మన సామెతలు మరొకరికోసం

అనువాదాలు కోకొల్లలుగా వస్తున్న ఈ రోజుల్లో, ఆ సొగసు మరో భాషలో ఎలా వస్తుందని హేళన చేస్తున్న ఈ రోజుల్లో, సామెతలూ, జాతీయాలూ ఎలా అనువాదం చెయ్యడం? ఎందుకు చెయ్యడం? ఈ వారంరోజుల్లోనూ ఫేస్బుక్కులో నేను పెట్టిన టపాలకి వచ్చిన స్పందనలతో, మరింత విపులంగా ఈవిషయం ఇక్కడ చర్చిస్తున్నాను. . భాషే సంస్కృతి అని మనం ఒప్పుకున్నతరవాత (ఒప్పుకోకపోతే బాధే లేదనుకోండి, అది వేరే సంగతి), మరి మనం తిన్న తిండి, కట్టిన బట్టలాగే ఆడే మాట కూడా మన అస్తిత్వానికి ప్రతీక. అంటే తెలుగు సామెత తెలుగువారి సంస్కృతికి అద్దం పడుతుంది. ఒక చిన్న ఉదాహరణ – మనం చల్లని తల్లి, చల్లనిమనసు అంటాం. ఎందుకంటే నాకు కలిగిన ఒక ఆలోచన – మనకి భరించలేనంత ఎండలు కనక మనకి చల్లదనం ఊరట కలిగిస్తుంది. పాశ్చాత్యదేశాల్లో Warm heart అంటారు. వారికి వెచ్చదనం కావాలి. చల్లని మనసుకి cold heart కి చాలా బేధం ఉంది. సామెతలు అనువదించడం తేలిక కాకపోయినా, తెలుగుజాతికి చెందిన అనేకానేక అలవాట్లూ సాంప్రదాయాలలాగే ఈ సామెతలు వారికి అందించడానికి ప్రయత్నించాలని నా అభిప్రాయం.

పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత తీసుకోండి. దానికి సమానంగా ఇంగ్లీషులో the grass is greener on the other side of the fence అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంగ్లీషు సామెతే వాడితే ఏమవుతుంది. విదేశీ పాఠకుడికి కథ తేలిగ్గా అర్థమయిపోతుంది నిజమే. కానీ, ఆ వాక్యం దగ్గర ఆగి ఆహా తెలుగువాళ్ళు ఇలా అనుకుంటారా అని అనుకోడానికేమీ లేదు. వాక్యం తరవాత వాక్యం చదువుకుంటూ పోతాడు. సూక్ష్మంగా పరిశీలించి చూస్తే, ఈ రెండు సామెతల్లోనూ మరి కొన్ని వ్యత్యాసాలు తెలుస్తాయి. పొరుగింటి అన్న పదం ఆ రెండు కుటుంబాలమధ్య దగ్గరతనానికి ప్రతీక. ఇరుగూ పొరుగూ అన్న నుడికారం వింటే మనకి కావలిసినవారు, దగ్గరివారు అనిపిస్తుంది. ఇంగ్లీషులో other అన్న పదం ఇద్దరు లేక రెండు కుటుంబాలమధ్య ఎడాన్ని ఎత్తి చూపుతుంది. అమెరికాలో తెల్లవారు కానివారు అదర్స్.

అలాగే మరొక ఉదాహరణ – ఫేస్బుక్కులో లలిత గూడ వారి చిన్నబ్బాయి అభిరామ్ సామెతలగురించి మాటాడుకుంటున్నప్పుడు, అభిరామ్ ఒక తెలుగు సామెతకి బొమ్మ వేసేడు. twoBirdsWithOneShot2

(లలిత గూడ, అభిరామ్ సౌజన్యంతో)

సామెతలు బొమ్మలరూపంలో చెప్పొచ్చు అని అభిరామ్‌కి తోచడం నాకు చాలా సరదాగా అనిపించింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని తెలుగు సామెత. Two birds with one shot అని ఇంగ్లీషు సామెత. సరిగ్గా సరిపోయింది. అయితే ఈ బొమ్మ చూడగానే నాకు తెలుగు సామెత గుర్తు రాలేదు. ఎందుకో చెప్తాను. నేను మూడు తరాలకి ముందటిదాన్ని అని మీకు తెలుసు కదా. నామనసులో ఒక్కదెబ్బకి రెండు పిట్టలు అంటే ఒక్క బాణంతో రెండు పిట్టలు అనే భావం :)). లేదా వడిసెల, పొలాల్లో రైతుపిల్లలు ఉండేలులో రాయి పెట్టి విసుర్తారు పిట్టలని తోలడానికి. అంటే అపార్థం చేసుకోకండి. అభిరాం అభివ్యక్తం చేసిన పద్ధతిని నేను ఏమాత్రమూ తక్కువ చెయ్యడం లేదు. అతను పెరిగినవాతావరణంలో అతనిస్ఫూర్తి అది. అదే నేనంటున్న భిన్నసంస్కృతులలో వ్యత్యాసం కూడా. అంచేత సుమారుగా అదే అర్థం వచ్చినా మనకి ప్రత్యేకమయిన ఆచారాలు, అలవాట్లు తెలియాలంటే సామెతలు అనువాదం చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. తెలుగులో చెప్పినప్పుడు స్పందించినట్టుగా ఈ అనువాదాలకి అందరూ స్పందించలేపోవచ్చు, ముఖ్యంగా తెలుగువాళ్ళు. కానీ తెలుగు తెలీనివారికి తెలుగువారి భావప్రపంచం ఇలా ఉంటుందని తెలియజేయడం ముఖ్యం అనుకుంటే మన వాతావరణాన్ని సృష్టించవలసిన అవుసరం ఉంది.

కొరివితో తలగోక్కున్నట్టు అన్న సామెతని నేను scratching your head with a burning torch అని అనువదించేను. నా అమెరికన్ స్నహితులొకరు అది చాలా బాగుందన్నారు. ఇలాటివి మన అనువాదకులందరూ ఒక చోట పెట్టి, పదే పదే అవే వాడుతుంటే, వాటిని ఇతరభాషలవారు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఎవరికి వారు తమకి తోచినట్టు అనువదించేస్తూనో, వదిలేస్తూనో, వాడుకలో ఉన్న ఇంగ్లీషు సామెతలనే వాడేసుకోడమో చేస్తే, మనం మన సంప్రదాయంగురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నదేమీ ఉండదు. అదే అభిప్రాయమైనా, మన నుడికారం ప్రత్యేకత తెలియజేయాలంటే మనం వాడుకున్న పదాలే అనువదించాలి. అయితే అవి అవతలివారికి కూడా అర్థమయేలా ఉండాలి అనుకుంటాను. నేను సాధారణంగా ఫుట్ నోట్ లో ఇస్తాను వారిభాషలో ఉండే సామెత.

నా అనువాదాలు మరి కొన్ని ఇస్తున్నాను. మీ అభిప్రాయాలు, అనువాదాలు – ఈ సామెతలకైనా వేరే సామెతలకైనా రాయండి. అరికాలిమంట నెత్తికెక్కింది – Burning flames rose from toes to the top of [my] head

ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది – City says leave, graveyard says welcome

ఉన్నవాడు పాలల్లోకి పంచదార లేదని ఏడిస్తే లేనివాడు గంజిలోకి ఉప్పు లేదని ఏడ్చినట్టు The rich cries for sugar in milk, the poor wails for salt in gruel (corrected version)

గతిలేనోడు తగువుకెడితే మతిలేనోడు తీర్పు చెప్పినట్టు Like a man without brain advising a man without means.

ఎద్దుపుండు కాకికి రుచి bull’s sores are delicious to the crow

అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టు Tried to craft a teacher, turned out a monkey.

తేలు కుట్టినదొంగలా – Like the thief stung by a scorpion

చదవేస్తే ఉన్నమతి కూడా పోయినట్టు Sent him to school and he lost even the little brain he had.

అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు – When angry with mother-in-law, she takes it out on pot. (corrected version)

చుట్టాల్లేనమ్మ దయ్యాల్ని పట్టుకు ఏడ్చిందిట – Having no relatives, she pours her heart out to ghosts.

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరినట్టు – She can’t reach hanger in the kitchen, yet craves to fly the skies.

కొన్నిటికి అనువాదాలు అస్సలు కుదరవు. వీటికి మీరేమంటారో చెప్పండి తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళ్ళినట్టు

ఊరీ ఊరని ఊరగాయ రుచి,

వచ్చీరాని మాటలు రుచి కాళ్ళు పట్టుకు లాగితే చూరు పట్టుకు వేలాడినట్టు

————-

(నవంబరు 27, 2013)

About these ads
గురించి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను. www.thulika.net లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఆవిష్కరించే కథల అనువాదాలు, తెలుగురచయితలమీద విశ్లేషణాత్మకవ్యాసాలు చదవగలరు.

అనువాదాలు లో రాసారు
9 comments on “మన సామెతలు మరొకరికోసం
 1. మాలతి అంటున్నారు:

  అయ్యో, మాధురిగారూ, నా అనువాదాలలో తప్పులున్నాయని చూసేరు కదా. ఉన్నవి ఉన్నట్టు తీసేసుకోకుండా, మీరు కూడా ఆలోచించి చూసుకుంటే క్షేమం. పనిలో పనిగా నాక్కూడా తెలియజేయండి.

 2. madhuri అంటున్నారు:

  మాలతి గారు,

  నేను కథలు చదువుతానేగానీ అనువాదాల వంటివి నాకు రావు. ఇప్పుడిప్పుడే అటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను భయపెడుతున్నాయి. నిజంగానే అనువాదాలు చేస్తే సామెతల కోసం ఎక్కడా వెతకాల్సిన పని లేదు. మీ బ్లాగు నుంచే తీసేసుకోవచ్చు. (అలా తీసుకున్నప్పుడు మీ పేరు తప్పకుండా రాస్తాను….!)

 3. విన్నకోట నరసింహారావు అంటున్నారు:

  @@ “ఇప్పుడు కొందరికి నేను మరీ బాలాకుమారిని కాదని కొందరికి అర్ధం కావడం కోసం పెట్టవలసివచ్చింది.”

  హా హా హ. కాని మీ ఉద్దేశ్యం ఏదైనా, చక్కగా కళగా పెద్దదిక్కులా కనిపిస్తున్నారు. ఎలాగూ మీరు అదేలెండి – a pioneering lady of Telugu blogs.

 4. మాలతి అంటున్నారు:

  విన్నకోట నరసింహారావుగారూ, మీరు అత్త, దుత్త పదాలకి ఇచ్చిన అర్థాలు బాగున్నాయండి. నేను ఎందుక అలా అనువదించేనంటే, గిన్నెలు పగలకొడితే కోడలికి మరింత బాధ కదా, ఎద్దు అయితే ఎవరికీ బాధ లేదు. దుత్త అంటే ఎద్దు అని ఎక్కడ చూసేనో జ్ఞాపకం లేదు. మీ వివరణ సరయినది అనుకుంటాను. నేను ఈవిధంగా చర్చలకి పెట్టడం మంచిదే అయింది.
  మీరు Facebook చూస్తారా. అక్కడ కూడా తూలిక.నెట్ పేజీ ఒకటి తెరిచేను ఇలాటి చర్చలకోసమే.
  పువ్వులు మాలతి పుష్పాలని పి. సత్యవతిగారిస్తే పెట్టేను. ఇప్పుడు కొందరికి నేను మరీ బాలాకుమారిని కాదని కొందరికి అర్థం కావడం కోసం పెట్టవలసివచ్చింది :) :)).

 5. విన్నకోట నరసింహారావు అంటున్నారు:

  మంచి ప్రయత్నం. అనువాదకులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తాను.

  పైన చెప్పిన ఒక సామెతలో “అత్త” అంటే “అత్తగారు” (mother-in-law) (“aunt” కాదు) అనే అర్ధం అనుకుంటాను. అలాగే “దుత్త” అనేది ఒక మట్టిపాత్ర విశేషం – కడవ / ముంత / బాన లాంటి మట్టిపాత్రలు. steer అనే అర్ధం కాదనుకుంటాను. కోడలికి అత్త (అత్త గారు) మీద కోపం రావటం మామూలే కదా :) ఆ కోపాన్ని అత్తగారి మీద చూపించలేక, ఆ ఉక్రోషంతో ఆ కోపాన్ని పాత్రల పైన తీర్చుకుందని సామెత కవిహృదయంలాగా ఉంది.

  మీ జవాబుల పక్కన ఇంతవరకూ కనిపిస్తూ వచ్చిన పూల బొమ్మ బదులు మీ ఫొటోయే పెట్టటం చాలా బాగుందండి.

 6. మాలతి అంటున్నారు:

  మాధురి, కథలు అనువాదం చేస్తున్నప్పుడు సామెతలు వస్తాయి కదా. అప్పుడు మీరేం చేస్తారు?

 7. మాలతి అంటున్నారు:

  Madhuri, you’re right, I guess. Thanks for your input. I would leave gruel though, just to keep the Telugu flavor.

 8. madhuri అంటున్నారు:

  The very thought of translating’samethalu’ into English itae is innovative. I have heard of it for the first time.

 9. madhuri అంటున్నారు:

  I don’t mean to translate as it is
  …but ‘sugar in milk’ and ‘salt in porridge’ sound more meaningful to me. It can also avoid the repetition of for. Of course. ….you know better.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

భాండారం
Blog Stats
 • 166,146 hits
అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 369గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: