మార్పు 44

తాతగారికథ అనేక మెలికలు తిరిగి ఆయన రాజీవాళ్ళింట్లో స్థిరపడ్డాక ఆయనకథ అయితే ముగిసింది కానీ లీలకి మనసులో కల్లోలం మొదలయింది. మనసు విరిగింది. ఈ మనుషులంతా ఎందుకిలా ప్రవర్తిస్తారన్న ప్రశ్న, వీళ్ళంతా చదువుకున్నవాళ్ళు, వీళ్ళచదువులు వీళ్ళకి నేర్పిందేమిటి? అసలు జీవితానికర్థం ఏమిటి?

తనజీవితంలో తనకి ఎదురైన వారందర్నీ తలుచుకుంది. ఒకొకరిమనస్తత్వాలూ విశ్లేషించసాగింది. …

తాతగారు – వెనకటితరానికి మచ్చుతునక ఆయన. ఆయనకి తనవారు పెరవారు అన్న బేధం లేదు. ఎవరికి సాయం కావలిస్తే వారికి సాయం చెయ్యడమే. ఎదటివారు ఏం చెప్తే అదే, ఆ మాటని అలా ఉన్నదున్నట్టు తీసుకోడమే కానీ అంతరార్థాలు ఉంటాయని తోచదాయనకి. చిట్టికమల మీరు మాయింట్లో ఉండడం మా అదృష్టం అంటే నిజంగా అలాగే అనుకుంటోందనుకున్నారు కానీ ఆమాటలు నాలుకచివరనించి వచ్చినవని ఆయనకి తెలీదు. తాను సాయం చేస్తున్నాననే అనుకున్నారు కానీ ఆయనకి గతి లేనిసమయంలో తాము ఆదుకున్నామని వాళ్ళు ఊళ్ళో ప్రచారం చేస్తున్నారని తెలుసుకోలేదు. తనదగ్గర డబ్బున్నన్నాళ్ళు వాళ్ళకి పెట్టేరు. తనదగ్గర లేకపోతే వాళ్ళని అడిగి తీసుకున్నారు వెనకటి ఉమ్మడిసంప్రదాయాలధోరణిలో. తనడబ్బు వాళ్ళడబ్బు అని వేరు పెట్టడాలు ఆయనకి తెలీలేదు. చిట్టికమల, “మీరు ఇక్కడుండడం మాకు కష్టం కాదు కానీ మేమేదో మిమ్మల్ని ఇక్కడ ఉంచేసుకుని అవతలివారికి మీరు కాకుండా చేస్తున్నామని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. అంచేత మీరు కొన్నాళ్ళు అక్కడ కూడా ఉంటే బాగుంటుంది” అంది. తాతగారు, “ఊళ్లోవాళ్ళు ఏమనుకుంటే మనకేమి? నీకూ, నాకూ ఎలా బాగుంటే అలా చేస్తాం. నాకిక్కడ సదుపాయంగా ఉంది. పిల్లలు బాగా అలవాటయేరు. వాళ్ళు కూడా బెంగ పెట్టుకుంటారు నేనిప్పుడు వెళ్ళిపోతే. అంచేత నేనెక్కడికీ వెళ్లను. నువ్వేం బెంగ పెట్టుకోకు. వాళ్ళెవరేనా ఏమేనా అంటే నన్నగడమని చెప్పు. నేను వాళ్ళకి బుద్ధొచ్చేలా సమాధానం చెప్తాను,” అన్నారు. చిట్టికమల ఇరుకున బడింది.

అలాటివే మరో నాలుగు సంఘటనలయేక, అక్కలదగ్గర తన కష్టాలు వెళ్ళబోసుకోడం మొదలు పెట్టింది. నిజానికి తాతగారివల్లే అని కాదు, అంతకుముందు కూడా తనకి నొప్పి కలిగినప్పుడల్లా వాళ్ళకి చెప్తూనే ఉంది. అయితే ఇప్పుడు తేడా ఏమిటంటే ఆయనవల్ల తనకి కలిగిన లాభాలు అంతగా తలుపుకి రావడం లేదు. ఒకరోజు అబ్బాయి ఆలస్యంగా వచ్చేడని వాడిమీద అరిచేరుట. మరోరోజు ఆయన చెప్పిన చొక్కా తొడుక్కోలేదని విసుక్కున్నారుట. పిల్లాడు పెద్దవాడవుతున్నాడు, మరీ పసివాడిని కసిరినట్టు కసరడమేమిటి … ఆమాట ఆయనతో అంటే “పదకొండే కదా అప్పుడే పెద్దవాడయిపోయేడా, మరీ విచిత్రం కాకపోతే,” అంటూ నవ్వేసేరుట ఆయన. చిట్టికమలకి మాత్రం అది నవ్వుతాలువిషయంలా అనిపించలేదు. మరో రోజు తనూ పురందరం వాదించుకుంటుంటే ఆయన కలగజేసుకున్నారు. వెంటనే మొగుడూపెళ్ళాలకి ప్రైవేసీ లేకుండా పోతోందని స్ఫురించింది. మరి గత పదేళ్ళగా అలాటి సందర్భాలు రాలేదా? మరి అప్పుడేం చేసేరంటే, అప్పట్లో అదేమంత పెద్ద విషయంగా తోచలేదుట. …

“ఆయనకి అప్పట్లో చేతిలో డబ్బూ, వొంట్లో ఓపికా ఉన్నందున,” అన్న మాట మనసులోకి వచ్చింది. ఆమాట తనంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు ఊరుకుంటారా? ఎగిరిపడతారు తాను సంగతిసందర్భాలు పూర్తిగా అర్థం చేసుకోలేదని. ఈ లుకలుకలు ఆలోచిస్తుంటే నవ్వొస్తోంది కూడాను.

అక్కలిద్దరూ చిట్టికమల కష్టాలు గట్టెక్కెంచే ఆలోచనలు మొదలు పెట్టేరు.

పెద్దక్క వరలక్ష్మికి తన సంసారం అంటూ లేదు. దాదాపు అందరిళ్ళల్లోనూ తిరుగుతూ, ఎక్కడుంటే అక్కడ అదే తన సంసారం అన్నట్టు ప్రవర్తిస్తోంది. వాళ్ళపిల్లలకి బట్టలూ, ఆటవస్తువులూ కొంటుంది. ఉద్యోగరీత్యా అమెరికా, యూరపు తిరుగుతుంది. వెళ్ళినప్పుడల్లా పిల్లలకి రకరకాల వింతవస్తువులు కొని తెస్తుంది. మరి పిల్లలంటే అలా ప్రత్యేకాభిమానం ప్రకటిస్తోంది కనక వాళ్లు కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తారు వరలక్ష్మిని. ఒక్కమాటలో తాతగారిలాగే వరలక్ష్మి కూడా వెయ్యిళ్ల పూజారి. అయితే మరి తేడా ఏమిటి? వరలక్ష్మి ఆలోచనలతీరు వేరు. తాతగారిలా తను మరొకరింట్లో వాళ్ళ “పోషణ”లో ఉండడం జరగదు. వాళ్ళకిలాగే తనకి కూడా తన ప్రైవేసీ, స్పేసు కావాలి. అలాటివి తాతగారికి అర్థం కావు. వరలక్ష్మికి అర్థం అవుతాయి! రెండోది రెండేళ్ళక్రితం మొదలు పెట్టిన యోగసాధనం. ఆవిడ ఓసారి ఏదో కాన్ఫరెన్సుకోసం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వింది – భారతీయుల తత్వజిజ్ఞాసమీద ప్రత్యేకాభిమానం ఏర్పరుచుకుని మనదేశం వచ్చి హిమాలయాల సానువుల్లో ఓ పల్లెలో స్థిరనివాసం ఏర్పురుచుకున్న ఓ పాశ్చాత్యుడు నడుపుతున్న యోగశాలగురించి. ఆతరవాత ఆ యోగశాల సందర్శించి, ఆ గురుగారి ఉపన్యాసాలు విని ఆయనకి అనుయాయి అయిపోయింది. కొంత వ్యాయామం, కొంత ధ్యానం రంగరించి తయారు చేసిన ఆయనపద్ధతులు తనకి ఎంతో అర్థవంతంగా కనిపించేయి. మనసు చిరాగ్గా ఉన్నప్పుడు ఆ యోగపద్ధతిననుసరించి ఓ గంటసేపు కళ్లు మూసుకు కూర్చుని ధ్యానం చేస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ బోధనల్లో ప్రధానాంశం మనసుని అదుపులో పెట్టుకోడానికి సాధనం ఓ గదిలో తలుపులేసుకు కూర్చుని ఆయన చెప్పిన మంత్రం జపించడం. నిజానికి ఇది వరలక్ష్మి బిజినెస్ మీటింగులలో నేర్చినవిద్యకి కూడా చేరువగానే ఉంది.

లీల ఆలోచిస్తూ బిజినెస్ మీటింగులలో నూరిపోసే ఏకాగ్రతకీ, నిబద్ధతకీ తాతగారు నియమనిష్ఠలతో చేసే జపతపాలకీ సామ్యం ఉంది అనుకుంది. వరలక్ష్మీ, తాతగారూ కూడా అలా అనుకోకపోవచ్చు. ఇంతకీ రెండు నియమవిధుల్లోనూ ప్రధానం – ఒకే అంశంమీద పరిపూర్ణంగా ధ్యానం పెట్టడం. అలా చేసినప్పుడు, తదితర ఉపఅంశాలని గమనించకపోవడం, గమనించినా మనసులోకి చొరనివ్వకపోవడం చెయ్యడం జరుగుతుంది. తప్పనిసరిగా చెయ్యాలి అలా. అప్పుడే తాము కోరినది సాధించగలుగుతారు. దీనినే మరోలా కూడా చెప్పొచ్చు.

ప్రతి క్రియకీ లాభనష్టాలు, మంచీ చెడూ ఉంటాయి. ధీమతులు ఇది అవును, ఇది కాదు అనుకుంటూ లాభనష్టాలు కానీ మంచీ చెడూ కానీ బేరీజు వేసుకు చూసుకుని, చివరికి ఏది నిలుస్తుందో చూసుకుని ఆ పని చేస్తారు. తాతగారిని చిట్టికమల తమఇంటికి ఆహ్వానించడంలో లాభనష్టాలు ఇలాగే తూచి చూసుకుని, పిలవమని చెప్పింది వరలక్ష్మి. మళ్ళీ ఇప్పుడు కూడా మారిన పరిస్థితులదృష్ట్యా మరోసారి లెక్కలు చూసుకుని ఆయనని బయటికి పంపించేసే ప్రయత్నాలు చేసింది. చిట్టికమలకి ఏది సుఖం అన్నది ఒక కోణం. తాతగారు కానీ ఊళ్లో వాళ్ళు కానీ ఏమనుకుంటారు ఆయనకి ఒంట్లో ఓపికా చేతిలో డబ్బూ ఉన్నంతకాలం ఉంచుకుని, మంచంలో పడగానే పొమ్మంటే అన్నది రెండో కోణం. వరలక్ష్మి ఓ గంటసేపు ఆ విదేశీగురువుగారు ఉపదేశించిన మంత్రం జపించుకుని, మనసు స్తిమితపడ్డాక ఓ నిర్ణయానికొచ్చింది. చిట్టికమల మనశ్శాంతి ముఖ్యం. తాతగారేం అనుకుంటారన్నది ఆలోచించే సమయం కాదిది.

సావిత్రి తర్కంవేరు. తన తరహా వేరు. ఆమె అమెరికాలో చదువుకొచ్చి, అమెరికనుని చేసుకుని అమెరికాలోనే స్థిరపడిపోయింది. వారిద్దరి తొలి పరిచయాలయేక వివిధ జీవనవిధానాలతో పరీక్షించుకు చూసుకుని, ఒకరినొకరు అనేకరకాల అంచనాలు వేసుకుని, ఆ అంచనాలకి తగ్గట్టు చిన్న చిన్న పరీక్షలు పెట్టుకుని, చివరికి తామిద్దరూ ఒకే ఆపిలు రెండు  ముక్కల్లా, ఒకే చిక్కుడుకాయలో రెండు గింజల్లా, ఒకే కవితలో రెండు ఉపమాలంకారాల్లా తాము ఒకరికొకరు సరిపోయేరని నిశ్చయించుకున్నాక పెళ్ళి చేసుకున్నారు. అంచేత సావిత్రికి సుఖమైన సాంసారికజీవనమే తెలుసు. అంచేత చెల్లెలిభర్త చెల్లెలి ఆశలకీ, కోరికలకీ అనుగుణంగా ప్రవర్తించడం లేదంటే, ఆవిడకి ఒళ్ళు మండిపోతోంది. పాపం, చెల్లెలు చిన్నపిల్ల. చిన్నప్పటునించీ దానికేం కావలసినా తననే అడిగేది. తాను సమకూర్చిపెట్టేది. గాజుగ్లాసు పగలగొడితే ఆ తప్పు తనమీద వేసుకుని ఆ పిల్లని నాన్ననించీ కాపాడింది. స్కూలికి వెళ్లడం ఇష్టం లేదంటే, జ్వరం వచ్చినట్టు ఓ నకిలీకాయితం పుట్టించి, స్కూలికి తనే తీసుకెళ్ళి ఇచ్చింది. ఆ పిల్ల హోంవర్కంతా తనే చేసి పెట్టింది. ఇదంతా ఎందుకంటే “పాపం, చిన్నపిల్ల” అన్న అభిమానంతోనే. వెనక తాతగారిని ఇక్కడ ఉండమని సలహా ఇచ్చింది. ఇప్పుడు ఆయన బరువయితే, ఈ సమస్యని పరిష్కరించడం కూడా తన బాధ్యతే  … ఇలా సాగి ఉండొచ్చు సావిత్రి ఆలోచనలు. పైన చెప్పినట్టు ఇక్కడ సావిత్రి కూడా తాతగారికి నిజంగా సాయం కావలసినసమయంలో పొమ్మనడం ఏం మర్యాద అని ఆలోచించలేదు.

చిట్టికమల అక్కలకి చిట్టికమలని కష్టపెడుతున్నట్టు కనిపిస్తున్న పురందరం మరోరకం. అతనికి జనం కావాలి. కుటుంబం కావాలి. రెండువేపుల చుట్టాలనీ తన ఆత్మబంధువులుగానే భావిస్తాడతను. అంచేత తాతగారిని చిట్టికమలకంటే ఎక్కువ ఉత్సాహంతో ఆహ్వానించి ఆదరించేడు. ఇల్లు ఎలా జరుగుతుందిలాటి చిన్నవిషయాలు అతనికి పట్టవు. అంచేత చేస్తున్న ఉద్యోగం వదిలేసేడు. ఆ సమయంలోనే చిట్టికమల తాతగారిని పిలుస్తానంది. “అయ్యో, అంతకంటేనా, తప్పకుండా పెట్టుకుందాం, పిలు, పిలు, పిలు,” అంటూ హడావుడి చేసేసేడు. “నిన్నో దారిలో పెట్టడానికే తాతగారిని రమ్మంటున్నది,” అని చిట్టికమల చెప్పలేదు. తాతగారు వచ్చింతరవాత రోజూ పురందరానికి ఇంట్లో మగవాడిస్థానం, ధర్మాలు, ఆడదాని సంపాదనమీద ఆధారపడడంలో హైన్యం, అతను చెయ్యగల ఉద్యోగాలు, నూరి పోసేరు. ఆర్నెల్లతరవాత తాతగారి పోరు పడలేకో, సాటివారు ఉద్యోగాలకెళ్తుంటే, భార్య ఆఫీసుకెళ్తుంటే గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేకో … మొత్తంమీద ఏదో వ్యాపారం పెట్టుకుంటాను, మదుపు దొరికితే అన్నాడు. తాతగారు నేనిస్తాను పెట్టుకో అన్నారు. అలా అందరూ కేవలం కబుర్లు చెప్తుంటే, తాతగారు మాటల్లో మాత్రమే కాక చేతల్లో తనకి అండగా నిలబడడంతో పురందరానికి తాతగారంటే అవ్యాజమైన గౌరవం ఏర్పడిపోయింది. అంచేత తాతగారిని బయటికి తోలేయడానికి అతను సిద్ధంగా లేడు.

పోతే ఇప్పుడు రాజీ తాతగారిని తీసుకవెళ్లడానికి అతనెలాటి వాడయి ఉండాలి? లీలకి అతన్నిగురించి అట్ట్ తెలీదు తాతగారు వాళ్ళింట్లో కూడా కొన్నాళ్ళు ఉన్నారన్నది తప్పిస్తే. అప్పటికి ఈ అబ్బాయి ఇంకా హైస్కూలు కూడా పూర్తి చెయ్యలేదు. ఇప్పుడేదో మంచి ఉద్యోగంలోనే ఉన్నట్టుంది. మంచి తెలివైన కుర్రాడనీ, స్కాలర్షిప్పులతో చదువు అయిందనీ మాత్రం తెలుసు. బుద్ధిమంతుడు కూడా అయిఉండాలి లేకపోతే తాతగారిని తీసుకెళ్ళడానికి ఎందుకు ఒప్పుకుంటాడు, అందులోనూ ఆయనకి డబ్బూ, జబ్బపుష్టీ లేవని తెలిసి.

అతనితో ఓమారు మాటాడితే బాగుండునని ఉంది కానీ ఫోన్నెంబరూ, ఇమెయిలు ఐడి ఏమీ లేవు.

ఈ వ్యక్తిత్వాలతో సుందరం కూడా మనసులోకి వచ్చేడు. చిన్న నవ్వు కూడా వచ్చింది. ఆయనతో కాపురం చేస్తోంది ముప్ఫై ఏళ్ళగా. అయినా ఆయన్నిగురించి ఏం తెలుసంటే చప్పున చెప్పడానికేం లేదనే అనిపిస్తోంది.

తను వచ్చినకొత్తలో ఏవో ఈఊరూ ఆ ఊరూ చూద్దాం అంటూ తిరిగేరు. కానీ వెళ్లినచోటల్లో ఆయనస్నేహితులే. ఆయన వాళ్ళతో కబుర్లు చెప్తుంటే వందేళ్ళకిందటి సినిమా చూస్తున్నట్టు తను కూర్చోవలసివచ్చింది. ఒకటి రెండు చోట్ల అమ్మమ్మలతోనూ, నాయనమ్మలతోనూ తనని వదిలేసి వాళ్లు బయటికి వెళ్లిపోయేరు కూడాను. తనకి ఏంవనాలో తోచలేదు అలాటిసందర్భాల్లో. కొంతకారణం వాళ్ళకీ తనకీ ఉభయసామాన్యమైన విషయాలేమీ లేకపోవడం మాటాడ్డానికి. తరవాత అతనితో దేశం తిరిగే ఉత్సాహం పోయింది. ఆ తరవాత తనకి తోచినపనులేవో తను చేసుకోడంతో అతను “ఇదీ బాగానే ఉంది. నీకు కావలసినపని నువ్వు చేసుకో. నీకు కావలసిన స్నేహాలు నువ్వు చేసుకో” అంటూ తనకి “సంపూర్ణ స్వాతంత్ర్యం” ఇచ్చేడు. అతనిచ్చేడో తనే తీసుకుందో చెప్పడం కష్టం. ఎందుకంటే మొదటిసారి తను ఒక్కత్తీ బయటికి వెళ్లినప్పుడు, “అలా ఒక్కదానివే ఎందుకు వెళ్లేవు? మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి,” అన్నాడు. తను దేనికి భయపడదని అతనికి తెలిసింది మొదటిసారిగా. బహుశా, తను, “నాకు భయంవండీ. మీరు కూడా రండి. లేదా, నేనింట్లో ఉంటాను. మీరెళ్ళి తీసుకురండి,” అని ఉంటే అతనికి ఎక్కువ ఆనందంగా ఉండేదేమో. నిజానికి తనకి అలా చెప్పడానికేమీ అభ్యంతరం లేదు కానీ అలా చెప్పేక, నిజంగా అతను లేచి వెళ్ళి ఎప్పుడు తనడిగిన వస్తువు తెస్తాడా అని ఆలోచించినప్పుడు మాత్రం అలా చెప్పాలనిపించదు. ఓసారి అలాగే పాతికమందిని భోజనానికి పిలిచేడు. అంతా వెళ్ళేసరికి అర్థరాత్రి దాటింది. లీల గిన్నెలు తీసి తొలుస్తుంటే, “నేను చూస్తాలే. వెళ్ళి పడుకో,” అన్నాడు. సరేనని లీల అవి వదిలేసి పడగ్గదిలోకి వెళ్లిపోయింది. తెల్లారి లేచి చూస్తే, ఎక్కడివక్కడే ఉన్నాయి. సుందరం అప్పటికే ముస్తాబయి బయల్దేరబోతున్నాడు. మళ్ళీ “అవి నేను తిరిగొచ్చేక చూస్తాలే, అలాగే ఉండనియ్” అన్నాడు. లీలకి నవ్వొచ్చింది. తను నిజంగా అలా వదిలేసి ఉంటే ఏమయేది? అతను తిరిగొచ్చి, “అలా ఊరికే కూర్చోకపోతే, ఆగిన్నెలూ అవీ కడిగేసి ఉండొచ్చు కదా” అనకుండా ఉంటాడా? ఏమో తెలీదు. లీల ఆ తరవాతెప్పుడూ ఆయన“సాయం” అడగలేదు. క్రమంగా అతనికీ తనకీ ఎడం ఎక్కవవుతోంది. సుందరానికి తనూ, తన వ్యాపారమూ,తనస్నేహితులూ అదే లోకం అయిపోయింది. దానికి కారణం తనేనా? అందులో తనతప్పెంత? స్థూలంగా అతని అభిరుచులు వేరు తన అభిరుచులు వేరు. సంఘంలో సాటివారిలో, వారిమీద తను ఘనమని నిరూపించుకోవాలన్న తాపత్రయం లీలకి లేదు. ఉన్నదానితో తృప్తి పడిపోతుంది తేలిగ్గా. అలా ప్రతిదీ తేలిగ్గా తీసుకోడం అతనికి అసహ్యం. నలుగురు స్నేహితులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు కూడా తనమాటే పైమాట కావాలి. కింద పడ్డా పైచెయ్యి నాదేనని వాదించి, అవతలివారు ఒప్పుకునేవారకూ ఊరుకోడు.

లీల ఉలిక్కిపడి వాచీ చూసింది. సుందరం వచ్చేటయిమయింది అనుకుంది క్షణకాలం. వెంటనే గుర్తొచ్చింది అతను ఊళ్ళో లేడు. ప్చ్. ఆవిషయం కూడా మరోమారు ఆలోచిస్తే కానీ తోచలేదంటే ఇంకేమిటి అనుకోడం?!

అరవింద, విషి, ప్రబాస్రావు, శివాని, సిరి – ఒకొకరే గుర్తొచ్చేరు. వీళ్ళలో అరవింద ఒక్కర్తే తనకి కాస్త పరిచయమయింది. మిగతావారందరూ – అరవింద చెప్పినమాటలే తప్ప వారిగురించి మరేం తెలీదు.

పెద్దక్కయ్య. ఆవిడతో కొన్నాళ్ళు ఉన్నందున ఆవిడంటే గౌరవం హెచ్చింది కానీ నిజంగా ఆవిడ వ్యక్తిత్వం ఏమిటో తెలీలేదు.

లీల లేచి, బట్టలు మార్చుకుని వాళ్లింటికి బయల్దేరింది. మామూలుగా మరెవరైనా అయితే పిలిచి, వాళ్ళు ఇంట్లో ఉన్నారో లేదో కనుక్కుని, వాళ్లకి వీలవునో కాదో కనుక్కుని వెళ్ళాలి. కానీ పెద్దక్కయ్యవిషయంలో ఆ మర్యాదలు పాటించనక్కర్లేదు. “ఆవిడ ఇంట్లో లేకపోయినా ఫరవాలేదు,” అనుకుని బయల్దేరింది.

పోతే, మిగతా వాళ్లందరివీ చిన్న పాత్రలే. వాళ్ళని తను చూసి పది, పదిహేనేళ్ళవుతోంది. అంచేత వాళ్ళగురించి ఎలాటి అభిప్రాయాలూ ఏర్పరుచుకునే అవకాశం లేదు.

000

 

(జూన్ 28, 2012)

About these ads
గురించి

పేరు నిడదవోలు మాలతి. నేనున్నచోట వినిపించని మంచితెలుగుకోసం తెలుగు కథలు చదువుతాను. నా ఇంగ్లీషు రచనలు ఇంగ్లీషులో www.thulika.net చదవండి.

మార్పు లో రాసారు
2 comments on “మార్పు 44
  1. మాలతి అంటున్నారు:

    :) ) సంతోషం, లలితా. వీలయినప్పుడే చదువుతూండండి.

  2. మార్పు 43, 44 లలో కథనం వేగంగా సాగుతోంది కదా :) 43వ భాగం కనీసం రెండు మూడు సార్లు చదవాలి అనిపించింది. మొదటి సారి ప్రవాహంలో కొట్టుకుపోయాను :) కొంచెం తీరిక దొరికినప్పుడు మళ్ళీ చదువుతాను. పిల్లల సెలవుల్లో వాళ్ళ సంగతేమో కానీ నా screen time చాలా తగ్గింది :)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

భాండారం
Blog Stats
  • 139,357 hits
అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 32గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: