లీల పోను పక్కన పెట్టేసి సోఫాలో వెనక్కి వాలి, నిట్టూర్చింది. తాతగారిని డాక్టరుకి చూపిస్తున్నాం అని చిట్టికమల ఫోను చేసింది ఇండియానించి. ఉక్కుపిండంలాటి తాతగారికి వచ్చిన విపత్తు ఏమిటో తెలీడంలేదు. ఈమధ్య కొంతకాలంగా నీరసంగా ఉన్నారుట. డాక్టరుని చూడ్డానికి ఒకంతట ఒప్పుకోలేదుట. ఆఖరికి ఆరోజు ఉదయం పట్టుబట్టి తీసుకెళ్తే లివరులో ట్యుమరు లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇంకా టెస్టులు చెయ్యాలనీ చెప్పేరుట.
ఇప్పటికి, గత నాలుగు రోజుల్లోనూ నాలుగు ఇమెయిళ్ళొచ్చేయి, ఎనిమిది ఫోనుకాలులు వచ్చేయి.
అవును మరి. తాతగారిసంసారం చిన్నదేమీ కాదు గదా. ఆయనతండ్రి అంటే లీలముత్తాత మూడు పెళ్ళిళ్ళు చేసుకుని తొమ్మిదిమంది సంతానాన్ని కన్నారు. మూడో అమ్మమ్మ కూడా దివంగతురాలయినతరవాత ఆయనకి తపన మొదలయింది వీళ్ళందర్నీ ఎలా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి … ఇవన్నీ చేయడం ఎలా అని. అప్పటికే పెద్దకొడుక్కి పెళ్ళయింది కానీ ఇంటికి పెద్దకొడుకుగా అతనిబాధ్యతలేమీ నెత్తికెత్తుకోడానికి అతను అంగీకరించలేదు. తండ్రి చేసిన పెళ్ళి కాక మరో ఆడపిల్లని చేరదీసి ఆవిడతో సభలూ సమావేశాలూ అంటూ ఊరూరా తిరుగుతూ , తండ్రికి సాయం చెయ్యడం మానేశాడు. “నాకే రెండు పొయ్యిలు. ముగ్గురు పిల్లలు. నేను వీళ్ళసంగతి చూసుకోవాలి. అది నాధర్మం, మీకు చేసినన్నాళ్లు చేసేను. ఇంకా చెయ్యమనడం ఏం సబబు?” అంటూ ఎగిరి పడ్డాడు. పైగా “స్తోమతు చూసుకోకుండా అంతమందిని కనడమేమిటి?” అని కూడా సతాయించేడు. పెద్దాయనకి నోట మాట రాలేదు. తాను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే, ఈ గుంటవెధవల్ని సాకడానికే కదా అంటూ మండిపడ్డాడు. రెండోకొడుకు ఏదో వ్యాపారం పెడతానంటూ వేలకి వేలు తీసుకెళ్ళి బొంబాయిలోనూ, మద్రాసులోనూ తగలేసి, చిప్ప చేతికొచ్చేక తిరిగొచ్చీసేడు. అతడ్ని నమ్మినా ఒకటే వాకిట్లో తుమ్మచెట్టుని నమ్మినా ఒకటే.
మూడో గృహలక్ష్మి కూడా గతించేక, ఆయన బాగా కుంగిపోయేడు. ఎవరేనా చూస్తే ఆయనేనా ఈయన అనుకోవాలి. అంతగా దిగజారిపోయేడు. తనకి కళత్రయోగం లేదేమో అని అప్పుడనిపించిందాయనకి. ఆ సమయంలోనే ముత్తాతగారు మూడోకొడుకుని, అంటే లీలతాతగారిని అడిగేడు మిగతా పిల్లలకి ఓ దారి చూపమని. తాతగారు “తప్పకుండా చూస్తాను” అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసేరు. ఆ ధోరణిలోనే తాను పెళ్ళి మానుకుని వీళ్ళే తనసంసారంగా వాళ్ళ చదువులూ, పెళ్ళిళ్లూ, ఉపనయనాలూ, శ్రాద్ధాలతో సహా జరిపిస్తున్నారు. పాపం, తాతగారు… నిష్కామయోగి అంటే ఆయన్నే చెప్పుకోవాలి. ఈకాలంలో కుటుంబం అంటే మొగుడూపెళ్ళాం, ఒకరో ఇద్దరో పిల్లలు — గంగాధరంకుటుంబం, గౌరిదేవికుటుంబం, చిట్టెమ్మకుటుంబం, పుట్టన్నకుటుంబం అంటూ ఎవరికి వారే కానీ తాతగారెప్పుడూ అలా అనుకోలేదు. ఆయనకి కుటుంబం అంటే వీళ్ళంతా కుటుంబమే.
తనకున్నది ఒకరికి పెట్టేడు కానీ తనకి ఇది కావాలని ఎవరినీ ఎప్పుడూ కోరలేదు. తమ్ముళ్ళకీ, వాళ్ళపిల్లలకీ కూడా చదువులు చెప్పించేడు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేడు. పెళ్ళయిన తరవాత అవసరాలకి ఆదుకున్నాడు. డబ్బొక్కటే కాదు. తల్లి లేని పిల్లలని చెల్లెళ్ళకి తానే తల్లీ, తండ్రీ కూడా అయి పురుళ్ళు పోసేడు. పండుగలకీ, పబ్బాలకీ పిలిచి నూతనవస్త్రాలు పెట్టేడు. ఇన్ని చేసినా సంతృప్తి లేదు. సణుగుతూనే ఉంటారు. ఎవరింట్లో ఉంటే వాళ్ళు తాతగారిని “మేం పోషిస్తున్నాం” అనేవాళ్ళే కానీ తాతగారు మాకింత చేసేరు అనరు.
ప్రస్తుతం ఇప్పుడొచ్చిన ఫోను చిన్నతాతగారి మూడో కూతురి కూతురిదగ్గర్నుంచి. చిట్టికమల రెండో పెద్దక్క సావిత్రి దగ్గర్నుంచి.
“మాచెల్లి పదహారేళ్ళగా పోషిస్తోందాయన్ని. చిన్నది, పాపం, అదెంతకాలం చేస్తుంది. మిగతావారికి మాత్రం బాధ్యత ఉండఖ్ఖర్లేదా?”
“పోషిస్తోందనకు. ఆయనేదో చిన్నపిల్లాడో, మంచం పట్టినవాడో అన్నట్టు మాటాడుతున్నావు. ఆయనేం ఊరికే తింటూ కూర్చోలేదు కదా. ఇంట్లో మనిషిలాగే పిల్లల్నీ చూసుకోడం, ఇంటిపనులూ, బజారుపనులూ చెయ్యడం – ఇవన్నీ ఏమిటి?” అంది లీల నెమ్మదిగానే.
“ఆయనదగ్గర డబ్బు లేదు. నేనూ, అక్కయ్యా పంపిస్తున్నాం. అసలు ఆయనెందుకు అడుక్కోవాలి? పెదబాబుకి అంత చేసేరు. పొలం అంతా వాళ్ళచదువులకే అయింది. వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా.”
ఆమాట వినేసరికి లీలకి ఒళ్ళు భగ్గున మండింది. తనమరిది ఆదాయం ఏమీ తక్కువ కాదు , అసలు “అడుక్కోడం” మాట ఎందుకొచ్చిందీ, అవతల ఎవర్నిగురించి అంటున్నాం అని లేకుండా అదేం మాట?
“అడుక్కోడంలాటి మాటలు మాటాడకు. అసలు ఆయనపేరు చెప్పి మీచెల్లెలే అడుగుతోందేమో, నిన్నూ, మీఅక్కయ్యనీ,” అంది చిరాకునణుచుకుంటూ.
“నేనలా అనడంలేదు. మాటవరసకి అన్నాను. ఆయన్ని మిగతావాళ్ళు కూడా తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకోవచ్చు కదా. మేం చెయ్యం అని కాదు. అసలు ఆయన్నే కాదు, మీక్కూడా చేస్తాం. మాచెల్లి ఎంతగా కష్టాలనుభవించిందో మీకు తెలీదు …”
ఫెళఫెళార్బాటంతో కరాళమేఘాలు పన్నెండు ఒక్కసారిగా ఉరిమినట్టు, మిన్ను మిరిగి మీద పడ్డట్టు అనిపించింది. కిటికీదగ్గర నిలబడి మాటాడుతున్నది గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చి సోఫాలో కూలబడింది. ఈ అమ్మాయి సావిత్రిమాటలు పరమ గందరగోళంగా ఉన్నాయి. ఏం అంటోందో అర్థం చేసుకోలేకుండా ఉంది.
మరోపావుగంటకి పెదబాబు అనబడే, తాతగారి మేనల్లుడు ఫోను చేసేడు. “సావిత్రీ, వాళ్లక్కయ్యా నాకు మెయిలిచ్చేరు. తాతగారిబాధ్యత నీక్కూడా ఉంది, వచ్చి తీసుకెళ్ళిపొమ్మని. నాకేం తోచడం లేదు. మాయింట్లో పదేళ్ళు పెట్టుకున్నాను కదా. ఆ తరవాతే వాళ్ళు రండి రండి అంటూ ఆయన్ని పిలిచి తీసుకెళ్ళేరు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీరిపోయేయి కనక ఆయన్ని పొమ్మంటున్నారు.“
మరో ఇమెయిలు, “సావిత్తిరివదిన పిలిచి మమ్మల్ని నానా మాటలూ అంది. తాతగారికి ఆరోగ్యం బాగులేదంటే మాటాడకుండా ఊరుకుంటారా అని. పెద్దత్త కొడుకు తీసుకెళ్ళొచ్చు కదా. అమ్మమ్మ బంగారం అంతా దోచుకున్నారు. ఆవిడ పోయేవేళకి పది లక్షలబంగారం ఉంది వొంటిమీద. వాళ్ళింట్లో ఉండగానే కదా ఆవిడ పోయింది. బంగారం ఏమయిందంటే మాకు తెలీదన్నారు. నిజంగా పైవాళ్ళెవరో తీసుకుపోతే పోలీసు రిపోర్టివ్వరా?
మరో ఇమెయిలు, “అమ్మ పోగానే తాతగారొచ్చి మీమంచీ చెడ్డా నేను చూస్తాలే, ఏడవకు, అంటూ వచ్చి మాయింట్లో ఉంటే మేం ఒక్కమాట అన్నామా. పాతికేళ్ళు మాయింట్లో ఆయనకి రాజభోగాలు జరిపించేం. ఇప్పుడేమో మేం ఏమీ చెయ్యలేదన్నట్టు ఆ సావిత్తిరిపిన్ని మమ్మల్ని కొరుక్కు తినేస్తోంది.”
“తాతగారు లోకనాథంఅన్నయ్యింట్లో వదినవరస బాగులేదంటేనే కదా మాయింటికొచ్చి ఉండమన్నాం. వాళ్ళపిల్లలపెళ్ళిళ్ళకోసం పొలం అమ్మితే మేం అలాగే కానివ్వండి అన్నాం కానీ మావాటా ఏదీ అని పేచీలు పెట్టేం ఏమిటి? ఇప్పుడు …”
“సీతక్కఇంట్లో ఉన్నప్పుడు తాతగారు ఎంత అవస్థలు పడ్డారో తెలుసా? రాజు ఏదో పనిమీద బెజవాడ వెళ్లినప్పుడు చూసేను. తెల్లారగట్ల లేచి వీధి కొళాయిదగ్గర వరసలో నిలబడి మంచినీళ్ళు తీసుకురావాలి, అమ్మగారు లేచేసరికి కాఫీ పెట్టాలి. బజారుకెళ్ళి కూరా నారా తేవాలి. పిల్లల్ని స్కూలికి తీసుకెళ్ళాలి. ఆయన పడే అగచాట్లు చూడలేక మాయింటికి తెచ్చుకున్నాం. మాయింట్లో పన్నెండేళ్ళున్నారు.”
లీలకి తల వాచిపోతోంది వీళ్ళందరి లెఖ్ఖలూ చూస్తే, తాతగారికి ఈసరికి నూటయాభై ఏళ్ళుండాలి! మరోగంటకి వాళ్లపెద్దక్కదగ్గర్నుంచి వాళ్ళ పెద్దత్తకొడుక్కి ఇచ్చినమెయిలు కనిపించింది, తనకి కాపీ పెట్టింది. అందులో ఆయింట బుట్టిన ప్రతివారికీ ఉండవలసిన రక్తసంబంధమైన ధర్మాలగురించి ఉపన్యాసం. “మేం అందరం ఇంతకాలం తాతగారిని చూసుకున్నాం. మీరు కూడా చెయ్యాలి. అది మీధర్మం. ఆయనకి కష్టకాలం వచ్చినప్పుడు మీరు కాక ఎవరు చేస్తారు? …”
లీలకి కళ్లు తడి అయేయి. ప్రస్తుతం తాతగారి చివరి మజిలీ – చిన్నతమ్ముడు కొడుకింట్లో ఉంటున్నారు. ఆయనభార్యే ఈ చిట్టికమల. ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి. పసిపిల్లలని చూసుకునేవాళ్ళు కావాలి అన్నారుట వాళ్ళిద్దరూ. లేదా అంత చాదస్తంగా కాదనుకుంటే, “పెద్దవారయిపోతున్నారు. మీరిలా ఇల్లిల్లూ తిరగడం బాగులేదు. వచ్చి మాదగ్గరుండండి. మీక్కూడా పిల్లలతో కాలక్షేపంగా అవుతుంది. మానాన్నగారెంతో మీరంత. మీరూ మేమూ బతికున్నంతకాలం పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాం,” అన్నారు.
ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం చెడేసరికి, “ఇంతకాలం చేసేం, మీరెందుకు చూసుకోరంటే మీరెందుకు చూసుకోరం”టూ మిగతావారిని సతాయిస్తున్నారు. … we love him, we take care of him, but they also have filial duty గట్రా అంటూ వెధవ ఎంగిలిముక్కలొకటీ. వీళ్ళకి తాతగారు చెప్పించిన చదువు అందుకు పనికొచ్చింది. ఈ డూటీలు తాతగారికి ఒంట్లో ఓపికా, చేతిలో డబ్బూ ఉన్నప్పుడు తోచలేదీ బుర్రలకి.
తాతగారు పాతకాలపు మనిషి. తెల్లనివన్నీ పాలని నమ్మే అమాయకుడు. వాళ్లు రమ్మంటున్నారు అని మురిసిపోయేరే కానీ ఎందుకు రమ్మంటున్నారో ఆలోచించలేదు. లీల వెంటనే అన్లేదు కానీ తరవాత చూచాయగా చెప్పడానికి ప్రయత్నిస్తే, “వాళ్ళనేం అనకు. వాళ్ళకి నేనంటే ఎంతో అభిమానం. మానాన్నగారొకటీ, మీరొకటీ కాదన్నారు,” అందిట చిట్టికమల. ఏం చెప్పడం ఆయనకి? ఆ కబుర్లన్నీ నాలుకచివరినించి వచ్చినవే అని ఆయనకి ఎలా అర్థం అవుతుంది?
లీలకి మనసంతా చిరాకయిపోయింది. సుందరం ఊళ్లో లేడు. లేచి, బట్టలు మార్చుకుని పెద్దక్కయఇంటికి బయల్దేరింది. వాళ్లింట్లో కొన్నాళ్లు ఉండడంతో ఆవిడంటే ప్రత్యేకాభిమానం ఏర్పడింది లీలకి. తాను ఆవిడతో ఏమైనా మాటాడగలదు నిశ్చింతగా. మళ్లీ ఆమాటలు ఎక్కడికి చేరేస్తుందోనన్న బాధ లేదు.
లీల సూక్ష్మంగా జరుగుతున్న కథ వివరించి, అంది, “వీళ్ళందరిపోరూ పళ్ళేక ఓరోజు నేను తాతగారినే పిలిచి మాటాడేను. ఇప్పటికి రెండు వారాలయింది ఆయనకి బాగులేదని తెలిసి. ఆస్పత్రికి తీసుకెళ్ళడం, ఏవో టెస్టులూ, అవీ జరిగేయిట. సర్జరీ కూడా అయిందిట. ఆయన ఆరోజు నాతో బాగా మాటాడేరు. అసలు ఆయన ఆస్పత్రికెళ్ళినట్టే అనిపించలేదు. మాటలసందర్భంలో చెప్పేను వీళ్ళందరూ అంటున్నమాటలు. తీరా అనేసేక నాకు బాధేసింది. అనవసరంగా చెప్పేనేమో అని. నేను మాటాడిన మూడోనాడు మళ్ళీ ఫోను చేసేరు, పరిస్థితి మరీ దిగజారిపోయింది అని. దిగులుగా వెర్రిచూపులు చూస్తూ, ఏవేవో మాటలు తన్లో తనే మాటాడుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నారుట కాలు కాలినపిల్లిలా. నేను వీళ్ళసంగతులు చెప్పి మరింత నొప్పించేనేమో ఆయన్ని అనిపిస్తోంది,” అంది లీల కూడా దిగులు పడిపోతూ.
“అలా అనుకోకు. నువ్వు చెప్పకపోతే వాళ్ళే మరోవిధంగా ఆయనకి తెలియజేసి ఉండేవాళ్లు. అసలు ఇప్పుడు మాత్రం వాళ్ళు మరింత ఎత్తిపొడుపుమాటలు అన్లేదని నమ్మకం ఏముంది? వాళ్ళేం మాటలంటున్నారో, ఏం చేస్తున్నారో నీకు తెలీదు కదా. చూస్తుంటే ఆయన్ని బయటికి పంపడం మాత్రమే వాళ్ళ ఏకైకధ్యేయంలా ఉంది. అది సాధించడానికి ఏ గడ్డి కరవడానికేనా సిద్ధమే అలాటివాళ్లు,” అంది పెద్దక్కయ్య.
లీలకి నిజమే అనిపించింది.
పెద్దక్కయ్యే మళ్ళీ అందుకుంది, “మానాన్నగారివిషయం కూడా ఇలాగే అయింది. ఆరోజుల్లో ఆలోచనలు అలాటివి. నాబొందో అనుకుంటూ అందరికీ సేవలు చేసేరు. తీరా చివరిరోజులు వచ్చేసరికి, ఆయనకి కాస్త మతి చలించేసరికి, మతిమాలిన ముండాకొడుకు … అందిట మా పెద్దత్తయ్య ఆయన్ని. ఆ తరవాత ఆయన ఎంతో కాలం బతకలేదు. బుచ్చి నన్ను మతిమాలిన ముండాకొడుకు అంది అని తనలో తను గొణుక్కుంటూ తనగదిలోనే ప్రదక్షిణాలు చేస్తూ గడిపేరుట పదిరోజులు. పదకొండోరోజు స్నానం చేసి, మడిపంచె కట్టుకుని పెరట్లో తులసికోట దగ్గర సాష్టాంగపడి ప్రాణం వదిలేసేరు,” అంది. ఆరోజు తలపుకి రావడంతో ఆవిడకి కళ్ళనీళ్ళు తిరిగేయి.
లీల చాలాసేపు అలా కూర్చుండిపోయింది. ఆరోజుల్లో అభిమానాలూ, మనవాళ్ళు అన్నపదానికి నిర్వచనం వేరు. అది తెలుస్తూనే ఉంది. అవే ఆలోచనలు పెట్టుకున్నవారికి ఇప్పుడు బతుకు లేదు. మరి తాతగారి సంగతి?
మరికొంచెంసేపు కూర్చుని ఇంటికి వచ్చేసింది.
తరవాత, పీసీముందు కూర్చుని, మెయిలు టైపు చేసింది. “ఇప్పటికి దాదాపు అందరిఆలోచనలూ వినడం అయింది. తాతగారితో కూడా మాటాడేను. ఆయన మీరంటున్నమాటలు నమ్మలేదు. ఇదంతా చూస్తుంటే. ఇంత దూరంలో ఉండి నేనేం చెయ్యలేననిపిస్తోంది. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. వీటన్నటిమధ్య అసలు నిజం ఎక్కడో ఉంటుంది కానీ ఎక్కడుందో నాకు తెలీదు. తాతగారు ఒకమాట మాత్రం అన్నారు. ఆయనా, చిట్టికమలా, అల్లుడుగారూ – వాళ్ళలో వాళ్లు మాటాడుకునే చేసుకుంటున్నారుట ఏ నిర్ణయమైనా. కనీసం ఆయననమ్మకం అదీ. ఈ పరిస్థితుల్లో నేను ఎవరికీ ఏం చెప్పలేననిపిస్తోంది. ఎవరు ఏం చెప్పదలుచుకున్నా ఆయనతోనూ, చిట్టికమలతోనూ, వాళ్ళాయనతోనూ మాటాడండి. ఇది మీరూ మీరూ తేల్చుకోవలసిందే.“
లీల సెండ్ కొట్టి, నిట్టూర్చింది. తనకి తెలుసు ఇది ఇక్కడికి అయిపోలేదని. కానీ తను అంతకంటే చెయ్యగలిగిందేమిటో తెలీడం లేదు. ఒకటి స్పష్టంగా తెలుస్తోంది. ఆయనకి అర్థబలమూ, అంగబలమూ ఉన్నప్పుడు వాళ్ళకి లేనప్పుడు అందరికీ ఆప్తుడే. పరిస్థితి అటునించి ఇటయింది ఇప్పుడు. ఆయనదగ్గర డబ్బు లేదు. ఆపైన జబ్బు చేసింది. ఇప్పుడు ప్రతివారికీ రెండోవాళ్ళ బాధ్యతలు గుర్తు చేసే అవసరం అర్జంటుగా కనిపిస్తోంది.
000
లీలకి మనసు విరిగింది ఈ రగడతో. సుందరంతో కాపురం కూడా నామమాత్రంగానే ఉంది. నెలకి పదిహేను రోజులు ఇంట్లో ఉంటే గొప్ప. ఉన్నప్పుడు కూడా తనూ, తనస్నేహితులూ, తనవ్యాపకాలూ – అంతే. అసలు ఇంట్లో మరోమనిషి ఉందన్న స్పృహ అతనికి ఉన్నట్టు కనిపించదు కంచంలో అన్నం పెట్టినప్పుడు తప్ప.
అలాటి రోజుల్లో కాస్త పరిచయం ఉన్న కాత్యాయని ఎవరింట్లోనో భోజనాలవేళ కనిపించేరు. తనలాగే ఆవిడకి కూడా తీరిక ఎక్కువయి కాబోలు, “ఈఏడు దసరా నవరాత్రులు ఘనంగా చేద్దాంవండీ. ఇండియానించి పంచలోహాలతో చేసిన దుర్గవిగ్రహం తెప్పించేను. ఆవిడకి చీరెలూ, రవికెలూ ఎవరైనా కుట్టగలరేమో అని చూస్తున్నాను,” అంది మాటలసందర్భంలో.
పక్కనే ఉన్న లీల కొంచెం అనాలోచితంగానే, “మరీ అంత కుట్టుపనిమంతురాలిని అని కాదు కానీ, నా చొక్కాలకి కాలర్లు తీసేయడం, పొడుగు చేతులు పొట్టి చేయడంలాటివి చేస్తుంటాను. కావలిస్తే మీఅమ్మవారికి నేను ప్రయత్నిస్తాను,” అంది.
“అయ్యో అంతకంటేనా. తప్పకుండా రేపు మీయింటికొచ్చి నేను తెచ్చిన గుడ్డముక్కలు ఇస్తాను,” అంది కాత్యాయని ఉత్సాహంగా.
అప్పుడే తెలివొచ్చినట్టు, లీల అసలే విశాలమయిన కళ్ళు మరింత విశాలం చేసి, “ఏదో అనీసేను కానీ మీరిలా వెంటనే ఒప్పుకునేస్తారనుకోలేదు,” అంది నవ్వుతూ.
“సరి, మరేం చేస్తాం, కుట్టడానికి మీరూ, కుట్టించుకోడానికి నేనూ ఒప్పందం అయిపోయింది. ఆడి తప్పుతారా? హన్నా. చిన్నప్పుడు కాపీబుక్కుల్లో రాసుకోలేదూ ఆడి తప్పరాదు అని.”
“అది కాదండీ. నేను చీరెలెప్పుడూ కుట్టలేదు. మీ అమ్మవారేమో ఆరంగుళాల ఎత్తు కదా. అంత చిన్న చీరెలూ, రవికెలూ కుట్టగలనో లేనో అని. సరేలెండి. ముందు ఒకటి కుట్టి చూస్తాను. అవి చీరే, రవికలా ఉంటే మిగతావి చూద్దాం.”
“అలాగే లెండి. ఎవరైనా ఒకటి తరవాత ఒకటే కదా కుడతారు,” అంది కాత్యాయని.
ఆ తరవాత వారం కాత్యాయనిగారింటికి తాను కుట్టిన చీరె, రవిక చూపించడానికి వెళ్తే అక్కడ, కాత్యాయనీ సౌభాగ్యా పువ్వులదండలు కడుతూ కనిపించేరు. లీల కూడా కూర్చుని ఓ చెయ్యి వేసింది. ముఖ్యంగా తనకి వైజయంతీమాల కట్టడం చాలా యిష్టం. తను కడుతున్న మాల చూసి వాళ్ళు ఎంతో మురిసిపోయి, బాగుందని మెచ్చుకుని, ఇకమీదట మాలలు కట్టడం మీవంతు అన్నారు. అలా లీల భక్తిపేర కాకపోయినా ఇంచుమించు ఆ రకం వ్యాసంగంలో పడిపోయింది. ఎవరేనా మీకు భక్తి ఉందా అని అడిగితే లేదనే చెప్తుంది కానీ ఆవిడ వ్యాపకాలు చూసినవాళ్ళు మాత్రం ఆవిడమాట వినడానికి సిద్ధంగా లేరు.
000
(మే 5, 2012)
C V R Mohan, నేను చాలాకాలం వాళ్ళవంతు వస్తుందనీ, వాళ్ళు కూడా ఇలాటి బాధలనుభవిస్తారనీ అనుకునేదాన్ని. ఇప్పుడా నమ్మకం పోయింది చిట్టికమలలాటివాళ్ళని చూసేక. ఆత్మలని చిలక్కొయ్యలకి తగిలించేసి, తమ పబ్బం గడుపుకునేవారికి, జీవితాలు అలాగే సాగిపోతాయి. నాలాటివాళ్ళు ఇంకేం చెయ్యలేక, ఇలా కథలు రాసుకుంటారు.
ఇంట్లోని బాబాలను (పెద్ద వారిని) విస్సుగుకుంటూ
ఇసుమంత కూడా మాత్రం గౌరవించని వారు,
బాబా భక్తి మైకం లో ఎలా ఉండగలరో
నాకు అర్థం కాదు , రేపు అనేది ఉందని,
అప్పుడు తన దాకా వస్తే కానీ వారికీ తెలిసి రాదు.
@ మౌళి, మీరు నాకథని అంత చక్కగా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు.
@ లలిత, మీరన్నది నిజమేనండీ. నానిజం, నీనిజం పని చెయ్యని సందర్భాలే చాలా ఎక్కువ. కానీ నూటికో కోటికో ఓమారు సరి అనిపిస్తే, అదే చాలనిపిస్తుంది. ఆమాత్రం ఆశ లేకపోతే బతకడం కష్టం కదా. మన ప్రాచీనకావ్యాలన్నీ సర్వే జనా స్సుఖినో భవంతు అన్నట్టే. మీకు మీరు మీసమస్యలు విశ్లేషించుకుని పరిష్కారాలు కనుక్కోడం చాలా గొప్ప విషయం. అది చాలామంది చెయ్యలేరు. ఇందాకా స్ఫురితకథకి మీ వ్యాఖ్య మళ్ళీ చదివేను. అలా ఆత్మవిశ్లోషణ చేసుకోలేకపోవడమే చాలామందిలో పెద్ద సమస్య. మీ ఆలోచనలు నాక్కూడా స్ఫూర్తిదాయకం. అంచేత ఇలాగే కొనసాగించమని కోరుతూ, – మాలతి
మాలతి గారూ, మీ పరిస్థితి నాకు తెలియదు. నేను ఏ పరిస్థితులు గుర్తుకు తెచ్చుకుని వ్రాస్తున్నానో మీకు తెలియదు. కానీ నాకు “Déjà vu”" అనుభూతి కలుగుతోంది. నీ నిజం నా నిజం నాకైతే పని చెయ్యలేదండి బాబూ
)) మూడో నిజం కూడా ఉందన్నారు మధ్యలో ఎవరో
) వారి ఉద్దేశ్యమేమో కానీ, నాకు తటస్థపడిన మూడో నిజాలు అబద్ధాలు ఆడటం, సమస్య పరిష్కారం కావడం ఇష్టంలేకపోవడం వంటివి. అప్పుడు common సమస్యని పరిష్కరించుకోవడం కంటే నన్ను ఏది బాధిస్తోందో తెలుసుకుని దానిని నేను పరిష్కరించుకోవడం మేలని అర్థం చేసుకున్నాను.నాకు మాత్రం ఒక positive moment of clarity దొరికింది ఈ చర్చ వల్ల. మళ్ళీ ఇంకెప్పుడైనా కొనసాగిస్తాను. మీకు All the best!
లలిత గారు,
నేను కేవలం జెనరల్ గా చెప్పాను. ముసలాయన విష్యం లో మాలతి గారు వ్రాసింది చక్కగా ఉంది.ఇంకొకరు వచ్చి ఆయన్ని తీసికెళ్ళరు. వీళ్ళు మొహం పై మా ఇంట్లో వద్దు అని చెప్పరు, చెప్పలేరు . అలా జరిగిపోతుంది ..అనుభవజ్ఞుడైన పెద్దాయనకి ఇది నిజానికి బాధ కలిగించదు కూడా… కాబట్టి ఆయన లీల కు చెప్పిన సమాధానం చాలా కరెక్ట్ అని నా భావం .
@ sunnA, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
@ లలితా, నేననుకోడం ఎదటివారి తప్పు జాగ్రత్తగా ఎత్తి చూపవచ్చు కూడా కదండి. మీరన్నట్టు నువ్వు చేసింది తప్పు అంటే కోపం వస్తుంది. కానీ మర్యాదగా నీ పరిస్థితి అర్థమయింది. బహుశా ఆ క్షణంలో నీకంతకంటే తోచలేదేమో. కానీ మళ్ళీ అలాటి సందర్బం వస్తే, … (ఇలా) చేస్తావేమో, నీపనివాళ్ళ ఎదటివారికిలా అనిపిస్తుంది .. ఇలా డొంకతిరుగుడుగానూ, ఒకొకప్పుడు అవును సుమా నాదే తప్పంటూ, ఒప్పేసుకున్నట్టు నటిస్తూ, … . ఇలా రకరకాలుగా మాటాడొచ్చు కదా. నీ perspecive నువ్వు చెప్పేవు, నా perspective ఇదీ అని చెప్పొచ్చు. నీ perspective నీకు నిజం, నా perspective నాకు నిజం. ఎంచేతంటే ఎవరికీ ఎప్పుడూ మరొకరి పరిస్థితి పూర్తిగా అర్థం కాదు. మనం చూసింది, విన్నది మాత్రమే దృష్టిలో పెట్టుకుని సలహాలు ఇవ్వడమో, తప్పు ఎత్తి చూపడమో చేస్తాం. @ఎంతమంది గొప్పవారు వచ్చినా ఎన్ని మార్పులు వచ్చినా ఏవీ శాస్వత ప్రభావం చూపించలేదు. అన్నవాక్యం అక్షరాలా నిజం. ఎవరికి వారు తమ పరిస్థితులనిబట్టి, శక్తినిబట్టీ పరిష్కారాలు ఆలోచించుకోవాలి. ఎటొచ్చీ చాలామందికి ఆ సత్తా ఉండదు. రెండోది ఈ కథలో చెప్పినట్టు అక్కలు gaurdian angel పాత్ర ధరించి, చెల్లెళ్ళజీవితాలు చక్కదిద్ద పూనుకోడం. ఇవన్నీ కూడా వచ్చీ రాని మార్పులు మన సమాజంలో. ఓ పక్క ఎవరికి వారే తమంత తెలివైనవారు మరి లేరు అనుకుంటూనే ఎదటివారిని ఎత్తిపొడుపుమాటలనడం, మరో పక్క, స్వతంత్ర ప్రతిపత్తికి దోహదం చేస్తున్నట్టు మాటాడడం. ఇంకా ఆలోచిస్తాను. ప్రస్తుతానికి నా ఆలోచనలు ఇవీ.
మౌళి గారు, సున్నా గారు చేసిన వ్యాఖ్యలు చూశాక నా మాటలు కొంచెం వివరించాలనిపించింది. తప్పు ఎత్తి చూపిస్తే కోపం రావడం ఎవరికైనా సహజం అని నా ఉద్దేశ్యం. జీవితం తప్పొప్పుల చిట్ట మాత్రమే కాదు. జీవితంలో సంతోషం, మనశ్శాంతి కావాలంటే కష్టపడాలి. ఎవరమూ 100% రైట్ అని నేననుకోను. తప్పు చెయ్యకపోయినంత మాత్రాన కష్టాలు రాకుండా ఉండవు. సులభ మార్గం అనుకున్న దాంట్లో వెళ్ళి “విజయాలు” చవి చూస్తున్నారనుకుంటున్న వారి మనసుల్లో ఉండే సంఘర్షణ మనకి తెలియదు. లీల బంధువులు పెద్దాయన బాధ్యత వదిలించుకోవడానికి పడే తాపత్రయం దానికి ఒక ఉదాహరణ. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది కష్టమే. వాళ్ళకి మనశ్శాంతి లేదు ప్రస్తుతానికైతే. ఆయన వల్ల వాళ్ళకి జరిగిన మేలు గుర్తు చేసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా బాధ్యత స్వీకరించగలరు. కానీ అది కాదనుకుని వాళ్ళు అశాంతిని కొనితెచ్చుకుంటున్నారు. లీల లాగా దూరంగా ఉండి ప్రేక్షక పాత్ర పోషించే వాళ్ళు “మంచి” ఐనా ప్రయోజనం లేదు. wisdom కావాలి. వ్యవహార జ్ఞానం కావాలి. సమస్యని పరిష్కరించుకునే దిశగా ఆలోచించగలగడం కావాలి. అది లేనప్పుడు ఆ పరిమితిని accept చెయ్యడం వల్ల ప్రశాంతత దొరుకుతుంది. పెద్దక్కయ్య గారు లీల సమస్యకి పరిష్కారం చూపించారు. తన వల్ల పెద్దాయనకి తెలిసింది అని మథనపడుతుంటే ఇంకోలా ఐనా తెలిసేదే అని ఒక ఉదాహరణ చెప్పారు. ఆమెని ఎందుకూ పనికి రాని “గిల్టీ” ఫీలింగ్ నుంచి రక్షించారు.
అలాగే ఒకరిని తప్పు అనో మనని ఒప్పు అనో నిరూపించుకోవడానికి అతిగా ప్రయాస పడడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు అని నేను నేర్చుకున్న పాఠం. పరిస్థితిని సవరించుకునే దిశలో ప్రయత్నాలు సాగాలి. విపరీత పరిస్థితులలో నిలబడి పోరాడవలసి రావచ్చు లేదా పరిమితి తెలుసుకుని పక్కకి తప్పుకోవలసి రావచ్చు. ఎంతమంది గొప్పవారు వచ్చినా ఎన్ని మార్పులు వచ్చినా ఏవీ శాస్వత ప్రభావం చూపించలేదు. మనం, మననుంచి మన చుట్టు ప్రక్కల వారికి, వారి నుంచి ఇంకొందరికి అలా “మంచి” వాతావరణాన్ని వ్యాపింపజేసుకుంటూ పోవడం తప్ప సాధారణ మానవుడు ఇంకేమన్నా చెయ్యగలడా అని నా సందేహం. అక్కడ మన శక్తిని కేంద్రీకరించడమే మన కర్తవ్యం అని నా నమ్మకం.
>> నేను నోరు మూసుకుని వింటున్నంతసేపే నిలిచేయి ఆ స్నేహాలు
Very true. You can learn a lot by keeping your mouth shut. I learned this truth practically.
మౌళిగారూ, సవాలక్ష కారణాలు అన్నమాట నిజమేనండీ. అనేక పరిస్థితులు కలిసి ఒకమనిషిని ఒక రకంగా ప్రవర్తించేలా చేస్తాయి. వాటిని విడదీసి, పరీక్షించి పరిష్కారాలు కనుక్కోడం కష్టం. మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
లలిత గారు,
మీరు లోపాన్ని చెప్పగలరు కాని, వారి చుట్టూ ఉన్న వాస్తవాన్ని మార్చలేరు. లోపం ఏర్పడడానికి ఉన్న సవాలక్ష కారణాలను మార్చలేము. కాబట్టి చెప్పకుండా ఉండటాయినికి వీలయినంత ప్రయత్నం చేస్తూనే, సందర్భాన్ని బట్టి ప్రశ్నలు సంధిస్తూ మాత్రం ఉండొచ్చు అనుకుంటున్నాను.
లలితా, హాహా. బాగా చెప్పేరు. మనల్ని మనం కోల్పోడం మాటెలా ఉన్నా చాలామంది స్నేహితులు అనుకున్నవారిని కోల్పోయేను. అంటే పని గట్టుకు వాళ్ళ తప్పులు ఎత్తి చూపాలని కాదు కానీ, నేను నోరు మూసుకుని వింటున్నంతసేపే నిలిచేయి ఆ స్నేహాలు. అంచేత నాకింక మీరడిగిన సమాధానం తెలుస్తుందన్న ఆశ కూడా లేదు.
“ప్రతవారిచర్యలో తనకి లోపం కనిపించినప్పుడు అది లోపం చెప్తే వారు అర్థం చేసుకోరు సరి కదా ఆగ్రహిస్తారు. తనప్రవర్తన తప్పు కాదు అని తను నమ్మినా ఎదటివారిని నమ్మించలేదు. ” అదే నా సమస్య కూడా
మీకు సమాధానం దొరికితే నాకు చెప్పండి. నేనైతే ఆ ప్రయత్నం విరమించుకున్నాను. తప్పు ఎత్తి చూపిస్తే ఆగ్రహిస్తారు. ఎందుకు అని కాకుండా అది సహజం అని అర్థం చేసుకుంటేనే మనం ముందుకి సాగగలుగుతాము. మనం నమ్మిన విలువల మీద, మనం ఎంచుకున్న మార్గం మీద బలం ఏర్పడాలంటే మనం ఎందుకు ఆ మార్గం అనుసరిస్తున్నామో మనమే అర్థం చేసుకోవాలి. ఇతరులని నమ్మించడానికి చేసే ప్రయత్నంలో మనం చాలా కోల్పోయే ప్రమాదముంది. ఇంతమటుకే నాకు అర్థమయ్యింది.
లలితా, నాకు మీరు చెప్పింది అర్థమవుతోంది కానీ ఆచరణలో అది ఎలా వ్యక్తమవుతుంది అన్నది తెలీడం లేదు. తమ తప్పులని తప్పు అనుకోనివాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. లీల అంతస్సంఘర్షణ కూడా అదే. ప్రతవారిచర్యలో తనకి లోపం కనిపించినప్పుడు అది లోపం చెప్తే వారు అర్థం చేసుకోరు సరి కదా ఆగ్రహిస్తారు. తనప్రవర్తన తప్పు కాదు అని తను నమ్మినా ఎదటివారిని నమ్మించలేదు. ఇదంతా కథలో లేదనుకోండి. అది పెట్టడానికే ఇంత అవస్థ పడుతున్నాను.
మాలతి గారూ, ముత్తాత గారు కాదండీ ఆయన పెద్ద కొడుకులిద్దరూనూ.
తప్పు దారిలో వెళ్ళినా కష్టాలు ఉంటాయి కానీ అవి వారికి కష్టాలు అనిపించకపోవచ్చు. ఐనా కొంత దూరం వెళ్ళాక కానీ ఆ కష్టాలు ఎదురుపడనూపోకవచ్చు. అప్పుడు కూడా ఆ కష్టాలే నయమనిపించవచ్చు తాము మారడంకన్నా. ఐతే అలాంటి కష్టాలకు భయపడి తప్పు దారి పట్టని వాళ్ళూ, తమ దారిలో ఎదురుపడే కష్టాలను సహించడమో ఎదుర్కోవడమో అనే కష్టాన్నే నయమనుకోవచ్చు. ఇంతలా ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. అందుకే ముందు “సులభ మార్గం” అనే దాన్ని,లాభసాటిగా అనిపించే మార్గాన్ని ఎంచుకునే వాళ్ళే ఎక్కువ కనిపిస్తుండవచ్చు మనకి.
కానీ పోను పోను ఎప్పుడైనా విశ్లేషించుకుంటే ఈ విషయాలు అర్థం కావచ్చు అని అనిపిస్తుంది నాకు. నాకు తోచిన అర్థమైతే ఇదే. ఇతరులని దోచుకుని లేదా మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకునే వాళ్ళని చూసి లేదా అనవసరంగా ఇతరులని కష్టపెట్టే వాళ్ళని (నాకు వారు అలాంటి వారు అనిపించినప్పుడు) విమర్శించడం కూడా విసుగొచ్చేసింది నాకు.
ఆ ప్రవర్తనని అర్థం చేసుకుంటే వారి ప్రవర్తన మార్చే ప్రయత్నం చెయ్యచ్చేమో అని అనిపించేది కొన్నాళ్ళు. అలా ఆలోచిస్తుంటే మనం చేసే పనులు మనం ఎందుకు చేస్తున్నామో, ఎప్పుడైనా చేసిన తప్పులు గుర్తుకు వచ్చి అవి మళ్ళీ ఎందుకు చెయ్యలేదో అని అర్థం చేసుకోవాలనిపించేది. ఎవరిని ఎన్ని అనుకున్నా చిన్న పిల్లలని చూసినప్పుడు వాళ్ళు ఎలాంటి వారుగా ఐనా తయారయ్యే అవకాశం ఉందని అర్థమయ్యి చెడు దారి పట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, పెరిగేటప్పుడు మనం ఎలా తప్పించుకున్నాము తప్పు దోవని అని విశ్లేషించుకోవడంలో భాగం కూడా ఈ ఆలోచనలు.
మనం మంచి మార్గం అని అనుకునే దాన్ని విజయవంతంగా చివరంటా నడిచిన వాళ్ళని, మధ్యలో వాళ్ళు చేసిన పొరపాట్లని, వాటిని వారు అధిగమించడాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చని ఈ మధ్య తోస్తోంది.
లలితా, మీ వ్యాఖ్య కూడా వేరేరకం ఆలోచనలు రేపేదిగా ఉంది. @ కొంత దూరం వెళ్ళాక ఆ చేసే తప్పుడు పనులను సమర్థించుకుటూ దాని పరిణామాలనుంచీ తప్పించుకుంటూ సాగుతూ ఉండడం కూడా కష్టమే అనిపిస్తుంటుంది. – నాకు మాత్రం ఇలా చేసేవాళ్ళే ఎక్కువ అనిపిస్తోంది. తాతగారి కుటుంబంలో వాళ్లంతా మరొకరికి ఆయన పడుతున్న తంటాలతో, ఆత్మలని చిలక్కొయ్యలకి తగిలించేసేరని చెప్పడానికి ప్రయత్నించేను. ఇంకా ఆలోచించాలనుకుంటాను.
పోతే ముత్తాతగారు తమ బాధ్యతలని తప్పించుకుంటున్నాను అనుకోరు అనుకుంటా. ఆరోజుల్లో బాధ్యత అన్నపదానికి వారు చెప్పుకున్న అర్థం వేరు – బాధ్యత మొత్తం కుటుంబానిదంతటికీ అని.
మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
పోయిన సారి అప్పటికే ఎక్కువ వ్రాసేశాని ఇక చెప్పలేదు కానీ. రాజకీయ నాయకుల గురించి ఆలోచించడం మానేశాను. కుటుంబాలలో రాజకీయాలనుంచే తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి చూసారా లీల గారికి
“తప్పు కదా, ఎందుకు చేస్తారు ఇలా?” అన్న ప్రశ్న ఎన్నో ఏళ్ళు నన్ను బాధించేది. ఆ తర్వాత మా అబ్బాయి అడిగాడొక సారి, ఎవరో పిల్లలు ఏదో నొప్పించినప్పుడు. అందరమూ అలాంటి పనులూ చేస్తాము, కొందరికి నేర్చుకునే అవకాశం దొరుకుతుంది, కొందరికి దొరకదు అంటూ ఏదో చెప్పాను. ఆ తర్వాత ఇంకో స్పష్టమైన సమాధానం దొరికినట్టనిపించింది. ఇలాంటి ప్రశ్నే పిల్లలు తల్లిని అడిగినట్లు చూపించారు ఒక నాటకంలో. అప్పుడు మంచి మార్గంలో నడవాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అని జవాబు చెప్తుంది తల్లి. అది నాకొకలా అర్థమయ్యింది. మా అబ్బాయి సులభంగా ఉంటుందని చెడు పనులు చేస్తారనమాట అని అర్థం చేసుకున్నాడు. కానీ, కొంత దూరం వెళ్ళాక ఆ చేసే తప్పుడు పనులను సమర్థించుకుటూ దాని పరిణామాలనుంచీ తప్పించుకుంటూ సాగుతూ ఉండడం కూడా కష్టమే అనిపిస్తుంటుంది. ఐతే ఏ కష్టాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాము అని ప్రశ్నించుకోవాలేమో. కష్టపడకూడదు / బాధ పడకూడదు అన్న ఆలోచనే పెద్ద బాధకి ఆహ్వానం అనిపిస్తోంది కూడా. కొందరు పెద్దవాళ్ళు పిల్లలు తమని చూసుకోరేమోనన్న భయంతో ముందునుంచే దురుద్దేశాలు ఊహించుకుని దూరం చేసుకునే వాళ్ళూ ఉన్నారు. కాలమూ కాదు, మనుషులూ కాదు చాలా సందర్భాలలో మన పరిస్థితులని మనమే కల్పించుకుంటున్నాము, అలాగే మనమే మార్చుకోగలగాలి అని నమ్మాలనిపిస్తోనంది ఇప్పుడు. మూడో తాత గారు తప్ప మిగిలిన ఇద్దరు తాతగార్లూ ఆ కాలంలోనే తమ బాధ్యతనుంచి తప్పించుకున్నారా లేదా? ఈ సారికి ఇవీ నా ఆలోచనలు.