu okate
kani alochistunna vyaktula madye difference
anduke enni godavalu golalu
edina problem ragane paripoyyi danni marinta jatilamu chesukunekanna
nilabadi kasta edina manchi dari dorukutundemo ani alochinche oopika aadapillalaku lekunda potundi
andaru mogapillalu mary cheddavally vundaru -kasta teliyanitanamu konchemu ego-that”s all
veellu change avvataniki peddaga tiraskaramu chuparu
kakapote kasta oopika kasta prema chalu