నేను లోపలికెళ్ళేను టీ పెట్టడానికి. అరవింద నావెనకే వచ్చింది. “నువ్వుండులే. మీయిద్దరూ కబుర్లాడుకుంటూండండి. టీ చేస్తానంతే, పెద్ద పనేం లేదు,” అన్నాను.
ఐదునిముషాల్లో మూడు కప్పుల్లో టీ, ఓ పళ్ళెంలో ఇండియాబజారువాడిధర్మం మురుకులూ తీసుకొచ్చి, ఎదుట బల్లమీద పెట్టి అరవింద పక్కన కూర్చున్నాను. అరవింద ఓ కప్పు లీలకిచ్చి, తను మరో కప్పు అందుకుంది.
గదిలో గాలాడ్డం లేదు. ఫలానా అని చెప్పలేని బరువేదో గదంతా కమ్ముకున్నట్టుంది.
అరవింద ఆ చిక్కదనానికి గంటు పెట్టింది, “ఇప్పుడు నాకు మరీ అయోమయం అయిపోయింది. ఒక్క మీయింట్లోనే మూడు రకాల పెళ్ళిళ్ళు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏది ఉత్తమం? ఏది అనుసరణీయం? నేను నాపెళ్ళివిషయం పెద్దలకి వదిలేసి ఊరుకోనా? నాకు నేనే నిర్ణయం చేసుకోనా? మొదటిపద్ధతి అయితే, తరవాత తగువొచ్చినప్పుడు మీరే చేసేరని వాళ్ళమీద పడేడవడానికి వీలు. ఆ వసతి వదిలేసుకుని, నాకు నేనే చేసుకున్నప్పుడు కూడా మీరు కదా పెద్దలు, మీకామాత్రం తెలీదా, చిన్నపిల్లని అనైనా ఆలోచించకుండా నేనేదో తెలివితక్కువ పని చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఆయ్ అని వాళ్ళమీద అరవొచ్చు, ఏమంటారు?” అంది.
గది నవ్వులతో ప్రతిధ్వనించింది. “చిన్నపిల్లని అని చెప్పడం తెలిసినదానివి చిన్నపిల్లలా ఉండడం తెలీదా నీకు. పెళ్ళీ, సంసారం తరవాత చూసుకోవచ్చు, ముందు చదువు కానీ,” అన్నాను.
ఈ చిన్నపిల్లల “తత్వం”, వాళ్ళమాటలు, పిల్లల “పెద్దరికం“ గురించి చెప్పడానికి చాలా ఉంది. ఆదేశంలో పిల్లల్ని పిల్లల్లా పెరగనివ్వరని నేను చాలాసార్లు అనుకున్నాను. అది మరోసారి చెప్తాను. ఇంతకీ అరవింద హాస్యానికే అన్నా ఆమాటల్లో నిజం లేకపోలేదు.
“లేదులెండి, హాస్యానికన్నాను,” అని నాతో అని, లీలవేపు తిరిగి, ”అది సరే గానీ, మరి మీరు ఇక్కడికి వచ్చేక సుందరంగారి అసలు రంగు కనిపించిందా?” అనడిగింది.
లీల కనుబొమ్మలు ముడిచి, కాసేపు ఆలోచనాంతరంగయై, మెల్లిగా అంది, “అదేం లేదనుకుంటా. అసలు ‘తత్వం’ అంటూ మనిషికి స్థిరమైనదీ శాశ్వతమైనదీ ఏదీ ఉండదేమో. అడుగున్నర పిల్లవాడు ఆరడుగులకి ఎదిగినట్టే క్రమంగా మారతాడు. తెలిసి ఒకప్పుడూ తెలీకుండానే ఒకప్పుడూ జరుగుతుందనుకుంటా,” అంది.
“మనిషిలో మార్పు రావడం నిజమే అనుకోండి. కానీ అంతకుమించి ప్రతిమనిషికీ ఒక స్థిరమైన తత్వం కూడా ఉంటుందనుకుంటాను,” అంటూ నావేపు చూసింది.
“నాకేమో రెండూ నిజమే అనిపిస్తోంది. అద్సరే గానీ మీకు ఇక్కడికి రాగానే ఎలా అనిపించిందో చెప్పండి. వీళ్ళ సంస్కృతికీ మనసంస్కృతికీ సహస్రాంతం తేడా. అసలు పూర్తిగా విరుద్ధం. నాకయితే పదేళ్ళు పట్టింది ఆ మాట గుర్తించడానికే. ఆ తరవాత ఇంకా వెతుక్కుంటూనే ఉన్నాను, బహుశా ఆజన్మాంతం నాకదే పని అవుతుందేమో,” అన్నాను.
“అవునండీ నాక్కూడా అలాగే అనిపించింది. అసలు నాపెళ్ళే హడావుడిగా అయిపోయిందేమో నేను నాకు పెళ్ళయిందని అర్థం చేసుకోడానికే ఆర్నెల్లు పట్టింది. అంతలో ఈ విదేశీసంస్కృతితో ఢీకొనడం మరింత తికమక అయిపోయింది.”
“బండి మళ్ళీ పట్టాలు తప్పిపోతోంది. సంస్కృతిమాట తరవాత ఆలోచిద్దాం, సంసారం మాట చెప్పండి. నాకు విషితో నాలుగేళ్ళగా పరిచయం ఉంది. మాయిద్దరి ఇష్టాయిష్టాలూ, ఆశలూ, ఆశయాలూ, ఆర్థికం, సంప్రదాయం, దాదాపు అన్నీ మాటాడేసుకున్నాం. అయినా నాకు అతనితో శాశ్వతంగా జీవితం ముడి పెట్టుకోడానికి ధైర్యం చాలడం లేదు. మీరు గంటసేపు మాటాడి నిర్ణయించేసుకున్నారు. అదెలా సాధ్యం? దానిపర్యవసానం ఏమిటి?” అంది అరవింద.
“అదే మరి, ఈకాలప్పిల్లల్తో వచ్చిన చిక్కు. కొంచెం కూడా ఓపిక పట్టలేరు,” అంది లీల నవ్వుతూ.
“నాకు ఓపిక లేకపోవడం ఏమిటండీ, నేను విషితో, ఇంకా మాటాడితే వాళ్ళనాన్నతో ఎంత ఓపిక ప్రదర్శిస్తున్నానో మీకు తెలీదు,” అంది అరవింద మూతి ముడుచుకుని.
“నాదే తప్పు. నీకు చాలా ఓపిక ఉంది. అదలా ఉండనీ. నీకు విషిని నాలుగేళ్ళుగా తెలుసంటున్నావు కదా. ఈ నాలుగేళ్ళలో అతన్ని గురించి నీకు తెలిసింది చాలానే ఉండి ఉంటుంది కదా. అది చాలనుకుంటావా, ఇంకా తెలీందేదో ఉందనుకుంటావా?”
“అదే కదా ఇప్పుడొచ్చిన బాధ? నాకు నిజంగా అతన్నిగురించి ఎంత తెలుసు? ముందు ముందు ఏమాత్రం అతను మనసు విప్పి మాటాడతాడు? ఇలాటి ప్రశ్నలతోనే ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉన్నాను.”
“అప్పట్లో ఓ రెండు గంటలసేపు మాటాడి ఇష్టం అంటే ఇష్టం అనుకున్నాం గానీ నిజంగా ఒక మనిషి మరొక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోడం ఎప్పటికీ జరగదనే అర్థమయింది నాకు.”
“ఎందుకలా అంటారు? కొందరు చూడండి యాభై, అరవై ఏళ్ళగా కలిసి ఉండి కాపురం నిలబెట్టుకున్నారంటే వారిద్దరిమధ్యా ఏమాత్రమో అన్యోన్యత ఉందనే కదా అనుకోవాలి.”
“ఉండొచ్చు. నేనంటున్నది అది కాదు. మనుషులు మారుతూంటారు కనక ఒకరు రెండోమనిషిని అర్థం చేసుకునే సమయం వచ్చేసరికి ఆ రెండోమనిషి మారిపోవచ్చు కదా. అలా అన్నమాట ఎదురు పెట్టి చదరంగం ఆడ్డంలాటిదే,” అంది లీల.
000
లీల విమానం దిగి, జెట్లాగ్ తీరేక, సుందరం అమెరికన్ బతుకులో అనుపానులు చక్కగా పక్కనుండి నేర్పేడు. మనవంటలకి గిన్నెలు అలా పెట్టేస్తే డిష్ వాషరు వాషు చెయ్యదు. తొలిచి, అడుగంటిన గిన్నెలు గీకి, శుభ్రం చేసి, వాషరులో పెట్టాలి. అప్పుడు ఆ యంత్రరాజం బులబులాగ్గా కడిగి, తడిని పొడిచేసి అందిస్తుంది తిరిగి. బట్టలు కూడా అంతే. కాలరుదగ్గర బాగా మాసిపోతాయి కదా. అక్కడ కొంచెం సోపో స్టెయిను రిమువరో వేసి కాస్త రుద్ది వాషరులో వెయ్యాలి. చీరెలు వాషరులో జెంటిల్ వాషులో వేసి ఉతుక్కోవచ్చు కానీ డ్రైయరులో మాత్రం అవి నలిగి నుసి అయిపోతాయి. అంచేత బేస్మెంటులో దండెం ఒకటి ఏర్పాటు చేసేడు. అతనిచొక్కాలు డ్రైయరులో డ్రై చెయ్యొచ్చు. అయితే అలా వదిలెయ్యకుండా, అవి ఆరగానే తీసి, హేంగరుమీద పెట్టి, రెండు బొత్తాయిలు పెట్టేస్తే ఇస్త్రీ అక్కర్లేదు. ఇస్త్రీ చేస్తే బాగుంటాయనుకో, ఇది రెండో పద్ధతి. కూరలు తరుక్కునే కత్తులు కూడా రకరకాలు. ఉల్లిపాయకొకటీ, కొత్తిమీరకొకటీ, వంకాయలకొకటీ, గుమ్మడికాయకొకటీ – అబ్బే ఇన్ని కావాలని కాదు కానీ ఇలా వేరు వేరు కత్తులు వాడ్డంలో కొన్ని సుళువులున్నాయి.
అప్పుడెప్పుడో ఇండియా బజారుకి వెళ్ళినప్పుడు కనిపిస్తే సరదాకి కొండచీపురు కొనుక్కొచ్చేట్ట. వంటింట్లోనూ, స్నానాలగదిలోనూ గచ్చుంది కనక అది పనికొస్తుందని చెప్పేడు. కార్పెట్టున్న గదుల్లో వాక్యూము ఎలాగా తప్పదు.
ఇలా వంటింట్లో మెళుకువలయింతరవాత బజారుకి తీసుకెళ్ళేడు. కాఫీ స్టార్ బక్స్‌లోనే కొనాలి. అరటిపళ్ళు స్ప్రౌట్స్‌లో తాజాగానూ, రుచిగానూ ఉంటాయి. ఇండియన్ స్టోరులో గోరు చిక్కుడుకాయలూ. బీరకాయలూ, పొట్లకాయలాటివి దొరుకుతాయి కాని దగ్గర కాదు, నెలకోమారు వెళ్ళొచ్చు వాటికోసం. పచ్చిమిరపకాయలూ, కాబేజీ, కాలిఫ్లవరులాటివి పక్కవీధిలో దొరుకుతాయి. నడిచి వెళ్ళే దూరమే అయినా కొన్నతరవాత అవన్నీ మోసుకురావడం కష్టం కదా. డ్రైవింగు నేర్చుకుంటే మంచిదంటూ లీలకి స్వయంగా రథం తోలడం నేర్పేడు.
అతను అంత చక్కగా తనవిషయాల్లో చొరవ తీసుకుని, పక్కనుండి అన్నీ చెప్తున్నందుకు లీల చాలా సంతోషించింది. కొండచీపురుమీద ఆయనగారిఆసక్తి కూడా ఆసక్తికరంగా ఉంది! తన అంచనా తప్పలేదు. నిజంగా సుందరం ఎదటివారి మంచిచెడ్డలు, కష్టసుఖాలూ పట్టించుకునే మనిషి అని తృప్తి పడింది.
లీల అలా ఆనందించడానికి మరో కారణం కూడా ఉంది. తను కొత్తగా వచ్చిందని, ఊళ్ళో చాలాకాలంగా ఉంటున్న నాయుడుగారి భార్య చాముండేశ్వరిగారు తనకి అక్కడున్న తెలుగువాళ్ళని పరిచయం చేయడానికి భోజనానికి పిలిచేరు ఓ శనివారం. పది కుటుంబాలు. వారిలో అరవైలలో వచ్చి స్థిరపడినవారిదగ్గర్నుంచీ ఈమధ్యనే వచ్చినవాళ్ళదాకా ఉన్నారు. అరవైలు దాటిన దంపతులనుండీ ఇరవై ఐదు, ఇరవై ఆరు ఏళ్ళ పిల్లలవరకూ అన్ని వయసులవారూ అనేక రకాల అనుభవాలు కలవారు ఉన్నారు.
లీలకి విదేశీసినిమా చూస్తున్నట్టుంది. లివింగ్రూంకీ ఫామిలీరూంకీ మధ్యస్తంగా ఉన్న కుర్చీలో కూర్చుని వాళ్ళని గమనించసాగింది.
కొంచెం ఆలస్యంగా ప్రవేశించిన రాజుగారిని చూసి లేచి నిలబడింది ఓ అమ్మాయి.
“ఏమిటి సుందరం, ఎక్కడా కనిపించడంలేదు ఎంత కొత్తపెళ్ళికొడుకువైతే మాత్రం,” అంటూ చనువుగా కుర్చీ లాక్కుని, అతనిచేతిమీద చెయ్యేసి కబుర్లలోకి దిగింది మరో అమ్మాయి. బహుశా ఈదేశం వచ్చి చాలాకాలం అయిందేమో స్థానికమర్యాదలు చక్కగా ఆకళించుకున్నపిల్ల.
మరో అమ్మాయి ట్రేలో వైనూ, పళ్ళరసాలూ తీసుకొచ్చింది. ఎవరికి తోచింది వారు తీసుకున్నారు. కొందరు తమకి ఏమీ వద్దన్నారు.
రాజుగారు ముందుకి వంగి ఓ గ్లాసు అందుకున్నారు.కాస్త పెద్ద తరహాగా కనిపిస్తున్న శర్మగారిముందు ట్రే పట్టుకుని ఆ అమ్మాయి నిలబడింది. ఆయన ఉత్సాహంగా ఎన్నికలవ్యవహారం మాటాడుతున్నారు రాజుగారితో. ఆ అమ్మాయి రెండు నిముషాలు నిలబడి, ట్రే ఒడుపుగా ఓ చేత్తో పట్టుకుని, రెండో చేత్తో ఓ గ్లాసు తీసి ఆయనకి ఎదురుగా ఉన్న బల్లమీద పెట్టి వెళ్ళిపోయింది.
“శర్మగారికి ఇచ్చినావా?” అనడిగేరు చాముండేశ్వరిగారు.
“ఆయనకి ఎదురుగా బల్లమీద పెట్టేను,” అంది ఆ అమ్మాయి.
చాముండేశ్వరిగారు వచ్చి బల్లమీదున్న గ్లాసు ఆయనకి చేతికి అందించి లోపలికి వెళ్ళేరు.
నాలుగేళ్ళ అబ్బాయి హోరుమని అరుస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. అలా పరుగెత్తవద్దని తల్లి వాడిని గదమాయిస్తోంది కానీ వాడు వినిపించుకోడంలేదు. “పిల్లల్ని చిన్నతనంలోనే అదుపాజ్ఞల్లో పెట్టాలి, ఆ పిల్లాడిని చూడండి,” అన్నారెవరో మరో అబ్బాయిని చూపుతూ. ఆ అబ్బాయి కదిల్తే చొక్కా నలిగిపోతుందో, తల చెరిగిపోతుందో అన్నట్టు తండ్రి పక్కన ఒదిగి, బొమ్మలా కూర్చుని ఉన్నాడు.
లీల లేచి వంటగదిలోకి వెళ్ళింది, ”నేను సాయం చెయ్యనా?” అంటూ.
“లేదండి. అంతా సిద్ధమయిపోయింది.”
“ఇన్ని రకాల వంటకాలు చేసేరు, ఎప్పుడు మొదలు పెట్టేరేమిటి?” అంది లీల నవ్వుతూ.
“అయ్యయ్యో, అదేమండి, అట్లెట్ల ఔతది. ముందు రోజు చేస్తె స్వామికి ఆరగింపు పెట్టను గాదు గద. రెండు గంటలకి లేచి, స్నానం చేసి, వొండిన,” అందావిడ.
లీల అక్కడున్న బల్లలమీదా, కౌంటర్లమీదా, పొయ్యిమీదా, ఇంకా అవెన్లోనూ … ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న సంభారాలు చూస్తూ, అవాక్కయి నిలబడిపోయింది.
పక్కనే ఉన్న రాజేశ్వరిగారు, “మీకు తెలీదులెండి. కిందటివారం సావిత్రమ్మగారింట్లో మీరు చూడలేదు. ఆమె మూడు కూరలు చేస్తే ఈమె నాలుగు, ఆమె రెండు స్వీట్లు చేస్తే ఈమె మూడు,” అంది స్వరం తగ్గించి.
ఇందాకా రాజుగారు వచ్చినప్పుడు లేచి నిలబడిన అమ్మాయిదగ్గరికి ఒక అబ్బాయి వచ్చి తాళాలేవీ అనడిగేడు. ఆ అమ్మాయి కారు తాళాలు ఇస్తూ, “ఎందుకూ?” అనడిగింది. అతనేదో జవాబు చెప్పేడు. నవదంపతులు కాబోలు అనుకుంది లీల.
000
ఆ తరవాత మరో మూడు కుటుంబాలు పిలిచినప్పుడు, వాళ్ళయిళ్ళకి వెళ్ళి వచ్చేక, లీలకి తాను నిజంగా ఎంత కొత్త ప్రపంచంలోకి వచ్చిందో అర్థమయింది. అమెరికాదేశం ఒక్కటే కాదు తనకి అర్థం కానిది, అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు అంతకి పది రెట్లు కొత్త. ఇండియాలో చచ్చి అమెరికాలో పుట్టినట్టుంది, మళ్ళీ తప్పటడుగులతో పునః ప్రారంభం జీవితం అనుకుంది లీల.
000
(ఈ రచన గురించి ఒకమాట – ఇది అస్తవ్యస్తంగా నడుస్తోంది. కథేమిటో తెలీడం లేదు :p. కొందరు స్నేహితులని అడిగీ, కొన్ని వ్యాఖ్యలు చూసీ నేను గ్రహించింది అది. నిజమే.
ఇది మొదలు పెట్టినప్పుడు ఒక దారీ తెన్నూ లేకుండా మొదలు పెట్టేను. అప్పట్లో “ఇది దేన్నిగురించి అంటే మార్పుగురించే … మనలో, మన పరిసరాల్లో, మాటతీరులో, ఆశల్లో, ఆశయాల్లో … మార్పు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ … )” అని చెప్పేను.
ఏడాదికి పైనే అయింది. ఇప్పటికీ నాకు అలాగే అనిపిస్తోంద. కానీ మరో పక్క ముందు రెండు తరాలు చూసేను, ఇప్పుడు మూడోతరం చూస్తున్నాను. నేను ప్రధానంగా ఇక్కడ అక్షరగతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది ఏ ఒక్క పాత్ర జీవితచిత్రణో కాక, సామూహికంగా మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, ధ్యేయాల్లో వస్తున్న మార్పులు అనుకుంటున్నాను. అంటే కథగా అస్తవ్యస్తంగానే అనిపించినా, విడివిడిగా ఒక్కొక్క భాగంలో మనం దినదినం చూస్తున్న మార్పులు ఇవీ అని చూపడానికి చేసిన ప్రయత్నం అన్నమాట.
భవిష్యత్తులో ఎప్పుడయినా దీన్ని నవలగా మలిస్తే, మీ అభిప్రాయాలూ, అనుభవాలూ కూడా తోడ్పడతాయి కనక ఈవిషయంలో మీ అభిప్రాయాలూ, అనుభవాలూ కూడా తెలియజేయమని అర్థిస్తున్నాను. – మాలతి)
( 2 ఫిబ్రవరి 2012)
తెలుగు తూలిక లో వచ్చిన మార్పు కను విందుగా ఉంది.
అభినందనలు.
మోహన్
@ లలిత (తెలుగు4కిడ్స్), మంచి విషయాలు ప్రస్తావించేరు. ఆ చివరి పరక (ఒంటె మూపున) ఒక్కటి మాత్రమే తీసుకుని పాఠకులు, కనీసం కొందరు, ఏ భాష్యాలు చేస్తారో అన్న శంకతో పొడిగించలేకుండా ఉన్నాను కథ. ఒక సమస్య అనేక కోణాలనుండీ పరిశీలించడం, ఏ నిర్ణయం తీసుకున్నా అది రెండుపక్షాలకి శ్రేయస్కరం అని గ్రహించడం అవసరమని చూపించడం నా ధ్యేయం. మీరన్న రెండోవిషయం, మళ్ళీ పెళ్ళి చేసుకోడం కూడా గొప్ప మార్పు, మెచ్చుకోదగ్గ మార్పు కూడా. క్రమంగా అది కూడా ప్రస్తావిస్తాను. నిజానికి మరో పాఠకుడు నా చాతకపక్షులు కథలో గీతగురించి ఆ సూచన చేసేరు.
సర్దుకుపోవడం వ్యసనంగా మారడం కూడా మీరు చర్చలోకి తెచ్చిన మరో మంచి కోణం. ధన్యవాదాలు.
మాలతి గారూ,
నేను అదే అనుకున్నాను. last straw అన్నట్టు మెల్లగా పెరుగుతున్న అసహనం ఏ ఒక్క సంఘటనకో బద్దలు కావచ్చు అని. అదేలాగా లీల అక్కయ్య అంత పెద్ద మార్పుని ఎలా స్వీకరించింది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. విడాకుల గురించి ప్రశ్న వచ్చింది కానీ ఇంకో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవడం గురించి సందేహం ప్రకటించలేదు ఎవరూ? అసహనం క్రమంగా పెరగడం లాగే సర్దుకుపోవడమూ ఒక వ్యసనం ఐపోతుంది ఒక్కో సారి. ఏది మంచో ఏది చెడో అని బయటి వారికే ఆలోచనలు.
@ C V R Mohan, సాధారణంగా విడిపోవడం, ఆ మాటకొస్తే కలవడం కూడా జరగడానికి ఏదో ఒక్కటే కారణం అవదు. మొత్తం జీవితాన్ని తారుమారు చేసే ఘన నిర్ణయం చేసుకోడం అన్నది అనేక సంఘటనలు క్రమంగా మెట్టు మీద మెట్టులా చేరి ఆ మనిషిని ఆమూలాగ్రం కుదిపేసినప్పుడు మాత్రమే జరుగుతుందని నా నమ్మకం. ఇదే మాట నేను ఇదివరకు నా ఇతరరచనల్లో కూడా ప్రస్తావించేను. మీరు పెద్దవారు కనక మీరు కూడా ఇది గమనించే ఉంటారనుకుంటాను.
నిజంగా నాకు చాలా కుతూహలంగా ఉంది.
కారట్ ఉరగాయ వల్లే విడిపోయారా?
లేక థియేటర్లో వదిలి వచ్చేసినందుకా?
ఎవరి నోరు ఎక్కువ జారింది ?
మార్పు ఎవరిలో వచ్చింది?
ముగింపు ఏమౌతుంది?
మోహన్